Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటఅరువదియైదవ అధ్యాయము - గాయత్రీమాహత్మ్యము

వజ్రువాచ : హోతవ్యే విష్ణుదేవత్యే సావిత్రేమేత్వయోదితా | హోమకర్మణి సందేహోమహాన్మేభృగునందన! || 1

సవితాదైవతం తస్యాః సావిత్రీత్యుచ్యతే తతః | తయాకథంతు కర్తవ్యం హోమకర్మతువైష్ణవమ్‌ || 2

ప్రభావమార్షేశ్చతథా తస్యాస్తం మమ కీర్తయ | వేదమాతాతు సాప్రోక్తా సర్వపాపప్రణాశినీ || 3

మార్కండేయ ఉవాచ : రవిమధ్యేస్థితః సోమః సోమమధ్యేహుతాశనః |

తేజోమధ్యేస్థితం సత్త్వం సత్త్వ మధ్యేస్థితోచ్యుతః || 4

విష్ణుదైవత్యమైన హోమమునకు సావిత్రీమంత్రమునుకూడ తాముసెలవిచ్చినారు. అందు నాకు పెద్ద సంశయముకల్గుచున్నది. సవిత (సూర్యడు) దైవతముగా గలదిగాన యా మంత్రము ''సావిత్రీ'' అని పలుకబడుచున్నది. అపుడుదాని సంపుటీకరణముతో విష్ణుదేవతాకమైన హోమము సేయుటెట్లు? అమంత్రముయొక్క అమంత్రర్షియొక్క ప్రభావము నాకు వర్ణింపుము. ఆ సావిత్రిసర్వ పాపప్రణాశిని వేదమాతయనియు జెప్పబడినదిగదాయన మార్కండేయు డిట్లనియె.

అంగుష్ఠమాత్రః పురుషః పూర్వమేవమయేరితః | శంకరేణ తదాదృష్టః ప్రభవః సర్వతేజసామ్‌ || 5

సవిష్ణుర్భువనాధారోయస్యేదం సకలంజగత్‌ | వరేణ్యంతచ్చ సవితుర్భర్గోవాచ్యంతుయోగినామ్‌ || 6

ధ్యేయం వరంతదుద్దిష్టం బహిరంతశ్చయాదవ! | ధీశబ్దవాచ్యం బ్రహ్మాణం ప్రచోదయతియః సదా || 7

సృష్ట్యర్థం భగవాన్‌విష్ణుః సవితాసప్రకీర్తితః | సర్వలోకప్రసవనాత్సవితా సతుకీర్త్యతే || 8

యత స్తద్దేవదైవత్యా సావిత్రీత్యుచ్యతేతతః | గానాద్వాత్రాయతేయస్మా ద్గాయత్రీ వాతదాస్మృతా || 9

ఏతస్మాత్కారణా ద్రాజన్సావిత్రీకీర్తితామయా | తవధర్మభృతాంశ్రేష్ఠ! నిత్యంవైష్ణవకర్మసు || 10

సవ్యాహృతీక ప్రణవాం గాయత్రీం శిరసాసహ | యేజపంతి సదాతేషాం నభయం విద్యతే క్వచిత్‌ || 11

దశకృత్వః ప్రజప్తా సారాత్ర్యహ్నాయత్కృతంలఘు | తత్పా పంప్రణుదత్యాశు నాత్రకార్యా విచారణా || 12

శతం జప్తాతుసాదేవీ పాపోపశమనాస్మృతా | సహస్రజప్తాసాదేవీ చోపపాతకనాశినీ || 13

లక్షజాపేనచతథా మహాపాతకనాశినీ | కోటిజాప్యేన రాజేంద్రః యదిచ్ఛతితదాప్నుయాత్‌ || 14

విద్యాధరత్వం యక్షత్వంగం ధర్వత్వ మథాపివా | దేవత్వ మథవా రాజ్యంభూర్లోకేహతకంటకమ్‌ || 15

కోటిసాహస్రజాపేననిష్కామః పురుషోత్తమ! | విధినారాజశార్దూల ప్రాప్నోతి పరమంపదమ్‌ || 16

యాథాకథంచిజ్జ షై#్తషాదేవీ పరమ పావనీ | సర్వకామప్రదాప్రోక్తా విధినాకింపునర్నృప! || 17

రవి మధ్యమున సోముడు సోముని నడుమ హుతాశనుడు (అగ్ని) యున్నాడు (అగ్ని) తేజోమధ్యమందు సత్త్వ గుణము సత్త్వమధ్యమందచ్యుతుడు నున్నారు. ఆ అచ్యుతుడు అంగుష్ఠమాత్ర పురుషుడని లోగడనే తెల్పితిని. సర్వతేజః ప్రాదుర్భావమునకు గారణముగా నా విష్ణువు భువనాధారమైనవాడు. ఈ జగ మాతనికి సంబంధించినది. ఆవిష్ణుతత్త్వమే సవితయొక్క వరేణ్యము (శ్రేష్ఠము) అగుభర్గః =తేజస్సు యోగులకు పరమధ్యేయముగ ధ్యానమునకు లక్ష్యముగా ఉద్దేశింపబడినది. వెలుపల లోపలనదే వారికి ధ్యానలక్ష్యము. అదే ధీశబ్దవాచ్యుడైన బ్రహ్మనెల్లపుడు చోదనసేయును. భగవంతుడగు విష్ణువు సృష్టికార్యమందు సవిత యనబడును. సర్వలోకమును బ్రసవించుటవలన నాతడు సవితయని కీర్తింపబడును. ఆదేవుని దైవీశక్తియే సావిత్రి యని పలుకబడుచున్నది. గానముచేయుటవలన త్రాయతే=త్రాణముసేయునది (రక్షించునది) గావున ఆమెయే గాయత్రియని పేర్కొనబడినది. ఇందువలన నోరాజా! సావిత్రిని నీకు వైష్ణవ కర్మో పాసనలందు నేను బేర్కొన్నాను. వ్యాహృతులతో ప్రణవముతో రస్సుతోగూడనీ గాయత్రిని జపించువారి కెందునుభయముండదు. పదిసారు లిది జపించిన రాత్రిపవలు చేసిన స్వల్ప పాపమును వెనువెంటనే పోగొట్లును. ఇక్కడ విమర్శింప వలసినపనిలేదు. అది నూరుమారులు జపించిన పాపోపశమనము సేయును వేయి సారులది జపించిన నుప పాతకములను హరించును. లక్షజపించిన మహాపాతకముల విదళించును. రాజేంద్ర! ఆ గాయత్రిని కోటి పర్యాయములు జపించిన నేదికోరిననదివడయును. విద్యాధర-యక్ష-గంధర్వ-దేవత్వములు భూలోకమునందు నిష్కంటకమైన రాజ్యమునుంబడయును. సహస్రకోటి జపముచే నిష్కాముడై పురుషోత్తముని పరమపదవాచ్యునిం బొందును. యథాభిలాషముగ నేకొంచెము జపించినను బరమపావని సర్వకామప్రదయు ననబడిన యీగాయత్రి యథావిధిగ జపించినచో నేమనవలయును.

వజ్రఉవాచ : విధినాకేన జప్తవ్యాగాయత్రీపాపనాశినీ | మహాపవిత్రా పరమా సర్వ కల్యాణకారిణీ || 18

మార్కండేయ ఉవాచ : కుశశయ్యాం నివిష్టస్తు కుశపాణిర్జితేంద్రియః |

అర్కమధ్యగతం ధ్యాయేత్‌ పురుషంతంమహాద్యుతిమ్‌ || 19

అథవార్కం మహీపాల! బహిఃస్నాతస్త్వతంద్రితః | అనన్యచిత్తోమేధావీ పూర్వాహ్ణేతువిశేషతః || 20

భైక్ష్యయావక శాకాశీపయోమూలాశనోథవా ! ఫలమూలాశనో వాపినక్తంవాపిహవిష్యభుక్‌ || 21

అనేనవిధినాజప్యం యఃకరోతి మహీపతే! | సయాతి పరమం స్థానం వాయుభూతః ఖమూర్తిమాన్‌ || 22

వజ్రుండిది విని గాయత్రి పాపనాశిని మహాపవిత్ర సర్వకల్వాణకారిణి పరమమంత్రదేవత నేవిధానమున జపింపవలయునన మార్కండేయుడిట్లనియె. కుశాననముగూర్చుండి కుశపాణియై జాపకుడు సూర్యమధ్యస్థుడై వెలుంగు మహాతేజస్సును పురుషుని ధ్యానమునేయవలెను. లేదాస్నానముసేసి తొందరపడక వెలుపలనున్న సూర్యుని ధ్యానింపవలెను. వేరొకమనసు గొనక మేధాశాలియగు జాపకుడు పూర్వాహ్నమందు విశేషముగా నీధ్యానము నిట్లుసేయవలెను. భిక్షగాలభించిన యావకశాకములను (అన్నము కూరలను) దినుచు లేదాపాలు (నీరు) దుంపలు పండ్లు పువ్వులుగానిదినుచు నీజపము సేయవలెను. రాత్రి హవిష్యమును గొనవలెను. ఇట్లు జపముసేసినతడు వాయువై ఆకాశమూర్తియై పరమోన్న తస్థానమున కేగును కోరినను కోరని వాడయ్యును నాత డభీప్సిత సిద్ధింగాంచును.

అకామఃకామకామస్తు కామమా ప్నోత్యభీప్సితమ్‌ || సవ్యాహృతీక ప్రణవాః ప్రాణాయమాస్తుషోడశ || 23

అపిభ్రూణహణం మాసాత్పునంత్యం హరహః కృతాః | సవ్యాహృతీక ప్రణవాం గాయత్రీం శిరసానహ || 24

త్రిఃపఠేదాయత ప్రాణః ప్రాణాయామః సఉచ్యతే | ప్రాణాయమత్రయం కార్యం కల్యముత్థాయవైద్విజః || 25

అహోరాత్రకృతాత్పాపాత్తత్షణాదేవముచ్యతే | సర్వదోషహరం ప్రోక్తం ప్రాణాయామంద్విజన్మనామ్‌ || 26

తతస్త్వభ్యధికం నాస్తి రాజన్పరమపావనమ్‌ | ప్రాణసంధారణం మాసం కుశాగ్రచ్యుత బిందునా || 27

యఃకుర్యాదంభ సాంపానం ప్రాణాయామంతుతత్సమమ్‌ | నిరోధాజ్జాయతే వాయుస్తస్మాదగ్ని స్తతో జలమ్‌ || 28

త్రిభిః శరీరం సకలం ప్రాణాయమైస్తు శుధ్యతి | ఆకేశాగ్రన్నఖాగ్రాచ్చత వస్తప్యేత్స ఉత్తమమ్‌ || 29

ఆత్మానం శోధయేద్యస్తు ప్రాణాయామైః పునఃపునః | శ్రావణ్యాం పౌర్ణమాస్యాంతు సోపవాసోజితేంద్రియః || 30

ప్రాణాయామ శతం కృత్వాముచ్యతే సర్వకిల్బిషైః | అంతర్జలేత్రిరావర్త్య గాయత్రీం ప్రయతోజపన్‌ || 31

ముచ్యతే పాతకైః సర్వైర్య దిన బ్రహ్మహాభ##వేత్‌ |నాస్తిసత్యాత్పరోధర్మోనాస్తికృష్ణసమాగతిః || 32

గాయత్ర్యాశ్చ వరంనాస్తిదివిచేహచపావనమ్‌ | హుతాచవరదాదేవీ సర్వకామఫలప్రదా || 33

గాయత్ర్యాః సుతిలైర్హోమః సర్వపాప ప్రణాశనః | శాంతికామోయవైః కుర్యాదాయుష్కామోఘృతేనచ || 34

కర్మణాం సిద్ధికామస్తు కుర్యాత్సిద్ధార్థకైర్నరః | బ్రహ్మవర్చసకామస్తు పయసాస సమాచరేత్‌ || 35

పుత్త్రకామస్తథా దధ్నా ధన్యకామస్తుశాలిభిః | క్షీరవృక్షసమిద్భిశ్చ గ్రహపీడాప్రశాంతయే || 36

ధనకామస్తథాబిల్వైః శ్రీకామఃకమలై స్తథా | ఆరోగ్యకామః క్షీరాక్తైః కుర్యాద్దూర్వాంకురైః శుభైః || 37

దేశోవసర్గే సంప్రాప్తే తదేవచ విధీయతే | గుగ్గులోర్గుళికాభిస్తు కృత్వాహోమమతం ద్రితః || 38

సౌభాగ్యం మహదాప్నోతి నాత్రకార్యా విచారణా | పాయసేనతథాహుత్వా విద్యాంసమధిగచ్ఛతి ||

యేనయేనతు కామేన లక్షహోమం సమాచరేత్‌ || 39

తదేవకామమాప్నోతి నాత్రకార్యావిచారణా | కృచ్ఛ్రేనాశుద్ధి ముత్పాద్య ప్రాణాయామశ##తేనచ || 40

అంతర్జలేనవాజప్త్వా స్నాతో నిత్యమతంద్రితః | ప్రాణాయామాంస్తతః కృత్వావిధినైవసషోడశ || 41

పూర్వాహ్ణేజుహు యాద్వహ్నౌ సుసమిద్ధేయథావిధి | భైక్ష్యయావకశాకాశీ ఫలమూలాశనోథవా || 42

క్షీరసక్తు ఘృతాహారీ భ##వేదథవిచక్షణః ఆహారాణాం యథోక్తానామేకాహారం సమాశ్రయేత్‌ || 43

యావత్సమాప్తిర్భవతి లక్షహోమస్యపార్థివ! | అక్షహోమావసానేతు బ్రాహ్మణానాంతు దక్షిణా || 44

దేయాభవతి రాజేంద్ర గావోవస్త్రాణికాంచనమ్‌ | సర్వోత్పాతసముత్పత్తౌ బ్రాహ్మణౖ రనుపూజితైః || 45

పంచభిర్దశభిర్వాపి లక్షహోమం సమాచరేత్‌ | అసంకీర్ణెస్తథా హారైర్నృపతిస్తత్ర్పశాంతయే || 46

నాస్తిలోకేస ఉత్పాతో యోహ్యనేన నశామ్యతి | మంగళం పరమంనాస్తి యత్తస్మాదతిరిచ్యతే || 47

ప్రణవముతోగూడిన వ్యాహృతులతో పదునారుసారులు ప్రాణాయామముసేసిన భ్రూణహత్య సేసిన పాపమునుగూడ నది హరించును. వ్యాహృతులతో ప్రణవముతో శిరస్సుతో కలిపి మూడుసారులు (ఆవృత్తిగా) గాయత్రిని మనసుతో ధ్యానించుచు జేయు వాయునిరోధమదియొక ప్రాణాయామమనబడును అట్టి ప్రాణాయామములు మూడువేకువను లేవగానే చేయవలెను. దానివలన నొక్క పగలురేయింజేసిన పాపమాక్షణములో క్షయించును. ద్విజులకు ప్రాణాయామము సర్వదోషమరమని చెప్పబడినది. రాజా! దానిని మించినది పరమపావనమైన సాధనమింకలేదు. ఒక్కనెల ప్రాణసంధారణము (ప్రాణయామము) నెవ్వడు కుశాగ్రమందుండి జారిన బిందువుతో నుదకపానము చేయుటయు రెండునొక్కటే. ప్రాణనిరోధము వలన (ఊపిరిబిగబట్టుటవలన) వాయువు దానినుండి అగ్ని అందుండి జలమును జనించును. అట్టిమూడు ప్రాణాయామములచే సకలశరీరము పరిశుద్దమగును. ఎవ్వడు ప్రాణాయామములచే కేశాగ్రమునుండి కాలిగోటిదనుక తపముగావించి ఆత్మశోధనము సేసికొనునో శ్రావణి పూర్ణిమయందు ఉపవాసముండి ఇంద్రియముల జయించినూరు ప్రాణాయామములుసేసి నతడు సర్వపాపవినిర్ముక్తుడగును. నీళ్లలోనుండి గాయత్రిని ముమ్మారు నియమముగా జపించిన బ్రహ్మహత్య తప్పతక్కిన యన్నిపాపములనుండి ముక్తుండగును. సత్యముకంటె పరమధర్మములేదు. కృష్ణునితో సమమైనసద్గతిలేదు. గాయత్రికంటె మరిదివంబున నిక్కడ పావనముసేయు (పిత్రముసేయు) మంత్రములేదు. వరదయగు గాయత్రీ దేవి నుద్దేశించి హోమముసేసిన సర్వకామఫలప్రదయగును. తిలలతో గాయత్రీమంత్రము జపించి చేయుహోమము సర్వపాపహరము. శాంతికోరినాతడు యవలతో ఆయుష్కాముడు నేతితో కర్మసిద్ధికాముడు (సిద్ధార్థములతో) ఆవాలతో బ్రహ్మవర్చసకాముడు పాలతో హోమము సేయవలెను. పుత్రకాముడు పెరుగుతో ధాన్యకాముడు శాలిధాన్యముతో గ్రహపీడా ప్రశాంతికాముడు పాలచెట్లసమిధలతో ధనకాముడు మారేడుతో శ్రీకాముడు కమలములతో (వేయిరేకుల తామరపువ్వులతో) ఆరోగ్యకాముడు పాలతోదడిపిన దూర్వాంకురములతో (గరికపోచలతో) హోమము సేయవలెను. దేశోపద్రవమేర్పడినపుడుగూడ యీ చెప్పినవిధానమే యుచితము. గుగ్గులపు గుళికలతో (గుగ్గులపుకర్రపూసలతో) హోమముసేసిన మహాసౌభాగ్యమందును ఇది నిశ్చయము. పాయసముతో హొమముసేసిన విద్యాసిద్ధినందును. ఏ యే కోరికతో లక్షహోమముసేయునో యీకోరిక దానతప్పక సిద్ధించును. కృఛముచేతను (కృఛ్రచాంద్రాయణము) ఇది యనేకవిధములుగానున్నది. ఇది నీళ్ళు పాలు వగైరాలు త్రాగుచుచేయు వివిధ విధములగానున్నది.

నూరు ప్రాణాయామముసేసియు దేహశుద్ధి కూర్చుకొని స్నానముసేసి నీళ్ళలో నిత్యము తొందరపడక గాయత్రీ జపముగావించి అవ్వల విధివిధానమున బదునాఱు ప్రాణాయామములుసేసి పూర్వాహ్ణ మందు సుసమిద్ధన (ప్రజ్వలితమైన) యగ్ని యందు హోమము గావింప వలెను. భిక్షాన్నము యవాన్నము కూరలు గాని ఫలమూలములు గాని పాలుగాని పేలపిండి నెయ్యి గాని యాహారించుచు నీ యనుష్ఠానము సేయవలెను. లక్షహోమములు సమాప్తిచేసి బ్రాహ్మణులకు గోవులు వస్త్రములు బంగారమును దక్షిణ యీయవలెను. దేశ మందు ఏ ఉత్పాతములు సంభవించినను అనుపూజితులైన (దేవతలతో పాటుగ భూదేవతలుగ) బ్రాహ్మణులతో లక్షహోమము సేయవలెను. రాజు దేశోత్పాత ప్రశాంతికి (ఈమున్ను జెప్పిన ఆహారముల నొకదానితోనొకటి సంకీర్ణముగాకుండ) ఏదోయొక్క యాహారమునే కొనుచు నీ గాయత్రీ హోమము గావింపవలెను. ఈ విధానముచే శాంతింపని యుత్పాతము లోకమునందేదియు లేదు. దీనిచే సమకూడని పరమ మంగళమును లేదు.

కోటిహోమంతుయోరాజా కారయేత్పూర్వవద్ద్విజైః | సత్యస్యశత్రవః సంఖ్యేజాతుతిష్ఠంతికర్హిచిత్‌ || 48

నతస్యమరణందేశే నవ్యాధిర్జాయతే తథా | అదివృష్టిరనావృష్టి ర్మూషకాః శలభాః శుకాః || 49

రాక్షసాశ్చ ప్రశామ్యంతి సర్వాస్తత్రతథేతయః | రసవంతిచతోయాని సస్యానిస్వాదువంతిచ || 50

జాయంతే తస్యాదేశేతు ధర్మిష్ఠశ్చ జనోభ##వేత్‌ | కోటిహోమేతుపరయేత్‌ బ్రాహ్మణాన్‌ వింశతీన్నృప! || 51

శతంవాథ సహస్రంవాయ ఇచ్ఛేద్భూతి మాత్మనః | కోటిహోమం స్వయంయస్తు కుర్యాద్ర్బాహ్మణ సత్తమః || 52

క్షత్రియోవాథవావైశ్య స్తస్య పుణ్యఫలం మహత్‌ | యద్యదిచ్ఛతి కామానాంతత్త దాప్నోత్యసంశయమ్‌ || 53

సశరీరోపి చేద్గంతుందివమిచ్ఛేత్తదాప్నుయాత్‌ | సావిత్రీపరమాదేవీ సావిత్రీ పాపనీవరమ్‌ || 54

సర్వకామప్రదాదేవీ సావిత్రీకథితాతథా | ఆభిచారేషు తాందేవీం విపరీతాం ప్రయోజయేత్‌ || 55

కార్యావ్యాహృతయశ్చాత్ర విపరీతాక్షరా స్తథా | విపరీతాక్షరం కార్యం శిరశ్చమనుజేశ్వర! || 56

ఆదౌశిరః ప్రయోక్తవ్యం ప్రణవాంతేచ యాదవ! | స్వాహాస్థానేచ ఫట్‌ కారం సాధ్యనామసమన్వితమ్‌ || 57

గాయత్రీంచింతయేత్తత్ర దీప్తానలసమప్రభామ్‌ | ఘాతయంతీంచ శూలేనకేశేష్వాకృష్యవైరిణమ్‌ || 58

నిర్దహంతీంచతం క్రోధాత్‌ భ్రుకుటీభీషణాననామ్‌ | ఉచ్చాటనేచతాం దేవీం వాయుభూతాంవిచింతయేత్‌ || 59

వహమానాంతథా సాధ్యం తస్మాదేశాత్సుదూరతః | అభిచారేచహోతవ్యా రాజికావిషమిశ్రితాః || 60

స్వరక్తమిశ్రం హోతవ్యం కటుతైలమథాపివా | తత్రాపిచ విషందేయం హోమకాలేచ యత్నతః || 61

మధ్యేజహ్యాద్యదిక్రోధం ధ్రువంనశ్యేత్సేఏవతు | అనాగసిన కర్తవ్యమభిచారమతోబుధైః ||

ల్పాగసినకర్తవ్య మభిచారంత థైవతు |

మహాపరాధం బలినం దేవబ్రాహ్మణ కంటకమ్‌ | అభిచారేణ యోహన్యాన్న సదోషేణలిప్యతే || 63

ధర్మ ప్రధానేతునరే అల్పాగసి తథూవచ | అభిచారం నకుర్వీత బహూపాయం విచక్షణః || 64

బహూనాం కంటకం యంతుపాపాత్మానం సుదుర్మతిమ్‌ | హన్యాత్ర్పాప్తా పరాధంతు తస్యపుణ్యఫలంలభేత్‌ || 65

యేభక్తాఃపుండరీకాక్షం దేవదేవం జనార్దనమ్‌ | నతానభిచరేజ్జాతు తత్రతద్విఫలం భ##వేత్‌ || 66

నహికేశవభక్తానామభివారే ణకర్హిచిత్‌ | వినాశమభిపద్యేత తస్మాత్తన్న సమాచరేత్‌ || 67

ఏ రాజు కోటిహోమము బ్రాహ్మణులచే జేయించునో యాతనికి యుద్ధమునందు శత్రువులు నిలువలేరు. అతని దేశమున (రాజ్యమునందు) చావు వ్యాధియు నుండవు. అతివృష్టి అనావృష్టి మూషికములు శలభములు (మిడుతలు వడ్లచిలుకలు) రాక్షసులను నను నీతి బాధలు ప్రశమించును. ఉదకములు రుచిమంతములు మాటలును ధురములునగును. అతని రాజ్య మందలి ధనము ధర్మిష్ఠ మగును. కోటిహోమమునందిరువది మంది బ్రాహ్మణులను ఋత్విగ్వరణము సేయవలెను. నూరు, వేయి మందినిగూడ తనకు భూతి (ఐశ్వర్యము) గావలెనని రాజు కోరవచ్చును. కోటి హోమము స్వయముగ బడయును.శరీరస్వర్గమును గోరనేని యదియుం బొందును. సావిత్రి వర దేవత. సావిత్రి పరమపావని. ఆ దేవి సర్వకామప్రద. ఆదేవిని అభిచారములందు (చేతబడులందు) విపరీతముగ (తలక్రిందులుగ) ప్రయోగించ వలెను. హోమము సేయునపుడు వ్యాహృతులను అక్షరములను గాయత్రి శిరస్సును విపరీతముగా ద్రిప్పిజపింప వలెను. స్వాహాస్థానము వషట్కారము సాధ్యసమన్వితముగ పలుక వలెను. (ఎవనిమీద ప్రయోగము చేయ వలెననుకొనునో వాని పేరు కలిపి చేయవలెనని కాబోలు.) అక్కడ గాయత్రిని ప్రదీప్తాగ్ని సమముగ ధ్యానింప వలెను. జుట్టు పట్టుకొని శూలముతో శత్రువును పొడుచుచున్న దానింగా ధ్యానింపవలెను. హొమముచే కనుబొమలుముడిపడి భయము గొలుపు ముఖముతో శత్రువును దహించుచున్నదానిగా భావింప వలెను. ఉచ్చాటనమందాదేవిని వాయురూపిణిగా భావన సేయవలెను. మఱియు సాధ్యుని తన శత్రువును యటనుండి సుదూరము మోసికొని పోవుచున్న దానింగా తలంపవలెను. అభిచారికమునందు విష మిశ్రితములైన రాజికలను (నల్ల ఆవాలు) హోమము సేయవలెను. లేదా తన రక్తము గలిపి చేయు-తైలము విషము కలిపి సేయవలెను. హోమలు నడుములో శత్రువు నెడ కోపము విడిచెనేని తానే తప్పక నశించును. కావుననే పగలేని యెడల దెవిసిన వారు అభిచారము (చేతబడివగైరాలు) చేయకూడదు. (చేసిన నది బెడిసి ఎదురు తిరిగి తనను చంపు జంపునన్నమాట.) అట్లే స్వల్ప వైరము గలవాని యెడ నభిచారము సేయరాదు. మహాపరాధి బలవంతుడు దేవ బ్రాహ్మణ కంటకుడు నైనవానిని అభిచార ప్రయోగము సేసి చంప వలెను. ఆ చంపిన వానికి దోష మంటుకొనదు. ధర్మ ప్రధానుడగు మనుజునెడ సల్పాపరాధి యోడను విచక్షణుడు బహుపాపియైన యభిచారము (చేతబడి) చేయరాదు. బహుజనకంటకుని పాపాత్ముని దుర్బుద్ధిని అపరాధిని హతమార్చ వలెను. అట్లు చేసిన బహుపుణ్య ఫలమందును. పుండరీకాక్షుడు దేవదేవుడునగు జనార్దనుని భక్తులయెడ నెన్నడునభిచరించరాదు. అక్కడ అది విఫలమయితీరును. కేశవభక్తులకు అభిచారములవలన నాశనమెన్నడుం గలుగదు. కావున నది యక్కడ జేయరాదు.

సేయం ధాత్రీవి ధాత్రీచ సావిత్ర్యఘ వినాశినీ | స్రాణాయామేన జప్యేన తథైవాంతర్జలేనచ || 68

సవ్యాహృతీక ప్రణవాజ ప్తవ్యాశిరసాసహ | ప్రణవేనతథాభ్యస్తా వాచ్యావ్యాహృతయః పృథక్‌ || 69

దైవతం సవితా తస్యా గాయత్రం ఛందఏవచ | విశ్వామిత్రృషిశ్చైవ ప్రోచ్యతే వసుధాధిప! || 70

కర్మేంద్రియాణి పంచైవపంచ బుద్ధీం ద్రియాణిచ | పంచేంద్రియార్థాన్మహతాం భూతానాంచైవపంచకమ్‌ || 71

మనోబుద్ధిస్త థైవాత్మా అవ్యక్తంచయదూత్తమ | చతుర్వింశత్యథైతాని గాయత్ర్యా అక్షరాణితు || 72

ప్రణవం పురుషం విద్ధిసర్వగం పంచవింశకమ్‌ | సప్తలోకానియానీహ మహావ్యాహృత యస్తథా || 73

శిరసశ్చతథా వాచ్యః పురుషః పరమేశ్వరః | ఏవం విధాసాసావిత్రీ జప్తవ్యాసతతంబుధైః || 74

హోతవ్యాచతథాశక్త్యా సర్వకామసమృద్ధిదా | గాయత్రీమాత్ర శరణో వరం విప్రః సుయంత్రితః || 75

నాయంత్రితశ్చతుర్యేది సర్వాశీసర్వవిక్రయీ | గాయత్రం జపతేయస్తు కల్యముత్థాయవైద్విజః || 76

లిప్యతేన సపాపేభ్యః పద్మ పత్త్ర మివాంభసా | కామకామోలభేత్కామం గతికామస్తుసదతిమ్‌ || 77

అకామస్తదావాప్నోతి యద్విష్ణోః పరమంపదమ్‌ ||

ఏవం ప్రభావావరదా పవిత్రా గాయత్ర్యథోక్తా తవరాజసింహ!

జపంతియేతాం పరమం ప్రయాంతి స్థానం పరస్యాప్రతిమస్యపుంసః || 78

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే గాయత్రీమాహాత్మ్య వర్ణనం నామ పంచషష్ట్యధిక శతతమోధ్యాయః.

ఆ తల్లి సావిత్రి ధాత్రి (దాదివలె రక్షించునది) విధాత్రి (సర్వభాగ్య విధాత్రి) అఘవినాశిని ప్రాణాయామముచే నీళ్ళలో నిలిచి చేసిన జపముచే శిరస్సుతో సవ్యాహృతి ప్రణవముగ జపింప వలెను. అట్లే అభ్యసించవలెను. వేర్వేరు వ్వాహృతులను బలుకవలెను. ఈ సావిత్రీ మంత్రాధి దైవతము సవిత. గాయత్రి ఛందస్సు. విశ్వామిత్రుడు ఋషి. కర్మేంద్రియము లైదు బుద్ధీంద్రియములు ఐదు పంచభూత గుణములు పంచేంద్రియార్థములు విషయములు మనస్సు, బుద్ధి, ఆత్మ అవ్యక్తము మొత్తమీ యిరువది నాల్గుతత్త్వములు గాయత్రియొక్క ఇరువది నాల్గక్షరములు. ప్రణవము పురుషుడు (ఆత్మ) అది సర్వగతము. పంచవింశకము ఇరువది యైదవతత్త్వము. అనియెఱుంగుము. సప్తలోకము లివియేవి గలవో అవి సప్తవ్యాహృతులు. గాయత్రి శిరస్సునకు వాచ్యుడు పరమేశ్వరుడు పురుషుడు ఆత్మ. అనగా శిరోమంత్రమున కర్థము పరబ్రహ్మమన్నమాట. ఈ విధమయిన గాయత్రి బుధులకు (తెలిసిన వారికి) నిరంతరము జపింప వలసినది హోమము సేయనైనది. అది శక్తిచే సర్వకామ సమృద్ధి నిచ్చునది. గాయత్రీమాత్ర శరణుడయిన విప్రుడొక్కడే సుయంత్రితుడు నిగ్రహ సంపన్నుడు. కాని నాల్గువేదములు చదివినవాడై సర్వాశియై (విధినిసేధములులేక సర్వముతినువాడై) సర్వవిక్రయి (వేదము దగ్గరనుంచి యన్నియు నమ్ముకొనువాడు సర్వనియంత్రితుడుగాడు. ఉషః కాలమున మేల్కని యేద్విజుడు గాయత్రి జపించు నాతడు తామరాకు నీరంటనట్లు పాపముల నంటుకొనడు, కామకాముడు కామములం బడయును. గతి గాముడు సద్గతి నందును. అకాముడు (నిష్కాముడు) విష్ణువు పరపదమది యేది యది పొందును. వరద పవిత్రయునైన గాయత్రి యీలాటి ప్రభావము గలది. రాజసింహ! నీకానతిచ్చితిని అదేవిం జపించు వారు ఆ పరాత్పరుడు పురుషుడనబడు పరబ్రహ్మము యొక్క పరమ స్థానమునందుదురు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున గాయత్రీ మహాత్మ్య వర్ణనమను నూటఅరువదియైదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters