Sri Vamana Mahapuranam    Chapters   

నలుబది రెండవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

ఏతస్మిన్నంతరేప్రాప్తః సమందైత్యై స్తదాం7ధకః | మందరం పర్వతశ్రేష్ఠం ప్రమథాశ్రిత కందరమ్‌. 1

ప్రమథా దానవాన్‌ దృష్ట్వా చక్రుః కిలకిలధ్వనిమ్‌ | ప్రమథాశ్చాపి సంరబ్దా జఘ్నుస్తూర్యాణ్యనేకశః. 2

సచావృణోన్మహా నాదో రోదసీ ప్రలయోపమః | శుశ్రావ వాయుమార్గస్థో విఘ్నరాజో వినాయకః. 3

సమభ్యయాత్సు సంక్రుద్ధః ప్రమథైరభి సంవృతః | మందరంపర్వత శ్రేష్ఠం దదృశేపితరం తథా. 4

ప్రణిపత్య తథాభక్త్యా వాక్యమహ మహేశ్వరమ్‌ | కింతిష్ఠసి జగన్నాథ సముత్తిష్ఠ రణోత్సుకః. 5

తతోవిఘ్నేశ వచనా జ్జగన్నాథోం7 భికాంవచః|

ప్రాహయాస్యేం7ధకం హంతుం స్థేయమేవా ప్రమత్తయా. 6

తతోగిరిసుతా దేవం సమాలింగ్య పునఃపునః | సమీక్ష్య సస్నేహహరం ప్రాహగచ్ఛ జయాంధకమ్‌. 7

తతో7మరగురో ర్గౌరీ చందనంరోచనాంజనమ్‌ | ప్రతివంధ్యసుసంప్రీతా పాదవేవాభ్యవందత. 8

తతోహరః ప్రాహవచో యశస్యం మాలినీమపి | జయాంచ విజయాంచైవ జయంతీంచా పరాజితామ్‌. 9

యుష్మాభిరప్ర మత్తాభిః స్థేయంగేహే సురక్షితే | రక్షణీయా ప్రయత్నేన గిరిపుత్రీ ప్రమాదతః. 10

ఇతిసందిశ్యాతాః సర్వాః సమారుహ్యవృషం విభుః | నిర్జగామగృహాత్తుష్టో జయేప్సుః శూలధృగ్‌ బలీ. 11

నిర్గచ్ఛతస్తు భవనా దీశ్వరస్య గణాధిపాః | సమంతాత్పరి వార్యైవ జయశబ్దాంశ్చ చక్రిరే. 12

రణాయనిర్గచ్ఛతి లోకపాలే మహేశ్వరే శూలధరేమహర్షే|

శుభానిసౌమ్యాని సుమంగలాని, జాతాని చిహ్నాని జయాయంశంభోః. 13

శిక్షాస్థితా వాతమరే7థభాగే ప్రయాతిచాగ్రే స్వనమున్నదంతి |

క్రవ్యాద సంఘాశ్చతథా7మిషైషిణః ప్రయాంతి హృష్టాస్తృషితాసృగర్థే. 14

దక్షిణాంగంసఖాంతంవై సమకంపతశూలినః | శకునిశ్చాపి హారీతో మౌనీయాతి పరాఙ్‌ ముఖః. 15

నిమిత్తానీదృశాన్‌ దృష్ట్వా భూతభవ్య భవోవిభుః | శైలాదిం ప్రాహవచనం సస్మితం శశిశేఖరః. 16

ఈ లోపల ఆ ప్రమథులకాశ్రయాలైన కందరాలతో కూడిన ఆ మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు. ఆ దానవులను చూచి ప్రమథులందరు కిలికిల ధ్వనులు చేసి గొప్ప సంరంభంతో అనేకాలయిన తూర్యాలు భేరీలు మోగించారు. ఆ మహానాదం ప్రళయ ఘోషలాగ భూమ్యాకాశాలను నింపివేసింది. ఆ కాశమార్గాన వెళ్తున్న విఘ్నరాజైన వినాయకుని చెవిన బడినది. అదివిని క్రుద్ధుడై తన ప్రమథులతో కూడికొని పర్వతశ్రేష్ఠమైన మందరానికి వచ్చి వినాయకుడు తండ్రికి భక్తితో మ్రొక్కి , ఓ జగన్నాథా ఇంకా కూర్చున్నారేల? లేవండి, రణ సన్నద్ధులుకండి అని విన్నవించాడు. విఘ్నేశ్వరుని మాటలువిని పరమేశ్వరుడంబికను చూచి, 'అంధకుని సంహరించుటకు వెళ్తున్నాను. నీవప్రమత్తురాలివిగా నుండవలెను సుమా అన్నాడు. అంతట నా గిరి కుమారి ప్రాణశ్వరుని మాటిమాటికి గాఢంగా కౌగలించుకొని స్నేహాతిశయంతో ప్రభూ! వెళ్ళి అంధకుని జయించండి అన్నది. అంతటనామె చందన గోడోచనాంజనాది మంగళ ద్రవ్యాలతో భర్తను పూజించి అత్యంత ప్రేమతో ఆయన పాదాలకు నమస్కరించింది. అంతట నా హరుడు మాలిని, జయ, విజయ, జయంతి, అపరాజితలను చూచి మీరందరు యింటిలోనుండి జాగ్రత్తగా గిరి పుత్రికెలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుతూండండని ఆదేశించాడు. అలా అందరకూ చెప్పి సంతోషంతో వృషభారూఢుడై ఆ శూలపాణి ప్రమథగణాల జయజయధ్వానాల మధ్య అంధకుని జయించుటకై బయలుదేరి వెళ్ళాడు. అలా సర్వలోకేశ్వరుడు మహేశ్వరుడు శూలంధరించి రణభూమికి బయలుదేరగా నోమహర్షీ! ఆయన విజయాన్ని సూచిస్తూ మంగళకరాలైన శుభశకునాలెన్నో కలిగాయి. ఎడమ వైపుగా ఆడనక్క మోరయెత్తుకొని అరుస్తూ నడిచింది. క్రవ్యాదులు రక్తమాంస పిసాసువులైన మృగాలు సంతోషంతోతమదాహం తీర్చుకునేందుకు వెంబడించాయి. ఆ పరమశివుని దక్షిణాంగం నఖ శిఖ పర్యంతం కంపించింది. హారీతపక్షి మౌనంగా మెడ త్రిప్పుకొని వెళ్ళింది. ఈ శుభశకునాలను చూచి భూతభవిష్యద్వర్త మాన ప్రభులైన ఆ చంద్రశేఖరుడు నందీశ్వరునితో చిరునవ్వులు చిలుకరిస్తూ యిలా అన్నాడు.

హర ఉవాచ :

నందిన్‌ జయో7ద్యమేభావీ సకథంచి త్పరాజయః | నిమిత్తానీహదృశ్యంతే సంభూతాని గణశ్వర. 17

తచ్ఛంభువచనం శ్రుత్వా శైలాదిః ప్రాహశంకరమ్‌|

కఃసందేహో మహాదేవః యత్త్వం జయసిశాత్రవాన్‌. 18

ఇత్యేవముక్త్వా వచనం నందీరుద్రగణాం స్తథా | సమాదిదేశ యుద్ధాయ మహాపాశుపతైః సహ. 19

తే7భ్యేత్య దానవబలం మర్దయంతిస్మ వేగితాః | నానాశస్త్ర ధరావీరా వృక్షానశనయోయథా. 20

తేవధ్యమానా బలిభిః ప్రమథైర్ధైత్య దానవాః | ప్రమత్తాః ప్రమథాన్‌ హంతుం కూటముద్గర పాణయః. 21

తతో7బరతలే దేవాః సేంద్రవిష్ణు పితామహాః | ససూర్యాగ్ని పురోగాస్తు నమాయాతాదిదృక్షవః 22

తతో7బర తలేఘేషః సస్వనః సమజాయత | గీతవాద్యాది నంమిశ్రో దుందుభీనాం కలిప్రియ 23

తతః పశ్యత్సుదేవేషు మహాపాశుపతా దయః | గణాస్తద్దానవం సైన్యం జిఘాంసంతిస్మ కోపితాః. 24

చతురంగబలం దృష్ట్వా హన్యమానం గణశ్వరైః | క్రోధాన్వితస్తు హుండస్తు వేగేనాభిసపారహ. 25

ఆదాయపరిఘం ఘోరం వట్టోద్బద్ద మయన్మయమ్‌ |

రాజతం రాజతే7త్యర్థ మింద్ర ధ్వజమివోచ్ఛ్రితమ్‌. 26

తంభ్రామయానో బలవాన్‌ నిజఘాన రణ గణాన్‌ |

రుద్రాద్యాః స్కందపర్యంతా స్తే7భజ్యంత భయాతురా. 27

తత్ర్పభగ్నం బలందృష్ట్వా గణనాథో వినాయకః | సమాద్రవతవేగేన తుహుండం దనుపుంగవమ్‌. 28

అపతంతం గణపతిం దృష్ట్వాదైత్యో దురాత్మవాన్‌ | పరిఘం పాతయామాస కుంభపృష్ఠే మహాబలః. 29

వినాయకస్య తత్కుంభే పరిఘం వజ్రభూషణమ్‌ | శతదాత్వగమత్‌ బ్రహ్మన్‌ మేరోః కూట ఇవాశనిః. 30

పరిఘం విఫలందృష్ట్వా సమాయాంతంచ పార్షదమ్‌ | బబంధ బాహుపాశేన రాహూరక్షన్‌ హిమాతులమ్‌. 31

సబద్దో బాహుపాశేన బలాదాకృష్య దానవమ్‌ | సమాజఘాన శిరసి కుఠారేణ మహోదరః 32

కాష్ఠవత్సద్విధా భూతో నివపాత ధరాతలే | తథా7పినాత్యజద్రాహు ర్బలవాన్‌ దానవేశ్వరః|

సమోక్షార్థే7కరోద్యత్నం నశశాక చ నారదః. 33

నందీ! ఈ శుభశకునాలు, నాకీరోజు జయం కలుగుతుందని అపజయమంటూ ఉండదని చూపిస్తున్నాయి. శివుని మాటలకా గణాధ్యక్షుడు శిలాదపుత్రుడు మహాదేవా! నీవు జయించుటకు, శాత్రవులను పరిమార్చుటకు సందేహమంటూ ఏముండునని చెప్పి మహాపాశుపతాదులతో సహా రుద్ర గణాల నందరను యుద్ధానికి ఆదేశించాడు. ఆ గణాల వారంతా నానా అస్త్రశస్త్రాలు ధరించి దానవబలం మీదబడి పిడుగులు చెట్లను కూల్చినట్లు వారలను మర్దించ సాగారు. బలవంతులైన ప్రమథుల దాడిని త్రిప్పుకొట్టుటకై ఆ దైత్యదానవులంతా, రోకళ్ళు గుదిబండలు ధరించి ఆ ప్రమథులను చంప నుద్యమించారు. ఆ సమయాన ఆకాశాన నిలచి, ఇంద్ర విష్ణు బ్రహ్మ సూర్యాగ్నులతో గూడి దేవతలంతా ఆ దృశ్యం చూడ సాగారు. అంబరవీథి అంతా, ఓ నారదా! దుందుభులూ గీత వాద్యాల తుముల ఘేషలతో నిండిపోయింది. అలా దేవగణం చూస్తూ ఉండగా నా మహాపాశుపతాది గణాల వారంతా మహాకోపంతో ఆ దానవులను సంహరింపసాగారు. దైత్యసేనాపతి హుండుడు తమ చతురంగబలాలు సంహరింపబడటం చూచి క్రోధోన్ముత్తుడై మహావేగంతో, పట్టుకుచ్చులతో వెలిగే ప్రచండమైన వెండి గుదియ చేత బట్టుకొని ఇంద్రధ్వజంలాగా శత్రువుల మీద విరుచుకొని పడ్డాడు. ఆ గుదియను గిరగిర త్రిప్పుచూ అనేకమంది గణాలను సంహరించాడు. వాని ధాటికి వెరచి రుద్రులు మొదలు స్కందగణాల వారలు సైతం పారిపోసాగారు. అలా భయంతో విరుగుతున్న తనబలాన్ని చూచి గణాధిపతియైన వినాయకుడు తుహుండుని వైపు వేగంగా పరుగెత్తాడు. ఆ వచ్చుచున్న వినాయకుని కుంభస్థలాన్ని గురిచూచి ఆ దురాత్ముడైన హుండుడు తన గుదియను విసిరాడు. ఓ బ్రహ్మర్షీ! వజ్రంతో అలంకరించబడిన ఆ గుదియ వినాయకుని కుంభప్రదేశాన తగిలి, మేరుశిఖరానబడి ముక్కలయ్యే పిడుగునకు వలె తుత్తునియలై పోయింది. పరిఘను విఫలం గావించి తన మేనమామ (తుహుండుని) మీద లంఘిస్తున్న వినాయకుని చూచి, వాడిని రక్షించుకొనుటకై, రాహువు తన బాహుపాశాలతో గట్టిగా బంధించాడు. అంత నామహోదరుడు వాడి బాహుపాశాన్ని విడిపించుకొనుటకై వాడిని లాగి తనగొడ్డలితో తలమీద ప్రహరించాడు. వ్రేటుకు ఎండిన కట్టెలాగ తలరెండుగాచీలి క్రిందపడినా, ఆ రాహువు తనపట్టును వదలలేదు. నారదా! వినాయకుడెంత యత్నించినా తప్పిచుకోలేకపోయాడు.

వినాయకం సంయతమీక్ష్య రాహుణా కుండోదరోనామ గణశ్వరో7థః|

ప్రగృహ్యతూర్ణం ముశలం మహాత్మా రాహుందురాత్మానమసౌజమాన. 34

తతోగణశః కలశధ్వజస్తు ప్రాసేనరాహుం హృదయేబిభేద|

ఘటోదరో వైగదయా జఘాన ఖడ్గేన రక్షో7ధిపతిః సుకేశీ. 35

సతైశ్చతుర్భిః పరితాడ్యమానో గణాధిపం రాహురథోత్పసర్జ |

సంత్యక్త మాత్రో7థ పరశ్వథేన తుహుండమూర్ధాన మథోబిభేద. 36

హతేతుహుండే విముఖేచరాహౌ గణశ్వరాః క్రోధవిషం ముముక్షువః

పంచైకకాలానలసన్నికాశా విశంతి సేనాం దనుపుంగవానామ్‌. 37

తాంవధ్యమానాం స్వచమూంసమీక్ష్య బలిర్భలీ మారుతతుల్యవేగః.|

గదాం సమావిధ్యజఘానమూర్ధ్ని వినాయకం కుంభతటేకరేచ. 38

కుండోదరం భగ్నకటించకార, మహోదరం శీర్ణశిరః కపాలమ్‌ |

కుంభధ్వజం చూర్ణితసంధి బంధం ఘటోదరం చోరువిభిన్నసంధిమ్‌ . 39

గణాధిపాంస్తాన్‌ విముఖాన్‌ సకృత్వా బలాన్వితో వీరతరో7సురేంద్రః|

సమభ్యధావత్‌ త్వరితోనిహంతుం గణశ్వరాన్‌ స్కంద విశాఖముఖ్యాన్‌. 40

తమాపతంతం భగవాన్‌ సమీక్ష్య మహేశ్వరః శ్రేష్ఠతమంగణానామ్‌ |

శైలాదిమామంత్ర్యవచో బభాషే గచ్ఛస్వదైత్యాన్‌ జహి వీరః యుద్ధే. 41

ఇత్వేవముక్తో వృషభధ్వజేన వజ్రం సమాదాయశిలాదసూనుః|

బలింసమభ్యేత్య జఘానమూర్ధ్ని సంమోహితః సో7వనిమానసాద. 42

సంమోహితం భ్రాతృసుతం విదిత్వా బలీ కుజంభోముసలం ప్రగృహ్య |

సంభ్రామయం స్తూర్ణతరం సవేగాత్‌ సనర్జనందింప్రతిజాతకోపః. 43

తమాపతంతం ముసలం ప్రగృహ్య కరేణతూర్ణం భగవాన్‌ సనందీ |

జఘానతేనైవకుజంభ బాహవే నప్రాణహీనో నిపపాతభూమౌ. 44

హత్వాకుజంభం ముసలేననందీ వజ్రేణవీరః శతశోజఘాన |

తేవధ్య మానాగణనాయకేన దుర్యోధనం వైశరణం ప్రపన్నాః. 45

దుర్యోధనః ప్రేక్ష్యగణాధిపేన వజ్రప్రహారైర్నిహతాన్‌ దితీశాన్‌|

ప్రానం సమావిధ్యతడిత్ర్పకాశం నందిం ప్రచిక్షేప హతో7సి వైబ్రువన్‌. 46

తమాపతంతం కులిశేననందీ బిభేదగుహ్యం పిశునోయథానరః|

తత్ర్పాసమాలక్ష్య తదానికృత్తం సంవర్త్యముష్టిం గణమాససాద. 47

తతో7స్య నందీ కులిశేనతూర్ణం శిరో7చ్ఛినత్తాళఫల ప్రకాశమ్‌|

హతో7థభూమౌ నివపాతవేగా ద్దైత్యాశ్చ భీతావిగతాదిశోదశ. 48

రాహువు బంధనంలో చిక్కిన వినాయకుణ్ణి చూచి కుండోదరుడనే గణశ్వరుడు రోకలి పట్టుకొని మహావేగంతో దురాత్ముడగు రాహువును మోదాడు. కలశధ్వజుడనే గణపతి ప్రాసంతో రాహువు గుండెలు చీల్చాడు. ఘటోదరుడు గదతో ప్రహరించాడు. సుకేశ దైత్యుడు ఖడ్గంతో కొట్టాడు. అలా నలువైపుల నుండి చావు దెబ్బలు తిని వివశుడై ఆ రాహువు వినాయకుని వదలిపెట్టాడు. వెంటనే ఆ గణశ్వరుడు గండ్ర గొడ్డలితో తుహుండుని తల బ్రద్దలుకావించాడు. తుహుండుడు మరణించి రాహువు తిరుగు ముఖం పట్టడంతో, కాలానల సదృశులైన గణశ్వరులైదుగురు రాక్షసవీరుల సేనలోకి, తమ క్రోధవిషజ్వాలలు వర్షించేందుకు చొచ్చుకొని పోయారు. అలా వారల క్రోధాగ్నికి మాడిపోనున్న తనసేనను చూచి మహాబలశాలియైన బలి వాయువేగంతో గదతో వినాయకుణ్ణి కుంభస్థలం మీద మోదాడు. కుండోదరుడి నడుము విరుగగొట్టాడు. మహోదరుని మాడుపగులగొట్టాడు. కుంభధ్వజుడి కీలుకీలూ ఊడబాదాడు. ఘటోదరుడి తొడలు సంధులు పొడిపొడి చేశాడు. అలా అయిదుగురు గణాధిపులను తిరుగుముఖం పట్టించి, రెట్టించిన శౌర్యంతో ఆ రాక్షస శ్రేష్ఠుడు స్కంద విశాఖాది గణాల వారి మీదకు లంఘించాడు. అలా విరుచుక పడుతున్న బలిని చూచి మహేశ్వరుడు గణశ్రేష్ఠుడైన నందీశ్వరుని పిలచి, ఓ వీరా! వెళ్ళి దైత్యులను జయించి రమ్మని పంపాడు. శివాదేశాన్ని తలదాల్చి ఆ శిలాదనందనుడు వజ్రాయుధం గిరగిరా త్రిప్పి బలితలమీద గట్టిగా కొట్టాడు. దానితో అతడు సృహతప్పి నేలమీదపడిపోయాడు. తన సోదరుని కుమారుడలా మూర్ఛపోవడం చూచి కుజంభుడు రోకలి పట్టుకొని మహాబలంతో త్రిప్పి నందిమీద విసిరాడు. అలా వస్తూన్న రోకలిని మధ్యలోనే ఒడిసి పట్టుకొని మహాబలశాలియైన నంది దానితోటే కుజంభుని తలపగులగొట్టి యమలోకానికి పంపాడు. ముసలంతో కుజంభుణ్ణి చంపి. ఆ నంది వజ్రాయుధంతో వందలాది రాక్షసులను సంహరించాడు. వారందరా గణనాయకుని చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి దుర్యోధనుని అండజేరారు. నంది చేతిలో దెబ్బలుతిని వచ్చిన తనవీరులను చూచి ఆ దైత్య వీరుడు దుర్యోధనుడు మెరుపుతీగవంటి ప్రాసాయుధాన్ని నందిమీదకు చావురా ఈ దెబ్బతో! నంటూ బలంకొద్దీ విసరాడు. ఆ వచ్చే ప్రచండ ప్రాసానిని, కొండెగాడు (పిశునుడ) గూఢరహస్యాలు బయటపెట్టి బ్రద్దలు గావించి నట్లుగా వజ్రాయుధంతో మధ్యలో బ్రద్ధలు చేశాడు. అంతట తన ప్రాసాయుధం వ్యర్థంకావడం చూచి వాడు పిడికిలి బిగించి గణశ్వరుని మీదకు దుమికాడు. అంతట నందీశ్వరుడు మహావేగంతో వజ్రాయుధం ప్రయోగించి వాడి తలకాయను తాటి పండులాగ ఛేదించి నేల పడగొట్టాడు. ఆ వీరుడు నేలకొరగి పోవడంతో రాక్షసులంతా భయభీతులై వెన్నిచ్చి దశదిశలకూ పారిపోయారు.

తతోహతం స్వంతనయం నిరీక్ష్యహస్తీ తదానందినమాజగామ|

ప్రగృహ్యబాణా సనముగ్రవేగం బిభేదబాణౖర్యమదండ కల్పైః. 49

గణాన్‌ సనందీన్‌ వృషభధ్వజాంస్తాన్‌ | దారాభిరేవాంబుధరాస్తు శైలాన్‌ |

తేఛాద్యమానాసురబాణజాలై ర్వినాయకాద్యా బలినో7పివీరాః.

సింహప్రణున్నా వృషభాయథైవ భయాతురా దుద్రువిరే సమంతాత్‌. 50

పరాజ్‌ ముఖాన్వీక్ష్య గణాన్‌ కుమారః | శాక్త్యాపృషత్కాసథ వారయిత్వా |

తూర్ణం సమభ్యేత్యరిపుంసమీక్ష్య ప్రగృహ్యశక్త్యా హృదయే బిభేద. 51

శక్తి నిర్భిన్న హృదయో హస్తేభూమ్యాం సపాతహ | మమారచారి పృతనా జాతాభూయః పరాఙ్‌ ముఖీ. 52

అమరారి బలం దృష్ట్వా భగ్నం క్రుద్ధా గణశ్వరాః | పురతో నందినం కృత్వా జిఘాసంతిస్మదానవాన్‌. 53

తేవధ్యమానాః ప్రమథై ర్దైత్యాశ్చాపి పరాఙ్‌ నముఖాః | భూయోనివృత్తా బలినః కార్తస్వర పురోగమాః. 54

తాన్‌ నివృత్తాన్‌ సమీక్ష్యైవ క్రోధ దీప్తేక్షణః శ్వసన్‌ | నందిషేణో వ్యాఘ్రముఖో నివృత్త శ్చాపివేగవాన్‌. 55

తస్మిన్‌ నివృత్తే గణపే వట్టిశాగ్ర కరేతధా | కార్తస్వరోనివవృతే గదామాదాయ నారద. 56

తమాపతంతం జ్వలన ప్రకాశం గణః సమీక్ష్యైవ మహాసురేంద్రమ్‌|

తం పట్టిశం భ్రామ్యజఘానమూర్ధ్ని కార్తస్వరం విస్వరమున్నదంతమ్‌. 57

తస్మిన్‌ హతే భ్రాతరి మాతులేయో పాశం సమావిధ్య తురంగకంధరః|

బబంధవీరః సహపట్టిశేన గణశ్వరం చాప్యథనందిషేణమ్‌. 58

నందిషేణం తథాబద్ధం సమీక్ష్య బలినాం వరః | విశాఖః కుపితో7భ్యేత్య శక్తి పాణిరవస్థితః. 59

తందృష్ట్వా బలినాంశ్రేష్ఠః పాశపాణి రయశ్శిరాః | సంయోధయామాసబలీ విశాఖం కుక్కుట ధ్వజమ్‌. 60

విశాఖం సంనిదుద్దం వై దృష్ట్వా 7యఃశిరసారణ | శాఖశ్చనైగమేయశ్చ తూర్ణమాద్రవతాం రిపుమ్‌. 61

ఏకతోనైగమేయేన భిన్నఃశక్త్యా త్వయఃశిరాః | ఏకతశ్చైవ శాఖేన విశాఖప్రియ కామ్యయా. 62

సత్రిభిః శంకర సుతైః పీడ్యమానో జహౌరణమ్‌ | తేప్రాప్తాః శంబరం తూర్ణం ప్రేక్ష్యమాణా గణశ్వరాః. 63

పాశంశక్త్యా సమాహత్య చతుర్భిః శంకరాత్మజైః | జగామ నిలయం తూర్ణ మాకాశాదివ భూతలమ్‌. 64

పాశేనిరాశతాం యాతే శంబరః కాతరేక్షణః | దిశో7థభేజేదేవర్షే కుమారః సైన్యమర్దయత్‌. 65

తైర్వధ్యమానా పృతనా మహర్షే సా దాననీ రుద్రసుతైర్గణౖశ్చ|

విషణ్ణరూపా భయవిహ్వలాంగీ జగామ శుక్రం శరణం భయార్తా.66

ఇతి శ్రీ వామన మహాపురాణ ద్విచత్వారింశోధ్యాయః.

తన కుమారుడట్లు హతుడగుట నిరీక్షించి, వాని తండ్రి హస్తి భయంకరమైన బాణాసవం ధరించి నందీశ్వరుని మీదకురికి, యమదండాల్లాంటి బాణాలు వదలి ఆయన శరీరాన్ని చిల్లులుబడజేశాడు. మోఘాలనడ్డుకొని వాన జలధారల్లో మునిగిన కొండల్లాగ నందీశ్వరునితో బాటు వృషభధ్వజులైన గణాలవారంతా ఆబాణధారల్లో మునిగిపోయారు. ఆ బాణ వృష్టికి తట్టుకొనలేక బలవంతులైనప్పటికీ వినాయకాది వీరులుకూడ సింహాన్ని చూచిబెదరిన వృషభాల్లాగ నలువైపులా భయార్తులై పారిపోయారు. అలా తమ గణాధిపతులు తిరోగాములవడం చూచి, తన శక్త్యాయుధంతో ఆ బాణవృష్టిని నివారించి ప్రచండ వేగంతో శత్రువును సమీపించి శక్తితో వాని వృక్షాన్ని చీల్చాడు, కుమారస్వామి. స్కందుని శక్తి పాతానికి హస్తి నేలకొరిగి మరణించగా శత్రుసైన్యం మరల పలాయనం చిత్తగించింది. అసుర సైన్యమలాకకావికలై పోవడంచూచి నంది మొదలైన గణ ముఖ్యులు మహాక్రోధంతో విజృంభించి దానవమూకలను చెండాడసాగారు. అలా ప్రమథుల ధాటికి వెన్నువిరిగి పారిపోయే దానవులు కార్తస్వరదైత్యనాధుని నాయకత్వంలో మరలి యుద్ధభూమికి వచ్చారు, అలా తిరిగివచ్చిన దైత్య సేవలను చూచి ప్రచండ క్రోధంతో బుసలు కొడుతూ వ్యాఘ్రముఖుడైన నందిషేణుడు కూడ తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. వాడిమొనదేరిన పట్టిశాయుధంతో నందిషేణుడు, గదచేతబట్టుకొని కార్తస్వరుడూ తలపడ్డారు. అలా అగ్ని శిఖలా దూకుతున్న కార్తస్వర మహాదైత్యుని చూచి నందిషేణుడు పట్టిశాన్ని గిరగిర త్రిప్పి ప్రచండ వేగంతో వాని నుదుటి మీద ప్రహరించాడు. దానితో ఆ కార్తస్వరుడు వికృతస్వరంతో చావుకేకపెట్టి నేలకొరిగాడు. తన మేనమామ కుమారుడలా హతుడు కావడంతో కాలపాశంలాంటి పాశం ధరించి, తురంగకంధరుడను వీరుడు ముందుకురికి ఆ పాశంతో ఆ నందిషేణుడిని పట్టిశాయుధంతో సహా బంధించాడు. బద్ధుడైన నందిషేణుని చూచి రోషించి మహాబలశాలి అయిన విశాఖుడు శక్తి ఆయుధంతో వచ్చి నిలచాడు. అది చూచి మేటివీరుడైన ఆయఃశిరుడను వాడు పాశం ధరించి కుక్కట ధ్వజుడైన విశాఖునితో తలపడ్డాడు. అదిచూచి విశాఖునికి తోడుగా శాఖుడు నైగముడు వచ్చి ఆయఃశిరుని ఎదుర్కొన్నారు. విశాఖునికి ప్రియం చేసేందుకై శాఖ నైగమేయులిద్దరూ తమశక్త్యాయుధాలతో అయఃశిరుని దేహాన్ని చెరొక వైపునా ఛేదించాడు. అలా ఆ హర కుమారులు మువ్వురూ పీడించగా వాడు రణభూమి వదలి పారిపోయి గణశ్వరులు చూస్తుండగా, శంబరాసురుని మరుగుచేరాడు. ఆ శంబరుని పాశాన్ని శివుని నలుగురు పుత్రులూ నాలుగు ముక్కలుగా తమ శక్త్యాయుధాలతో ఖండించారు. అలా ఆకాశం నుంచి క్రిందబడిన తన పాశపు ముక్కలను చూచి భయంతో గడగడ లాడుతూ శంబరుడు పారిపోయాడు. కుమారుడు రాక్షసులను మర్దించాడు. రుద్రగణాలచేత మర్దింపబడిన ఆ దానవసేన విషణ్ణవదనంతో భయాందోళనతో పారిపోయి శుక్రాచార్యుని అండజేరింది.

ఇది శ్రీవామనహాపురాణంలో నలుబది రెండవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters