Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది రెండవ అధ్యాయము

ఋషయ ఊచుః :

స్థాణుతీర్థస్యమాహాత్మ్యం వచస్యచమహామునే | సాన్నిహత్యసరోత్పత్తిం పూరణం పాంశునాతతః. 1

లింగానాందర్శనాత్పుణ్యం స్పర్శనేన చకింఫలమ్‌ | తథైవసరమాహాత్మ్యం బ్రూహిసర్వమశేషతః. 2

లోమహర్షణ ఉవాచ :

శృణ్వంతుమునయస్సర్వే పురాణంవామనం మహత్‌ | యచ్ఛ్రుత్వాముక్తిమాప్నోతి ప్రసాదాద్వమనస్యతు.

సనత్కుమారమాసీనం స్థాణోర్వటసమీపతః | ఋషిభిర్వాలభిల్యాద్యై ర్బ్రహ్మపుత్రైర్‌ మహాత్మభిః. 4

మార్కండేయోమినిస్తత్ర వినయేనాభిగమ్యచ | పప్రచ్ఛసరమాహాత్మ్యం ప్రమాణంచస్థితింతథా. 5

మార్కండేయ ఉవాచ :

బ్రహ్మపుత్రమహాభాగ సర్వశాస్త్రవిశారద | బ్రూహిమేసరమహాత్మ్యం సర్వపాపక్షయావహమ్‌. 6

కానితీర్థానిదృశ్యాని గుహ్యానిద్విజసత్తమ | లింగానిహ్యతిపుణ్యాని స్థాణోర్యోని

సమీపతః. 7

యేషాందర్శనమాత్రేణ ముక్తిం పాప్నోతిమానవః | వటస్యదర్శనంపుణ్య ముత్పత్తింకథయస్వమే. 8

ప్రదక్షిణాయాంయత్పుణ్యం తీర్థస్నానేనయత్ఫలమ్‌ | గుహ్యేషు చైవదృష్టేషు యత్పుణ్యమభిజాయతే. 9

దేవదేవోయథాస్థాణుః సరోమధ్యేవ్యవస్థితః | కిమర్థంపాంశునాశక్ర స్తీర్థంపూరితవాన్‌ పునః . 10

స్థాణుతీర్థస్యమాహాత్మ్యం చక్రతీర్థస్యయత్పలం | సూర్యతీర్థస్యమాహాత్మ్యం సోమతీర్థస్యబ్రూహిమే. 11

శంకరస్య గుహ్యాని విష్ణోః స్థానానియానిచ | కథయస్వమహాభాగ సరస్వత్యాః

సవిస్తరమ్‌. 12

బ్రూహిదేవాధిదేవస్యమాహాత్మ్యం దేవతత్త్వతః | విరించస్య ప్రాసాదేన విదితంసర్వమేవచ. 13

ఓ మహామునీ ! స్థాణుతీర్థం, అక్కడి వటవృక్ష మాహాత్మ్యం సాన్నిహిత్య సరోవరోత్పత్తి దానినిమట్టి (దుమ్ము) తో పూడ్చటం, ఆ సరోవరమహిమ అక్కడి లింగాల దర్శన స్పర్శలవల్ల కలిగేఫలం,అన్నీ విశదంగా వివరించండి. అందుకు లోమహర్షణుడిలా చెప్పసాగాడు. మునులారా ! మీరందరూ , దేనిని విన్నంతనే శ్రీ వామనదేవుని కృపవల్ల ముక్తికలుగుతుందో అలాంటి ఉత్తమైన వామనపురాణాన్ని శ్రద్ధగా వినండి. స్థాణువట సమీపాన, వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహనీయులతో ఆసీనుడైన బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయముని యొకపరి వినయంగా అభివాదంచేసి, ఆ సరోవరంయొక్క విస్తారం, మహిమలు, ఉనికీ వివరించవలసినదిగా అర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడవైన బ్రహ్మకుమారా ! సర్వపాపాలు క్షాలనంచేసే సరోవరమహిమ నాకు తెలుపగోరెదను. ఏఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి, ఏ తీర్థాలుగుప్తంగా ఉన్నవి? స్థాణువుకు అతిదగ్గరగా ఉన్న అతిపవిత్ర లింగాలు ఎవ్వి? దర్శనమాత్రాన ముక్తి పాదాలైన ఆ లింగాలను గురించీ పవిత్ర వటవృక్షదర్శన పుణ్యం. దాని ఉత్పత్తీ, తీర్థప్రదక్షిణ స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉండే దేవతలనారాధించిన కలుగుఫలం దేవాధిదేవుడైన స్థాణువు సరోవరం మధ్య ఉండుట, శక్రుడా తీర్థాన్ని మట్టితోపూడ్చుట, ఆస్థాణు తీర్థమహిమ, చక్రతీర్థ సూర్యతీర్థ సోమతీర్థాల మహిమా విశేషాలు వివరించండి. మహామునీ ! బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో, ఈశ్వరుని గుహ్యస్థానాలు విష్ణుస్థానాలు సరస్వతీ వృత్తాంతం దేవాధిదేవుని మహిమ మొదలగునవన్నియు సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి విన్నవించాడు.

లోమహర్షణ ఉవాచ :

మార్కండేయవచః శ్రుత్వా బ్రహ్మాత్మాసమహాముని ః | అతిభక్త్యాతుతీర్థస్య ప్రవణీకృతమానసః. 14

పర్యంకంశిథిలీకృత్వా నమస్క్వత్వామహేశ్వరమ్‌ | కథయామాసతత్సర్వం యచ్ఛ్రుతంబ్రహ్మణఃపురా.

సనత్కుమార ఉవాచ ః

నమస్కృత్యమహాదేవ మీశానంవరదంశివమ్‌ | ఉత్పత్తించ ప్రవక్ష్యామి తీర్థానాంబ్రహ్మ భాషితామ్‌. 16

పూర్వమేకార్ణవేఘోరే నష్టేస్థావరజంగమే | బృహదండమభూజేకం ప్రజానాం బోజసంభవమ్‌. 17

తస్మిన్నండేస్థితోబ్రహ్మా శయనాయోపచక్రమే | సహస్రయుగపర్యంతం సుప్త్వాసప్రత్యబుధ్యత. 18

సుప్తోత్థిత స్తదా బ్రహ్మా శూన్యంలకమపశ్యత | సృష్టించింతయతస్తస్య రజసామోహితస్యచ. 19

రజఃసృష్టిగుణంప్రోక్తం సత్త్వస్థితిగుణం విదుః | ఉపసంహారకాలేచ తమోగుణః

ప్రవర్తతే. 20

గుణాతీతః సభగవాన్‌ వ్యాపకః పురుషః స్మృతః | తేనేదంసకలంవ్యాప్తం యత్కించిజ్జీవసంజ్ఞితమ్‌. 21

సబ్రహ్మాసచగోవింద ఈశ్వరః సననాతనః | యస్తంవేదమహాత్మానం ససర్వంవేదమోక్షవిత్‌. 22

కింతేషాంసకై స్తీర్థై రాశ్రమైర్వాప్రయోజనమ్‌ | యేషామనంతకంచిత్త మాత్మన్యేవవ్యవస్థితమ్‌. 23

ఆత్మానదీసంయమపుణ్యతీర్థా సత్యోదకాశీలసమాధియుక్తా.

తస్యాంస్నాతః పుణ్యకర్మాపునాతినవారిణా శుద్ధ్యతి చాంతరాత్మా. 24

ఏతత్ప్రధానం పురుషస్యకరమ్యదాత్మసంబోధసుఖేప్రవిష్టమ్‌|

జ్ఞేయం తదేవ ప్రవదంతిసంతః తత్ర్పాప్యదేహీవిజాతికామాన్‌. 25

నైతాదృశం బ్రాహ్మణస్యాస్తివిత్తం యథైకతాసమతా సత్యతాచ

శీలేస్థితిర్దండ విదానవర్జనమ్‌ అక్రోధనశ్చోపరమః క్రియాభ్యః. 26

ఏతద్బ్రహ్మసమాసేన మయోక్తంతేద్విజోత్తమ | యజ్‌ జ్ఞాత్వాబ్రహ్మపరమం ప్రాప్స్యసిత్వం నసంశయః.

లోమహర్షణుడిలా అన్నాడు. మర్కండేయముని మాటలువిన్న వెంటనే బ్రహ్మాత్ముడైన ఆ మహాముని, తీర్థము లందు అతిశ్రద్ధకలవాడై ఎంతో భక్తితో తనపర్యంకాసనముద్రవీడి పరమశివునకు నమస్కరించి తాను పూర్వం బ్రహ్మవలన విన్నదంతయు చెప్పనారంభించాడు. ఓ మహామునీ! వరదుడు కల్యాణకరుడునగు మహేశ్వరునకు నమస్కరించి మున్నునేను బ్రహ్మవలన వినివట్టి తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జల ప్రళయమేర్పడి స్థావరజంగ మాత్మకమైన జగత్తంతా నశించిపోయింది. సకల జీవసృష్టికి మూలమైన పెద్ద అండం (గ్రుడ్డు) ఒకటి పుట్టింది. ఆ అండంలో ఉన్న బ్రహ్మ వేయియుగాలపాటు నిద్రించి మేలుకొన్నాడు. లోకమంతా శూన్యంకావడం చూచి ఆయన రజోగుణమోహితుడై సృష్టిచేయ నాలోచించాడు. సృష్టి గుణం రజస్సు, స్థితిగుణం లయంకాగా ఉపసంహారకాలంలో తమోగుణం ప్రవర్తిస్తుంది. యిక ఈ సకల జీవులను వ్యాపించియున్న ఆ పరమపురుషుడగు భగవానుడో సకలగుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా ఈశ్వరుడుగా గోవిందుడు గా పిలవబడే సనాతనుడు. ఆ పరతత్వాన్ని గుర్తించినవానికి సకలంతెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలిసికొన్న మహనీయులకు ఈ తీర్ధాలు ఆశ్రమాలు యేవీ అవసరంలేదు. వారు ముక్తులు. సంయమమునే పవిత్రతీర్థాలతో, సత్యం శీలం సమాధులనే పవిత్రోదకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానంచేసిన పుణ్యుడు పవిత్రుడౌతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటివల్ల కలుగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడొనర్చవలసిన ప్రధానకర్తవ్యం. అదే తెలియవలసిన ఏకైకవస్తువని, దానిని పొందినవాడు సమస్తమైన కోరికలను వదలివేయుననీ పెద్దలగు సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడగువానికి సర్వసమతాభావాలు ఏకత్వం శీలం వదలకుండుట హింసాత్యాగం క్రోధరాహిత్యం ఉపరతి (అసంగం) అనే గుణాలే నిజమైన ధనం. దానిని బోలినవిత్తం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా ! సంక్షేపంగా మీకు బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాను. దీనిని తెలుసుకున్నవాడు నిస్సందేహం గా పరమబ్రహ్మను పొందుతారు.

ఇదానీంశృణుచోత్పత్తిం బ్రహ్మణః పరమాత్మనః | ఇమంచోదాహరంత్యేవ శ్లోకంనారాయణంప్రతి. 28

అపోనారావైతనవ ఇత్యేవంనామశుశ్రుమః | తాసుశేతేసయస్మాచ్చ తేననారాయణః స్మృతః. 29

విబుద్ధః సలిలేతస్మిన్‌ విజ్ఞాయాంతర్గతంజగత్‌ | అండంబిభేదభగవాం స్తస్మాదోమిత్యజాయత. 30

తతోభూరభవత్తస్మాద్భువ ఇత్యపరఃస్మృతః | స్వఃశబ్దః తృతీయో7భూత్‌ భూర్భువఃస్వేతిసంజ్ఞితః. 31

తస్మాత్తేజఃసమభవత్‌ తత్సవితుర్వరేణ్యంయత్‌ | ఉదకం శోషయామాస యత్తేజోండవినిసృతమ్‌. 32

తేజసాశోషితం శేషం కలలత్వముపాగతమ్‌ | కలలాద్బుద్బుదంజ్ఞేయం తతః కాఠిన్యతాంగతమ్‌. 33

కాఠిన్యాద్దరణీజ్ఞేయా భూతానాందారిణీహిసా | యస్మిన్‌ స్థానేస్థితంహ్యండం తస్మిన్‌ సంనిహితంసరః. 34

యదాద్యంనిఃసృతంతేజ స్తస్మాదాదిత్య ఉచ్యతే | అండమధ్యేసముత్పన్నో బ్రహ్మాలోకపితామహః . 35

ఉల్బంతస్యాభవన్మేరు ర్జరాయుఃపర్వతాఃస్మృతాః | గర్భోదకంసముద్రాశ్చ తథానద్యఃసహస్రశః. 32

నాభిస్థానేయదుదకం బ్రహ్మణోనిర్మలంమహత్‌| మహత్సరస్తేనపూర్ణం విమలేనవరాంభసా. 37

తస్మిన్‌ మధ్యేస్థాణురూపీ వటవృక్షోమహామనః | తస్మాద్వినిర్గతావర్ణాబ్రాహ్మణాః క్షత్రియావిశః. 38

శూద్రాశ్చతస్మాదుత్పన్నాః శుశ్రూషార్థంద్విజన్మనామ్‌ |

తతశ్చింతయతఃసృష్టిం బ్రహ్మణో7వ్యక్తజన్మనః | మనసామానసాజాతాః సనకాద్యామహర్షయః. 39

పునశ్చింతయతస్తన్య ప్రజాకామస్యదీమతః | ఉత్పన్నాఋషయఃసప్త తేప్రజాపతయో7భవన్‌. 40

ఇక పరమాత్మయగు బ్రహ్మఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతూ ఉంటారు. నీళ్ళు " నార" శరీరం కలవి. (నీటికి నారమని పేరు) వాని మీద శయనిచినందున నారాయణుడని భగవంతునకు పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలిసికొన్న ఆ ప్రుభువు ఆ పెద్దగ్రుడ్డును బ్రద్దలుచేయగా అందులోనుంచి ఓంకారం బయలుదేరింది. అందులోనుచి భూః భువః, స్వః అనే మూడు భూర్భవస్వః లోకాలు వచ్చినయి. వానినుంచి తేజస్సు, తత్సవితుర్వరేణ్యం, బయటకు వచ్చింది. ఆ తేజస్సానీళ్ళన్నింటిని ఎండింపజేసింది. మిగిలినది పిండం (కలలంగా మారింది. దానినుంచి బుడగఏర్పడి అదిగట్టిపడింది. ఆ గట్టితనంవల్ల దానిని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలచిన ప్రదేశ##మే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుడన్నారు. లోకపితామహుడైన విరించి గ్రుడ్డుమధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండంమేరువు, యోనిపర్వతాలు, సప్తసముద్రాలు వేలాది నదులూ గర్భోదకం (ఉమ్మనీరు) బ్రహ్మనాభి ప్రదేశానఉన్న నిర్మలమైన ఉత్తమజలమే అ మహత్సరోవరంలో నిండినది. దానికి మధ్యలో స్థాణురూపమైన వటవృక్షం వెలిసింది. ఆస్థాణువటం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుద్భవించారు. విప్రుల కార్యసాధనకు శూద్రులు వెలసారు. అంతట అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టికార్యాన్ని ఆలోచించగా ఆయన మనస్సునుండి సనకాదిఋషులుద్భవించారు. ప్రజసృష్టీకాయన మరల సంకల్పించుకోగా సప్తఋషులుత్పన్నమైనారు. వారే ప్రజాపతులు.

పునశ్చింతయతస్తస్య రజసామోహితస్యచ | వాలఖిల్యాః సముత్పన్నా స్తపస్స్వాధ్యాయతత్పరాః. 41

తేసదాస్నాననిరతా దేవార్చనపరాయణాః ఉపవాసైర్ర్వతైస్తీవ్రైః శోషయంతి

కలేబరమ్‌. 42

వానప్రస్థేనవిధినా అగ్ని హోత్రసమన్వితాః | తపసా పరమేణహ శోషయంతికళేబరమ్‌. 43

దివ్యంవర్షసహస్రంతేకృశాధమనిసంతతాః | ఆరాధయంతిదేవేశం నచతుష్యతిశంకరః. 44

తతఃకాలేనమహతా ఉమయాసహశంకరః | ఆకాశమార్గేణతదా దృష్ట్వాదేవీసుదుఃఖితా. 45

ప్రసాద్యదేవదేవేశం శంకరం ప్రాహసువ్రతా | క్లిశ్యంతేతేమునిగణా

దేవదారువనాశ్రయాః 46

తేషాంక్లేశక్షయందేవ విధేహి కురుమేదయామ్‌ | కింవేదధర్మనిష్ఠానా మనంతం దేవదుష్కృతమ్‌. 47

నాద్యాపియేనశుద్ధ్యంతి శుష్కస్నాయ్వస్థిశోషితాః | తచ్ఛ్రుత్వావచనందేవ్యాః పినాకీపాతితాంధకః.

ప్రోవాచప్రహసన్‌ మూర్థ్ని చారుచంద్రాంశుశోభితః. 48

శ్రీమహాదేవ ఉవాచ :

నవేత్సిదేవి తత్త్వేన ధర్మస్యగహనాగతిః | నైతేధర్మంవిజానంతి నచకామవివర్జితాః. 49

నచక్రోధేననిర్ముక్తాః కేవలంమూఢబుద్ధయః | ఏతచ్ఛ్రుత్వాబ్రవీద్దేవీ మామైవంశంసితప్రతాన్‌ 50

దేవప్రదర్శయాత్మానం పరంకౌతూహలంహిమే | సఇత్యుక్తఉవాచేదం దేవీందేవఃస్మితాననః. 51

తిష్ఠత్వమత్రయాస్యామి యత్రైతే మునిపుంగవాః | సాధయంతితపోఘోరం దర్శయిష్యామి చేష్టితమ్‌. 52

ఇత్యుక్తాతుతతోదేవీ శంకరేణమహాత్మనా | గచ్ఛస్వేత్యాహముదితా భర్తారంభువనేశ్వరమ్‌. 53

యత్రతేమునయః సర్వేకాష్ఠలోష్టసమాఃస్థితాః | అధీయానామహాభాగాః కృత్వాగ్నిసదనక్రియాః. 54

తాన్‌ విలోక్యతతోదేవో నగ్నఃసర్వాంగసుందరంః | వనమాలాకృతాపీడో యువాభిక్షాకపాలభృత్‌. 55

ఆశ్రమేపర్యటన్‌ భిక్షాం మునీనాం దర్శనంప్రతి | దేహిభిక్షాంతతశ్చోక్త్వా హ్యాశ్రమాదాశ్రమం య¸°. 56

రజోగుణమోహితుడై బ్రహ్మమరల ఆలోచించగా తపఃస్వాధ్యాయ నిరతులైన వాలభిల్యమునులు జన్మించారు. వారు స్నానదేవతార్చన ఉపవాస ప్రతాదులలో మునిగి, వానప్రస్థ పద్దతిలో అగ్ని కర్మలు నెరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమశరీరాలు శుష్కింపజేసుకున్నారు. వేయిదివ్య సంవత్సరాలావిధంగా తపించినందున వారలదేహాల్లోని రక్తమాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలిపోయాయి. అలా ఆరాధించినాశంకరుడు ప్రసన్నుడుకాలేదు. తర్వాత చాలాకాలానికి శివపార్వతులాకాశమార్గాన పోతుంటే పార్వతివాళ్ళఎండిన దేహాలుచూచి దుఃఖించి భర్తను ప్రసన్నునిగావించి యిలా అన్నది. "ప్రభో! దేవదారువనంలో ఆ మునులావిధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారలక్లేశాలు తొలగించండి. అస్తికులై వేదధర్మనిష్ఠతో అస్థిశల్య మాత్రావశిష్టులై యింతకాలంగా ఘోరతపస్సు చేసినా యింకా శుద్ధులుకాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా? కనికరించి అనుగ్రహించండి. పార్వతిదేవిమాటలువిని ఆచంద్రమౌళి, పినాకపాణి, అంధకాంతకుడు చిరునవ్వునవ్వి యిలా అన్నాడు. దేవీ! నీవు ధర్మసూక్ష్మం ఎరుగక యిలా అంటున్నావు. వీరంతగా తపించినా ధర్మమెరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్ధులు; నీవెరుగవు" అందులకాతల్లి ప్రభూ! తపోవ్రతనిష్ఠులైన వీరినిగురించి అలా అనకండి. అనుగ్రహించివారలకు దర్శనమొసగి రక్షించండి. నాకు చాలా బాధగాఉంది. అని వేడుకోగా నా దేవదేవుడు నవ్వుతూ యిలా అన్నాడు. అయితే నీవిక్కడే ఉండి చూస్తూండు. నేనువెళ్లి వారుచేసే కఠోరతపస్సు అసలురంగు బైట పెట్టెదను. వారలచేష్టితాలు నీకే అర్థమౌతాయి." అందుకుసంతోషించి పార్వతిభర్తతో మంచిది, నడవండి అలాగే వెళ్ళుదాం. నేను కూడా వస్తానని యిద్దరూ బయలుదేరారు. కట్టెపుల్లలు యినుపఊచల్లాగ ఉండి వేదాధ్యయనాలు అగ్నికర్మలు అదేపనిగా చేస్తున్న ఆ మునులనుచూచి పరమేశ్వరుడు సర్వాంగ సుందరమూ, దిగంబరమూ, వనమాలాభూషితమైనయువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకొని ఆ మున్యాశ్రమాల వెంటభిక్షాటనం చేయసాగాడు.

తంవిలోక్యాశ్రమగతం యోషితోబ్రహ్మవాదినామ్‌ | సకౌతుకస్వభావేన తస్యరూపేణమోహితాః. 57

ప్రోచుఃపరస్పరంనార్య ఏహిపశ్యామభిక్షుకమ్‌ | పరస్పరమితిచోక్త్వా గృహ్యమూలఫలంబహు. 58

గృహాణభిక్షామూచుస్తా స్తందేవంమునియోషితః | సతుభిక్షాకపాలంతం ప్రసార్యబహుసాదరమ్‌. 59

దేహిదేహిశివంవోస్తు భవతీభ్యస్తపోవనే | హసమానస్తు దేవేశ స్తత్రదేవ్యానిరీక్షితః

తసై#్మదత్వైవతాంభిక్షాం ప్రవచ్ఛుస్తంస్మరాతురాః. 60

నార్యఊచుః:

కో7సౌనామవ్రతవిధి స్త్వయాతాపససేవ్యతే | యత్రనగ్నేనంలింగేన వనాలావిభూషితః.

భవాన్‌ వైతాపసోహృద్యో హృద్యాఃస్మోయదిమన్యసే. 61

ఇత్యుక్తస్తాపసీభిస్తు ప్రోవాచహసితాననః | ఇదమీదృగ్‌ వ్రతం

కించిన్నరహస్యంప్రకాశ్యతే. 62

శృణ్వంతిబహవోయత్ర తత్ర వ్యాఖ్యానవిద్యతే | అన్యవ్రతస్యసుభగా ఇతిమత్వా గమిష్యథ. 63

ఏవముక్తాస్తదాతేనతాః ప్రత్యూచుస్తదా మునిమ్‌ | రహస్యేహిగమిష్యామో మునే నఃకౌతుకం మహత్‌. 64

ఇత్యుక్త్వాతా స్తదాతంవై జగృహుఃపాణిపల్లవైః | కాచిత్కంఠేసకందర్పా బాహూభ్యామపరాస్తథా. 65

జానుభ్యామపరానార్యః కేశేషులలితాపరాః | అపరాస్తుకటీరంధ్రే అపరాఃపాదయోరపి. 66

క్షోభంవిలోక్యమునయ ఆశ్రమేషుస్వయోషితామ్‌ | హన్యతామితిసంభాష్య కాష్ఠపాషాణపాణయః. 67

పాతయంతిస్మదేవస్య లింగముద్దృత్యభీషణమ్‌ | పాతితేతుతతోలింగే గతోంతర్దానమీశ్వరః. 68

తమ ఆశ్రమాలవెంట తిరుగుతున్న ఆ అందమైన యువతపస్విని నగ్నంగాచూచుటతో సహజమైన ఉత్కంఠతో ఆ మునుల భార్యలు మోహంలోమునిగిపోయారు. అందరూ ఒకచోట చేరి తమలోతామా సుందరతపస్విని చూచెదమనుచూ కందమూల ఫలాలు తీసికొని భిక్షపెట్టుటకు బయలుదేరారు. ఆ దేవదేవుడుకూడ "తెండు ! తెండ"నుచు వారలిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షాకపాలాన్నిచూచి భిక్షతీసికొంటూ మేలుకలుగుగాక!" అని నవ్వులొలకబోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నలవర్షం కురిపించారు. "ఓయీ తాపస యువకుడా: ఈవిధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనంచేసే వ్రతం ఎలాటిది ? దానివిధానం ఎక్కడఉంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేముకూడ అందచందాలలో నీకు తీసిపోము". ఆ కామార్తల ప్రశ్నవిని శివుడు - సుందరులారా ! ఇది చాల రహస్యమైన వ్రతం. దీని విధానం ఫలం పదిమందిలో వెల్లడించకూడదు. కాన మీరు మీరు వెళ్ళిపోండి." అనగానాస్త్రీలు " అలాగైతే ఏకాంతస్థలానికి వెళ్దాం పదండి. అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చు" నంటూ ఆయన చేయిపట్టుకొనిరి. కొందరు సుందరాంగనలాయన మెడను మోహావేశంతోపెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు, పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభిప్రదేశాన్ని చుట్టివేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమస్త్రీల వికారచేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రండు రండంటూ కర్రలూ, రాళ్ళూ తీసికొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడినేలపైబడిన వెంటనే ఆ మహాదేవుడంతర్హితుడైపోయాడు.

దేవ్యాసభగవాన్‌ రుద్రః కైలాసంనగమాశ్రితః | పతితేదేవదేవస్య లింగేనష్టేచరాచరే. 69

క్షోభోబభూవసుమహా నృషీణాంభావితాత్మనామ్‌ | ఏవందేవేతదాతత్ర

వర్తతివ్యాకులీకృతే. 70

ఉవాచైకోమునివర స్తత్ర బుద్ధిమతాంవరః | నవయంవిద్మః సద్బావం తాపసస్యమహాత్మనః. 71

విరించింశరణంయామః సహిజ్ఞాస్యతిచేష్టితమ్‌ | ఏవముక్త్వాసర్వఏవ ఋషయోలజ్జితాభృశమ్‌. 72

బ్రహ్మణఃసదనం జగ్ముర్దేవైస్సహనిషేవితమ్‌ | ప్రణిపత్యాథదేవేశం లజ్జయా7ధోముఖాఃస్థితాః. 73

అథతాన్‌ దుఃఖితాన్‌ దృష్ణ్వా బ్రహ్మావచనమబ్రవీత్‌ | అహోమూగ్దాయదాయూయం క్రోధేనకలుషీకృతాః. 74

సధర్మస్యక్రియాకాచిజ్‌ జ్ఞాయతే మూఢబుద్ధయః | శ్రూయతాంధర్మసర్వస్వం తాపసాః క్రూరచేష్టితాః. 75

విదిత్వాయద్బుధః క్షిప్రం ధర్మస్య ఫలమాప్నుయాత్‌ |

యోసావాత్మనిదేహే7స్మిన్‌ విభుర్నిత్యోవ్యవస్థితః. 76

సో7నాదిః సమహాస్థాణుః పృథ క్త్వేపరిసూచితః | మణిర్యథోపధానేన ధత్తేవర్ణోజ్వలో7పివై. 77

తన్మయోభవతేతద్వ దాత్మా7పిమనసాకృతః | మనసోభేదమాశ్రిత్య

కర్మభిశ్చోపచీయతే. 78

తతఃకర్మవశాద్‌ భుంక్తే సంభోగాన్‌ స్వర్గనారకాన్‌ | తన్మనః శోధయేద్దీమాన్‌ జ్ఞానయోగాద్యుపక్రమైః. 79

తస్మిన్‌ శుద్ధేహ్యంతరాత్మా స్వయమేవనిరాకులః | నశరీరస్య సంక్లేశై

రపినిర్దహనాత్మకైః. 80

శుద్ధిమాప్నోతి పురుషః సంశుద్ధంయస్యనోమనః | క్రియూహినాయమార్థాయ పాతకేభ్యః ప్రకీర్తితాః. 81

యస్మాదత్యావిలందేహం నశీఘ్రంశుద్ధ్యతేకిల | తేనలోకేషుమార్గో7యం సత్సథస్యప్రవర్తితః. 82

వర్ణాశ్రమవిభాగో7యం లోకాధ్యక్షేనకేనచిత్‌ | నిర్మితోమోహమాహాత్మ్యం చిహ్నంచోత్తమభాగినామ్‌. 83

భవంతఃక్రోధకామాభ్యా మభిభూతాశ్రమేస్థితాః | జ్ఞానినామాశ్రమోవేశ్మ అనాశ్రమమయోగినామ్‌. 84

క్వచన్యస్తసమస్తేచ్ఛా క్వచనారీమయోభ్రమః | క్వక్రోధమీదృశం ఘోరం యేనాత్మానం నజానథ. 85

యత్క్రోధనోయజతియద్దదాతి యద్వాతపస్తపతియజ్ఞుహోతి |

నతస్యప్రాప్నోతి ఫలం హిలోకే మోఘంఫలంతస్యహిక్రోధనస్య. 86

ఇతి శ్రీవామన మహాపురాణ సరోమాహ్మత్మ్యే ద్వావింశో7ధ్యాయః.

పార్వతితోకలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడుటతోనే సృష్టిఅంతా అతలకుతలమైపోయింది. భగవానుని వ్యాకులపాటువల్ల ఆత్మజ్ఞానులయిన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతటనా మునులలో బుద్ధిమంతుడయినఆతడొకడు, మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేకపోయాము. ఇపుడందరం వెళ్ళివిరించిని శరణువేడుదాము. ఆయనే యెందులోని రహస్యం తెలిసినవాడు అని సలహాయిచ్చాడు. ఆ ప్రకారం ఆ మునులందరు తమ తొందరపాటుకు మూర్ఖత్వానికిసిగ్గుపడి, దేవతలచేత పరివేష్టితుడైన బ్రహ్మసన్నిధికి వెళ్ళి ప్రజతులై తలవంచుకొని నలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులను చూచి బ్రహ్మ యిలా మందలించాడు. " క్రోధం మిమ్ములను కలుషాత్ములను గావించింది. దానికిలోబడి పరమ మూర్ఖులైపోయారు. మూఢబుధ్దులారా ! మీరలు ఏ మాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరుగకపోయారు. పరమక్రూర కార్యమాచరించారు. ధర్మ స్వరూపం, సారతత్వం యిప్పుడైనావిని తెలుసుకోండి. ధర్మస్వరూపం గుర్తించిన విజ్ఞుడు శ్రీఘ్రమే ఉత్తమఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోనే, ఆత్మలోనే సదా నిలచి యున్నాడు. మీకంటె భిన్నుడుకాడు. అనాదితత్వమైన ఆ మహాస్థాణువు, పరమ ప్రకాశవంతమైనమణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రము యొక్క రంగులోనేపైకి కనపడునో, అదే విధంగా ప్రాణులదేహంలోఉంటూ వారలకర్మ వాసనల అంతరాన్ననుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు.ఆయా జీవుల మనోభావాలచేత పరిచ్ఛిన్నుడైయుంటాడు.అయితే ఆయనకు వారలకర్మ వాసనలేమాత్రము అంటవు. వారలకర్మానుసారమే స్వర్గ వరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్ధిమంతులగువారు జ్ఞాన యోగాది సాధనల ద్వారా తమ మనస్సులను పరిశుద్ధం గావించుకోవాలి. చిత్తశుద్ధి అయినవెంటనే అంతరాత్మ తనంతతానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికిలోను కాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంతవరకు ఎంతకాలంప్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును పాపాలనుంచి మరలించేవే సత్ర్కియులు. ఈ అనుష్ఠానాలన్నీ చిత్తశుద్ధికోసమే ఉద్ధేశింపబడినాయి. పాపపంకిలమైన యీ దేహాన్ని శుద్ధిపరచుకొనుటకే లోకంలో ఈ జ్ఞానమార్గం ప్రవర్తితమైనది. అలాంటి సత్ర్పవర్తనకు సాధనభూతంగానే, ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మవ్యవస్థనేర్పరచినాడు. కాగా ఎక్కువమంది అజ్ఞానాన్ని మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారమనుకుంటున్నారు. ఇక మీ విషయమే చూచండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనస్సులో తిష్ఠవేసికొనిఉన్నవో కామక్రోధాలు ! నిజమైన జ్ఞానులకుయిల్లే ఆశ్రమం. జ్ఞానులుకానివారికి ఆశ్రమాలు యింటి కంటె గూడ నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబధమైన భ్రమలకులోనై మీరెక్కడ? నిరీహమైన జీవితమెక్కడ? క్రోధానికి దాసులైన మీరెక్కడ ? ఆత్మజ్ఞానమెక్కడ ? క్రోధాభిభూతుడుచేసే యజ్ఞాలు, యిచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపోవ్రతాదులు బూడిదలోపోసిన పన్నీరువలె నిష్ప్రయోజనకరాలు ! ఈ జన్మలో అవి ఎలాటి ఫలాన్నీ యివ్వవు. కోపిష్టిచేసే పనులన్నీ వ్యర్థచేష్టితాలు !

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమాహత్మ్యంలోని ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters