Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

అంతమొందవలసిన ఆధ్యాత్మిక దారిద్య్రం

మానవులుగా జన్మించే మహాభాగ్యం మనకు లభించింది. ఈ ప్రపంచంలో సుఖంగా జీవించాలని మనం కోరుతూ వున్నాము. దుఃఖము, దైన్యము, కష్టములు, కడగండ్లు ఇవన్నీ మన జీవనగమనముల గురించి, మన బాధలకు గల కారణములను గురించి ఆలోచించుటకై మనకు ప్రేరణ కలిగిస్తాయి. మన ప్రస్తుత కష్టాలకు ఏదో ఒక కారణం వున్నది. ఆకారణం దగ్గరది కావచ్చును లేదా ఎక్కడనో దూరమందు వున్నది కావచ్చును. మన దుఃఖానికి అంతిమకారణాన్ని గుర్తించి దానిని నాశనం చేయవలసి వున్నది. అంతిమకారణాన్ని గుర్తించకుండచేసే యత్నం తాత్కాలికమే అవుతుంది. అప్పుడు దుఃఖం ఆరూపంలో కాకపోతే మరొక రూపంలో తిరిగి ప్రత్యక్షం అవుతుందేకాని నశించదు.

దుఃఖానికి మూలకారణం కనిపెట్టుటకై మతప్రవక్తలు పూనుకొన్నారు, వారిలో ప్రతి ఒక్కరు తమకు తోచిన పరిష్కార మార్గాన్ని సూచించారు. బుద్ధుడు తన చుట్టూ వున్న దుఃఖాన్ని చూచి మథన పడ్డాడు. దుఃఖాన్ని తొలగించడానికి ఒక మార్గం శోధించిమానవాళిని వుద్ధరించాలని ఆయన సంకల్పించాడు. తాను జ్ఞానాన్ని పొంద గలిగిప్పుడే ఇతరులకు తాను సాయపడగలనని ఆయనగ్రహించాడు. ఆజ్ఞానాన్ని అన్వేషిస్తూ ఆయన పర్యటన సాగించాడు. ఎందరో గురువులను ప్రశ్నించాడు. కాని వారు సూచించిన పద్ధతులేవి ఆయనకు నచ్చలేదు. చివరకు ఆయన బోధి వృక్షముక్రింద ఆసీనుడై ధ్యానం ప్రారంభించాడు. ఆయనకు జ్ఞానబోధ కలిగింది. అప్పుడాయన తన 'శూన్యవాద' సిధ్దాంతాన్ని ప్రతిపాదించాడు. ''ప్రపంచములోని ప్రతివస్తువు శూన్యమే'' అని ఆ విషయం గ్రహించి సుఖదుఃఖాలకు చలింపక స్థిరంగా వుండుటయే సరియైన జీవనమార్గమని ఆయన భావించాడు.

క్రైస్తవమతం పాపానికి, దుఃఖానికి కార్యకారణ సంబంధాన్ని ప్రతిపాదించదు. అందరూ పాపులే అనీ, క్రీస్తును నమ్ముట ద్వారా వారు తమ పాపాన్ని క్షాళనంచేసుకొనవచ్చునని అది చెపుతూ వున్నది. క్రైస్తవ మత ప్రకారము ప్రస్తుత జన్మ ఒక్కటే మానవులకు ఇవ్వబడింది. యీ జన్మలో ముక్తి వస్తే వచ్చినట్లు లేకపోతే అధోగతియే. పూర్వజన్మకాని పునర్జన్మకాని లేవు.

మహమ్మదీయమతం కూడా అదే చెపుతూవున్నది. ''ఏసుక్రీస్తులో లేదా మహమ్మదు ప్రవక్తలో విశ్వాసంవుండుట స్వర్గానికి ఏకైకమార్గం; విశ్వాసము లేనివారు నరకానికి పోతారు'' అన్నది వీనిసారం. ఈ రెండుమతాలూ ఈ జన్మతరువాత మరియొక జన్మ వున్నదని విశ్వసించవు. కనుక అవి మరణానంతరం స్వర్గానికి వెళ్ళుట మీదనే తమ దృష్టి నంతటిని కేంద్రీకరించాయి.

జన్మ పరంపర వున్నదనీ, ప్రతి జన్మలోని సుఖదుఃఖాలకు పూర్వజన్మలలోని పాపపుణ్యకర్మలు కారణాలు అని హిందూమతం చెపుతూవున్నది. అందువల్లనే క్రైస్తవులవలె, మహమ్మదీయులవలె హిందువులు శాశ్వతనరకాన్ని గురించి ప్రసంగించరు. భారతీయ సాంప్రదాయంలో జన్మించిన వాడగుటచే బుద్ధుడుకూడా కర్మసిద్ధాంతాన్ని జన్మపరంపరలను విశ్వసించాడు.

ఏసుక్రీస్తును లేదా మహమ్మదు ప్రవక్తను విశ్వసించే వారు మాత్రమే స్వర్గానికి పోతారనే ఉద్ఘాటనయొక్క తార్కిక పరిణామం వారు పుట్టుటకు పూర్వకాలములోని వారెవరూ మోక్షము పొందలేదు. అని అనుటయే. ఇది అంగీకారయోగ్యం కాదు.

ఈ రెండు మతాలు ప్రస్తుత దుఃఖదైన్యాలకు హేతుబద్ధమైన వ్యాఖ్యానంగాని, వాని పరిష్కారమార్గం కాని చూపుటలేదు. హిందువుల కర్మసిద్ధాంతము, జన్మపరంపరల సిద్ధాంతము సంతృప్తికరంగా ఉన్నాయి.

ప్రతివ్యక్తి తన పూర్వజన్మలోని కర్మల ద్వారా ఈ జన్మలో సుఖదుఃఖాలను సంపాదించాడు. అదేవిధంగా ఈ జన్మంలో సత్కార్యాలను చేయుట ద్వారా ఈజన్మయందు వచ్చే జన్మంలయందు సుఖాన్ని పొందవచ్చు.

మతప్రచారకులు దుఃఖంలో ఉన్న మానువుని సమీపించి- తమ మతాన్ని పుచ్చుకొంటే స్వర్గానికి పోవచ్చునని చెప్పడానికి ప్రయత్నిస్తారు.

తమదే ఉత్తమమైన మతమని త్రికరణముల విశ్వసించిన మిషనరీలయొక్క ఉత్సాహం ద్వారా క్రైస్తవమతం విస్తరించింది. 'హీదెను'ల ఆత్మలను కాపాడుటకై వారు ధనం సాధనంగా చేసుకొన్నారు. ఇతరులను తమ మతంలోనికి చేర్చి, తద్ద్వారా వారి ఆత్మలను కాపాడుటకు ఉద్యోగములు వైద్యసౌకర్యములు, విద్యాసౌకర్యములు మొదలగు ప్రలోభనాలను చూపుట తప్పుకాదని వారు విశ్వసించారు.

ఇస్లాము మతం ఖడ్గ సహాయంతో విస్తరించినదని చరిత్ర చెపుతూ వున్నది. 'కాఫిర్లను' కాపాడుటకై బెదరించుట తప్పు కాదని ముస్లిము మతగురువుల విశ్వాసం.

బౌద్ధమతం అహ్దింసను, విశ్వవ్యాప్తమైన ప్రేమను బోధించింది. బుద్ధుని హృదయం నుండి, ఆయన ముఖ్యశిష్యుల హృదయాలనుండి కట్టలు తెగి ప్రవహించే ప్రేమభావం, పరమకారుణిక భావం- ప్రజలను ఆ మతానికి ఆకరించాయి. బౌద్దమతముయొక్క జీవనస్రోతస్సు ప్రేమయొక్క బహః ప్రవాహమే.

పరిశుద్ధాత్ములైన మహాపురుషుల ప్రబోధం ద్వారా, ఆచరణద్వారా ఇతరులలో ప్రేమభావం సృజించుట హిందూ ధర్మముయొక్క జీవనస్రోతస్సు.

హిందూ ధర్మం ఎన్నో అఘాతాలను తట్టుకొని నిలువ గలుగుటకు- కర్మానుష్ఠానం 'తు చ' తప్పకుండ ఆచరింపబడుట, మహాపురుషుల ఆత్మగుణము- అనేరెండూ కారణాలై వున్నాయి.

కొద్దిమంది మహితాత్ములయొక్క ఆధ్యాత్మికౌన్నత్యము, మరియు విశ్వపరివ్యాప్తమైన వారి ప్రేమభావము ప్రజలలోగల శ్రద్ధను నిలిపి వుంచాయి. పూవులలోని మకరందమువలన ఆకృష్టములైన మధుపములవలె సామాన్య జనులు వారి ఆత్మగుణముచేత ఆకం ింపబడినారు.

బౌద్ధమతం ప్రేమను అందరకు ప్రదర్శించుటయందు ప్రాముఖ్యాన్ని ఇచ్చింది. హిందూమతం ప్రేమభావాన్ని ప్రతివ్యక్తి తనలో ఆత్మసౌరభంగా పెంపొందించుకొన వలెనని ప్రబోధిస్తూ వున్నది.

వైదిక మతం అతి ప్రాచీనమైనదనీ, ప్రపంచంలో దాదాపు అన్ని భాగాలలోను ప్రచారంలో వుండేదని నిరూపించుటకు ప్రమాణాలు వున్నాయి. క్రొత్తమతాలు జనించి విస్తరించుటవలన నేడది ఈ దేశపు సరిహద్దులకే పరిమితం అయిపోయింది; కుంచించుకొని పోయింది. అయితే ఈ క్రొత్త మతాలు ఎందులకు వుద్భవించాయి? ఎలా వుద్భవించాయి? ఎలా విస్తరించాయి? అంటే -

మన ధర్మమునందు మనకు విశ్వాసము సడలిపోవుట; ధర్మానుష్ఠానములో మనము ఆశ్రద్ధ వహించుటయే దీనికి కారణాలు.

మన ధర్మములో బలహీనత ఏర్పడుటకు ప్రచారము చేయకపోవుట కారణము కాదు. మనకు శ్రద్ధ లేకపోవుట, మనలోని ఆచరణహీనత మాత్రమే ఈ బలహీనతకు కారణాలు.

ఒక ధర్మంయొక్క శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక, దానిని ఆచరించే వ్యక్తుల స్వభావముమీద ఆధారపడి వుంటుంది. హిందూధర్మ సిద్ధాంతాలకు అను గుణంగా తన జీవనమును తీర్చిదిద్దుకొనే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమప్రచారకుడు. అట్టి మహాపురుషుల వలననే హిందూధర్మం నేటికీ నిలచి ఉన్నది.

మన ధర్మానకి ఉన్న మరొక విశేషం దానికి పేరు లేకపోవుట. ఒకానొక సమయములో వేరొక ధర్మం లేనందున దీనికి పేరు పెట్టవలసిన అవసరం కలుగ లేదు. ధర్మము సనాతనమైనది. దానిని ఆచరించుమని బోధిస్తూ ఉన్నది కనుక హిందూధర్మం 'సనాతన ధర్మం' అని పిలువబడినది. వైదికమతము నుండి వేరుచేయుటకే ఇతరమతాలను వాని సంస్థాపకుల పేర్లతో వ్యవహరించారు.

హిందూధర్మము ననుసరించి పాపము తొలగించుకొనుటకు వేదవిహిత కర్మాచరణం ఒక్కటే మార్గం. శరీరారోగ్యానికీ, మానసిక పారిశుద్ధ్యానికి కర్మానుష్ఠానమే అనుసరణ యోగ్యమైనది.

దుఃఖము కలిగినప్పుడు దానినిగురించి చింతించుట కాక దుఃఖసమయాలలో పాపపుతలంపులు మనస్సులో ప్రవేశించకుండా ఉండాలని ప్రార్థించుటయే ధర్మమార్గము. అట్టి ప్రార్థన వలన సహనశక్తి పెంపొందుతుంది. బాధలోని తీవ్రత తగ్గుతుంది. యథార్థమైన ప్రార్థన బాధనుండి ఉపశమనం పొందుటకు, కాక, మనస్సునుండి చెడుతలంపులను తొలగించి, సద్భావాలు ఎల్లప్పుడు దానిలో వసించునట్లు చేయుటకు ఉద్దేశింపబడింది. పాండవులకు కష్టపరంపరలు కలిగినపుడు కుంతీదేవి భగవానుని సదాధ్యానించేశక్తి వారికి ఒసగుమని ప్రార్థిస్తుంది.

అట్టి దృక్పథం జ్ఞానమువలన కలుగుతుంది. ఈజ్ఞానాన్ని ప్రతివ్యక్తి స్వయంకృషివల్ల సముపార్జించవలసి ఉన్నది. కనుకనే మనధర్మం సామూహికమైనదికాక వ్యక్తిగతమైనదై ఉన్నది. అస్పృశ్యత పాటింపబడిన రోజులలో కూడా దాని వెనుక ఆఫ్రికాలో నేడు కనబడే జాత్యహంకారము, ద్వేషము ఉండేవికావు. విశ్వజనీనమైన ప్రేమ సర్వదా విలసిల్లి ఉండేది. కనుకనే ఎన్నియో ప్రలోభాలు చూపబడినప్పటికి నేటికిని హిందువులలో అత్యధిక సంఖ్యాకులు తమ ధర్మాన్ని వదలుకొనడానకి సిద్ధపడుటలేదు. అందుచే మనము అలసత్వాన్ని త్యజించి ఈ ప్రేమపూరిత వాతావరణ ప్రభావాన్ని ప్రజలందరు పొందునట్లు చూడవలసి ఉన్నది.

6-10)

మనము మన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తొలగించుకొని కర్మానుష్ఠానము, భక్తి మూర్తీభవించిన మహాపురుషులను సృష్టించుట ద్వారా ఇది సాధ్యం అవుతుంది.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page