Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ఆరాధ్యదైవం
(ఎన్‌. రామేశన్‌ ఎం. ఏ. ఐ. ఎ. ఎస్‌.)

ఒక్కమారు కామకోటి స్వాములవారిని చూచినవారికి ఈశ్వరాస్తిత్వంలో ఏమాత్రం సందేహమూ ఉండదు. ప్రాచ్యేతరవిద్యల నభ్యసించినా, పారమార్థికజిజ్ఞాన కలిగిన మాదృశులకు శ్రీవారుమార్గోపదేష్టలేకాక, మానసికంగానూ, తత్త్వచింతనలోనూ జీవిత విధానంలోనూ అద్భుతపరిణామాన్ని సాధించిన గురువులు శ్రీవారు, 'తమేవభాంతమను భాతి సర్వం, తస్యభాసా సర్వమిదం విభాతి' అను మహావాక్యానికి మూర్తిత్వమే శ్రీవారు. జగద్గురువులచేత అనుగ్రహింపబడినవారు, విగతద్వేషులు. అట్టివారినే గీత 'అద్వేష్టాసర్వభూతానాం' అంటున్నది.

నిరాశ్రయుటైన వితంతువులు, పెళ్ళికాని పిల్లల భారంతో క్రుంగిన తల్లిదండ్రులు, భర్తలచే విడువబడిన భార్యలు, ఉద్యోగంలేని యువకులు, పాండిత్యానికి తగిన ప్రశస్తిలేని పండితులు, ఒక రేమి అందరూ, శ్రీవారికృపకోసం ఆయనచుట్టూ మూగుతారు. వీరి అందరిలోనూ శ్రీవారు చూచేది పరమేశ్వరుని విభూతియే. రామపద స్పర్శకోసం శిలాంతరాళంలో వేచియున్న అహల్యవలె ఒక్కొక్కరూ శ్రీవారి జ్ఞాననేత్రాలకు గోచరిస్తారు. వచ్చినవారికి వేలకొలది సమస్యలు. ఐతే స్వామిని దర్శించగానే వారి సమస్యలన్నీ పరిష్కారమవుతున్నవా అంటే చెప్పలేము కానీ దర్శంచిన వారందరూ ఏదో తెలియని తృప్తితో, ఆనందంతో శాంతంతో వెళ్ళటం మాత్రం చూస్తున్నాం. వారి అనుభవం 'యస్మిన్‌స్థితితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే' అన్న గీతా శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది. ఒక విశిష్టమైన పరిణామం అందరిలోనూ కనబడుతుంది.

ఈ పరిణామానికి హేతువు వారికి అంతుబట్టదు. శ్రీవారి విశిష్టత వారి మేధాసంపదలో లేదు. వారి అపారజ్ఞాపక శక్తిలో లేదు. అఖండవైదుష్యంలో లేదు. లౌకికజ్ఞానంలో లేదు. కార్యదక్షతలోలేదు. కానీ వీటిఅన్నిటిలోనూ అనల్పమైన దక్షత శ్రీవారిది.

తన్ను చేరవచ్చినవారి చిత్తవృత్తులలో ఆయన హత్తుకొనిపోతారు. ఒక అపూర్వపరిణామం సాధిస్తారు. అది శ్రీవారి ప్రత్యేకత. ఆయన సన్నిధిలో అనుమానానికి సందేహానికీ తావులేదు. అదినిరస్తద్వైతభావసన్నిధి. అక్కడ సంశయగ్రంథులు శాశ్వతంగా విచ్ఛేదమౌతుంది.

శ్రీవారిది సువిశాలమైన ఫాలం. వారి ముఖమండలం శారదపూర్ణిమా సుధాకరబింబమువలె స్పృహణీయం. ఆయన కన్నులు కరుణాప్లావితములైన వెలుగులను జిమ్ముతూ ఉంటుంది. ఆయనను చూచినపుడు మధ్యయుగములోని ఋషి పుంగవులు జ్ఞాపకం వస్తారు. మనతో సరససల్లాపాలు ఆడుతున్నా, ఆపరిచితి, ఆచమత్కృతీ, పరిష్కృత వాగ్వైభవమూ వెనుక- మనకు తెలియని వస్తువు వస్తువు అగ్రాహ్యంగా నిలిచిపోతుంది.

మనకు ఆరాధ్యమైనదంతా శ్రీవారి స్వరూపంగా మన ముందు నిలిచినది. అద్వితీయ బ్రహ్మపదార్థానికి శ్రీవారు సజీవప్రతీకలు. మనలను ఉద్ధరించుటకే ఆయన అవతరించారు. భగవత్పాదులవారు వివేకచూడామణిలో-

శ్లో|| శాంతా మహాంతో నివసంతి సంతో

వసంతవ ల్లోక హితం చరంతః,

తీర్ణా స్స్వయం భీమభవార్ణవం జనా

స హేతునాన్యా నపి తారయంతః.

అని జీవన్ముక్తుని వర్ణన కావించారు. దీనికి నిదర్శనం శ్రీకామకోటి ఆచార్యులే.

చిత్తశుద్ధివుంటే భక్తివిశ్వాసాలు తమంతట వస్తవని శ్రీవారి అనుశాసనం. సాధన కొంత పూర్తి కాగా సంశయాలు అంతరిస్తాయి. తర్వాత సాధన చేయాలన్న కోరిక కూడపోతుంది. అపుడు జీవుడు ప్రపత్తిలోనికి దిగుతాడు. మన అంతఃకరణాన్ని ఆచార్యులవారికి అర్పిస్తే మనం చేయవలసిన సాధన కూడ మనకొరకు శ్రీవారే చేస్తారు. ఇది పరమసత్యం. అనుభవంలోని విషయం శ్రీవారు మనమధ్య వుండి తిరగడం మన అదృష్టం. ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.

నా ప్రస్తుతానికి కారణభూతులైన శ్రీగురుచరణులను ఈ విధంగా ప్రార్థిస్తున్నా.

శ్లో|| ''గణ్యహం దీనదీనః త్వమిహ

శివతనుః గణ్యసే దీనబంధుః

చిచ్ఛక్త్యాః కామకోట్యాః హితమథ

భగవత్పాద సంస్థాపితార్థం,

పీఠం విశ్వప్రశస్తం కలయసి మహసా

సద్గురో జ్ఞానమూర్తే

త్వత్పాదాంభోజ యుగ్మార్పిత

జనిమవ మావిలం పాపపంకైః.''


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page