Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఆరవ అధ్యాయము

మూ || ఋషయచుః -

ద్వైపాయనవినేయత్వం సూతపౌరాణికోత్తమ | దేవీపత్తనపర్యంతం చక్రతీర్థమనుత్తమం || 1 ||

ఇత్యబ్రవీః పూరాస్మాకం అతః పృచ్ఛామకించన | దేవీపురంహితత్కుత్ర యదస్తం చక్రతీర్థకం || 2 ||

దేవీపత్తనమిత్యాఖ్యా కథంత స్యా భవత్తథా | శ్రీరామసేతు మూలేచస్నాతానాం పాపినామపి || 3 ||

కీదృశంవాభ##వేత్పుణ్యం చక్రతీర్థే తథైవచ | ఏతచ్చాన్యాన్విశేషాం శ్చ బ్రూహిపౌరాణికోత్తమ || 4 ||

శ్రీ సూత ఉవాచ -

సర్వమేతత్ప్రవక్ష్యామి శ్రుణుధ్వం మునిపుంగవాః | పఠతాంశ్రుణ్వతాం చైతదాఖ్యానం పాపనాశనం || 5 ||

యత్రపాషాణ నవకం స్థాపయిత్వారఘూద్వహః | బబంధ ప్రధమం సేతుం సముద్రే మైధిలీపతిః || 6 ||

దేవీపురంతు తత్రైవ యదన్తం చక్రతీర్థకం | దేవీ పత్తన మిత్యాఖ్యా యథాతస్యాసమాగతా || 7 ||

తద్బ్రవీమి మునిశ్రేష్ఠాః శ్రుణధ్వం శ్రద్ధయా సహ || 7 1/2 ||

తా || ఋషులిట్లనిరి - పౌరాణిక శ్రేష్ఠ ! ద్వైపాయన శిష్య ! ఓ సూత ! నీవు ఉత్తమమైన చక్రతీర్థము దేవీపత్తన పర్యంతమని (1) ఇంతకు ముందు మాతో అన్నావు అందువల్ల కొంచం అడగాలనుకున్నాము. చక్రతీర్థంచి వరనున్న ఆ దేవీ పురము ఎక్కడుంది. (2) దానికి దేవీపత్తనమనే పేరు ఎట్లా వచ్చింది. శ్రీరామసేతు మూలమందు స్నానం చేసిన పాపులకు గూడా (3) ఎటువంటి పుణ్యం లభిస్తుంది. చక్రతీర్థంలో వచ్చేపుణ్యం కూడా. వీటిని ఇతర విశేషాలను కూడా చెప్పండి ఓ పౌరాణిక శ్రేష్ఠ అని (4) శ్రీ సూతులిట్లనిరి - ఇదంతా చెప్తాను ఓ మునిశ్రేష్ఠులారా ! వినండి చదివే వారికి వినేవారికి కూడా ఈ ఆఖ్యానము పాపనాశకము (5) శ్రీరాముడు తొమ్మిది రాళ్ళను స్థాపించి సముద్రమందు మొదట సేతువును బంధించాడు (6) అక్కడే దేవీపురం ఉంది. దాని చివరే చక్రతీర్థము. దానికి దేవీ పత్తనం అనే పేరు ఎట్లా వచ్చిందో (7) దాన్ని చెప్తాను. మునులార ! శ్రద్ధగా వినండి (7 1/2).

మూ || పురాదేవాసురే యుద్ధేదేవైః నాశిత పుత్రిణీ || 8 ||

దితిః ప్రోవాచ తనయామాత్మనః శోకమోహితా

దితిరువాచ -

యాహిపుత్రిత పంకర్తుం తపోవన మనుత్తమం || 9 ||

పుత్రార్థంత వ సుశ్రోణి నియతా నియతేంద్రియా | ఇంద్రాదయోన శిష్యేరన్‌ యేన పుత్రేణవైసురాః || 10 ||

ఉదితాతనయా చైవం జనన్యాతాం ప్రణమ్య సా | స్వీకృత్యమాహిషం రూపం వనం పంచాగ్ని మధ్యగా || 11 ||

తపో7త ప్యతసా ఘోరం తేనలోకాశ్చకంపిరే | తస్యాంతపః ప్రకుర్వంత్యాం త్రిలోక్యాసీద్భయాతురా || 12 ||

ఇంద్రాదయః సురగణాః మోహమాపుర్ద్విజోత్తమాః | సుపార్శ్వస్త పసాతస్యామునిః క్షుబ్ధో7వదత్తుమాం || 13 ||

సుపార్శ్వ ఉవాచ -

పరితుష్టోస్మిసుశ్రోణి పుత్రస్తవ భవిష్యతి | ముఖేన మహిషాకారోవ పుషానరరూపవాన్‌ || 14 ||

మహిషోనామపుత్రస్తే భవిష్యత్యతి వీర్యవాన్‌ | పీడమిష్యతి యః స్వర్గం దేవేంద్రంచ ససైనికం || 15 ||

సుపార్శ్వ స్త్యేవ ముక్త్వాతాం వినివార్యతపస్తథా | ఆగచ్ఛదాత్మనోలోకం అనునీయ తపస్వినీం || 16 ||

అథజజ్ఞే సమహిషోయథోక్తం బ్రహ్మణాపురా | వ్యవర్థత మహావీర్యః పర్వణీవ మహోదధిః || 17 ||

తతః పుత్రో విప్రచిత్తేః విద్యున్మాల్యసురాగ్రణీః | అన్యేzప్యసురవర్యాస్తే సంతియే భూతలే ద్విజాః || 18 ||

తే సర్వే మహిష స్యాస్య శ్రుత్వాదత్తం వరం ముదా | సమాగమ్య మునిశ్రేష్ఠాః ప్రావదన్మహిషా సురం || 19 ||

తా || పూర్వము దేవా సురల యుద్ధంలో దేవతలతో సంతానం పోగొట్టుకున్న దితి (8) శోకమోహితురాలై తన పుత్రికతో ఇట్లా అంది. దితి మాటలు - ఉత్తమమైన తపోవనమునక తపస్సు చేయుటకు ఓ బిడ్డ పొమ్ము (9) తప్పకుండా ఇంద్రియముల నిరోధించి పుత్రునికొరకు తపించు. ఆ పుత్రునితో దేవతలు ఇంద్రాదులు కూడా మిగులరు (10) ఇట్లా తల్లితో చెప్పబడ్డ బిడ్డ తల్లికి నమస్కరించి, మహిషరూపం ధరించి, అడవికి వెళ్ళి, పంచాగ్నుల మధ్యనిలిచి, (11) ఆమె ఘోరమైన తపమాచరించింది దానితో లోకములు కంపించాయి. ఆమె తపస్సు చేస్తుండగా ముల్లోకములు భయకంపితమైనాయి (12) ఇంద్రాది దేవతలు ద్విజశ్రేష్ఠులు మోహాన్ని పొందారు. ఆమె తపస్సుతో బాధపడిన సుపార్శ్వడనే ముని ఆమెతో ఇట్లాఅన్నాడు (13) సుపార్‌శ్వుని వాక్కు - ఓ సుశ్రోణి! నేను సంతోషించాను. నీకు కుమారుడు జన్మిస్తాడు. ముఖము మహిష రూపము శరీరము నరరూపము (14) మిక్కిలి పరాక్రమవంతుడై నీకు మహిషుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆతడు స్వర్గాన్ని సైన్యంతో కూడిన ఇంద్రుణ్ణి కూడా పీడిస్తాడు. (15) సుపార్‌శ్వుడు ఆమెతో ఇట్లా చెప్పి తపస్సునుండి ఆమెను విరమింపచేసి, ఆ తపస్వినిని ఓదార్చి తనలోకానికి తిరిగి వచ్చాడు (16) బ్రహ్మ ఇదివరలో చెప్పినట్లు మహిషుడు జన్మించాడు. పూర్ణిమనాడు సముద్రంలా ఆ పరాక్రమవంతుడు పెరిగాడు (17) విప్రచిత్తి కుమారుడు విద్యున్మాలి అనే రాక్షస శ్రేష్ఠుడు, ఓ ద్విజులారా! ఇతర రాక్షసులు ఈ భూమియందున్న వారు (18) వారంతా మహిషునికి ఇవ్వబడ్డ వరాల గూర్చివిని ఆనందించి, (మునిశ్రేష్ఠులారా) వచ్చి మహిషాసురునితో ఇట్లా అన్నారు (19).

మూ || స్వర్గాధిపత్యమస్మాకం పూర్వమాసీన్మహామతే |దేవైః విష్ణుం సమాశ్రిత్య రాజ్యంనోహృతమోజసా || 20 ||

తద్రాజ్యమాన యబలాత్‌ అస్మాకం మహిషాసుర | వీర్యం -ప్రకటయస్వాద్య ప్రభావమపిచాత్మనః || 21 ||

అత్యుల్యబలవీర్యస్త్వం బ్రహ్మదత్తవరోద్ధతః | పులోమజాపతిం యుద్ధేజహి దేవగణౖః సహ || 22 ||

దనుజైరేవముక్తో7సౌ యోద్ధుకామోzమరైః సహ | మహావీర్యో7థమహిషః ప్రయయా వమరావతీం || 23 ||

దేవనామసురాణాంచ సంవత్సరశతంరణం | పురాబభూవవిప్రేంద్రాః తుములంరోమహర్షణం || 24 ||

దేవవృందం తతో భీత్యాపురస్కత్యపురందరం | కాంది శీకమభూద్విప్రాబ్రహ్మాణం చయ¸°తదా || 25 ||

బ్రహ్మాతానమరాన్‌ సర్వాన్‌ సమాదాయయ¸°పునః | నారాయణ శివౌయత్ర వర్తేతే విశ్వపాలకౌ || 26 ||

తత్రగత్వాన మస్కృత్యస్తు త్వాస్తోత్రైః అనేకశః | బ్రహ్మానివేదయా మానమహిషా సురచేష్టితం || 27 ||

సురాణామసురైః పీడాం దేవయోః శంభుకృష్ణయోః | ఇంద్రాగ్ని యమసూర్యేందు కుబేర వరుణాదికాన్‌ || 28 ||

నిరాకృత్యాధికారేషు తేషాంతిష్ఠత్యయం స్వయం | అన్యేషాం దేవవృందానాం అధికారే పితిష్ఠతి || 29 ||

నిరస్తం దేవవృందంతత్‌ స్వర్లోకా దవనీ తలే | మనుష్యవ ద్విచరతే మహిషాసుర బాధితం || 30 ||

ఏతత్‌ జ్ఞా పయితుందేవౌ యువయోరహమాగతః | సార్థం దేవగణౖరత్ర రక్షతం తాన్‌ సమాగతాన్‌ || 31 ||

తా || ఓ మహామతి ! మనకు స్వర్గాధిపత్యము ఇది వరలో ఉండేది. దేవతలు విష్ణువు నాశ్రయించి తమ పరాక్రమంతో మనరాజ్యాన్ని తీసుకున్నారు (20) కనుక ఓ మహిషాసుర, నీ బలంతో మన ఆ రాజ్యాన్ని తీసుకురా నీ ప్రభావాన్ని నీ పరాక్రమాన్ని ప్రకటించు ఇప్పడు (21) బ్రహ్మచే ఇవ్వబడ్డ వరములచే ఉద్ధతుడవు సాటిలేని పరాక్రమములు కలవాడవు. దేవగణములతో కూడా ఇంద్రుడిని యుద్ధంలో జయించు (22) రాక్షసులతో ఈ విధముగా కోరబడిన ఈతడు దేవతలతో సహా యుద్ధంచేయదలచి, మహాపరాక్రమవంతుడైన ఈతడు అమరావతి మీదకు బయలుదేరాడు (23) దేవతలకు రాక్షసులకు నూరు సంవత్సరాలు యుద్ధం జరిగింది. అది ఘోరమైనట్టిది, రోమహర్షకము కూడా (24) దేవతల సమూహం భయంతో ఇంద్రుడు మొదలుకొని అంతా పారిపోయారు. బ్రహ్మను చేరారు (25) బ్రహ్మ ఆ దేవతలనందరిని తీసుకొని విశ్వపాలకులైన శివనారాయణులున్న చోటికి వెళ్ళాడు (26) అక్కడికిచేరి నమస్కరించి అనేక విధముల స్తోత్రములతో స్తుతించి మహిషాసురుని చేష్టలను బ్రహ్మవారికి నివేదించాడు. (27) శంభుకృష్ణులకు, రాక్షసులవల్ల దేవతలకు కల్గిన పీడను నివేదించాడు. ఇంద్ర అగ్నియమ సూర్య, చంద్ర కుబేరవరుణాది దేవతలను (28) అధికారముల నుండి తొలగించి అందులో వీడే ఉన్నాడు. ఇతర దేవతల అధికారమందును వీడే ఉన్నాడు (29) దేవతలు స్వర్లోకము నుండి భూమికి తొలగించబడ్డారు. మహిషాసురునితో బాధింపబడి దేవతా సమూహము మనుష్యులలాగా సంచరిస్తోంది (30) ఇది మీ ఇద్దరికి చెప్పటానికి నేను వచ్చాను. దేవగణములతో సహ వచ్చిన వారిని మీరిద్దరు రక్షించండి. (31)

మూ|| బ్రహ్మణోవచనం శ్రుత్వారమేశ్వర మహేశ్వరౌ | కోపాత్కరాల వదనౌ దుష్‌ప్రేక్ష్యౌతౌబభూవతుః || 32 ||

అత్యంత కోపజ్వలితాన్ముఖాత్‌ విష్ణో రథద్విజాః | నిశ్చక్రామ మహత్తేజః శంశోః స్రష్టుః తథైవచ || 33 ||

అపరేషాం సురాణాంచ దేహాదింద్ర శరీరతః | తేజః సముద భూత్‌ క్రూరం తదేకం సమజాయత || 24 ||

తేషాంతు తేజ సాంరాశిః జ్వలత్పర్వత సన్నిభః | దదృశే దేవవృందైసై#్తః జ్వాలా వ్యాప్త దిగంతరః || 35 ||

తేజసాంసముదాయోzసౌనా రీకా చిదభూత్తదా | శివతే జోముఖమభూత్‌ విష్ణుతేజో భుజౌ ద్విజాః || 36 ||

బ్రహ్మతేజస్తు చరణౌ మధ్య మైంద్రేణ తేజసా | యమస్య తేజసాకేశాః కుచౌ చంద్రస్యతేజసా || 37 ||

జంఘోరూ కల్పితౌ విప్రా వరుణస్యతు తేజసా | నితంబః పృథివీ తేజః పాదాం గుల్యోzర్క తేజసా || 38 ||

కరాం గుల్యో వసూనాంచ తేజసా కల్పితాస్త థా | కుబేరతేజసా విప్రానాసికా పరికల్పితా || 39 ||

నవప్రజాపతీ నాంచ తేజసా దంతపంక్తయః | చక్షుర్ద్వయం సమజని హవ్యవాహన తేజసా || 40 ||

ఉభేసంధ్యే భృవౌజాతే శ్రవణ వాయుతేజసా | ఇతరేషాంచ దేవానాం తేజోభిరతిదారుణౖః || 41 ||

కృతాన్యావయవానారీ దుర్గా పరమ భాస్వరా | బభూవ దుర్ధర్షతరా సర్వైరపి సురాసురైః || 42 ||

సర్వ వృందారకానీక తేజః సంఘసముద్భవా | తాందృష్ట్వా ప్రీతిమా పుస్తే దేవా మహిష బాధితాః || 43 ||

తా || బ్రహ్మ మాటలను విన్న రామ, మహేశ్వరులు కోపంతో భయంకరమైన ముఖాలు కలవారై చూడశక్యము కానివారైనారు (32) మిక్కిలి కోపంతో వెలిగిపోతున్న విష్ణువు ముఖంనుండి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చింది. శంభువు, బ్రహ్మల ముఖములనుండి అట్లాగే వచ్చింది (33) ఇతరదేవతల శరీరాల నుండి, ఇంద్రుని శరీరం నుండి, ఒక క్రూరమైన తేజస్సు వెలువడింది. అదంతా ఏకమైంది (34) వారందరి తేజస్సులరాశి మండుతున్న పర్వతంలా ఉంది. జ్వాలలతో దిగంతములకు వ్యాపించిన దానిని దేవతలంతా చూశారు (35) ఈ తేజస్సమూహము ఒక స్త్రీ రూపంగా మారింది. శివుని తేజస్సు ముఖముగా విష్ణువు తేజస్సు భుజములుగా (36)బ్రహ్మతేజస్సు పాదములుగా ఇంద్ర తేజస్సు మధ్యభాగముగా, యమ తేజస్సు కేశములుగా, చంద్రతేజస్సుకుచములుగా (37) వరుణ తేజస్సు జంఘ ఊరు భాగములుగా, పృధివీ తేజస్సు పిరుదు భాగములుగా సూర్య తేజస్సు పాదాంగుళులుగా (38) వసువుల తేజస్సుక రాంగుళులుగా, కుబేరతేజస్సు నాసికగా (39) తొమ్మిది మంది ప్రజాపతుల తేజస్సు పలువరుసగా, అగ్ని తేజస్సు రెండుకళ్ళుగా (40) రెండు సంధ్యలు కనుబొమలుగా, వాయుతేజస్సు చెవులుగా, ఇతర దేవతల మిక్కిలి భయంకరమైన తేజస్సులు (41) ఇతర అవయవములుగా కల్పిపంబడి మిక్కిలి తేజస్సు గల దుర్గ అను పేరుగల నారి, దేవ దానవులందరితో కూడా ఎదిరింపశక్యము కానిది ఏర్పడింది (42) సర్వదేవతల సమూహములచే తేజః సమూహము నుండి పుట్టిన ఆమెను చూచి మహిషబాధితులైన ఆ దేవతలు ఆనందం పోందారు (43).

మూ || తతో రుద్రాదయోదేవా వినిష్కృష్యాయుధాన్నిజాత్‌ | ఆయుధాని దదుస్తసై#్య శూలాదీనిద్విజోత్తమాః || 44 ||

భూషణాని దదుస్తసై#్య వస్త్రమాల్యాని చందనం | సాపిదేవీతదావసై#్త్ర భూషణౖశ్చందనాదిభిః || 45 ||

కుసుమైరాయుధైర్‌హారైః భూషితాపరిచారకైః | సాట్టహాసంప్రముంచంతీ భైరవీ భైరవ స్వనా || 46 ||

ననాదకంపయం తీవరోదసీ దేవ సేవితా | దేవ్యాభైరవనాదేన చచాల సకలంజగత్‌ || 47 ||

సింహవాహనమారూఢాందేవీంతా మమరాస్తదా | మున యస్సిద్ధ గంధర్వాస్తుష్టువుః జయశబ్దతః || 48 ||

అతి భీషణ నాదేన దేవ్యాఃక్షు బ్ధంజగత్త్రయం | దృష్ట్వా దేవారయోదైత్యాః సముత్త స్థురుదాయుధాః || 49 ||

మహిషో7పిమహాక్రోధాత్‌ సముద్యత మహాయుధః | తంశబ్ద మపలక్ష్యాథ యయావసుర సంవృతః || 50 ||

వ్యలోకయత్తతో దేవీం తేజో వ్యాప్త జగత్త్రయీం | సాయుధానంత బాహ్వాఢ్యాం నాదకంపిత భూతలాం || 51 ||

క్షోభితా శేషశేషాది మహానాగ పరంపరాం | విలోక్య దేవీ మసురాః సమనహ్యన్ను దాయుధాః || 52 ||

తా || ఆ పిదప రుద్రాది దేవతలు తమ నుండి ఆయుధములను తీసి, శూలము మొదలగు ఆయుధములను ఆమెకిచ్చారు (44) వస్త్రమాల్యచందనములు భూషణములు ఆమెకిచ్చారు. ఆమె కూడా వస్త్రభూషణ చందనాదులతో (45) పూలు ఆయుధములు హారములతో, పరిచారకులతో అలంకరింపబడి, భయంకరమైన స్వరముగలదై అట్ట హాసముచేస్తూ ఆ భైరవి (46) రోదసి భాగమును కంపింపచేస్తూన్నట్లు దేవతలతో సేవించబడుతూ నాదం చేసింది. ఆమె, భయంకర నాదముతో సమస్త జగత్తు కదిలిపోయింది (47) సింహవాహనారూఢయైన ఆదేవిని అమరులు మునులు సిద్ధగంధర్వులు జయ శబ్దంతో పొగిడారు. (48) ఆమె భీషణనాదముతో ముల్లోకములు క్షోభించాయి. దేవతల శత్రువులైన దైత్యులు ఇదిచూచి ఆయుధములు ధరించి సిద్ధమైనారు (49) మహిషుడు కూడా కోపంతో ఆయుధము ధరించి సిద్ధమైనాడు. రాక్షసులతో చుట్టబడి ఆ శబ్దాన్ని గురిగా చేసుకొని బయలుదేరాడు (50) తన తేజస్సుతో ముల్లోకములలో వ్యాపించిన ఆ దేవిని చూచాడు. ఆయుధములుగల అనంత బాహువులతో కూడిన దానిని తన ధ్వనితో భూమినంతా వణికింపచేస్తున్నదానిని (51) క్షోభించిన సమస్తములైన శేషాదినాగ పరంపరగల దానిని ఆ దేవిని రాక్షసులు చూచి ఆయుధములనెత్తి సమీపించారు (52).

మూ || తతో దేవ్యాతయాసార్ధం అసురాణామభూద్రణః | అసై#్త్రఃశ##సై#్రః శ##రైశ్చక్రైః గదాభిర్ముసలైరపి || 53 ||

గజాశ్వరథ పాదాతైః అసంఖ్యేయైః మహాబలః | మహిషో యుయుధే తత్రదేవ్యాసాకమరిందమః || 54 ||

లక్షకోటి సహస్రాణి ప్రధానాసురయూథపాః | ఏకైకస్యతుసేనాయాః తేషాం సంఖ్యాన విద్యతే || 55 ||

తేసర్వేయుగపద్దేవీం శ##సై#్త్రరావవ్రు రోజసా | సాపి దేవీతతో భీమా దైత్యమూక్తాస్త్ర సంచయం || 58 ||

బి భేదలీల యా బాణౖః స్వకార్ముకవినిః సృతైః | ససర్జదైత్యకాయేషుబాణపూగాన్యనేకశః || 57 ||

దేవ్యాశ్రయబలాద్దేవా నిర్భయాదైత్యయూథపైః | యుయుధుః సంయుగేశ##సై#్త్రః అసై#్త్రరప్యాయుధాంతరైః || 58 ||

తతో దేవాబలోత్పిక్తా దేవీశక్త్యువ బృంహితాః | నిఃశేషమసురాన్సర్వానా యుధైర్నిరమూలయన్‌ || 59 ||

స్వసైన్యేతుక్షయంయాతేసంక్షుబ్ధో మహిషాసురః | చాపమాదాయవేగేన వికృష్యచమహాస్వనం || 60 ||

సంధాయమము చేబాణాన్‌ దేవసైన్యేషుభూసురాః | ఇంద్రేతుదశసాహస్త్రం యమేపం చ సహస్రకం || 61 ||

వరుణ చాష్ట సాహస్త్రం కుబేరేషట్‌ సహస్రకం | సూర్వేచంద్రేచవహ్నౌచ వా¸°వనుషుచాశ్వినోః || 62 ||

అన్యేష్వపిచదేవేషు మహిషోదానవేశ్వరః | ప్రత్యేకమయుతం బాణాన్‌ మముచే బలినాంవరః || 63 ||

పలాయంతే తతోదేవా మహిషాసురమర్దితాః | దేవీం శరణమాజగ్ముః త్రాహిత్రాహీతివాదినః || 64 ||

తతోదేవీగణాన్‌ స్వస్యభూతవేతాలకాదికాన్‌ | యూయం నాశయతక్షిప్రం ఆసురం బలమిత్యశాత్‌ || 65 ||

అహంతుమహిషం యుద్ధేయోధయామిబలోద్ధతం | తతోదేవ్యాగణౖః సర్వమాసురం క్షతమాశువై || 66 ||

తతఃసైన్యేక్షయం నీతేగణౖః దేవీప్రచోదితైః | యోద్ధుకామః సమహిషోగణౖః సాకం వ్యతిష్ఠత || 67 ||

అత్రాంతరే మహానాదః సుచక్షుశ్చమహాహనుః |మహాచండోమహాభక్షోమహోదరముహోత్కటౌ||68||

పంచస్యః పాదచూడశ్చబహునేత్రః ప్రభాహుకః|ఏకాక్షస్త్వేక పాదశ్చబహుపాదోzప్య పాదకః || 69 ||

ఏతేచాన్యేచ బహవో మహిషాసుర మంత్రిణః | యోద్ధుకామారణ దేవ్యాః పురతస్త్వవతస్థిరే || 70 ||

తా || ఆదేవితో అసురులకు అస్త్రములతో శస్త్రములతో బాణములతో చక్రములు గదలతో ముసలములతో యుద్ధం జరిగింది. (53) గజఅశ్వరథ పదాతులు అసంఖ్యేయములైన వానితో కూడిన మహాబలవంతుడైన మహిషుడు శత్రునాశకుడైనవాడు దేవితో యుద్ధం చేశాడు (54) ప్రధాన రాక్షసనాయకులు లక్షకోటి సహస్రములు. ఒక్కొక్క సేన యొక్క సంఖ్య తెలియదు (లెక్కింపరాదు) (55) వాళ్ళందరూ ఒకేసారి శక్తి కలిగి శస్త్రములతో దేవిని ఆవరించారు. ఆదేవి కూడా అంతకన్నా భయంకరమైనదై రాక్షసులు వదలిన బాణములను (56) తన ధనస్సు నుండి వెలువడిన బాణములతో అవలీలగా భేదించింది. రాక్షసుల శరీరములందు అనేకములైన బాణసమూహములను సృష్టించింది (57) దేవి యొక్క ఆశ్రయబలంవల్ల దేవతలు రాక్షసుల సమూహం నుండి నిర్భయులైనారు. యుద్ధమందు శస్త్ర అస్త్రములతో ఇతర ఆయుధములతో యుద్ధం చేశారు. (58) ఆ పిదప దేవతలు బలవంతులై దేవీ శక్తితో కూడినవారై రాక్షసులందరిని ఆయుధములతో నిర్మూలించారు. (59) తన సైన్యం నశించగా క్షోభించిన మహిషాసురుడు వేగంగా ధనస్సును తీసుకొని, గొప్పనాదం చేస్తూ (60) బాణముల సంధించి దేవతల సైన్యంపై వదిలాడు. ఇంద్రునిపై పదివేల బాణాలు, యమునిపై ఐదువేల బాణాలు (61) వరుణునిపై ఎనిమిది వేల బాణాలు, కుబేరునిపై ఆరువేల బాణాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వసువులు, అశ్వినులు (62) ఇతర దేవతలు వీరందరిపై దానవరాజైన మహిషుడు, బలవంతులలో శ్రేష్ఠుడు ఒక్కొక్కరిపై పదివేల బాణములను వదిలాడు (63) మహిషాసురునితో మర్దింపబడి దేవతలు పరుగెత్తారు. రక్షించు, రక్షించుఅని అరుస్తూ దేవిని శరణువేడారు (64) అప్పుడే దేవి భూతవేతాళాది తన గణములను, మీరు తొందరగా రాక్షస బలాన్ని నాశనం చేయండి అని ఆదేశించింది. (65) నేను బలోద్ధతుడైన మహిషునితో యుద్ధం చేస్తాను అని అంది. అప్పుడు దేవి యొక్క గణములతో రాక్షసులందరు తొందరగా హతమైనారు. (66)సైన్యం అంతా నాశనమయ్యాక, దేవి పంపిన గణములతో యుద్ధం చేయదలచిన ఆ మహషుడు తన గణములతో నిల్చున్నాడు(67) ఇంతలో మహానాదుడు, సుచక్షుడు, మహాహనుడు, మహాచండుడు, మహాభక్షుడు, మహోదర, మహోత్కటలు (68) పంచాన్యుడు, పాదచూడుడు, బహునేత్రుడు, ప్రబాహుకుడు, ఏకాక్షుడు, ఏకపాదుడు, బహుపాదుడు, అపాదకుడు (69) వీరు ఇతరులు అనేకులు మహిషాసురుని మంత్రులు యుద్ధం చేయదలచి యుద్ధమందు దేవి ఎదుట నిల బడ్డారు. (70).

మూ || సింహం వాహన మారుహ్యతతో దేవీమనోజవం | ప్రలయాంబుదనిర్ఘోషం చాపమాదాయ భైరవం || 71 ||

విస్ఫోట్యముముచే బాణాన్‌ వజ్రవేగ సమాన్యుధి|దశలక్షగజైశ్చాపి శతలక్షైశ్చవాజిభిః || 72 ||

శతలక్షైః రథైశ్చాపి లక్షాయుద పదాతిభిః | యుక్తో మహాహనుర్దైత్యో దేవ్యాయుధిని పాతితః || 73 ||

సైన్యేచతస్యనిహతా దేవ్యాః బాణౖః ద్విజోత్తమాః | లక్షకోటి సహస్రాణి ప్రధానాసురనాయకాః || 74 ||

మహిషస్యహి విద్యంతే మహాబల పరాక్రమాః | ఏకైకస్య ప్రధానస్య చతురంగబలం తథా || 75 ||

మహాహనోర్యథావిప్రాః తథైవాస్తి మహద్బలం | తత్సర్వం నిహతం దేవ్యాశ##రైః కాంచన పుంఖితైః || 76 ||

యమామాత్రేణ విప్రేంద్రాః తదద్భుత మివాభవత్‌ || 76 1/2 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే చక్రతీర్థ ప్రశంసాయాం దేవీ వురాభిధానకథనే దేవ మహిషాసుర యుద్ధ వర్ణనం నామషష్ఠోzధ్యాయః || 6 ||

తా || మనోవేగంగల సింహవాహనాన్నధిరోహించి దేవి, ప్రళయ కాలమందలి మేఘధ్వనివంటి ధ్వనిగల భయంకరమైన ధనస్సు తీసుకొని (71) వజ్రవేగముగల బాణములను యుద్ధంలో విడిచింది. దశలక్ష గజములు శత లక్ష గుఱ్ఱములు (72) శత లక్షరథములు, పది లక్షల పదాతులు వీటన్నిటితో కూడిన మహాహనుడను రాక్షసుడు యుద్ధంలో దేవిచే చంపబడ్డాడు. (73) దేవిబాణములతో ఆతని సైన్యములు చంపబడ్డాయి. లక్షకోటి సహస్రముల ప్రధాన అసురనాయకులు (74) మహిషునకు గూడా మహా బలపరాక్రమవంతులు ఉన్నారు. ఒక్కొక్క ప్రధానునకు చతురంగబలంకూడా. (75) మహాహనువునకు ఎంత బలంఉందో అంతబలం సైన్యం ఉంది. బంగారు పొదగబడిన చివరలుగల బాణములతో ఆ సైన్యం అంతా చంపబడింది. (76) జాము మాత్రంలో ఇదంతా ఒక అద్భుతంలాగా జరిగింది. ఓ బ్రాహ్మణులారా! (76 1/2) (77) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్కవేల సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు చక్రతీర్థ ప్రశంస యందు దేవీపురమనే పేరును గూర్చిన కథయందు దేవీ మహిషాసుర యుద్ధవర్ణనమనునది ఆరవ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters