Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది తొమ్మిదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సంప్రవక్ష్యామి రామనాథ న్యశూలినః | స్తోత్రాధ్యాయం మహాపుణ్యం శృణుతశ్రద్ధయాద్విజాః || 1 ||

రామః ప్రతిష్ఠితే లింగే తుష్టావపరమేశ్వరం | లక్ష్మణోజానకీ సీతాసుగ్రీవాద్యాః కపీశ్వరాః || 2 ||

బ్రహ్మప్రభృతయో దేవాః కుంభజాద్యామహర్షయః | అస్తువన్భక్తి సంయుక్తాః ప్రత్యేకం రాఘవేశ్వరం || 3 ||

తద్వక్ష్యామ్యానుపూర్వ్యేణ శృణుతాదర పూర్వకం | ఏతచ్ఛ్రవణ మాత్రేణ ముక్తః స్యాన్మాన వోద్విజాః || 4 ||

శ్రీరామ ఉవాచ -

నమో మహాత్మనే తుభ్యం మహామాయాయ శూలినే | స్వపదాంబుజ భక్తార్తిహారిణ సర్పహారిణ || 5 ||

నమో దేవాధి దేవాయ రామనాథాయ సాక్షిణ | నమోవేదాంతవేద్యాయ యోగినాంతత్వదాయినే || 6 ||

సర్వదానందపూర్ణాయ విశ్వనాథాయ శంభ##వే | నమోభక్తభయచ్ఛేద హేతుపాదాబ్జరేణవే || 7 ||

నమస్తేఖిల నాథాయ నమః సాక్షాత్పరాత్మనే | నమస్తేద్భుత వీర్యాయ మహాపాతకనాశినే || 8 ||

కాలకాలాయ కాలాయకాలాతీతాయతేనమః | నమోవిద్యానిహంత్రేతేనమః పాపహరాయచ || 9 ||

నమః సంసారతప్తానాంతాపనాశైకహేతవే | నమోమద్ర్బహ్మహత్యావినాశినేచ విషాశినే|| 10 ||

నమస్తే పార్వతీనాథ కైలాస నిలయావ్యయ | గంగాధర విరూపాక్ష మాం రక్షసకలాపదః|| 11 ||

తుభ్యం పినాకహస్తాయ నమోమదన హారిణ | భూయోభూయో నమస్తుభ్‌యం సర్వావస్థాను సర్వాదా || 12 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఇక ఇప్పుడు శూలియైన రామనాథుని స్తోత్రాధ్యాయమును చెబుతాను. ఇది పుణ్యప్రదమైనది. ఓ ద్విజులార ! శ్రద్ధగా వినండి (1) రాముడు లింగమును ప్రతిష్ఠించి పరమేశ్వరుని స్తుతించాడు. లక్ష్మణుడు, జానకి సీత, సుగ్రీవాదికపీశ్వరులు (2) బ్రహ్మ ప్రభృతి దేవతలు, అగస్త్యుడు మొదలగు మహర్షులు ప్రత్యేకముగా భక్తితో కూడి రాఘవేశ్వరుని స్తుతించారు (3) దానిని వరుసగా చెప్తాను. ఆదరంగా వినండి. ఓ ద్విజులార! దీనిని విన్నంత మాత్రమున మానవులు ముక్తులౌతారు (4) శ్రీరాములిట్లా అన్నారు - మహాత్ముడవైన నీకు నమస్కారము. మహామాయ స్వరూపుడవైన, శూలివైన నీకు నమస్సులు నీపదాంబుజము లందుండే భక్తుల ఆర్తి హరించువాడ, సర్పములను హారముగా గలవాడ (5) దేవాధి దేవ, రామనాథ, సాక్షి నీకు నమస్కారము. వేదాంతవేద్య యోగులకు తత్వమిచ్చువాడ నీకు నమస్కారము (6) ఎల్లప్పుడూ ఆనందంతో నిండినవాడ! విశ్వనాథ, శంభు, భక్తుల భయమును ఛేదించుటకు కారణమైన పాదబ్జరేణువులు కలవాడ నమస్కారము (7) అఖలిలనాథ నీకు నమస్కారము. సాక్షాత్పరమాత్మ నీకు నమస్కారము. అద్భుత వీర్యవంతుడ, మహాపాతకనాశక నీకు నమస్కారము. (8) కాలమునకు కాలస్వరూపుడ! కాలుడ! కాలమునకతీతుడ నీకు నమస్కారము అవిద్యానాశక పాపహార నీకు నమస్కారము (9) సంసారతప్తులైన వారి తాపనాశమునకు ఒకే కారణమైన వాడ నీకు నమస్కారము నా బ్రహ్మహత్యను నశింపచేసినవాడ, విషమే ఆహారముగా గలవాడ నీకు నమస్కారము (10) పార్వతీనాథ కైలాసనిలయ, అవ్యయ నీకు నమస్కారము గంగాధర, విరూపాక్ష, అన్ని ఆపదల నుండి నన్ను రక్షించు (11) పినాకహస్త, మదనహారి నీకు నమస్కారము. అన్ని అవస్థలలో, ఎల్లప్పుడూ నీకు మరీ మరీ నమస్కారము (12)

మూ || లక్ష్మణ ఉవాచ -

నమస్తే రామనాథాయ త్రిపురఘ్నాయ శంభ##వే | పార్వతీ జీవితేశాయ గణశ స్కందసూనవే || 13 ||

నమస్తే సూర్యచంద్రాగ్ని లోచనాయ కపర్దినే | నమఃశివాయ సోమాయ మార్కండేయ భయచ్ఛిదే || 14 ||

నమః సర్వప్రపంచస్య సృష్టిస్థిత్యంతహేతవే | నమ ఉగ్రాయ భీమాయ మహాదేవాయ సాక్షిణ || 15 ||

సర్వజ్ఞాయవరేణ్యాయ వరదాయ వరాయతే | శ్రీకంఠాయ నమస్తుభ్యం పంచపాతకభేదినే || 16 ||

నమస్తేస్తు పరానంద సత్యవిజ్ఞాన రూపిణ | నమస్తే భవరోగఘ్నస్నాయూనాం పతయేనమః || 17 ||

పతయేతస్కరాణాంతే వనానాం పతయేనమః | గణానాం పతయే తుభ్యం విశ్వరూపాయ సాక్షిణ || 18 ||

కర్మణాప్రేరితః శంభోజ నిష్యే యత్రయత్రతు | తత్రతత్ర పదద్వంద్వే భవతో భక్తిరస్తుమే || 19 ||

అసన్మార్గేరతిర్మాభూద్భవతః కృపయా మమ | వైదికాచారమార్గేచరతిః స్యాద్భవతేనమః || 20 ||

సీతోవాచ -

పరమకారణ శంకర ధూర్జటే | గిరిసుతాస్తన కుంకుమశోభిత

మమపతౌ పరిదేహి మతింసదా | సవిషమాం పరపూరుషగోచరాం || 21 ||

గంగాధర విరూపాక్ష నీలలోహిత శంకర | రామనాథనమస్తుభ్యం రక్షమాంకరుణాకర || 22 ||

నమస్తేదేవదేవేశనమస్తే కరుణాలయ | నమస్తేభవభీతానాం భవభీతి విమర్దన || 23 ||

నాథత్వ దీయ చరణాంబుజ చింతనేన | నిర్థూయ భాస్కర సుతాద్భయ మాశుశంభో

నిత్యత్వ మాశుగతవాన్సమృకండుపుత్రః | కింవానసిద్ధ్యతి తవాశ్రయణాత్పరేశ || 24 ||

పరేశ పరమానంద శరణాగతపాలక | పాతివ్రత్యం మమసదాదేహితుభ్యంనమోనమః || 25 ||

తా || లక్ష్మణుని వచనము - రామనాథ త్రిపుర సంహార, శంభు నీకు నమస్కారము పార్వతీ జీవితేశ, గణశ స్కందులను పుత్రులుగా గలవాడ (13) కపర్ది సూర్యచంద్ర అగ్నులను నేత్రములుగా గలవాడ నీకు నమస్కారము. శివ, సోమ మార్కండేయుని భయమును ఛేదించినవాడ, నమస్కారము (14) సర్వప్రపంచమునకు సృష్టిస్థితి అంతములకు కారణమైనవాడ నమస్కారము. ఉగ్ర,భీమ, మహాదేవ, సాక్షి నమస్కారము (15) సర్వజ్ఞ, వరేణ్య, వరద, వర, శ్రీకంఠ, పంచపాతకభేది, నీకు నమస్కారము (16) పరమైన ఆనంద సత్య విజ్ఞానముల స్వరూప నీకు నమస్కారము. భవరోగనాశక, నీకు నమస్కారము. స్నాయువులకు (నరము) పతి నీకు నమస్కారము. (17) తస్కరపతి వనములపతి నీకు నమస్కారము. గణములకు పతి, విశ్వరూప, సాక్షి నీకు నమస్కారము. (18) కర్మచే ప్రేరితుడనై జనించిన ప్రతిచోట నీపాద ద్వంద్వ మందు నాకు భక్తి కలుగనీ (19) నీదయ వలన నాకు ఆసన్మార్గమందు ఆసిక్త కలగవద్దు. వైదికా చారమార్గమందు ఆసక్తి కలుగని, నీకు నమస్కారము (20) సీతవచనము - పరమకారణమైన వాడ, శంకర, ధూర్జటి, గిరిసుతస్తన కుంకుమతోశోభించేవాడ, నాకు ఎల్లప్పుడు మతిని నా భర్తయందే కల్గించు, విషమమైన పరపురుషగోచరమతిని కల్గించొద్దు. (21) గంగాధర, విరూపాక్ష, నీలలోహిత, శంకర, రామనాథ నీకు నమస్కారము. ఓ కరుణాకర నన్ను రక్షించు (22)దేవ దేవేశ నీకు నమస్కారము. (23) ఓ నాథ ! నీ చరణాంబుజముల ధ్యానముతో యముని నుండి భయమును త్వరగా పోగొట్టుకుని ఓ శంభు! మార్కండేయుడు నిత్యత్వమును త్వరగా పొందాడు. ఓ పరేశ ! నిన్ను ఆశ్రయించుట వలన ఏమి సిద్ధించదు ! (24) పరేశ ! పరమ ఆనంద శరణాగతుల పాలించేవాడ నాకు ఎల్లప్పుడూ పాతివ్రత్యాన్ని ఇవ్వునీకు నమస్కారము (25)

మూ || హనుమానువాచ -

దేవదేవ జగన్నాథ రామనాథ కృపానిధే | త్వత్పాదాంభోరుహగతానిశ్చలాభక్తిరస్తుమే || 26 ||

యంవినా న జగత్సత్తాతద్భానమపినోభ##వేత్‌ | నమః సద్భానరూపాయ రామనాథాయ శంభ##వే || 27 ||

అంగద ఉవాచ -

యస్యభాసా జగద్భానం యత్ర్పకాశం వినాజగత్‌ | సభాసతే సమస్తసై#్మ రామనాథాయ శంభ##వే || 28 ||

జాంబవానువాచ -

సర్వానందో యదానందో భాసతే పరమార్థతః | నమో రామేశ్వరా యాసై#్మ పరమానందరూపిణ || 29 ||

నీల ఉవాచ -

యద్ధేశకాల దగ్భేదైర భిన్నం సర్వదాద్వయం | తసై#్మరామేశ్వరాయాసై#్మనమోభిన్నస్వరూపిణ || 30 ||

నల ఉవాచ -

బ్రహ్మవిష్ణు మహేశానా యదవిద్యా విజృంభితాః | నమోవిధ్యా విహీనాయ తసై#్మరామేశ్వరాయతే || 31 ||

కుముద ఉవాచ -

యత్‌స్వరూపా పరిజ్ఞానా త్ర్పధానం కారణత్వతః | కల్పితం కారణాయాసై#్మ రామనాధాయ శంభ##వే || 32 ||

పనస ఉవాచ -

జాగ్రత్స్వప్న సుషుప్త్యాది యదవిద్యా విజృంభితం | జాగ్రదాది విహీనాయనమోసై#్మ జ్ఞానరూపిణ || 33 ||

గజ ఉవాచ -

యత్స్వరూపా పరిజ్ఞానా త్కార్యాణాం పరమాణవః | కల్పితాః కారణత్వేన తార్కికాపనదైర్వృథా || 34 ||

తమహం పరమానందం రామనాథం మహేశ్వరం | ఆత్మరూపత యానిత్యము పాసే సర్వసాక్షిణం || 35 ||

గవాక్ష ఉవాచ -

అజ్ఞాన పాశబద్ధానాం పశూనాం పాశమోచకం | రామేశ్వరం శివం శాంతముపైమిశరణం సదా || 36 ||

గవయ ఉవాచ -

సాధ్వస్త జగదాధారం చంద్ర చూడమూమాపతిం | రామనథం శివం వందే సంసారామయభేషజం || 37 ||

శరభ ఉవాచ -

అంతః కరణమాత్మేతి యదజ్ఞానాద్విమోహితైః | భణ్యతే రామనాధం తమాత్మానం ప్రణమామ్యహం || 38 ||

గంధమాదన ఉవాచ -

రామనాథముమానాథం గణానాథంచత్ర్యంబకం | సర్వపాతక శుద్ధ్యర్థము పాసే జగదీశ్వరం || 39 ||

తా || హనుమద్వచనము - దేవదేవ జగన్నాథ, రామనాథ, కృపానిధి, నీపాదాంభోరుహగతమైనాకు భక్తి నిశ్చలంగా ఉండనీ (26) ఎవరు లేకుండా జగత్తునకు సత్త లేదో దాని ప్రకాశము కూడా కలుగదో అట్టిసత్‌ భాసరూపమైన శంభునకు రామనాథునకు నమస్కారము (27) అంగద వచనము - ఎవని కాంతులు జగత్తునకు వెలుగో ఎవని వెలుగులేకుండా జగత్తు ప్రకాశించదో అట్టి శంభువు రామనాథునకు నమస్కారము (28) జాంబవవచనము - ఎవని ఆనందము సర్వుల ఆనందమో పరమార్థంగా ఏది ప్రకాశిస్తున్నదో అట్టి పరమానందరూపియైన ఈ రామేశ్వరునకు నమస్కారము (29) నీలుని వచనము - ఏదిదేశకాల దిక్కుల భేదముతో అభిన్నమైనదో, ఎల్లప్పుడు అద్వయమో, అట్టి అభిన్న స్వరూపుడైన ఈ రామేశ్వరునకు నమస్కారము (30) నల వచనము - బ్రహ్మవిష్ణుమహేశానులు అవిద్యతో విజృంభితులైనారు. అవిద్యా విహీనుడైన ఆ రామేశ్వరుడవైన నీకు నమస్కారము (31) కుముదుని వచనము - దేవి స్వరూప పరిజ్ఞానము లేనందు వలన ప్రధానము కారణముగా కల్పింపబడిందో అట్టి కారణమైన ఈ రామనాథ శంభునకు నమస్కారము (32) పనసుని వచనము - జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యాదులు ఏ అవిద్య విజృంభణ ఫలమో అట్టి జాగ్రదాదులు లేని జ్ఞాన రూపియైన ఈతనికి నమస్కారము (33) గజుని వచనము - దేవి స్వరూప పరిజ్ఞానం లేనందువలన కార్యములకు పరమాణువులు కారణముగా తార్కికులు వృథాగా కల్పించారో (34) అట్టి పరమానంద స్వరూపుడు రామనాథ మహేశ్వరుడు సర్వసాక్షి ఆతనిని ఆత్మరూపముగా నిత్యము ఉపాసిస్తాను (35) గవాక్షుని వచనము - అజ్ఞాన పాశబద్ధులైన పశువుల పాశమును విడిపించేవాడు ఐన రామేశ్వరుని శివుని శాంతుని ఎల్లప్పుడు శరణు పొందుతాను (36) గవయుని వచనము - అధ్వస్త (సాధు+ అస్త) జగత్తునకు ఆధారమైన ఆతని చంద్ర చూడుని ఉమాపతిని, రామనాథుని, శివుని, సంసార రోగమునకు ఔషధమును ఐన వానిని నమస్కరిస్తున్నాను. (37) శంభుని వచనము - అంతః కరణము ఆత్మ అని అజ్ఞానం వల్ల మోహితులైన వారన్నారో అట్టి ఆత్మయైన రామనాథుని నేను నమస్కరిస్తున్నాను (38) గంధమాదనుని వచనము - రామనాథుని ఉమానాథుని గణనాథుని త్ర్యంబకుని జగదీశ్వరుని సర్వపాతకముల శుద్ధికొరకు ఉపాసిస్తాను (39).

మూ|| సుగ్రీవ ఉవాచ -

సంసారాంబోధిమధ్యే మాం జన్మమృత్యుజలే భ##యే | పుత్రదార ధనక్షేత్ర వీచి మాలా సమాకులే || 40 ||

మజ్జద్ర్బహ్మాండ ఖండే చపతితం నాప్త పారకం | క్రోశంత మవశం దీనం విషయ వ్యాలకాతరం || 41 ||

వ్యాధినక్రసముద్విగ్నం తాపత్రయ ఝషార్తిదం | మాం రక్షగిరిజానాథ రామనాథ నమోస్తుతే || 42 ||

విభీషణ ఉవాచ -

సంసార వన మధ్యేమాం వినష్టనిజమార్గకే | వ్యాధిచౌరే క్రోథ సింహజన్మవ్యాఘ్రేలయోరగే || 43 ||

బాల్య¸°వన వార్థక్య మహాభీమాంధకూపకే | క్రోధేర్ష్యాలోభవహ్నౌచ విషయక్రూరపర్వతే || 44 ||

త్రాసభూకంటకాఢ్యేచ సీదంతమధునాంధకం | శోభనాం పదవీం శంభో నయరామేశ్వరాధునా || 45 ||

సర్వేవానరా ఊచుః -

నింద్యా నింద్యేషు సర్వత్ర జనిత్వాయోనిషు ప్రభో | కుంభీపాకాది నరకే పతిత్వాచ పునస్తథా || 46 ||

జనిత్వాచ పునర్యోనౌ కర్మశేషేణ కుత్సితే | సంసారే పతి తానస్మాన్‌ రామనాథ దయానిథే || 47 ||

అనాథా న్వివిశాన్దీనాన్‌ క్రోశతః పాహిశంకర | నమస్తేస్తు దయాసింధోరామనాథమహేశ్వర || 48 ||

బ్రహ్మోవాచ -

నమస్తే లోకనాథాయ రామనాథాయ శంభ##వే | ప్రసీదమమనర్వేశ మదవిద్యాం వినాశయ || 39 ||

ఇంద్ర ఉవాచ -

యస్యశక్తి రుమాదేవీ జగన్మాతాత్రయీమమీ | తమహం శంకరం వందే రామనాథ ముమాపతిం || 50 ||

యమ ఉవాచ -

పుత్రౌగణశ్వర స్కందౌ పృషోయస్యచవాహనం | తంవైరామేశ్వరం సేవే సర్వాజ్ఞాననివృత్తయే || 51 ||

వరుణ ఉవాచ -

యస్యపూజాప్రభావేనజితమృత్యుర్‌మృకండుజః | మృత్యుంజయముపాసేహంరామనాథంహృదాతుతం || 52 ||

కుబేర ఉవాచ-

ఈశ్వరాయలసత్కర్ణకుండ లాభరణాయతే | లాక్షారుణ శరీరాయనమో రామేశ్వరాయవై || 53 ||

ఆదిత్య ఉవాచ -

నమస్తేస్తు మహాదేవ రామనాథ త్రియంబక | దక్షాధ్వర వినాశాయనమస్తే పాహిమాం శివ || 54 ||

సోమ ఉవాచ -

నమస్తే భస్మదిగ్ధాయ శూలినే సర్పమాలినే | రామనాథ దయాంభోధే స్మశాన నిలయాయతే || 55 ||

అగ్నిరువాచ -

ఇంద్రాద్యఖిల దిక్పాల సంసేవిత పదాంబుజ | రామనాథాయ శుద్ధాయ నమో దిగ్వాససే సదా || 56 ||

వాయురువాచ -

హరాయ హరిరూపాయ వ్యాఘ్రచర్మాంబరాయచ | రామనాథనమస్తుభ్యం మమాభాష్టప్రదోభవ || 57 ||

తా || సుగ్రీవుని వచనము - సంసార సముద్రం మధ్యలో జన్మము మృత్యువు అనే భయంకరమైన జలమందు, పుత్రులు భార్య ధనము క్షేత్రము అనే అలల సమూహంతో వ్యాకులమైన (40) నన్ను మునుగుతున్న బ్రహ్మఖండమందు పడిన తీరం పొందని నన్ను, ఆక్రోశిస్తున్న, వశం తప్పిన దీనుడనైన విషయములనే సర్పములతో భయపడుతున్న నన్ను (41) రోగములనే మొసళ్ళతో ఉద్విగ్నుడనైన, తాపత్రయములనే చేపలతో బాధింపబడుతున్న నన్ను గిరిజానాథ రక్షించు. రామనాథ నీకు నమస్కారము (42) విభీషణుని వచనము - సంసారమనే అడవి మధ్యలో తనతోవను మరచిన నన్ను వ్యాధి అనే దొంగలు క్రోధమనే సింహాలు జన్మమనే పులులు, లయమనే పాపములు గల నన్ను (43) బాల్య¸°వన వార్థక్యములనే మహాభయంకరమైన చీకటి బావి గల నన్ను, క్రోధ ఈర్ష్యలోభములనే అగ్ని, విషయమనేకఠిన పర్వతము కలనన్ను(44) త్రాసమనేముళ్ళతో నిండి నశిస్తున్న, అంధుడనైన నన్ను ఇప్పుడు శంభు ! మంచి పదవికి చేర్చు, ఓ రామేశ్వర ! (45) వానరుంలందరి వచనము - వింద్య అనింద్యములైన అన్ని యోనుల యందు జన్మించి, ఓ ప్రభు! కుంభీ పాకాది నరకమందు పడి మరల అట్లాగే (46) కర్మశేషం వల్ల కుత్సితమైన యోని యందు జన్మించి సంసార మందు పడిన మమ్ములను రామనాథ ! దయానిధి (47) అనాథలు వివశులు, దీనులు, దుఃఖిస్తున్నవారు ఐన మమ్ములను ఓ శంకర! రక్షించు ఓ దయాసింధు ! రామనాథ! మహేశ్వర! నీకు నమస్కారము (48) బ్రహ్మవచనము- లోకనాథ! రామనాథ! శంభు ! నీకు నమస్కారము. ఓ సర్వేశ ! నన్నను గ్రహించు. నా అవిద్యను నశింపచేయి (49) ఇంద్రుని వచనము - ఎవని శక్తి త్రయీమయి, జగన్మాత, ఉమా ఐన దేవియో అట్టి శంకరుని రామనాథుని ఉమాపతిని నేను నమస్కరిస్తున్నాను (50) యముని వచనము - ఎవనికి గణశ్వర స్కందులు కుమారులో ఎవనికి వృషభము వాహనమో అట్టి రామేశ్వరుని సర్వ అజ్ఞానని వృత్తి కొరకు సేవిస్తాను (51) వరుణుని వచనము - ఎవని పూజా ప్రభావం వల్ల మార్కండేయుడు మృత్యువును జయించాడో, ఆమృత్యుంజయుని, రామనాథుని హృదయంతో నేను ఉపాసిస్తున్నాను. (52) కుబేరుని వచనము - ఈశ్వరుడు వెలుగుతున్న కర్ణకుండల ఆభరణము కలవాడు, లత్తుకవలె ఎర్రని శరీరము కలవాడు. రామేశ్వరుడు ఐన నీకు నమస్కారము (53) ఆదిత్యుని వచనము - ఓ మహాదేవ! రామనాథ! త్రియంబక! నీకు నమస్కారము. దక్షుని అధ్వరమును నశింపచేసిన నీకు నమస్కారము. ఓ శివ నన్ను రక్షించు (54) సోముని వచనము - భస్మమును పూసుకొనిన, శూలముగల, సర్పములు మాలగా గల నీకు నమస్కారము. రామనాథ దయాసముద్ర, స్మశానవాసి, నీకు నమస్కారము. (55) అగ్నివచనము - ఇంద్రుడు మొదలగు అఖిలదిక్పాలురతో సేవించబడే పాదాంబుజములు కలవాడ! రామనాథ, శుద్ధస్వరూప, దిక్కులేవసనముగా గలవాడ నీకు ఎల్లప్పుడు నమస్కారము (56) వాయువచనము - హరిరూప ! వ్యాఘ్రచర్మము వస్త్రముగా గలవాడ! రామనాథ! నీకు నమస్కారము. నాకు అభీష్టమును ప్రసాదించు (57).

మూ|| బృహాస్పతి రువాచ -

అహంతా సాక్షిణ నిత్యం ప్రత్యగద్వయవస్తునే | రామానథ మయాజ్ఞానమాశునాశయతేనమః || 58 ||

శుక్ర ఉవాచ -

పంచకానామలభ్యాయ మహామంత్రార్థరూపిణ | నమోద్వైతవిహీనాయ రామనాథాయ శంభ##వే || 59 ||

అశ్వినాపూచతుః -

ఆత్మరూపతయా నిత్యం యోగినాం భాసతే హృది | అనన్య భాసవేద్యాయ నమస్తే రాఘవేశ్వర || 60 ||

అగస్త్య ఉవాచ -

ఆది దేవ మహాదేవ విశ్వేశ్వర శివావ్యయ | రామనాథాం బికానాథ ప్రసీద వృషభధ్వజ || 61 ||

అపరాద సహస్రం మేక్షమ స్వవిధుశేఖర | మమాహమితి పుత్రాదాపహంతాం మమమోచయ || 62 ||

సుతీక్ణ ఉవాచ -

క్షేత్రాణి రత్నాని ధనాని దారా | మిత్రాణి వస్త్రాణి గవాశ్వపుత్రాః

నైవోపకారాయ హి రామనాథ | మహ్యం ప్రయచ్ఛ త్వమతో విరక్తిం || 63 ||

విశ్వామిత్ర ఉవాచ -

శ్రుతాని శాస్త్రాణ్యపి నిష్ఫలాని | త్రయ్య వ్యధీతా విఫలైవసూనం

త్వమీశ్వరేచేన్నభ##వేద్ధిభక్తిః | శ్రీరామనాథే శివమానుషస్య || 64 ||

గాలవ ఉవాచ -

దానానియజ్ఞాని యమాస్తపాంసి | గంగాది తీర్థేషు నిమజ్జనాని

రామేశ్వరం త్వాం సనమంతియేతు | వ్యర్థాని తేషామితి నిశ్చయోత్ర || 65 ||

వసిష్ఠ ఉవాచ -

కృత్వాని పాపాన్యఖిలానిలోకః | త్వామేత్య రామేశ్వర భక్తియుక్తః

సమేత చేత్తా నిలయం ప్రజేయుః | యథాంధకారోరవితేజసాద్ధా || 66 ||

అత్రిరువాచ -

దృష్ట్వాతురామేశ్వర మేకదాపి | స్పృష్ట్వానమస్కృత్య భవంతమీశం

పునర్నగర్భం సనరః ప్రయాయాత్‌ | కింత్వ ద్వయంతే లభ##తే స్వరూపం || 67 ||

అంగిరా ఉవాచ -

యోరామనాథం మనుజో భవంత | ముపేత్య బంధూన్ర్పణమన్‌ స్మరేత

సంతారయేత్తానపి సర్వపాపాత్‌ | కిమద్భుతం తస్య కృతార్థతాయాం || 68 ||

గౌతమ ఉవాచ -

శ్రీరామనాథేశ్వర గూఢమేతత్‌ | రహస్యభూతం పరమంవిశోకం

త్వత్పాదమూలం భజతాం నృణాంమే | సేవాం ప్రకుర్వంతి హితేపిథన్యాః || 69 ||

శతానంద ఉవాచ -

వేదాంత విజ్ఞాన రహస్యవిద్భిః | విజ్ఞేయమే తద్ధిమముక్షుభిస్తు

శాస్త్రాణి సర్వాణి విహాయదేవ | త్వత్సేవనం యద్రఘువీర నాథ || 70 ||

భృగురువాచ -

రామనాథ తవపాద పంకజ | ద్వంద్వచింతన విధూత కల్మషః

నిర్భయంప్రజతి సత్సుఖాద్వయం | సుప్రభం త్వథ అమోఘ చిద్ధనం || 71 ||

కుత్సఉవాచ -

రామనాథ తవపాదసేవనం | భోగమోక్ష వరదం నృణాం సదా |

రౌరవాది నరక ప్రణాశనం | కఃపుమాన్నభజతే రసగ్రహః || 72 ||

కాశ్యప ఉవాచ -

రామానథ తవపాదసేవినాం | కింవ్రతైరుతతపోభిరధ్వరైః

వేదశాస్త్ర జపచింతయాచకిం | స్వర్గసింధు పయసాపి కింఫలం || 73 ||

శ్రీరామనాథ త్వమాగత్య శీఘ్రం | మమోత్క్రాంతికాలేభవాన్యాచసాకం

మాంప్రాపయస్వాత్మపదారవిందం | విశోకం విమోహం సుఖం చిత్స్వరూపం || 74 ||

తా || బృహస్పతి ఇట్లా స్తుతించాడు - అహంకారమునకు సాక్షి ఎల్లప్పుడు వ్యతిరేకమైనది లేకపోవటం, ఏకత్వము కలిగి ఉండటం) రెండోది లేకపోవటం వస్తువుగా గలవాడ రామనాథ నా అజ్ఞానాన్ని త్వరగా నశింపచేయి. నీకు నమస్కారము (58) శుక్రుని వచనము - పంచకులకు లభించనివాడ, మహామంత్రార్థ స్వరూపుడ ! రెండోది లేనివాడ, రామనాధ, శంభు, నీకు నమస్కారము (59) అశ్వినులిట్లా అన్నారు - యోగుల హృదయమందు ఎల్లప్పుడు ఆత్మరూపంగా వెలిగే వాడ, అనన్య జ్ఞానముతో తెలుసుకోతగినవాడ, రాఘవేశ్వర, నీకు నమస్కారము (60) అగస్త్యుని వచనము - ఆదిదేవ, మహాదేవ, విశ్వేశ్వర, శివ,అవ్యయ, రామనాథ, అంబికానాథ, వృషభమును ధ్వజంలో కలవాడ, అనుగ్రహించు (61) ఓ చంద్రశేఖర, నా వేలకొలది పాపములను క్షమించు. కొడుకులు మొదలగు వారియందు వీడునా వాడు అని భావించినట్లునన్ను భావించి నా అహంకారాన్ని నశింపచేయి (62) సుతీక్షుణుని వచనము - క్షేత్రములు, రత్నములు, ధనము, భార్య, మిత్రులు, వస్త్రములు, గోవులు, అశ్వములు, పుత్రులు ఇవన్ని ఉపకారం కొరకు కాదు. అందువల్ల ఓ రామనాథ నీవు నాకు వైరాగ్యాన్ని ఇవ్వు (63) విశ్వామిత్రుని వచనము - శాస్త్రములను విన్నా వ్యర్థమే. వేదములను అభ్యసించినా వ్యర్థమే. ఓ శివ! ఈశ్వరుడవైన రామనాథుడవైన నీపై మనుష్యునకు భక్తి కలగకపోతే పై వివ్యర్థం (64) గాలవుని వచనము - దానములు, యజ్ఞములు, నియమములు, తపస్సు, గంగాది తీర్థములలో స్నానము, ఇవన్ని రామేశ్వరుడవైన నిన్ను నమస్కరించని వారికి వ్యర్థము అని నిశ్చయము. (65) వసిష్ఠుని వచనము - సమస్త పాపములు చేసి కూడా లోకము రామేశ్వర ! నీ దగ్గరకు వచ్చి భక్తి యుక్తుడై నమస్కరిస్తే అవన్నీ నశిస్తాయి. ఎట్లాగంటే సూర్యుని తేజస్సు వల్ల అంధకారము నశించినట్లు (66) అత్రివచనము- రామేశ్వరుని ఒకసారైన చూచి, తాకి, ఈశుడవైన నిన్ను నమస్కరించిన ఆతడు తిరిగి గర్భ ప్రవేశము చేయడు. అంతేకాక అద్వయమైన నీ స్వరూపాన్ని పొందుతాడు. (67) అంగిరుడు ఇట్లా అన్నాడు - రామనాథుడవైన నిన్ను చేరి నరుడు నమస్కరిస్తూ తన బంధువులను స్మరించినా వారిని కూడా అన్ని పాపముల నుండి తరింపచేస్తాడు అని అంటే నమస్కరించేవాని కృతార్థత విషయంలో అద్భుతమేముంది (68) గౌతముని వచనము - శ్రీరామనాథ ! ఈశ్వర, ఇది చాలా గూఢమైనది మిక్కిలి రహస్యమైనది శోకనాశకము, నీ పాదమూలమును సేవించే నరుల సేవను చేసే వారు కూడా ధన్యులే (69) శతానందుని వచనము - వేదాంత విజ్ఞాన రహస్య మెరిగిన వారు తెలుసుకో తగినది, ముముక్షువులు చేయాల్సినది, ఏమంటే శాస్త్రములన్ని వదలి, ఓ రఘువీరనాథ, దేవ, నీ సేవనము చేయాలి అని (70) భృగువచనము - రామనాథ, నీ పాదపద్మ ద్వంద్వ చింతనతో పాపములన్ని పోగొట్టుకొని ప్రకాశవంతమైన అద్వయమును సత్‌ సుఖమును అమోఘమైన చిత్‌ అనే ధనమును పొందుతాడు (71) కుత్సుని వచనము - ఓ రామనాథ! నీ పాద సేవ నరులకు ఎల్లప్పుడు భోగమైన మోక్ష వరము నిచ్చేది. రౌరవాది నరకములను నశింపచేసేది. రసగ్రాహిపురుషుడు ఎవడు సేవించడు (72) కశ్యప వచనము - రామనాథ నీ పాదములు సేవించే వారికి వ్రతములతో పనేమి, తపస్సులతో అధ్వరములతో పనేమి. వేదశాస్త్రజప చింతలతో పనేమి. స్వర్గమందలి గంగా నీరుతో కూడా ఫలమేమి (73) శ్రీరామనాథ! నా ప్రాణం పోయే సమయంలో నీవు భవానీతో సహ త్వరగా వచ్చి నీ పాదారవిందములకు నన్ను చేర్చు. శోకము, మోహము లేకుండా చేసి చిత్‌ స్వరూపమైన సుఖాన్ని నాకు కల్గించు (74).

మూ || గంధర్వా ఊచుః -

రామనాథత్వమస్మాకం భజతాం భవసాగరే | అపారేదుఃఖకల్లోలేసత్వత్తోన్యాగతిర్హినః || 75 ||

కిన్నర ఊచుః -

రామనాథ భవారణ్య వ్యాధి వ్యాఘ్రభయానకే | త్వామంతరేణ నాస్మాకం పదవీ దర్శకోభ##వేత్‌ || 76 ||

యక్షా ఊచుః -

రామనాథేంద్రియారాతి బాధానో దుఃసహాసదా | తాన్విజేతుం సహాయస్త్వమస్మాకం భవధూర్జటే || 77 ||

నాగా ఊచుః -

అచింత్యమహిమానంత్వా రామనాథ వయం కథం | స్తోతు మల్పధియః శక్తా భవిష్యామోంబికా పతే || 78 ||

కింపురుషచా ఊచుః -

నానాయోనౌచ జననం మరణం చాప్యనేకశః | వినాశయతథాజ్ఞానం రామనాథనమోస్తుతే || 79 ||

విద్యాధరా ఊచుః -

అంబికాపతేయేతుభ్యం అసంగాయ మహాత్మనే | నమస్తే రామనాథాయ ప్రసీదవృషభధ్వజ || 80 ||

పనవఊచుః -

రామనాథ గణశాయ గణవృందార్చితాం ఘ్రయే | గంగాధరాయగు హ్యాయ నమస్తేపాహినః సదా || 81 ||

విశ్వేదేవాఊచుః -

జ్ఞప్తిమాత్రైకనిష్ఠానాం ముక్తిదాయనుయోగినాం | రామనాథా య సాంబాయనమోస్మాన్రక్షశంకర || 82 ||

మరుత ఊచుః -

పరతత్త్వాయ తత్త్వానాం తత్త్వభూతాయవస్తుతః | నమస్తే రామనాథాయ స్వయం భానాయ శంభ##వే || 83 ||

సాధ్యాఊచుః -

స్వాతిరిక్త విహీనాయ జగత్‌సత్తా ప్రదాయినే | రామేశ్వరాయదేవాయ నమోవిద్యావిభేదినే || 84 ||

తా || గంధర్వులిట్లనిరి - రామనాథ, అపారమై దుఃఖముతో కల్లోలమైన భవసాగరమందున్న మాకు నిన్ను సేవించే వారికి నీకు మరొక మార్గములేదు. (నీవేగతి) (75)కిన్నరులిట్లనిరి - వ్యాధులనే వ్యాఘ్రములతో భయానకమైన భవారణ్య మందున్న మాకు మార్గ దర్శకుడ ! నీవు తప్ప మరొకరు లేరు, ఓ రామనాథ ! (76) యక్షులిట్లనిరి - ఓ రామనాథ! ఇంద్రియములనే శత్రువుల బాధమాకు ఎల్లప్పుడు భరింపరానిదిగా ఉంది. వాటిని జయించుటకు మాకు నీవు సహాయంగా ఉండు, ఓ ధూర్జటి (77) నాగులిట్లనిరి - ఓ రామనాథ ! అంచిత్యమైన మహిమ గల నిన్ను అల్పబుద్ధులమైన మేము స్తుతించుటకు ఎట్లా శక్తుల మౌతాము, ఓ అంబికావతి (78) కింపురుషులిట్లనిరి - అనేక యోనులయందు జన్మించుట, అనేక మార్లు మరణించుట, అజ్ఞానము వీటిని నశింపచేయి, రామనాథ! నీకు నమస్కారము (79) విద్యాధరులిట్లనిరి - అంబికాపతి ! సంగతిలేనివాడ (అనంగుడ) మహాత్మ నీకు నమస్కారము. రామనాథ వృషభధ్వజ ! నన్ను అనుగ్రహించు (80) వసువులిట్లనిరి - రామనాథగణశ ! గణవృందములతో పూజింపబడే పాదములు గలవాడ, గంగాధర, గుహ్య (ఒంటరి) నీకు నమస్కారము ఎల్లప్పుడు మమ్ముల రక్షించు (81) విశ్వేదేవులిట్లనిరి - జ్ఞానమందు మాత్రమే నిష్ఠగల వారికి యోగులకు మాత్రమే ముక్తినిచ్చే రామనాథ సాంబ! శంకర నీకు నమస్కారము. మమ్ములను రక్షించు (82) మరుత్తులిట్లనిరి - తత్వములన్నింటికి పరతత్వము, తత్వభూతము యథార్థానికి, ఐన రామనాథ స్వయంప్రకాశ శంభు నీకు నమస్కారము (83) సాధ్యులిట్లనిరి - తనకన్న అతిరిక్తము లేనివాడ ! జగత్తునకు సత్తనిచ్చేవాడ రామేశ్‌పర, దేవ, అవిద్యావిభేది నీకు నమస్కారము (84).

మూ || సర్వేదేవా ఊచుః -

సచ్చిదానంద సంపూర్ణం ద్వైతవస్తు వివర్జితం | బ్రహ్మాత్మానం స్వయంభానం ఆదిమధ్యాంత వర్జితం || 85 ||

అవిక్రియమసంగంచ పరిశుద్ధం సనాతనం | ఆకాశాది ప్రపంచానాం సాక్షిభూతం పరామృతం || 86 ||

ప్రమాతీతం ప్రమాణానామపిబోధ ప్రదాయినం | ఆవిర్భావతిరోభావ సంకోచ రహితం సదా || 87 ||

స్వస్మిన్నధ్యస్తరూపస్య ప్రపంచస్యాన్య సాక్షిణం | నిర్లేపంపరమానందం నిరస్త సకల క్రియం || 88 ||

భూమానందం మహాత్మానం చిద్రూపం భోగవర్జితం | రామనాథం వయం సర్వేస్వ పాతక విశుద్ధయే || 89 ||

చింతయామః సదాచిత్తే స్వాత్మానంద బుభుత్సవః | రక్షాస్మాన్కరుణా సింధో రామనాథ నమోస్తుతే || 90 ||

రామనాథాయ రుద్రాయ నమః సంసారహారిణ | బ్రహ్మవిష్ట్వాది రూపేణ విభిన్నాయ స్వమాయయా || 91 ||

విభీషణ సచివా ఊచుః -

వరదాయ వరేణ్యాయ త్రినేత్రాయ త్రిశూలినే | యోగిధ్యే యాయ నిత్యాయ రామనాథాయ తేనమః || 92 ||

సూత ఉవాచ -

ఇతిరామాదిభైః సర్వైః స్తుతో రామేశ్వరః శివః ప్రాహసర్వాన్సమా హూయ రామాదీన్ద్విజసత్తమాః || 93 ||

రామరామ మహాభాగజానకీరమణ ప్రభో | సౌమిత్రే జానకీ శుభే హే సుగ్రీవ ముఖాస్తథా || 94 ||

అన్యేబ్రహ్మముఖాయూయంశృణుధ్వంసుసమాస్థితాః|స్తోత్రాధ్యాయమిమంపుణ్యంయుష్మాభిఃకృతమాదరాత్‌ || 95 ||

యేపఠంతిచ శృణ్వంతి శ్రావ యంతిచమానవాః | మదర్చన ఫలంతేషాం భవిష్యతి నసంశయః || 96 ||

రామచంద్ర ధనుష్కోటి స్నాన పుణ్యం చ వైభ##వేత్‌ | వర్షమేకం రామసేతౌ వానపుణ్యం భవిష్యతి || 97 ||

గంధమాదన మధ్యస్థ సర్వతీర్థాభిమజ్జనాత్‌ | యత్పుణ్యం తద్భవేత్తేన నాత్ర సంశయ కారణం || 98 ||

ఉక్త్వైవం రామనాథోపి స్వాత్మలింగే తిరోదధే | స్తోత్రాధ్యాయమిమం పుణ్యం నిత్యం సంకీర్తయన్నరః || 99 ||

జరామరణ నిర్ముక్తో జన్మదుఃఖ వివర్జితః | రామనాథస్య సాయుజ్య ముక్తిం ప్రాప్నోత్య సంశయః || 100 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామాదిభిః రామనాధస్తోత్ర కథనం నామైకోన పంచాశత్తమోధ్యాయః || 49 ||

తా || దేవతలందరిట్లనిరి - సచ్చిదానంద సంపూర్ణుడు, ద్వైత వస్తువులేని వాడు, బ్రహ్మాత్మ, స్వయంజ్యోతి, ఆదిమధ్యాంతరహితుడు (85) వికారములేనివాడు, అసంగుడు, పరిశుద్ధుడు, సనాతనుడు, ఆకాశాది ప్రపంచములకు సాక్షిభూతుడు పరమైన అమృతుడు (86)ప్రమకు అతీతుడు, ప్రమాణములకు కూడ బోధను కల్గించేవాడు, ఆవిర్భావ, తిరోభావ, సంకోచములు లేనివాడు, ఎల్లప్పుడు (87) తనయందు అధ్యవసించిన రూపముగల ప్రపంచమునకు సాక్షి, నిర్లేపుడు, పరమానందుడు, క్రియలన్ని తొలగినవాడు (88) సృష్టియందు ఆనందపడేవాడు, మహాత్ముడు, చిద్రూపుడు, భోగవర్జితుడు, అట్టా రామనాథుని మన మందరము మన పాతకముల నుండి శుద్ధికొరకు (89) ఎల్లప్పుడు చిత్త మందు స్వాత్మానంద మనుభవించుటకు ఇచ్ఛకలవారమై చింతిద్దాము (ధ్యానిద్దాము). ఓ కరుణా సింధు మమ్ముల రక్షించు. రామనాధ! నీకు నమస్కారము. (90) రామనాధ! రుద్ర సంసారహారి నీకు నమస్కారము. నీ మాయతో బ్రహ్మవిష్ణ్వాది రూపములతో భిన్నమైన వాడ నమస్సులు (91) విభీషణుని సచివులిట్లనిరి - వరద, వరేణ్య, త్రినేత్ర, త్రిశూలి, యోగులకు ధ్యేయమైనవాడ, నిత్యుడ, రామనాథ నీకు నమస్కారము (92) సూతుడిట్లనెను - అని రాముడ మొదలగు వారందరితో ప్రార్థింపబడ్డ రామేశ్వరుడు, శివుడు, రాముడు మొదలగు వారందరిని పిలిచి ఇట్లన్నాడు, ఓ ద్విజసత్తములార! (93) రామరామ, మహాభాగ, జానకీరమణ ప్రభు, సౌమిత్రి, జానకి, శుభులైన ఓ సుగ్రీవ ప్రముఖులార (94) ఇతరులైన బ్రహ్మ మొదలుగా గల మీరలు చక్కగా ఉండి వినండి. ఆదరంతో మీరు చేసిన పుణ్యమైన ఈ స్తోత్రాధ్యాయమును (95) చదివినవారు, విన్నవారు, వినిపించిన నరులు, నన్ను అర్చించిన ఫలమును పొందుతారు. అనుమానము లేదు (96) రామచంద్ర ధనుష్కోటి స్నాన పుణ్యము కల్గుతుంది. ఒక సంవత్సర కాలము రామసేతువు నందు నివసించిన పుణ్యము కలుగుతుంది. (97) గంధమాదన మధ్యమందున్న సర్వతీర్థములందు స్నానం చేయటం వల్ల కలిగే పుణ్యము దాని వల్ల కల్గుతుంది. ఇక్కడ అనుమాన కారణములేదు (98) ఈ విధముగా పలికి రామనాథుడు కూడా స్వాత్మలింగమందు అంతర్థానము నందాడు. ఈ స్తోత్రాథ్యాయమును పుణ్యమైన దానిని రోజు గానం చేసిన నరుడు (99) జరమరణములు లేనివాడై జన్మ దుఃఖము తొలగిన వాడై రామనాథ సాయుజ్య ముక్తిని పొందుతాడు. అనుమానము లేదు. (100) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్య మందు రామాదులతో రామనాథ స్తోత్రమును చెప్పుట అనునది నలుబది తొమ్మిదవ అధ్యాయము || 49 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters