Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్‌ త్రింశో7ధ్యాయః.

శక్రయయాతి సంవాదః.

శౌనకః : స్వర్గతస్తుస రాజేన్గ్రో నివస న్దేవసద్మని | పూజిత స్త్రిదశై స్సాధ్యై ర్మరుద్భి ర్వసుభి స్తథా. 1

దేవలోకా ద్బ్రహ్మలోకం సఞ్చర న్పుణ్యకృ ద్వశీ | అవస త్పృథీవీపాలో దీర్ఘకాల మితి శ్రుతిః. 2

స కదాచి న్నృపశ్రేష్ఠో యయాతి శ్శక్ర మాగమత్‌ | కథాన్తే తత్ర శ##క్రేణ పృష్ణ స్స పృథివీపతిః. 3

శక్రః . యదా పూరు స్తవ రూపేణ రాజ న్జరాం గృహీత్వా ప్రచచార లోకే |

తదా స రాజ్యం సమ్ప్రదాయైవ తసై#్మ త్వయా కియుక్తః కథయేహ సత్యమ్‌. 4

యయాతిః గఙ్గాయమునయో ర్మధ్యే కృత్స్నో7యం విషయ స్తవ |

మధ్యే పృథివ్యా స్త్వం రాజా భ్రాతరో7న్తాధిపా స్తవ. 5

తే తే ధికాశ్శిష్టతమా స్తితిక్షవో తథా తితిక్షు శ్చాతితిక్షో ర్విశిష్టః |

అమానుషేభ్యో మానుషశ్చప్రధానో విద్వాం స్తథైవావిదుషః ప్రధానః. 6

ఆక్రుశ్యమానో నాక్రోశే న్మన్యు రేవం తితిక్ష్యతే | ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విన్దతి. 7

నారున్తుద స్స్యా న్న నృశంసవాదీ న హీనతః పరమ ప్యాదదీత |

యయా స్వవాచా పర ఉద్విజేత న తాం పదే దుశతీం పాపలోక్యామ్‌. 8

అరున్తుదం పరుషం తీక్షవాచం వాక్కంటకై ర్వితుదన్తం మనుష్యమ్‌ |

విద్యా దలక్ష్మీకతమం జనానాం ముఖే నిబద్ధాం నిరృతిం వహన్తమ్‌. 9

సద్బిః పురస్తా దభిపూజిత స్స్యా త్సద్భి స్తథా పృష్ఠతో నన్దిత స్స్యాత్‌ |

సదా సతా మతివాదం తితిక్షే త్సతాం వృత్తం చాదదీ తార్యవృత్తః. 10

వాక్సాయకా వదనా న్నిష్పతన్తి తైరాహత శ్శోచతి రాత్ర్యహాని |

పరస్య నామర్మసు నిష్పతన్తి తాన్పణ్డితో నావసృజే త్పరేషు. 11

నాస్తీదృశం సంవననం త్రిషు లోకేషు కిఞ్చన | యథా మైత్రీచ భూతేషు దానంచ మదురాచ వాక్‌. 12

*తస్మా త్సాన్త్వం సదా వాచ్యం న వదే త్పరుషం క్వచిత్‌ |

పూజ్యాన్త్సమ్బూజయే దన్యా న్నాభిశాపం కదాచన. 13

ఇది శ్రీమపత్స్యమహాపురాణ శౌనకశతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే

యయాతిచరితే షట్త్రింశో7ధ్యాయః.

ముప్పది ఆరవ అధ్యాయము

ఇంద్ర యయాతి సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను. రాజేంద్రుడగు యయాతి స్వర్గమును చేరి దేవభవనమునందు నివసింపసాగెను. అచట నతనిని దేవతలు సాధ్యులు మరుత్తులు వసువులు మొదలగువారు పూజించు (ఆదరించు)చుండిరి. అతడు పుణ్యమును ఆచరించినవాడును ఇంద్రియనిగ్రహము కలవాడును (కావున తన తపోబలమున సంపాదించిన పుణ్యలోకములలో) దేవలోక బ్రహ్మలోకములలో ఒకదానినుండి మరియొకదానికి సంచరించుచు చాలకాలము ఉండెను. అని పరంపరలో వినుచున్నాము. ఇట్లు ఒకప్పుడు ఆ నృపశ్రేష్ఠుడు యయాతి ఇంద్రలోకమునకు పోయెను. మాటల సందర్భములో ఇంద్రుడు యయాతిని ఇట్లు ఇడిగెను: ''రాజా! పూరుడు నీ రూపమును గ్రహించి వార్ధకముతో లోకమున వ్యవహరించినందులకు సంతసించి నీవు నీరాజ్యము నతని కిచ్చినప్పుడు అతనికి ఏమి ఉపదేశించితివో నిజము చెప్పుము.'' యయాతి: ''గంగా యమునా నదుల నడుమ నున్న ఈ దేశమంతయు నీ విషయము! (పరిపాలనలో ఉండు ప్రదేశము). ఈ భూభాగమున కంతటికి నీవు రాజవు. నీ అన్నలు నీరాజ్యపు అంచులందును వానికి అవతలను ఉండు దేశములను పాలింతురు.

''శిష్ణులందరలో గొప్పవారును ఓర్పుగలవారును పురుషులలో అధికులు. ఎట్లన-ఓర్పు లేనివానికంటె అదికలవాడు విశిష్టుడు. మానుష ధర్మము లేనివారికంటె అదికలవాడును వివేకము లేనివానికంటె అదికలవాడును విశిష్టతరుడు. ఇతరులు చెడు మాటలాడినను తానట్టివి ఆడరాదు. ఇట్లున్నచో కోపము నిగ్రహింపబడును. ఆ కోపము ఆక్రోశించినవాడనినే నిర్దహించును. తిట్టు తినినవాని పాపము తిట్టినవానికి అంటును. ఇతరుల హృదయమునకు వ్రణము కలిగించుపనులు చేయరాదు. క్రూర వచనములు పలుకరాదు. హీనునినుండి ఎంత గొప్ప వస్తువునైన గ్రహింపరాదు. (తాను ఏది పలికిన ఇతరులు నొప్పిపడుదురో) ఇతరులు ఏది పలికినచో తన మదికి నొప్పి కలుగునో అట్టి దుర్యచనములు తానితరులను పలుకరాదు. అది పాపలోకములకు పోవుటకు కారణమగును. అరుంతుదుడు (ఇతరుల హృదయ వ్రణమును రేపెడి క్రూరపు పనులు చేయుచు అట్టి మాటలాడుచు నుండువాడు) అగు పురుషుడు తీక్‌ష్ణవచనములు పలుకువాడు మాటలనెడి ముండతో ఇతరుని బాధించువాడు మనుష్యులందరలో అశుభస్వరూపులని తెలియవలెను. అట్టి వాడు తన ముఖమునందు నిరృతిని (అలక్ష్మిని) కట్టుకొని మోయువాడే. సజ్జనులు తన ఎదుటను మెచ్చుకొనునట్లును వెనుకను ప్రశంసించునట్లును నడుచు కొనవలెను. సజ్జనులు ఒకవేళ నిందించినను ఓర్చుకొనవలెను. వారి నడువడిలో మంచివానిని తాను గ్రహించి పూజ్యమగు నడువడితో మెలగవలెను. (పరుష) వచనములు నోటినుండి వెలువడు బాణములు. వాటి దెబ్బ తినినవాడు రాత్రంబవళ్ళును శోకించుచుండును. అవి ఇతరుల హృదయ మర్మములందు తప్ప గ్రుచ్చుకొనవు. కనుక వివేకి యగువాడు వాటిని ఎవరిమీదను విడువరాదు. భూతములయందు మైత్రి (సానుభూతి) దానము-మధుర వచనములు పలుకుట- ఈ మూటితో సదృశమగు సంవననము (ఇతరులను తనవైపు త్రిప్పుకొనునది) మరి ఏదియు లేదు. కనుక ఎల్లప్పుడును నెమ్మదిగా మాటలాడవలయును. పరుషము లెక్కడ నెప్పుడు నాడరాదు. పూజ్యులగు ఇతరులను పూజించుచుండవలయును. అభిశాపవచనము లెన్నడు నాడరాదు.''

___________________________________________

* తస్మాత్సత్యం

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానుకీర్తనమున యయాతి చరితమున

ఇంద్ర యయాతి సంవాదమున యయాతి పూరునకు బోధించిన నీతులు అను ముప్పదిఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters