Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తదశోధ్యాయః.

సాధారణశ్రాద్ధకాలనిర్ణయః.

సూతః: అతఃపరం ప్రవక్ష్యామి విష్ణునా య దుదీరితమ్‌ | శ్రాద్ధం సాధారణం నామ భుక్తిము క్తిఫలప్రదమ్‌.

అయనే విషువే యుగ్మే సామాన్యే చార్కసఙ్ర్కమే | అమావాస్యాష్టకా చైవ కృష్ణపక్షచతుర్దశీ. 2

ఆర్ద్రా మఖారోహిణీషు ద్రవ్యబ్రామ్మణసన్నిధౌ | గజచ్ఛాయావ్యతీపాతే విష్టివైధృతివాసరే. 3

వైశాఖస్య తృతీయాయాం నవమ్యాం కార్తికస్య తు | పఞ్చదశ్యాం తు మాఖస్య సభ##స్యేచ త్రయోదశీ. 4

యుగాదయ స్స్మృతా హ్యేతే దత్తస్యాక్షయకారకాః | తథా మన్వన్తరాదౌ చ దేయం శ్రాద్ధం విజానతా. 5

ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశీ కార్తికే తథా | తృతీయా చైత్రమాసస్య తథా భాద్రపదస్య చ. 6

అమావాస్యా ఫాల్గునస్య పౌషసై#్యకాదశీ తథా | ఆసాఢస్యాపి దశమీ మాఖమాసస్య సప్తమీ. 7

శ్రావణ చాష్టమీ కృష్టా తథాషాఢేచ పూర్ణిమా | కార్తికీ ఫాల్గునీ చైత్రీ జ్యైష్ఠీ పఞ్చదశీ తథా. 8

మన్వన్తరాదయశ్చైతా దత్తస్యాక్షయకారకాః | యస్మా న్మన్వన్తరస్యాదౌ రథ మాప దివాకరః. 9

మాఖమాసస్య సప్తమ్యా మథ సా రథసస్తమీ |

పానీయమ ప్యత్ర తిలై ర్విమిశ్రం దద్యా త్పితృభ్యః ప్రయతో మనుష్యః. 10

శ్రాద్ధం కృతం తేన సమా స్సహస్రం రహస్య మేత త్పితతరో వదన్తి |

వైశాఖ్యా ముపరాగేషు రథోత్సమమహాలయే. 11

తీర్థాయతనగోష్ఠేషు ద్వీపోద్యానగృహేషు చ | విని క్తేషూపలిష్తేషు శ్రాద్ధం దేయం విజానతా. 12

సప్తదశాధ్యాయము

సాధారణ శ్రాద్ధ విధానము-ఆభ్యుదయిక శ్రాద్ధ విధానము

సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పనారంభించెను (ఇంతవరకు నేను మీకు మూడు విధములగు నైమిత్తిక శ్రాద్ధములలో మొదటిదగు పార్వణ శ్రాద్ధపు విధానమును తెలిపితిని.) ఇకమీదట మత్స్యరూప నారాయణుడు మనువునకు చెప్పిన సాధారణ శ్రాద్ధ విధానము తెలిపెదను. (ఇది నై మి త్తిక శ్రాద్ధములలో రెండవది.) దీని వలన భుక్తి ముక్తులు లభించును.

(ఈ శ్రాద్ధము జరుపవలసిన కాలమును-దేశమును) ఉత్తరాయన దక్షిణయన ప్రవేశ పుణ్యకాలములును రెండు విషువ దినములును (రాత్రింబవళ్ళ పరమాణము సమముగా ఉండు దినములు) సూర్యుడు ఆయారాశులయందు ప్రవేశించు దినములును అమావాస్య అష్టకా (మాసమున కృష్ణపక్ష సప్తమీ) కృష్ణపక్ష చతుర్దశీ తిథులును ఆర్ద్రామఖా రోహిణీ నక్షత్ర దినములును శ్రాద్ధమునకు యోగ్యములగు ద్రవ్యములును యోగ్యులగు బ్రాహ్మణులును లభించిన దినములును గజచ్ఛాయా వ్యతీపాత్‌ విష్టి వైధృతి యోగములున్న దినములును యుగాది మన్వంతరాది దినములును అనెడి ఈ దినములందు జరిపిన శ్రాద్ధము అక్షయమగును. (అనంత ఫలమును ఇచ్చును.) (వీనిలో గజచ్ఛాయావ్యతీపాత విష్టి వైధృతి యోగములు జ్యోతిశ్శాస్త్రమునుండి తెలియవలెను.) వైశాఖ తృతీయా కార్తిక నవమీ మాఘ పంచదశీ భాద్రపద త్రయో దశీ-ఇవి యుగాదులు. అశ్వయుజ శుక్లనవమీ కార్తిక ద్వాదశీ చైత్ర తృతీయా భాద్రపద తృతీయా పాల్గునామావాస్యా పుషై#్యకాదశీ ఆషాఢ దశమీ మాఘ సప్తమీ శ్రావణ కృష్ణాష్టమీ ఆషాఢ పూర్ణిమా కార్తిక ఫాల్గున చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వంతరాది దినములు. (ఇచట కొన్ని తిథుల విషయమున పక్షమును చెప్పలేదు. మరియు పంచాంగములలో మన్వన్తరాదులు ఈ విధముగా నున్నవి. కార్తిక శుక్ల ద్వాదశీ స్వాయంభువ-అశ్వయుజ శుక్లనవమీ స్వారోచిష-చైత్ర శుక్ల తృతీయా-ఉత్తమ-భాద్రపద శుక్ల తృతీయా తామస-పుష్య శుక్లైకాదశీ రైవత-ఆషాఢ శుక్లదశమీ చాక్షుష-చైత్ర శుక్ల తృతీయా-ఉత్తమ-భాద్రపద శుక్ల తృతీయా తామస-పుష్య శుక్లైకాదశీ రైవత-ఆషాఢ శుక్లదశమీ చాక్షుష-మాఖశుక్ల సప్తమీ వైవస్వత-శ్రావణామావాస్యా అగ్ని సావర్ణి-ఫాల్గున పూర్ణిమా బ్రహ్మసావర్ణి-కార్తిక పూర్ణిమా దక్షసావర్ణి-భాద్రపద కృష్ణాష్టమీ సూర్యసావర్ణి-ఆషాఢ కృష్ణాష్టమీ-రుద్రసావర్ణి-జ్యేష్ఠ పూర్ణిమా బౌత్య-చైత్ర శుక్ల పూర్ణిమా రౌచ్య).

వీనిలో వైవస్వత మన్వంతరాదియగు మాఖ శుక్ల సప్తమీ తిథినాడు సూర్యుడు తన రథమును ఆరోహించెను. (సంపాదించుకొనెను.) కనుక దీనికి రథ సప్తమీయని వ్యవహారము ఏర్పడినది. ఈ దినమున మనుష్యుడు ప్రయతుడై (దేహమున చిత్తమున శుచియై) తిలలతో మిశ్రితమయిన ఉదకమును మాత్రమైనను పితృ దేవతల నుద్దేశించి అర్పించినచో వేయి సంవత్సరముల కాలము శ్రద్ధతో యథావిధిగ శ్రాద్ధము పెట్టినంత ఫలము కలుగును. వైశాఖామావాస్య నాడును గ్రహణ దినములందును ఉత్సవ దినములందును మహాలయ దినములందును తీర్థములందును క్షేత్రములందును గోవులు నిలుచు ప్రదేశములందును ద్వీపములందును ఉద్యాన గృహములందును (ఉద్యానవనములు వేరు.) లేదా ఉద్యానవనములందును తనకు అనుకూలమయిన గృహములందును వివిక్తమగు (ఎట్టి అపవిత్రతకును కలవరపాటునకును అవకాశము కలుగనీయని) ప్రదేశమునందును చక్కగా అలికి ఆ ప్రదేశమున శ్రాద్ధము జరుపుట శాస్త్రమును సంప్రదాయమును ఎరిగిన వారు చేయవలసిన పని.

విప్రా న్పూర్వేపరే చాహ్ని వినీతాత్మా నిమ న్త్రయేత్‌ | శీలవ్రత గుణోపేతా న్వయోరూపసమన్వితా&.

సాధారణశ్రాద్ధే విశ్వేదేవాద్యర్చావిధిః.

ద్వౌ దైవే పితృకార్యే త్రీ నేకైక ముభయత్ర వా | భోజయే త్సుసమృద్దోపి న ప్రసజ్యేత విస్తరే. 14

విశ్వా న్దేవా న్యవైః పుషై#్ప రభ్యర్చ్యాసనపూర్వకమ్‌ |

పూరయే త్పాత్రయుగ్మం తు స్థాప్య దర్భపవిత్రకమ్‌. 15

శన్నో దేవీ త్యపః క్షిప్త్వా యవోసీతి యవా నపి | గన్ధపుషై#్పశ్చ సమ్పూజ్య విశ్వే దేవం ప్రతి న్యసేత్‌.

విశ్వేదేవాన ఇత్యాబ్యా మావాహ్య వికిరే ద్యవా&|

గన్ధపుషై#్ప రలఙ్కృత్య యా దివ్యేత్యర్ఘ్య ముత్సృజేత్‌. 17

అభ్యర్చ్య తాభ్యా ముత్సృష్టః పితృయజ్ఞం సమారభేత్‌ |

దర్భాసనాని కృత్వా೭೭దౌ త్రీణి పాత్రాణి పూరయేత్‌. 18

సపవిత్రాణి కృత్వాదౌ శ న్నో దేవీ త్యపః క్షి పేత్‌ | తిలోసీతి తిలా నిప్త్వా గన్ధపుష్పాదికం పునః. 19

పాత్రం వనస్పతిమయం తథా పర్ణమయం పునః | జలజం చాపి కుర్వీత తథా సాగరసమ్భవమ్‌. 20

సౌవర్ణం రాజతం వాపి పితౄణాం పాత్ర ముచ్యతే | రజతస్య కథా వాపి దర్శనం దాన మేవ చ. 21

రాజతై ర్భాజనై రేషా మథవా రాజతాన్వితైః | వార్యపి శ్రద్ధయా దత్త మక్షయాయోపకల్పతే. 22

తథార్ఘ్యపాత్రే పిణ్డపి పితౄనాం రాజతం మతమ్‌ | శివనేత్రోద్భవం యస్మా త్తత స్త త్పితృవల్లభమ్‌. 23

అమఙ్గళం తద్యత్నేన దేవకార్యేషు వర్జయత్‌ | ఏవం పాత్రాణి సఙ్కల్ప్య యథాలాభం విమత్సరః. 24

యా దివ్యేతి పితు ర్నామ గోత్రై ర్దర్భకరో న్యసేత్‌ |

పితౄ నావాహయిష్యామి తథేత్యుక్తస్తు తైః పునః. 25

ఉశన్తస్త్వా తథా೭೭యంతు ఋచా ప్యావాహయే తృతౄ&|

యా దివ్యేత్యర్ఘ్య ముత్సృజ్య దద్యా ద్గన్ధాదికం తతః 26

వస్త్రోత్తరం దేవపూర్వం గత్వా సంశ్రవణాదితః | పితృపాత్రే నిధాయాథ శేష ముత్తరతో న్యసేత్‌. 27

పితృభ్య స్థ్సానమసీతి నిధాయ పరిషేచయేత్‌ | తత్రాపి పూర్వవ త్కుర్యా దగ్నికార్యం విమత్సరః. 28

ఉభాభ్యామపి హస్తాభ్యా మాహృత్య పరివేషయేత్‌ | ప్రశా న్తచి త్త స్సతతం దర్భపాణి రశేషతః. 29

శ్రాద్ధకర్త శ్రాద్ధమునకు ఒకదినము ముందుగా గాని రెండునాళ్లు ముందుగాగాని మంచిశీలము సత్కర్మాను ష్ఠానము సద్గుణములు కలిగిన వారిని తగిన వయస్సు రూపము కలవారిని శ్రాద్ధమున భోక్తలుగా నిమంత్రించవలెను. విశ్వదేవస్థానమున ఇద్దరను పితృ స్థానమున ముగ్గురిని మాత్రమే భుజింపచేయవలెను. లేదా ఒక్కొక్క స్థానమునకు ఒక్కొక్కరైనను చాలును. కర్త తానెంత ధనవంతుడైనను అంతకంటె ఎక్కువమందిని పిలువరాదు.

మొదట విశ్వదేవులకు ఆసనమునిచ్చి వారిని యవలతోపుష్పములతో పూజించవలెను. దర్భపవిత్రములను ధరించి రెండు పాత్రలను జలముతో నింపవలెను. 'శన్నో దేవీః' అను మంత్రముతో నీటిని ఆ పాత్రలలో పోయవలెను. 'యవోసి' అను మంత్రముతో పాత్రలో యవల వేయవలెను. గంధపుష్పములతో పాత్రలను పూజించి విశ్వేదేవులముందుంచవలెను. 'విశ్వేదేవాసః' అను మంత్రముతో విప్రులయందు విశ్వేదేవతల నావాహనము చేయవలెను. తరువాత వారిమీద యవలను విదలించవలెను. తరువాత బ్రాహ్మణులను గంధ పుష్పములతో అలంకరించి 'యా దివ్యాః' అను మంత్రముతో వారిచేతుల యందర్ఘ్యము విడువవలెను. మరల వారిని అర్బించి వారినుండి వీడ్కోలు అనుమతి పొందవలెను. పిమ్మట పితరులను అర్చించుటకు రావలెను. దర్భలతోడి ఆసనములను పితృస్థానమునందలి బ్రాహాణులకు వేయవలెను. వీరిముందున్న మూడు పాత్రలను నీటితో నింపవలెను. పవిత్రములను ధరించవలెను. 'శన్నోదేవీః' అను మంత్రముతో పాత్రలయందు నీటిని పోయవలెను. 'తిలోసి' అసు మంత్రముతో పాత్రలందు తిలలను వేయవలెను. గంధ పుష్పాదులను కూడ పాత్రలలో వేయవలెను. ఈ అర్ఘ్య పాత్రములు రావివంటి వనస్పతుల కొయ్యతో చేసినవి కాని ఆకుల దొన్నెలు కాని సముద్రమునుండి లభించు శంఖము మొదలైనవి కాని అయియుండవలెను. లేదా వెండిదో బంగారపుదో కావచ్చును. రజతము అను మాటయు రజతమును చూపుటయు దానము చేయుటయు పితృప్రీతికరము. వెండి పాత్రలతో కాని వెండి కలిసిన లోహపు పాత్రలతోకాని శ్రద్ధతో పితరులకు ఇచ్చినది అక్షయమై అనంతఫలము నిచ్చును. అర్ఘ్యముంచుటకును విడుచుటకును కాని పిండముల నుంచుట మొదలగు పనులలో కాని పితృదేవతలకు వెండి చాల ప్రీతికరమైనది.

వె డి శివుని కంటినుండి పుట్టినది. కనుకనే అది పితృ ప్రీతికరము. అది శుభకరము మాత్రము కాదు. కనుక దానిని దేవ కార్యములందు ఉపయోగింపరాదు.

ఈ విధముగా తనకు లభించునంతలో (శ్రాద్ధమునకై) పాత్రలను సమకూర్చుకొనవలెను. మత్సరము మొదలగు మనోదోషము లేమియు లేక యుండవలెను. 'యా దివ్యాః' అను మాత్రముతో పితరుల నామ గోత్రములను చెప్పుచు దర్భలను చేతపట్టుకొని 'పితరులను మీయందు ఆవాహనము చేయుచున్నాను.' అను అర్థమునిచ్చు మంత్రముతో ఆదర్భాలను బ్రాహ్మణుల చేతియందుంచవలెను. ఆసమయముతో 'మీయందావాహనము చేయుచున్నాను.' అని కర్త అనగా 'తథా' 'అట్లే కానిమ్ము.' అని ఆ విప్రుడనును. 'ఉశంతస్త్వా' అను మంత్రముతో కాని 'ఆయంతు' అను మంత్రముతో కాని వారియందు పితరులను ఆవాహనము చేయవలెను. 'యా దివ్యా' అను మంత్రముతో వారిచేతిలో అర్ఘ్యమును విడువవలెను. గంధ పుష్పవస్త్రములీయవలెను. అర్ఘ్యము మొదట విశ్వేదేవులకు-తరువాత పితరులకు. సంశ్రవ మంత్రము కూడ చెప్పుచుండవలెను. అర్ఘ్యమును విడిచిన తరువాత న్యుబ్జుడై (ముందునకు వ గినవాడై) ఆ అర్ఘ్యపాత్రలను భోక్తకు ఉత్తరముగా ఉంచవలెను. 'పితృభ్యః స్థానమసి' అను మంత్రముతో ఆ పాత్రలను భోక్తకు ఎడమ దిక్కుగా శుచి ప్రదేశమున ఉంచి వాటిని నీటితో పరిషేచనము చేయవలెను.

ఈ సాధారణ శ్రాద్దమందు కూడ పార్వణ శ్రాద్ధమునందు వలెనే నిర్మలచిత్తుడై అగ్ని (గ్నౌ)కరణమును జరుపవలెను. తరువాత ప్రశాన్త చిత్తుడై నిరంతరముగా దర్భలను చేత ధరించియేయుండి రెండు చేతులతోను పదార్థములను అన్నిటిని తెచ్చి భోక్తల పాత్రలయందు వడ్డించవలెను.

సాధారణశ్రాద్ధే దేయమాంసభేదాః.

గుణౖస్తు సూపశాకాద్యై ర్నా నాభ##క్ష్యై స్తథైవచ |

అన్నంతు స్వాదువ తీక్షరం గోఘృతం శర్కరాన్వితమ్‌. 30

మాసం ప్రీణాతివై సర్వా న్పితౄ నిత్యాహ కేశవః |

ద్వౌ మాసౌ మత్స్యమాంసేన త్రీన్మాసా& హారిణన తు. 31

ఔరభ్రేణాథ చతుర శ్మాకున్తేనాథ పఞ్చకమ్‌ | షణ్మాసాం శ్ఛాగమాం సేన తృప్యన్తి పితర స్తథా. 32

సప్తలోహస్య మాంసేన అష్టౌ వైణయజేన తు | పృషతస్య తు మాంసేన తృప్తి ర్మాసా నవైవ తు. 33

దశమాసాంస్తు తృప్యన్తి వరాహమహిషామిషైః | శశకూర్మకయోర్మాంసం మాసా నేకాదశైవతు. 34

సంవత్సరంతు గవ్యేన పయసా పాయసేన తు | రౌరవేణ తు తృప్యన్తి మాసా న్పఞ్చదశైవతు. 35

వార్ధ్రాణసస్య మాంసేన తృప్తి ర్ధ్వాదశవార్షికీ | కాలశాకేనవా೭೭నన్త్యం ఖడ్గమాంసేన చైవతు. 36

యత్కించి న్మధునా మిశ్రం గోక్షీరఘృతపాయసమ్‌ | దత్తమక్షయ మిత్యాహుః పితరః పూర్వదేవతాః. 37

శ్రాద్ధే అభిశ్రవణాదివిధిః.

స్వాధ్యాయం శ్రావయే త్పిత్ర్యం పురాణాన్య ఖిలాని చ | బ్రమ్మవిష్ణ్వర్కరుద్రాణాం స్తవాని వివిధానిచ.

ఇన్ద్రాగ్నిసోమసూక్తాని పావమానాని శక్తితః | బృహద్రథన్తరం తద్వ జ్జ్యేష్ఠసామ సరౌహిణమ్‌. 39

తథైవ శాన్తికాధ్యాయం మహాబ్రాహ్మణమేవచ | మణ్డలబ్రాహ్మణం తద్వ త్ర్పీతికారిచ యత్పునః. 40

పితౄణా మాత్మనశ్చపి తత్సర్వం సముదీరయేత్‌ |

పితృ దేవతలను ఉద్దేశించి భోక్తలచే భుజింపజేయు అన్నము శుచియై రుచికల మంచి ఆహారమునకు ఉండవలసిన అన్ని గుణములును కలిగి ఉండవలెను. నానా విధములగు భక్ష్యములతో చేరి ఉండవలెను. పప్పు ఆకు కూరలు కాయ గూరలు ఉండవలెను. పదార్థములన్నియు చాల రుచికలవై ఉండవలెను. ఆవు పాలు ఆవు నేయి శర్కర ఉండవలెను. ఇటువంటి అన్నమును మాంసమును పితరులకు తృప్తి కలిగించును. అని సాక్షాత్‌ విష్నువే చెప్పెను. మాంసములలో మత్స్య మాంసము రెండు మాసముల పాటు లేడి మాంసము మూడు మాసములపాటు పొట్టెలు మాంసము నాలుగు మాసముల వరకు పాలపిట్ట మాంసము ఐదు మాసముల వరకు మేక మాంసము ఆరు మాసముల వరకు ఎర్ర మేక మాంసము ఏడు మాసముల వరకు ఇఱ్ఱి మాంసము ఎనిమిది మాసముల వరకు తెల్లని మచ్చలు గల ఇఱ్ఱి మాంసము తొమ్మిది మాసముల వరకు అడవి పంది-అడవి దున్న -మాంసములు పది మాసముల వరకు తాబేటి మాంసములు పదు నొకండు మాసముల వరకు ఆవు పాలతో చేసిన పాయసము సంవత్సరము వరకు రురు మృగపు మాంసము పదునైదు మాసముల వరకు పోడవు చెవులు గల అడవి మేక మాంసము పండ్రెండు సంవత్సరముల వరకు ఖడ్గమృగపు మాంసము కాని బలుసాకు కూరగాని అనంతకాలము వరకు పితరులకు తృప్తి కలిగించును. కాని ఆవు పాలతో వండి తేనె కలిపి ఆవు నేతితో సంస్కరించిన పాయసము పితృదేవతలనుద్దేశించి పెట్టినచో అక్షయమై యుండును. అని పితృ దేవతలే స్వయముగా చెప్పిరి. (దీనిని బట్టి శ్రాద్ధములయందు ఈ చెప్పిన విధమగు పాయసముతో భోక్తలను భుజింపజేయుట సర్వోత్తమమని తేలుచున్నది.)

భోక్తలు భుజించు సమయమున వేదము నుండి పితృదేవతా విషయమును ప్రతిపాదించు అనువాకములను మంత్రములను సమ స్తములగు పురాణములను బ్రహ్మ విష్ణు సూర్య రుద్రుల వివిధ స్తోత్రములను ఇంద్రుడు అగ్ని సోముడు దేవతలుగా గల సూక్తములను పవమాన సూక్తములను బృమద్రథంతరము రౌహిణము జ్యేష్ఠము అనబడు సామవేద భాగములను శాంతికాధ్యాయము (వేదమునందలి భాగము)ను మహాబాహ్మణము మండల బ్రాహ్మణము అను వేద భాగములను పఠించుచు వారికి వినిపించుచుండవలెను. ఇంతేకాదు. తనకును పితరులకును ఏయే స్తోత్రములు పురాణాదులు వేదభాగములు మొదలైనవి ప్రీతికరములో అవి ఏవై నను పఠించి వినిపించవలెను. (దీనినే అభిశ్రవణము అందురు.)

భుక్తవత్సు తతస్తేషు భోజనోపాన్తికే నృప. 41

సార్వవర్ణిక మన్నాద్యం కనీయాంసావధారణాత్‌ | సముత్సృజే ద్భుక్తవతా మగ్రతో వికిరే ద్భువి. 42

అగ్నిదగ్ధాస్తు యే జీవా యేప్యదగ్ధాః కులే మమ| భూమౌదత్తేన తృప్యన్తు తృప్తా యాన్తు పరాం గతిమ్‌.

యేషాం న మాతా న పితా న బన్థు ర్న గోత్రశుద్ధి ర్నతథాగతేషు |

తత్‌తృప్తయేన్నం భువి ద త్త మేత త్ప్రయాన్తు లోకాయ సుఖాయ తద్వత్‌. 44

అసంస్కృతప్రమీతానాం త్యాగినాం కులయోషితామ్‌ | ఉచ్ఛిష్టభాగధేయస్య దర్భేషు వికిరేచ్చయః. 45

తృప్తాన్జాత్వోదకం దద్యా త్సకృ ద్విప్రకరే తదా | ఉపలిప్తే మహీపృష్ఠే గోశకృన్మూత్రవారిణా. 46

నిధాయ దర్భా న్విధివ ద్దక్షిణాగ్రా న్ప్రయత్నతః | సర్వవర్ణేన చాన్నేన పిణ్డాంస్తు పితృయజ్ఞవత్‌. 47

అవనేజనపూర్ణంతు నామగోత్రేణ మానవః | గన్ధధూపాదికం దద్యా త్కృత్వా ప్రత్యవనేజనమ్‌. 48

కృత్వాపసవ్యం సవ్యేన ప్రణిపత్య ప్రదక్షిణమ్‌ | పిత్ర్య మానీయ తత్కార్యం విధివ ద్దర్భపాణినా. 49

దీపప్రజ్వలనం తద్వ త్కుర్యా త్పుష్పార్చనం బుధః| అథాచాన్తేషు చాచమ్య దద్యాదాప స్సకృత్సకృత్‌.

తథా పుష్పాక్షతః పశ్చా దక్షయ్యాదకమేవచ | సతతం నామగోత్రేణ దద్యా చ్ఛక్త్యా చ దక్షిణామ్‌. 51

గోభూహిరణ్యవాసాంసి భవ్యాని శయనాని చ | దద్యాద్యదిష్టం విప్రాణా మాత్మనః పితురేవచ. 52

విత్తశాఠ్యేన రహితః పితృభ్యః ప్రీతి మాహరేత్‌ | తత స్స్వధావాచనికం విశ్వేదేవేష్వథోదకమ్‌. 53

దత్వాశీః ప్రతిగృహ్ణీయా ద్ద్విజేభ్వః ప్రాఙ్ముఖో బుధః | ప్రీతా నః పితర స్సన్తు సన్త్విత్యుక్తః పునర్ద్విజైః.

గోత్రం తథా వర్ధతాం న స్తథేత్యు క్తశ్చ తైః పునః | దాతారో నోభివర్ధన్తా మితిచైవ ముదీరయ&. 55

ఏతాస్సత్యాశిషస్సన్తు సన్త్విత్యుక్తశ్చ తైః పునః | స్వస్తివాచనికం కుర్యా త్పిణ్డా నుద్ధృత్య భక్తితః. 56

ఉచ్చేషణంతు తత్తిష్ఠే ద్యావ ద్విప్రా విసర్జితాః | తతో గృహబలి కుర్యా దితి ధర్మో వ్యవస్థితిః. 57

ఉచ్ఛేషణం భూమిగత మజిహ్మస్యాశఠస్యచ | దాసవర్గస్య తత్పిత్ర్యం భాగధేయం ప్రచక్షతే. 58

పితృభి ర్నిర్మితం పూర్వ మేత దాప్యాయనం తదా | అపుత్త్రణాం సపుత్త్రాణాం స్త్రీణామసి నరాధివ. 59

తత్రస్థా నగ్రతఃస్థిత్వా పరిగృహ్యోదపాత్రకమ్‌ | వాజేవాజే ఇతి జప న్కు శాగ్రేణ విసర్జయేత్‌. 60

బహిఃప్రదక్షిణం కుర్యా త్పాదా న్త్స్పృష్ట్వా త్వనువ్రజేత్‌ | బన్ధువర్గేణ సహితః పుత్త్రభార్యాసమన్వితః. 61

నివృత్య ప్రణిపత్యాథ ప్రపూజ్యాగ్నిం సమన్త్రవత్‌ | వైశ్వదేవం ప్రకుర్వీత నైత్యకం బలిమోవచ. 62

తతస్తు వైశ్వదేవాన్తే సగోత్రసుతబాన్ధవః | భుంజీతాతిధిసంయుక్త స్సర్వం పితృనిషేవితమ్‌. 63

ఏతచ్చానుపనీతోపి కుర్యా త్సర్వేషు పర్వసు | శ్రాద్ధం సాధారణం నామ సర్వకామఫలప్రదమ్‌. 64

భార్యావిరహితోప్యేత త్ర్పవాసస్థోపి శక్తిమా& | శూద్రోప్యమన్త్రవత్కుర్యా దనేన విధినా బుధః. 65

ఇట్లు భోక్తలు భుజించిన తరువాత ఆ భోజన సమీపమున భోజనపు ఆకులలో (పాత్రలలో) మిగిలిన అన్నము మొదలగు అన్ని పదార్థముల నుండియు చాల కొంచెము కొంచెము అంశమును ఎత్తి తీసికొని భోక్తల ముందు భాగమున నేలపై వెదజల్లినట్లు వేసి ఉచ్ఛిష్ట భాక్కులకొరకై దానిని విడువవలెను. వికిర పిండమును అక్కడ ఉంచవలెను. ఉంచుచు ఈ అర్థమును ఇచ్చు మంత్రమును చెప్పవలెను. ''నా వంశమున పూర్వులలో ఎవరైన అగ్నిచే దహింప బడినవారు గాని (మరణానంతరము) అగ్నిచే దహనసంస్కారము పొందనివారు గాని తల్లిదండ్రులు బంధువుల గోత్ర శుద్ధి లేనివారు గాని ఎవరైన నున్నచో వారును-కుల స్త్రీలై యుండియు ఎవరును పట్టించుకొనకపోవుటచే మరణించిన తరువాత ఏ (పైతృక) సంస్కారములను పొందని స్త్రీలెవరైన నున్నచో వారును నేను భూమిపై వేసిన ఈ వికిరాన్నముతో తృప్తి చెంది ఉత్తమగతిని పొందుదురు గాక !''

భోక్తలు తృప్తిగా భుజించినారని తెలిసికొనిన తరువాత వారి చేతులందు ఒక మారుగా మాత్రమే నీరు (ఉత్తరాపోశనమునకై) వేయవలెను. తరువాత గోమూత్ర గోమయములతో అలికిన నేలపై దక్షణపు కొనలుగా దర్భలను పరచవలెను. వానిపై అన్ని పదార్థములతో కలిపి చేసిన పిండములను పితరుల నామగోత్రములతో అవనేజన పూర్వక మూగా (నీటితోను నేతితోను తడిపి శుద్ధి చేసి) ఉంచవలయును. అపసవ్యముతో పిండములను దర్భలపై ఉంచవలెను. సవ్యముగా చేసికొని వాటిని ప్రదక్షిణించి నమస్కరించవలెను. ఈ పిండములు ఆయా పితరులకు చెందుగాక అని మంత్రమును చెప్పవలెను. తరు వాత దర్భలను చేత ఉంచుకొని యథావిధిగా పిండములకు ధూపదీవ పుష్ప నైవేద్యములతో అర్చన చేయవలెను.

పిమ్మట (భోక్తలు పాత్రల దగ్గర నుంచి లేచి కాలుచేతులు కడుగుకొని) ఆచమనము చేయుదురు. కర్తయు ఆచమనము చేయవలెను. అపుడు వారికి ఒక్కొక్కమారు మాత్రమే హస్తముపై నీరు వేయవలెను. పూవులను అక్షతలను అక్షయ్యోదకమును వారి చేతులయందు వదలవలెను. తన గోత్ర నామములను చెప్పుచు (ఈ గోత్రమున పుట్టి ఈ నామము గల నేను ఇచ్చుచున్నాను అనుచు) తన శ క్తికొలది తనకును ఆ బ్రాహ్మణులకును తన పితరులకును ప్రీతికరమైనవి-గోవు-భూమి-బంగారము-వస్త్రములు-మంచి పడకలు-ఏవైనను దక్షిణగా ఈయవలెను. తన శ క్తికి తగినట్లు ధన లోపము చేయక దక్షిణలనీయవలెను. ఇచ్చినచో పితరులకు తృప్తి కలుగును. కనుక ఆ విధముగా చేసి పితృదేవతలను తృప్తి పరచవలయును.

తరువాత పితృదేవతా స్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర స్వధావాచనికమును ('స్వధోచ్యతాం' ఇత్యాది మంత్రమును పఠించుట) విశ్వేదేవస్థానమున భుజించిన బ్రామ్మణుల దగ్గర ఉదక దానమును జరుపవలెను. తరువాత సంప్రదాయమును ఎరిగి కర్త తూర్పు ముఖముగ కూర్చుండి వారి నుండి ఆశీస్సుల గ్రహింపవలెను. 'పితృదేవతలు మా యందు ప్రీతికల వారగుదురు గాక!' అని కర్త అనగా 'అగుదురు గాక!' అని బ్రాహ్మణులు అందురు. 'అస్మద్గో త్రం వర్ధతామ్‌' 'మా గోత్రము వర్ధిల్లుగాక!' అని కర్త అనగా 'అట్లే అగుగాక!' అని భోక్తలు అందురు. లోగడ చెప్పినట్లు 'మాకు అడుగకయే ఇచ్చు దాతలు ఉందురుగాక!' ఇత్యాది మంత్రమును కర్త చెప్పవలెను. 'ఈ ఆశీస్సులు సత్యములు అగుగాక!' అని భోక్తలు అందురు. పిమ్మట భక్తితో పిండములను ఎత్తిఉంచి స్వస్తి వాచనికము జరుపవలెను.

భోక్తలగు బ్రాహ్మణులు ఇంటియందు ఉన్నంతవరకును ఎంగిళ్లు తీయరాదు. తరువాత తీయవలెను. అట్లు వారు తినిన ఎంగిళ్లు తీసి పిమ్మట గృహబలిని (వైశ్వదేవమును) చేయవలెను. అని ఇట్లు ధర్మ వ్యవస్థ చేయబడియున్నది.

భోక్తలు భుజించునపుడు భూమిపై పడిన ఉచ్ఛేషణము (మిగిలిన పదార్థము) శ్రాద్ధకర్త ఇంటిలో ఊడిగము చేయువారిలో కపటము కొంటెతనములేని సేవకులకు పితృశేషముగా తినుటకు ఈయవలెను. అని పెద్దలు చెప్పుచున్నారు.

ఈ చెప్పిన విధముగా జరిపిన శ్రాద్ధకర్త వంశములోను బంధుమిత్రాది జనములోను పుత్త్రులున్నవారికిని లేని వారికి అట్టి స్త్రీలకును (పూర్వము మరణించియున్న వారికి) అందరకును తృప్తి కలిగించును. అని పూర్వము పితృదేవతా గణమువారు వ్యవస్థ చేసియున్నారు.

(ఇక ఈ శ్రాద్ధప్రక్రియ అంతము ముగిసిన తరువాత భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పుట ఎట్లనిన) శ్రాద్ధక ర్త భోక్తలు భుజించిన ప్రదేశమున శ్రాద్ధము జరిపిన ప్రదేశమున నిలువబడి చేత ఉదకపాత్రమును పట్టుకొని యుండి 'వాజే వాజే' ఈ మొదలగు మంత్రమును చెప్పుచు దక్భకొనతో వారిని తాకుచు వారిని విసర్జించ (వీడ్కోలుచెప్ప) వలెను. వారిని ప్రదక్షిణించి వారి పాదములను స్పృశించవలెను. వారు బయలుదేరి పోవుచుండ వారివెంట కొంతదూరము పుత్ర భార్యా బంధువర్గముతోకూడ పోవలెను. తరువాత వారికొకమారు నమస్కరించి వెనుకకు మరలివచ్చి అగ్నిని పూజించి వైశ్వదేవమును నిత్యబలిని జరుపవలెను. తరువాత పితృశేషమును శ్రాద్థకర్త తన సగోత్రులతో సుతులతో బాంధువులతో అతిథులతోపాటుగ తానును భుజించవలెను.

ఈ విధమగు శ్రాద్థము అన్ని పర్వములయందును(ఈపైని చెప్పిన వానిలో ఏ పర్వమునందైనను) జరుపవలెను. జరుపవచ్చును. దీనిని ఉపనయనము కానివాడైనను భార్యలేనివాడైనను విదేశమునందు ఉన్న వాడైనను శక్తి యున్నచో (తనశక్తికి తగినట్లు) చేయవలెను. శూద్రుడైనను మంత్రహీనముగా ఇదే ప్రక్రియతో శ్రాద్థము జరుపవలెను. ఇది సాథారణ శ్రాద్థవిధానము.

అభ్యుదయిక శ్రాద్థనిర్ణయః.

తృతీయ మాభ్యుదయికం వృద్థిశ్రాద్థం తదుచ్యతే | ఉత్సవానన్దసమ్భారే యజ్ఞోద్వాహాదిమజ్గళే.66

మాతరః ప్రథమం పూజ్యాః పితర స్తదనన్తరమ్‌ | తతో మాతామహా రాజ న్విశ్వేదేవా స్తథైవచ.67

ప్రదక్షిణోపచారేణ దధ్యక్షతఫ లోదకైః | ప్రాజ్ముఖో నిర్వపేత్పిణ్డా న్దూర్వయాచ కుశైర్వుతా9.68

సమ్మన్నమి త్యభ్యుదయే ప్రీయతా మిత్యుదీరయేత్‌ | యుగ్మా ద్విజాతయః పూజ్యా వస్త్రకా ర్తస్వరాదిభిః.69

తిలార్థేతు యవైః కార్యం నాన్దీశబ్దాను పూర్వకమ్‌ | మజ్గళ్యాన్యపి సర్వాణి పారయే ద్ద్విజపుజ్గవాన్‌.70

ఏవంశూద్రొపి సామాన్యం వృద్థిశ్రాద్థేపి సర్వదా | నమస్కారాది మన్త్రేణ కుర్వాన్మన్త్రం వినా బుధః.71

దానప్రదానం శూద్రస్య ఇత్యాహ భగవాన్ప్రభుః | దానేన సర్వకామాప్తి స్తస్య స ఞ్జాయతే యతః.72

ఇతి శ్రీమత్స్యపురాణ మత్స్యమనుసంవాదే శ్రాద్థకల్పే సాధారణశ్రాద్థాదివిధిర్నామ సప్తదశోధ్యాయః.

మూడవ నైమిత్తిక శ్రాద్థమున కు అభ్యుదయికము అనిపేరు. దనికే వృద్థి (శుభ) శ్రాద్థమనియు పేరు గలదు. ఉత్సవములు మొదలగు ఆనందకరమగు కార్యములు జరుపునపుడును యజ్ఞములు వివాహములు మొదలగు శుభ కార్యముల సమయములందును ముందుగా ఈ ఆభ్యుదయిక శ్రాద్దమును జరుపవలయును.

దీనియందు మాతృపితామహీప్రపితామహ్యాది స్త్రీలను మొదట పూజించవలెను. పితృ పితామహాదులను తరువాత పూజించవలెను. తరువాత మాతామహుడు మొదలగు వారిని పిమ్మట విశ్వేదేవులను పూజించవలెను. ప్రదక్షిణముగా [నవ్యముగా] ఆయా ఉపచారములు జరుపవలెను. [ ఈ వృద్థి శ్రాద్థమునందు అపసవ్యము చేసికొనకూడదు]. పెరుగు అక్షతలు ఫలములు ఉదకము మొదలగునవి విని యోగించవలెను. [ తిలలు కూడదు]. తూర్పు మొగముతో పిండములను నిర్వపణము చేయవలెను. [దక్షిణముఖము కూడదు]. 'సంపన్నం' అనియు 'ప్రీయతాం' అనియు మాత్రము చెప్పవలెను. [స్వధాఅని చెప్పరాదు]. సరి సంఖ్యలోనే [బేసి సంఖ్యకూడదు]. బ్రాహ్మణులను అర్చించ [భుజింపజేయ] వలెను. వస్త్రములు బంగారు మొదలగునవి వారికిచ్చుటకును కర్మానుష్ఠానములోను వినియోగించవలెను. [వెండి పాత్రలు-దర్భలు కూడదు.] తిలలకు మారుగా యవలను ఉపయోగించుచు నాందీ శ బ్దముతో ఈకార్యమును జరుపవలెను. శుభమునకును సంబంధించిన మంత్రములను స్తోత్రములను పఠించి బ్రాహ్మణులకు వినిపింపవలెను.[పిత్ర్యములగు వేదభాగములు కూడదు.]ఇది ద్విజులు వృద్ధి-నాందీ-శ్రాద్ధము-జరుపవలసిన విధానము. శూద్రులుకూడ పైవారివలెనే నమస్కారపూర్వక మయిన మంత్రమలతోను ఇతర మంత్రములేవియు లేకుండగను ఈ వృద్ధిశ్రాద్దము జరుపవలెను. కాని శూద్రులు భోజనాదికము లేకుండ ఆయా పదార్థములను దానము చేయుటతోనే జరుపవలెనని భగవానుడు ప్రభువు అగు నారాయణుడు చెప్పెను. ఏలయన శూద్రునకు దానమాత్రముతోనే అన్ని కోరికలు ఫలించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్థకల్పమున సాధారణాభ్యుదయిక శ్రాద్థ విధా న కథనమును సప్తదశాధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters