Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్‌త్రింశదుత్తరశతతమో7ధ్యాయః

త్రిపురదాహే తారకాక్షవధః.

సూతః : తాన్నిహన్తుం సమఘవా నసురా నమరేశ్వరః | లోకపాలా యయుస్సర్వే తథైవ గణపాశ్చయే. 1

ఈశ్వరేణోదితా స్సర్వే ఉత్పేతుశ్చామ్బరేతదా | ఖగతాశ్చ విరేజుస్తే పక్షవన్త ఇవాచలాః. 2

ప్రయయు స్తత్పురం హన్తుం శరీరం వ్యాధయో యథా | శ##ఙ్ఖైః పటహనిర్ఘోషై ర్మృదఙ్గైః పణవైరపి| 3

నాదయన్తః పురే దేవా దృష్టా స్త్రిపురవాసిభిః | హరః ప్రాప్త ఇతీవోక్తా బలినస్తే మహాసురాః. 4

ఆజగ్ముః పరమం క్షోభ మత్యయేష్వివ సాగరాః | సురతూర్యరవం శ్రుత్వా దానవా భీమవిక్రమాః. 5

వినేదు ర్నదయన్తోహి నానావాద్యా న్యనేకశః | తూర్యాపూరితవీర్యాస్తే పరస్పరకృతాగసః. 6

పూర్వదేవాశ్చ దేవాశ్చ సూదయన్తః పరస్పరమ్‌ | ఆకాశేపి సమప్రఖ్యే తేషాం దేహనికృన్తనమ్‌. 7

ప్రవృద్ధం యుద్ధమతులం ప్రహారకృతనిస్వనమ్‌ | ప్రతపన్త ఇవాదిత్యాః ప్రజ్వలన్త ఇవాగ్నయః. 8

శ్వసన్తఇవ నాగేన్ద్రా భ్రమన్తఇవ పక్షిణః | జృమ్భన్తఇవ శార్దూలా గర్జన్తఇవ తోయదాః. 9

గిరీన్ద్రాఇవ కమ్పన్తో దానవాశ్చ మహాబలాః | వివృద్ధోర్మితరఙ్గౌఘక్షుభ్యన్త ఇవ సాగరాః. 10

ప్రమథాశ్ఛ మహాశూరా దానవాశ్చ మమాబలాః | యుయుధు ర్నిశ్చలా భూత్వా వజ్రాఇవ మహాబలాః. 11

కార్ముకానాం వికృష్టానాం బభూవు ర్దారుణారవాః | కల్పానుగానాం మేఘానాం యథా వియతి వాయునా. 12

*అయంమే శరణంయాతః కుప్యసిత్వం మృతోహ్యసి | ప్రవారాశు స్థిరోభూత్వా ఏహి దర్శయ పౌరుషమ్‌.

గృహాణ ఛిన్ధిభిన్ధీతి ఖాద మారయ దారయ | ఇత్యూచురుచ్చై రన్యోన్యం ప్రయము ర్యమసాదనమ్‌. 14

నూట ముప్పది యారవ అధ్యాయము.

తారకాక్షవధము.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ అసురులను చంపుటకై శివుని ఆదేశమున అమరేశ్వరుడగు

___________________________________________

* ఆహుశ్చాభయ మాభైషీః క్షయోస్య నిభృతోహ్యసి.

ఇంద్రుడును లోకపాలురును ప్రమథ గణాధిపతులును బయలుదేరి వెళ్ళిరి. ఈశ్వరాజ్ఞానుసారముగా వారందరును ఆకాశమునకు ఎగిరి అచట సంచరించుచు ఱక్కలుగల పర్వతముల వలె ప్రకాశించుచుండిరి. శరీరమును నశింపజేయ బోవుచున్న వ్యాధులవలె త్రిపుర దుర్గమును నశింపజేయదలచిపోవుచు వారు శంఖములను పటహము (తప్పెట)లను మృదంగములను పణవములను మ్రోగించసాగిరి. ఇట్లు వాద్యములు మ్రోగించుచు దుర్గమున కనబడిన ఆ దేవసేనను చూచి త్రిపురవాసులు బలశాలురగు మయాది మహాసురులతో హరుడే దుర్గమునకు వచ్చెనని తోచుచున్నదని చెప్పిరి. దానవులు తామెంత భీమ విక్రములయ్యును దేవతల వాద్య ధ్వనులను విని ప్రళయ కాలమునందలి మహా సాగరములవలె కలవరమందసాగిరి. వారును నానా వాద్యములను అనేక విధములయిన వాటిని మ్రోగింపసాగిరి. ఇరుపక్షముల వారును తమతమ వాద్యములను మ్రోయించుటతోపాటు తమతమ వీర్యములను ప్రశంసించుకొనుచు ఒకరికి మరియొకరు శస్త్రాస్త్ర ప్రయోగములతో ఆపకారములు చేసికొనసాగిరి. దేవదానపులు వీరిని వారును వారిని వీరును చంపుకొనుచుండిరి. సమతలమయి ప్రకాశించుచు నిరాలంబమగు ఆకాశమునందును వారి పరస్పర ప్రహారముల ధ్వనులతో పరస్పర దేహావయవ-దేహ-ఖండనములతో సాటిలేని యుద్ధము సాగుచుండెను. ఇరుపక్షములవారును యుద్ధ విజృంభనావేశ వశమున మిగుల వేడిమితో వెలుగు సూర్యులవలె ప్రజ్వరిల్లు అగ్నులవలె బుసకొట్టు నాగములవలె ఆకాశమున భ్రమించు పక్షులవలె విజృంభించు వ్యాఘ్రములవలె ఉరిమెడి మేఘములవలె కంపిల్లు గిరీంద్రములవలె క్షణక్షణమును వృద్ధినందుచున్న తరంగశ్రేణులతో కూడి క్షోభిల్లు సాగరములవలె మహాబల (దార్ఢ్య) సంపన్నములగు వజ్రములవలె నిశ్చలులగుచు మహాశూరులగు ప్రమథులును మహాబలులగు దానవులును నిశ్చలులయి యుద్ధము చేయసాగిరి. గాఢముగా వారాకర్షించుచుండిన ధనువుల టంకారములు ప్రళయ కాలానుసారి మేఘములు ప్రళయ వాయుప్రేరితములగుచు చేయుదారుణ రవములను పోలియుండెను. 'వీడు నన్ను శరణు చొచ్చినాడు.' 'నాపై నీవు కోపించువాడవా?' 'ఇదిగో! చచ్చితివిరా!' 'స్థిరముగా నిలువుము.' 'నన్ను కొట్టగలిగినచో శీఘ్రముగా కొట్టుము.' 'రమ్ము; నీ పౌరుషమును చూపుము.' 'పట్టుకొనుము.' 'నరకుము.' 'చీల్చుము.' 'తినుము.' 'చంపుము.' 'బ్రద్దలు చేయుము.' ఇట్లు పరస్పరము బిగ్గరగా అనుకొనుచు పోరుచు యమలోకమునకు పోవుచుండిరి.

ఖడ్గాపవర్జితాః కేచి త్కేచిచ్ఛిన్నాః పరశ్వథైః | కేచి న్ముద్గరభిన్నాఙ్గాః కేచి ద్బాహుహతాశ్చతే. 15

పట్టసై ర్నోదితాః కేచి త్కేచి చ్ఛూలవిదారితాః | దానవా శ్శరపుష్పాభా స్సబాణాః పర్వతాఇవ. 16

నిపతన్త్యర్ణవజలే భీమనక్రతిమిఙ్గిలే | వ్యసుభి శ్శరవిద్ధాఙ్గైః పతమానై స్సురేతరైః. 17

సమ్బభూవార్ణవే శబ్ద స్సజలామ్బుదనిస్వనః | తేనశ##బ్దేన చోద్విగ్నా నక్రా స్తిమితిమిఙ్గిలాః. 18

మత్తా లోహితగన్ధేన క్షోభయన్తో మహార్ణవమ్‌ | పరస్పరేణ కలహం కుర్వాణా భీమమూర్తయః. 19

వమన్తో భక్షయన్తశ్చ దానవానాంచ లోహితమ్‌ | సరథా న్త్సాయుధా న్త్సాశ్వా న్త్సవస్త్రాభరణామ్బరా&. 20

అగ్రసం స్తిమయో దైత్యా& ద్రావయన్తో జలేచరాః | యుద్ధం యథాసురాణాంచ ప్రమథానాంచ వర్తతే. 21

అమ్బరేచ తథాయుద్ధం యోధయన్తో జలేచరాః |

యథా భ్రమన్తి ప్రమథా స్సదైత్యా స్తథాభ్రమన్తే తిమయ స్పనక్రాః. 22

తథైవ ఛిన్ధన్తి పరస్పరస్తు తథైవక్రన్దన్తిచభిన్నదేహాః |

వ్రణాననైరఙ్గరసం స్రవద్భి స్సురాసురై ర్నక్రతిమిఙ్గిలైశ్చ. 23

కృతోముహూర్తేన సముద్రదేశ స్సరక్తతోయై స్సముదీర్ణతోయః |

సితం మహామ్భోధరపర్వతాభం ద్వారం మహాన్తం త్రిపురస్యశక్రః. 24

నిపీడ్యతస్థౌ మహతా బలేన యుక్తస్సురేశో మహతా జవేన |

తదన్తరేవై తనుజో హరస్య బాలార్కజామ్బూనదతుల్యవర్ణః. 25

స్కన్దః పురద్వార మథో రురోధ బాలో7స్తశృఙ్గం ప్రపతన్నివార్కః |

యమశ్చ విత్తాధిపతి స్సదేవై స్సో7పామ్పతిః పాశవరాయుధశ్చ. 26

దేవారిణ స్తస్య పురస్య ద్వార మాపశ్చిమం పశ్చిమతో నిరుద్ధమ్‌ |

తస్యాపి రుద్ర స్తపనాయుతాభ స్సహానుగై ర్దేవరథేన దేవః. 27

తన్మన్దిరద్వార మరేఃపురస్య రుద్ధ్వా7వతస్థే భగవాం స్త్రిణత్రః |

తుఙ్గాని వేశ్మాని సగోపురాణి సువర్ణకైలాసశశిప్రభాణి. 28

ప్రహ్లాదరూపాః ప్రమథావరుద్ధా జ్యోతీంషి మేఘాఇవ సాశ్మవర్షాః |

ఉత్పాట్య చోత్పాట్య గృహాని తేషాం సశైలమాలాసనవేదికాని. 29

ప్రక్షిప్యచోతిక్షప్య సముద్రమధ్యే కాలామ్బుదాభాః ప్రమథా వినేదుః |

రక్తాని చాశేషవనై ర్యుతాని సాశోకఖణ్డాని సకోకిలాని. 30

* గృహాణ హేనాధ పితస్సుతేతి భ్రాతేతి కాన్తేతి ప్రియేతి చాపి |

ఉత్పాట్యమానేషు గృహేషు నార్యోహ్యనార్యశబ్దా బహుధా ప్రచుక్రుశుః. 31

కొందరు ఖడ్గములతో ముక్కలయిరి. మరికొందరు గండ్రగొడ్డంద్రతో తెగిరి. కొందరు ముద్గరములతో ఖండితులయిరి. మరికొందరు భుజ ప్రహారములతోనే నలిగిచచ్చిరి. కొందరు పట్టసములతో నొచ్చిరి. కొందరు శూలములతో చీలికలయిరి. దానవులు శరములనెడు పూలతో ప్రకాశించుచు బాణములు గ్రుచ్చుకొనిన కొండలవలెనయి భయంకరములగు నక్రములతో తిమింగిలములతో నిండిన సముద్ర జలమున పడుచుండిరి. బాణముల దెబ్బలుతినని ప్రాణములుపోయి పడుచుండిన రాక్షసులతో సముద్రమునుండి సజల మేఘముల ఉరుములవంటి ధ్వనులు ఉప్పతిల్లెను. నక్రములు(ఒక విధమగు సముద్ర జంతువులు)ను తిమింగిలములును ఆ ధ్వనులకు భయపడియు ఆ రాక్షసుల రక్తపు వాసనకు మత్తెక్కియు సముద్రజలమును క్షోభింపజేయుచుండెను. అవి భయంకర రూపములయి పరస్పరము కలహించుచు రాక్షస రక్తమును భక్షించు(త్రాపు)చు క్రక్కుచునుండెను. సముద్రమునందలి తిమింగిలములు సముద్రమున పడిన దానవులను వారి రథములను ఆయుధములను అశ్వములను ఆభరణములను వస్త్రములను కూడ మ్రింగివేయుచు తమకు ఆపనిలో అడ్డము తగిలిన వేరు తిమి తిమింగిలములను తరిమివేయుచుండెను. అంబరము (ఆకాశము)నందు ప్రమథులనును దానవులను పోరుచున్నట్లే అంబరము (జలము)నందు జలచర జంతువులును పోరుచుండెను. యుద్ద క్రమమున ప్రమధులును దైత్యులును గిరగిర తిరుగుచున్నట్లే సముద్రమున జలచరములును తిరుగుచుండెను. అట్లే పరస్పరము నరకుకొనుచుండెను. అట్లే దేహములు నరకుకొని చీల్చుకొని అరచుచుండెను. తమ గాయపు నోళ్ళ నుండి రక్తమును స్రవించుచుండిన నక్ర తిమింగిలాది మహాజల జంతువులతోను సురాసురులతోను ఒక ముహూర్త కాలములోనే రక్తము కలిసిన నీటితో సముద్రమంతయు వృద్ధి పొందినదయ్యెను.

ఇది ఇట్లుండ సురేశ్వరుడగు శక్రుడు (ఇంద్రుడు) మహాసైన్యమును తీసికొనిపోయి తెల్లనిదై మహామేఘము వలెను మహాపర్వతమువలెను ఉన్నతమయి కాంతివంతమయిన త్రిపురదుర్గ మహాద్వారమును మహావేగముతో ముట్టడి చేసి అడ్డగించి నిలువబడెను. ఆ సమయమునందే బాల సూర్యునివలెను కాచిన బంగారువలెను ప్రకాశించును హరపుత్త్రుడగు స్కందుడు (కుమారస్వామి) బాలుడయ్యును మహాతేజశ్శాలియగు సూర్యుడు అస్తపర్వత శిఖరమును ముట్టడించినట్లు మరియొక వైపునుండి ముట్టడించెను. యముడును కుబేరుడును పాశ##శ్రేష్ఠము ఆయుధముగా ధరించిన వరుణుడును దేవశ్రేష్ఠులననేకులను వెంటగొని త్రిపురదుర్గపు పశ్చిమ ద్వారమును ముట్టడించిరి. భగవానుడు త్రినేత్రుడు

___________________________________________

* గృహాణహేతాత

మహాదేవుడునగు రుద్రుడును దేవనిర్మితమగు దివ్యరథమునెక్కి తన యనుచరులతో కూడ పదివేలమంది సూర్యుల తేజమువంటి తేజముతో వెలుగుచు పోయి శత్రుమందిరమగు త్రిపురదుర్గపు ద్వారమును ముట్టడించి నిలిచెను.

ఆనందముతో నిండిన రూపములతో ప్రమథులును గోపురములతో కూడినవయి బంగారు కొండలవలె కైలాసమువలె చంద్రునివలె వెలుగొందుచున్న ఉన్నతములగు దానవ గృహములను - రాలను వర్షించుచు మేఘములు అంతరిక్షమందలి జ్యోతిర్గణములను అడ్డగించినట్లు అడ్డగించి - క్రమ్మివేసిరి. ప్రమథులు కృత్రిమములగు క్రీడా పర్వతముల మాలలతో ఆసనములతో వేదికలతో కూడిన దానవ గృహములను పెల్లగించి పెల్లగించి పైకెత్తి సముద్ర మధ్యమునకు ఎత్తిపడవేసి ప్రళయకాల మేఘములవలె గర్జించుచుండిరి. ఎర్రనై అశేషవనములను తమ చుట్టు నుండగా అశోకవనముల నడుమనున్నవై కోకిల ధ్వనులతో మనోహరమయియున్న తమ గృహములన్నియు ఇట్లు ప్రమథులు పెల్గించుచుండ దానవ స్త్రీలు-నాథా! తండ్రీ! కొడుకా! అన్నా! కాంతా! ప్రియా! వీరిని పట్టు కొనుడు! అని అరచుచు అనేక విధములగు మొరలు అరపులతో ఏడ్చుచుండిరి.

కళత్రపుత్త్రక్షయజీవనాశే తస్మిన్సురే రుద్రబలే ప్రవృత్తే |

మహాసురా మారుతతుల్యవేగా గణశ్వరాః కోపయుతా స్సమేయుః. 32

పరశ్వథై స్తత్ర శిలోపమైశ్చ త్రిశూలవజ్రోత్తమకమ్పనైశ్చ |

శరీరసద్మక్షపణం సుఘోరం యుద్ధం ప్రవృద్ధం దృఢవైరబద్ధమ్‌. 33

అన్యోన్యముద్దిశ్య నినర్దతాం చప్రధావతాం చైవ వినిఘ్నతాంచ |

శబ్దో బభూవామరదానవానాం యుగాన్తకాలేష్వివ సాగరాణామ్‌. 34

వ్రణౖరజస్రం క్షతజం వమన్తః కోపోపరక్తా బహుధా నదన్తః |

గణశ్వరాస్తే సురపుఙ్గవాశ్చ యుద్ధాయ శబ్దం మహ దుద్గిర న్తః. 35

మార్గాస్తథా లోహితకర్దమాశ్చ స్వర్ణేష్టకా స్స్ఫాటికభిన్న చిత్రాః |

కృతా ముహూర్తేన సుఖేన గన్తుం ఛిన్నోత్తమాఙ్గాంఘ్రికరాః కరాళాః. 36

కోపావృతాక్ష స్సతు తారాకాక్ష స్సాక్షాత్సదృక్షో గిరిణాచ వీరః |

తస్మి& క్షణ ద్వారవరం రరక్ష రుద్ధం హరేణాద్భుతవిక్రమేణ. 37

స తత్ర ప్రాకారగతాంశ్చ భూతా న్నాగా న్సురా న్భూతపతీంశ్చ తద్వత్‌ |

ప్రకాలయ న్స ప్రియదర్పయుక్తః పురాద్వినిష్క్రమ్య రరాస ఘోరమ్‌. 38

తతస్సదైత్యోన్న తపర్వతాభో యథాంజసా నాగవరోభిమత్తః |

స వారితో రుద్రరథం జిషృక్షు ర్యథార్ణవం పర్వణి చాతిభీమమ్‌. 39

నష్టాస్సురాస్తే గిరిశస్తు దేవ శ్చతుర్ముఖక్షగ్నిశ్చ త్రిలోచనశ్చ |

తే తారకాక్షభిగతా గతాజౌ క్షోభం యథా వాయువశా త్సముద్రాః. 40

తతో గిరీశశ్చ పితామహశ్చ క్షోక్షుభ్యమాణా స్సరథోమ్బరస్థః |

త్రిభేదసన్ధీషు బలాభిపన్నః కూజన్నినాదంచ కరోతి ఘోరమ్‌. 41

ఏకంతు ఋగ్వేదతురఙ్గమస్య పృష్ఠే పదం న్యస్య వృషన్య చైకమ్‌ |

తస్థౌ భవస్సోద్యతచాపబాణః పురస్య తత్సఙ్గమ మీక్షమాణః. 42

తదా భవపదన్యాసా ద్వేదస్య వృషభస్యచ | పేతుః స్తనాశ్చ దన్తాశ్చ పీడితస్య త్రిశూలినా. 43

తతః ప్రభృతి చాశ్వానాం స్తనా దన్తా గవాంతథా | గూఢా స్సమభవంస్తేన అదృశ్యత్వ ముపాగతాః. 44

భార్యాపుత్త్రులును గృహములును కొందర జీవితములును కూడ నశించగా ఆ త్రైపురదుర్గమున రుద్రుని ప్రమథ బలము తన ప్రవృత్తిని చూపగా (అంతట సంచరించుచుండగా) వాయు సమానవేగులై ప్రమథ గణాధిపతులును మహా సురులును పరస్పరము యుద్ధమునకు తలపడిరి. వారు దృఢవైర బంధపూర్వకముగా శిలా సమానములగు గండ్ర గొడ్డండ్రను త్రిశూలములను ఉత్తమ వజ్రాయుధములను ప్రయోగించుచు శరీరములను గృహములను నాశము చేసి కొనుచు యుద్ధము సాగించిరి. వారు పరస్పరముద్దేశించి గర్జించుచుండిరి. పరుగెత్తుచుండిరి. కొట్టుకొనుచుండిరి. ఇట్లు ఆ అమరులును దానవులును చేయుచుండిన యుద్ధముచే ఉత్పన్నమయిన శబ్దము యుగాంతకాల సముద్రఘోషము వలె భయంకరమయి వినబడుచుండెను. వారి గాయములనుండి ఎడతెగక రక్తము స్రవించుచుండెను. వారు కోప గ్రస్తులయి బహు విధుముల గర్జించుచుండిరి. యుద్ధోత్సాహవృద్ధి సూచకముగా పెద్ద పెద్ద కేకలు వేయుచు గర్జనలు చేయుచుండిరి. ఒక ముహూర్త కాలములో పురమందలి మార్గములన్నియు నెత్తుటి బురదతో నిండిపోయెను. బంగారు ఇటికలతో కట్టి స్ఫటికమణులు తాపటము చేసిన గోడలును అట్లే అయ్యెను. దేవదానవుల కాళ్ళును చేతులును శిరములును తెగిపడిన మార్గములన్నియు భయంకరములయి కనబడుచుండెను. ఆ సమయములో తారకాక్షుడు శివుడు ముట్టడించిన ద్వారమును రక్షించుచుండెను. వాని కన్నులు కోపముతో ఆవరించబడి ఉండెను. వాని దేహము సాక్షాత్తుగ పర్వతమువలె నుండెను. ఆ వీరుని విక్రమము అందరకు ఆశ్చర్యము గొలుపుచుండెను. వాడప్పుడు ప్రాకారముపైనున్న ప్రమథులను నాగులను ప్రమథనాధులను తరిమివేయుచు దర్పము ప్రకటించుచు వారివెంట పురము వెలుపలివరకు తమరుముచుపోయి భయంకరముగా ధ్వని చేసెను. మదపుటేనుగువంటివాడును పర్వతమువలె భయంకరోన్నత శరీరుడునగు ఆ తారకాక్షుడు రుద్రుని రథమును స్వాధీనము చేసికొనగోరి పర్వకాలమునందు భయంకరముగా పొంగియున్న సముద్రమును పట్టబోయినవాడువలె అయి శివునిచే వారించబడెను. ఆ తారకాక్షుని విజృంభణమునకు దేవతలు అందరును భయపడి పారిపోయిరి. మహాదేవుడగు శివుడును చతుర్ముఖుడును అగ్నియును ఆ తారకాక్షుడు తమపై చేసిన ముట్టడితో ఝంఝా మారుతముతో కల్లోలపడిన సముద్రవులవలె కలవరపడిరి. ఇట్లు పరమేశ్వరుడును బ్రహ్మయును మిగుల క్షోభమందుచుండగా ఆ రథము ఆకాశములోనికి పోయి నిలిచెను. దానికి త్రిభేదమను రథాంగము లందు బలమగు దెబ్బలు తగిలినందున అది కీచు మ్రోతలతో భయంకరముగా ధ్వని చేయసాగెను. ఇట్టి స్థితియందు పరమేశ్వరుడు తన పాదములలో నొకటి ఋగ్వేదమను అశ్వపు వీపుమీదను మరియొక పాదమును వృషభపు వీపుమీదను ఉంచి ధనువును బాణములను సిద్ధపరచుకొని పుష్యయోగము ఎపుడు వచ్చునాయని ఎదురు చూచుచుండెను. శివుని పాదముల బరువుతో ఋగ్వేదాశ్వమునకు స్తనములును వృషభమునకు (పై) దంతములును పడిపోయెను. అది మొదలుకొని అశ్వములకు స్తనములును వృషభములకు (పై) దంతములును గూఢములయి అదృశ్యములయి యుండుట జరిగినది.

నన్దికేశ్వరతారకాక్షయుద్ధమ్‌.

తారకాక్షస్తు భీమాక్షో రోషా ద్రక్తాననేక్షణః | రుద్రాన్తికే సునఙ్కుద్ధో నన్దినం కులనన్దినమ్‌. 45

పరశ్వథేన తీక్షేణన నన్దినం దానవేశ్వరః | తక్షయామాస వై తక్షా చన్దనం సరసం యథా. 46

పరశ్వథహత శ్శూరః శైలాది శ్శరభో యథా | దుద్రాన ఖడ్గం నిష్కృష్య తారకాక్షజిఘాంసయా. 47

స తేన సితధారేణ తారకాక్షం గణశ్వరః | యజ్ఞోపవీతమార్గేణ చిచ్ఛేదన ననాదచ. 48

తతస్తస్మి న్వినిహతే శఙ్ఖశబ్ద స్సభైరవః | గణశ్వరైః కృతస్తత్ర తారకాక్షే నిషూదితే. 49

ప్రమథారసితం శ్రుత్వా వాదిత్రస్వనమేవచ | మయశ్చ స్వస్య పార్శ్వస్థం విద్యున్మాలిన మబ్రవీత్‌. 50

బహువదనవతాం కిమేష శబ్దో నదతాం శ్రూయతి భిన్నసాగరాభః |

వద వచ తటిమాలి కిం కిమేత ద్గజపాలా రురుధు ర్గజాను కింవా. 51

ఇతి మయవచనాంకుశార్దితస్స న్విద్మున్మాలి రవిరివ సోంశుమాలీ |

రణశిరసి సమాగతాన్‌ సురాంస్తా& నిజగాదేద మరిన్దమోతిహర్షాత్‌. 52

యమవరుణమహేన్ద్రరుద్రవీర్య స్తవశయనే నిధిరేష తారకాక్షః |

సకలసమరశీర్షః పర్వతేన్ద్రాయుధో యస్తపతిహి ననిరస్త స్తారకాక్షో గణన్ద్రైః. 53

మృదిత ముపనిశమ్య తారకాక్షం అతిదీప్తానలభీషణాయతాక్షమ్‌ |

హృషితసకలలోకనేత్రసక్తాః ప్రమథా స్తోయముచో యథా నదన్తి. 51

ఇతి సుహృది వచో నిశమ్య తత్త్వం తటిమాలే స్సమయ స్సువర్ణమాలీ |

రణశిరసి జితాఞ్జనాచలాభో నిజగాదైనమిదం మయో వచోన్యత్‌. 55

విద్యున్మాలి న్యథాయుక్తం తత్కరిష్యామి విక్రమాత్‌ | యథా పురంచ నిర్ముక్తం భ##వే త్సరభయార్దితమ్‌. 56

విద్యున్మాలీ తతః క్రుద్ధో మయశ్చ త్రిపురేశ్వరః |

ప్రమథా న్జఘ్ను రాదిష్టా స్సహితా సై#్తర్మహాసురైః. 57

యేనయేన గతస్తంతం విద్యున్మాలీ మయశ్చసః | తేనతేన పరంశూన్యం ప్రమథైః ప్రకృతైః కృతమ్‌. 58

అథ యమవరుణమృదఙ్గశఙ్ఖఘోషైః పటహాడిండిమవాద్యకప్రఘోషైః |

సకలతలవపుశ్చ సింహనాదైః పరమభిపూజ్య తథాసురా వితస్థుః. 59

సమ్పూజ్యమానో దితిజైర్మహాత్మభి స్సహస్రరశ్మి ప్రతిమో మయో బభౌ |

అభిష్టుత స్సత్త్వరతై స్తపోధనై ర్యథాభ్రశృఙ్గాభిగతో దివాకరః. 60

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే త్రిపురదాహే దేవాసురయుద్ధే

తారకాక్షవధో నామ షట్త్రింశదుత్తరశతతమోధ్యాయః.

సహజముగనే భయంకర నేత్రుడును దానవేశ్వరుడు నగు తారకాక్షుడు రోషముతో మరింతగా మొగమును కన్నులును ఎర్రగానయి రుద్రుడు చూచుచుండగా అతని సమీపమందే ప్రమథ కుల పరమానందకరుడగు నందీశ్వరుని వడ్లంగివాడు సరసమగు (మెత్తని) చందనపు కొయ్యను చెక్కినట్లు తీక్‌ష్ణమగు గండ్రగొడ్డలితో చెక్కెను. శిలాదపుత్త్రు డగు నంది తన్నట్లు తారకాక్షుడు గండ్రగొడ్డలితో గాయపరచగా తన ఖడ్గమును ఒరనుండి పెరికి ఆ తారకాక్షుని చంపదలచి శరభమృగమువలె వాని పైకి దుమికెను. ప్రమథ గణాధిపతియగు నంది వాడియగు వాదరగల ఆ ఖడ్గముతో యజ్ఞోప వీతము ఉండు క్రమములో (ఎడమ భుజముపై నుండి కుడి డొక్క క్రిందివరకు ఏటవాలుగా) తారకాక్షుని నరకి వేసి సింహనాదము చేసెను. తారకాక్షు డిట్లు నంది చేతిలో మరణించగా ప్రమథగణ సైనికులు మహా భయంకర శంఖధ్వనులు చేసిరి. ప్రమథుల శంఖధ్వనులను దేవతల వాద్యధ్వనులను విని విద్యున్మాలితో మయుడు 'విద్యున్మాలీ! ఈ ధ్వని ఏమి? అనేక కంఠములనుండి ఒకేమారు వచ్చిన ధ్వనియా ఇది-కలత చెందుచున్న సముద్రముల ధ్వనియా-గజపాలురు అడ్డగించగా కోపించి ఘీంకరించుచున్న ఏనుగుల ఘీంకార ధ్వనియా? అని అడిగెను. మయుని ఈ మాట విద్యున్మాలికి అంకుశపు పోటువలె బాధాకరమయ్యెను. యమ వరుణ మహేంద్ర రుద్రులతో సమానుడగు వీరుడును నీకు శయనమున దాచుకొన్న నిధివంటి వాడును సకల యుద్ధములందు అగ్రగామియు వజ్రాయుధము వంటివాడు నగు తారకాక్షుడు ప్రమథ గణము చేతిలో చంపబడి రణరంగమున పడినాడు. ఆ ఉత్సాహమున ఒకచోట చేరి నినాదములు చేయుచున్న దేవతల కోలాహల మిది. ప్రజ్వలించు అగ్నివలె భయంకర నేత్రు డా తారకాక్షుడు రణమున మర్దితు డయ్యెనని వినగానే దేవత లును ప్రమథులును ఎల్లరును ఇందులకై సంతోషించిన సకల లోకజనుల సంతోషమునకు ప్రోత్సాహకముగా చేయుచున్న నాదములు ఇవి. అని పలికెను. ఆ మాటలు విని మయుడు 'విద్యున్మాలీ! ఇపు డేమి చేయవలెనో అది చేయుదును. మన త్రిపుర దుర్గమునకు పరబల భయము లేకుండ చేయుదును.' అని పలికెను. తరువాత మయుడును విద్యున్మాలియు క్రుద్ధులయి తమ ఆదేశానుసారము తమకు సహాయులై యున్న అసురులతో కూడి ప్రమథులను చావగొట్ట నారంభించిరి. వారు ఇద్దరును ఏఏ త్రోవలో పోయిరో ఆ చోట నెల్ల ప్రమథులు వారి నడ్డగించి అచట రాక్షసు లెవ్వరును లేకుండునట్లు చంపివేయుచుండిరి. ఇది చూచి సంతోషముతో యమ వరుణాదులు మృదంగ పటహడిండిమాది వాద్యములు మ్రోగించుచుండిరి. భుజాస్ఫాలనములతోను సింహనాదములతోను తమ సంతోష ప్రకటనము చేయుచుండిరి. సూర్య సమానతేజుడగు మయుని మహాత్ములగు దైత్యు లందరును - సత్త్వగుణాభిరతులగు తపోధనులు ఆకాశోన్నత భాగము నలంకరించిన మధ్యాహ్న అభిష్టవము చేసినట్లు - స్తుతించుచుండిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున తారకాక్ష వధమను

నూట ముప్పది యారవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters