Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టాదశోత్తరశతతమో7ధ్యాయః.

పురూరవసో7త్ర్యాశ్రమగమనమ్‌-తత్తపశ్చర్యాచ.

సూతః తత్రాయతే మహాశృఙ్గే మహావర్షే మహాహిమే | తృతీయంతు తయోర్మధ్యే శృఙ్గ మత్యన్తముచ్ఛ్రితమ్‌. 1

నిత్యాతపోత్తప్తశిలం తథాపి శ్రమవర్జితమ్‌ | తస్యాధస్తా ద్వృక్షపణ్డ దేశభాగేతు పశ్చిమే. 2

జాతీలతాపరిక్షిప్తం వివరం చారుదర్శనమ్‌ | దృష్ట్వైవ కౌతుకావిష్ట స్తం వివేశ మహీపతిః. 3

తమసా చాభినిర్విష్టం నల్వమాత్రం మహీపతిః | నల్వమాత్ర మతిక్రమ్య సుప్రభాభరణోజ్జ్వలమ్‌. 4

సముచ్ఛ్రిత మథాత్యన్త గమ్భీరపరివర్తులమ్‌ | న తత్ర సూర్యస్తపతి న విరాజతి చన్ద్రమాః. 5

తథాపి దివసాకార ప్రకాశం తమహర్నిశమ్‌ | క్రోశాధఙక పరీణాహసరసాచ విరాజితమ్‌. 6

నూట పదునెనిమిదవ అధ్యాయము.

పురూరవసు డత్ర్యాశ్రమమున కేగుట - తపమాచరించుట.

హిమలయమునందలి ఇట్టి ప్రదేశములో చాల ఎత్తయిన రెండు శిఖరములు కలవు. వానియందు అధికముగా వర్షము కురియుచు మంచుపడుచు ఉండును. ఈ రెంటి నడుమ వీనికంటె చాల ఎత్తయిన మూడవ శిఖరము కలదు. దాని శిలలు ఎడతెగక ఎండతో కాలుచుండును. అయినను అచట శ్రమతోచదు. ఆ శిఖరమునకు దిగువలో పడమటగా చెట్ల గుబురులో జాజి తీగలు క్రమ్మినదై చూడముచ్చటగా నున్న గొంది ఒకటి కనబడగా కుతూహలము కలిగి పురూరవో రాజందు ప్రవేశించెను. చీకట్లు దట్టముగా క్రమ్మియున్న ఆ ప్రదేశము నల్వమాత్రము (నాలుగు వందల ధనువులు; ధనువు = నాలుగు మూరలు) పొదవుండెను. అది దాటిన తరువాత చక్కని కాంతులే అభరణములుగా ప్రకాశించునది చాల ఎత్తైనది చాల లోతుకలది (లోపలికి వ్యాపించినది) గుండ్రనిది ఒకచోటు కలదు. అచట సూర్యుడు తన ఎండను చంద్రుడు తన వెన్నెలను ప్రసరింపజేయరు. ఐనను అది అహర్నిశములు పగలువలె ప్రకాశించుచుండును. దానియందు క్రోశముకంటె ఎక్కువ వ్యాసముగల (క్రోశము = 1000 ధనువులు) సరస్సు అందగించుచుండెను.

సమన్తా త్సరస స్తస్య శైలలగ్నాతు వేదికా | సౌవర్ణైరాజతైర్వృక్షై ర్వృద్రుమై శ్చైవశోభితా. 7

నానామాణిక్యకుసుమై స్సుప్రభాభరణోజ్జ్వలైః | తస్మి న్త్సరసి పద్మాని పద్మరాగచ్ఛదానిచ. 8

వజ్రకేసరయుక్తాని సుగన్ధీని తథాప్యతి | పత్రై ర్మరకతై ర్నీలై ర్వైడూర్యైశ్చ మహీపతే. 9

కర్ణికాశ్చ తథా తేషాం జాతరూపాశ్చ పార్థివ | తస్మిన్త్సరసి భూమిర్యా న సాపఙ్క సమాకులా. 10

నానారత్నై రుపచితా జలజానాం సమాశ్రయా | కపర్దకానాం శుక్తీనాం శఙ్ఖానాంచ మహీపతే. 11

మకరాణాంచ మత్స్యానాం జలజానాంచ కచ్ఛపైః | తత్ర మరకతఖణ్డాని వజ్రాణిచ సహస్రశః. 12

పద్మరాగేన్ద్రనీలాని మహానీలాని పార్థివ | పుష్యరాగాణి రమ్యాణి తథా కార్కోటకానిచ. 13

తుబుకస్యచ ఖణ్డాని తథా విష్ణుమణరపి | రాజావర్తకముఖ్యాని రుధిరాక్షస్య చాప్యథ. 14

సూర్యేన్దుకాన్తయో శ్చైవ పీలో ర్వైరాతలస్యచ | జ్యోతీరసస్య రమ్యస్య సమకస్యచ భాగశః. 15

పురోరబలాక్షాణాం స్ఫాటికస్య తథైవచ | గోమేదవిత్తకానాం చ ధూళీమరకతస్యచ . 16

వైడూర్యసౌగన్ధికయో స్తథా రాజమణ ర్నృప | ఖఞ్జస్యచైవ ముక్తస్య తథా బ్రహ్మమణరపి. 17

ముక్తాఫలానాం శుద్ధానాం తారావిగ్రహధారిణమ్‌ | సుభోష్ణంచైవ తత్తోయం స్నానా చ్ఛీతవినాశనమ్‌. 18

ఈ సరస్సునకు అన్ని వైపులను వ్యాపించి కొండను అంటుకొని వేదిక (పొదరిండ్లతో నిండిన ప్రదేశము) ఒకటి కలదు. కన్నులకింపగు కాంతులే ఆభరణములై ప్రకాశించు మణి కుసుములుకల బంగారు వెండి పగడవు చెట్లటనుండెను. ఆ సరస్సునందలి తామర పూవుల దళములు పద్మరాగములతో కేసరములు వజ్రములతో ఆకులు మరకతములతో వైడూర్యములతో దుద్దులు బంగారుతో ఏర్పడి సుగంధ యుతములై యుండెను. ఆ సరస్సునందును పరిసరములందును ప్రదేశము బురద లేక అది నానావిధ రత్నములతో పద్మములతో గవ్వలతో శంఖములతో ముత్తెపు చిప్పలతో మకరమత్స్య కూర్మాదులతో వెలయుచుండెను.

పద్మారాగేంద్ర నీలమహేంద్ర నీలకార్కోటక తుబుక-విష్ణుమణి-రాజావర్తక-రుధిరాక్ష-సూర్యకాంత చంద్రకాంత-పీలు-వైరాతల -జ్యోతీరస- సమక పురోరగ-బలాక్ష-స్పటిక-గోమేద-విత్తక-మరకత-వైదూర్య-సౌగంధిక-రాజమణి- ఖంజ-ముక్త-బ్రహ్మముణి-తారాసదృశముక్తాఫల-రత్న ఖండములట నుండెను. ఆ కొలని నీరు స్నానమాడినంతనే చలిపోగొట్టి హాయిగొల్పునంత వేడిగా నుండును.

వైడూర్యసుశిలా మధ్యే సరస శ్చోపశోభితా | ప్రమాణచతథాభూతా ద్వేచ రాజ& ధనుశ్శతే. 19

చతురశ్రా తథారమ్యా నిర్మితాచ తథాత్రిణా | బిలద్వారిసమాద్దేశ స్తత్రచాపి హిరణ్మయః. 20

ప్రదేశస్సతు రాజేన్ద్ర ద్వీపే తస్మి న్మనోహరే | తథా పుష్కరిణీ రమ్యా తస్మి న్రాజచ్ఛిలాతలే. 21

సుశీతామలపానీయా జలజైశ్చ విరాజితా | ఆకాశ ప్రతిమా రాజం శ్చతురశ్రా మనోహరా. 22

తస్యా స్తదుదకం స్వాదు లఘు శీతం సుగన్ధిచ | న క్షిణోతి తథాకణ్ఠం కుక్షిం నాపూరయత్యపి. 23

తృప్తిం విధత్తే పరమాం శరీరేచ మహత్సుఖమ్‌ |

ఆ సరస్సు నడుమ వైదూర్య శిల ఉపశోభిల్లుచుండెను. దాని (ఒక్కొక్క భుజము) ప్రమాణము రెండు వందల ధనువులు; అది చతురస్రమును రమ్యమునునై యుండునట్లు అత్రి మహాముని నిర్మించెను. (ఇచ్చటి ఈ రమ్య పవిత్ర ప్రదేశములన్నియు అత్రి తపో నిర్మితములే.) అచట సరస్సు నడుమ పర్వత బిలద్వార సదృశములగు ఉద్దేశములు (చిన్న చిన్న ప్రదేశములు) గల హిరణ్మయ ప్రదేశపు ద్వీపమొకటి ఉండెను. ఆ మనోహర ద్వీపము నడుమ మిగుల ప్రకాశించు వైదూర్య శిలా తలుము నడుమ కంటికింపగు చతురస్ర పుష్కరిణి కలదు. దానియందును పద్మములు కలవు. దాని నీరు మిగుల చల్లనిది స్వచ్ఛమయినది మధురమయినది తేలికయైనది సుగంధయుతము. అది త్రావినచో కంఠము బాధ నొందదు; కడుపు నిండి బరువెక్కదు; కాని ఆనీరు పరమ తృప్తిని శరీరమునకు మహా సుఖమును కలిగించును.

మధ్యేచ తస్యాశ్చ కృతః ప్రాసాద స్తపసాత్రిణా. 24

రుక్మసేతుప్రదేశశ్చ సర్వరత్నమయ శ్శుభః | శశాఙ్కరశ్మిజఙ్కాశః ప్రాసాదో రాజతోహి సః. 25

రత్నవైడూర్యసోపానో విద్రుమామలసాలకః | ఇన్ద్రనీలమహాచక్రో జాతరూపవిభూషితః. 26

పద్మరాగమహాస్తమ్భ స్తథామరకతవేదికః | రత్నాంశుజాలస్ఫురితో రమ్యో దృష్టిమనోహరః. 27

ప్రాసాదే తత్ర భగవా& దేవదేవో జనార్దనః | భోగిభోగివళీసుప్త స్సర్వాలఙ్కారభూషితః. 28

జాను రాకుఞ్చితశ్చైవ దేవదేవస్య చక్రిణః | ఫణీన్ద్రసన్నివిష్టోంఘ్రి ర్ద్వితీయశ్ఛ నరాధిప. 29

లక్ష్మ్యామాసక్తదృష్టేస్తు శేషభోగప్రశాయినః | ఫణీన్ద్రభోగవిన్యస్త బాహుదణ్డోపశోభితః. 30

అఙ్గుష్ఠపృష్ఠవిన్యస్త దేవశీర్షోదరం శుభమ్‌ | ఏకస్తు దేవదేవస్య ద్వితీయ స్సుప్రసారితః. 31

సమాకుఞ్చితజానుస్థ మణిబన్ధ సుశోభితః | కిఞ్చిదాకుఞ్చితశ్చైవ నాభిదేశే తథాస్థితః. 32

తృతీయస్తు కర స్తస్య చతుర్థంతు తథా శృణు | ఆత్తసన్తానకుసుమ ఘ్రాణదేశానువర్తనమ్‌. 33

లక్ష్మ్యా సంవాహ్యమానాఙ్ఘ్రిః పద్మప్రనిభైః కరైః | సన్తానమాల్యమకుట హారకేయారభూషితమ్‌. 34

భూషితంచ తథా దేవ మఙ్జదై రఙ్గళీయకైః | ఫణీన్ద్రఫణవిన్యస్త చారురత్న శిఖోజ్జ్వలమ్‌. 35

జ్ఞానినామప్యగమ్యం తం ప్రతిష్ఠిత మథాత్రిణా | సిద్ధాభిపూజ్యం సతతం సతతం కుసుమాన్వితమ్‌. 36

దివ్యగన్ధానులిప్తాఙ్గం తం దేవ ముత్పలశీర్షకమ్‌ | తత స్సమ్ముఖ ముద్వీక్ష్య వవన్దే స నరాధిపః. 38

ఆ పుష్కరిణి నడుమ అత్రి మహాముని తన తపముచే నిర్మించిన ప్రాసాదము (దేవాలయము) ఒకటి కలదు. దాని నిర్మాణమునకై అమర్చిన చోటిని పుష్కరిణి నీటినుండి వేరుబరచుటకు నలువైపుల చతురస్రాకారమున నిర్మించిన అడ్డుకట్ట (సేతువు) నానా రత్నములు పొదిగిన బంగారుతో నిర్మితమై శోభిల్లుచుండెను. ఆలయము చంద్ర కిరణములవలె వెలయు వెండితో దాని మెట్లు వైదూర్యములతో ప్రాకారము పగడములతో లోపలి కప్పుపైనుండు మహాచక్రము బంగారు పొదిగిన ఇంద్రనీలములతో మహా స్తంభములు పద్మరాగములతో వేదికలు మరకతములతో నిర్మితములు; ఇట్లు అది రత్న కిరణరాశితో తళతళలాడుచు దృష్టిమనోహరము మర్యమునై యుండెను.

ఇట్టి ఆలయమున దేవదేవుడు భగవానుడు నగు జనార్దనుడు (నారాయణుడు) అర్చామూర్తియై ఉండెను. ఆ దేవుడు ఆనంతుని పడగల గమిపై పండుకొన్న వాడు-సర్వాలంకార భూషితుడు; ఆ దేవదేవుడగు చక్రి కుడి మోకాలు కొంచెముగ ముడుచుకొని రెండవ పాదము అనంతుని యందు ఉంచబడియుండెను. ఆశేషశాయి దృష్టి లక్ష్మిపై అనక్తమై యుండెను. ఆ దేవదేవుని ఎడమ పైభుజము ఫణీంద్రుడగు ఆదిశేషుని పడగలపై దిండుగా నుంచబడెను. కుడిపైభుజము పూర్తిగా చాచబడి దాని మణికట్టు దేవదేవుని ముడుచుకొనిన మోకాలిపై ప్రకాశించుచుండెను. ఎడమ దిగువ భుజమును కొంచెముగ ముడిచి ఆదేవుడు నాభిదేశమునకు ఉదరమునకు సూటిగా పాన్పుపై ఉంచుకొనెను. కుడి దిగువ చేతితో పారిజాత(కల్పవృక్ష) కుసుమమును వాసన చూచుటకై ముక్కునకు దగ్గరగా ఉంచుకొనెను. ఆ దేవదేవుని పాదములను లక్ష్మీదేవి పద్మపత్రములను బోలు కరములతో సంవాహనము చేయుచుండెను.

ఆ భగవానుడు కల్పవృక్షపు పూలతో మకుటముతో హారములతో అందెలతో భుజకీర్తులతో అంగుళీయకములతో శోభించుచుండెను. ఫణీంద్రుని పడగలయందలంకారముగా ఉంచబడిన మనోహర రత్న శిఖలతో స్వామి ప్రకాశించు చుండెను. జ్ఞానులకును ఆగమ్యుడు ఆత్రి మహామునిచే ప్రతిష్ఠితుడు సిద్ధులకును సతతము అభిఫూజ్యుడు సతతము పూజా కుసుమాన్వితుడు దివ్య గంధానులిప్తాంగుడు దివ్య ధూప ధూపితుడు సిద్దులు సదా తెచ్చి కానుకలిచ్చిన సరసములును హృదయమునకింపుగొల్పునవియునగు మంచి ఫలములతో ప్రకాశించుచుండు ఉత్తమ పార్శ్వము కలవాడు కలువలు అలంకారముగానున్న శీర్షము కలవాడునగు ఆ నారాయణుని తన సమక్షమున గాంచి ఆ ముద్రరాజగు పురూరవసుడు నిలువబడి ఉండియే నమస్కరించెను.

జానుభ్యాం శిరసాచైవ గత్వా భూమితలం తదా | నామ్నాం సహస్రేణ తథా తుష్టావ మధుసూదనమ్‌. 39

ప్రదక్షిణ మథో చక్రే స తూత్థాయ పునః పునః | రమ్యమాయతనం దృష్ట్వా తత్రోవాసాశ్రమే పునః. 40

జలాద్బహి ర్గుహాం కాంచి దాశ్రిత్య సుమనోహరామ్‌ | తపశ్చకార త్రైవ పూజయ న్మధుసూదనమ్‌. 41

నానావిధైస్తథాపుషై#్పః ఫలమూలై స్సగోరసైః | నిత్యం త్రిషవణస్నాయీ వహ్ని పూజా పరాయణః. 42

దైవవాపీజలైః కుర్వ న్త్సతతః ప్రాణధారణమ్‌ | సర్వాహారపరిత్యాగం కృత్వా స మనుజేశ్వర. 43

ఆనాశ్రితగుహాశాయీ కాలం నయతి పార్థివః | త్యక్తాహార క్రియాశ్చాపి కేవలం నియతో నృపః. 44

న తస్య గ్లానిమాయాతి శరీరంచ తదద్భుతమ్‌ | ధ్రువం స రాజా తపసి ప్రసక్త స్సమ్పూజయ& దేవవరం సదైవ. 45

తత్రాశ్రమే కాలుమవాస కించి త్స్వర్గోపమే దుఃఖమవిన్దమానః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ భూగోళే పురూరవశ్చరితే పురూరవసోత్స్రాశ్రమ గమనాదికథనం నామాష్టాదశోత్తరశతతమోధ్యాయః.

అంతట ఆతడు మోకాళ్ళను శిరస్సును నేలకానించి నారాయణుని నమస్కరించి సహస్ర నామములతో మధుసూదనుని స్తుతించెను. అనంతరమతడు లేచి ప్రదక్షిణమును నమస్కారమును మరల మరల చేసెను. ఆ ఆలయము అతి రమ్యముగా నుండుట చూచి ఆ ఆశ్రమమునందే తన నివాసము నేర్పరచుకొనెను. పుష్కరిణీ జలమునకు వెలుపల అతి మనోహరమగు ఒకానొక గుహను ఆశ్రయముగా ఏర్పరచుకొని దానియందే నానావిధ పుష్ప ఫలమూలములతో గోరసముల (ఆవుపాలు పెరుగు నేయి మొదలగు వాని)తో మధుసూదన పూజా పూర్వకముగా తపమాచరించెను. ఆతడు అను దినమును త్రిషవణములందు స్నానము చేయును. అగ్నిని హోమముతో పూజించును. దేవ నిర్మితములగు (మనుష్యులు త్రవ్వియుండని) బావుల నీటితో ప్రాణధారణము చేయును. మరి ఆహారమును తీసికొనడు. ఇతరులు ఎవ్వరును ఆశ్రయించి ఉపయోగించుకొనుచుండని గుహలయందు నిద్రించును. కేవలము నియమపరుడై ఆహారగ్రహణము విడిచియున్నను ఆతని శరీరము శ్రమ చెందెడిది కాదు. ఇది ఆశ్చర్యము గొలుపు విషమముగదా ! ఇట్లారాజు ధ్రువ నిశ్చయుడై దేవదేవుని విడువక సదా పూజించుచు తపమాచరించుచు స్వర్గతుల్యమగు ఆ ఆశ్రమమున ఏ దుఃఖమును ఎరుగక కొంతకాలుము గడపెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భారత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున ముద్రరాజగు పరూరవుడత్ర్యాశ్రమమేగి తపమాచరించుటయను నూట పదునెనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters