Sri Matsya Mahapuranam-2    Chapters   

పంచాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః

కనకకల్పలతికాదానవిధానమ్‌.

శ్రీమత్స్య : 

అథాత స్సమ్ర్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్‌ | మహాకల్పలతా నామ మహాపాతకనాశనమ్‌. 1

పుణ్యాం తిథి మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్‌ | ఋత్విఙ్మణ్డపసమ్భార భూషణాచ్ఛాదనాదికమ్‌. 2

తులాపురుషవ త్కుర్యా ల్లోకేశావాహనం బుధః | చామీకరమయీః కుర్యా ద్దశ కల్పలతా శ్శుభాః. 3

నానాపుష్పఫలోపేతా నానాంశుకవిభూషితాః | విద్యాధర సుపర్ణానాం మిథునైరుపశోభితాం. 4

హారా నాదిత్సుభి స్సిద్ధైః ఫలానిచ విహఙ్గమైః | లోకపాలానుకారిణ్యః కర్తవ్యా స్తాసు దేవతాః. 5

బ్రాహ్మీమనంత శక్తిం చల లవణస్యోపరి న్యసేత్‌ | అధస్తా ల్లతయో ర్మధ్యే పద్మశఙ్ఖకరే శుభే. 6

ఇభాసనస్థాతు గుడే పూర్వతః కులిశాయుధా | రజనీసంస్థితా7గ్నాయీ స్రువపాణి రథా7నలే. 7

యామ్యేచ మహిషారూఢా గదినీ తణ్డులోపరి | ఘృతేతు నైరృతీ స్థాప్యా సఖణ్డా దక్షిణ కరే. 8

వారుణ్యాం వారుణీ క్షీరే ఝషస్థా నాగపాశినీ | పతాకినీచ వాయవ్యే మృగస్థా శర్కరోపరి. 9

సౌమ్యా తిలేషు సంస్థాప్యా శఙ్ఖినీ నిధిసంస్థితా | మాహేశ్వరీ వృషారూఢా నవనీతే త్రిశూలినీ. 10

మౌలిన్యో వరదా స్తద్వ త్కర్తవ్యా బాలకాన్వితాః |

శక్త్యా పఞ్చపలా దూర్ధ్వ మాసహస్రా త్ర్పకల్పయేత్‌. 11

సర్వాసా ముపరి స్థాప్యం పఞ్చవర్ణం వితానకమ్‌ | ధేనవో దశ కుమ్భాశ్చ వస్త్రయుగ్మాని చైవహి.12

మధ్యమే ద్వేతు గురవే ఋత్విగ్భ్యో7న్యా స్తథైవ చ | తతో మఙ్గళశ##బ్దేన స్నాత శ్శుక్లామ్బరో ముధః. 13

ప్రదక్షిణ మథావృత్య మన్త్రా నేతా నుదీరయేత్‌ |

నమోనమః పాపవినాశనీభ్యో బ్రహ్మాణ్డలోకేశ్వరపాలినీభ్యః. 14

ఆశంసితాధిక్యఫలప్రదాభ్యో దిగ్భ్యస్తథా కల్పలతావధూభ్యః |

ఇతి సకల దిగఙ్గనాప్రదానం భవభయసూదనకారి యః కరోతి. 15

అభిమతఫలదే స నాకలోకే వసతి పితామహవత్సరాణి త్రింశత్‌ |

పితృశత మథ తారయే తక్షణర్ధే భవదురితౌఘవిఘాతశుద్ధదేహః. 16

సురపతివనితాసహస్రసజ్ఘైః పరివృత మమ్బురుహోద్భవాభివన్ద్యః |

ఇతి విధాన మిదం దిగఙ్గనానాం (దివిజాంగనా) కనకకల్పలతావినివేదకమ్‌. 17

పఠతి య స్స్మరతీహ తథేక్షతే స పద మేతి పురన్దరసేవితమ్‌. 17u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ కనకకల్పలతికాప్రదానికో నామ పంచాశీత్యుత్తర

ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఎనుబది యైదవ అధ్యాయము.

కనకకల్పలతికాదాన విధానము.

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడు ఇక మహాపాతక నాశనమగు మహాకల్పలతా మహాదాన విధానమును తెలిపెదను; పుణ్యకరమగు తిథినాడు బ్రాహ్మణులచే పుణ్యాహ వాచనము జరిపించవలెను; ఋత్విక్‌లును మండపమును సంభారములును భూషణములు ఆచ్ఛాదనములు మొదలగునవియు లోకపాలకావాహనమును తులా పురుష దానమునందువలెనే చేయవలయును; బంగారుతో పది కల్పలతలను చేయించవలయును; అవి శుభములును (చూడ నింపగునవియు) నానా పుష్ప ఫలసహితములును నానావస్త్ర విభూషితములునయి ఉండవలయును; విద్యాధరగరుడ దంపతులును హారముల నా కల్పలతలనుండి తీసికొనగోరుచుండు సిద్ధులును ఫలములను గ్రహింపగోరు పక్షులును లోకపాలురవంటి దేవతా ప్రతిమలును వానిని ఉపశోభింప జేయుచుండవలయును; లవణము మీద బ్రాహ్మిని అనంతశక్తిని ఉంచవలెను; వారి హస్తములందు శంఖచక్రములుండును; దిగువను ఆ లతల నడుమయందు గజాననముపై తూర్పుదిక్కున బెల్లముపై వజ్రాయుధధారిణియగు ఇంద్రాణియు పనపుపై కూర్చుండి ఆగ్నేయమున స్రువమునుర చేత ధరించి అగ్నాయీ దేవతయు దక్షిణమున బియ్యముపై మహిషముపై నెక్కి గదినీదేవియు నైరృతమున నేతియందు దక్షిణకరమున ఖడ్గము ధరించిన నైరృతీదేవియు పడమట పాలయందు మత్స్యముపై కూర్చుండి నాగపాశము ధరించియున్న వారుణియు వాయవ్యమున శర్కరపై మృగవాహనయగు పతాకినీదేవియు ఉత్తరమున తిలలయందు నిధులపై(తో) కూర్చుండియున్న శంఖినియు ఈశాన్యమున వృషభవాహనయు త్రిశూలధారిణియునగు మాహేశ్వరియు నుందురు; వీరందరును కిరీటములను చెవుల యందు బావిలీలను దరించి వరదముద్రతో నుందురు; ఇవి యన్నియు ఐదు పలములకు తక్కువ కాకుండ సహస్ర పలముల వరకు గల తూకపు బంగారముతో చేయించవలయును; వీరందర మీదకు వచ్చునట్లు ఐదు వన్నెల మేల్కట్టు (చాందినీ - వితానకము) చేయించవలయును; ధేనువులును - కుంభములును - వస్త్రయుగ్మములును ప్రతివిధమగునవియు పది పది చొప్పున సిద్ధపరచుకొనవలయును; ప్రతిమలలో నడుమనుండు బ్రాహ్మిని అనంతశక్తిని ఆచార్యునకును మిగిలిన ఎనిమిదింటిని ఎనిమిది మంది ఋత్విజులకును ప్రతి ప్రతిమకును ఒక్కొక్క ధేనువు కుంభము వస్త్రయుగ్మము చొప్పున చేర్చి దాన మీయవలయును; తరువాత సంప్రదాయ మెరిగి యజమానుడు మంగళవాద్య ధ్వనులతో స్నానమాడి తెల్లని వస్త్రములను ధరించి ఆ విప్రులను ప్రదక్షిణించి ఈ మంత్రములను పలుకవలయును; ''పాపవినాశినులును బ్రహ్మాండ లోకేశ్వర పాలినులును కోరినంతకంటె అధిక ఫలములను వరముగా నిచ్చువారును నగు దిగ్ధేవతలకును కల్పలతా దేవతల కును నమస్కారము.'' అనుచు ఇట్లు సకల దిగ్దేవతాదానమును చేయువారు ముప్పది బ్రహ్మ సంవత్సరముల కాలము స్వర్గ లోక సుఖముల ననుభవింతురు; ఈ వ్రతము సంసార భయనాశకము; అభిమతఫలప్రదము; దీని నాచరించువాడు క్షణార్ధ కాలములోనే సంసారజనిత పాపరాశినుండి పవిత్రత నందిన శరీరము కలవాడయి తన పితరులను వందమందిని కూడ తరింపజేయును; సురపతి స్త్రీ సహస్ర పరివృతుడయి సుఖించును; బ్రహ్మచేత కూడ ప్రశంసితుడగును; ఈ దిగంగనా కనకకల్పలతా దానవ్రత విధానమును వినినను చదివినను వ్రతాచరణమును చూచినను అట్టివారును ఇంద్ర సేవితమగు స్వర్గమున సుఖింతురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కనకకల్పలతికా ప్రదానికమను

రెండు వందల ఎనుబది యైదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters