Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టషష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ప్రాసాదవిధినిర్ణయః.

సూతః ఏవం వాస్తుబలిం కృత్వా భ##జే త్షోడశభాగికమ్‌ | తస్య మధ్యే చతుర్భిస్తు బాగై ర్గర్భంతు కల్పయేత్‌. 1

భాగద్వాదశకం సాగ్రం తతస్తు పరికల్పయేత్‌ | చతురాభాగేన భిత్తీనా ముచ్ఛ్రాయ స్స్యా త్ప్రమాణతః. 2

ద్విగుణ శ్శిఖరోచ్ఛ్రాయో భిత్త్యుచ్చ్రాయానుమానతః | శిఖరార్ధస్య చార్ధేన విధేయా తు ప్రదక్షిణా. 3

చతుర్దిక్షు తథా జ్ఞేయం నిర్గమంతు తతో బుధైః గర్భసూత్రద్వయం చాగ్రే విస్తారోమణ్డపస్య తు. 4

ఆయతం స్యా త్త్రిభి ర్భాగ్రై ర్భద్రయుక్తం సుశోభనమ్‌ | పఞ్చభాగేన సమ్భజ్య గర్భమానం విచక్షణః. 5

భాగ మేకం గృహీత్వా తు ప్రగ్రీవం కల్పయేద్భుధః | గర్భసుత్రసమా ద్భాగా దగ్రతో ముఖమణ్డపః. 6

ఏత త్సామాన్య ముద్దిష్టం ప్రాసాదస్యేహ లక్షణమ్‌ | ఇదానీంతు ప్రవక్ష్యామి ప్రాసాదం లిఙ్గమానతః. 7

రెండు వందల అరువది ఎనిమిదవ అధ్యాయము.

ప్రాసాద (దేవాలయ) విధి కీర్తనము.

(ఈ అధ్యాయములో ప్రతిపాదింపబడిన ప్రాసాద నిర్మాణ ప్రణాళి భారతీయ దేవాలయ నిర్మాణ విధానములో అతి ప్రాచీనదశయని విమర్శకుల యభిప్రాయము. 'మానసారము' నమరాంగణసూత్రధారము' మొదలగు గ్రంథముల యందును శ్రీవిష్ణు ధర్మోత్తర పురాణమునందును కూడా ఈ ప్రాసాదరూప నిర్మాణ ప్రతిపాదనములో ఈశ్రీమత్స్య మహా పురాణమున ప్రతిపాదించిన తీరుకంటె విభిన్నత కనబడును.

నాగర (ఔత్తరాహ) సంప్రదాయము - ద్రావిడ సంప్రదాయము అను రెండు విధములగు ప్రాసాద (దేవాలయ) నిర్మాణ సంప్రదాయములలో శ్రీమత్స్య మహాపురాణమున ప్రతిపాదించి రీతి నాగర సంప్రదాయమునకు చెందినదియని విమర్శకుల తలపు.

ఇందు ప్రతిపాదించిన రూపములో ఆలయ నిర్మాణము దక్షిణ భారతమున మహబూబ్‌నగర్‌ జిల్లా - అలంపురము నందలి ఆలయములయందును కర్నూలు జిల్లా - ఆదోని సమీపమునందలి పెద్ద తుంబళము అను గ్రామమునందలి ఒక శిథిల ప్రాచీనాలయమునందును ఇట్లే అచ్చటచ్చట అరుదుగ కనబడుచున్నది.)

నాగర సంప్రదాయపు ప్రాసాద (దేవాలయ) ముల ఆకృతి విషయక భావన.

''దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః''

అనగా ప్రాణుల దేహమే దేవాలయము అనియు. ఆ దేహమునందలి జీవచైతన్యమే సనాతను (శాశ్వతు)డగు భగవానుడు (పరమాత్ముడు) అనియు ఈ పారంపరిక వచనమునకు ప్రసిద్ధముగా చెప్పుకొను అర్థము.

మరియొక విధముగా - దేవాలయము భగవానుని దేహము; ఆలయమునందు ప్రతిష్ఠితమయియున్న భగవన్మూర్తియే ఆ దేహమునందలి జీవ చైతన్యము అనగా సనాతనుడగు (శాశ్వతుడగు) భగవానుని ప్రతినిధిగా ఆ ఆలయము నందు ఉంచిన దేవతామూర్తి - సాక్షాత్‌ ఆ పరమాత్మ చైతన్యమే; అనగా సాక్షాత్‌ భగవానుడే. అనియు అర్థము.

ఈ యర్థమును అనుసరించి మన ప్రాచీనులు దేవాలయమును నిలువబడియో కూర్చుండియో యున్న మానవుని దేహమువలె కనబడునట్లు నిర్మించిరి. అందును నాగరసంప్రదాయపు శివాలయమును వారు నిలువడియున్న మానవా కృతితో సరిపోల్చి భావనచేసి అది చాల ఎత్తుగా ఉండునట్లు నిర్మింప జూచిరి; అని తోచును. శ్రీమత్స్య మహాపురాణములో 'లింగమానతః' చెప్పిన దేవాయపు ఎత్తు 'గర్భమానతః' చెప్పిన ఆలయపు ఎత్తుకంటె చాల ఎక్కువగా నున్నది.

ఈ అధ్యాయమున నిరూపించిన దేవాలయ (ప్రాసాద) మాన భేదములు నాలుగు విధములుగా నున్నవి.

1. సామాన్య (సర్వ సాధారణ) ప్రాసాదము: ఇది మొదట ప్రధానాలయ నిర్మాణమునకై ఉద్దేశించిన ప్రదేశపు కొలతలు నిర్ణయించుకొని ఆ కొలతల భాగములను అనుసరించి మిగిలిన ఆలయ భాగముల కొలతలను గ్రహించు పద్ధతి.

2. లింగపు (విగ్రహపు) కొలతనలు మొదట నిర్ణయించుకొని దాని కొలతలను అనుసరించి ఆలయ భాగముల కొలతలను నిర్ణయించుకొను పద్దతి.

3. గర్భాలయపు కొలతలను మొదట నిర్ణయించుకొని దాని ననుసరించి ఆలయపు మిగిలిన భాగముల కొలతలను నిర్ణయించుకొను విధము.

4. ఇదియు గర్భాలయపు కొలతలను అనుసరించి ఆలయపు మిగిలిన భాగముల కొలతలను నిర్ణయించు పద్ధతియే.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పసాగెను:

గడచిన అధ్యాయము చెప్పిన విధమున ప్రాసాద (దేవాలయ)మునకై నిర్దేశించుకొనిన ప్రదేశమున వాస్తు బలిని జరిపిన తరువాత ఈ చెప్పబోవు విధమున కొలతలతో ప్రాసాద నిర్మాణము జరుపవలయును.

ప్రథమ ప్రకారము : ప్రాసాద (దేవాలయ) నిర్మాణమునకై నిర్దేశించి యుంచుకొనిన మొత్తము ప్రదేశపు వైశాల్యమును పదునారు సమభాగములుగా విభజించవలయును. అట్టి పదునారు భాగములయందలి నాలుగు భాగముల వైశల్యము కలదియు. ఈ మొత్తము ప్రదేశమునకు నట్టనడుమ నున్నదియు నగు సమ చతురస్ర ప్రదేశమున గర్భాలయమును నిర్మించవలయును. ఈ గర్భాలయమునకు నలువైపుల మిగిలియున్న ప్రదేశపు వైశాల్యము మిగిలిన పండ్రెండు భాగములు సరిగా అగునట్లు చూచుకొనవలయును.

ఈ కొలతలకై గ్రహించిన ప్రమాణములు (Units) (హస్తములు - మొదలగునవి) నాలుగు ఆలయభిత్తుల ఎత్తు ఉండవలయును. భిత్తుల ఎత్తునకై గ్రహించిన ప్రమాణములు ఏవి ఎన్నియో అవి అంతకు రెట్టింపు శిఖరపు ఎత్తు ఉండవలయును.

శిఖరపు ఎత్తునకు సగములో సగము (నాలగువవంతు) ప్రమాణములు కొలతతో గర్భాలయమునకు అన్ని వైపులను 'ప్రదక్షిణా' (నేమి) ఉండవలయును.

ఆలయమునకు నాలుగు వైపులను (ఈ ప్రదక్షిణనుండియు ఆలయమునుండియు దిగిపోవుటకు అనువుగా) 'నిర్గమము' (గడపల వరుస) ఉండవలయును.

గర్భాలయపు కుడి ఎడమలందలి సూత్రములను రెండిటిని ముందునకు పెంచి గర్భాలయపు వెడల్పు (లోగడ తెలిపిన నాలుగు భాగముల) పొడవు పరిమాణముతోను ఇట్టి మూడు భాగములంత వెడల్పుతోను ఉండునట్లు ఆయతా (దీర్ఘ చతురస్రా)కృతితో గర్భాలయమునకు ముందు మండప ముండవలయును.

గర్భాలయము తన కుడి ఎడమలందును వెనుక వైపునను 'భద్రము' (భిత్తు-గోడ-లనుండి పెంచి నిర్మించిన అందమగు నిర్మాణములకు 'భద్రము' అనియు 'కపోలము' అనియు వ్యవహారము)లతో కూడి మిగుల అందముగా చూడ ముచ్చట గొలుపుచుండవలయును.

గర్భాలయపు కొలతలకై తీసికొనిన మొత్తము పరిమాణమును విచక్షణుడగు వాస్తుశాస్త్రజ్ఞుడు ఐదు భాగములుగా చేసి అందలి ఒక భాగముతో 'ప్రగ్రీవము' (ప్రాగ్గ్రీవము - అనుట సరికాదు)ను నిర్మించవలయును. (గర్భాలయపు ప్రధాన భిత్తులకు పైగా నాలుగు వైపులకును పంచవలె ముందునకు ప్రసారితమై యుండు పెంపుదల నిర్మాణ భాగమును 'ప్రగ్రీవము' అని చెప్పినట్లు తోచును. నిఘంటువులందు ఈ పదమునకు ఇంకను వేరువేరు అర్థములు కలవు. కాని అవి ప్రకృతమునకు అన్వయించునట్లు కనబడవు.)

గర్భాలయపు ఉభయ పార్శ్వము (కుడి ఎడమ) లందలి సూత్రములను ఇంకను ముందునకు పెంచి ఈ మండపమును నిర్మించవలయును.

ఇది ఇక్కడ ఇట్లు సర్వ సామాన్యమగు ప్రాసాద (దేవాలయ) లక్షణము ఉద్దేశించ (ప్రతిపాదించ)బడినది.

లిఙ్గపూజాప్రమాణన కర్తవ్యా పీఠికా బుధైః | పీఠికార్ధేన భాగ స్స్యా త్తన్మానేన తు భిత్తయః. 8

బాహ్యభిత్తిప్రమాణన ఉత్సేధస్తు భ##వేత్పునః | భిత్త్యుచ్ఛ్రాయాచ్చ ద్విగుణ శ్శిఖరస్య సముచ్ఛ్రయః. 9

శిఖరస్య చతుర్భాగా త్కర్తవ్యా తు ప్రదక్షిణా | ప్రదక్షిణా యాస్తు సమ స్త్వగ్రతో మణ్డపో భ##వేత్‌. 10

తస్య చార్ధేన కర్తవ్య స్త్వగ్రతోముఖ మణ్డపః | ప్రాసాదా న్నిర్గతౌ కార్యౌ కపోలౌ గర్భమానతః. 11

ఊర్ధ్వం భిత్త్యుచ్ఛ్రయా త్తస్య మఞ్జరీం తు ప్రకల్పయేత్‌ |

మఞ్జర్యా శ్చార్దభాగేన శుకనాసాం ప్రకల్పయేత్‌. 12

ఊర్ధ్వం తథార్ధభాగేన వేదీబన్ధో భ##వేదిహ | వేద్యా శ్చోపరి యచ్ఛేషం కణ్ఠశ్చామలసారకః. 13

ఏవం విభజ్య ప్రాసాదం శోభనం కారయే ద్బుధః | అథాన్యచ్చ ప్రవక్ష్యామి ప్రాసాదస్యేహ లక్షణమ్‌. 14

అదే విధముగ లింగ (అర్చామూర్తి) ప్రమాణమును ముందుగా నిర్ణయించుకొని తరువాత దాని పరిమాణము ననుసరించి నిర్మించదగు 'ప్రాసాద' లక్షణమును తెలిపెదను.

రెండవ విధమగు ప్రాసాదము: విద్వాంసులగు వాస్తుశాస్త్రజ్ఞులు 'లింగము'నుగాని *పూజామూర్తిని (అర్చించుటకు ప్రతిష్ఠించు దేవతామూర్తిని)గాని దృష్టిలో ఉంచుకొని దాని పరిమాణపు ప్రమాణములు (Units) ననుసరించి 'పీఠికా' నిర్మాణము చేయవలయును.

పీఠికయు గల ఎత్తు అర్ధభాగమును ఒక్కొక్క ప్రమాణ భాగముగా గ్రహించి అట్టి ఒక్క భాగపు ప్రమాణము ఎత్తు ఉండునట్లు గర్భాలయవు బాహ్యభిత్తులు (ప్రధాన భిత్తినుండి వెలువలకు పెంచి నిర్మించు భిత్తులు) నిర్మించ వలయును.

ఈ బాహ్యభిత్తికై గ్రహించిన ఒక భాగము 'ప్రమాణము'గా గ్రహించి అట్టి భాగముల (కొన్నింటితో - బహుశః నాలుగు ప్రమాణములతో) (అంతర్‌) భిత్తులను నిర్మించవలయును. ఈ (అంతర్‌) భిత్తుల మొత్తము ఎత్తునకు రెట్టింపు ఎత్తుతో శిఖరమును నిర్మించవలయును.

శిఖరపు ఎత్తులో చతుర్భాగ ప్రమాణములతో 'ప్రదక్షిణా' ఉండవలయును. 'ప్రదక్షిణా' ఎంత వెడలుపున ఉండునో అంతే పరిమాణము వెడలుపు అగునట్లు గర్భాలయపు రెండు పార్శ్వముల సూత్రములను ముందునకు పెంచి మండపము ఉండవలయును. మండవపు వెడల్పులో సగము వెడల్పుతో దాని ముందుగా ముఖమండపముండవలయును.

'ప్రాసాద' (గర్భాలయ)ము నుండి (ముందు తప్ప మిగిలిన మూడు వైపులకును) వెలుపలకు సాగి వ్యాపించి యుండునట్లు గర్భాలయ ప్రమాణపు నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక వైపునకు రెండేసి చొప్పున కపోలములు భద్ర - ప్రతిభద్రములు ఒకటి పెద్దదిగా - రెండవది దానికంటె కొంత చిన్నదిగా నిర్మించవలయును.

ఇక శిఖర భాగములు: (ఇవి నాలుగు విధములగు ప్రాసాద - దేవాలయములకును ఇంచుమించుగా సమానము గానే అన్వయించును.) గర్భాలయమునకు పై భాగమున (అంతర్‌) భిత్తుల ఉచ్ఛ్రయము (ఎత్తు)నకు అనుగుణముగా (అంతే ఎత్తుతో) 'మంజరీ' అను శిఖర భాగమును నిర్మించవలయును. (ఇచట మూలములో స్పష్టముగా శిఖరపు ఎత్తు ఇంత అని చెప్పలేదు. అయినను ప్రథమ విద 'ప్రాసాదము' విషయమున చెప్పిన దానిని బట్టి - గర్భాలయ పరిమాణమును నాలుగు భాగములుచేసి అట్టి ప్రమాణములు ఎనిమిది ఉండునట్లు ''శిఖర మంజరీ'' మొత్తము ఎత్తు ఉండును. అని ఊహించవచ్చును.) శిఖర 'మంజరీ' మొత్తము ఎత్తులో సగము ఎత్తుతో 'శుకనాసా' అను శిఖర భాగమును దానికి పైగా - 'శుకవాసా' ఎత్తులో సగము ఎత్తుతో 'వేదీబంధము'ను మిగిలిన (నాలుగవ వంతు) ప్రమాణముతో 'కంఠము' 'ఆమలసారము' అను శిఖర భాగమును నిర్మించవలయును.

('వేదీబంధ'మునకు నలువైపులను ఉండు గ్రుడ్లవంటి గుండ్రని నిర్మాణ చతుష్టయమునకును అండకములు - అని వ్యవహారము. ఇచట మూలములో చెప్పకున్నను ఈ అంశము ముందు పనికివచ్చును.)

ఈ విధముగా ఆయా ప్రాసాద (దేవాలయ)పు అంశములను చెప్పిన ఆయా కొలతలతో విభజించి అందముగా ఉండునట్లు నేర్పరియగు వాస్తు శాస్త్రజ్ఞుడు నిర్మించవలెను.

ఇదే విధముగా ఇచ్చట ఈ ప్రసంగమునందే మరియొక విధమగు 'ప్రాసాదపు' లక్షణము కూడ చెప్పెదను.

*'ఆనీయలింగమర్చాంవా' (అ. 263; శ్లో. 27) 'లింగమును గాని అర్చామూర్తిని కాని తెచ్చి' అని యున్నది. 'అర్చా - పూజా' శబ్దములు సమానార్థకములు. కనుక శ్లో. 8 లోని 'పూజా' శబ్దమునకు 'అర్చామూర్తి' అను అర్థము గ్రహించ వలసి యున్నది.

గర్భమానప్రమాణన ప్రాసాదం శృణుత ద్విజాః | విభజ్య నవధా గర్భం మధ్యే స్యా ల్లిఙ్గపీఠికా. 15

పా(ప) దాష్టకం తు రుచికం పార్శ్వతః పరికల్పయేత్‌ | మానేన తేన విస్తారో భిత్తీనాం తు విధీయతే. 16

పా(ప) దం పఞ్చగుణం కృత్వా భిత్తీనా ముచ్ఛ్రయో భ##వేత్‌ |

స ఏవ శిఖరస్యాపి ద్విగుణ స్స్యాతముచ్ఛ్రయః. 17

చతుర్దా శిఖరం భజ్య అర్ధభాగద్యయస్య తు | శుకనాసాం ప్రకుర్వీత తృతీయే వేదికా మతా. 18

కణ్ఠ మామలసారం తు చతుర్థే పరికల్పయేత్‌ | కపోలయోస్తు సంహారో ద్విగుణో7స్య విధీయతే. 19

శోభ##నైః పత్రవల్లీభి రణ్డకైశ్చ విభూషితః | ప్రాసాదో7యం ద్వితీయస్తు మయా తుభ్యం నివేదితః. 20

మూడవ విధమగు 'ప్రాసాదము' : ద్విజులారా ! ముందుగా గర్భాలయపు ప్రమాణమును నిర్ణయించుకొని దాని ననుసరించి ఆలయపు ఇతరాంశముల కొలతలను గ్రహించు విధము తెలిపెదను; వినుడు.

గర్భాలయమును (3x3=9)అగునట్లు తొమ్మిది భాగములుగా (పదములు-గదులుగా) విభజించవలయును. అందు నట్టనడుమనున్న ఒక పదము (ఆంకణము-గది) నందు లింగమునకు గాని అర్చామూర్తికిగాని నిర్దేశించిన పీఠిక (దానియందు లింగముకాని అర్చామూర్తి కాని) ఉండవలయును.

దీనికి పోగా దీనికి చుట్టును మిగిలిన ఎనిమిది 'పదముల'లో (అంతర్‌) భిత్తులు ఉండవలయును. ఇట్టి ఐదు పదముల ప్రమాణముల ఎత్తుతో ఈ 'ఆంతర్‌' భిత్తులు ఉండవలయును. దీనికి రెట్టింపు (పది పదముల ప్రమాణముల) ఎత్తు శిఖరమునకు ఉండవలయును.

శిఖరపు ఎత్తును నాలుగు భాగములు చేసి అందలి రెండు భాగముల ఎత్తులో ఒక భాగపు ఎత్తుతో 'వేదీ బంధము'ను మిగిలిన నాలుగవ భాగములో 'కంఠము' 'అమలసారము' అను అంశములను నిర్మించవలయును.

రెండు పదములయంత (లేదా శిఖరమంజరీ పరిమాణములో రెండు నాలుగవవంతులంత వెడల్పుతో గర్భా లయమునకు మూడు వైపులను ఒక్కొక్కవైపున రెండేసి చొప్పున ఒకటి పెద్దది. ఇంకొకటి చిన్నదిగా) కపోలములు (భద్ర ప్రతిభద్రములు) నిర్మించవలెను.

ఆలయమునకు అందు ఇచ్చునట్లు 'పత్రవల్లులు' (ఆకులు పూలు - కల తీగలు) అండకములు దీనికి అలంకారముగా నుండవలయును;

ఈ విధముగా మూడవ విధమగు ప్రాసాదము నాచే (మత్స్య) నారాయణునిచే) నీకు (మనువునకు) తెలుప బడినది.

సామాన్య మపరం తద్వ త్ర్పాసాదం శృణుత ద్విజాః | త్రిభేదం కారయే తేత్రం యత్ర తిష్ఠన్తి దేవతాః.

రథాఙ్క స్తేన మానేన బాహ్యభాగవినిర్గతః | నేమీపా(ప) దేన విస్తీర్ణా ప్రాసాదస్య సమన్తతః . 22

భిత్తిశ్చ ద్విగుణా కార్యా తస్య మానం భ##వేదిహ | స ఏవ భిత్తే రుత్సేధో ద్విగుణ శ్శిఖరో మతః. 23

ప్రగ్రీవః పఞ్చభాగేన నిష్కాస స్తస్య చోచ్యతే | కారయే త్సుషిరం తద్వ త్ర్పాకారస్య త్రిభాగతః. 24

ప్రగ్రీవం పఞ్చభాగేన నిష్కాసేన విశేషతః | కుర్యాద్వా పఞ్చభాగేన ప్రగ్నీవే కర్ణమూలతః. 25

స్థాపయే త్కనకం తత్ర గర్భాన్తే ద్వారమూలతః | ఏవం తు త్రివిధం కుర్యా జ్జ్యేష్ఠమధ్యకనీయసమ్‌. 26

లిఙ్గమానానుభేదేన రూపభేదేన వాపునః | ఏతే సమాసతః ప్రోక్తా విభాగాఞ్ఛృణుత ద్విజాః. 27

ద్విజులారా! అదే విధముగా సామాన్యరూపమగు మరియొక ప్రాసాద భేదపు లక్షణమును చెప్పెదను; వినుడు.

దేవతలు ఎచటనుందురో (దేవతామూర్తులు ఎచట నుండునో) ఆ క్షేత్ర (ప్రదేశ) మును (గర్భాలయమును) మూడు భాగములుగ విభజించవలయును.

అందలి ఒక భాగపు పరిమాణమును ప్రమాణముగా తీసికొని అంత కొలతలతో గర్భాలయమునకు మూడు వైపులను దాని బాహ్యాంతర్భిత్తులనుండి వెలుపలి వైపునకు వచ్చునట్లు 'రథాంకము' అను (రథమును వాలిచినట్లు కనబడు) లక్షణ విశేషములను నిర్మించవలయును.

అదే తృతీయ భాగపు కొలతతో ఉండునట్లు ప్రాసాదమునకు అన్ని వైపులను నేమి (ప్రదక్షిణా) నిర్మించవలెను.

గర్భాలయపు పరిమాణపు ప్రమాణములను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండవలయును.

భిత్తుల ఎత్తునకు ద్విగుణము శిఖరపు ఎత్తు ఉండవలయును.

గర్భాలయ పరిమాణములో ఐదవవంతు కొలతతో 'ప్రగ్రీవ'మును 'నిష్కాన' (నిర్గమ)మును నిర్మించ వలయును.

ప్రాకారపు (భిత్తికిగల) ఎత్తులో మూడవవంతు ఎత్తుతో సుషిరము (ద్వారము?) ఉండవలయును.

అదే ప్రాకారపు (భిత్తుల) ఎత్తులో ఐదవవంతు పరిమాణ ప్రమాణముతోనైనను 'ప్రగ్రీవ'మును 'నిష్కాన' (నిర్గమ)మును నిర్మించవచ్చును. ఇది విశేష ప్రకారము.

గర్భాలయపు చతురస్రాకృతిలో ఏర్పడు కర్ష పరిమాణములో ఐదవ వంతు పరిమాణపు కొలతతోనైనను ప్రగ్రీవమును నిర్మించవచ్చును.

గర్భాలయపు అంతమున ద్వారమూల ప్రదేశమున కలశ (రూపమగు శిల్పనిర్మాణ)మును నిలుపవలయును.

ఈ విధముగా ఆలయ నిర్మాణమును జ్యేష్ఠ-మధ్యమ-కనిష్ఠ-పరిమాణములలోను లింగపు పరిమాణమునో అర్చామూర్తి పరిమాణమునో ఆధారముగా అవలంబించియు రూప భేదకల్పనను అవలంబముగా చేసికొనియు జరుప వలయును.

ఇట్లుసమాన (సంక్షేప)ముగా ప్రాసాద సామాన్యముల లక్షణములు చెప్పబడినవి. ఇక - ద్విజులారా - ప్రాసాద విభాగ - విశేషములను - వాని లక్షణములను చెప్పెదను; వినుడు.

మేరుమన్దరకైలాసకుమ్భసింహమృగా స్తథా | విమానచ్ఛన్దక స్తద్వ చ్చతురశ్ర స్తథైవచ. 28

అష్టాశ్రా ష్షోడశాశ్రశ్చ వర్తుల స్పర్వభద్రకః | సింహాస్యో నన్దనశ్చైవ నన్దివర్ధనక స్తథా. 29

హంసో వృష స్సుపర్ణశ్చ పద్మకో7థ సముద్గకః | ప్రాసాదా నామతః ప్రోక్తా విభాగా ఞ్ఛృణుత ద్విజాః.

శతశృఙ్గ శ్చతుర్ద్వారో భూమికాషోడశోచ్ఛ్రితః | నానావిచిత్రశిఖరో మేరుప్రాసాద ఉచ్యతే. 31

మన్దరో ద్వాదశః ప్రోక్తః కైలాసో నవభూమికః | విమానచ్ఛన్దక స్తద్వ దనేకశిఖరాననః. 32

సో7ప్యష్టభూమిక స్తద్వత్సప్తభి ర్నన్దివర్ధనః | విషాణాంకసమాయుక్తో నన్దన స్స ఉదాహృతః. 33

షోడశాశ్రసమాయుక్తో నానారూపసమన్వితః | అనేకశిఖర స్తద్వ త్సర్వతోభద్ర ఉచ్యతే. 34

1. మేరువు 2. మందరము 3. కైలాసము 4. కుంభము 5. సింహము 6. గజము 7. విమానచ్ఛందకము 8. చతురస్రము (రుచకము-శ్రీవత్సకము-శ్రీవృక్షకము) 9. అష్టాస్రము (వజ్రము) 10. షోడశాస్రము (ద్వివజ్రము) 11. వర్తులము (మండలము) 12. సర్వ భద్రకము (సర్వతోభద్రము) 13. సింహాన్యము 14. నందనము 15. సంది వర్ధనకము 16. హంసము 17. వృషము 18. సువర్ణము 19. పద్మకము 20. సముద్గకము.

ఇట్లు ద్విజులారా! ప్రాసాద విశేషములు నామగ్రహణముతో చెప్పబడినవి; వీని విభాగ లక్షణములను చెప్పెదను; వినుడు.

మేరు ప్రాసాదము : ఇది నూరు నానావిచిత్ర శిఖరములు నాలుగు ద్వారములు పదునారు భూమికల (అంతస్తుల) ఎత్తుకలది. (భూమిక అనగా ఎంత ఎత్తు ఉండవలయును? అనునది వాస్తు ప్రకరణమున చెప్పబడినది.) మందర ప్రాసాదము: ఇది ద్వాదశ భూమికలు కలది; కైలాస ప్రాసాదము: ఇది నవభూమికలు కలది; విమానచ్ఛందకము: ఇది ఎనిమిది భూమికలు కలది. నందివర్ణనము: ఇది సప్త భూమికలు కలది; నందనము: ఇది ఒకే శిఖరము కలది; బహుశః దీనికి షడ్‌ భూమికలు; సర్వతోభద్రము; ఇది షోడశాస్రపు ఆకృతియు నానారూప విశేషములును అనేక శిఖరములును కలది.

చిత్రశాలాసమో పేతో విజ్ఞేయః పఞ్చభూమికః | వలభిచ్ఛన్దక స్తద్వ చ్చుకనాసత్ర యాన్వితః. 35

వృషస్యోచ్ఛ్రాయత స్తుల్యో మణ్డల శ్చాశ్రివర్జితః | సింహ స్సింహసమోజ్ఞేయో గజో గజసమస్తథా. 36

కుమ్భః కుమ్భాకృతి స్తద్వ ద్భూమికానవకోచ్ఛ్రయః | అఙ్గుళీయక సంస్థానః పఞ్చాణ్డకవిభూషితః. 37

షోడశాశ్రస్సమన్తాచ్చవిజ్ఞేయ స్ససముద్గకః | పార్శ్వయో శ్చన్ద్రశాలే7స్య ఉచ్ఛ్రాయో భూమికాద్వయమ్‌.

తథైవ పద్మకః ప్రోక్త ఉచ్ఛ్రాయో భూమికాత్యయమ్‌ | షోడశాశ్ర స్స విజ్ఞేయో విచిత్రశిఖర శ్శుభః. 39

భృఙ్గరాజస్తు విఖ్యాత శ్చన్ద్రశాలావిభూషితః | ప్రగ్రీవేణ విశాతేన భూమికాసు షడున్నతః. 40

అనేకచన్ద్రశాలస్తు గజప్రాసాద ఇష్యతే | వర్యన్తగ్భహరాజో వై గరుడో నామ నామతం. 41

సప్తభూమ్యుచ్ఛ్రయ స్తద్వ చ్చన్ద్రశాలాత్రయాన్వితః | భూమికాషడశీతిస్తు బాహ్యత స్సర్వతో భ##వేత్‌. 42

తథా7న్యో గరుడ స్తద్వ దుచ్ఛ్రాయదశభూమికః | పద్మక ష్షోడశాశ్రస్తు భూమిద్వయ మథాధికః. 43

పద్మతుల్యప్రమాణన శ్రీవృక్షక ఇతి స్మృతః | పఞ్చాణ్డకో ద్విభూమస్తు గర్భే హస్తచతుష్టయమ్‌. 44

వృషో భవతి నామ్నా7యం ప్రాసాద స్సర్వకామికః |

సప్తకాః పఞ్చకాశ్చైవ ప్రాసాదా యే మయోదితాః. 45

సింహాస్యేన సమా జ్ఞేయా యే చాన్యే తత్ర్పమాణతః 7

చన్ద్రశాలై స్సమోపేతా స్సర్వే ప్రగ్రీవసంయుతాః. 46

ఏ(ఐ)ష్టకా దారవాశ్చైవ వశైలా వా స్యు స్సతోరణాః | మేరుః పఞ్చాశద్ధస్త స్స్యా న్మన్దరః పఞ్చహీనకః. 47

చత్వారింశస్తు కైలాస శ్చతుస్త్రిం శద్విమానకః | నన్దివర్దనక స్తద్వ ద్ద్వాత్రింశత్సముదాహృతః. 48

త్రింశతా నన్దనః ప్రోక్త స్సర్వతోభద్రక స్తథా | వర్తులః పద్మకశ్చైవ వింశద్దస్త ఉదాహృతః. 49

వలభీచ్ఛందకము : ఇది చిత్రశాలలును - మూడు శుకనానలును ఐదు భూమికలును కలది; మండలము (వర్తులము): ఇది ఎత్తు విషయమున (ముందు చెప్పబోవు) వృషప్రాసాదముతో సమానము; అశ్రులు (కోణములు) లేనిది; (అశ్రి=కోణము); సింహ (ప్రాసాద)ము; ఇది సింహముతో సమానమయిన (ఆకృతి కల)ది; గజప్రాసాదము: ఇది గజముతో సమాన మైన (ఆకృతి కల)ది; కుంభప్రాసాదము: ఇది కుంభాకృతి కలది; తొమ్మిది భూమికల ఎత్తు అంగుళీపుట(యక)ము వంటి అమరికయు పంచాండకములును కలది; సముద్గకము: ఇది షోడశాస్రములు (16 కోణములును భుజములను) కలది; రెండు పార్శ్వములందును రెండు చంద్రశాలలును రెండుభూమికల ఎత్తును కలది; పద్మకము: ఇది పై దానివలెనే యుండి మూడు భూమికల ఎత్తు కలది; మృగరాజ (సింహ) ప్రాసాదము: ఇది షోడశాస్రములును విచిత్ర శిఖరములను కలది; శుభ (మనోహర)మైనది; చంద్రశాలలు కలది; గజప్రాసాదము: ఇది విశాలము అగు ప్రగ్రీవము ఆరు భూమికల ఎత్తు అనేక చంద్రశాలలు కలది; గరుడ (ప్రాసాద)ము: ఇది ఏడు భూమికల ఎత్తు మూడు చంద్రశాలలు తనకు రెండు వైపులను మృగరాజు ప్రాసాద (రూప)ములు కలది, ఇంకొక విధమగు గరుడ ప్రాసాదము: ఇది ఆరు భూమికల ఎత్తు కలది; ఇది వెలుపలి వైపున అన్ని వైపులను కలిసి అశీతి (ఎనుబది) హస్తములు (చుట్టు కొలత) కలది; మరియొక గరుడ ప్రాసాదము: ఇది పది భూమికల ఎత్తు కలది; పద్మకము: ఇది షోడశాస్రమయి పండ్రెండు భూమికల ఎత్తు కలది; శ్రీవృక్షము (చతురస్రము): ఇది ప్రమాణమునందు (కొలతలో) పద్మకముతో సమానమయి చతురస్రాకృతి కలది; వృషప్రాసాదము: ఇది పంచాండకములు రెండు భూమికల ఎత్తు నాలుగు హస్తముల భుజముగల గర్భాలయము కలది; ఇది సార్వకామికము (అన్ని కోరికలను ఆవశ్యకతలను తీర్చునది) సింహాస్యము: నా చేత చెప్పబడినవానిలో సప్త భూమి కల - పంచ భూమికల ఎత్తు కలవి - అట్టివానికి చెప్పిన ఆయా ప్రమాణములు కలవి చంద్రశాలలు ప్రగ్రీవములు కలవి ఏవి కలవో అవి అన్నియు 'సింహాస్యములు' అనబడును. (భూమిక=అంతస్తు)

ఇవి అన్నియు ఇటుకలతోనో శిలలతోనో దారువుతోనో నిర్మింపబడి తోరణముల (పెద్ద ద్వారముల)తో కూడి యుండును.

ఆయా ప్రాసాదములకు కల ప్రదేశమునకు తీసికొనవలసిన భుజముల (విష్కంభముల) ప్రమాణములు: మేరువు - 50; మందరము-45; కైలాసము-40; విమానచ్ఛందకము-34; నందివర్ధనకము-32; నందనము-సర్వతోభద్రము-30; వర్తులము (మండలము) పద్మకము-20;

సింహో గజశ్చ కుమ్భశ్చ వలభీచ్ఛన్దక స్తథా | ఏతే షోడశహస్తా స్స్యు శ్చత్వారో దేవవల్లభాః 50

కైలాసో మృగరాజశ్చ విమాన చ్ఛన్ధకో మతం | ఏతే ద్వాదశహస్తా స్స్యు రేతేషాం విహితాత్మనామ్‌. 51

గరుడో7ష్టకరో జ్ఞేయో హంసో దశ ఉదాహృతః | ఏవ మేత త్ర్పమాణన కర్తవ్యా శ్శుభలక్షణాః. 52

యక్షరాక్షసనాగానాం మాతృహస్తా న్ర్పశస్యతే | తథా మేర్వాదయ స్సప్త జ్యేష్ఠలిజ్గే శుభావహాః. 53

శ్రీవృక్షకాదయ శ్చాష్టౌ మధ్యమస్య ప్రకీర్తితాః | తథా హంసాదయః పఞ్చకన్యసే శుభధాః స్మృతాః. 54

వలభీచ్ఛన్దకే గౌరీ జటా ముకుటధారిణీ | వరదా7భయదా తద్వ త్సాక్షసూత్రకమణ్డలుః. 55

గృహే తు రక్తముకుటా ఉత్పలాఙ్కుశధారిణీ | వరదా7భయదా వాపి పూజనీయా సభర్తృకా. 56

తపోవనస్థా మితరాం తాం తు సమ్పూజయే ద్బుధః | దేవ్యా వినాయక స్తద్వ ద్వలభీచ్ఛన్దకే శుభః. 57

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ప్రాసాదవిధినిర్ణయో నామ

అష్టషష్ట్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

సింహము - గజము - కుంభము - వలభీచ్ఛందకము - 16; ఇవి దేవతలకు ప్రీతికరమయినవి; విహితా (మహా) త్ములగు ఈ దేవతలకు ప్రీతికరములగు కైలాసము - సింహము - విమానచ్ఛందకము - 12; గరుడము - 8; హంసము-10; ఇట్టి హస్త ప్రమాణక విష్కంభములతో శుభలక్షణములతో ప్రాసాదములను నిర్మించవలయును.

యక్ష-రాక్షస-నాగులకుగాను నిర్మించు ప్రాసాదములు మాతృ(సప్త) హస్తముల ప్రమాణములతో నుండునవి ప్రశస్తములు. (?)

(ఈ చెప్పిన ఇరువది విధములగు ప్రాసాదములలో -చతురస్రము - నందివర్ధనము - విమానచ్ఛందకము - గజము - సర్వతోభద్రము అనునవి చతురస్రపు (Square) ఆకృతి కలవి; (భృంగ-గృహ) మృగరాజము (సింహము) ఆయతపు (Rectangle)ఆకృతి గలది; సింహాస్యము వృత్తాయతము (దీర్ఘవృత్తము-Ellipse); వజ్రమ-(అష్టాస్రము)-సందనము- హంసము ఇవి వజ్రాకృతి కలవి; (అష్టభుజి-Octagon) అని శ్రీభోజ మహారాజ విరచితమగు ''సమరాంగణ సూత్ర ధారము'' వలన తెలియుచున్నది. చూ. 293 పు.)

ఈ చెప్పినవానిలో మేరువు మొదలగు ఏడు ప్రాసాదములును జ్యేష్ఠపరిమాణకలింగమును (అర్చామూర్తిని) ప్రతిష్ఠించుటకు - శ్రీవృక్షకము (రుచకము - చతురస్రము) మొదలగు ఎనిమిదియు మధ్యమలింగమును (అర్చామూర్తిని) ప్రతిష్ఠించుటకు హంసము మొదలగు ఐదును కనిష్ఠ లింగమును (అర్చామూర్తిని) ప్రతిష్ఠించుటకు శుభావహములు.

వలభీచ్ఛందక ప్రాసాదమున -గౌరిని - జటా - ముకుటములు ధరించి వరదాభయ ముద్రలు అక్షమాల - కమండలుపు నాలుగు హస్తములందును ధరించిన తపోవనస్థమూర్తితోగాని - రక్తముకుటము కలిగి ఉత్పలము అంకుశము వరదాభయ ముద్రలు కల నాలుగు హస్తములతో భర్తతో వినాయకునితో కూడి గృహస్తితమూర్తితోగాని - యున్న రూపముతో అర్చించవలయును.

ఇట్లు ఈ రెండు రూపములలో ఏ రూపముతోనైనను వలభీచ్ఛందక ప్రాసాదమున గౌరిని అర్చించవచ్చును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రాసాదవిధి కీర్తనము అను

రెండు వందల అరువది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters