Siva Maha Puranam-4    Chapters   

అథ వింశో%ధ్యాయః

శిష్యుని ఆచార్యస్థానములో అభిషేకించుట

ఉపమన్యురువాచ |

అథైవం సంస్కృతం శిష్యం కృతపాశుపతవ్రతమ్‌ | ఆచార్యత్వే%భిషించేత తద్యోగ్యత్వే న చాన్యథా || 1

మండలం పూర్వవత్కృత్వా సంపూజ్య పరమేశ్వరమ్‌ | స్థాపయేత్పంచ కలశాన్‌ దిక్షు మధ్యే చ పూర్వవత్‌ || 2

నివృత్తిం పురతో న్యస్య ప్రతిష్ఠాం పశ్చిమే ఘటే | విద్యాం దక్షిణతశ్శాంతిముత్తరే మధ్యతః పరామ్‌ || 3

కృత్వా రక్షాదికం తత్ర బద్ధ్వా ముద్రాం చ ధైనవీమ్‌ | అభిమంత్ర్య ఘటాన్‌ హుత్వా పూర్ణాంతం చ యథా పురా || 4

ప్రవేశ్య మండలే శిష్యమనుష్ణీషం చ దేశికః | తర్పణాద్యం తు మంత్రాణాం కుర్యాత్పూర్ణావసానకమ్‌ || 5

తతస్సంపూజ్య దేవేశమనుజ్ఞాప్య చ పూర్వవత్‌ | అభిషేకాయ తం శిష్యమాసనం త్వధిరోహయేత్‌ || 6

సకలీకృత్య తం పశ్చాత్కలాపంచకరూపిణమ్‌ | న్యస్తమంత్రతనుం బద్ధ్వా శివం శిష్యం సమర్పయేత్‌ || 7

తతో నివృత్తి కుంభాదిఘటానుద్ధృత్య వై క్రమాత్‌ | మధ్యమాంతాచ్ఛివేనైవ శిష్యం తమభిషేచయేత్‌ || 8

శివహస్తం సమర్ప్యాథ శిశోశ్శిరసి దేశికః | శివభావసమాపన్నశ్శివాచార్యం తమాదిశేత్‌ || 9

అథాలంకృత్య తం దేవమారాధ్య శివమండలే | శతమష్టోత్తరం హుత్వా దద్యాత్పూర్ణాహుతిం తతః || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

తరువాత ఈ విధముగా సంస్కారమును పొంది, పాశుపతవ్రతమును ఆచరించిన శిష్యుని గురువు ఆతడు యోగ్యుడైనచో, ఆచార్యస్థానమునందు అభిషేకించ వలెను ; యోగ్యుడు కానిచో, చేయరాదు (1). ఇదివరలో చెప్పిన విధముగా మండలమును చేసి, పరమేశ్వరుని చక్కగా పూజించి, ఇదివరలో చెప్పిన విధముగనే నాలుగు దిక్కులలో నాలుగు, మధ్యలో ఒకటి , వెరసి అయిదు కలశములను స్థాపించవలెను (2). తూర్పు కలశమునందు నివృత్తికళను, పశ్చిమకలశమునందు ప్రతిష్ఠను, దక్షిణమునందు విద్యను, ఉత్తరమునందు శాంతిని, మధ్యలో శాంత్యతీతకళను న్యాసము చేసి (3), వాటియందు రక్షాబంధము మొదలగు కర్మలను చేసి ధేనుముద్రను చూపించి, ఆ కలశములను అభిమంత్రించి, ఇదివరలో చెప్పిన విధముగానే పూర్ణాహుతి పర్యంతము హోమములను చేసి (4), గురువు శిష్యుని తలపాగా లేకుండగా మండలములో ప్రవేశ##పెట్టి , మంత్రములకు తర్పణములను, పూర్ణాహుతి పర్యంతము హోమములను చేయవలెను (5). తరువాత దేవదేవుని చక్కగా పూజించి, ఇదివరలో చెప్పిన విధముగనే అభిషేకము కొరకై అనుమతిని పొంది, ఆ శిష్యుని ఆసనముపైకి ఎక్కించవలెను (6). తరువాత వానికి సకలీకరణము అను సంస్కారమును చేసి, అయిదు కళ##లే స్వరూపముగా గలవాడు, మంత్రన్యాసము చేయబడిన దేహము గలవాడు అగు ఆ శిష్యుని కట్టి శివునకు సమర్పించవలెను (7). తరువాత నివృత్తితో మొదలగు పెట్టి మధ్య వరకు గల కలశములను వరుసగా పైకి తీసి ఆ శిష్యుని శివమంత్రముతోనే అభిషేకించవలెను (8). తరువాత గురువు తన పుత్రుని వంటి శిష్యుని తలపై శివహస్తమును (అరచేతిలో శివుని ఆవాహన చేసి పూజించినచో అది శివహస్తమగును) ఉంచి, శివభావమును పొందినవాడై వానిని శివాచార్యుడని నిర్దేశించవలెను (9). తరువాత వానిని అలంకరించి, శివమండలములోని దేవుని ఆరాధించి, నూట యెనిమిది ఆహుతులను ఇచ్చి తరువాత పూర్ణాహుతిని చేయవలెను (10).

పునస్సంపూజ్య దేవేశం ప్రణమ్య భువి దండవత్‌ | శిరస్యంజలిమాధాయ శివం విజ్ఞాపయేద్గురుః || 11

భగవంస్త్వత్ర్పసాదేన దేశికో%యం మ యా కృతః | అనుగృహ్యత్వయా దేవ దివ్యాజ్ఞాసై#్మ ప్రదీయతామ్‌ || 12

ఏవం విజ్ఞాప్య శిష్యేణ సహ భూయః ప్రణమ్య చ | శివం శివాగమం దివ్యం పూజయేచ్ఛివవద్గురుః || 13

పునశ్శివమనుజ్ఞాప్య శివజ్ఞానస్య పుస్తకమ్‌ | ఉభాభ్యామథ పాణిభ్యాం దద్యాచ్ఛిష్యాయ దేశికః || 14

స తాం మూర్ధ్ని సమాధాయ విద్యాం విద్యాసనోపరి | అధిరోప్య యథాన్యాయమభివంద్య సమర్చయేత్‌ || 15

అథ తసై#్మ గురుర్దద్యాద్రాజోపకరణాన్యపి | ఆచార్యపదవీం ప్రాప్తో రాజ్యం చాపి యతో%ర్హతి || 16

అథానుశాసనం కుర్యాత్పూర్వైరాచరితం యథా | యథా చ శివశాస్త్రోక్తం యథా లోకేషు పూజ్యతే || 17

శిష్యాన్‌ పరీక్ష్య యత్నేన శివశాస్త్రోక్తలక్షణౖః | సంస్కృత్య చ శివజ్ఞానం తేభ్యో దద్యాచ్చ దేశికః || 18

ఏవం సర్వమనాయాసం శౌచం క్షాంతిం దయాం తథా | అస్పృహామనసూయాం చ యత్నేన చ విభావయేత్‌ || 19

ఇత్థమాదిశ్య తం శిష్యం శివముద్వాస్య మండలాత్‌ | శివకుంభానలాదీంశ్చ సదస్యానపి పూజయేత్‌ || 20

గురువు మరల దేవదేవుని పూజించి సాష్టాంగనమస్కారమును చేసి తలపై చేతులను జోడించికొని శివునకు విన్నవించవలెను (11). ఓ భగవాన్‌ ! నీ అనుగ్రహముచే వీనిని ఆచార్యునిగా చేసితిని. ఓ దేవా! నీవు అనుగ్రహించి వీనికి దివ్యమగు ఆజ్ఞను ఇమ్ము (12). గురువు ఈ విధముగా ప్రార్థించి, శిష్యునితో గూడి మరల శివునకు నమస్కరించి, దివ్యమగు శివాగమమును శివునితో సమానముగా పూజించవలెను (13). గురువు మరల శివుని అనుమతిని పొంది శివజ్ఞానము యొక్క పుస్తకమును రెండు చేతులతో శిష్యునకీయవలెను (14). ఆతడు శివవిధ్యారూపమగు ఆ పుస్తకమును తలపై నిడుకొని యథాశాస్త్రముగా విద్యాసనముపై నుండి నమస్కరించి పూజించవలెను (15). తరువాత గురువు ఆతనికి రాజునకు తగిన సాధనములను ఈయవలెను. ఏలయనగా, ఆచార్య స్థానమునకు పొందిన వానికి రాజార్హత కూడ గలదు (16). తరువాత పూర్వాచార్యులచే అనుష్ఠించబడినది, శివశాస్త్రములో చెప్పబడినది, లోకములో ఆదరమును కలిగించునది అగు ఆచారమును ఆతనికి ఉపదేశించ వలెను (17). గురువు శివశాస్త్రములో చెప్పబడిన లక్షణములను బట్టి ప్రయత్నపూర్వకముగా శిష్యులను పరీక్షించి, వారికి సంస్కారమును చేసి, శివజ్ఞాన మునీయవలెను (18). ఈ విధముగా శౌచము, క్షాంతి, దయ, కామనలు లేకుండుట, అసూయ లేకుండుట అను గుణములను ప్రయత్నపూర్వకముగా పాటించి, వాటిని అనాయాసముగా (అతి సహజముగా) పాటించే లక్షణమును అలవరచు కొనవలెను (19). ఈ విధముగా ఆ శిష్యునకు ఉపదేశించి, మండలమునుండి శివునకు, శివకలశము అగ్ని మొదలగువాటికి ఉద్వాసన చెప్పి, సభాసదులను కూడ పూజించవలెను(20).

యుగపద్వాథ సంస్కారాన్‌ కుర్వీత సగణో గురుః | తత్ర యత్ర ద్వయం వాపి ప్రయోగస్యోపదిశ్యతే || 21

తదాదావేవ కలశాన్‌ కల్పయేదధ్వ శుద్ధి విత్‌ | కృత్వా సమయసంస్కారమభిషేకం వినాఖిలమ్‌ || 22

సమభ్యర్చ్య శివం భూయః కృత్వా చాధ్వ విశోధనమ్‌ | తస్మిన్‌ పరిసమాప్తే తు పునర్దేవం ప్రపూజయేత్‌ || 23

హుత్వా మంత్రం తు సంతర్ప్య సందీప్యాశాస్య చేశ్వరమ్‌ | సమర్ప్య మంత్రం శిష్యస్య పాణౌ శేషం సమాపయేత్‌ || 24

అథవా మంత్రసంస్కారమనుచింత్యాఖిలం క్రమాత్‌ | అధ్వశుద్ధిం గురుః కుర్యాదభిషేకావసానకమ్‌ || 25

తత్ర యశ్శాంత్యతీతాదికలాసు విహితో విధిః | స సర్వో%పి విధాతవ్యస్తత్త్వత్రయ విశోధనే || 26

శివవిద్యాత్మతత్త్వాఖ్యం తత్త్వ త్రయముదాహృతమ్‌ | శక్తౌ శివస్తతో విద్యా తస్యా స్త్వాత్మా సముద్బభౌ || 27

శివేన శాంత్యతీతాధ్వా వ్యాప్తస్తదపరః పరః | విద్యయా పరిశిష్టో%ధ్వా హ్యాత్మనా నిఖిలః క్రమాత్‌ || 28

దుర్లభం శాంభవం మత్వా మంత్రమూలం మనీషిణః | శాక్తం శంసీత సంస్కారం శివశాస్త్రార్థపారగాః || 29

ఇతి తేసర్వమాఖ్యాతం సంస్కారాఖ్యస్య కర్మణః | చాతుర్విధ్యమిదం కృష్ణ కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 30

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శిష్యస్య ఆచార్యస్థానాభిషేకవర్ణనం నామ వింశో%ధ్యాయః (20).

ఈ విషయములో మరియొక వికల్పము గలదు. గురువు తన శిష్యగణముతో గూడి సంస్కారములను ఒకేసారి చేయవలెను. రెండు సంస్కారములను కలిపి చేసే సందర్భములో చేయవలసిన ప్రయోగము ఇచట ఉపదేశించ బడుచున్నది (21). దానికి ముందులోనే అధ్వశుద్ధిలో చేసినట్లుగా కలశములను స్థాపించవలెను. అభిషేకమును మినహాయించి సమయసంస్కారమునంతనూ చేసి (22),శివుని మరల పూజించి, అధ్వశోధనమును చేసి, అది పూర్తి అయిన తరువాత దేవుని మరల పూజించవలెను (23). మూలమంత్రముతో హోమమును తర్పణమును చేసి, సందీపనకర్మను చేసి, ఈశ్వరుని ఆజ్ఞను పొంది, శిష్యుని చేతిలో మంత్రమును సమర్పించి మిగిలిన కర్మను పూర్తి చేయవలెను (24). మరియొక వికల్పముగలదు. గురువు మంత్రసంస్కారమునంతనూ వరుసగా భావన చేసి, అధ్వశోధనమును చేసి, అభిషేకముతో పూర్తి చేయవలెను (25). దానిలో శాంత్యతీత మొదలగు కళల యందు ఏ ప్రయోగము విధించబడినదో, దానినంతనూ మూడు తత్త్వముల శోధనలో కూడా చేయవలెను (26). తత్త్వత్రయమనగా శివతత్త్వము, విద్యాతత్త్వము, ఆత్మతత్త్వము అనునవి. శక్తియందు ముందుగా శివుడు, తరువాత విద్య, ఆ తరువాత ఆత్మ ఆవిర్భవించినవి (27). శివునిచే శాంత్యతీతాధ్వ, దానిచే శాంతికళ, దానిచే విద్య, విద్యచే మిగిలియున్న కళ మరియు ఆత్మచే సర్వము క్రమముగా వ్యాపించబడి యున్నవి (28). శివశాస్త్రముయొక్క పారమును దర్శించిన విద్వాంసులు మంత్రమూలకమగు శైవసంస్కారము దుర్లభమని తలచి శక్తిసంస్కారమును బోధించుచున్నారు (29). ఓ శ్రీకృష్ణా! ఈ విధముగా నేను నీకు నాలుగు విధముల సంస్కారకర్మను సమగ్రముగా చెప్పితిని. నీవు ఇంకనూ ఏమి వినగోరు చున్నావు ? (30)

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శిష్యుని ఆచార్యస్థానములో అభిషేకించే కర్మను వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

Siva Maha Puranam-4    Chapters