Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వాదశోధ్యాయః

పంచాక్షర మంత్ర మాహాత్మ్యము

శ్రీకృష్ణ ఉవాచ |

మహర్షివర సర్వజ్ఞ సర్వజ్ఞానమహోదధే | పంచాక్షరస్య మాహాత్మ్యం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || 1

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ గొప్ప మహర్షీ! సర్వమును తెలిసిన వాడా ! నీవు సకలజ్ఞానమునకు గొప్ప సముద్రము వంటి వాడవు. నేను పంచాక్షరమంత్రము యొక్క మహిమను యథాతథముగా వినగోరుచున్నాను (1).

ఉపమన్యురువాచ |

పంచాక్షరస్య మాహాత్మ్యం వర్షకోటిశ##తైరపి | అశక్యం విస్తరాద్వక్తుం తస్మాత్సంక్షేపతః శృణు || 2

వేదే శివాగమే చాయముభయత్ర షడక్షరః | సర్వేషాం శివభక్తానామ శేషార్థప్రసాధకః || 3

తదల్పాక్షరమర్థాఢ్యం వేదసారం విముక్తిదమ్‌ | ఆజ్ఞాసిద్ధమసందిగ్ధం వాక్యమేతచ్ఛివాత్మకమ్‌ || 4

నానాసిద్ధియుతం దివ్యం లోకచిత్తానురంజకమ్‌ | సునిశ్చితార్థం గంభీరం వాక్యం తత్పారమేశ్వరమ్‌ || 5

మంత్రం సుఖముఖోచ్చార్యమ శేషార్థప్రసిద్ధయే | ప్రాహోన్నమశ్శివాయేతి సర్వజ్ఞస్సర్వదేహినామ్‌ || 6

తద్బీజం సర్వవిద్యానాం మంత్రమాద్యం షడక్షరమ్‌ | అతిసూక్ష్మం మహార్థం చ జ్ఞేయం తద్వటబీజవత్‌ || 7

దేవో గుణత్రయాతీతస్సర్వజ్ఞస్సర్వకృత్ర్పభుః | ఓమిత్యేకాక్షరే మంత్రే స్థితస్సర్వగతశ్శివః || 8

ఈశానాద్యాని సూక్ష్మాణి బ్రహ్మాణ్యకాక్షరాణి తు | మంత్రే నమశ్శివాయేతి సంస్థితాని యథాక్రమమ్‌ |

మంత్రే పడక్షరే సూక్ష్మే పంచబ్రహ్మతనుశ్శివః || 9

వాచ్యవాచకభావేన స్థితస్సాక్షాత్స్వభావతః | వాచ్యశ్శివోప్రమేయత్వాన్మంత్రస్తద్వాచకస్స్మృతః || 10

వాచ్యవాచకభావో%యమనాదిసంస్థితస్తయోః | యథా%నాదిప్రవృత్తోయం ఘోరసంసారసాగరః || 11

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

పంచాక్షరమంత్రముయొక్క మహిమను విస్తరముగా వర్ణించుట వందకోటి సంవత్సరముల కాలములోనైననూ సంభవము కాదు. కావున, సంగ్రహముగా వినుము (2). ఓంకారముతో కలిపి ఆరు అక్షరములు గల ఈ మంత్రము వేదము మరియు శివాగమము అను రెండింటిలో కానవచ్చును. ఇది శివభక్తులందరికీ సకలప్రయోజనములను చేకూర్చును (3). తక్కువ అక్షరములు గలది, గంభీరమగు అర్థము గలది, వేదముల సారము, మోక్షమునిచ్చునది, శివుని ఆజ్ఞచే సిద్ధించినది, సందేహములకు అవకాశమునీయనిది అగు ఆ మంత్రరూపవాక్యము శివుని స్వరూపమే (4). పరమేశ్వరుని బోధించే ఈ దివ్యమగు వాక్యము (మంత్రము) అనేకములగు సిద్ధులను ఇచ్చి, జనుల మనస్సులను రంజిల్ల చేయును. దీనికి ఖచ్ఛితముగా నిర్ధారణ చేయబడిన గంభీరమగు అర్థము గలదు (5). సర్వజ్ఞుడగు శివుడు ఓం నమశ్శివాయ అనే సుఖముగా నోటితో ఉచ్చరించ దగిన మంత్రమును సకలప్రాణుల సకలప్రయోజనములు సిద్ధించుట కొరకై బోధించెను (6). ఆరు అక్షరములు గల ఆ మొట్ట మొదటి మంత్రము విద్యలన్నింటికీ మూలము. మర్రి విత్తు వలె అది మిక్కిలి సూక్ష్మమే అయిననూ, గొప్ప అర్థమును కలిగి యున్నది (7). మూడు గుణములకు అతీతుడు, సర్వము తెలిసిన వాడు, స్వమును సృష్టించి రక్షించువాడు, సర్వవ్యాపకుడు అగు శివుడు ఓం అనే ఒకే అక్షరము గల మంత్రములో నున్నాడు (8). ఈశానుడు మొదలగు అయిదు బ్రహ్మలు సూక్ష్మరూపములో ఒకే అక్షరమునందున్నవారై క్రమముగా నమశ్శివాయ అను మంత్రమునందు నిలిచి యున్నారు. ఆరు అక్షరములు గల ఈ సూక్ష్మమగు మంత్రమునందు అయిదు బ్రహ్మలే దేహముగా గల శివుడు సాక్షాత్తుగా సహజముగా వాచ్యవాచకభావముచే నిలిచి యున్నాడు. ఇతరప్రమాణములకు గోచరము కాని శివుడు వాచ్యుడు (ప్రతిపాదించబడువాడు) అనియు, మంత్రము ఆయనకు వాచకము (బోధించునది) అనియు మహర్షులు చెప్పుచున్నారు (9,10). ఈ భయంకరమగు సంసారసముద్రము ఏ విధముగా అనాదికాలమునుండియు వచ్చుచున్నదో, అదే విధముగా ఓంకారమునకు శివునకు ఈ వాచ్యవాచకభావము అనాది కాలమునుండియు స్థిరముగా నున్నది (11).

శివో%పి హి తథానాదిసంసారాన్మోచకః స్థితః | వ్యాధీనాం భేషజం యద్వత్ర్పతిపక్షస్స్వభావతః || 12

తద్వత్సంసారదోషాణాం ప్రతిపక్షశ్శివస్స్మృతః | అసత్యస్మిన్‌ జగన్నాథే తమోభూతమిదం భ##వేత్‌ || 13

అచేతనత్వాత్ర్పకృతేరజ్ఞత్వాత్పురుషస్య చ | ప్రధానపరమాణ్వాది యావత్కించిదచేతనమ్‌ || 14

న తత్కర్తృ స్వయం దృష్టం బుద్ధిమత్కారణం వినా | ధర్మాధర్మోపదేశశ్చ బంధమోక్షౌ విచారణాత్‌ || 15

న సర్వజ్ఞం వినా పుంసామాదిసర్గః ప్రసిధ్యతి | వేద్యం వినా నిరానందాః క్లిశ్యంతే రోగిణో యథా || 16

తస్మాదనాదిస్సర్వజ్ఞః పరిపూర్ణస్సదాశివః | అస్తి నాథః పరిత్రాతా పుంసాం సంసారసాగరాత్‌ || 17

ఆదిమధ్యాంతనిర్ముక్తస్స్వభావవిమలః ప్రభుః | సర్వజ్ఞః పరిపూర్ణశ్చ శివో జ్ఞేయశ్శివాగమే || 18

తస్యాభిధానమంత్రో% యమభిధేయశ్చ స స్మృతః | అభిధానాభిధేయత్వాన్మంత్రస్సిద్ధః పరశ్శివః || 19

ఏతావత్తు శివజ్ఞానమేతావత్పరమం పదమ్‌ | యదోం నమశ్శివాయేతి శివవాక్యం షడక్షరమ్‌ || 20

విధివాక్యమిదం శైవం నార్థవాదం శివాత్మకమ్‌ | యస్సర్వజ్ఞస్సుసంపూర్ణస్స్వభావవిమలశ్శివః || 21

లోకానుగ్రహకర్తా చ స మృషార్థం కథం వదేత్‌ | యద్యథావస్థితం వస్తు గుణదోషైస్స్వభావతః || 22

యావత్ఫలం చ తత్పూర్ణం సర్వజ్ఞస్తు యథా వదేత్‌ | రాగాజ్ఞానాదిభిర్దోషైర్గ్రస్తత్వాదనృతం వదేత్‌ || 23

మరియు శివుడు అనాదినుండియు సంసారమునుండి మోక్షమును అనుగ్రహించుచున్నాడు. వ్యాధులకు మందు స్వభావము చేతనే విరోధియైన విధముగా, శివుడు సంసారములోని దోషములకు ప్రతిపక్షియని మహర్షులు చెప్పుచున్నారు. జగన్నాథుడగు ఈ శివుడు లేనిచో, ఈ జగత్తు అంధకారమయమై ఉండెడిది (12,13). ప్రకృతి జడమగుట వలన, పురుషుడు అజ్ఞాని యగుట వలన, ప్రధానము పరమాణువులు మొదలగునవి అన్నీ జడములు అగుట వలన (14), చేతనమగు మరియొక కారణము లేకుండగా ఆ జగత్తునకు అవి స్వయముగా కర్తలు కాజాలవు. విచారించినచో, ధర్మ-అధర్మములు ఉపదేశము, బంధమోక్షములు, జీవుల ఆదిసృష్టి అనునవి సర్వజ్ఞుడగు ఈశ్వరుడు లేనిదే సిద్ధించవు వైద్యుడు లేనిచో రోగులు ఆనందము లేనివారై క్లేశములకు గురి యగుచుందురు గదా! (15,16). కావున, ఆది లేనివాడు, సర్వమును తెలిసిన వాడు, పరిపూర్ణుడు, పాలకుడు, జీవులను సంసారసముద్రమునుండి అన్ని విధములుగా రక్షించువాడు అగు సదాశివుడు గలడు (17). శివుడు ఆదిమధ్యాంతములు లేనివాడు, స్వభావము చేతనే దోషరహితుడు, పాలకుడు, సర్వజ్ఞుడు మరియు పరిపూర్ణడు అని తెలియవలెను. ఈ మంత్రము ఆయనను బొధించు అభిధానమనియు, ఆయన అభిధేయుడు (బోధింపబడేవాడు) అనియు చెప్పబడినది. ఈ మంత్రమునకు శివునుతో ఇట్టి అభిధాన-అభిధేయభావము ఉండుటచే, ఈ మంత్రము పరమ శివస్వరూపమేననియు, ఇది సిద్ధమంత్రమనియు మహర్షులు చెప్పుచున్నారు (18,19). శివజ్ఞానమనగా ఓం నమశ్శివాయ అనే ఈ ఆరు అక్షరముల మంత్రము మాత్రమే; ఇదియే పరమపదము (20). ఇది శివునకు సంబంధించిన విధివాక్యమే గాని, అర్థవాదము (ముఖ్యార్థమునందు తాత్వర్యము లేని స్తుతి) కాదు. ఈ మంత్రము శివుని స్వరూపమే. సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, స్వభావము చేతనే దోషరహితుడు, లోకములను అనుగ్రహించువాడు అగు శివుడు సత్యము కాని విషయమును ఎట్లు చెప్పును? ఏ వస్తువు ఎట్టి స్వరూపమును కలిగి యున్నదో, దానియందు స్వభావముచేతనే ఏయే గుణదోషములు గలవో, దాని ఫలము ఎంతటిదో అనే ఈ సర్వమును సర్వజ్ఞుడగు శివుడు యథాతథముగా చెప్పును. కాని, దీనికి భిన్నముగా జీవుడు రాగము, అజ్ఞానము మొదలగు దోషములకు వశుడై యుండుటచే, అసత్యమును పలుకుచుండును (21-23).

తే చేశ్వరే న విద్యేతే బ్రూయాత్స కథమన్యథా | అజ్ఞాతాశేషదోషేణ సర్వజ్ఞేన శివేన యత్‌ |

ప్రణీతమమలం వాక్యం తత్ప్రమాణం న సంశయః || 24

తస్మాదీశ్వరవాక్యాని శ్రద్ధేయాని విపశ్చితా | యథార్థం పుణ్యపాపేషు తదశ్రద్ధో వ్రజత్యధ ః || 25

స్వర్గాపవర్గసిద్ధ్యర్థం భాషితం యత్సుశోభనమ్‌ | వాక్యం మునివరైశ్శాంతైస్తద్విజ్ఞేయం సుభాషితమ్‌ || 26

రాగద్వేషానృతక్రోధకామతృష్ణానుసారి యత్‌ | వాక్యం నిరయహేతుత్వాత్తద్దుర్భాషితముచ్యతే || 27

సంస్కృతేనాపి కిం తేన మృదునా లలితేన వా | అవిద్యారాగవాక్యేన సంసారక్లేశ##హేతునా || 28

యచ్ర్ఛుత్వా జాయతే శ్రేయో రాగాదీనాం చ సంశయః | విరూపమపి తద్వాక్యం విజ్ఞేయమితి శోభనమ్‌ || 29

బహుత్వేపి హి మంత్రాణాం సర్వజ్ఞేన శివేన యః | ప్రణీతో విమలో మంత్రో న తేన సదృశః క్వచిత్‌ || 30

సాంగాని వేదశాస్త్రాణి సంస్థితాని షడక్షరే | న తేన సదృశస్తస్మాన్మంత్రో%ప్యస్త్యపరః క్వచిత్‌ || 31

సప్తకోటిమహామంత్రైరుపమంత్తెరనేకధా | మంత్రః షడక్షరో భిన్నస్సూత్రం వృత్త్యాత్మనా యథా || 32

శివజ్ఞానాని యావంతి విద్యాస్థానాని యాని చ | షడక్షరస్య సూత్రస్య తాని భాష్యం సమాసతః || 33

ఆ దోషములు ఈశ్వరునియందు ఉండవు. కావున, ఆయన అసత్యమును చెప్పుట యెట్లు సంభవమగును? సమస్తదోషములు లేనివాడు, సర్వజ్ఞుడు అగు శివుడు ఏ నిర్దోషమగు వాక్యమును చెప్పునో, అదియే ప్రమాణమనుటలో సందేహము లేదు (24). కావున, వస్తుతత్త్వము, పుణ్యపాపములు అను విషయములో వివేకవంతుడు ఈశ్వరుని వాక్యముల యందు శ్రద్ధను కలిగి యుండవలెను. అట్టి శ్రద్ధ లేనివాడు అధోగతిని పొందును (25). మనోనిగ్రహము గల మహర్షులు స్వర్గము మరియు మోక్షము లభించుట కొరకై ఏ అతిశయించిన శోభ గల వాక్యమును చెప్పియున్నారో, అదియే సుభాషితమని తెలియదగును (26). రాగద్వేషములు, కామక్రోధములు, తృష్ణ అను లక్షణములచే ప్రభావితమై చెప్పబడిన వాక్యము నరకహేతువు అగును. కావుననే, దానికి దుర్భాషితము అని పేరు (27). అజ్ఞానము, రాగము మూలమునందు గలది, సంసారములోని క్లేశములకు కారణమైనది అగు ఆ వాక్యము సంస్కృతభాషలో (లేదా సంస్కారయుక్తముగా) మృదుమధురముగా చెప్పబడియున్ననూ, దాని వలన ప్రయోజనమేమున్నది? (28) ఏ వాక్యమును విన్నచో రాగము మొదలగునవి నశించి మోక్షము కలుగునో, అట్టి వాక్యము వికృతముగా నున్ననూ, అదియే మిక్కిలి సుందరమైనది యని తెలియవలెను. (29). మంత్రములు అనేకములు గలవు. కాని, సర్వజ్ఞుడగు శివునిచే బోధింపబడిన నిర్మలమగు మంత్రముతో సాటియగు మంత్రము ఎక్కడనైననూ లేదు (30). ఆరు అక్షరముల మంత్రములో అంగములతో కూడిన వేదములు మరియు శాస్త్రములు గలవు. కావున, దానితో సాటియగు మంత్రము మరియొకటి ఎక్కడనైననూ లేదు (31). సూత్రము (తత్త్వమును సంగ్రహముగా బోధించే వాక్యము) వృత్తి (సూత్రమును వివరించే వాక్యము) కంటె భిన్నముగా నుండును. అదే విధముగా, ఆరు అక్షరముల మంత్రము ఏడు కోట్ల మహామంత్రముల కంటె మరియు ఉపమంత్రము (మహామంత్రమును అనుసరించి ఉండే అవాంతరమంత్రము) ల కంటె అనేకవిధములుగా భిన్నముగా నున్నది (32). శివజ్ఞానములు మరియు విద్యాస్థానములు (పదునాలుగు) ఎన్ని గలవో, అవి అన్నియు సూత్రస్థానీయమగు ఆరు అక్షరముల మంత్రము యొక్క సంగ్రహభాష్యములు మాత్రమే (33).

కిం తస్య బహుభిర్మంత్రైశ్శాసై#్త్రర్వా బహువిస్తరైః | యస్యోన్నమశ్శివాయేతి మంత్రో%యం హృది సంస్థితః || 34

తేనాధీతం శ్రుతం తేన కృతం సర్వమనుష్ఠితమ్‌ | యేనోన్నమశ్శివాయేతి మంత్రాభ్యాసః స్థిరీకృతః || 35

నమస్కారాదిసంయుక్తం శివాయేత్యక్షరత్రయమ్‌ | జిహ్వాగ్రే వర్తతే యస్య సఫలం తస్య జీవితమ్‌ || 36

అంత్యజో వాధమో వాపి మూర్ఖో వా పండితో%పి వా | పంచాక్షరజపే నిష్ఠో ముచ్యతే పాపపంజరాత్‌ || 37

ఇత్యుక్తం పరమేశేన దేవ్యా పృష్టేన శూలినా | హితాయ సర్వమర్త్యానాం ద్విజానాం తు విశేషతః || 38

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే పంచాక్షర మంత్రమాహాత్మ్యవర్ణనం నా ద్వాదశో%ధ్యాయః (12).

ఎవని హృదయములో ఓం నమశ్శివాయ అనే ఈ మంత్రము చక్కగా నిలిచియున్నదో, వానికి అనేకమంత్రములతో గాని, అతిశయించిన విస్తారము గల శాస్త్రములతో గాని పని యేమున్నది? (34). ఎవడైతే ఓం నమశ్శివాయ అనే మంత్రమును స్థిరముగా జపించునో, వాడు సర్వమును అధ్యయనము చేసినట్లే; సర్వమును విన్నట్లే సర్వమును అనుష్ఠించినట్లే యగును (35). మొదట నమః అని, తరువాత శివాయ అనే మూడు అక్షరములు ఎవని నాలుక కొనపై నుండునో, వాని జీవితము సఫలమగును (36). అంత్యజుడు గాని, అధముడు గాని, మూర్ఖుడు గాని, పండితుడు గాని ఎవడైతే పంచాక్షరమంత్రజపమునందు నిష్ఠను గలిగి యుండునో, వాడు పాపబంధమునుండి విముక్తుడగును (37). పార్వతీదేవి ప్రశ్నించగా శూలధారియగు పరమేశ్వరుడు సర్వమానవుల హితము కొరకు విశేషించి బ్రాహ్మణుల హితము కొరకు ఈ విధముగా చెప్పినాడు (38).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో పంచాక్షరమంత్రమహిమను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-4    Chapters