Siva Maha Puranam-4    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

శివుని మహిమను వర్ణించుట

ఉపమన్యురువాచ |

న శివస్యాణవో బంధః కార్యో మాయేయ ఏవ వా | ప్రాకృతో వాథ బోద్ధా వా హ్యహంకారాత్మకస్తథా || 1

నైవాస్య మానసో బంధో న చైత్తో నేంద్రియాత్మకః | న చ తన్మాత్రబంధో%పి భూతబంధో న కశ్చన || 2

న చ కాలః కలా చైవ న విద్యా నియతిస్తథా | న రాగో న చ విద్వేషశ్శంభోరమితతేజసః || 3

న చాస్త్యభినివేశో%స్య కుశలా%కుశలాన్యపి | కర్మాణి తద్విపాకశ్చ సుఖదుఃఖే చ తత్ఫలే || 4

ఆశ##యైర్నాపి సంబంధస్సంస్కారైః కర్మణామపి | భోగైశ్చ భోగసంస్కారైః కాలత్రితయగోచరైః || 5

న తస్య కారణం కర్తా నాదిరంతస్తథాంతరమ్‌ | న కర్మ కరణం వాపి నాకార్యం కార్యమేవ చ || 6

నాస్య బంధురబంధుర్వా నియంతా ప్రేరకో%పి వా | న పతిర్న గురుస్త్రాతా నాధికో న సమస్తథా || 7

న జన్మమరణ తస్య న కాంక్షితమకాంక్షితమ్‌ | న విధిర్న నిషేధశ్చ న ముక్తిర్న చ బంధనమ్‌ || 8

నాస్తి యద్యదకల్యాణం తత్తదస్య కదాచన | కల్యాణం కసలం చాస్తి పరమాత్మా శివో యతః || 9

స శివస్సర్వమేవేదమధిష్ఠాయ స్వశక్తిభిః | అప్రచ్యుతస్స్వతో భావాత్‌ స్థితః స్థాణురతస్స్మృతః || 10

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

అణువులకు (పదార్థమునకు), లేదా క్రియకు,, లేదా మాయకు, లేదా ప్రకృతికి, లేదా బుద్ధికి, లేదా అహంకారమునకు, లేదా మనస్సునకు, లేదా చిత్తము (స్మరణము) నకు, లేదా ఇంద్రియములకు, లేదా భూతతన్మాత్రలకు, లేదా పంచభూతములకు సంబంధించిన బంధము ఏదియు శివునకు లేదు (1,2). అనంతమగు తేజస్సు గల శివునకు కాలము గాని, అంశము (కళ) గాని, విద్య గాని, నియతి గాని, రాగము గాని, ద్వేషము గాని లేవు (3). ఆయనకు పట్టుదల, కుశలము (కర్మలో నేర్పు లేక వివేకము), అకుశలము, కర్మలు, అవి పరిపక్వమగుట, వాటి ఫలములగు సుఖదుఃఖములు లేవు (4). శివునకు మూడు కాలములయందు ఉండే భావనలతో గాని, కర్మల సంస్కారములతో గాని, భోగములతో గాని, భోగసంస్కారములతో గాని సంబంధము లేనే లేదు (5). కారణము, కర్త, ఆది, అంతము, మధ్యము, కర్మ, కరణము, చేయకూడనిది, చేయవలసినది, బంధువు, బంధువు కానివాడు, నియమించు వాడు, ప్రేరేపించు వాడు, ప్రభువు, గురువు, రక్షించువాడు, అధికుడు, సమానుడు, పుట్టుక, మరణము, కోరబడేది, కోరబడనిది, విధి, నిషేధము, మోక్షము, బంధము అనునవి శివునకు లేవు (6-8). శివుడు పరమాత్మ గనుక, ఆయనకు సర్వము మంగళ##మే గాని, ఏ కాలమునందైననూ మంగళము కానిది లేనే లేదు (9). ఆ శివుడు ఈ సర్వమును తన శక్తులచే అధిష్ఠించి ఉన్నాడు. కాని, ఆయన తన స్వరూపమునుండి జారిపోకుండ నుండుటచే, ఆయనకు స్థాణువు (చలనము లేనివాడు) అని పేరు వచ్చినది (10).

శివేనాధిష్ఠితం యస్మాజ్జగత్‌ స్థావరజంగమమ్‌ | సర్వరూపస్స్మృతశ్శర్వస్తథా జ్ఞాత్వా న ముహ్యతి || 11

శర్వో రుద్రో నమస్తసై#్మ పురుషస్సత్పరో మహాన్‌ | హిరణ్యబాహుర్భగవాన్‌ హిరణ్యపతిరీశ్వరః || 12

అంబికాపతిరీశానఃపినాకీ వృషవాహనః | ఏకో రుద్రః పరం బ్రహ్మ పురుషః కృష్ణపింగలః || 13

బాలాగ్రమాత్రో హృన్మధ్యే విచింత్యో దహరాంతరే | హిరణ్యకేశః పద్మాక్షో హ్యరుణస్తామ్ర ఏవ చ || 14

యో%వసర్పత్యసౌ దేవో నీలగ్రీవో హిరణ్మయః | సౌమ్యో ఘోరస్తథా మిశ్రశ్చాక్షరశ్చామృతో%వ్యయః || 15

స పుంవిశేషః పరమో భగవానంతకాంతకః | చేతనాచేతనోన్ముక్తః ప్రపంచాచ్చ పరాత్పరః || 16

శివేనాతిశయత్వేన జ్ఞానైశ్వర్యే విలోకితే | లోకేశాతిశయత్వేన స్థితం ప్రాహుర్మనీషిణః || 17

ప్రతిసర్గప్రసూతానాం బ్రహ్మణాం శాస్త్రవిస్తరమ్‌ | ఉపదేష్టా స ఏవాదౌ కాలావచ్ఛేదవర్తినామ్‌ || 18

కాలావచ్ఛేదయుక్తానాం గురూణామప్యసౌ గురుః | సర్వేషామేవ సర్వేశః కాలావచ్ఛేదవర్జితః || 19

శుద్ధా స్వాభావికీ తస్య శక్తిస్సర్వాతిశాయినీ | జ్ఞానమప్రతిమం నిత్యం వపురత్యంతనిర్మితమ్‌ || 20

చరాచర జగత్తు శివునిచే అధిష్ఠించబడి యుండుటచే సంహారకుడగు శివుడే సర్వజగద్రూపములో నున్నాడని మహర్షలు చెప్పుచున్నారు. ఆ సత్యమును తెలుసుకున్న వ్యక్తి మోహమును పొందడు (11). రుద్రుడే సంహారకుడు. ఆయనకు నమస్కారమగు గాక! చేతనుడు, సద్రూపుడు, సర్వాతీతుడు, సర్వాధికుడు, బంగరు వలెమెరిసే చేతులు గలవాడు, షడ్గుణసంపన్నుడు, తేజస్సునకు ప్రభువు, జగన్నాథుడు (12). పార్వతీపతి, ఈశానరూపుడు, పినాకమును ధరించువాడు, వృషభము వాహనముగా గలవాడు, అద్వితీయుడు, రుద్రరూపుడు, పరంబ్రహ్మ, నలుపు యెరుపుల మిశ్ర వర్ణము గల పురుషుడు (13). హృదయమధ్యములో కేశాగ్రము వలె సూక్ష్మరూపములో నుండువాడు, బంగరు కేశములు గలవాడు, పద్మమును పోలిన కన్నులు గలవాడు, అరుణవర్ణము వాడు, రాగి రంగు గలవాడు అగు శివుని హృదయాకాశములో ధ్యానించ వలెను (14). నల్లని కంఠము గలవాడు, తేజోమయుడు అగు శివుడే సూర్యరూపములో ఆకాశమునందు సంచరించు చున్నాడు. ప్రసన్నము, భయంకరము మరియు రెండింటి కలయిక అగు రూపములు ఆయనకు గలవు. ఆయన వినాశము లేనివాడు. ఆయన అమృతస్వరూపుడు మరియు వికారములు లేనివాడు (15). సర్వాతీతుడు, షడ్గుణౖశ్వర్య సంపన్నుడు, మృత్యవునకు మృత్యువు, జడచేతనములనుండి విముక్తుడు, ప్రపంచమునకు మాత్రమే గాక ప్రకృతికి కూడ అతీతుడ అగు ఆ శివుడే పురుషోత్తముడు (16). జ్ఞానము మరియ ఈశ్వరత్వము అను వాటి చరమసీమను దర్శించుటచే, శివుడు లోకములయందలి ప్రభువులందరికంటె అతిశయముగా నున్నాడని విద్వాంసులు చెప్పుచున్నారు (17). ప్రతి సృష్టియందు పుట్టి, కాలమునకు వశవర్తులై యుండే బ్రహ్మలకు ఆయనయే సృష్ట్యాదియందు విస్తారమగు వేదమును ఉపదేశించును (18). కాలమునకు వశవర్తులై యుండే గురువులకు కూడా ఆయనయే గురువు. కాలపరిచ్ఛేదము లేని ఆ సర్వేశ్వరుడే అందరికీ ప్రభువు (19). ఆయనయొక్క శక్తి పరిశుద్ధమైనది. స్వభావసిద్ధమైనది, సర్వమును అతిశయించునది. ఆయన జ్ఞానము సాటి లేనిది, మరియు నిత్యము. నిర్మాణమునకు అతీతమైన ఆయన దేహము అవినాశి (20)

ఐశ్వర్యమప్రతిద్వంద్వం సుఖమాత్యంతికం బలమ్‌ | తేజః ప్రభావో వీర్యం చ క్షమా కారుణ్యమేవ చ || 21

పరిపూర్ణస్య సర్గాద్యైర్నాత్మనో%స్తి ప్రయోజనమ్‌ | పరానుగ్రహ ఏవాస్య ఫలం సర్వస్య కర్మణః || 22

ప్రణవో వాచకస్తస్య శివస్య పరమాత్మనః | శివరుద్రాదిశబ్దానాం ప్రణవో హి పరస్స్మృతః || 23

శంభోః ప్రణవవాచ్యస్య భవానాత్తజ్జపాదపి | యాసిద్ధిస్సా పరా ప్రాప్యా భవత్యేవ న సంశయః || 24

తస్మాదేకాక్షరం దేవమాహురాగమపారగాః | వాచ్యవాచకయోరైక్యం మన్యమానా మనస్వినః || 25

అస్య మాత్రాస్సమాఖ్యాతాశ్చతస్రో వేదమూర్ధని | అకారశ్చాప్యుకారశ్చ మకారో నాద ఇత్యపి || 26

అకారం బహ్వృచం ప్రాహురుకారో యజురిత్యపి | మకారస్సామనాదోస్య శ్రుతిరాథర్వణీ స్మృతా || 27

అకారశ్చ మహాబీజం రజస్ర్సష్టా చతుర్ముఖః | ఉకారః ప్రకృతిర్యోనిస్సత్త్వం పాలయితా హరిః || 28

మకారః పురుషో బీజం తమస్సంహారకో హరః | నాదః పరః పుమానీశో నిర్గుణో నిష్ర్కియశ్శివః || 29

సర్వం తిసృభిరేవేదం మాత్రాభిర్నిఖిలం త్రిధా | అభిధాయ శివాత్మానం బోధయత్యర్ధమాత్రయా || 30

యస్మాత్పరం నాపరమస్తి కించిద్యస్మాన్నాణీయో న జ్యాయో%స్తి కించిత్‌|

వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ఠత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌ || 31

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివమహిమ వర్ణనం నామ షష్ఠో%ధ్యాయః (6).

ప్రతిద్వంద్వి లేని ఈశ్వరభావము, ఆత్యంతికమగు (వచ్చి పోయేది కానిది) సుఖము, బలము, తేజస్సు, మహిమ, సామర్థ్యము, క్షయ, దయ అనువాటియందు పరిపూర్ణుడగు శివునకు సృష్టి మొదలగు వాటిచేత స్వీయమగు ప్రయోజనమేమియు లేదు. శివునకు ఈ సకలకర్మలకు ఫలము ఇతరులను అనుగ్రహించుట మాత్రమే (21,22). ఆ శివపరమాత్మను ఓంకారము నిర్దేశించును. శివుడు, రుద్రుడు మొదలగు శబ్దముల కంటె ఓంకారము ఉత్కృష్టమైనదని చెప్పబడినది (23). ఓంకారముచే నిర్దేశించబడే శంభుని ధ్యానించుట వలన, ఓంకారమును జపించుట వలన ఏ పరమసిద్ధి లభించునో, అది తప్పక పొందదగినది. సందేహము లేదు (24). కావున, వాచ్యమగు శివునకు వాచకమగు ఓంకారమునకు అభేదమును భావన చేసిన ధ్యాననిష్ఠులగు వేదవేత్తలు ఓంకారము ఒకే అక్షరము గల పరంబ్రహ్మ అని చెప్పుచున్నారు (25). దీనికి అకారము, ఉకారము, మకారము, నాదము అనే నాలుగు మాత్రలు గలవని ఉపనిషత్తులో చెప్పబడినది (26). అకారము ఋగ్వేదమునకు, ఉకారము యజుర్వేదమునకు, మకారము సామవేదమునకు, నాదము అథర్వణవేదమునకు ప్రతీకయని చెప్పెదరు (27). మహాబీజమగు అకారము రజోగుణమును, సృష్టిని చేయు చతుర్ముఖబ్రహ్మను నిర్దేశించును. ఉకారము ప్రకృతి అనబడే జగత్కారణమును, సత్త్వగుణమును, పాలకుడగు విష్ణువును నిర్దేశించును (28). మకారము చేతనుడగు పురుషుని (జీవుని), మాయాబీజమును, తమోగుణమును, ప్రళయకర్తయగు రుద్రుని నిర్దేశించును. పురుషోత్తముడు, ఈశ్వరుడు, నిర్గుణుడు, నిష్ర్కియుడు అగు శివుని నాదము నిర్దేశించును (29). ఓంకారము మూడు మాత్రలచే ఈ త్రిగుణాత్మకమగు సకలజగత్తును బోధించి, అర్ధమాత్రచే శివస్వరూపమును బోధించు చున్నది (30). ఎవని కంటె గొప్పది గాని తక్కువది గాని ఏదీ లేదో, దేనికంటె చిన్నది కాని పెద్దది గాని ఏదీ లేదో, ఏ అద్వితీయపూర్ణపురుషుడు చెట్టువలె స్వప్రకాశమునందు స్థిరముగా నున్నాడో, అట్టి శివునిచే ఈ సకలజగత్తు నిండి యున్నది (31).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివుని మహిమను వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Siva Maha Puranam-4    Chapters