Siva Maha Puranam-4    Chapters   

అథ త్రయస్త్రింశో%ధ్యాయః

పాశుపత వ్రత విధానము

ఋషయ ఊచుః |

భగవన్‌ శ్రోతుమిచ్ఛామో వ్రతం పాశుపతం పరమ్‌ | బ్రహ్మాదయో%పి యత్కృత్వా సర్వే పాశుపతాస్స్మృతాః || 1

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ పూజ్యా! బ్రహ్మ మొదలగు వారుకూడ దేనిని చేసి పాశుపతులైనారని చెప్పబడినదో, అట్టి శ్రేష్ఠమగు పాశుపతవ్రతమును గురించి వినగోరు చున్నాము (1).

వాయురువాచ|

రహస్యం వః ప్రవక్ష్యామి సర్వపాపనికృంతనమ్‌ | వ్రతం పాశుపతం శ్రౌతమథర్వశిరసి శ్రుతమ్‌ || 2

కాలశ్చైత్రీ పౌర్ణమాసీ దేశశ్శివపరిగ్రహః | క్షేత్రారామాద్యరణ్యం వా ప్రశస్తశ్శుభలక్షణః || 3

తత్ర పూర్వ త్రయోదశ్యాం సుస్నాతస్సుకృతాహ్నికః | అనుజ్ఞాప్య స్వమాచార్యం సంపూజ్య ప్రణిపత్య చ || 4

పూజాం వైశేషికీం కృత్వా శుక్లాంబరధరస్స్వయమ్‌ | శుక్లయజ్ఞోపవీతి చ శుక్లమాల్యానులేపనః || 5

దర్భాసనే సమాసీనో దర్భముష్టిం ప్రగృహ్య చ | ప్రాణా యామత్రయం కృత్వా ప్రాఙ్ముఖో వాప్యుదఙ్ముఖః |

ధ్యాత్వా దేవం చ దేవీం చ తద్విజ్ఞాపనవర్త్మనా || 6

వ్రతమేతత్కరోమీతి భ##వేత్సంకల్ప్య దీక్షితః | యావచ్ఛరీరపాతం వా ద్వాదశాబ్దమథాపి వా || 7

తదర్ధం వా తదర్ధం వా మాసద్వాదశకం తు వా | తదర్ధం వా తదర్ధం వా మాసమేకమథాపి వా || 8

దినద్వాదశకం వా%థ దినషట్కమథాపి వా | తదర్ధం దినమేకం వా వ్రతసంకల్పనావధి || 9

అగ్నిమాధాయ విధివద్విరజాహోమకారణాత్‌ | హుత్వాజ్యేన సమిద్భిశ్చ చరుణా చ యథాక్రమమ్‌ || 10

పూర్ణమాపూర్య తాం భూయస్తత్త్వానాం శుద్ధిముద్ధిశన్‌ | జుహుయాన్మూలమంత్రేణ తైరేవ సమిదాదిభిః || 11

రహస్యమైనది. పాపములనన్నింటినీపోగొట్టునది, అథర్వవేదమునకు చెందిన ఉపనిషత్తునందు చెప్పబడినది అగు పాశుపతము అనే శ్రౌతవ్రతమును మీకు చెప్పెదను (2). చైత్రమాసపూర్ణిమ దీనికి కాలము. శివునిచే అనుగ్రహించ బడిన స్థానమే దీనికి దేశము. లేదా, శుభకరమగు లక్షణములు గల క్షేత్రము, ఆరామము మొదలైనవి వాటిలో గాని, అరణ్యములో గాని చేయవచ్చును (3). అచట మొదటి త్రయోదశి నాడు చక్కగా స్నానమును చేసి, నిత్యకర్మలను చక్కగా చేసుకొని, తన ఆచార్యుని చక్కగా పూజించి, ఆయనకు నమస్కరించి, అనుమతిని తీసుకొని (4), విశేషపూజను చేసి, తాను స్వయముగా తెల్లని వస్త్రములను, తెల్లని యజ్ఞోపవీతమును, తెల్లని పుష్పమాలను మరియు తెల్లని అనులేపనము (శరీరముపై పూసుకొనే ద్రవ్యము) ను ధరించి (5), దర్భాసనమునందు చక్కగా కూర్చుండి, గుప్పెటలో దర్భలను పట్టుకొని, మూడుసార్లు ప్రాణాయామమును చేసి, తూర్పునకు గాని ఉత్తరమునకు గాని అభిముఖముగా కూర్చుండి, పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి, శివుడు బోధించిన విధముగా (6) ఈ వ్రతమును చేయుచున్నాను అని సంకల్పమును చెప్పి, దీక్షను స్వీకరించ వలెను. బ్రతికి ఉన్నంత కాలము, లేదా పన్నెండు సంవత్సరములు (7), లేదా ఆరు, లేదా మూడు సంవత్సరములు, లేదా ఒక సంవత్సరము, లేదా ఆరు, లేదా మూడు మాసములు, లేదా ఒక మాసము (8), లేదా పన్నెండు రోజులు, లేదా మూడు రోజులు, లేదా ఒక రోజు ఈ వ్రతమునకు అవధి. ఆ విధముగా సంకల్పించి (9), విరజాహోమమమును చేయుటు కొరకై యథావిధిగా అగ్నిని ఆధానము చేసి, క్రమమును తప్పకుండగా నేతితో, సమిధలతో మరియు వండిన అన్నముతో హోమమును చేసి (10), మరల పూర్ణాహుతిని చేసి, తత్త్వముల శుద్ధి కొరకై మూలమంత్రముతో ఆ సమిధలు మొదలగు ద్రవ్యములనే హోమము చేయవలెను (11).

తత్త్వాన్యేతాని మద్దేహే శుద్ధ్యంతామిత్యనుస్మరన్‌ | పంచ భూతాని తన్మాత్రాః పంచ కర్మేంద్రియాణి చ || 12

జ్ఞానకర్మవిభేదేన పంచకర్మవిభాగశః | త్వగాదిధాతవస్సప్త పంచ ప్రాణాదివాయవః || 13

మనో బుద్ధిరహంఖ్యాతిర్గుణాః ప్రకృతిపూరుషౌ | రాగో విద్యాకలే చైవ నియతిః కాల ఏవ చ || 14

మాయా చ శుద్ధవిద్యా చ మహేశ్వరసదాశివౌ | శక్తిశ్చ శివతత్త్వం చ తత్త్వాని క్రమశో విదుః || 15

మంత్రైస్తు విరజైర్హుత్వా హోతాసౌ విరజా భ##వేత్‌ | శివానుగ్రహమాసాద్య జ్ఞానవాన్‌ స హి జాయతే || 16

అథ గోమయమాదాయ పిండీకృత్యాభిమంత్ర్య చ | విన్యస్యాగ్నౌ చ సంప్రోక్ష్య దినే తస్మిన్‌ హవిష్యభుక్‌ || 17

ప్రభాతే తు చతుర్దశ్యాం కృత్వా సర్వం పురోదితమ్‌ | దినే తస్మిన్నిరాహారః కాలం శేషం సమాపయేత్‌ || 18

ప్రాతః పర్వణి చాప్యేవం కృత్వా హోమావసానతః | ఉపసంహృత్య రుద్రాగ్నిం గృహ్ణీయాద్భస్మ యత్నతః || 19

తతశ్చ జటిలో ముండీ శిఖైకజట ఏవ వా | భూత్వా స్నాత్వా తతో వీతలజ్జశ్చేత్స్యాద్దిగంబరః || 20

అపి కాషాయవసనశ్చర్మచీరాంబరో%థ వా | ఏకాంబరో వల్కలీ వా భ##వేద్దండీ చ మేఖలీ || 21

నా దేహమునందు ఈ తత్త్వములు శుద్ధమగును గాక! అని స్మరిస్తూ హోమమును చేయవలెను. అయిదు భూతములు, వాటి తన్మాత్రలు (సూక్ష్మభూతములు), అయిదుకర్మేంద్రియములు (12), అయిదు జ్ఞానేంద్రియములు, చర్మము మొదలగు ఏడు ధాతువులు, ప్రాణము మొదలగు అయిదు వాయువులు (13), మనస్సు, బుద్ధి, అహంకారము, మూడు గుణములు, ప్రకృతి, పురుషుడు, రాగము, విద్య, కళ, నియతి, కాలము (14), మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు, శక్తి, శివుడు అనునవి క్రమముగా తత్త్వములని చెప్పబడినవి (15). ఈ హోమమును చేయు వ్యక్తి విరజామంత్రములతో హోమమును చేసి దోషములు లేనివాడు అగును. ఆతడు శివుని అనుగ్రహమును పొంది జ్ఞాని యగును (16). తరువాత ఆతడు గోమయమును తీసుకొని, పిండముగా చేసి, అభిమంత్రించి, అగ్నిలో నుండి, సంప్రోక్షించ వలెను. ఆతడు ఆ నాడు హవిస్సును మాత్రమే భుజించ వలెను. (17). మరునాడు చతుర్దశి నాడు ఉదయము పైన చెప్పబడిన కర్మను అంతనూ చేసి, ఆ రోజు మిగిలిన కాలమును నిరాహారముగా గడుప వలెను (18). పూర్ణిమ నాడు ఉదయము కూడ ఇదే విధముగా చేసి, హోమము పూర్తి అయిన పిదప రుద్రాగ్నిని ఉపసంహరించి, శ్రద్ధతో భస్మను సంగ్రహించ వలెను. (19). తరువాత జటలను ధరించ వలెను. లేదా, ముండనము చేయించు కొనవలెను; లేదా, ఒక జటను పిలకగా నుంచు కొనవలెను. ఆతడు తరువాత స్నానమును చేసి, సిగ్గును విడిచిన వాడైనచో దిగంబరుడుగా నుండవలెను (20). లేదా, కాషాయవస్త్రములను గాని, చర్మమును గాని, నారబట్టలను గాని ధరించవలెను. ఆతడు ఒకే ఒక వస్త్రమును గాని, లేదా చెట్టు బెరడును గాని ధరించి, మేఖల (నడుము చుట్టూ త్రాడు) ను కట్టుకొని, దండమును పట్టుకొన వలెను (21).

ప్రక్షాల్య చరణౌ పశ్చాద్ద్విరాచమ్యాత్మనస్తనుమ్‌ | సంకులీకృత్య తద్భస్మ విరజానలసంభవమ్‌ || 22

అగ్నిరిత్యాదిభిర్మంత్రైః షడ్భిరాథర్వణౖః క్రమాత్‌ | విమృజ్యాంగాని మూర్ధాదిచరణాంతాని తైస్స్పృశేత్‌ || 23

తతస్తేన క్రమేణౖవ సముద్ధృత్య చ భస్మనా | సర్వాంగోద్ధూలనం కుర్యాత్ర్పణవేన శివేన వా || 24

తతస్త్రి పుండ్రం రచయేత్‌ త్రియాయుషసమాహ్వయమ్‌ | శివభావం సమాగమ్య శివయోగమథాచరేత్‌ || 25

కుర్యాత్త్రి సంధ్యమహ్యేవమేతత్పాశుపతం వ్రతమ్‌ | భుక్తిముక్తిప్రదం చైతత్పశుత్వం వినివర్తయేత్‌ || 26

తత్పశుత్వం పరిత్యజ్య కృత్వా పాశుపతం వ్రతమ్‌ | పూజనీయో మహాదేవో లింగమూర్తిస్సనాతనః || 27

పద్మమష్టదలం హైమం నవరత్నైరలంకృతమ్‌ | కర్ణికాకేశరోపేతమాసనం పరికల్పయేత్‌ || 28

విభ##వే తదభావే తు రక్తం సితమథాపి వా | పద్మం తస్యాప్యభావే తు కేవలం భావనామయమ్‌ || 29

తత్పద్మకర్ణికామధ్యే కృత్వా లింగం కనీయసమ్‌ | స్ఫాటికం పీఠికోపేతం పూజయేద్విధివత్ర్క మాత్‌ || 30

ప్రతిష్ఠాప్య విధానేన తల్లింగం కృతశోధనమ్‌ | పరికల్ప్యాసనం మూర్తిం పంచవక్త్ర ప్రకారతః || 31

పంచగవ్యాదిభిః పూర్ణైర్యథావిభవసంభృతైః | స్నాపయేత్కలశైః పూర్ణైరష్టాపదసముద్భవైః || 32

తరువాత కాళ్లను కడుగుకొని, రెండుసార్లు ఆచమనమును చేసి, విరజాహోమమును చేసిన అగ్నికుండములో తయారైన భస్మను ప్రోగు చేసుకొని, అగ్నిరితి భస్మ అని మొదలయ్యే అథర్వణవేదమునందలి ఆరు మంత్రములను వరుసగా పఠిస్తూ తలతో మొదలిడి పాదముల వరకు గల అవయవములను స్పృశిస్తూ భస్మను రాసుకొని తన దేహమును పవిత్రము చేసుకొన వలెను (22,23). తరువాత అదే క్రమములో మంత్రములతో గాని, ఓంకారముతో గాని, శివమంత్రముతో గాని భస్మను శరీరములోని అవయవములన్నింటిపై చల్లుకొన వలెను (24). తరువాత త్రియాయుషం అనే మంత్రమును చెప్పి, త్రిపుండ్రమును ధరించి, శివభావమును ఆపాదించుకొని, తరువాత శివయోగమును ఆచరించవలెను (25). మూడు సంధ్యలలో ఇదే విధముగా పాశుపతవ్రతమును చేయవలెను. ఇది సాధకునకు భుక్తిని, ముక్తిని ఇచ్చి అజ్ఞానమును విశేషముగా తొలగించును (26). పాశుపతవ్రతమును చేసి పశుభావమును విడిచి పెట్టి, లింగరూపములోనున్న సనాతనుడగు మహాదేవుని పూజించ వలెను (27). సంపద గలవాడైనచో, ఎనిమిది దళములు తొడిమ మరియు దుద్దు గల బంగరు పద్మమును తొమ్మిది రత్నములతో నలంకరించి, దానిని శివునకు ఆసనముగా నీయవలెను. సంపద లేనిచో, ఎర్రని లేదా తెల్లని పద్మమును ఈయవలెను. అది కూడా లేనిచో, కేవలము భావనారూపమగు పద్మమును సమర్పించ వలెను (28,29). ఆ పద్మము యొక్క దుద్దునకు మధ్యలో పీఠముతో కూడియున్న ఆ చిన్న స్ఫాటిక లింగమును యథావిధిగా క్రమముగా పూజించ వలెను (30). శోధనము చేయబడిన ఆ లింగమును యథావిధిగా ప్రతిష్ఠించి, ఆ విధముగా ఆసనమును కల్పించి, తన వైభవమునకు తగ్గట్లుగా సమకూర్చుకున్న పంచగవ్యములు మొదలగు ద్రవ్యములతో నిండియున్న బంగరు పూర్ణకలశములతో ఆ లింగమూర్తికి అయిదు ముఖములకు వరుసగా అభిషేకమును చేయవలెను (31,32).

గంధద్రవ్యైస్సకర్పూరైశ్చందనాద్యైస్సకుంకుమైః | సవేదికం సమాలిప్య లింగం భూషణభూషితమ్‌ || 33

బిల్వపత్రైశ్చ పద్మైశ్చ రక్తైః శ్వేతైస్తథోత్పలైః | నీలోత్పలైస్తథాన్యైశ్చ పుషై#్పసై#్తసై#్తస్సుగంధిభిః || 34

పుణ్యౖః ప్రశ##సై#్తః పత్రైశ్చ చితై ర్దూర్వాక్షతాదిభిః | సమభ్యర్చ్య యథాలాభం మహాపూజావిధానతః || 35

ధూపం దీపం తథా చాపి నైవేద్యం చ సమాదిశేత్‌ | నివేదయిత్వా విభ##వే కల్యాణం చ సమాచరేత్‌ || 36

ఇష్టాని చ విశిష్టాని న్యాయేనోపార్జితాని చ | సర్వద్రవ్యాణి దేయాని వ్రతే తస్మిన్‌ విశేషతః || 37

శ్రీపత్రోత్పలపద్మానాం సంఖ్యా సాహస్రికీ మతా | ప్రత్యేకమపరా సంఖ్యా శతమష్టోత్తరం ద్విజాః || 38

తత్రాపి చ విశేషేణ న త్యజేద్బిల్వపత్రకమ్‌ | హైమమేకం పరం ప్రాహుః పద్మం పద్మసహస్రకాత్‌ || 39

నీలోత్పలాదిష్వప్యేతత్సమానం బిల్వపత్రకైః | పుష్పాంతరే న నియమో యథాలాభం నివేదయేత్‌ || 40

అష్టాంగమధ్యముత్కృష్టం ధూపాలేపౌ విశేషతః | చందనం వామదేవాఖ్యే హరితాలం చ పౌరుషే || 41

ఈశానే భసితం కేచిదాలేపనమితీదృశమ్‌ | న ధూపమితి మన్యంతే ధూపాంతరవిధానంతః |

సితాగురుమఘోరాఖ్యే ముఖే కృష్ణాగురుం పునః || 42

పౌరుషే గుగ్గులుం సవ్యే సౌమ్యే సౌగంధికం ముఖే | ఈశానే%పి హ్యుశీరాది దేయాద్ధూపం విశేషతః || 43

వేదితో సహా లింగమునకు కర్పూరము, చందనము మొదలగు సుగంధద్రవ్యములను చక్కగా లేపనము చేసి, భూషణములతో అలంకరించవలెను (33). మారేడు పత్రములతో, ఎర్రని పద్మములతో, తెల్లని మరియు నల్లని కలువలతో, మరియు ఇతరములగు ఆయా సుగంధపుష్పములతో (34), పవిత్రము మరియు శ్రేష్ఠము అగు పత్రములతో, రంగు రంగుల దూర్వలతో, అక్షతలతో, లభించిన దానిని బట్టి మహాపూజావిధానము ననుసరించి చక్కగా పూజించవలెను (35). ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలెను. సర్వవ్యాపకుడగు ఆ ఈశ్వరునకు విన్నవించి, కల్యాణమును కూడ జరుప వలెను (36). ఆ వ్రతమునందు ప్రియమైనవి, విలువైనవి, న్యాయముగా సంపాదించినవి అగు సకలద్రవ్యములను విశేషముగా సమర్పించ వలెను (37). మారేడు పత్రములు, కలువలు, పద్మములు ఒక్కొక్కటి వెయ్యి చొప్పున ఉండవలెను. ఓ బ్రాహ్మణులారా! ఇతరపుష్పముల సంఖ్య ఒక్కొక్కటి నూట యెనిమిది చొప్పున ఉండవలెను (38). వాటిలో కూడ ప్రత్యేకించి మారేడు పత్రములను విడువరాదు. వేయి పద్మముల కంటె ఒక్క బంగరు పద్మము శ్రేష్ఠమని చెప్పెదరు (39). నల్ల కలువలు మొదలగు వాటికి కూడ ఇది వర్తించును. నల్ల కలువలు మారేడుపత్రములతో సమానమైనవి. మిగిలిన పుష్పముల విషయములో నియమము లేదు. దొరికే దానిని బట్టి వాటిని సమర్పించ వలెను (40). ఎనిమిది అంగములు గల అర్ఘ్యము విశిష్టమైనది. ధూపము, మరియు అంగరాగముల విషయములో ఈ క్రింది విశేషము గలదు. వామదేవ ముఖమునకు చందనమును, తత్పురుష ముఖమునకు హరిదళమును (41), ఈశానముఖమునకు భస్మను ఆలేపనముగా నీయవలెను. మరియొక ధూపవిధి యుండుటచే ఈ సామాన్యమగు ధూపము నిషిద్ధమని కొందరు చెప్పుచున్నారు.అఘోరముఖమునకుతెల్ల అగరును, తత్పురుషముఖమునకు నల్ల అగరును, వామదేవముఖమునకు గుగ్గిలమును, సద్యోజాతముఖమునకు గంధకమును, ఈశానముఖమునకు వట్టివ్రేళ్లను విశేషముగా ధూపము వేయవలెను (42, 43).

శర్కారామధుకర్పూరకపిలాఘృతసంయుతమ్‌ | చందనాగురుకాష్ఠాద్యం సామాన్యం సంప్రచక్షతే || 44

కర్పూరవర్తిరాజ్యాఢ్యా దేయా దీపావలిస్తతః | అర్ఘ్యమాచమనం దేయం ప్రతివక్త్ర మతః పరమ్‌ || 45

ప్రథమావరణ పూజ్యౌ క్రమాద్ధేరంబషణ్ముఖౌ | బాహ్మాంగాని తతశ్చైవ ప్రథమావరణర్చితే || 46

ద్వితీయావరణ పూజ్యా విఘ్నేశాశ్చక్రవర్తినః | తృతీయావరణ పూజ్యా భవాద్య అష్టమూర్తయః || 47

మహాదేవాదయస్తత్ర తథైకాదశమూర్తయః | చతుర్థావరణ పూజ్యాస్సర్వ ఏవ గణశ్వరాః || 48

బహిరేవ తు పద్మస్య పంచమావరణ క్రమాత్‌ | దశ దిక్పతయః పూజ్యాస్సాస్త్రా స్సానుచరాస్తథా || 49

బ్రహ్మణో మానసాః పుత్రాస్సర్వే%పి జ్యోతిషాం గణాః | సర్వా దేవ్యశ్చ దేవాశ్చ సర్వే సర్వే చ ఖేచరాః || 50

పాతాలవాసినశ్చాన్యే సర్వే మునిగణా అపి |యోగినో హి మఖాస్సర్వే పతంగా మాతరస్తథా || 51

క్షేత్రపాలాశ్చ సగణాస్సర్వం చైతచ్చరాచరమ్‌ | పూజనీయం శివప్రీత్యై మత్త్వా శంభువిభూతిమత్‌ || 52

అథావరణపూజాంతే సంపూజ్య పరమేశ్వరమ్‌ | సాజ్యం సవ్యంజనం హృద్యం హవిర్భక్త్యానివేదయేత్‌ || 53

పంచదార, తేనె, కర్పూరము, కపిలగోవు నేయి, చందనము, అగరు చెక్క మొదలగు పదార్థములతో చేసిన ధూపమును ముఖములన్నింటికీ సమానముగా వాడవచ్చునని పెద్దలు చెప్పుచున్నారు (44). తరువాత నేతిలో నానబెట్టిన కర్పూరపు వత్తులతో దీపపంక్తిని సమర్పించవలెను. తరువాత ప్రతి ముఖమునకు అర్ఘ్యమును మరియు ఆచమనమును ఈయవలెను (45). మొదటి ఆవరణలో విఘ్నేశ్వరుని, కుమారస్వామిని, యంత్రము యొక్క బాహ్యమునందు ఉండే అంగములను వరుసగా పూజించ వలెను. మొదటి ఆవరణలో పూజ అయిన తరువాత (46), రెండవ ఆవరణయందు విఘ్నేశ్వరులను మరియు చక్రవర్తులను, మూడవ ఆవరణయందు భవుడు మొదలగు అష్టమూర్తులను మరియు మహాదేవుడు మొదలగు ఏకాదశరుద్రులను కూడ పూజించవలెను. నాల్గవ ఆవరణలో గణాధ్యక్షులను అందరినీ పూజించవలెను (47, 48). అయిదవ ఆవరణలో పద్మమునకు బయట మాత్రమే వరుసగా అస్త్రములతో మరియు అనుచరులతో కూడియున్న పది దిక్పాలకులను పూజించ వలెను (49). బ్రహ్మయొక్క మానసపుత్రులను, నక్షత్రగణములను అన్నింటినీ, ఆకాశమునందు సంచరించు దేవతలను మరియు దేవీమూర్తులను అందరినీ (50), పాతాళమునందు నివసించు ఇతరులను, మునిగణముల నందరినీ, యోగులను సకలయజ్ఞముల (అధిష్ఠాన దేవతల) ను, పక్షులను, మాతృమూర్తులను మరియు (51) గణములతో కూడియున్న క్షేత్రపాలకులను పూజించ వలెను. ఈ చరాచరజగత్తు అంతయు శివుని విభూతిని కలిగియున్నదని తెలుసుకొని, శివప్రీతి కొరకై పూజించ వలెను (52). ఆవరణ పూజ అయిన తరువాత పరమేశ్వరుని పూజించి, నేతితో మరియు వ్యంజనములతో (కూర, పచ్చడి మొదలగునవి) కూడిన, మనస్సునకు ఆహ్లాదమును కలిగించే హవిస్సును భక్తితో నివేదన చేయవలెను (53).

ముఖవాసాదికం దత్వా తాంబూలం సోపదంశకమ్‌ | అలంకృత్య చ భూయో%పి నానాపుష్పవిభూషణౖః || 54

నీరాజనాంతే విస్తీర్య పూజాశేషం సమాపయేత్‌ | చషకం సోపకారం చ శయనం చ సమర్పయేత్‌ || 55

చంద్రసంకాశహారం చ శయనీయం సమర్పయేత్‌ | ఆద్యం నృపోచితం హృద్యం తత్సర్వమనురూపతః || 56

కృత్వా చ కారయిత్వా చ హుత్వా చ ప్రతిపూజనమ్‌ | స్తోత్రం వ్యపోహనం జప్త్వా విద్యాం పంచాక్షరీం జపేత్‌ || 57

ప్రదక్షిణాం ప్రణామం చ కృత్వాత్మానం సమర్పయేత్‌ | తతః పురస్తాద్దేవస్య గురువిప్రౌ చ పూజయేత్‌ || 58

దత్త్వార్ఘ్యమష్టౌ పుప్పాణి దేవముద్వాస్య లింగతః | అగ్నేశ్చాగ్నిం సుసంయమ్య హ్యుద్వాస్య చ తమప్యుత || 59

ప్రత్యహం చ జనస్త్వేవం కుర్యాత్సేవాం పురోదితామ్‌ | తతస్తత్సాంబుజం లింగం సర్వోపకరణాన్వితమ్‌ || 60

సమర్పయేత్స్వగురవే స్థాపయేద్వా శివాలయే | సంపూజ్య చ గురూన్‌ విప్రాన్‌ ప్రతినశ్చ విశేషతః || 61

భక్తాన్‌ ద్విజాంశ్చ శక్తశ్చేద్దీనానాథాంశ్చ తోషయేత్‌ | స్వయం చానశ##నే శక్తః ఫలమూలాశ##నే%థవా || 62

నోటిని సుగంధపూర్ణము చేయుటకై వక్కపొడితో కూడిన తాంబూలమును ఇచ్చి, మరల వివిధరకముల పుష్పములతో మరియు ఆభరణములతో అలంకరించి (54), విస్తారమగు పూజను నీరాజనముతో పూర్తి చేసి,మిగిలిన పూజను సమాప్తి చేయవలెను. నీటిని త్రాగే పాత్రను, సౌకర్యమును కలిగించే ఇతరములగు వస్తువులను, శయ్యను సమర్పించ వలెను (55). చంద్రుని పోలిన హారమును శయ్యపై నుంచ వలెను. మహారాజు స్థాయికి తగ్గట్లుగా మనోహరమైన తినుబండారములను, వాటికి అనురూపమైన ఇతరములగు సకలవస్తువులను (56) స్వయముగా ఏర్పాటు చేసి, ఇతరులచే కూడ చేయించ వలెను. ప్రతి పూజయందు హోమమును చేయవలెను. అమంగళములను పోనాడే స్తోత్రమును పఠించి, పంచాక్షరీ మంత్రమును జపించ వలెను (57). తరువాత ఆతడు ప్రదక్షిణమును చేసి, నమస్కరించి, తనను సమర్పించు కొనవలెను. తరువాత దేవుని యెదుట గురువును, బ్రాహ్మణుని పూజించ వలెను (58). అర్ఘ్యమును, ఎనిమిది పుష్పములను ఇచ్చి, లింగమునుండి శివునకు ఉద్వాసనను చెప్పి, ఏకాగ్రమగు చిత్తము గలవాడై అగ్నిహోత్రమునుండి అగ్నికి కూడ ఉద్వాసనను చెప్పవలెను (59). మానవుడు ప్రతి దినము ఇంతవరకు చెప్పిన విధముగా సేవను చేసి, తరువాత పద్మము మరియు ఇతరములగు ఉపకరణములన్నింటితో కూడి యున్న ఆ లింగమును (60) తన గురువునకు సమర్పించ వలెను; లేదా, శివాలయమునందు స్థాపించ వలెను. గురువులను, బ్రాహ్మణులను, విశేషించి ఇట్టి వ్రతమును చేయువారిని చక్కగా పూజించి (61), భక్తులను, బ్రాహ్మణులను, శక్తి ఉన్నచో దీనులను అనాథులను సంతోషపెట్ట వలెను. తాను శక్తి ఉన్నచో ఉపవాసమును చేయ వలెను; లేదా, పళ్లను దుంపలను తినవలెను (62).

పయోవ్రతో వా భిక్షాశీ భ##వేదేకాశనస్తథా | నక్తం యుక్తాశనో నిత్యం భూశయ్యానిరతశ్శుచిః || 63

భస్మశాయీ తృణశాయీ చీరాజినధృతో%థవా | బ్రహ్మ చర్యవ్రతో నిత్యం వ్రతమేతత్సమాచరేత్‌ || 64

అర్కవారే తథార్ద్రాయాం పంచదశ్యాం చ పక్షయోః | అష్టమ్యాంచ చతుర్దశ్యాం శక్తస్తూపవసేదపి || 65

పాఖండిపతితో దక్యాస్సూతకాంత్యజపూర్వకాన్‌ | వర్జయేత్సర్వయత్నేన మనసా కర్మణా గిరా | 66

క్షమాదానదయాసత్యాహింసాశీలస్సదా భ##వేత్‌ | సంతుష్టశ్చ ప్రశాంతశ్చ జపధ్యానరతస్సదా || 67

కుర్యాత్త్రి షవణస్నానం భస్మస్నానమథాపి వా| పూజాం వైశేషికీం చైవ మనసా వచసా గిరా || 68

బహునాత్ర కిముక్తేన నాచరేదశివం వ్రతీ | ప్రమాదాత్తు తథాచారే నిరూప్య గురులాఘవే || 69

ఉచితం నిష్కృతిం కుర్యాత్పూజాహోమజపాదిభిః | ఆసమాప్తేర్ర్వ తసై#్యవమాచరేన్న ప్రమాదతః || 70

గోదానం చ వృషోత్సర్గం కుర్యాత్పూజాం చ సంపదా | భక్తశ్చ శివప్రీత్యర్థం సర్వకామవివర్జితః || 71

సామాన్యమేతత్కథితం వ్రతస్యాస్య సమాసతః | ప్రతిమాసం విశేషం చ ప్రవదామి యథాశ్రుతమ్‌ || 72

పాలను త్రాగి ఉండవలెను; లేదా, భిక్షాన్నమును భుజించవలెను. మరియు ఒక పూట మాత్రమే భుజించ వలెను. రాత్రి యథోచితముగా తినవలెను. నిత్యము పరిశుద్ధుడుగా నుంటూ నేలపై పరుండుటయందు ప్రీతిని కలిగి యుండవలెను (63). భస్మయందు గాని, గడ్డిపై గాని పరుండ వలెను. నారబట్టలను గాని, చర్మమును గాని ధరించ వలెను. నిత్యము బ్రహ్మచర్యదీక్షను పాటిస్తూ ఈ వ్రతమును కొనసాగించ వలెను (64). శక్తి ఉన్నచో ఆదివారము, ఆర్ద్రా నక్షత్రము, పూర్ణిమ, అమావాస్య , రెండు పక్షములలో అష్టమి మరియు చతుర్దశిల యందు ఉపవాసమును చేయవలెను (65). పాఖండులు, పతితులు, రజస్వలా స్త్రీలు, ఆశౌచము గలవారు మరియు పశుఘాతకులు అను వారితో మనోవాక్కాయములతో సంపర్కము కలుగకుండునట్లు సకలప్రయత్నములను చేయవలెను (66). సాధకుడు సర్వకాలములలో ఓర్పు, దానము, దయ, సత్యము, అహింస, సంతృప్తి, మనఃప్రసన్నత మరియు జపమునందు ధ్యానమునందు ప్రీతి అను లక్షణములను కలిగి యుండవలెను (67). మూడు పూటలా స్నానమును చేయవలెను; భస్మస్నానమునైననూ చేయవలెను. మనస్సుతో మరియు వాక్కులతో విశేషమగు పూజను చేయవలెను (68). ఇన్ని మాటలేల? ఈ వ్రతమును చేయు వ్యక్తి పొరపాటు చేతనైననూ అమంగళమగు పనిని చేయరాదు. అట్లు చేసినచో, అది చిన్నదా లేక పెద్దదా అను విషయమును విచారించి (69), తగిన విధముగా పూజ , జపము మరియు హోమము మొదలగు వాటితో ప్రాయశ్చిత్తమును చేయవలెను. వ్రతము పూర్తి యగునంతవరకు పొరపాటు జరుగని విధముగా ఈ విధముగా ఆచరించ వలెను (70). భక్తుడు సకలములగు కామనలను విడిచి పెట్టి శివుని ప్రీతి కొరకై సంపదను బట్టి గోదానము, ఆంబోతును విడుచుట మరియు పూజ అను కర్మలను చేయవలెను (71). ఈ వ్రతముయొక్క సామాన్యనియమములను సంగ్రహముగా చెప్పతిని. ప్రతి నెలకు కొన్ని విశేషములు గలవు. నేను విన్నదానిని బట్టి వాటిని చెప్పెదను (72).

వైశాఖే వజ్రలింగం తు జ్యేష్ఠే మారకతం శుభమ్‌ | ఆషాడే మౌక్తికం విద్యాచ్ఛ్రావణ నీలనిర్మితమ్‌ || 73

మాసే భాద్రపదే చైవ పద్మరాగమయం పరమ్‌ | ఆశ్వినే మాసి విద్యాద్వై లింగం గోమేధకం వరమ్‌ || 74

కార్తిక్యాం వైద్రుమం లింగం వైదూర్యం మార్గశీర్షకే | పుష్పరాగమయం పౌషే మాఘే ద్యుమణిజంతథా || 75

ఫాల్గునే చంద్రకాంతోత్థం చైత్రే తద్వ్యత్యయో%థ వా | సర్వమాసేషు రత్నానామలాభే హైమమేవ వా || 76

హైమాభావే రాజతం వా తామ్రజం శైలజం తథా | మృన్మయం వా యథాలాభం జాతుషం చాన్యదేవ వా || 77

సర్వగంధమయం వాథ లింగం కుర్యాద్యథారుచి | వ్రతావసానసమయే సమాచరితనిత్యకః || 78

కృత్వా వైశేషికీం పూజాం హుత్వా చైవ యథా పురా | సంపూజ్య చ తథాచార్యం వ్రతినశ్చ విశేషతః || 79

దేశికేనాప్యనుజ్ఞాతః ప్రాఙ్ముఖో వాప్యుదఙ్ముఖః | దర్భాసనో దర్భపాణిః ప్రాణాపానౌనియమ్య చ || 80

జపిత్వా శక్తితో మూలం ధ్యాత్వా సాంబం త్ర్యంబకమ్‌ | అనుజ్ఞాప్య యథాపూర్వం నమస్కృత్య కృతాంజలిః || 81

సముత్సృజామి భగవన్‌ వ్రతమేతత్త్వదాజ్ఞయా | ఇత్యుక్త్వా లింగమూలస్థాన్‌ దర్భానుత్తరతస్త్యజేత్‌ || 82

వైశాఖమాసములో వజ్రలింగము, జ్యేష్ఠమాసములో మరకతలింగము, ఆషాఢమాసములో ముత్యముతో చేసిన లింగము, శ్రావణమాసములో ఇంద్రనీలమణితో చేసిన లింగము (73), భాద్రపద మాసములో పద్మరాగమణితో చేసిన లింగము, ఆశ్వయుజ మాసములో గోమేధకముతో చేసిన లింగము శ్రేష్ఠము (74). కార్తీకమాసములో పగడముతో చేసిన లింగము, మార్గశీర్షములో వైదూర్యముతో చేసిన లింగము, పుష్యములో పుష్పరాగముతోచేసినది, మాఘములో సూర్యకాంతలింగము (75), ఫాల్గునములో చంద్రకాంతలింగము, చైత్రమాసములో సూర్యకాంతలింగము శ్రేష్ఠము. రత్నములు దొరకని పక్షములో మాసములన్నింటిలో బంగరు లింగము శ్రేష్ఠము (76). బంగారము లేనిచో వెండి, రాగి, రాయి, మట్టి, లక్క , లేక లభించిన మరే పదార్థముతో నైననూ (77), లేదా తన రుచికి తగ్గట్లుగా సకలసుగంధపదార్థములతో లింగమును చేయవలెను. వ్రతము పూర్తి అయిన సమయములో నిత్యకర్మలను చేసుకొని (78), విశేషపూజను చేసి, పూర్వమునందు వలెనే హోమమును చేసి, ఆచార్యుని వ్రతమును చేసిన వారిని విశేషముగా చక్కగా పూజించి (79), ఆచార్యుని అనుమతిని తీసుకొని, తూర్పు లేక ఉత్తరమునకు అభిముఖముగా దర్భాసనముపై కూర్చుండి, చేతిలో దర్భలను పట్టుకొని,ప్రాణాయామమును చేసి (80), శక్తిననుసరించి మూలమంత్రమును జపించి, జగన్మాతతో గూడియున్న ఆ ముక్కంటిని ధ్యానించి, పూర్వమునందు వలెనే విన్నవించుకొని, చేతులను జోడించి నమస్కరించి (81), ఓ భగవంతుడా! నీ అనుమతితో ఈ వ్రతమును ముగించు చున్నాను అని పలికి, లింగముయొక్క మూలమునందున్న దర్భలను ఉత్తరదిక్కునందు పారవేయ వలెను (82).

తతో దండజటాచీరమేఖలా అపి చోత్సృజేత్‌ | పునరాచమ్య విధివత్పంచాక్షరముదీరయేత్‌ || 83

యః కృత్వాత్యంతికీం దీక్షామాదేహాంతమనాకులః | వ్రతమేతత్ర్ప కుర్వీత స తు వైనైష్ఠికస్స్మృతః || 84

సో%త్యాశ్రమీ చ విజ్ఞేయో మహాపాశుపతస్తథా | స ఏవ తపతాం శ్రేష్ఠస్స ఏవ చ మహావ్రతీ || 85

న తేన సదృశః కశ్చిత్కృతకృత్యో ముముక్షుషు | యో యతిర్నైష్ఠికో జాతస్తమాహుర్నైష్ఠికోత్తమమ్‌ || 86

యో%న్వహం ద్వాదశాహం వా వ్రతమేతత్సమాచరేత్‌ | సో%పి నైష్ఠికతుల్యస్స్యాత్తీవ్రవ్రతసమన్వయాత్‌ || 87

ఘృతాక్తో యశ్చరేదేతద్ర్వతం వ్రతపరాయణః | ద్విత్రై కదివసం వాపి స చ కశ్చన నైష్ఠికః || 88

కృత్యమిత్యేవ నిష్కామో యశ్చరేద్వ్రతముత్తమమ్‌ | శివార్పితాత్మా సతతం న తేన సదృశః క్వచిత్‌ || 89

భస్మచ్ఛన్నో ద్విజో విద్వాన్మహాపాతకసంభ##వైః | పాపైస్సుదారుణౖస్సద్యో ముచ్యతే నాత్ర సంశయః || 90

రుద్రాగ్నేర్యత్పరం వీర్యం తద్భస్మ పరికీర్తితమ్‌ | తస్మాత్సర్వేషు కాలేషు వీర్యవాన్‌ భస్మసంయుతః || 91

భస్మనిష్ఠస్య నశ్యంతి దోషా భస్మాగ్నిసంగమాత్‌ | భస్మస్నానవిశుద్ధాత్మా భస్మనిష్ఠ ఇతి స్మృతః || 92

తరువాత దండము, జటలు, నారబట్టలు, మేఖలు అనువాటిని కూడ విడిచి పెట్టవలెను. ఆతడు యథావిధిగా మరల ఆచమనమును చేసి పంచాక్షరమంత్రమును ఉచ్చరించవలెను (83). ఎవడైతే ఆజీవనదీక్షను గైకొని ఆందోళనలు లేనివాడై జీవించి యున్నంతవరకు ఈ వ్రతమును చేయునో, ఆతడు నైష్ఠికుడని చెప్పబడినాడు (84). అట్టి మహాపాశుపతుడు ఆశ్రమములన్నింటికీ అతీతుడని తెలియవలెను. ఆతడు మాత్రమే తపశ్శాలులలో శ్రేష్ఠుడు. ఆతడు మాత్రమే మహావ్రతము గలవాడు (85). మోక్షము ను గోరువారిలో ఆతనితో సమానముగా కృతార్థుడైన వాడు మరియొకడు లేడు. ఏ సన్న్యాసి నైష్ఠికుడగునో, ఆతడు నైష్ఠికోత్తముడని చెప్పబడును (86). ఎవడైతే పన్నెండు రోజుల వరకు ప్రతిదినము ఈ వ్రతమును చేయునో, ఆతడు తీవ్రమగు వ్రతమను అనుష్ఠించిన వాడగుటచే నైష్ఠికునితో సమానుడే యగును (87). వ్రతమునందు నిష్ఠ గల ఏ వ్యక్తి కనీసము రెండు మూడు రోజులైననూ శరీరమంతటా నేయిని పట్టించుకొని ఈ వ్రతమును చేయునో, వాడు కూడ ఒక రకమగు నైష్ఠికుడే యగును (88). చేయదగినది గనుక చేయుచున్నాను అనే భావన గలవాడై కామనలు లేకుండగా ఎవడైతే మనస్సును శివునియందు అర్పించి ఈ ఉత్తమమగు వ్రతమును ఆచరించునో, వానితో సమానమగు వాడు మరియొకడు లేడు (89). విద్వాంసుడగు బ్రాహ్మణుడు భస్మను శరీరమంతటా పూసుకున్నచో, మహాపాపముల వలన కలిగే మిక్కిలి భయంకరమగు దుఃఖములనుండి విముక్తుడగుననుటలో సందేహము లేదు(90). రుద్రాగ్ని యొక్క శ్రేష్ఠమగు వీర్యమే భస్మయని కీర్తించ బడినది. కావున, సర్వకాలములలో భస్మను ధరించువాడు వీర్యవంతుడగును (91). భస్మయందు నిష్ఠ గలవానికి భస్మ అనే అగ్నితో సంయోగము వలన దోషములు నశించును. భస్మస్నానముచే పరిశుద్ధమైన అంతఃకరణము గల వ్యక్తి భస్మనిష్ఠుడు అని చెప్పబడు చున్నాడు (92).

భస్మనా దిగ్ధసర్వాంగో భస్మదీప్తత్రిపుండ్రకః | భస్మస్నాయీ చ పురుషో భస్మనిష్ఠ ఇతి స్మృతః || 93

భూతప్రేతపిశాచాశ్చ రోగాశ్చాతీవ దుస్సహాః | భస్మనిష్ఠస్య సాన్నిధ్యాద్విద్రవంతి న సంశయః || 94

భావనాద్భసితం ప్రోక్తం భస్మ కల్మషభక్షణాత్‌ | భూతిర్భూతికరీ చైవ రక్షా రక్షాకరీ పరమ్‌ || 95

కిమన్యదిహ వక్తవ్యం భస్మమాహాత్మ్యకారణమ్‌ | వ్రతీ చ భస్మనా స్నాతస్స్వయం దేవో మహేశ్వరః || 96

పరమాస్త్రం చ శైవానాం భ##సై#్మతత్పారమేశ్వరమ్‌ | ధౌమ్యాగ్రజస్య తపసి వ్యాపదో యన్నివారితాః || 97

తస్మాత్సర్వప్రయత్నేన కృత్వా పాశుపతవ్రతమ్‌ | ధనవద్భస్మ సంగృహ్య భస్మస్నానరతో భ##వేత్‌ || 98

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే పాశుపతవ్రత విధానవర్ణనం నామ త్రయస్త్రింశో%ధ్యాయః (33).

భస్మను వంటినిండా పూసుకొని, భస్మచే దిద్దబడిన త్రిపుండ్రముతో ప్రకాశిస్తూ, భస్మతో స్నానమును చేయు పురుషుడు భస్మనిష్ఠుడనగునని చెప్పెదరు (93). భూతములు, ప్రేతములు, పిశాచములు, మిక్కిలి సహింప శక్యము కాని రోగములు భస్మనిష్ఠుని సన్నిధినుండి పారిపోవుననుటలో సందేహము లేదు (94). ప్రకాశించునది అగుటచే దానికి భసితము అని పేరు వచ్చినది. పాపములను భక్షించి వేయుటచే దానికి భస్మ అని పేరు వచ్చినది. సంపదలను ఇచ్చుటచే అది భూతి అనబడును. భస్మ గొప్పగా రక్షించును గనుక, దానికి రక్ష అను పేరు వచ్చినది (95). భస్మ మహిమ గలది అని చెప్పుటకు ఇంకనూ ఏమి కారణమును చెప్పవలయును? వ్రతమును చేసి భస్మతో స్నానమును చేసిన వ్యక్తి స్వయముగా మహేశ్వరదేవుడే యగును (96). ఈ పరమేశ్వరునకు చెందిన భస్మయే శివభక్తులకు గొప్ప అస్త్రము. ఎందువలననగా, ధౌమ్యుని అన్నగారగు ఉపమన్యుని తపస్సులో ఆపదలను భస్మయే పోగొట్టినది (97). కావున, మానవుడు సకలప్రయత్నములను చేసి పాశుపతవ్రతమును చేసి ధనమును వలె భస్మను ప్రోగు చేసుకొని భస్మస్నానమునందు ప్రీతి గలవాడు కావలెను (98).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండంలో పాశుపత వ్రతమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).

Siva Maha Puranam-4    Chapters