Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకోనత్రింశో%ధ్యాయః

శివ శక్తుల స్వరూము

వాయురునాచ |

నివేదయామి జగతో వాగర్థాత్మ్యం కృతం యథా | షడధ్వవేదనం సమ్యక్‌ సమాసాన్న తు విస్తరాత్‌ || 1

నాస్తి కశ్చిదశబ్దోర్థో నాపి శబ్దో నిరర్థకః | తతో హి సమయే శబ్దస్సర్వస్సర్వార్థబోధకః || 2

ప్రకృతేః పరిణామో%యం ద్విధా శబ్దార్థభావనా | తామాహుః ప్రాకృతీం మూర్తిం శివయోః పరమాత్మనోః || 3

శబ్దాత్మికా విభూతిర్యాసా త్రిధా కథ్యతే బుధైః | స్థూలా సూక్ష్మా పరా చేతి స్థూలా యా శ్రుతిగోచరా || 4

సూక్ష్మాచింతామయీ ప్రోక్తా చింతయా రహితా పరా | యా శక్తిస్సా పరా శక్తిశ్శివతత్త్వసమాశ్రయా || 5

జ్ఞానశక్తిసమాయోగాదిచ్ఛోపోద్బలికా తథా | సర్వశక్తిసమష్ట్యాత్మా శక్తితత్త్వ సమాఖ్యయా || 6

సమస్తకార్యజాతస్య మూలప్రకృతితాం గతా | సైవ కుండలినీ మాయా శుద్ధాధ్వపరమా సతీ || 7

సా విభాగస్వరూపైవ షడధ్వాత్మా విజృంభ##తే | తత్ర శబ్దాస్త్ర యో%ధ్వానస్త్ర యశ్చార్థాస్సమీరితాః || 8

సర్వేషామపి వై పుంసాం నైజశుద్ధ్యనురూపతః | లయభోగాధికారాస్స్యుస్సర్వతత్త్వవిభాగతః || 9

కలాభిస్తాని తత్త్వాని వ్యాప్తాన్యేవ యథాతథమ్‌ | పరస్యాః ప్రకృతేరాదౌ పంచధా పరిణామతః || 10

వాయువు ఇట్లు పలికెను -

జగత్తు వాగర్థముల స్వరూపము గలదిగా చేయబడిన విధానమును, దానిని ఆరు తెరంగులుగా తెలిసే విధానమును విస్తారముగా గాక, సంగ్రహముగా చెప్పెదను (1). శబ్దము లేని అర్థము గాని, అర్థము లేని శబ్దము గాని లేవు, కావున, సమయమును బట్టి సర్వ శబ్దములు సర్వములగు అర్థములను బోధించును (2). ఈ శబ్దము మరియు అర్థము అనే రెండు రూపములలోనికి ప్రకృతియే పరిణామమును చెందినది. ఈ శబ్దార్థసముదాయము పరమాత్మలగు పార్వతీపరమేశ్వరుల స్వరూపమని చెప్పెదరు (3). శబ్దరూపములో నున్న పరమేశ్వరవిభూతి స్థూల, సూక్ష్మ మరియు పర అను మూడు రకములుగా నున్నదని విద్వాంసులు చెప్పుచున్నారు. చెవికి వినబడే శబ్దము స్థూలము (4). ఆలోచన రూపములోనున్న శబ్దము సూక్ష్మము. ఆలోచనలకు అతీతమైనది పరాశబ్దము. శివతత్త్వమును ఆశ్రయించి ఉన్న శక్తికి పరాశక్తి అని పేరు (5). ఈ శక్తి జ్ఞానశక్తితో గూడి ఇచ్ఛకు బలమునిచ్చును. శక్తితత్త్వము అను పేరు గల ఈ శక్తి శక్తులన్నింటియొక్క సమాహార స్వరూపము (6). ఆ శక్తితత్త్వమే కార్యములన్నింటియొక్క మూలప్రకృతి అయినది. ఆ మాయయే కుండలినీ రూపములోనుండి పరిశుద్ధమగు సుషుమ్నామార్గముగుండా ప్రవహించి పరాశక్తితో కలియును (7). ఆ శక్తియే విభాగమును చెందిన స్వరూపము గలదై, ఆరు మార్గములలో విజృంభించుచున్నది. వాటిలో మూడు శబ్దమునకు, మూడు అర్ధమునకు సంబంధించినవని చెప్పుచున్నారు (8). మానవులందరికీ తమ శుద్ధికి అనురూపముగా తత్త్వముల నన్నింటినీ విభాగము చేసి లయము చేయుటకు మరియు అనుభవించుటకు అధికారములు గలవు (9). సృష్ట్యారంభములో పరాప్రకృతి అయిదు కళల రూపములో పరిణమించి యున్నది. ఆ తత్త్వములు ఈ కళలచే ఉన్నవి ఉన్నట్లుగా నిశ్చయము గా వ్యాపించ బడి యున్నవి (10).

కలాశ్చ తా నివృత్త్యాద్యాః పర్యాప్తా ఇతి నిశ్చయః | మంత్రాధ్వా చ పదాధ్వా చ వర్ణాధ్వా చేతి శబ్దతః || 11

భువనాధ్వా చ తత్త్వావాధ్వా కలాధ్వా చార్థతః క్రమాత్‌ | అత్రాన్యోన్యం చ సర్వేషాం వ్యాప్యవ్యాపకతోచ్యతే || 12

మంత్రాస్సర్వాః పదైర్వ్యాప్తా వాక్యభావాత్పదాని చ | వర్ణైర్వర్ణసమూహం హి పదమాహుర్విపశ్చితః || 13

వర్ణాస్తు భువనైర్వ్యాప్తాస్తేషాం తేషూపలంభనాత్‌ | భువనాన్యపి తత్త్వౌఘైరుత్పత్త్యాంతర్బహిః క్రమాత్‌ || 14

వ్యాప్తాని కారణౖస్తత్త్వై రారబ్ధత్వాదనేకశః |అంతరాదుత్థితానీహ భువనాని తు కానిచిత్‌ || 15

పౌరాణికాని చాన్యాని విజ్ఞేయాని శివాగమే | సాంఖ్యయోగప్రసిద్ధాని తత్త్వాన్యపి చ కానిచిత్‌ || 16

శివశాస్త్ర ప్రసిద్ధాని తతోన్యాన్యపి కృత్స్నశః | కలాభిస్తాని తత్త్వాని వ్యాప్తాన్యేవ యథాతథమ్‌ || 17

పరస్యాః ప్రకృతేరాదౌ పంచధా పరిణామతః | కలాశ్చ తా నివృత్త్యా ద్యా వ్యాప్తాః పంచ యథోత్తరమ్‌ || 18

వ్యాపికాతః పరా శక్తిరవిభక్తా షడధ్వనామ్‌ | పరప్రకృతిభావస్య తత్సత్త్వా చ్ఛివతత్త్వతః || 19

శక్త్యాది చ పృథివ్యంతం శివతత్త్వసముద్భవమ్‌ | న్యాప్తమేకేన తేనైవ మృదా కుంభాదికం యథా || 20

నివృత్తి మొదలగు ఆ అయిదు కళలు వీటిని వ్యాపించుటకు తగిన వ్యాపకశక్తి గలవి యనునది నిశ్చయము. మంత్రము, పదము, వర్ణము అనునవి శబ్దమునకు చెందిన మార్గములు కాగా (11), భువనము, తత్త్వము, కళ అనునవి అర్థమునకు చెందిన మార్గములు. వీటన్నింటిలో పరస్పరము వ్యాప్యవ్యాపకభావ ము గలదని చెప్పబడినది (12). మంత్రములన్నియు వాక్యరూపములో కూర్చబడియున్న పదములచే వ్యాప్తములై యున్నవి. పదములు వర్ణములచే వ్యాపించబడియున్నవి. వర్ణముల సమూహమే పదమని విద్వాంసులు చెప్పుచున్నారు (13). వర్ణములు భువనములచే వ్యాపించబడి యున్నవి. ఏలయనగా, భువనములు వర్ణములయందు ఉపలభ్యమగుచున్నవి. తత్త్వముల సమూహములనుండి ఆరంభ##మై పుట్టినవి యగుటచే భువనములు లోపల మరియు బయట తమకు కారణమగు ఆ తత్త్వములే వ్యాపించబడి యున్నవి. అనేకములగు భువనములు తత్త్వముల లోపలనుండియే పుట్టినవి. వాటిలో కొన్ని పురాణములలో ప్రసిద్ధములై యుండగా, మరికొన్ని శైవాగమములో నిరూపించబడి యున్నవి. వాటికంటె అధికములగు తత్త్వములతో కలిపి తత్త్వములన్నియు పూర్ణముగా శివశాస్త్రములో ప్రసిద్ధములై యున్నవి. ఆ తత్త్వములు యథాతథముగా కళలచే నిశ్చయముగా వ్యాపించబడి యున్నవి (14-17). సృష్టికి ఆరంభములో పరాప్రకృతి అయిదు విధములుగా పరిణామమును చెందుట వలన నివృత్తి మొదలగు అయిదు కళలు పుట్టినవి. వీటిలో ముందున్న కళ తరువాతి కళలచే వ్యాపించబడి యుండును (18). కావున, పరాశక్తి సర్వమును వ్యాపించి యున్నది. ఆమె స్వయముగా విభాగము లేకుండగనే ఆరు మార్గములయందు వ్యాపించి యున్నది. ఈ పరాప్రకృతి శివతత్త్వమునందు ఉనికిని కలిగి యుండుటచే, దానిచే వ్యాపించబడి యున్నది (19). శక్తితో మొదలిడి పృథివీతత్త్వము వరకు గల సర్వము శివతత్త్వము నుండి పుట్టినవి. ఈ సర్వము ఆ అద్వితీయుడగు శివునిచే, కుండ మొదలగునవి మట్టి చేతను వలె, వ్యాపించబడి యున్నవి (20).

శైవం తత్ర్పరమం ధామ యత్ర్పా ప్యం షఢ్భిరధ్వభిః | వ్యాపికా%వ్యాపికా శక్తిః పంచతత్త్వవిశోధనాత్‌ || 21

నివృత్త్యా రుద్రపర్యంతం స్థితిరండస్య శోధ్యతే | ప్రతిష్ఠయా తదూర్ధ్వం తు యావదవ్యక్తగోచరమ్‌ || 22

తదూర్ధ్వం విద్యయా మధ్యే యావద్విశ్వేశ్వరావధి | శాంత్యా తదూర్ధ్వమధ్వాంతే విశుద్ధిశ్శాంత్యతీతయా || 23

యామాహుః పరమం వ్యోమ పరప్రకృతియోగతః | ఏతాని పంచ తత్త్వాని యైర్వ్యాప్తమఖిలం జగత్‌ || 24

తత్రైవ సర్వమేవేదం ద్రష్టవ్యం ఖలు సాధకైః | అధ్వవ్యాప్తిమవిజ్ఞాయ శుద్ధిం యః కర్తుమిచ్ఛతి || 25

స విప్రలంభకశ్శుధ్దేర్నాలం ప్రాపయితుం ఫలమ్‌ | వృథా పరిశ్రమస్తస్య నిరయాయైవ కేవలమ్‌ || 26

శక్తిపాతసమాయోగాదృతే తత్త్వాని తత్త్వతః | తద్వ్యాప్తిస్తద్వివృద్ధిశ్చ జ్ఞాతుమేవం న శక్యతే || 27

శక్తిరాజ్ఞా పరాశైవీ చిద్రూపా పరమేశ్వరీ | శివోధి%తిష్ఠత్యఖిలం యయా కారణభూతయా || 28

నాత్మనో నైవ మాయైషా న వికారో విచారతః | న బంధో నాపి ముక్తిశ్చ బంధముక్తివిధాయినీ || 29

సర్వైశ్వర్యపరాకాష్ఠా శివస్యా%వ్యభిచారిణీ | సమానధర్మిణీ తస్య తైసై#్తర్భావైర్విశేషతః || 30

శివుని ధామము సర్వోత్కృష్టమైనది. దానిని ఈ ఆరు మార్గములచే పొందదగును. పృథివి మొదలగు అయిదు తత్త్వములను విశేషముగా శోధించుట వలన వ్యాపకశీలము గలది మరియు వ్యాపనశీలము లేనిది అగు శక్తి తెలియబడును (21). రుద్రుని వరకు గల బ్రహ్మాండము యొక్క స్థితి నివృత్తి కళ##చే శోధింపబడును. ఆపైన అవ్యక్తము వరకు గల స్థితి ప్రతిష్ఠా కళ##చే శుద్ధి చేయబడును (22). ఆ పైన విశ్వేశ్వరుని వరకు గల స్థితిని మధ్యలో నుండే విద్యాకళ##చే, ఆ పైన శాంతి కళ##చే, మార్గము అంతము వరకు శాంత్యతీతకళ##చే శోధన చేయబడును (23). దానికే పరమవ్యోమ అని పేరు. పరబ్రహ్మకు ప్రకృతితోడి సంయోగముచే ఈ అయిదు తత్త్వములు పుట్టినవి. వాటిచే జగత్తు అంతయు వ్యాపించబడి యున్నది (24). సాధకులు ఈ సర్వమును ఆ పరమాకాశమునందు అధిష్ఠితమై యున్నదానినిగా దర్శించ వలెను. ఎవడైతే మార్గములందు గల ఈ వ్యాప్తిని గురించి తెలియకుండగా శుద్ధిని చేయగోరునో (25), అట్టి వాడు శుద్ధినుండి వంచితుడగును. ఆ శుద్ధి ఆతనికి ఫలమునీయ జాలదు. వాని శ్రమ అంతయు వ్యర్థము. అది వానికి కేవలము నరకమును మాత్రమే పొందింప జేయును (26). శక్తిపాతముతో సంయోగము (జీవునకు శక్తితో కలయిక) లేకుండగా ఈ తత్త్వములను గాని, వాటి వ్యాప్తిని గాని, వాటి వృద్ధిని గాని యథార్థముగా తెలియుట సంభవము కాదు (27). చైతన్యస్వరూపురాలు, పరమేశ్వరి అగు శక్తియే శివుని ఆజ్ఞ రూపముగా నున్నది. సర్వజగత్కారణమగు ఆ శక్తియే సర్వజగద్రూపముగా ప్రకటము కాగా, శివుడు ఆ జగత్తునకు అధిష్ఠానమగుచున్నాడు (28). విచారించి చూచినచో, ఆత్మకు వికారములు గాని, మాయాసంబంధము గాని, బంధము గాని, ముక్తి గాని యథార్థముగా లేవు. ఆ మాయయే బంధముక్తివ్యవస్థకు మూలము (29). శివునితో అభిన్నమగు ఆ మాయాశక్తి శివుని సకలైశ్వర్యముల పరాకాష్ఠ. ఆ మాయ శివునితో సమానమగు ధర్మములను కలిగియున్నది.

శివుని ఆయా విశిష్టభావములు మాయాశక్తియందు గలవు (30).

స తయైవ గృహీ సాపి తేనైవ గృహిణీ సదా| తయోరపత్యం యత్కార్యం పరప్రకృతిజం జగత్‌|| 31

స కర్తా కరణం సేతి తయోర్ఛేదో వ్యవస్థితః | ఏక ఏవ శివస్సాక్షాద్ద్విధా%సౌసమవస్థితః || 32

స్త్రీ పుంసభావేన తయోర్ఛేద ఇత్యపి కేచన | అపరే తు పరా శక్తిశ్శివస్య సమవాయినీ || 33

ప్రభేవ భానోశ్చిద్రూపా%భిన్నైవేతి వ్యవస్థితిః | తస్మాచ్ఛివః పరో హేతుస్తస్యాజ్ఞా పరమేశ్వరీ || 34

తయైవ ప్రేరితా శైవీ మూలప్రకృతిరవ్యయా | మహామాయా చ మాయా చ ప్రకృతిస్త్రి గుణతి చ || 35

త్రివిధా కార్యభేదేన సా ప్రసూతే షడధ్వనః | స వాగర్థమయశ్చాధ్వా షడ్విధో నిఖిలం జగత్‌ || 36

అసై#్యవ విస్తరం ప్రాహుశ్శాస్త్రజాతమశేషతః || 37

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే వాగర్థ తత్త్వవర్ణనం నామ ఏకోనత్రింశో%ధ్యాయః (29).

అయన ఆమెచే మాత్రమే గృహస్థుడగుచున్నాడు. ఆమె కూడా సర్వకాలములలో ఆయనచే మాత్రమే గృహిణి యగుచున్నది. పరాప్రకృతినుండి పుట్టిన ఈ కార్యజగత్తు ఏది గలదో, అది వారి సంతానము మాత్రమే (31). ఆయన కర్త కాగా, ఆమె కారణము అగుచున్నది. ఈ తీరున వారిద్దరి మధ్య ఈ భేదము మాత్రమే నిశ్చయించ బడినది. ఒకే శివుడు సాక్షాత్తుగా ఈ రెండు రూపములలో నిలిచి యున్నాడు (32). వారిద్దరి మధ్యలో స్త్రీ పురుష భేదము కూడ గలదని కొందరు చెప్పుచున్నారు. పరాశక్తికి శివునితో సమవాయ(విడదీయరాని) సంబంధము గలదని చెప్పుచున్నారు (33). సూర్యునకు ప్రకాశముతో భేదము లేని విధముగా, చైతన్యస్వరూపిణియగు శక్తికి శివునితో భేదము లేదని సిద్ధాంతము. కావున, శివుడు పరమకారణము కాగా, పరమేశ్వరి ఆయనయొక్క ఆజ్ఞయే అగుచున్నది (34). ఆ ఆజ్ఞ చేతనే ప్రేరేపించబడి శివుని వినాశము లేని మూలప్రకృతి మహామాయ, మాయ, త్రిగుణాత్మకమగు ప్రకృతి (35) అనే మూడు విధములుగా పరిణమించి కార్యములయందలి భేదమును బట్టి కలిగిన స్పందనచే ఆరు మార్గములను సృజించు చున్నది. ఈ జగత్తు అంతయు వాక్కు మరియు అర్థము స్వరూపముగా గల ఆ ఆరు మార్గముల వికారము మాత్రమే అగుచున్నది (36). శాస్త్రములన్నియు ఈ ఆరు మార్గముల విస్తారమును మాత్రమే బోధించు చున్నవి (37).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో జగత్తుయొక్క వాగర్థాత్మకమగు స్వరూపమును వర్ణించే ఇరువదితొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

Siva Maha Puranam-4    Chapters