Siva Maha Puranam-4    Chapters   

అథ చతుర్దశో%ధ్యాయః

రుద్రుల ఆవిర్భావము

వాయురువాచ |

ప్రతికల్పం ప్రవక్ష్యామి రుద్రావిర్భావకారణమ్‌ | యచో విచ్ఛిన్నసంతానా బ్రహ్మసృష్టిః ప్రవర్తతే || 1

కల్పే కల్పే ప్రజాస్సృష్ట్వా బ్రహ్మా బ్రహ్మాండసంభవః | అవృద్ధి హేతోర్భూతానాం ముమోహ భృశదుఃఖితః || 2

తస్య దుఃఖప్రశాంత్యర్థం ప్రజానాం చ వివృద్ధయే | తత్తత్కల్పేషు కాలాత్మా రుద్రో రుద్రగణాధిపః || 3

నిర్దిష్టః పరమేశేన మహేశో నీలలోహితః | పుత్రో భూత్వా%నుగృహ్ణాతి బ్రహ్మాణం బ్రహ్మణో%నుజః || 4

స ఏవ భగవానీశ##స్తేజోరాశిరనామయః | అనాదినిధనో ధాతా భూతసంకోచకో విభుః || 5

పరమైశ్వర్యసంయుక్తః పరమేశ్వరభావితః |తచ్ఛక్త్యధిష్ఠితశ్శశ్వత్తచ్చిహ్నైరపి చిహ్నితః || 6

తన్నామనామా తద్రూపస్తత్కార్యకరణక్షమః | తత్తుల్యవ్యవహారశ్చ తదాజ్ఞాపరిపాలకః || 7

సహస్రాదిత్యసంకాశశ్చంద్రావయవభూషణః | భుజంగహారకేయూరవలయో ముంజమేఖలః || 8

జలంధరవిరించేంద్రకపాలశకలోజ్జ్వలః | గంగాతుంగతరంగా ద్రిపింగళాననమూర్ధజః || 9

భగ్నదంఎ్టా్రంకురాక్రాంతప్రాంతకాంతిధరాధరః | సవ్యశ్రవణపార్శ్వాంతమండలీకృతకుండలః || 10

మహావృషభనిర్యాణో మహాజలదనిస్స్వనః | మహానలసమప్రఖ్యో మహాబలపరాక్రమః || 11

ఏవం ఘోరమహారూపో బ్రహ్మపుత్రో మహేశ్వరః | విజ్ఞానం బ్రహ్మణ దత్త్వా సర్గే సహకరోతి చ || 12

వాయువు ఇట్లు పలికెను -

ప్రతికల్పమునందు రుద్రుడు ఆవిర్భవించుటకు గల కారణములను గురించి చెప్పెదను. విచ్ఛిన్నమైన సంతానము గల బ్రహ్మయొక్క సృష్టి ముందుకు సాగుట కొరకై రుద్రుడు ఆవిర్భవించును (1). ప్రతి కల్పమునందు బ్రహ్మాండమునుండి పుట్టిన బ్రహ్మ ప్రజలను సృష్టించి, ప్రాణులు వృద్ధిని చెందక పోవుటచే మోహమును మరియు అధికమగు దుఃఖమును పొందెను (2). ప్రజలు వృద్ధి యగునట్లు చేసి ఆయన దుఃఖమును చల్లార్చుట కొరకై ఆయా కల్పములయందు కాలస్వరూపుడు, భయంకరమగు గణములకు అధిపతి, కంఠమునందు నీలవర్ణము మరియు ఇతరదేహమునందు ఎర్రని వర్ణము గలవాడు, బ్రహ్మకు సోదరుడు అగు రుద్రుడు పరమేశ్వరుడగు మహేశ్వరునిచే ఆజ్ఞాపించబడినవాడై బ్రహ్మకు పుత్రుడై బ్రహ్మను అనుగ్రహించును (3, 4). తేజస్సుయొక్క ముద్ధ, దోషములు లేనివాడు, ఆది మరియు అంతము లేనివాడు, సృష్టికర్త, భూతములను ఉపసంహరించువాడు, సర్వవ్యాపి అగు ఆ శివభగవానుడే (5) సర్వశ్రేష్ఠమగు ఈశ్వరభావము గలవాడై, పరమేశ్వరునిచే అనుగ్రహించ బడినవాడై, ఆ పరమేశ్వరుని శక్తిచే అధిష్ఠించబడినవాడై, ఆ పరమేశ్వరుని చిహ్నములను కూడ శాశ్వతముగా ధరించి (6), ఆయా నామములను మరియు రూపములను దాల్చి, ఆయా కార్యములను చేయుటయందు సమర్ధుడగుచున్నాడు. పరమేశ్వరుని ఆజ్ఞను పాలించు రుద్రుడు పరమేశ్వరునితో సమానమగు వ్యవహారము గలవాడే (7). లెక్కలేనన్ని సూర్యులను బోలియున్నవాడు, చంద్రవంకయే అలంకారముగా గలవాడు, పాములనే హారములుగా భుజకీర్తులుగా మరియు హస్తాభరణములుగా ధరించువాడు, ముంజగడ్డియొక్క మేఖలను ధరించినవాడు (8), జలంధరుడు బ్రహ్మ మరియు ఇంద్రుడు అను వారి కపాలముల ముక్కలతో గొప్పగా ప్రకాశించువాడు, గంగయొక్క ఎత్తైన కొండకొమ్ములవంటి తరంగములచే తడిసి బూడిద రంగును కలిగియున్న శిరోజములు మీసములు గెడ్డము గలవాడు (9), విరిగిన కోరల ముక్కలచే సమీపమునందు ఆక్రమింపబడి ప్రకాశించే క్రింది పెదవి గలవాడు, ఎడమచెవికి సమీపములో చెక్కిలి మధ్యలో కాంతిమండలమును సృష్టించుచున్న కుండలము గలవాడు (10), పెద్ద ఎద్దుపై పయనించువాడు మేఘగర్జనవలె గంభీరమైన వాక్కు గలవాడు, ప్రళయకాలాగ్నివలె ప్రకాశించువాడు, గొప్ప బలపరాక్రమములు గలవాడు (11), భయంకరమగు పెద్ద ఆకారము గలవాడు, బ్రహ్మయొక్క పుత్రుడు అగు మహేశ్వరుడు ఈ విధముగా బ్రహ్మకు విజ్ఞానమునిచ్చి సృష్టియందు సహకరించుచున్నాడు (12).

తస్మాద్రుద్రప్రసాదేన ప్రతికల్పం ప్రజాపతేః | ప్రవాహరూపతో నిత్యా ప్రజాసృష్టిః ప్రవర్తతే | 13

కదాచిత్ర్పార్ధితస్స్రష్టుం బ్రహ్మణా నీలలోహితః | స్వాత్మనా సదృశాన్‌ సర్వాన్‌ ససర్జ మనసా విభుః || 14

కపర్దినో నిరాతంకాన్నీలగ్రీవాంస్త్రిలోచనాన్‌ | జరామరణనిర్ముక్తాన్‌ దీప్తశూలవరాయుధాన్‌ || 15

తైస్తు సంఛాదితం సర్వం చతుర్దశవిధం జగత్‌ | తానా దృష్ట్వా వివిధాన్‌ రుద్రాన్‌ రుద్రమాహ పితామహః || 16

నమస్తే దేవదేవేశ మా స్రాక్షిరీదృశీః ప్రజాః | అన్యాస్సృజ త్వం భద్రం తే ప్రజా మృత్యుసమన్వితాః || 17

ఇత్యుక్తః ప్రహసన్నాహ బ్రహ్మాణం పరమేశ్వరః | నాస్తి మే తాదృశస్సర్గస్సృజ త్వమశుభాః ప్రజాః || 18

యే త్విమే మనసా సృష్టా మహాత్మానో మహాబలాః | చరిష్యంతి మయా సార్ధం సర్వ ఏవ హి యాజ్ఞికాః || 19

ఇత్యుక్త్వా విశ్వకర్మాణం విశ్వభూతేశ్వరో హరః| సహ రుద్రైః ప్రజాసర్గాన్నివృత్తాత్మా%ధ్యతిష్ఠత|| 20

తతఃప్రభృతి దేవో% సౌ న ప్రసూతే ప్రజాశ్శుభాః | ఊర్ధ్వరేతాః స్థితః స్థాణుర్యావదాభూతసంప్లవమ్‌ || 21

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే రుద్రావిర్భావ వర్ణనం నామ చతుర్దశో%ధ్యాయః (14).

కావున, ప్రతికల్పమునందు ప్రజాపతియొక్క ప్రవాహరూపములో నిత్యమగు ప్రజాసృష్టి రుద్రుని అనుగ్రహముచే కొనసాగుచున్నది (13). ఒకనాడు బ్రహ్మ సృష్టిని చేయుమని ప్రార్థించగా నీలలోహితుడు, సర్వవ్యాపి అగు రుద్రుడు సంకల్పముచే తనను పోలియున్న అసంఖ్యాకులగు రుద్రులను సృష్టించెను (14). జటాజూటధారులు, భయము లేనివారు, నల్లని కంఠము గలవారు, మూడు కన్నులు గలవారు, వృద్ధాప్యము మరియు మరణము లేనివారు అగు ఆ రుద్రులు ప్రకాశించే శూలమును మరియు శ్రేష్ఠమగు ఆయుధములను కలిగియుండిరి (15). పదునాల్గు భువనములతో కూడియున్న జగత్తు అంతయు వారిచే నిండిపోయెను. బ్రహ్మ ఆ అసంఖ్యాకులగు రుద్రులను చూచి రుద్రునితో నిట్లనెను (16). ఓ దేవదేవా! ఈశ్వరా! నీకు నమస్కారము. ఇటువంటి ప్రజలను సృష్టించవద్దు. నీవు వీరికంటె భిన్నముగా మరణించే స్వభావము గల ప్రజలను సృష్టించుము. నీకు మంగళమగుగాక! (17) బ్రహ్మ ఇట్లు పలుకగా, పరమేశ్వరుడు నవ్వుతూ ఇట్లనెను. నావద్ద అట్టి సృష్టిలేదు. మరణించే సంతానమును నీవే సృష్టించుము (18). నేను సంకల్పముచే సృష్టించిన ఈ మహాత్ములు, మహాబలశాలురు అగు రుద్రులు నాతో కలిసి సంచరించెదరు. వీరందరు యజ్ఞభాగములకు అర్హులు (19). సమస్తజగత్తులోని ప్రాణులకు ప్రభువగు రుద్రుడు బ్రహ్మతోనిట్లు పలికి, ప్రజాసృష్టినుండి విరమించబడిన మనస్సు గలవాడై రుద్రులతో కలిసి యుండెను (20). అప్పటినుండియు ఆ శివుడు మరణము లేని ప్రజలను సృష్టించుట లేదు. ఆయన ప్రళయకాలములో సర్వప్రాణులు విలీనమగు వరకు ఊర్ధ్వరేతస్కుడై స్థిరమగు యోగసమాధిలో నుండెను (21).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో రుద్రుల ఆవిర్భావమును వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

Siva Maha Puranam-4    Chapters