Siva Maha Puranam-4    Chapters   

అథ దశమో%ధ్యాయః

బ్రహ్మాండ స్థితి వర్ణనము

వాయురువాచ |

పురుషాధిష్ఠితాత్పూర్వమవ్యక్తాదీశ్వరాజ్ఞయా | బుద్ధ్యాదయో విశేషాంతా వికారాశ్చాభవన్‌ క్రమాత్‌ || 1

తతస్తేభ్యో వికారేభ్యో రుద్రో విష్ణుః పితామహః | కారణత్వేన సర్వేషాం త్రయో దేవాః ప్రజజ్ఞిరే || 2

సర్వతో భువనవ్యాప్తిం శక్తిమవ్యాహతాం క్వచిత్‌ | జ్ఞానమప్రతిమం శశ్వదైశ్వర్యం చాణిమాదికమ్‌ || 3

సృష్టిస్థితిలయాఖ్యేషు కర్మసు త్రిషు హేతుతామ్‌ | ప్రభుత్వేన సహైతేషాం ప్రసీదతి మహేశ్వరః || 4

కల్పాంతరే పునస్తేషామస్పర్ధాబుద్ధిమోహినామ్‌ | సర్గరక్షాలయాచారం ప్రత్యేకం ప్రదదౌ చ సః || 5

ఏతే పరస్పరోత్పన్నా ధారయంతి పరస్పరమ్‌ | పరస్పరేణ వర్ధంతే పరస్పరమనువ్రతాః || 6

క్వచిద్ర్బ హ్మక్వచిద్విష్ణుః క్వచిద్రుద్రః ప్రశస్యతే | నానేన తేషామాధిక్యమైశ్వర్యం చాతిరిచ్యతే || 7

మూర్ఖా నిందంతి తాన్వాగ్భిస్సంరంభాభినివేశినః | యాతుధానా భవంత్యేవ పిశాచాశ్చ న సంశయః || 8

దేవో గుణత్రయాతీతశ్చతుర్వ్యూహో మహేశ్వరః | సకలస్సకలాదారశ్శక్తేరుత్పత్తికారణమ్‌ || 9

సో%యమాత్మా త్రయస్యాస్య ప్రకృతేః పురుషస్య చ | లీలాకృతజగత్సృష్టిరీశ్వరత్వే వ్యవస్థితః || 10

వాయువు ఇట్లు పలికెను ః

సృష్ట్యాదియందు ఈశ్వరుని ఆజ్ఞచే, పురుషునిచే అధిష్ఠంచబడిన అవ్యక్తప్రకృతినుండి మహత్తత్త్వముతో మొదలిడి పరమాణువిశేషముల వరకు గల వికారములు క్రమముగా ప్రకటమైనవి (1). తరువాత ఆ వికారములనుండి సర్వకారణులగు బ్రహ్మవిష్ణురుద్రులనే త్రిమూర్తులు ఉదయించిరి (2). మహేశ్వరుడు సకలభువనములను వ్యాపించియుండే సామర్థ్యమును, ఎక్కడనైననూ, ఎక్కడనైననూ ఎదురు లేని శక్తిని, సాటిలేని జ్ఞానమును, శాశ్వతమగు ఐశ్వర్యమును, అణిమ మొదలగు సిద్ధులను, సృష్టిస్థితిలయములనే మూడు కర్మలకుకారణమయ్యే స్థాయిని, జగన్నాథులనే స్థాయితో సహా వారికి అనుగ్రహించెను (3,4). మరల ఆయన వారికి మరియొక కల్పములో ఒకరితో నొకరికి స్పర్ధ మరియు బుద్ధిలో మోహము లేకుండుట కొరకై సృష్టిస్థితిలయములనే కర్మలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మను అప్పజెప్పెను (5). వీరు ఒకరినుండి మరియొకరు పుట్టినారు. వారు ఒకరిని మరియొకరు నిలబెట్టుకుంటూ, ఒకరితో కలిసి మరియొకరు వర్ధిల్లి, ఒకరిని మరియొకరు అనుసరించి పని చేయుదురు (6). కొన్ని చోట్ల బ్రహ్మ, మరికొన్ని చోట్ల విష్ణువు, మరికొన్ని సందర్భములలో రుద్రుడు ప్రశంసింప బడెదరు. దీనిని బట్టి వారి ఈశ్వరభావములో హెచ్చుతగ్గులు ఉండుననుకోరాదు (7). హడావుడి, మొండి పట్టుదల గల మూర్ఖులు వారిని వాక్కులతో నిందించెదరు. అట్టివారు రాక్షసులై, పిశాచములై జన్మించెదరనుటలో సందేహము లేదు (8). మూడు గుణములకు అతీతుడు, నాలుగు రూపములుగా ప్రకటమగువాడు, అంశములు కలవాడు, సకలమునకు ఆధారమైనవాడు అగు మహేశ్వరుడు శక్తి ఉదయించుటకు కారణమగుచున్నాడు (9). ఈ త్రిమూర్తులకు, ప్రకృతికి మరియు పురుషునకు కూడ ఆత్మరూపుడగు ఆ మహేశ్వరుడే లీలగా జగత్తులను సృష్టించి ఈశ్వరభావమును పొందియున్నాడు (10).

యస్సర్వస్మాత్పరో నిత్యో నిష్కలః పరమేశ్వరః | స ఏవ చ తదాధారస్తదాత్మా తదధిష్ఠితః || 11

తస్మాన్మహేశ్వరశ్చైవ ప్రకృతిః పురుషస్తథా | సదాశివో భవో విష్ణుర్ర్బహ్మా సర్వం శివాత్మకమ్‌ || 12

ప్రధానాత్ర్పథమం జజ్ఞే వృద్ధిః ఖ్యాతిర్మతిర్మహాన్‌ | మహత్తత్త్వస్య సంక్షోభాదహంకారస్త్రిధా%భవత్‌ || 13

అహంకారశ్చ భూతాని తన్మాత్రాణీంద్రియాణి చ | వైకారికాదహంకారాత్సత్త్వోద్రిక్తాత్తు సాత్త్వికః || 14

వైకారికస్స సర్గస్తు యుగవత్సంప్రవర్తతే | బుద్ధీంద్రియాణి పంచైవ పంచ కర్మేంద్రియాణి చ || 15

ఏకాదశం మనస్తత్ర స్వగుణనోభయాత్మకమ్‌ | తమోయుక్తాదహంకారాద్భూతతన్మాత్రసంభవః || 16

భూతానామాదిభూతత్వాద్భూతాదిః కథ్యతే తు సః | భూతాదేశ్శబ్దమాత్రం స్యాత్తత్ర చాకాశసంభవః || 17

ఆకాశాత్స్పర్శ ఉత్పన్నస్స్పర్శాద్వాయుసముద్భవః | వాయో రూపం తతస్తేజస్తేజసో రససంభవః || 18

రసాదాపస్సముత్పన్నాస్తాభ్యో గంధసముద్భవః | గంధాచ్చ పృథివీ జాతా భూతేభ్యో% న్యచ్చరాచరమ్‌ || 19

పురుషాధిష్ఠితత్వాచ్చ అవ్యక్తానుగ్రహేణ చ | మహదాదివిశేషాంతా హ్యండముత్పాదయంతి తే || 20

సర్వజగత్తునకు అతీతుడు, నిత్యుడు, అంశములు లేనివాడు అగు ఆ పరమేశ్వరుడే జగత్తునకు ఆధారమై అధిష్ఠానమై ఆత్మయైఉన్నాడు (11). కావున, ప్రకృతి, పురుషుడు, సదాశివుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ అనువారు మహేశ్వరుడే, సర్వము శివస్వరూపమై యున్నది (12). ముందుగా ప్రధానము (ప్రకృతి) నుండి సమష్టిబుద్ధితత్త్వము అగు మహత్తు పుట్టెను. ఆ మహత్తత్త్వమునందు సంక్షోభము కలిగి మూడు రకముల అహంకారము ఉదయించెను (13). భూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు అను రూపములోనికి అహంకారము పరిణమించెను. మహత్తత్త్వవికారము, సత్త్వగుణప్రధానము అగు అహంకారమునుమడి సాత్త్వికసృష్టి బయలు దేరెను (14). మహత్తత్త్వవికారమగు అహంకారమునుండి అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు అనే పది, పదకొండవ మనస్సు పుట్టినవి. ఈ సృష్టి ఏకకాలములో జరిగినది. మనస్సు తనయందు గల గుణసంయోగముచే ఈ రెండు రకముల ఇంద్రియములను పర్యవేక్షించును. తమోగుణప్రధానమగు అహంకారమునుండి భూతతన్మాత్రలు (సూక్ష్మభూతములు) పుట్టినవి (15,16). భూతములకు కారణమగుటచే అహంకారము (లేదా, మహత్తత్త్వము) భూతాదియనబడును. ఆ భూతాదినుండి శబ్దతన్మాత్ర, దానినుండి ఆకాశము పుట్టినవి (17). ఆకాశమునుండి స్పర్శతన్మాత్ర, స్పర్శనుండి వాయువు, వాయువునుండి రూపము, దానినుండి అగ్ని, అగ్నినుండి రసము పుట్టినవి. (18). రసతన్మాత్రనుండి జలములు, వాటినుండి గంధము, గంధమునుండి పృథివి పుట్టినవి. ఈ భూతములనుండి మిగిలిన చరాచరజగత్తు పుట్టినది (19). మహత్తునుండి పరమాణువిశేషముల వరకు గల ఈ తత్త్వములు పురుషునిచే అధిష్ఠించబడి యుండుట వలన, మాయాశక్తియొక్క అనుగ్రహము చేత బ్రహ్మాండమును సృష్టించుచున్నవి (20).

తత్ర కార్యం చ కరణం సంసిద్ధం బ్రహ్మణో యదా | తదండే సుప్రవృద్ధో%భూత్‌క్షేత్రజ్ఞో బ్రహ్మసంజ్ఞితః || 21

స వైశరీరీ ప్రథమస్సవై పురుష ఉచ్యతే | ఆదికర్తాస భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత || 22

తస్యేశ్వరస్య ప్రతిమా జ్ఞానవైరాగ్యలక్షణా | ధర్మైశ్వర్యకరీ బుద్ధిర్ర్బాహ్మీ యజ్ఞే%భిమానినః || 23

అవ్యక్తాజ్జాయతే తస్య మనసా యద్యదీప్సితమ్‌ | వశీకృతత్వాత్త్రై గుణ్యాత్సాపేక్షత్వాత్స్వభావతః || 24

త్రిధా విభజ్య చాత్మానం త్రైలోక్యే సంప్రవర్తతే | సృజతే గ్రసతే చైవ వీక్షతే చ త్రిభిస్స్వయమ్‌ || 25

చతుర్ముఖస్తు బ్రహ్మత్వే కాలత్వే చాంతకస్స్మృతః | సహస్రమూర్ధా పురుషస్తిస్రో%వస్థాస్స్వయంభువః || 26

సత్త్వం రజశ్చ బ్రహ్మా చ కాలత్వే చ తమో రజః | విష్ణుత్వే కేవలం సత్త్వం గుణవృద్ధిస్త్రిధా విభౌ || 27

బ్రహ్మత్వే సృజతే లోకాన్‌ కాలత్వే సంక్షిపత్యపి | పురుషత్వే%త్యుదాసీనః కర్మ చ త్రివిధం విభోః || 28

ఏవం త్రిధా విభిన్నత్వాద్ర్బహ్మ త్రిగుణ ఉచ్యతే | చతుర్ధా ప్రవిభక్తత్వాచ్చతుర్వ్యూహః ప్రకీర్తితః || 29

ఆదిత్వాదాదిదేవో%సావజాతత్వాదజన్స్మృతః | పాతి యస్మాత్ర్ప జాస్సర్వాః ప్రజాపతిరిత స్మృతః || 30

ఈ విధముగా ఏ కాలములోనైతే బ్రహ్మయొక్క కార్యము మరియు సాధనములు సమకూరినవో, అపుడు ఆ బ్రహ్మాండమునందు పరంబ్రహ్మ అనే పేరు గల క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును తెలియువాడు) చక్కగా వృద్ధిని చెందెను (21). ఆయనయే శరీరము గల మొదటి జీవుడు. ఆయనకే పురుషుడని పేరు. ఈ విధముగా ప్రాణులను సృష్ట్యాదిలో సృష్టించిన బ్రహ్మ మున్ముందుగా జన్మించెను (22). యజ్ఞమునకు అధిష్ఠానదేవతయగు ఆ ఈశ్వరునకు జ్ఞానవైరాగ్యములతో కూడినది, ధర్మమును మరియు ఐశ్వర్యమును కలిగించునది, బ్రహ్మనిష్ఠము అగు బుద్ధి ప్రతిమ (ఉపలబ్ధిస్థానము) అగుచున్నది. లేదా, అట్టి బుద్ధి (మహత్తత్త్వము) హిరణ్యగర్భునకు ఉపాధి అగును (23). పరమేశ్వరుని స్వభావమనదగినది, పరమేశ్వరుని వశములోనున్నది, పరమేశ్వరుని సత్త (ఉనికి) పై ఆధారపడిన సాపేక్షికమగు సత్త గలది, మూడు గుణములు (సత్త్వరజస్తమస్సులు) గలది అగు మాయాశక్తినుండి పరమేశ్వరుడు దేనిని సంకల్పిస్తే అది పుట్టును (24). పరమేశ్వరుడు తనను మూడు రూపములుగా విభజించుకొని ముల్లోకములలో ప్రవర్తిల్లుచున్నవాడై, ఆ త్రిమూర్తుల ద్వారా సృష్టిస్థితిలయములనే కర్మలను తానే స్వయముగా చేయుచున్నాడు (25). స్వయముగా సత్తాస్వరూపుడగు ఆ పరమేశ్వరుడు చతుర్ముఖబ్రహ్మయై సృష్టిని, కాలస్వరూపుడై సంహారమును, అనంతశిరస్సులు గల పురుషుడై స్థితిని చేయుచూ మూడు అవస్థలను కలిగియున్నాడు (26). బ్రహ్మయందు సత్త్వరజోగుణములు, కాలపురుషునియందు రజస్తమోగుణములు, విష్ణువునందు కేవలము సత్త్వగుణము కలవు. ఈ విధముగా సర్వవ్యాపకుడగు ఆ పరమేశ్వరునియందు గుణముల మూడు రకముల వృద్ధి కలదు (27). సర్వవ్యాపకుడగు ఆ పరమేశ్వరుడ బ్రహ్మయై లోకములను సృష్టించుచున్నాడు; కాలరూపుడై ఉపసంహరించుచున్నాడు. స్థితితో కలిపి మూడు జగత్కార్యములను చేయుచున్ననూ పూర్ణస్వరూపుడగు పరమేశ్వరునియందు కర్తృత్వము లేనే లేదు (28). ఈ తీరున మూడు మూర్తులుగా విభాగమును చెందియుండుటచే త్రిగుణుడనియు, నాలుగు రూపములుగా విభాగమును చెందియుండుటచే చతుర్వ్యూహుడనియు వర్ణింపబడుచున్నాడు (29). జగత్తునకు కారణమగుటచే ఆయనకు ఆదిదేవుడనియు, పుట్టుక లేనివాడగుటచే అజుడనియు, ప్రజలనందరినీ రక్షించుటచే ప్రజాపతియనియు పేర్లు (30).

హిరణ్మయస్తు యో మేరుస్తస్యోల్బం సుమహాత్మనః | గర్భోదకం సముద్రాశ్చ జరాయుశ్చాపి పర్వతాః || 31

తస్మిన్నండే త్విమే లోకా అంతర్విశ్వమిదం జగత్‌ | చంద్రాదిత్యౌ సనక్షత్రౌ సగ్రహౌ సహ వాయునా || 32

అద్భిర్దశగుణాభిస్తు బాహ్యతో%ండం సమావృతమ్‌ | ఆపో దశగుణనైవ తేజసా బహిరావృతాః || 33

తేజో దశగుణనైవ వాయునా బహిరావృతమ్‌ | ఆకాశేనావృతో వాయుః ఖం చ భూతాదినా%వృతమ్‌ || 34

భూతాదిర్మహతా తద్వదవ్యక్తేనావృతో మహాన్‌ | ఏతైరావరణౖరండం సప్తభిర్బహిరావృతమ్‌ || 35

ఏతదావృత్య చాన్యోన్యమష్టౌ ప్రకృతయః స్థితాః | సృష్టిపాలనవిధ్వంసకర్మకర్త్ర్యో ద్విజోత్తమాః || 36

ఏవం పరస్పరోత్పన్నా ధారయంతి పరస్పరమ్‌ | ఆధారాధేయభావేన వికారాస్తు వికారిషు || 37

కూర్మో%ంగాని యథా పూర్వం ప్రసార్య వినియచ్ఛతి | వికారాంశ్చ తథావ్యక్తం సృష్ట్వా భూయో నియచ్ఛతి || 38

అవ్యక్తప్రభవం సర్వమానులోమ్యేన జాయతే | ప్రాప్తే ప్రలయకాలే తు ప్రాతిలొమ్యే%నులీయతే || 39

గుణాః కాలవశాదేవ భవంతి విషమాస్సమాః | గుణసామ్యే లయో జ్ఞేయో వైషమ్యే సృష్టిరుచ్యతే || 40

సర్వజగద్రూపముగా ప్రకటమైన స్వరూపము గల పరమేశ్వరునకు బంగరు పర్వతమగు మేరువు గర్భస్థపిండము వంటిది; సముద్రములు గర్భమునందలి నీరు కాగా, పర్వతములు జరాయువు (గర్భమును చుట్టియుండే చర్మ) అగుచున్నవి (31). ఆ అండము లోపల ఈ లోకములు, ఈ సమస్తజగత్తు, చంద్రసూర్యులు, నక్షత్రములు, గ్రహములు, వాయువు గలవు (32). ఆ అండమును పది రెట్లు నీరు చుట్టువారి యున్నది. ఆ నీటిని పది రెట్లు అగ్ని చుట్టువారి యున్నది (33). ఆ అగ్నిని పది రెట్లు వాయువు చుట్టువారి యున్నది. వాయువు ఆకాశము చేత, ఆకాశము అహంకారము చేత (34), అదే విధముగా అహంకారము మహత్తత్త్వము చేత, మహత్తత్త్వము అవ్యక్తము చేత చుట్టువారబడి యున్నవి. ఈ విధముగా బ్రహ్మాండమునకు బయట ఏడు ఆవరణలు గలవు (35). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఈ ఎనిమిది ప్రకృతి వికారములు ఈ బ్రహ్మాండమును మరియు ఒకదానిని మరియొకటి ఆవరించి యున్నవై, సృష్టిస్థితిలయములనే కర్మలను చేయుచున్నవి (36). ఈ విధముగా ఈ ప్రకృతి వికారములు ఒక దానినుండి మరియొకటి పుట్టి, ఒక దానిని మరియొకటి ధరించి (అనగా స్థితిని కలిగిస్తూ) యున్నవి. వికారములు తమ ప్రకృతులయందు ఆధార-అధేయ (ఆధారమునందు ఉండేది)-భావములో నున్నవి (37). తాబేలు ముందుగా తన అవయవములను బయటకు చాచి, తరువాత వాటిని తల లోనికి ఉపసంహరించును. అదే విధముగా, మాయాశక్తి వికారములను సృష్టించి, మరల తనలోనికి ఉపసంహరించును (38). ఈ విధముగా సర్వము పైన చెప్పిన వరుసలో అవ్యక్తమునుండి పుట్టినది. ప్రళయకాలము రాగానే, ఈ సర్వము తల్లక్రిందులు క్రమములో అవ్యక్తమునందు లీనమగును (39). సత్త్వరజస్తమోగుణములు కాలమునకు వశములో నున్నవై సామ్య (సమపాళ్లలో నుండుట), వైషమ్య (ఆ పాళ్లలో తేడా వచ్చుట) భావమును పొందుచుండును. వైషమ్యము వచ్చినప్పుడు సృష్టి, సామ్యమునందు ప్రళయము కలుగునని తెలియవలెను (40).

తదిదం బ్రహ్మణో యోనిరేతదండం ఘనం మహత్‌ | బ్రహ్మణః క్షేత్రముద్దిష్టం బ్రహ్మాక్షేత్రజ్ఞ ఉచ్యతే || 41

ఇతీదృశానామండానాం కోట్యోజ్ఞేయాస్సహస్రశః | సర్వగత్వాత్ర్పధానస్య తిర్యగూర్ధ్వమధః స్థితాః || 42

తత్ర తత్ర చతుర్వక్త్రా బ్రహ్మాణో హరయో భవాః | సృష్టా ప్రధానేన తథా లబ్ధ్వా శంభోస్తు సన్నిధిమ్‌ || 43

మహేశ్వరః పరో%వ్యక్తాదండమవ్యక్తసంభవమ్‌ | అండాజ్జజ్ఞే విభుర్ర్బహ్మాలోకాస్తేన కృతాస్త్విమే || 44

అబుద్ధిపూర్వః కథితో మయైషః ప్రధానసర్గః ప్రథమః ప్రవృత్తః | ఆత్యంతికశ్చ ప్రలయో%ంతకాలే లీలాకృతః కేవలమీశ్వరస్య || 45

యత్తత్స్మృతం కారణమప్రమేయం బ్రహ్మా ప్రధానం ప్రకృతేః ప్రసూతిః |

అనాదిమధ్యాంతమనంతవీర్యం శుక్లం సురక్తం పురుషేణ యుక్తమ్‌ || 46

ఉత్పాదకత్వాద్రజసో% తిరేకాల్లోకస్య సంతానవివృద్ధిహేతూన్‌ | అష్టౌ వికారానపి చాదికాలే సృష్ట్యా సమశ్నాతి తథాంతకాలే || 47

ప్రకృత్యవస్థాపితకారణానాం యా చ స్థితిర్యా చ పునః ప్రవృతిః | తత్సర్వమప్రాకృతవైభవస్య సంకల్పమాత్రేణ మహేశ్వరస్య || 48

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే బ్రహ్మాండస్థితి వర్ణనం నామ దశమో%ధ్యాయః (10)ః

పెద్దది, దట్టమైనది అగు ఈ బ్రహ్మాండము పరంబ్రహ్మ ప్రకటమయ్యే స్థానము. కావున, ఇది ఆ పరంబ్రహ్మకు క్షేత్రము అనియు, బ్రహ్మ క్షేత్రజ్ఞుడనియు వర్ణించబడినది (41). మాయా శక్తి సర్వవ్యాపకము. కావున, క్రింద, సమానస్థాయిలో మరియు పైన ఇటువంటి వేల కోట్ల బ్రహ్మాండములు గలవని తెలియవలెను (42). ఆ మాయాశక్తి శంభుని సాన్నిధ్యమును పొంది, ఆయా బ్రహ్మాండములలో నాల్గు మోముల బ్రహ్మలను, విష్ణువులను మరియు రుద్రులను సృష్టించినది (43). ఆ మాయాశక్తికంటె అతీతుడు మహేశ్వరుడు. ఈ బ్రహ్మాండము మాయాశక్తినుండి పుట్టినది. ఆ అండమునుండి సర్వసమర్థుడగు బ్రహ్మ పుట్టెను. ఆయన ఈ లోకములను నిర్మించెను (44). మొట్టమొదటి మాయాశక్తియొక్క సృష్టియందు బుద్ధికి పాత్ర లేదు. అది కేవలము ఈశ్వరుని లీలచే మాత్రమే సృష్టించబడినది. ప్రళయకాలమందు వచ్చే అంతిమప్రళయము కూడ అట్టిదియే. ఈ విషయమును నేను చెప్పియుంటిని (45). ఆది మధ్యము మరియు అంతము లేనిది, అనంతమగు శక్తి గలది, తెల్లని వర్ణము గలది (సత్త్వగుణము), మిక్కిలి ఎర్రనైనది (రజోగుణము), పురుషునితో కూడియున్నది మరియు సర్వప్రమాణములకు గోచరము కానిది అగు మాయాశక్తి సర్వజగత్తునకు కారణము. ఆ శక్తియొక్క సంతానమే బ్రహ్మ యని చెప్పబడినది (46). రజోగుణము అధికమైనప్పుడు ఆ మాయాశక్తి సృష్టిని చేయును. ఆ సమయములో ఆ శక్తి లోకముయొక్క సంతానము అధికమగుటకు కారణమగు ఎనిమిది వికారములను సృష్ట్యాదియందు సృష్టించి, ప్రళయకాలమునందు వాటిని తనలోనికి ఉపసంహరించును (47). ఈ జగత్తునకు హేతువులగు వికారములు ప్రకృతియందు విలీనమై యుండుట, మరల జగద్రూపముగా ప్రకటమగుట అనే కార్యము అంతయు దివ్యమగు వైభవము గల మహేశ్వరుని సంకల్పమాత్రముచే జరుగుచుండును (48).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో బ్రహ్మాండస్థితిని వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).

Siva Maha Puranam-4    Chapters