Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

సన్న్యాసికి అంతిమసంస్కారము

వామదేవ ఉవాచ |

యే ముక్తా యతయస్తేషాం దాహకర్మ నవిద్యతే | మృతే శరీరే ఖననం తద్దేహస్య శ్రుతం మయా || 1

తత్కర్మాచక్ష్వ సుప్రీత్యా కార్తికేయ గురో మమ | త్వత్తో%న్యో న హి సంవక్తా త్రిషు లోకేషు విద్యతే || 2

పూర్ణాహంభావమాశ్రిత్య యే ముక్తా దేహపంజరాత్‌ | యే తూపాసనమార్గేణ దేహముక్తాః పరం గతాః || 3

తేషాం గతివిశేషం చ భగవన్‌ శంకరాత్మజ | వక్తుమర్హసి సుప్రీత్యా మాం విచార్య స్వశిష్యతః || 4

వామదేవుడు ఇట్లు పలికెను -

జీవన్ముక్తులగు యతులకు దహనము ఉండదు. వారు మరణించినప్పుడు ఆ దేహమును పాతి పెట్టవలెనని నేను వినియున్నాను (1). ఓ కార్తికేయా! నీవు నాకు గురుడవు. ఆ కర్మను గురించి అతిశయించిన ప్రీతితో నాకు చెప్పుము. ఈ ముల్లోకములలో ఈ విషయమును చెప్పగలవాడు నీకంటె మరియొకడు లేడు (2). ఎవరైతే పూర్ణాత్మభావము గలవారై దేహము అనే బంధిఖానానుండి విముక్తిని పొందియున్నారో, ఎవరైతే ఉపాసనామార్గముచే దేహమునుండి విముక్తులై పరమేశ్వరుని పొందెదరో (3), వారు పయనించే మార్గముయొక్క విశేషమును పరమప్రీతితో చెప్పుము. ఓ పూజ్యా! శంకరపుత్రా! నీవు నన్ను నీ శిష్యునిగా భావించుము (4).

సూత ఉవాచ |

మునివిజ్ఞప్తిమాకర్ణ్య శక్తిపుత్రస్సురారిహా | ప్రాహాత్యంతరహస్యం తద్భృగుణా శ్రుతమీశ్వరాత్‌ || 5

సూతుడు ఇట్లు పలికెను -

రాక్షససంహారి, పార్వతీపుత్రుడు అగు కార్తికేయుడు ఆ మునియొక్క విన్నపమును విని, శివుని వద్ద భృగుమహర్షి వినియున్న మిక్కిలి రహస్యమగు ఆ విషయమును చెప్పెను (5).

శ్రీసుబ్రహ్మణ్య ఉవాచ |

ఇదమేవ మునే గుహ్యం భృగవే శివయోగినే | ఉక్తం భగవతా సాక్షాత్‌ సర్వజ్ఞేన పినాకినా || 6

వక్ష్యే యదద్యతే బ్రహ్మన్న దేయం యస్య కస్యచిత్‌ | దేయం శిష్యాయ శాంతాయ శివభక్తియుతాయవై || 7

సమాధిస్థో యతిః కశ్చచ్ఛివభావేన దేహముక్‌ | అస్తి చేత్స మహాధీరః పరిపూర్ణశ్శివో భ##వేత్‌ || 8

అధైర్యచిత్తో యః కశ్చిత్సమాధిం న చ విందతి | తదుపాయం ప్రవక్ష్యామి సావధానతయా శృణు || 9

త్రిపదార్ధపరిజ్ఞానం వేదాంతాగమవాక్యజమ్‌ | శ్రుత్వా గురోర్ముఖాద్యోగమభ్యసేత్స యమాదికమ్‌ || 10

తత్కుర్వన్‌ స యతిస్సమ్యక్‌ శివధ్యానపరో భ##వేత్‌ | నియమేన మునే నిత్యం ప్రణవాసక్తమానసః || 11

దేహదౌర్బల్యవశతో యద్యధైర్యధరో యతిః | అకామశ్చ శివం స్మృత్వా స జీర్ణం స్వాం తనుం త్యజేత్‌ || 12

సదాశివానుగ్రహతో నందినా ప్రేరితా మునే | అతివాహికరూపిణ్యో దేవతాః పంచ విశ్రుతాః || 13

ఆత్మహంతాకృతిః కాచిజ్జ్యోతిః పుంజవపుష్మతీ | అహ్నో%భిమానినీ కాచిచ్ఛుక్లపక్షాభిమానినీ || 14

ఉత్తరాయణరూపా చ పంచానుగ్రహతత్పరాః | ధూమ్రా తమస్వినీ రాత్రిః కృష్ణపక్షాభిమానినీ || 15

దక్షిణాయనరూపేతి విశ్రుతాః పంచ దేవతాః | తాసాం వృత్తిం శృణుష్వాద్య వామదేవ మహామునే || 16

శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఇట్లు పలికెను -

ఓమునీ! ఈ రహస్యమునే సర్వజ్ఞుడు, పినాకధారి యగు శివభగవానుడు స్వయముగా శివయోగియగు భృగువునకు చెప్పియున్నాడు (6). ఓ బ్రహ్మన్‌! నేను దానిని నీకు ఇప్పుడు చెప్పెదను. దీనిని ఎవరికి పడితే వారికి చెప్పరాదు. శాంతస్వభావము మరియు శివభక్తి గల శిష్యునకు చెప్పవలెను (7). శివభావముతో నిండినవాడై సమాధియందు దేహమును విడిచిపెట్టే యతి ఎవరైనా ఉన్నచో, అట్టి మహాజ్ఞాని పరిపూర్ణుడగు శివుడు అగును (8). ఎవని చిత్తములో జ్ఞానము లేని కారణముచే సమాధి లభించదో, వాని కొరకై ఉపాయమును చెప్పెదను. సావధానముగా వినుము (9). యతి ఉపనిషత్తులను మరియు ఆగమములలోని వాక్యములను గురువు ముఖముననుండి విని, జీవుడు జగత్తు మరియు ఈశ్వరుడు అనే మూడు తత్త్వముల పరిజ్ఞానము గలవాడై, యమనియమాది యోగాంగములను అభ్యసించవలెను (10). ఓ మునీ! యతి యోగమును అభ్యసిస్తూ, నిత్యము నియమముతో ఓంకారమునందు లగ్నమైన మనస్సు గలవాడై, చక్కగా శివధ్యానమునందు నిష్ఠ కలవాడు కావలెను (11). యతి దేహములో బలము లేని కారణుగా అధైర్యము కలవాడైనచో, కోరికలను విడిచిపెట్టి, శివుని స్మరిస్తూ, శిథిలమై యున్న తన దేహమును వడిచిపెట్టవలెను (12). ఓమునీ! అయిదుగురు అతివాహిక (జీవుని పుణ్యలోకములకు గొనిపోవువారు) దేవతలు వేదమునందు చెప్పబడినవి. ఈ దేవతలు సదాశివుని అనుగ్రహముచే నందికి వశములో నుండెదరు (13). ఒక దేవత దేహమును దహించే అగ్ని-అభిమాని. మరియొక దేవత కాంతి ముద్ద యనదగిన దేహమును కలిగియుండును. ఒక దేవత పగటికి, మరియొక దేవత శుక్లపక్షమునకు, ఇంకో దేవత ఉత్తరాయణమునకు అభిమాని లేక అధిష్టానము అగును. ఈ అయిదు దేవతలు పుణ్యజీవులను అనుగ్రహించుటయందు తత్పరులై యుందురు. ధూమ (పొగ) - అభిమాని, చీకటి - అభిని, రాత్రి - అభిమాని. కృష్ణపక్షదేవత మరియు దక్షిణాయనదేవతలతో కలిసి వీరు అయిదుగురు దేవతలు వర్ణింపబడినారు. ఓ వామదేవమహర్షీ! ఇప్పుడు వారి ప్రవృత్తిని గురించి వినుము (14-16).

తాః పంచదేవతా జీవాన్‌ కర్మానుష్ఠానతత్పరాన్‌ | గృహీత్వా త్రిదివం యాంతి తత్పుణ్యవశతో మునే || 17

భుక్త్వా భోగాన్‌ యథోక్తాంశ్చ తే తత్పుణ్యక్షయే పునః | మానుషం లోకసమాసాద్య భజంతే జన్మ పూర్వవత్‌ || 18

తాః పునః పంచధా మార్గం విభజ్యారభ్య భూతలమ్‌ | అగ్న్యాదిక్రమతాం గృహ్య సదాశివపదం యయుః || 19

నినీయ వంద్యచరణౌ దేవదేవస్య పృష్ఠతః | తిష్ఠంత్యనుగ్రహకరాః కర్మణ్యవ ప్రయోజితాః || 20

సమాగతమభిప్రేక్ష్య దేవదేవస్సదాశివః | విరక్తశ్చేన్మహామంత్రతాత్పర్యముపదిశ్య చ || 21

స్వసామ్యం చ వపుర్దత్తే గాణపత్యే%భిషిచ్య చ | అనుగృహ్ణాతి సర్వేశశ్శంకరస్సర్వనాయకః || 22

మృగటంకత్రిశూలాగ్ర్యవరదానవిభూషితమ్‌ | త్రినేత్రం చంద్రశకలం గంగోల్లాసి జటాధరమ్‌ || 23

అధిష్ఠిత విమానాగ్య్రం సర్వదం సర్వకామదమ్‌ | ఇతి శాఖావిరక్తశ్చేద్రుద్ర కన్యాసమావృతమ్‌ || 24

నృత్యగీతమృదంగాదివాద్యఘోషమనోహరమ్‌ | దివ్యాంబరస్రగాలేపభూషణౖరపి భూషితమ్‌ || 25

దివ్యామృతఘటైః పూర్ణం దివ్యాంభఃపరిపూరితమ్‌ | సూర్యకోటిప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్‌ || 26

మనోవేగం సర్వగం చ విమానమనుగృహ్య చ | భుక్తభోగస్య తస్యాపి భోగకౌతూహలక్షయే || 27

నిపాత్య శక్తిం తీవ్రతరాం ప్రకృత్యా హ్యతి దుర్గమామ్‌ | కాంతారం దగ్ధుకామాం తాం ప్రలయానలసుప్రభామ్‌ || 28

అనుగృహ్య మహామంత్రతాత్పర్యం పరమేశ్వరః | పూర్ణోహంభావనారూపశ్శంభురస్మీతి నిశ్చలమ్‌ || 29

అనుగృహ్య సమాధిం చ స్వదాస్యస్పందరూపిణీః | రవ్యాదికర్మసామర్థ్యరూపాస్సిద్ధీరనర్గలాః || 30

ఆయుఃక్షయే పద్మయోనేః పునరావృత్తివర్జితామ్‌ | ముక్తిం చ పరమాం తసై#్మ ప్రయచ్ఛతి జగద్గురుః || 31

ఓ మునీ! ఆ అయిదు దేవతలు కర్మలననుష్ఠించుటలో నిష్ఠగల జీవులను తీసుకొని, వారి పుణ్యవశముచే స్వర్గమునకు గొనిపోయదరు (17). వారు పూర్వములో వర్ణింపబడియున్న భోగములననుభవించి, ఆ పుణ్యము ఖర్చు కాగానే, మరల మనుష్యలోకమును చేరి, పూర్వమునందు వలెనే జన్మను పొందెదరు (18). ఇంతే గాక, అనుగ్రహరూపులు, పుణ్యాత్ములను పుణ్యలోకములకు గొనిపోయే పనియందు నియమింపబడినవారు అగు ఆ అయిదుగురు దేవతలు యతీశ్వరుడు పయనించే మార్గమును భూమినుండి అగ్ని మొదలగు క్రమములో అయిదు రకములుగా విభజించి, ఆ యతిని సదాశివుని స్థానమునకు గొనిపోయి, ఆ దేవదేవుని పాదములకు నమస్కరించి, ఆయన వెనుక నిలబడియుందురు (19, 20). దేవదేవుడు, సర్వేశ్వరుడు, మంగళకరుడు, సర్వమునకు ప్రభువు అగు సదాశివుడు తన వద్దకు వచ్చియున్న యతినిచూచి, ఆతడు విరాగియైనచో మహామంత్రముయొక్క తాత్పర్యమునుపదేశించి, తనతో సమానమైన దేహమునిచ్చి, గణాధ్యక్షస్థానమునందు అభిషేకించి అనుగ్రహించును (21,22). ఆతడు మృగము పరశువు మరియు త్రిశూలము అనువాటిచే అలంకరింపబడి, మూడు కన్నులు కలిగి, చంద్రవంకతో మరియు గంగతో ప్రకాశించే జటాజూటము కలవాడై, గణాధ్యక్షుడై వరములనిచ్చే మహిమతో నలరారును (23). ఆతడు కోరికలనన్నిటినీ ఈడేర్చే సామర్థ్యము గలవాడై, సర్వమును ఇచ్చే శ్రేష్ఠమైన విమానమునధిష్ఠించియుండును. ఆతడు విరక్తుడు కానిచో, రుద్రకన్యలతో నిండియున్నది, నృత్యము, గీతము, మృదంగము మొదలైన వాద్యముల ఘోషతో మనస్సునకు ఆహ్లాదమును కలిగించునది, దివ్యమగు వస్త్రములతో, మాలలతో, సుగంధద్రవ్యముల లేపనములతో మరియు భూషణములతో అలంకరింపబడియుండునది, దివ్యమగు అమృతము గల ఘటములతో నిండియున్నది, దివ్యమగు జలములతో నిండియున్నది, కోటి సూర్యుల కాంతి గలది, కోటి చంద్రుల చల్లదనము గలది (24-26), మనస్సు యొక్క వేగముతో సర్వస్థానములకు వెళ్లునది అగు విమానమును శివుడు ఆతనికి అనుగ్రహించును. ఆతడు భోగములననుభవించిన పిదప భోగములపై ఉత్సాహము తగ్గును (27). చాలా తీవ్రమైనది, స్వభావముచేతనే మిక్కిలి అధిగమించ శక్యము కానిది, సంసారమనే అడవిని తగులబెట్టే కోరిక గలది, ప్రళయకాలాగ్నివంటి గొప్ప కాంతులు గలది అగు శక్తిని శివుడు ఆతనికి ఇచ్చును (? 28) పరమేశ్వరుడాతనికి మహామంత్రముయొక్క తాత్పర్యముననుగ్రహించును. నేను పూర్ణుడను, నేను శంభుడను, అనే భావనయొక్క రూపములో నుండే నిశ్చలమగు సమాధిని కూడ ఆయన ఆతనికి అనుగ్రహించును. ఆ భక్తుడు తనను ఈశ్వరుని దాసునిగా భావించును. ఆ మానసికస్పందనలే ఆటంకములు లేని సిద్ధుల రూపమును దాల్చును. దాని వలన ఆతనికి సూర్యుడు మొదలగు దేవతల కర్మలను చేసే సామర్థ్యము కలుగును (29, 30). బ్రహ్మ యొక్క ఆయుర్దాయము పూర్తి అయిన పిదప జగద్గురువగు శివుడు ఆతనికి పునరావృత్తి (మరలి వచ్చుట) లేని సర్వోత్కృష్టమగు మోక్షమును ఇచ్చును (31).

ఏతదేవ పదం తస్మాత్సర్వైశ్వర్యసమష్టిమత్‌ | ముక్తిఘంటాపథం చేతి వేదాంతానాం వినిశ్చయః || 32

మమూర్షోస్తస్య మందస్య యతేస్సత్సంప్రదాయనః | యతయస్సానుకూలత్వాత్తిష్ఠేయుః పరితస్తదా || 33

తతస్సర్వే చ తే తత్ర ప్రణవాదీన్యనుక్రమాత్‌ | ఉపదిశ్య చ వాక్యాని తాత్పర్యం చ సమాహితాః || 34

వర్ణయేయుస్స్పుటం ప్రీత్యా శివం సంస్మారయన్‌ సదా | నిర్గుణం పరమం జ్యోతిః ప్రణమ్య విలయావధి || 35

ఏతేషాం సమమేవాత్ర సంస్కారక్రమ ఉచ్యతే | అసంస్కృతశరీరాణాం దౌర్గత్యం నైవ జాయతే || 36

సన్న్యస్య సర్వకర్మాణి శివాశ్రయపరా యతః | దేహం దూషయతస్తేషాం రాజ్ఞో రాష్ట్రం చ నశ్యతి || 37

తద్గ్రా మవాసినస్తే%పి భ##వేయుర్భృశదుఃఖినః | తద్దోషపరిహారాయ విధానం చైవముచ్యతే || 38

స తు నమ ఇరిణ్యాయ చేత్యారభ్య వినమ్రధీః | నమ ఆమీవత్కేభ్యాంతం తత్కాలే ప్రజపేన్మనుమ్‌ || 39

ఓమిత్యంతే జపన్‌ దేవయజనం పూరయేత్తతః | తతశ్శాంతిర్భవేత్తస్య దోషస్య హి మునీశ్వర || 40

పుత్రాదయో యథాన్యాయం కుర్యుస్సంస్కారముత్తమమ్‌ | వచ్మి తత్కృపయా విప్ర సావధానతయా శృణు || 41

సమస్తములగు ఐశ్వర్యముల సమాహారస్థానమనదగిన ధామము ఇదియే. ఇదియే మోక్షమునకు రాజమార్గమని ఉపనిషత్తులు నిశ్చింయుచుచున్నవి (32). మంచి సంప్రదాయమునకు చెందిన ఆ యతి మెల్లగా మరణమునకు చేరువ అగుచుండగా, ఆ సమయములో ఇతరసన్న్యాసులు ఆతనికి అనుకూలముగా నుండు విధముగా చుట్టూ కూర్చుండవలెను (33). అపుడు వారు ఏకాగ్రచిత్తము గలవారై ఓంకారముతో మొదలిడి క్రమముగా మహావాక్యములను ఉపదేశించి, వాటి తాత్పర్యమును స్పష్టముగా ప్రీతితో వర్ణించవలెను. నిర్గుణుడు, పరమప్రకాశస్వరూపుడు అగు శివుని ఆయనకు వారు నిరంతరముగా గుర్తు చేయుచుండవలెను. మరియు వారు ఆతడు మరణించువరకు ఆతనికి నమస్కారమును చేయవలెను (34, 35). యతులందరికీ మరణించినప్పుడు చేసే సంస్కార క్రమము సమానమే . దానిని చెప్పుచున్నాను . ఈ యతులు మరణించినప్పుడు దేహమునకు సంస్కారమును చేయనిచో వారికి దుర్గతి కలుగనే కలుగదు (36). ఏలయనగా, వారు సర్వకర్మలను విచిడిపెట్టి శివుని శరణాగతి చేసి యుందురు. కావున, అట్టివారి దేహమునకు సంస్కారము లేకుండా వదిలి పెట్టినచో, ఆ రాజునకు మరియు రాష్ట్రమునకు వినాశము కలుగును (37). ఆ గ్రామములో నివసించు జనులకు అధికమగు దుఃఖములు కలుగును. ఈ దోషములనుండి తప్పించుకొనుట కొరకై సంస్కారమును చేసే విధి చెప్పబడుచున్నది (38). సంస్కారమును చేయు వ్యక్తి వినయముతో నిండిన మనస్సు గలవాడై, నను ఇరిణ్యాయ చ (ఎడారియందు ఉండు రుద్రునకు నమస్కారము ) అని ప్రారంభ##మై, నమ ఆమీవత్కేభ్యః (సర్వమును వ్యాపించి పాపులను శిక్షించు రుద్రులకు నమస్కారము) అని అంతమయ్యే అనువాకము రూపములో నున్న మంత్రమును ఆ కాలమునందు జపించవలెను (39). ఆఖరుగా ఓంకారమునుచ్చరించి మట్టితో దేవయజనము (సన్న్యాసి దేహమును ఉంచే గొయ్యి) ను నింపవలెను. ఓ మహర్షీ! అట్లు చేయుట వలన యతికి సంస్కారము చేయక పోవుటచే కలిగే దోషము శాంతించును (40). ఆయనయొక్క పుత్రుడు మొదలగు వారు యథావిధిగా ఉత్తమమగు అంత్యసంస్కారమును చేయవలెను. ఓ బ్రాహ్మణా! ఆ విధానమును దయతో నీకు చెప్పెదను. సావధానముగా వినుము (41).

అభ్యర్చ్య స్నాప్య శుద్ధోదైరభ్యర్చ్య కుసుమాదిభిః | శ్రీరుద్రచమకాభ్యాం చ రుద్రసూక్తేన చ క్రమాత్‌ || 42

శంఖం చ పురతః స్థాప్య తజ్జలేనాభిషిచ్య చ | పుష్పం నిధాయ శిరసి ప్రణవేన ప్రమార్జయేత్‌ || 43

కౌపీనాదీని సంత్యజ్య పునరన్యాని ధారయేత్‌ | భస్మనోద్ధూలయేత్తస్య సర్వాంగం విధినా తతః || 44

త్రిపుండ్రం చ విధానేన తిలకం చందనేన చ | విరచ్య పుషై#్పర్మాలాభిరలంకుర్యాత్కలేవరమ్‌ || 45

ఉరః కంఠశిరోబాహు ప్రకోష్ఠశ్రుతిషు క్రమాత్‌ | రుద్రాక్షమాలాభరణౖరలంకుర్యాచ్చ మంత్రతః || 46

సుధూపితం సముత్థాయ శిక్యోపరి విధాయ చ | పంచబ్రహ్మమయే రమ్యే రథే సంస్థాపయేత్తనుమ్‌ || 47

ఓమాద్యైః పంచభిర్ర్బహ్మమంత్రై స్సద్యాదిభిః క్రమాత్‌ | సుగంధకుసుమైర్మాల్యైరలంకుర్యాద్రథం చ తమ్‌ || 48

నృత్య వాద్యైర్బ్రాహ్మణానాం వేదఘోషైశ్చ సర్వతః | గ్రామం ప్రదక్షిణీకృత్య గచ్ఛేత్ర్పేతం తముద్వహన్‌ || 49

తతస్తే యతినస్సర్వే తథా ప్రాచ్యామథాపి వా | ఉదీచ్యాం పుణ్యదేశే తు పుణ్యవృక్షసమీపతః || 50

ఖనిత్వా దేవయజనం దండమాత్రప్రమాణతః | ప్రణవవ్యాహృతిభ్యాం చ ప్రోక్ష్య చాస్తీర్య చ క్రమాత్‌ || 51

శమీపత్రైశ్చ కునుమైరుత్తరాగ్రం తదూర్ధ్వతః | ఆస్తీర్య దర్భాంస్తత్పీఠం చైలాజినకుశోత్తరమ్‌ || 52

ఆ దేహమును పూజించి, శుభ్రమగు జలములతో స్నానమును చేయించి, శ్రీరుద్రాధ్యాయమును, చమకమును, రుద్రసూక్తమును ఆ వరుసలో పఠించి, పుష్పములు మొదలగు వాటితో పూజించి (42), దానికి యెదుట శంఖమునుంచి, దానియందలి జలముతో అభిషేకించి, శిరస్సుపై పుష్పమునుంచి, ఓంకారమునుచ్చరించి దేహమును తుడువవలెను (43). కౌపీనము మొదలగు వాటిని తీసివేసి కొత్త వాటిని కట్టవలెను. తరువాత ఆ యతి యొక్క దేహము అంతట భస్మను యథావిధిగా పూయవలెను. (44). యథావిధిగా త్రిపుండ్రమును మరియు గంధముతో తిలకమును దిద్ది, పుష్పములతో మాలను గుచ్చి దానితో ఆ దేహమును అలంకరించవలెను (45). వక్షఃస్థలము, కంఠము, శిరస్సు, బాహువులు, ముంజేతులు, చెవులు అను స్థానములను వరుసగా మంత్రపూర్వకముగా రుద్రాక్షలతో అలంకరించవలెను (46). సాంబ్రాణి పొగను దట్టముగా వేసి, ఆ దేహమును లేవదీసి చిక్కముపై పెట్టి, పంచబ్రహ్మస్వరూపమగు సుందరమగు రథమునందు కూర్చుండబెట్టవలెను (47). సద్యోజాతాది పంచబ్రహ్మమంత్రములను ఓంకారపూర్వకముగా వరుసగా పఠించి, ఆ రథమును సువాసనలను వెదజల్లే పుష్పములతో మరియు మాలలతో అలంకరించవలెను (48). నృత్యవాద్యముల ఘోష మరియు బ్రాహ్మణుల వేదఘేష నిరంతరముగా ప్రతిధ్వనించుచుండగా, ఆ దేహమును మోసుకొనుచూ గ్రామమును ప్రదక్షిణము చేయవలెను. (49). తరువాత ఆ సన్న్యాసులు అందరు తూర్పునందు, లేదా ఉత్తరమునందు పవిత్రమగు స్థానములో పవిత్రమగు చెట్టునకు దగ్గరలో (50) ఒక చేతికర్రతో సమానమగు లోతు గల గోతిని (దేవయజనమును) తవ్వి, దానియందు ఓంకారముతో మరియు భూర్భువస్సువః అనే వ్యాహృతులతో నీటిని చల్లి, వరుసగా జమ్మి ఆకులను, పుష్పములను పరచి, వాటిపైన ఉత్తరము వైపునకు కొనలు ఉండునట్లుగా దర్భలను పరచి, ఆ యతి యొక్క పీటను వేసి, దానిపై దర్భలను మృగచర్మమును మరియు వస్త్రమును ఆ క్రమములో వేయవలెను (51, 52).

ప్రణవేన బ్రహ్మభిశ్చ పంచగవ్యేన తాం తనుమ్‌ | ప్రోక్ష్యాభిషిచ్య రౌద్రేణ సూక్తేన ప్రణవేన చ || 53

శంఖతో యేనాభిషిచ్య మూర్ధ్ని పుష్పం వినిఃక్షిపేత్‌ | తద్గర్తస్యానుకూలో%సౌ శివస్మరణతత్పరః || 54

ఓమిత్యథ సముద్ధృత్య స్వస్తివాచనపూర్వకమ్‌ | గర్తే యోగాసనే స్థాప్య ప్రాజ్ముఖం స్యాద్యథా తథా || 55

గంధపుషై#్పరలంకృత్య ధూపగుగ్గులునా తతః | విష్ణో హవ్యమితి ప్రోచ్య రక్షస్వేతి వదన్‌ దదేత్‌ || 56

దండం దక్షిణహస్తే తు వామే దద్యాత్కమండలుమ్‌ | ప్రజాపతే నత్వదేతాన్యన్యో మంత్రేణ సోదకమ్‌ || 57

బ్రహ్మజజ్ఞానం ప్రథమమితి మంత్రేణ మస్తకే | స్పృశన్‌ జప్త్వా రుద్రసూక్తం భ్రువోర్మధ్యే స్పృశన్‌ జపేత్‌ || 58

మా నో మహాంతమిత్యాది చతుర్భిర్మస్తకం తతః | నాలికేరేణ నిర్భిద్యాదవటం పూరయేత్తతః || 59

పంచభిర్బ్రహ్మాభిః స్పృష్ట్వా జపేత్‌ స్థలమనన్యధీః | యో దేవానాముపక్రమ్య యః పరస్స మహేశ్వరః || 60

ఇతి జప్త్వా మహాదేవం సాంబం సంసారభేషజమ్‌ | సర్వజ్ఞమపరాధీనం సర్వానుగ్రహకారకమ్‌ || 61

ఏకారత్నిసముత్సే ధమరత్నిద్వయవిస్తృతమ్‌ | మృదా పీఠం ప్రకల్ప్యాథ గోమయేనోపలేపయేత్‌ || 62

ఓంకారమును మరియు పంచబ్రహ్మమంత్రములను పఠించి పంచగవ్యము (గోవునుండి లభించే అయిదు ద్రవ్యముల కలయిక) ను ఆ దేహముపై చల్లి, రుద్రసూక్తముతో అభిషేకించి, ఓంకారమునుచ్చరిస్తూ (53), శంఖమునందలి నీటితో అభిషేకించి శిరస్సుపై పుష్పమునుంచవలెను. ఈ కర్మలను చేయుచున్న వ్యక్తి ఆ గోతివద్ద సరియగు విధములో నిలబడి, ఆయతికి అనుకూలముగా శివుని తదేకధ్యానముగా స్మరిస్తూ (54), ఓం అని గట్టిగా పలికి స్వస్తిపుణ్యాహవాచనమంత్రములతో ఆ దేహమును ఎత్తి, ఆ గోతిలో యోగసనమునందు ముఖము తూర్పువైపునకు ఉండునట్లుగా కూర్చుండబెట్టి (55), గంధముతో మరియు పుష్పములతో అలంకరించి, తరువాత విష్ణో హవ్యగ్‌ం రక్షస్య (ఓ విష్ణూ! ఆహుతిద్రవ్యమును రక్షించుము) అని పలికి సాంబ్రాణి ధూపమును వేయవలెను (56). ప్రజాపతే నత్వదేతాన్యన్యః (ఓ ప్రజాపతీ! ఈ సర్వము నీనుండి పుట్టినది; నీకంటె భిన్నముగా ఏదీ లేదు) అను మంత్రముతో కూడి చేతిలో దండమును, ఎడమ చేతిలో నీటిని నింపిన కమండలమును ఉంచవలెను (57). బ్రహ్మజజ్ఞానం ప్రథమమ్‌ (సృష్ట్యాదియందు బ్రహ్మనుండి ముందుగా జన్మించిన సూర్యుడు) అను మంత్రముతో శిరస్సుపైస్పృశించి, రుద్రసూక్తమును జపించి కనుబొమల మధ్యలో స్పృశించవలెను (58). మా నో మహాంతమ్‌ --- (ఓ రుద్రా! మా ఇంటిలో పెద్దవారిని హింసించకుము---) అని మొదలయ్యే నాలుగు మంత్రములను పఠించి, కొబ్బరికాయతో శిరస్సును భేదించి, తరువాత గోతిని పూడ్చవలెను (59). ఆ కర్మను చేయు వ్యక్తి ఏకాగ్రమగు మనస్సుతో పంచబ్రహ్మమంత్రములను జపిస్తూ ఆ స్థానమును స్పృశించవలెను. యో దేవానాం --- (ఏ పరమేశ్వరుడు దేవతలలో ప్రధానుడగు హిరణ్యగర్భుడు జన్మించుచుండగా చూచునో---) ఆను మంత్రముతో మొదలిడి, యః పరస్స మహేశ్వరః అని అంతమయ్యే మంత్రమును (60) జపించి, పార్వతీసమేతుడు, సంసారమనే రోగమునకు వైద్యుడు, సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, అందరినీ అనుగ్రహించువాడు అగు మహాదేవుని స్మరించవలెను (61). ఒక మూర యెత్తు, రెండు మూరల వైశాల్యము గల పీఠమును మట్టితో నిర్మించి, దానిని గోమయముతో అలకవలెను (62).

చతురస్రం తు తన్మధ్యే గంధాక్షతసమన్వితైః | సుగంధకుసుమైర్బిల్వైస్తుల స్యా చ సమర్చయేత్‌ || 63

ప్రణవేన తతో దద్యాత్‌ ధూపదీపౌ పయో హవిః | దత్వా ప్రదక్షిణీకృత్య నమస్కుర్యాచ్చ పంచధా || 64

ప్రణవం ద్వాదశావృత్త్యా సంజప్య ప్రణమేత్తతః | దిగ్విదిక్క్ర మతో దద్యాద్బహ్మాద్యం ప్రణవేన చ || 65

ఏవం దశాహపర్యంతం విధిస్తే సముదాహృతః | యతీనాం మునివర్యాథైకాదశాహవిధిం శృణు || 66

దాని మధ్యలో చతురస్రమును గంధము, అక్షతలు, పరిమళములను వెదజల్లే పుష్పములు, మారేడు ప్రతి మరియు తులసి ఆకులు అను వాటితో పూజించవలెను (63). తరువాత ఓంకారముతో ధూపదీపములను పాలను నేతిని సమర్పించి, ప్రదక్షిణమును చేసి, అయిదు సార్లు నమస్కరించవలెను (64). తరువాత ఓంకారమును పన్నెండు సార్లు జపించి, నమస్కారమును చేయవలెను. తరువాత ఓంకారముతో నాలుగు దిక్కులు మరియు నాలుగు మూలల యందు ఆహారమును నైవేద్యము పెట్టవలెను (65). ఈ విధముగా పది రోజుల వరకు చేయవలెను. ఓ మహర్షీ! ఈ విధముగా యతులు మరణించినప్పుడు చేయవలసిన పది రోజుల విధిని నీకు చెప్పియుంటిని. ఇప్పుడు పదకొండవ రోజునాటి కార్యక్రమమును గురించి వినుము (66).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు యతులు మరణించినప్పుడు చేయదగిన కర్మను గురించి వర్ణించే ఇరుపది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).

Siva Maha Puranam-4    Chapters