Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టాదశోధ్యాయః

గురువు యోగపట్టమునకు శిష్యుని తయారు చేయుట

శౌనక ఉవాచ |

శ్రుత్వా వేదాంతసారం తద్రహస్యం పరమాద్భుతమ్‌ | కిం పృష్టవాన్వామదేవో మహేశ్వరసుతం తదా || 1

ధన్యో యోగీ వామదేవశ్శివజ్ఞానరతస్సదా | యత్సంబంధాత్కథోత్పన్నా దివ్యా పరమపావనీ || 2

ఇతి శ్రుత్వా మునీనాం తద్వచనం ప్రేమగర్భితమ్‌ | సూతః ప్రాహ ప్రసన్నస్తాన్‌ శివాసక్తమనా బుధః || 3

శౌనకుడు ఇట్లు పలికెను -

ఉపనిషత్తుల సారము, రహస్యము మరియు గొప్ప అద్భుతము అగు ఆ ఉపదేశమును విని వామదేవమహర్షి అపుడు మహేశ్వరుని పుత్రుడగు కుమారస్వామిని ఏమి ప్రశ్నించెను? (1)సర్వకాలములలో శివజ్ఞానమునందు ప్రీతి గల వామదేవమహర్షి ధన్యుడగు యోగి. ఆయనను గురించి దివ్యము మరియు మిక్కిలి పావనము అగు ఈ కథ ప్రవర్తిల్లినది (2). మునుల ఈ ప్రేమతో నిండియున్న వచనమును విని శివునియందు లగ్నమైన మనస్సు గలవాడు, విద్వాంసుడు అగు సూతుడు ప్రసన్నుడై వారితో నిట్లనెను (3).

సూత ఉవాచ |

ధన్యా యూయం మహాదేవభక్తా లోకోపకారకాః | శృణుధ్వం మునయస్సర్వే సంవాదం చ తయోఃపునః || 4

శ్రుత్వా మహేశతనయవచనం ద్వైతనాశకమ్‌ | అద్వైతజ్ఞానజనకం సంతుష్టో%భూన్మహామునిః || 5

నత్వా స్తుత్వా చ వివిధం కార్తికేయం శివాత్మజమ్‌ | పునః పప్రచ్ఛ తత్త్వం హి వినయేన మహామునిః || 6

సూతుడు ఇట్లు పలికెను -

మహాదేవుని భక్తులు, జనులకు ఉపకారమును చేయువారు అగు మీరు ధన్యులు. ఓ మునులారా! మీరందరు వారిద్దరి సంవాదమును మరల వినుడు (4). ద్వైతభావనను పోనాడి అద్వైతజ్ఞానమును కలిగించే కుమారస్వామి యొక్క వచనములను విని ఆ మహర్షి సంతసించెను (5). ఆ మహర్షి శివపుత్రుడగు ఆ కార్తికేయునకు నమస్కరించి అనేకవిధములుగా స్తుతించి మరల వినయముతో తత్త్వమును గురించి ప్రశ్నించెను (6).

వామదేవ ఉవాచ |

భగవన్‌ సర్వతత్త్వజ్ఞ షణ్ముఖామృతవారిధే | గురుత్వం కథమేతేషాం యతీనాం భావితాత్మనామ్‌ || 7

జీవానాం భోగమోక్షాదిసిద్ధిస్సిధ్యతి యద్వశాత్‌ | పారంపర్యం వినా నైషాముపదేశాధికారితా ||8

ఏవం చ క్షౌరకర్మాంగం స్నానం చ కథమీదృశమ్‌ | ఇతి విజ్ఞాపయ స్వామిన్‌ సంశయం ఛేత్తుమర్హసి || 9

ఇతి శ్రుత్వా కార్తికేయో వామదేవచస్స్మరన్‌ | శివం శివాం చ మనసా వ్యాచష్టుముపచక్రమే || 10

వామదేవుడు ఇట్లు పలికెను -

ఓ భగవాన్‌! నీవు తత్త్వములన్నియు తెలిసినవాడవు. ఓ షణ్ముఖా! నీవు అమృతసముద్రమవు. పవిత్రమగు అంతఃకరణము గల ఈ యతులకు గురుస్థానము లభించు విధమెట్టిది?(7) ఈ జ్ఞానముయొక్క ప్రభావముచే జీవులకు భోగమోక్షములు సిద్ధించును. కాని, పరంపరలో భాగము కానిదే, వీరికి ఉపదేశించే అధికారము లేదు గదా! (8) ఇంతేగాక, క్షౌరకర్మలో అంగమైన స్నానముయొక్క స్వరూపమెట్టిది? ఓ స్వామీ! ఈ వివరములను చెప్పి, నా సందేహములను తొలగించుటకు నేవే తగుదువు (9), వామదేవుని ఈ వచనములను విని కార్తికేయుడు పార్వతీపరమేశ్వరులను మనస్సులో స్మరించి వ్యాఖ్యానించుటకు ఉపక్రమించెను (10).

శ్రీసుబ్రహ్మణ్య ఉవాచ |

యోగపట్టం ప్రవక్ష్యామి గురుత్వం యేన జాయతే | తవ స్నేహాద్వామదేప మహద్గోప్యం విముక్తిదమ్‌ || 11

వైశాఖే శ్రావణ మాసి తథాశ్వయుజి కార్తికే | మార్గశీర్షే చ మాఘే వా శుక్లపక్షే శుభే దినే || 12

పంచమ్యాం పౌర్ణమాస్యాం వా కృతప్రాభాతికక్రియః | లబ్ధానుజ్ఞస్తు గురుణా స్నాత్వా నియతమానసః || 13

పర్యంకశౌచం కృత్వా తద్వాససంగం ప్రమృజ్య చ | ద్విగుణం దోరమాబధ్య వాససీ పరిదాయ చ || 14

క్షాలితాం ఘ్రిర్ద్వి రాచమ్య భస్మ సద్యాదిమంత్రతః | ధారయేద్ధి సమాధాయ సముద్ధూలనమార్గతః || 15

గృహీతహస్తో గురుణా సానుకూలేన వై మునే | సశిష్యస్సాంజలిస్స్వాభ్యాం హస్తాభ్యాం ప్రాఙ్ముఖో యథా || 16

తథోపవేష్టితస్తిష్ఠేన్మండపే సమలంకృతే | గుర్వాసనవరే శుద్ధే చైలాజినకుశోత్తరే || 17

అథ దేశిక ఆదాయ శంఖం సాధారమస్త్ర తః | విశోధ్య తస్య పురతః స్థాపయేత్సానుకూలతః || 18

సాధారం శంఖమపి చ సంపూజ్య కుసుమాదిభిః | నిఃక్షిపేదస్త్ర వర్మభ్యాం శోధితం తత్ర సజ్జలమ్‌ || 19

అపూర్య పూర్వవత్పూజ్యే షడంగోక్తక్రమేణ చ | ప్రణవేన పునస్తద్వై సప్తధైవాభిమంత్రయేత్‌ |' 20

శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను -

ఓ వామదేవా! గురుస్థానమును ఇచ్చే యోగపట్టమును చెప్పెదను. మిక్కిలి రహస్యమైనది, మోక్షమునిచ్చునది అగు దీనిని నీయందలి ప్రేమచే చెప్పుచున్నాను (11). వైశాఖ-శ్రావణ-ఆశ్వయుజ-కార్తిక-మార్గశీర్ష-మాఘములలో ఏదో ఒక మాసములో శుక్లపక్షములో శుభదినముఅగు (12) పంచమినాడు గాని, లేదా పూర్ణిమ నాడు గాని, ప్రభాతకృత్యములను నెరవేర్చుకొని గురువు వద్ద అనుమతిని పొంది, స్నానమును చేసి, ఏకాగ్రమగు మనస్సు గలవాడై (13), వీరాసనములో నడుము మరియు మోకాళ్ల చుట్టూ కట్టే బట్టను ఉతికి, దానితో శరీరమును తుడుచుకొని, దానికి రెండు పేటల త్రాడును కట్టి, రెండు వస్త్రములను ధరించి (14), కాళ్లను కడుగుకొని, రెండు సార్లు ఆచమనమును చేసి, సద్యోజాతం ప్రపద్యామి --- (సద్యోజాతుని నేను శరణు పొందుచున్నాను---) అనే మంత్రముతో భస్మను స్వీకరించి, శరీరముపై పూసుకొని, తరువాత దానిని ధరించవలెను (15). ఓ మునీ! అపుడు అనుకూలుడగు గురువు తన శిష్యులతో గూడిఆతని చేతినితన రెండు చేతులలో పట్టుకొని తూర్ప ముఖముగా కూర్చుండబెట్టవలెను (16). ఆతడు ఆ విధముగా అలంకరించిన మండపములో దర్భలు, దానిపై మృగచర్మము, దానిపై వస్త్రము పరచిన, గురువు కూర్చుండదగిన శుభ్రమగు ఆసనముపై గురువు కూర్చుండబెట్టిన విధముగా కూర్చుని యుండవలెను (17). తరువాత గురువు శంఖమును దాని ఆధారముతో సహా తీసుకొని, అస్త్ర మంత్రముతో దానిని విశేషముగా శుభ్రము చేసి, అనుకూల్యమును బట్టి ఆతనికి ఎదురుగా పెట్టవలెను (18). ఆతడు ఆధారముతో సహా శంఖమును పుష్పములు మొదలగు వాటితో పూజించి అస్త్ర మంత్రముతో మరియ కవచ మంత్రముతో దానిని శుభ్రము చేసి, పూర్వమునందు చెప్పిన విధముగా పూజింపదగిన ఆ శంఖములో షడంగములలో చెప్పబడిన క్రమములో శుభ్రమగు నీటిని నింపి, మరల దానిని ఏడు సార్లుఓంకారముతో అభిమంత్రించవలెను (19, 20).

అభ్యర్చ్య గంధపుష్పాద్యైర్ధూపదీపౌ ప్రదర్శ్య చ | సంరక్షాస్త్రేణ తం శంఖం వర్మణా%థావగుంఠయేత్‌ || 21

ధేనుశంఖాఖ్యముద్రే చ దర్శయేదథ దేశికః | పునస్స్వపురతశ్శంఖదక్షిణ దేవ ఉత్తమే || 22

పూజార్ఘ్యోక్తవిధానేన సుందరం మండలం శుభమ్‌ | కుర్యాత్సంపూజయేత్తం చ సుగంధకుసుమాదిభిః || 23

సాధారం శోధితం శుద్ధం ఘటం తంతుపరిష్కృతమ్‌ | ధూపితం స్థాపితం శుద్ధవాసితోదప్రపూరితమ్‌ || 24

పంచత్వక్‌ పంచపత్రైశ్చ మృత్తికాభిశ్చ పంచభిః | మిలితం చ సుగంధేన లేపయేత్తం మునీశ్వర || 25

వస్త్రా మ్రదలదూర్వాగ్రనారికేలసుమైస్తతః | తం ఘటం వస్తుభిశ్చాన్యైస్సంస్కుర్యాత్సమలంకృతమ్‌ || 26

విన్యసేత్పంచ రత్నాని ఘటే తత్ర మునీశ్వర | హిరణ్యం చాపి తేషాం వాభావే భక్త్యా ప్రవిన్న్యసేత్‌ || 27

నీలాఖ్యరత్నం చ తథా రత్నే మాణిక్యహేమనీ | ప్రవాలగోమేధకే చ పంచరత్నమిదం స్మృతమ్‌ || 28

నృవ్లుస్కమితి సంప్రోచ్య గ్లూమిత్యంతే%థ దేశికః | సమ్యగ్విధానతః ప్రీత్యా సానుకూలస్సమర్చయేత్‌ || 29

ఆధారశక్తిమారభ్య యజనోక్తవిధానతః | పంచావరణమార్గేణ దేవమావాహ్య పూజయేత్‌ || 30

గంధము, పుష్పములు మొదలగువాటితో చక్కగా పూజించి, ధూపదీపములను చూపించి, ఆ శంఖమును తరువాత సంరక్షాస్త్ర మంత్రముతో మరియు కవచమంత్రముతో కప్పి రక్షించవలెను (21). తరువాత గురువు ధేనుముద్రను, శంఖముద్రను చూపించవలెను. తరువాత ఆతడు మరల తన యెదుట శంఖమునకు దక్షిణమునందు ఉత్తమమగు స్థానములో (22). అందమైన మంగళకరమైన మండలమును పూజావిధానములో చెప్పిన విధముగా తయారు చేసి, దానిని కూడ సుగంధము, పుష్పములు మొదలగు వాటితో చక్కగా పూజించవలెను (23) మంత్రములచే శుచిగా చేయబడిన శుభ్రమగు ఘటమును మట్టుతో సహా తీసుకొని దానికి దారములను చుట్టి, దానికి ధూపమును వేసి, పరిశుభ్రమైన సుగంధజలముతో దానిని నింపి అచట నుంచవలెను (24). ఓ మహర్షీ! ఐదు చెట్టు బెరడులు, ఐదు ఆకులు మరియు ఐదు రకముల మట్టి కలిపిన సుగంధమును దానికి పూయవలెను (25). ఈ విధముగా చక్కగా అలంకరించబడియున్న ఆ ఘటమును వస్త్రములు, మామిడి ఆకులు, దూర్వ (గడ్డిపోచ) ల అగ్రభాగములు, పుష్పములు మరియు ఇతరవస్తువులతో సంస్కరించి, దానిపై కొబ్బరికాయను ఉంచవలెను (26). ఓ మహర్షీ! ఆ ఘటములో అయిదు రత్నములనుంచవలెను. రత్నములు లేనిచో బంగారమును దానియందు భక్తితో వేయవలెను (27). ఇంద్రనీలము, మాణిక్యము, బంగారము, పగడము, గోమేధము అనువాటికి పంచరత్నములు అని పేరు (28). తరువాత శిష్యునకు అనుకూల్యమును చేసే ఆ ఆచార్యుడు నృవ్లుస్కం గ్లూమ్‌ అనే బీజాక్షరములను పలికి ప్రేమతో యథావిధిగా చక్కగా పూజించవలెను (29). పూజావిధానములో చెప్పిన విధాముగా పంచావరణపూజాపద్ధతిని అనుసరిస్తూ సాధకుడు పరమేశ్వరుని ఆవాహన చేసి, ఆధారశక్తితో మొదలిడి పూజించవలెను (30).

నివేద్య పాయసాన్నం చ తాంబూలాది యథా పురా | నామాష్టకార్చనాంతం చ కృత్వా తమభిమంత్రయేత్‌ || 31

ప్రణవాష్టోత్తరశతం బ్రహ్మభిః పంచభిః క్రమాత్‌ | సద్యాదీశాంతమప్యస్త్రం రక్షితం వర్మనా పునః || 32

అవగుంఠ్య ప్రదర్శ్యాథ ధూపదీపౌ చ భక్తితః | ధేనుయోన్యాఖ్యముద్రే చ సమ్యక్తత్ర ప్రదర్శయేత్‌ || 33

తతశ్చ దేశికస్తస్య దర్భైరాచ్ఛాద్య మస్తకే | మండలస్యేశదిగ్భాగే చతురస్రం ప్రకల్పయేత్‌ || 34

తదుపర్యాసనం రమ్యం కల్పయిత్వా విధానతః | తత్ర సంస్థాపయేచ్ఛిష్యం తం శిశుం సానుకూలతః || 35

తతః కుంభం సముత్థాప్య స్వస్తివాచనపూర్వకమ్‌ | అభిషించేద్గురుశ్శిష్యం ప్రాదక్షిణ్యన మస్తకే || 36

ప్రణవం పూర్వముచ్చార్య సప్తధా బ్రహ్మభిస్తతః | పంచభిశ్చాభిషేకాంతే శంఖోదేనాభివేష్టయేత్‌ || 37

చారుదీపం ప్రదర్శ్యాథ వాససా పరిమృజ్య చ | నూతనం దోరకౌపీనం వాససీ పరిధాపయేత్‌ || 38

క్షాలితాంఘ్రిర్ద్విరాచమ్య ధృతభస్మగురుశ్శిశుమ్‌ | హస్తాభ్యామవలంబ్యాథ హస్తౌ మండపమధ్యతః || 39

తదంగేషు సమాలిప్య తద్భస్మ విధినా గురుః | ఆసనే సంప్రవేశ్యాథ కల్పితే స్థాపయేత్సుఖమ్‌ || 40

పాయసాన్నమును నైవేద్యమిడి, తాంబూలము మొదలగు వాటిని సమర్పించి, పూర్వమునందు చెప్పిన విధముగా ఎనిమిది నామములతో పూజ వరకు పూర్తి చేసి, ఆ ఘటమును నూట యెనిమిది ఓంకారములతో మరియు సద్యోజాతమ్‌ అను మంత్రముతో మొదలిడి ఈశానస్సర్వ----అను మంత్రము వరకు గల పంచబ్రహ్మమంత్రములతో క్రమముగా అభిమంత్రించి అస్త్ర కవచమంత్రములతో మరల దానికి రక్షణను కల్పించి (31,32), దానిని వస్త్రముతో కప్పి, ధూపదీపములను భక్తితో చూపించి, తరువాత ధేనుముద్రను మరియు యోనిముద్రను సరియగు విధానములో ప్రదర్శించవలెను (33). తరువాత ఆచార్యుడు ఆ శిష్యుని తలను దర్భలతో కప్పి, మండలమునకు ఈశాన్యదిక్కునందు చతురస్రమును గీయవలెను (34). దానిపై యథావిధిగా సుందరమగు ఆసనమును ఏర్పాటు చేసి, దానియందు తన పుత్రునివంటి ఆ శిష్యుని అనుకూలముగా నుండు విధములో కూర్చండబెట్టవలెను (35). తరువాత గురువు ఆ కుండను స్వస్తిమంత్రములతో పైకి తీసి శిష్యుని శిరస్సుపై ప్రదక్షిణవిధానములో అభిషేకించవలెను (36). ముందుగా ఓంకారమును ఏడు సార్లు ఉచ్చరించి , తరువాత పంచబ్రహ్మమంత్రములతో అభిషేకించి, ఆఖరులో శంఖమునందలి జలమును చుట్టూ చల్లవలెను (37). తరువాత సుందరమగు దీపమును చూపించి, వస్త్రముతో తుడిచి, కొత్త లంగోటీని మరియు రెండు కొత్తవస్త్రములను ధరింపజేయవలెను (38). గురువు కాళ్లను కడుగుకొని రెండు సార్లు ఆచమనమును చేసి, భస్మను చేతబట్టుకొని, తన పుత్రునివంటి శిష్యుని రెండు చేతులను తన రెండు చేతులతో పట్టుకొని, మండపమునకు మధ్యములో ఆ భస్మను యథావిధిగా వాని ఆవయవములయందు ధరింపజేసి, తరువాత అచట ఏర్పాటు చేయబడిన సుఖాసనమునందాతనిని కూర్చుడ బెట్టవలెను (39, 40).

పూర్వాభిముఖమాత్మీయతత్త్వజ్ఞానాభిలాషిణమ్‌ | స్వాసనస్థో గురుర్ర్బూ యాదమలాత్మా భ##వేతి తమ్‌ || 41

గురుశ్చ పరిపూర్ణో%స్మి శివ ఇత్యచలస్థితిః | సమాధిమాచరేత్సమ్యజ్‌ ముహూర్తం గుఢమానసః || 42

పశ్చాదున్మీల్య నయనే సానుకూలేన చేతసా | సాంజలిం సంస్థితం శుద్ధం పశ్యేచ్ఛిష్యమనాకులః || 43

స్వహస్తం భసితాలిప్తం విన్యస్య శిశుమస్తకే | దక్షశ్రుతావుపదిశేద్ధం సస్సో%హమితి స్ఫుటమ్‌ || 44

తత్రాద్యహంపదస్యార్థశ్శక్త్యాత్మా స శివస్స్వయమ్‌ | స ఏవాహం శివో%స్మీతి స్వాత్మానం సంవిభావయ || 45

య ఇత్యణోరర్థతత్త్వముపదిశ్య తతో వదేత్‌ | అవాంతరాణాం వాక్యానామర్థతాత్పర్యమాదరాత్‌ || 46

వాక్యాని వచ్మితే బ్రహ్మన్‌ సావధానమతిః శృణు | తాని ధారయ చిత్తే హి స బ్రూయాదితి సంస్ఫుటమ్‌ || 47

ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం శిష్యకరణవిధిర్నామ అష్టాదశో%ధ్యాయః (18).

గురువు తన ఆసనమునందు తూర్పు ముఖముగా కూర్చుండి ఆత్మతత్త్వమును తెలియవలెననే అభిలాషను కలిగియున్న ఆ శిష్యుని ఉద్దేశించి, స్వచ్ఛమైన మనస్సు కలవాడవు కమ్ము అని చెప్పవలెను (41). గురువు కూడ నేను పరిపూర్ణడనగు శివుడను అనే భావనలో స్థిరముగా ముహూర్తకాలము ఉన్నవాడై ఆత్మయందు లగ్నమైన మనస్సు గలవాడై సమాధిని అనుష్ఠించవలెను (42). తరువాత ఆయన కన్నులను తెరచి, కంగారు లేనివాడై, చేతులను కట్టుకొని నిలబడియున్న పవిత్రుడగు శిష్యుని ప్రసన్నమగు మనస్సుతో చూడవలెను (43). భస్మ పూయబడిన తన చేతిని తన పుత్రుని వంటి శిష్యుని తలపై నుండి కుడి చెవిలో హంసస్సో%హమ్‌ (పరబ్రహ్మస్వరూపుడను నేనే) అని స్పష్టముగా ఉపదేశించవలెను (44). ఆ మంత్రములో మొదటి అక్షరమగు హం పదమునకు శక్తిస్వరూపము అని యర్ధము. ఈ సకారము సాక్షాత్తుగా శివుడే. ఆ శివుడను ఆత్మస్వరూపుడనగు నేనే అని తెలుసుకొనుము (45). ఇట్లు బోధించిన తరువాత గురువు అణోరణీయాన్‌ ---- (సూక్ష్మమైనదానికంటె కూడ ఆత్మ సూక్ష్మమైనది---) అని ఆరంభమయ్యే మంత్రముయొక్క అర్థము అగు ఆత్మతత్త్వమును ఉపదేశించి, తరువాత అవాంతర (మహావాక్యముల మధ్యలో వచ్చే) వాక్యముల అర్థమును, తాత్పర్యమును సాదరముగా చెప్పవలెను (46). ఓ బ్రహ్మస్వరూపుడా! నీకు కొన్ని వాక్యములను చెప్పెదను. సావధానమగు మనస్సు గలవాడనై విని, వాటిని మనస్సులో నిలబెట్టుకొనుము అని ఆయన ఆతనితో స్పష్టముగా చెప్పవలెను (47).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు యోగపట్టము కొరకై శిష్యుని సంసిద్ధుని చేసే ప్రక్రియను వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

Siva Maha Puranam-4    Chapters