Siva Maha Puranam-4    Chapters   

అథ నవమో%ధ్యాయః

శివుడు ప్రణవార్థమును వివరించుట

ఈశ్వర ఉవాచ |

శివో మహేశ్వరశ్చైవ రుత్రో విష్ణుః పితామహః | సంసారవైద్యస్సర్వజ్ఞః పరమాత్మేతి ముఖ్యతః || 1

నామాష్టకమిదం నిత్యం శివస్య ప్రతిపాదకమ్‌ | ఆద్యంతపంచకం తత్ర శాంత్యతీతాద్యనుక్రమాత్‌ || 2

సంజ్ఞా సదాశివాదీనాం పంచోపాధిపరిగ్రహాత్‌ | ఉపాధి వినివృత్తౌతు యథాస్వం వినివర్తతే || 3

పదమేవ హితం నిత్యమనిత్యాః పదినస్స్మృతాః | పదానాం పరివృత్తిస్స్యాన్ముచ్యంతే పదినో యతః || 4

పరివృత్త్యంతరే త్వేవం భూయస్తస్యాప్యుపాధినా | ఆత్మాంతరాభిధానం స్యాత్పదాద్యం నామపంచకమ్‌ || 5

అన్యత్తు త్రితయం నామ్నాయుపాదానాదిభేదతః | త్రివిధోపాధిరచనాచ్ఛివ ఏవ తు వర్తతే || 6

అనాదిమలసం శ్లేషప్రాగభావాత్స్వభావతః | అత్యంతపరిశుద్ధాత్మేత్యతో%యం శివ ఉచ్యతే || 7

అథవా %శేషకల్యాణగుణౖకఘన ఈశ్వరః | శివ ఇత్యుచ్యతే సద్భిశ్శివతత్త్వార్థవేదిభిః || 8

త్రయోవింశతితత్త్వేభ్యః పరా ప్రకృతిరుచ్యతే | ప్రకృతేస్తు పరం ప్రాహుః పురుషం పంచవింశకమ్‌|| 9

యద్వేదాదౌ స్వరం ప్రాహుర్వాచ్యవాచకభేదతః | వేదైకవేద్యం యాథాత్మ్యాద్వేదాంతే చ ప్రతిష్ఠితమ్‌ || 10

ఈశ్వరుడిట్లు పలికెను -

శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, పితామహుడు, సంసారవైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ అను ఎనిమిది నామములు నిత్యుడగు శివుని ముఖ్యముగా ప్రతిపాదించును. పరమాత్మయందు శాంత్యతీత కళ మొదలగు అయిదు కళలు గలవు. పరమాత్మ వాటి క్రమముననుసరించి సదాశివుడు మొదలగు అయిదు ఉపాధులను స్వీకరించును. వాటిని బట్టి ఆయనకు వీటిలో మొదటి ఐదు నామములు కలిగినవి. ఆ ఉపాధులు ఉపసంహరింపబడినప్పుడు ఆ నామములు కూడ ఉపసంహరింపబడును (1-3). పదము మాత్రమే నిత్యమనియు, పదముచే నిర్దేశింపబడే పదార్థము (పది) అనిత్యమనియు స్వీకరింపబడినది. పదనిర్దేశ్యములగు ఉపాధులు తొలగిపోవుచుండును. కావున, పదములు కూడ మారుచుండును (4). ఉపాది మారుట తోడనే నామము కూడ ఈ విధముగా మారుచుండును. కావున, మొదటి ఐదు నామములు నిరుపాధికమగు ఆత్మను గాక, ఉపాధిసహితమగు ఆత్మను బోధించును (5). జగత్తుయొక్క ఉపాదానకారణములోనుండే భేదములను బట్టి మగిలిన మూడు నామమలు కలిగినవి. మూడు రకముల ఉపాధులను రచించి వాటియందు ఉండువాడు శివుడు మాత్రమే (6). పరమాత్మ తన స్వరూపమునందు అనాదియగు అవిద్యతో సంశ్లేషము (లేపము) లేనివాడు గనుక, అత్యంతపరిశుద్ధుడుగనే యున్నాడు. కావుననే, ఆ పరమాత్మకు శివుడనే పేరు కలిగినది (7). లేదా, సకలకల్యాణగుణములకు ఏకైకనిధానమగుటచే ఈశ్వరునకు శివుడని పేరు కలిగినదని శైవతత్త్వమునెరింగిన సత్పరుషులు చెప్పుచున్నారు (8). ప్రకృతి ఇరవై మూడు తత్త్వములకు అతీతమైనదనియు, ఇరువది అయిదవ తత్త్వమగు పురుషుడు ప్రకృతికి అతీతుడనియు మహర్షులు చెప్పుచున్నారు (9). వేదముయొక్క ఆదిలోనుండే ఓంకారము వేదములచే మాత్రమే తెలియబడువాడు, ఉపనిషత్తులయందు దృఢముగా ప్రతిపాదింపబడువాడు అగు పరమేశ్వరుని నిర్దేశించే నామము అగుచున్నది (10).

స ఏవం ప్రకృతౌ లీనో భోక్తా యః ప్రకృతేర్యతః | తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః || 11

తదధీనప్రవృత్తిత్వాత్ర్ప కృతేః పురుషస్య చ | అథవా త్రిగుణం తత్త్వం మాయేయమిదమవ్యయమ్‌ || 12

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ | మాయావిమోచకో%నంతో మహేశ్వరసమన్వయాత్‌ || 13

రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్ద్రా వయతి యః ప్రభుః | రుద్ర ఇద్యుచ్యతే తస్మాచ్ఛివః పరమకారణమ్‌ || 14

శివతత్త్వాది భూమ్యంతం శరీరాది ఘటాది చ | వ్యాప్యాధితిష్ఠతి శివస్తస్మాద్విష్ణురుదాహృతః || 15

జగతః పితృభూతానం శివో మూర్త్యాత్మనామపి | పితృభావేన సర్వేషాం పితామహ ఉదీరితః || 16

నిదానజ్ఞో యథా వైద్యో రోగస్య వినివర్తకః | ఉపాయైర్భేషజైస్తద్వల్లయభోగాధికారకః || 17

సంసారస్యేశ్వరో నిత్యం స్థూలస్య వినివర్తకః | సంసారవైద్య ఇత్యుక్తస్సర్వతత్త్వార్థవేదిభిః 18

దశార్థజ్ఞానసిద్ధ్యర్థమింద్రియేషు చ సత్స్వపి | త్రికాలభావినో భావాన్‌ స్థూలసూక్ష్మానశేషతః || 19

అణవో నైవ జానంతి మాయార్ణవమలావృతాః | అసత్స్వపి చ సర్వేషు సిద్ధసర్వార్థవేదిషు || 20

యద్యథా % వస్థితం వస్తు తత్తథైవ సదాశివః | ఆయత్నేనైవ జానాతి తస్మాత్సర్వజ్ఞ ఉచ్యతే || 21

ఆ ఓంకారము ప్రకృతిలో లీనమగును. ప్రకృతియందు తాదాత్మ్యమును పొందిన ఆత్మ భోక్త యగుచున్నది. ప్రకృతియందు లీనమైన ఆ ఓంకారమునకు అతీతుడగు పరమాత్మకు ప్రకృతిపురుషులు వశములో నుందురు గనుక, ఆయనకు మహేశ్వరుడను పేరు వచ్చినది. లేదా, సత్త్వరజస్తమోగుణాత్మకమగు ఈ జగత్తు మాయ. అది అవినాశి (11, 12). ఆ మాయయే ప్రకృతి అనియు, మమేశ్వరుడు మాయను వశమునందు కలవాడనియు తెలియవలెను. అనంతుడగు ఆ పరమాత్మ మాయనుండి విముక్తిని ఇచ్చువాడు గనుకనే, ఆయనకు మహేశ్వరుడను పేరు సార్థకమగుచున్నది (13). రుత్‌ అనగా దుఃఖము, లేదా దుఃఖమునకు హేతువు. సర్వకారణకారణుడగు శివప్రభుడు దానిని పారద్రోలును గనుక రుద్రుడనబడును (14). శివతత్త్వములో మొదలిడి భూమి వరకు, శరీరము మొదలగు వాటి వరకు, మరియు ఘటములు మొదలగు వాటి వరకు వ్యాపించి సర్వమునకు అదిష్ఠానమై ఉన్నాడు గనుకనే, శివునకు విష్ణువు అను పేరు వచ్చినది (15). జగత్తునకు తండ్రులనదగిన త్రిమూర్తులకు అందరికీ తండ్రి యగుటచే శివునకు పితామహుడు అనే పేరు వచ్చినది (16). రోగనిదానము తెలిసిన వైద్యుడు వివిధములగు ఉపాయములచేత మరియు మందులతో రోగమును పోగొట్టగల్గును. అదే విధముగా, లయమునకు భోగమునకు అధికారి అయినవాడు, జగత్తును సర్వదా పాలించువాడు, స్థూలజగత్తును ప్రళయములో ఉపసంహరించువాడు అగు శివుడు సంసారవైద్యుడని తత్త్వములన్నింటి అర్థము తెలిసిన మహాత్ములు చెప్పుచున్నారు (17, 18). శబ్దరూపరసస్పర్శగంధములనే అయిదు విషయములను తెలియుటకు మనకు అయిదు జ్ఞానేంద్రియములు సహకారము మరియు అయిదు విధముల కార్యములను చేసే అయిదు కర్మేంద్రియములు ఉన్ననూ, మాయ అనే సముద్రముయొక్క దోషముచే కప్పివేయబడియున్న అల్పులగు జీవులు భూతభవిష్యద్వర్తమానకాలములయందు ఉండే స్తూలసూక్ష్మపదార్థములను సంపూర్ణముగా తెలియజాలరు. కాని, ఎదురుగానుండే పదార్థములనన్నింటిని తెలుపుడు జేసే జ్ఞానేంద్రియములు మరియు పనులనన్నింటినీ చేసిపెట్టే కర్మేంద్రియములు లేకున్ననూ, సదాశివుడు ప్రయత్నము లేకుండగనే వస్తువును ఉన్నది ఉన్నట్లుగా తెలియగల్గుచున్నాడు. కావుననే, అయనకు సర్వజ్ఞుడను పేరు తగియున్నది (19, 21).

సర్వాత్మా పరమైరేభిర్గుణౖర్నిత్యసమన్వయాత్‌ | స్వస్మాత్పరాత్మవిరహాత్పరమాత్మా శివస్స్వయమ్‌ || 22

ఇతి స్తుత్వా మహాదేవం ప్రణవాత్మానమవ్యయమ్‌ | దత్త్వా పరాఙ్ముఖాద్యం చ పశ్చాదీశానమస్తకే || 23

పునరభ్యర్చ్య దేవేశం ప్రణవేన సమాహితః | హస్తేన బద్ధాంజలినా పూజాపుష్పం ప్రగృహ్య చ || 24

ఉన్మనాంతం శివం నీత్వా వామనాసాపుటా ధ్వనా | దైవీముద్వాస్య చ తతో దక్షనాసాపుటాధ్వనా || 25

శివ ఏవాహమస్మీతి తదైక్యమనుభూయ చ | సర్వావరణదేవాంశ్చ పునరుద్వాసయేద్ధృది || 26

విద్యాపూజాం గురోః పూజాం కృత్వా పశ్చాద్యథాక్రమమ్‌ | శంఖార్ఘ్యపాత్రమంత్రాంశ్చ హృదయే విన్యసేత్క్ర మాత్‌ || 27

నిర్మాల్యం చ సమర్ప్యాథ చండేశాయేశగోచరే | పునశ్చ సంయతప్రాణ ఋష్యాదికమథోచ్చరేత్‌ || 28

కైలాసప్రస్తరో నామ మండలం పరిభాషితమ్‌ | అర్చయేన్నిత్యమేవైతత్పక్షే వా మాసి మాసి వా || 29

షణ్మాసే వత్సరే వాపి చాతుర్మాస్యాదిపర్వణి | అవశ్వం చ సమభ్యర్చేన్నిత్యం మల్లింగమాస్తికః || 30

సర్వమునకు ఆత్మ యగుట వలన, నిత్యము ఈ గుణములతో కూడి యుండుట వలన, తనకంటె మరియొక ఆత్మ లేనందువలన శివుడు స్వయముగా పరమాత్మ యగుచున్నాడు (22). ఓంకారస్వరూపుడు, వినాశము లేనివాడు అగు మహాదేవుని ఈ విధముగా స్తుతించి, తరువాత ఈశానుని శిరస్సునందు తాంబూలమును సమర్పించి (23). ఏకాగ్రమగు మనస్సు గలవాడై మరల దేవదేవుని ఓంకారముతో పూజించి, చేతులను జోడించి వాటిలో పూజాపుష్పమును పట్టుకొని (24). ఎడమ ముక్కుతో గాలిని పీలుస్తూ మనోన్మనాయ నమః అని అంతమయ్యే మంత్రముతో శివుని మనస్సులో భావన చేస్తూ దేహభావనతో గూడియున్న ఆ గాలిని కుడి ముక్కు గుండా బయటకు విడిచిపెట్టి (25). శివుడను నేనే అని పలికి శివునితో ఐక్యమును అనుభవించి, ఆవరణదేవతలనందరినీ మరల మనస్సులో భావన చేసి ఉద్వాసన చెప్పవలెను (26). తరువాత వరుసగా విద్యాపూజను, గురుపూజను చేసి, శంఖమంత్రములను మరియు అర్ఘ్యపాత్రమంత్రమును హృదయములో క్రమముగా న్యాసము చేసుకొనవలెను (27). తరువాత ఈశాన్యమునందుండే చండీశ్వరునకు నిర్మాల్యమును సమర్పించి, మరల ప్రాణాయామమును చేసి ఋషి మొదలగు వివరములను ఉచ్చరించవలెను (28). ఈ మండలమునకు కైలాసప్రస్తరము అని పేరు. ప్రతిదినము గాని, పదిహేను రోజులకు ఒకసారి గాని, ప్రతి నెలలో గాని, ఆరు మాసములకు ఒకసారి గాని, సంవత్సరమునకు ఒకసారి గాని, చాతుర్మాస్యము మొదలగు పర్వదినములలో గాని అస్తికుడు ఈ మండలమునందు నా లింగమును తప్పని సరిగా శ్రద్ధతో పూజించవలెను (29, 30).

తస్మిన్‌ క్రమే మహాదేవి విశేషః కో%పి కథ్యతే | ఉపదేశదినే లింగం పూజితం గురుణా సహ || 31

గృహ్ణీయాదర్చయిష్యామి శివమాప్రాణసంక్షయమ్‌ | ఏవం త్రివారముచ్చార్య శపథం గురుసన్నిధౌ || 32

తతస్సమర్చయేన్నిత్యం పూర్వోక్తవిధినా ప్రియే | అర్ఘ్యం సమర్పయేల్లింగమూర్ధన్యర్ఘ్యోదకేన చ || 33

ప్రణవేన సమభ్యర్చ్య ధూపదీపౌ సమర్పయేత్‌ | ఐశాన్యాం చండమారాధ్య నిర్మాల్యం చ నివేదయేత్‌ || 34

ప్రక్షాల్య లింగం వేదీం చ వస్త్ర పూతైర్జలైస్తతః | నిఃక్షిప్య పుష్పం శిరసి లింగస్య ప్రణవేన తు || 35

ఆధారశక్తిమారభ్య శుద్ధవిద్యాసనావధి | విభావ్య సర్వం మనసా స్థాపయేత్పరమేశ్వరమ్‌ || 36

పంచగవ్యాదిభిర్ద్రవ్యైర్యథావిభవసంభృతైః | కేవలైర్వా జలైశ్శుద్ధై స్సురభిద్రవ్యవాసితైః || 37

పావమానేన రుద్రేణ నీలేనత్వరితేన చ | ఋగ్భిశ్చ సామభిర్వాపి బ్రహ్మభిశ్చైవ పంచభిః || 38

స్నాపయేద్దేవదేవేశం ప్రణవేన శివేన చ | విశేషార్ఘ్యోదకేనాపి ప్రణవేనాభిషేచయేత్‌ || 39

విశోధ్య వాససా పుష్పం లింగమూర్ధని విన్యసేత్‌ | పీఠే లింగం సమారోప్య సూర్యాద్యర్చాం సమాచరేత్‌ || 40

ఓ మహాదేవీ! ఆ క్రమములో గొప్ప విశేషము గలదు. దానిని చెప్పుచున్నాను. సాధకుడు సన్న్యాసదీక్షను స్వీకరించిన నాడు గురువుతో కూడి లింగమును పూజించి, 'నేను ప్రాణములు ఉన్నంత వరకు శివుని పూజించెదను' అను శపథమును గురువుయొక్క సన్నిధిలో మూడు సార్లు ఉచ్చరించవలెను (31, 32). ఓ ప్రియురాలా! తరువాత ప్రతి దినము పూర్వమునందు చెప్పబడిన విధానములో పూజించవలెను. లింగముపైన అర్ఘ్యపాత్రలోని జలముతో అభిషేకించవలెను (33). ఓంకారముతో పూజించి దూపదీపములను సమర్పించవలెను. ఈశాన్యమునందు చండీశ్వరుని ఆరాధించి నిర్మాల్యమును నివేదించవలెను (34). వస్త్రములో వడకట్టిన జలముతో లింగమును మరియు వేదికను కడిగి లింగముయొక్క శిరస్సుపై ఓంకారముతో పుష్పమునుంచి (35). మూలధారశక్తితో మొదలిడి శుద్ధవిద్యాస్థానము (సహస్రారము) వరకు సర్వమును మనస్సుతో భావన చేసి పరమేశ్వరుని స్థాపించవెను (36). సాధకుడు తన వైభవమునకు అనుగుణముగ పంచగవ్యములు మొదలగు ద్రవ్యములను సంపాదించి వాటితో గాని, లేదా పరిమళద్రవ్యములను కలిపి శుద్ధజలములతో గాని (37). పవమానసూక్తమును, రుద్రాధ్యాయమును, నీలాసూక్తమును, త్వరితసూక్తమును, లేదా ఋగ్వేద సామవేదములలోని మంత్రములను, లేదా సద్యోజాతమ్‌ తో మొదలిడి అయిదు బ్రహ్మల మంత్రములను పఠించి (38). దేవదేవుడగు శివుని అభిషేకించవలెను. ప్రణవమును లేదా శివనామమును మంత్రముగా నుపయోగించదగును. అర్ఘ్యపాత్రలోని జలముతో ఓంకారమునుచ్చరిస్తూ అభిషేకించవలెను (39). లింగమును వస్త్రముతో తుడిచి దాని శిరస్సుపై పుష్పమునుంచవలెను. ఆ లింగమును పీఠముపై నిలబెట్టి సూర్యుడు మొదలగు దేవతలను పూజించవలెను (40).

ఆధారశక్త్యనంతౌ ద్వౌ పీఠాథస్తాత్సమర్చయేత్‌ | సింహాసనం తదూర్ద్వం తు సమభ్యర్చ్య యథాక్రమమ్‌ || 41

అథోర్ధ్వచ్ఛదనం పీఠపాదే స్కందం సమర్చయేత్‌ | లింగే మూర్తిం సమాకల్ప్య మాంత్వయా సహ పూజయేత్‌ || 42

సమ్యగ్‌ భక్త్యా విధానేన యతిర్మద్ధ్యానతత్పరః | ఏవం మయా తే కథితమతిగుహ్యమిదం ప్రియే || 43

గోపనీయం ప్రయత్నేన న దేయం యస్య కస్యచిత్‌ | మమ భక్తాయ దాతవ్యం యతయే వీతరాగిణ || 44

గురుభక్తాయ శాంతయ మదర్థే యోగభాగినే | మమాజ్ఞామతిలంఘ్యైతద్యో దదాతి విమూఢధీః |

స నారకీ మమ ద్రోహీ భవిష్యతి న సంశయః || 45

మద్భక్తదానాద్దేవేశి మత్ప్రియశ్చ భ##వేద్ధ్రు వమ్‌ | ఇహ భుక్త్వాఖిలాన్‌ భోగాన్‌ మత్సాన్నిధ్యమవాప్నుయాత్‌ || 46

పీఠమునకు క్రింది భాగములో ఆధారశక్తి, అనంతము అను రెండింటినీ ముందుగా పూజించవలెను. తరువాత, దానికి పైన సింహాసనమును పూజించవలెను (41). తరువాత పై కప్పును, పీఠముయొక్క పాదమునందు కుమారస్వామిని పూజించవలెను. ధ్యానమునందు నిష్ఠగల సన్న్యాసి లింగము నందు నీతో కూడియున్న నా మూర్తిని చక్కగా భావన చేసి చక్కని భక్తితో యథావిధిగా పూజించవలెను. ఓ ప్రియురాలా! ఈ విధముగా నేను నీకు మిక్కిలి రహస్యమైన ఈ పూజావిధానమును చెప్పియుంటిని (42,43). దీనిని ప్రయత్నపూర్వకముగా రహస్యముగా నుంచవలెను. ఎవరికి పడితే వారికి ఈయరాదు. వైరాగ్యము గలవాడు, నాయందు మరియు గురువునందు భక్తి గలవాడు, శాంతస్వభావము గలవాడు, నన్ను పాందుటకై యోగమును చేపట్టినవాడు అగు సన్న్యాసికి ఈయవలెను. నా ఆజ్ఞను ఉల్లంఘించి ఏ మూర్ఖుడైతే దీనిని అయోగ్యునకు ఇచ్చునో, అట్టి వాడు నాకు ద్రోహమును చేసినవాడగుటచే నరకమును పొందుననుటలో సందేహము లేదు (44, 45). ఓ దేవదేవీ! నా భక్తునకు దీనిని ఇచ్చువాడు నిశ్చయముగా నాకు ప్రియమైనవాడగును. అట్టివాడు ఇహలోకములో సకలభోగములను అనుభవించి నా సాన్నిధ్యమును పొందును (46).

వ్యాస ఉవాచ|

ఏతచ్ఛ్రుత్వా మహాదేవీ మహాదేవేన భాషితమ్‌ | స్తుత్వా తు వివిధైః స్తోత్రై ర్దేవం వేదార్థగర్భితైః || 47

శ్రీమత్పాదాబ్జయోః పత్యుః ప్రణామం పరమేశ్వరీ | అతిప్రహృష్టహృదయా ముమోద మునిసత్తమాః || 48

అతిగుహ్యమిదం విప్రాః ప్రణవార్థప్రకాశకమ్‌ | శివజ్ఞానపరం హ్యేతద్భవతామార్తినాశనమ్‌ || 49

వ్యాసుడు ఇట్లు పలికెను -

ఓ మహర్షులారా! మహాదేవుని ఈ వచనములను విని మహాదేవి యగు ఆ పరమేశ్వరి ఆ దేవుని వేదముయొక్క అర్థముతో కూడి గంభీరముగా నున్న వివిధస్తోత్రములతో స్తుతించి, భర్తయొక్క శోభాయుక్తములగు పాదపద్మములకు ప్రణమిల్లి మిక్కిలి ఉల్లాసముతో నిండిన మనస్సుగలదై ఆనందించెను (47,48). ఓ బ్రాహ్మణులారా! ఓంకారముయొక్క అర్థమును ప్రకాశింపజేయునది, శివజ్ఞానమగుటచే శ్రేష్ఠమైనది అగు ఈ సంభాషణము మిక్కిలి రహస్యమైనది. ఇది మీ దుఃఖమును పోగొట్టును (49).

సూత ఉవాచ |

ఇత్యుక్త్వా మునిశార్దూలః పారాశర్యో మహాతపాః | పూజితః పరయా భక్త్యా మునిభిర్వేదవాదిభిః || 50

కైలాసాద్రిమనుస్మృత్య య¸° తస్మాత్తపోవనాత్‌ | తే%పి ప్రహృష్టహృదయాస్సత్రాంతే పరమేశ్వరమ్‌ || 51

సంపూజ్య పరయా భక్త్యా సోమం సామార్ధశేఖరమ్‌ | యమాదియోగనిరతాశ్వివధ్యానపరా%భవన్‌ || 52

గుహాయ కథితం హ్యేతద్దేవ్యా తేనాపి నందినే | సనత్కుమారమునయే ప్రోవాచ భగవాన్‌ హి సః || 53

తస్మాల్లబ్ధం మద్గురుణా వ్యాసేనామితతేజసా |' తస్మాల్లబ్ధమిదం పుణ్యం మయాపి మునిపుంగవాః || 54

మయా వః శ్రావితం హ్యేతద్గుహ్యాద్గుహ్యతరం పరమ్‌ | జ్ఞాత్వా శివప్రియాన్‌ భక్త్యా భవతో గిరిశం ప్రియమ్‌ || 55

భవద్భిరపి దాతవ్యమేతద్గుహ్యం శివప్రియమ్‌ | యతిభ్యశ్శాంతచిత్తేభ్యో భ##క్తేభ్యశ్శివపాదయోః || 56

ఏతదుక్త్వా మహాభాగస్సూతః పౌరాణికోత్తమః | తీర్థయాత్రాప్రసంగేన చచార వృథివీమిమామ్‌ || 57

ఏతద్రహస్యం పరమం లబ్ధ్వా సూతాన్మునీశ్వరాః | కాశ్యామేవ సమాసీనా ముక్తాశ్శివపదం యయుః || 58

ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం ప్రణవార్థప్రకాశనం నామ నవమో%ధ్యాయః (9).

సూతుడట్లు పలికెను -

పరాశరపుత్రుడు, మహాతపశ్శాలి యగు వ్యాసమహర్షి ఇట్లు పలికి, వేదవేత్తలగు మునులచే గొప్ప భక్తితో పూజింపబడినవాడై (50). ఆ తపోవనమునుండి కైలాసపర్వతమును స్మరిస్తూ వెళ్లెను. ఆ మహర్షులు కూడ మిక్కిలి ఆనందముతో నిండిన హృదయములు గలవారై సత్రయాగము పూర్తి అయిన పిదప పార్వతీదేవితో కూడియున్నవాడు, చంద్రుని శిరముపై దాల్చినవాడు అగు పరమేశ్వరుని పరమభక్తితో చక్కగా కొలిచి యమనియమాది యోగపద్ధతులలో నిష్ఠ గలవారై శివధ్యానమునందు నిమగ్నులైరి (51, 52). ఈ వృత్తాంతమును పార్వతీదేవి కుమారస్వామికి చెప్పగా,. ఆయన నందికి చెప్పెను. పూజ్యుడగు ఆ నందీశ్వరుడు సనత్కుమారమహర్షికి చెప్పెను (53). మహాతేజశ్శాలి. నాకు గురువు అగు వ్యాసుడు దీనిని ఆయననుండి పొందెను. ఓ మహర్షులారా! నేను కూడ ఈ పుణ్యవృత్తాంతమును వ్యాసుని వద్దనుండి పొందితిని (54). మీరు శివునకు ప్రియులైన భక్తులనియు, మీకు ఆ కైలాసవాసి ప్రియుడనియు తెలిసిన నేను మిక్కిలి రహస్యమైనది, గొప్పది అగు ఈ విషయమును మీకు వినిపించితిని (55). శివునకు ప్రియమైన ఈ విషయమును మీరు కూడ శాంతమగు చిత్తము గలవారు, శివుని పాదములయందు భక్తిగలవారు అగు సన్న్యాసులకు ఈయదగును (56). మహాత్ముడు, పౌరాణికులలో శ్రేష్టుడు అగు సూతుడు ఇట్లు పలికి, తీర్థయాత్ర అనే కారణముచే ఈ భూలోకమునందు సంచరించెను (57). ఈ పరమరహస్యమగు విషయమును సూతునినుండి పొంది ఆ మహర్షులు కాశీయందు మాత్రమే నివసించి ముక్తులై శివధామమును పొందిరి (58).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు ఓంకారముయొక్క అర్థమును వివరించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-4    Chapters