Siva Maha Puranam-4    Chapters   

అథ సప్తమో%ధ్యాయః

శివధ్యానము - పూజా విధానము

ఈశ్వర ఉవాచ |

స్వవామే చతురస్రం తు మండలం పరికల్పయేత్‌ | ఓమిత్యభ్యర్చ్య తస్మింస్తు శంఖమస్త్రోపశోభితమ్‌ || 1

స్థాప్య సాధారకం తం తు ప్రణవేనార్చయేత్తతః | ఆపూర్య శుద్ధతోయేన చందనాదిసుగంధినా || 2

అభ్యర్చ్య గంధపుష్పాద్యైః ప్రణవేన చ సప్తధా | అభిమంత్ర్య తతస్తస్మిన్ధేనుముద్రాం ప్రదర్శయేత్‌ || 3

శంఖముద్రాం చ పురతశ్చతురస్రం ప్రకల్పయేత్‌ | తదంతరే% ర్ధచంద్రం చ త్రికోణం చ తదంతరే | 4

షట్కోణం వృత్తమేవేదం మండలం పరికల్పయేత్‌ | అభ్యర్చ్య గంధపుష్పాద్యైః ప్రణవేనాథ మధ్యతః || 5

సాధారమర్ఘ్యపాత్రం చ స్థాప్య గంధాదినార్చయేత్‌ | ఆపూర్య శుద్ధతోయేన తస్మిన్‌ పాత్రే వినిఃక్షిపేత్‌ || 6

కుశాగ్రాణ్యక్షతాశ్చైవ యవవ్రీహితిలానపి | ఆజ్యసిద్ధార్థపుష్పాణి భసితం చ వరాననే || 7

సద్యోజాతాదిభిర్మంత్రైః షడంగైః ప్రణవేన చ | అభ్యర్చ్య గంధపుష్పాద్యైరభిమంత్ర్య చ వర్మణా || 8

అవగుంఠ్యాస్త్ర మంత్రేణ సంరక్షార్ధం ప్రదర్శయేత్‌ | ధేనుముద్రాం చ తేనైవ ప్రోక్షయేదస్త్ర మంత్రతః || 9

స్వాత్మానం గంధపుష్పాదిపూజోపకరణాన్యపి | పద్మ స్యేశానదిక్పద్మం ప్రణవోచ్చారపూర్వకమ్‌ || 10

గుర్వాసనాయ నమ ఇత్యాసనం పరికల్పయేత్‌ | గురోర్మూర్తిం చ తత్రైవ కల్పయేదుపదేశతః || 11

ఈశ్వరుడిట్లు పలికెను -

సాధకుడు తనకు ఎడమ భాగములో చతురస్రమండలమును ఏర్పాటు చేసుకొని, దానిని ఓంకారముతో పూజించి, దానియందు అస్త్రమంత్రము (ఫట్‌) చే సంస్కరింప బడిన శంఖమును పీఠముతో సహా ఉంచి, దానిని తరువాత ఓంకారముతో పూజించి శుధ్ధమగు నీటిని దానియందు నింపి, దానిని చందనము మొదలగు పరిమళద్రవ్యములతో, పుష్పములు మొదలగు వాటితో అర్చించి, తరువాత ఓంకారమును ఏడుసార్లు ఉచ్చరించి దానిని అభిమంత్రించి, తరువాత ధేనుముద్రను, శంఖముద్రను దాని యెదుట చూపవలెను. చతురస్రమును, దానిలోపల అర్ధచంద్రాకారమును, దాని లోపల త్రికోణమును, షడ్భుజిని మరియు వృత్తమును గీసి, మండలమును సిద్ధము చేయవలెను. ఓంకారమునుచ్చరించి ఆ మండలమును గంధము, పుష్పములు మొదలగు వాటితో చక్కగా అర్చించి, దాని మధ్యలో పీఠముతో కూడిన అర్ఘ్యపాత్రను ఉంచి దానిని గంధము మొదలగు వాటితో అర్చించి, దానిని శుద్ధమగు నీటితో నింపవలెను (1-6). ఓ సుందరీ! దర్భ కొనలు, అక్షతలు, ధాన్యము, గోధుమలు, నువ్వులు, నేతియందు తయారుచేసిన పదార్ధములు, పుష్పములు, భస్మ అను వాటిని దానియందు ఉంచవలెను (7). ఆరు అంగములతో (ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము) కూడిన సద్యోజాతాది మంత్రములను మరియు ఓంకారమును ఉచ్చరించి దానిని గంధము, పుష్పములు మొదలగు వాటితో చక్కగా పూజించి కవచము (హుమ్‌) తో అభిమంత్రించి, అస్త్ర మంత్రము (ఫట్‌) తో దానిని కప్పి, రక్షణ కొరకై ధేనుముద్రను చూపి అదే నీటిని అస్త్ర మంత్రమును ఉచ్చరిస్తూ తనపై మరియు గంధము పుష్పములు మొదలగు పూజాద్రవ్యములపై చల్లవలెను. ఓంకారపూర్వకముగా'గుర్వాసనాయ నమః (గురువుయొక్క ఆసనమునకు నమస్కారము)' అని పఠించి మండలమునకు ఈశాన్యదిక్కునందు ఉన్న పద్మమును ఆసనముగా నీయవలెను. ఈ శాస్త్రో పదేశముననుసరించి గురువుయొక్క మూర్తిని కూడ అచటనే స్థాపించవలెను (8-11).

ప్రణవం గుం గురుభ్యో%తే నమః ప్రోచ్యాపి దేశికమ్‌ | సమావాహ్య తతో ధ్యాయేద్దక్షిణాభిముఖం స్థితమ్‌ || 12

సుప్రసన్నముఖం సౌమ్యం శుద్ధస్ఫటికనిర్మలమ్‌ | వరదాభయహస్తం చ ద్వినేత్రం శివవిగ్రహమ్‌ || 13

ఏవం ధ్యాత్వా యజేద్గంధపుష్పాదిభిరనుక్రమాత్‌ | పద్మస్య నైరృతే పద్మే గణపత్యాసనోపరి || 14

మూర్తిం ప్రకల్ప్య తత్రై వ గణానాం త్వేతి మంత్రతః | సమావాహ్య తతో దేవం ధ్యాయేదేకా గ్రమానసః || 15

రక్తవర్ణం మహాకాయం సర్వాభరణభూషితమ్‌ | పాశాంకుశేష్టదశనాన్‌ దధానం కరపంకజైః || 16

గజాననం ప్రభుం సర్వవిఫ°్నఘఘ్నముపాసితుః | ఏవం ధ్యాత్వా యజేద్గంధపుష్పాద్యైరుపచారకైః || 17

కదలీనారికేలా మ్రఫలలడ్డుకపూర్వకమ్‌ | నైవేద్యం చ సమర్ప్యాథ నమస్కుర్యాద్గజాననమ్‌ || 18

పద్మస్య వాయుదిక్పద్మే సంకల్ప్య స్కాందమాసనమ్‌ | స్కందమూర్తిం ప్రకల్ప్యాథ స్కందమావాహయేద్బుధః || 19

ఉచ్చార్య స్కందగాయత్రీం ధ్యాయేదథ కుమారకమ్‌ | ఉద్యదాదిత్యసంకాశం మయూరవరవాహనమ్‌ || 20

చతుర్భుజముదారాంగం ముకుటాదివిభూషితమ్‌ | వరదాభయహస్తం చ శక్తికుక్కుటధారిణమ్‌ || 21

ఓం గుం గురుభ్యో నమః (గురువులకు నమస్కారము) అను మంత్రమును చెప్పి గురువును ఆవాహన చేసి తరువాత దక్షిణముఖముగా కూర్చుని యున్నవాడు, మిక్కిలి ప్రసన్నమైన ముఖము గలవాడు, మంచివాడు, స్ఫటికమువలె స్వచ్ఛమైనవాడు, ఒక చేతితో వరదముద్రను మరియొక చేతితో అభయముద్రను పట్టియున్నవాడు, రెండు కన్నులవాడు, శివస్వరూపుడు అగు గురువును ధ్యానము చేయవలెను (12,13). ఈ విధముగా ధ్యానించి, గంధము పుష్పములు మొదలగు వాటితో క్రమముగా పూజించవలెను. మండలమునకు నైరృతిదిక్కునందలి పద్మమునందు గణపతియొక్క ఆసనమునందు గణపతిమూర్తిని నిలిపి దానియందు 'గణానాం త్వా' అను మంత్రముతో గణపతిని ఆవాహన చేసి ఏకాగ్రమగు మనస్సు గలవాడై, ప్రకాశస్వరూపుడు, ఎర్రని రంగు గలవాడు, పెద్ద శరీరము గలవాడు, సకలాభరణములతో అలంకరించుకున్నవాడు, పాశము అంకుశము వరదముద్ర మరియు దంతము అను వాటిని పద్మములవంటి చేతులతో ధరించి యున్నవాడు, సర్వసమర్థుడు, ఉపాసకుని విఘ్నముల సమూహములను అన్నింటినీ పోగొట్టువాడు అగు విఘ్నేశ్వరుని ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యానించి, గంధము పుష్పములు మొదలగు ఉపచారములతో పూజించవలెను. (14-17). తరువాత విఘ్నేశ్వరునకు అరటి పళ్లు, కొబ్బరి ముక్కలు, మామిడి పళ్లు, లడ్డులు మొదలగు వాటిని నైవేద్యమిడి నమస్కరించవలెను (18). విద్వాంసుడగు సాధకుడు మండలమునకు వాయవ్యదిక్కునందు గల పద్మమునందు కుమారస్వామికి ఈయదగిన ఆసనమునేర్పాటు చేసి దానియందు కుమారస్వామియొక్క మూర్తిని నిలిపి కుమారస్వామిని ఆవాహన చేయవలెను (19). తరువాత స్కందగాయత్రిని పఠించి, ఉదయించే సూర్యుని ప్రకాశము గలవాడు, గొప్ప నెమలి వాహనముగా గలవాడు, నాలుగు చేతులు గలవాడు, గొప్ప అవయవములు గలవాడు, కిరీటము మొదలగువాటితో అలంకరింపబడి యున్నవాడు, వరద-అభయముద్రలను దాల్చినవాడు, శక్తిని కోడిని పట్టుకున్నవాడు అగు కుమారస్వామిని ధ్యానించవలెను (20, 21).

ఏవం ధ్యాత్వా%థ గంధాద్యైరుపచారైరనుక్రమాత్‌ | సంపూజ్య పూర్వద్వారస్య దక్షశాఖాముపాశ్రితమ్‌ || 22

అంతఃపురాధిపం సాక్షాన్నందినం సమ్యగర్చయేత్‌ | చామీకరాచలప్రఖ్యం సర్వాభరణభూషితమ్‌ || 23

బాలేందుముకుటం సౌమ్యం త్రినేత్రం చ చతుర్భుజమ్‌ | దీప్త శూలమృగీటంకహేమవేత్రధరం విభుమ్‌ || 24

చంద్రబింబాభవదనం హరివక్త్ర మథాపి వా | ఉత్తరస్యాం తథా తస్య భార్యాం చ మరుతాం సుతామ్‌ || 25

సుయశాం సువ్రతామంబపాదమండనతత్పరామ్‌ | సంపూజ్య విధివద్గంధపుష్పాద్యైరుపచారకైః || 26

తతస్సంప్రోక్షయేత్పద్మం సాస్త్ర శంఖో దబిందుభిః | కల్పయేదాసనం పశ్చాదాధారాది యథాక్రమమ్‌ || 27

ఆధారశక్తిం కల్యాణీం శ్యామాం ధ్యాయేదధో భువి | తస్యాః పురస్తాదుత్కంఠమనంతం కుండలాకృతిమ్‌ ||28

ధవలం పంచఫణినం లేలిహానమివాంబరమ్‌ | తస్యోపర్యాసనం భద్రం కంఠీరవచతుష్పదమ్‌ || 29

ధర్మో జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం చ పదాని వై | ఆగ్నేయాదిశ్వేతపీతరక్తశ్యామాని వర్ణతః || 30

ఈ విధముగా ధ్యానించి, తరువాత గంధము మొదలగు ఉపచారములతో క్రమముగా పూజించి, తూర్పు ద్వారమునకు కుడి భాగమునందున్నవాడు, సాక్షాత్తుగా అంతఃపురమునకు అధ్యక్షుడు, మేరు పర్వతమువలె ప్రకాశించువాడు, సకలాభరణములను అలంకరించుకున్నవాడు, బాలచంద్రుడు శిరస్సునందు గలవాడు, మంచివాడు, మూడు కళ్లు నాలుగు చేతులు గలవాడు, ప్రకాశించే శూలమును ఆడులేడిని గొడ్డలిని మరియు బంగరు బెత్తమును ధరించినవాడు, సమర్ధుడు, చంద్రబింబమును పోలిన ముఖము గలవాడు, లేదా కోతి మోమువాడు అగు నందీశ్వరుని చక్కగా అర్చించవలెను. ఆయనకు ఉత్తరమునందు ఆయన భార్య, మరుద్దేవతల కుమార్తె, గొప్ప వ్రతము గలది, పార్వతీదేవియొక్క పాదములను అలంకరించుటలో నిమగ్నమై యుండునది అగు సుయశాదేవిని చక్కగా గంధము పుష్పములు మొదలగు ఉపచారములతో పూజించి (22-26), తరువాత మండలమును అస్త్రముతో కూడియున్న శంఖమునందలి నీటితో ప్రోక్షించవలెను. తరువాత ఆధారము, ఆసనము మొదలగు వాటిని సరియగు వరుసలో అమర్చవలెను. నేలకు క్రింద మంగళకరమైనది, నల్లని వర్ణము గలది అగు ఆధారశక్తిని ధ్యానము చేయవలెను. దానికి యెదుట ఎత్తిన పడగతో చుట్టుకొనియున్నవాడు, తెల్లని వాడు, అయిదు పడగలతో ఆకాశమును ఆస్వాదించుచున్నాడా యన్నట్లు ఉన్నవాడు అగు అనంతుని భావన చేయవలెను. ఆయనకు పైన ధర్మజ్ఞానవైరాగ్యైశ్వర్యములే నాలుగు సింహాకారములో నుండే కోళ్లు గల భద్రాసనమును భావన చేయవలెను. ఆగ్నేయము మొదలగు నాలుగు మూలలయందు ఉండే ఆ కోళ్లు క్రమముగా తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగులను కలిగియుండును (27-30).

అధర్మాదీని పూర్వాదీన్యుత్తరాంతాన్యనుక్రమాత్‌ | రాజావర్తమణి ప్రఖ్యాన్యస్య గాత్రాణి భావయేత్‌ || 31

అధోర్ధ్వచ్ఛదనం పశ్చాత్కందం నాలం చ కంటకాన్‌ | దలాదికం కర్ణికాం చ విభావ్య క్రమశో%ర్చయేత్‌ || 32

దలేషు సిద్ధయశ్చాష్టౌ కేసరేషు చ శక్తికాః | రుద్రా వామాదయస్త్వష్టౌ పూర్వాదిపరతః క్రమాత్‌ || 33

కర్ణికాయాం చ వైరాగ్యం బీజేషు నవ శక్తయః | వామాద్యా ఏవ పూర్వాది తదంతే చ మనోన్మనీ || 34

కందే శివాత్మకో ధర్మో నాలే జ్ఞానం శివాశ్రయమ్‌ | కర్ణికోపరి వాహ్నేయం మండలం సౌరమైందవమ్‌ || 35

ఆత్మవిద్యా శివాఖ్యం చ తత్త్వత్రయమతః పరమ్‌ | సర్వాసనోపరి సుఖం విచిత్రకుసుమోజ్జ్వలమ్‌ || 36

పరవ్యోమావకాశాఖ్యవిద్యయా %తీవ భాస్వరమ్‌ | పరికల్ప్యాసనం మూర్తేః పు ష్పవిన్యాసపూర్వకమ్‌ || 37

ఆధారశక్తిమారభ్య శుద్ధవిద్యాసనావధి | ఓంకారాదిచతుర్ధ్యంతం నామమంత్రం నమోంతకమ్‌ || 38

ఉచ్చార్య పూజయేద్విద్వాన్‌ సర్వత్రైవం విధిక్రమః | అంగవక్త్ర కలాభేదాత్పంచ బ్రహ్మాణి పూర్వవత్‌ || 39

విన్యసేత్ర్క మశో మూర్తౌ తత్తన్ముద్రావిచక్షణః | ఆవాహయేత్తతో దేవం పుష్పాంజలిపుటః స్థితః || 40

తూర్పు దిక్కుతో మొదలిడి ఉత్తరము వరకు క్రమముగా అధర్మము మొదలగు వాటిని భావన చేయవలెను. ఈ ఆసనముయొక్క వివిధభాగములు రాజావర్తమనే మణియొక్క కాంతులను కలిగియున్నట్లుగా భావన చేయవలెను (31). క్రింది కప్పు, పై కప్పు, దుంప, నాళము, కంటకములు, దళములు, కర్ణిక మొదలగు వాటిని క్రమముగా భావన చేసి అర్చించవలెను (32). దళములయందు అణిమ మొదలైన ఎనిమిది సిద్ధులను, కేసరములయందు శక్తులను వామదేవుడు మొదలగు పదకొండు రుద్రులను తూర్పుతో మొదలిడి క్రమముగా భావన చేయవలెను (33). కర్ణికయందు వైరాగ్యమును, బీజములయందు తొమ్మిది శక్తులను, తూర్పుతో మొదలిడి వామదేవుడు మొదలగు రుద్రులను, వాటి అంతమునందు మనోన్మని (మనోవృత్తులను ప్రేరేపించే చైతన్యశక్తి) ని భావన చేయవలెను (34). దుంపయందు శివస్వరూపమగు ధర్మమును, నాళమునందు శివుని ఆశ్రయించి ఉండే జ్ఞానమును, కర్ణికకు పైన అగ్ని-సూర్య-చంద్రమండలములను (35), ఆ పైన ఆత్మ, విద్య, శివా అనే మూడు తత్త్వములను, శివమూర్తికి ఈ ఆసనములన్నింటి పైన సుఖకరమైనది, రంగు రంగుల పుష్పములతో ఉజ్జ్వలముగా నున్నది, పరవ్యోమావకాశము అను పేరు గల విద్యతో అతిశయించి ప్రకాశించునది అగు ఆసనమును భావన చేసి దానిపై పుష్పములనుంచవలెను (36, 37). విద్వాంసుడగు సాధకుడు ఆధారశక్తితో మొదలిడి ఈ శుద్ధవిద్యాసనము వరకు 'ఓం నమశ్శివాయ', అనే మంత్రమును ఉచ్చరిస్తూ పూజించవలెను. సర్వత్రా ఇదే విధిని, క్రమమును పాటించవలెను. ఆయా ముద్రల జ్ఞానము గల సాధకుడు పూర్వమునందు వలెనే శివమూర్తియందు ఆవయవములు, ముఖములు, బీజములు అను వాటి భేదమును బట్టి అయిదు బ్రహ్మలను క్రమముగా న్యాసము చేయవలెను. తరువాత చేతులయందు పుష్పములను పట్టుకొని నిలబడి ఆ పరమేశ్వరుని ఆవాహన చేయవలెను (38-40).

సద్యోజాతం ప్రపద్యామీత్యారభ్యోమంతముచ్చరన్‌ | ఆధారోత్థితనాదం తు ద్వాదశగ్రంథిభేదతః || 41

బ్రహ్మరంధ్రాంతముచ్చార్య ధ్యాయేదోంకారగోచరమ్‌ | శుద్ధస్ఫటికసంకాశం దేవం నిష్కలమక్షరమ్‌ || 42

కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరమ్‌ | అంతర్బహిః స్థితం వ్యాప్య హ్యణోరల్పం మహత్తమమ్‌ || 43

భక్తానామప్రయత్నేన దృశ్యమీశ్వరమవ్యయమ్‌ | బ్రహ్మేంద్రవిష్ణురుద్రాద్యైరపి దేవైరగోచరమ్‌ || 44

వేదసారం చ విద్వద్భిరగోచరమితి శ్రుతమ్‌ | ఆదిమధ్యాంతరహితం భేషజం భవరోగిణామ్‌ || 45

సమాహితేన మనసా ధ్యాత్వైవం పరమేశ్వరమ్‌ | ఆవాహనం స్థాపనం చ సన్నిరోధం నిరీక్షణమ్‌ || 46

నమస్కారం చ కుర్వీత బద్ధ్వా ముద్రాః పృథక్‌ పృథక్‌ | ధ్యాయేత్సదాశివం సాక్షాద్దేవం సకలనిష్కలమ్‌ || 47

శుద్ధస్ఫటికసంకాశం ప్రసన్నం శీతలద్యుతిమ్‌ | విద్యుద్వలయసంకాశం జటాముకుటభూషితమ్‌ || 48

శార్దూలచర్మవసనం కించిత్స్మితముఖాంబుజమ్‌ | రక్తపద్మదల ప్రఖ్యపాణిపాదతలాధరమ్‌ || 49

సర్వలక్షణసంపన్నం సర్వాభరణభూషితమ్‌ | దివ్యాయుధకరైర్యుక్తం దివ్యగంధానులేపనమ్‌ || 50

పద్మవక్త్రం దశభుజం చంద్రఖండశిఖామణిమ్‌ | అస్య పూర్వముఖం సౌమ్యం బాలార్కసదృశప్రభమ్‌ || 51

త్రిలోచనారవిందాఢ్యం బాలేందుకృతశేఖరమ్‌ | దక్షిణం నీలజీమూతసమానరుచిరప్రభమ్‌ || 52

భ్రుకుటీకుటిలం ఘోరం రక్తవృత్తత్రిలోచనమ్‌ | దంష్ట్రా కరాలం దుష్ప్రేక్ష్యం స్ఫురితాధరపల్లవమ్‌ || 53

సద్యోజాతం ప్రపద్యామి అను మంత్రముతో ఆరంభించి ఓంకారముతో అంతము అగునట్లుగా ఉచ్చరించి, మూలాధారమునందు పుట్టే నాదమును గ్రంథులను భేదించుకొని బ్రహ్మరంధ్రమును చేరు విధముగా ఉచ్చరించి ఓంకారవాచ్యుడగు పరమేశ్వరుని ధ్యానించవలెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె ప్రకాశించువాడు, ప్రకాశస్వరూపుడు, అవయవరహితుడు, వినాశము లేనివాడు, సర్వలోకములకు కారణమైన వాడు, సర్వలోకస్వరూపుడైన పరబ్రహ్మ, సర్వమును లోపల బయట వ్యాపించి యున్నవాడు, అణువుకంటె చిన్నవాడు, చాలపెద్దవాడు, భక్తులకు ప్రయత్నము లేకుండగనే దర్శనమిచ్చువాడు, పాలకుడు, వికారములు లేనివాడు, బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు రుద్రుడు మొదలగు దేవతలకు కూడ కానరానివాడు, వేదముల సారము అయినవాడు, వేదములకైననూ గోచరించని వాడని విద్వాంసులచే స్తుతించబడువాడు, ఆది మధ్యము మరియు అంతము లేనివాడు, సంసారము అనే రోగమునకు వైద్యుని వంటివాడు అగు పరమేశ్వరుని ఈ విధముగా ఏకాగ్రమగు మనస్సుతో ధ్యానించి, ఆవాహనము, స్థాపనము, సన్నిరోధము (మనస్సును ఈశ్వరునిపై చక్కగా నిలిపియుంచుట) , స్థిరముగా చూచుట, నమస్కారము అను క్రియలను చేయవలెను. తరువాత వేర్వేరుగా ముద్రలను చూపించి, ప్రకాశస్వరూపుడు, సగుణుడు, నిర్గుణుడు, స్వచ్చమగు స్ఫటికము వలె ప్రకాశించువాడు, ప్రసన్నుడు, చల్లని కాంతులు గలవాడు, పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించిన వాడు, చిరునవ్వుతో కూడిన ముఖపద్మము గలవాడు, ఎర్రని పద్మముల వలె ప్రకాశించే అరచేతులు అరికాళ్లు మరియు క్రింది పెదవి గలవాడు, అన్ని లక్షణములు గలవాడు, అన్ని ఆభరణములను అలంకరించుకున్న వాడు, చేతులయందు దివ్యములగు ఆయుధములను దాల్చినవాడు, దివ్యమగు గంధమును అలుముకున్నవాడు, అయిదు మోముల వాడు, పది చేతుల వాడు, శిరస్సుపై చంద్రవంకను ధరించినవాడు అగు సదాశివుని సాక్షాత్తుగా ధ్యానించవలెను. ఆయన తూర్పువైపు ముఖము సౌమ్యముగా, ఉదయించే సూర్యుని వంటి కాంతులు గలదై, పద్మముల వంటి మూడు కన్నులతో రాజిల్లునదై, చంద్రవంకను శిరస్సుపై దాల్చినదై యుండును. దక్షిణముఖము నల్లని మేఘముల వలె అందమైన కాంతులు గలదై, ముడివడియున్న కనుబొమలు గలదై, భయంకరముగా, ఎర్రని గిరగిర తిరిగే కన్నులతో, కోరలతో క్రూరముగా, వణికే చిగురుటాకు వంటి క్రింది పెదవితో చూడ శక్యము కానిదిగా నుండును (41-53).

ఉత్తరం విద్రుమప్రఖ్యం నీలాలకవిభూషితమ్‌ | సద్విలాసం త్రినయనం చంద్రార్ధకృతశేఖరమ్‌ || 54

పశ్చిమం పూర్ణచంద్రాభం లోచనత్రితయోజ్జ్వలమ్‌ | చంద్రలేఖాధరం సౌమ్యం మందస్మితమనోహరమ్‌ || 55

పంచమం స్ఫటికప్రఖ్యమిందురేఖాసముజ్జ్వలమ్‌ | అతీవ సౌమ్యముత్ఫుల్లలోచనత్రితయోజ్జ్వలమ్‌ || 56

దక్షిణ శూలపరశువజ్రఖడ్గానలోజ్జ్వలమ్‌ || 57

సవ్యే పినాకనారాచఘంటాపాశాంకుశోజ్జ్వలమ్‌ | నివృత్త్యా జానుపర్యంతమానాభి చ ప్రతిష్ఠయా || 58

ఆకంఠం విద్యయా తద్వదాలలాటం తు శాంతయా | తదూర్ధ్వం శాంత్యతీతాఖ్యకలయా పరయా తథా || 59

పంచాధ్వవ్యాపినం తస్మాత్కలాపంచకవిగ్రహమ్‌ | ఈశానమకుటం దేవం పురుషాఖ్యం పురాతనమ్‌ || 60

అఘోరహృదయం తద్వద్వామగుహ్యం మహేశ్వరమ్‌ | సద్యోజాతం చ తన్మూర్తిమష్టత్రింశత్కలామయమ్‌ || 61

మాతృకామయమీశానం పంచబ్రహ్మమయం తథా | ఓంకారాఖ్యమయం చైవ హంసన్యాసమయం తథా || 62

పంచాక్షరమయం దేవం షడక్షరమయం తథా | అగషట్కమయం చైవ జాతిషట్కసమన్వితమ్‌ || 63

ఏవం ధ్యాత్వాథ మద్వామభాగే త్వాం చ మనోన్మనీమ్‌ | గౌరీర్మిమాయ మంత్రేణ ప్రణవాద్యేన భక్తితః || 64

ఆవాహ్య పూర్వవత్కుర్యాన్నమస్కారాంతమీశ్వరి | ధ్యాయేత్తతస్త్వాం దేవేశి సమాహితమనా మునిః || 65

ఉత్తరముఖము పగడము వలె ప్రకాశించును; నల్లని ముంగురులతో శోభిల్లును; మూడు కన్నులతో మరియు శిరస్సుపై చంద్రవంకతో చక్కని విలాసము కలిగియుండును (54). పశ్చిమ ముఖము పూర్ణచంద్రుని వలె ప్రకాశించును; మూడు కన్నులతో వెలిగి పోవుచుండును; చంద్రవంకను దాల్చి సౌమ్యముగా నుండే ఆ ముఖము చిరునవ్వుతో మనోహరముగ నుండును (55). స్ఫటికము వలె స్వచ్ఛమైన కాంతులు గల అయిదవ ముఖము చంద్రవంకతో అతిశయించి ప్రకాశించును; మిక్కిలి సౌమ్యమగు ఆ ముఖము వికసించిన మూడు నేత్రములతో ఉజ్జ్వలముగా నుండును (56). శివుని కుడిచేయి శూలము, పరశువు, వజ్రము, ఖడ్గము మరియు అగ్ని అను వాటితో ఉజ్జ్వలముగా నుండును (57). ఎడమ చేయి పినాకమనే ధనస్సు, బాణములు, గంట, పాశము మరియు అంకుశము అను వాటితో ప్రకాశించుచుండును. నివృత్తి కళ మోకాళ్ల వరకు, ప్రతిష్ఠాకళ నాభి వరకు (58), విద్యాకళ కంఠము వరకు, శాంతకళ లలాటము వరకు, ఈ పైన శాంత్యతీతమనే సర్వశ్రేష్ఠమగు కళ ఉండును (59). ఈ విధముగా అయిదు కళలతో కూడిన శివుని దేహము అయిదు మార్గములను వ్యాపించియుండును. ఆదిపురుషుడగు ఆ మహేశ్వరదేవునకు ఈశానుడు కిరీటము కాగా, అఘోరుడు హృదయము, వామదేవుడు గుహ్యము, సద్యోజాతుడు ముప్పది ఎనిమిది కళలతో కూడిన సకలదేహము అగుచున్నారు (60,61). ఓ ఈశ్వరీ! దేవదేవీ! మననశీలుడగు సాధకుడు మాతృకా (అక్షరమాలిక) స్వరూపుడు, ప్రకాశస్వరూపుడు, అయిదు బ్రహ్మల రూపములో నున్నవాడు, ఓంకారస్వరూపుడు, హంసన్యాసస్వరూపుడు, పంచాక్షరమంత్రస్వరూపుడు, ఆరు అక్షరముల మంత్రము స్వరూపముగా గలవాడు, ఆరు పర్వతములు స్వరూపముగా గలవాడు, ఆరు జాతులతో కూడియున్న వాడు, పరమేశ్వరుడు అగు నన్ను మరియు నా ఎడమ భాగమునందున్న మనోన్మనివగు నిన్ను గౌరీమిమాయ అను మంత్రముచేతను మరియు ఓంకారము మొదలగు మంత్రములతోను ఈ తీరున భక్తితో ధ్యానించి ఆవాహన చేసి పూర్వమునందు వలెనే నమస్కారము వరకు పూజించి, తరువాత ఏకాగ్రమగు మనస్సు గల వాడై నిన్ను ధ్యానించవలెను (62-65).

ప్రపుల్లోత్పలపత్రాభాం విస్తీర్ణాయతలోచనామ్‌ | పూర్ణచంద్రాభవదనాం నీలకుంచితమూర్ధజామ్‌ || 66

నీలోత్పలదలప్రఖ్యాం చంద్రార్ధకృతశేఖరామ్‌ | అతివృత్తఘనోత్తుంగస్నిగ్ధపీనపయోధరామ్‌ || 67

తనుమధ్యాం వృథుశ్రోణీం పీతసూక్ష్మతరాంబరామ్‌ | సర్వాభరణసంపన్నాం లలాటతిలకోజ్జ్వలామ్‌ || 68

విచిత్రపుష్పసంకీర్ణకేశపాశోపశోభితామ్‌ | సర్వతో%నుగుణాకారాం కించిల్లజ్జానతాననామ్‌ || 69

హేమారవిందం విలసద్దధానాం దక్షిణ కరే | దండవచ్చాపరం హస్తం న్యస్యాసీనాం సుఖాసనే || 70

ఏవం మాం త్వాం చ దేవేశి ధ్యాత్వా నియతమానసః | స్నాపయేచ్ఛంఖతో యేన ప్రణవప్రోక్షణక్రమాత్‌ || 71

భ##వే భ##వే నాతిభవ ఇతి పాద్యం ప్రకల్పయేత్‌ | వామాయ నమ ఇత్యుక్త్వా దద్యాదాచమనీయకమ్‌ || 72

జ్యేష్ఠాయ నమ ఇత్యుక్త్వా శుభ్రవస్త్రం ప్రకల్పయేత్‌ | శ్రేష్ఠాయ నమ ఇత్యుక్త్వా దద్యాద్యజ్ఞోపవీతకమ్‌ || 73

రుద్రాయ నమ ఇత్యుక్త్వా పునరాచమనీయకమ్‌ | కాలాయ నమ ఇత్యుక్త్వా గంధం దద్యాత్సుసంస్కృతమ్‌ || 74

కలవికరణాయ నమో%క్షతం చ పరికల్పయేత్‌ | బలవికరణాయ నమ ఇతి పుష్పాణి దాపయేత్‌ || 75

బలాయ నమ ఇత్యుక్త్వా ధూపం దద్యాత్ర్ప యత్నత-ః | బలప్రమథనాయేతి సుదీపం చైవ దాపయేత్‌ || 76

చక్కగా వికసించిన కలువ రేకుల వలె ప్రకాశించే విశాలమైన నిడివి కన్నులు గలది, పూర్ణచంద్రుని వలె ప్రకాశించే ముఖము గలది, నల్లని గిరజాల జుట్టు గలది (66), నల్లని కలువ రేకు వంటి రంగు గలది, శిరస్సుపై చంద్రవంకను దాల్చినది, సుందరమైన స్తనములు గలది (67). సన్నని నడుము విశాలమైన శ్రోణి గలది, పచ్చని నాజూకు వస్త్రమును దాల్చినది, సకలాభరణములతో నిండుగా నున్నది, లలాటమునందు తిలకముతో ఒప్పారునది (68), రంగు రంగుల పుష్పములతో నిండియున్న కేశపాశముతో ప్రకాశించునది, అన్ని విధములుగా అనురూపమైన ఆకారము గలది, సిగ్గుచే కొంచెను తల వంచుకున్నది (69), కుడి చేతియందు అందమైన బంగరు పద్మమును పట్టుకున్నది, సుఖకరమగు ఆసనమునందు ఎడమ చేతిని నిటారుగా పెట్టి కూర్చున్నది అగు (70) నిన్ను మరియు నన్ను ఈ విధముగా సాధకుడు ఏకాగ్రమైన మనస్సు గలవాడై ధ్యానించవలెను. ఓ దేవదేవీ! తరువాత శంఖమునందలి నీటితో ప్రణవప్రోక్షణముయొక్క క్రమమును పాటిస్తూ అభిషేకమును చేయవలెను (71).'భ##వే భ##వే నాతిభ##వే (నన్ను జన్మ జన్మల సంసారమునందు గాక, జన్మరాహిత్యరూపమగు మోక్షమునందు ప్రేరేపించుము)' అను మంత్రముచే పాద్యమును, 'వామదేవాయ నమః (సుందరముగా ప్రకాశించే రూపము గల శివునకు నమస్కారము) అను మంత్రముచే స్వచ్ఛమగు వస్త్రమును, 'శ్రేష్ఠాయ నమః (దేవతలలో సర్వశ్రేష్ఠుడగు శివునకు నమస్కారము)' అను మంత్రముచే ఆచమనమును (72), 'జ్యేష్ఠాయ నమః (ఆదిపురుషుడగు శివునకు నమస్కారము)' అను మంత్రముచే స్వచ్ఛమగు వస్త్ర మును, శ్రేష్ఠాయ నమః (దేవతలలో సర్వశ్రేష్ఠుడగు శివునకు నమస్కారము) అను మంత్రముచే యజ్ఞోపవీతమును (73),'రుద్రాయ నమః (పాపాత్ములు ఏడ్చునట్లు చేయు శివునకు నమస్కారము)' అను మంత్రముచే మరల ఆచమనమును, 'కాలాయ నమః (మృత్యుస్వరూపుడగు శివునకు నమస్కారము)' అనుమంత్రముచే చక్కని పరిమళగంధమును (74), 'కలవికరణాయ నమః (ప్రకృతియందు వివిధవికారములను తెచ్చి జగత్తును సృష్టించు శివునకు నమస్కారము)' అను మంత్రముచే అక్షతలను, 'బలవికరణాయ నమః (క్రియాశక్తిని సృష్టిలో వివిధరూపములలో ప్రసరింపజేయు శివునకు నమస్కారము)' అను మంత్రముచే పుష్పములను (75), 'బలాయ నమః (సకలశక్తిస్వరూపుడగు శివునకు నమస్కారము)' అను మంత్రముచే ధూపమును, 'బలప్రమథనాయ నమః (సంహారకాలమునందు సకలశక్తులను ఉపసంహరించు శివునకు నమస్కారము)' అను మంత్రముచే చక్కని దీపమును శ్రద్ధాపూర్వకముగా సమర్పించవలెను (76).

బ్రహ్మభిశ్చ షడంగైశ్చ తతో మాతృకయా సహ | ప్రణవేన శివేనైవ శక్తియుక్తేన చ క్రమాత్‌ || 77

ముద్రాః ప్రదర్శయేన్మహ్మం తుభ్యం చ వరవర్ణిని | మయి ప్రకల్పయేత్పూర్వముపచారాంస్తతస్త్వయి || 78

యదా త్వయి ప్రకుర్వీత స్త్రీ లింగం యోజయేత్తదా | ఇయానేవ హి భేదో స్తి నాన్యః పార్వతి కశ్చన || 79

ఏవం ధ్యానం పూజనం చ కృత్వా సమ్యగ్విధానతః | మమావరణపూజాం చ ప్రారభేత విచక్షణః || 80

ఓ సుందరీ! నీకు మరియు నాకు క్రమముగా సద్యోజాతాది పంచబ్రహ్మలు, ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము అనే ఆరు అంగములు మరియు అక్షరమాలిక అను వాటిని చెప్పి, వరుసగా ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అను మంత్రములను చెప్పి ముద్రలను చూపించి ముందుగా నాకు ఉపచారములను చేసి, తరువాత నీకు ఉపచారములను చేయవలెను (77, 78). నీకు ఉపచారములను సమర్పించే సమయములో శివశబ్దస్థానములో శివా అను స్త్రీ లింగశబ్దమును ప్రయోగించిన చాలును. ఓ పార్వతీ! ఇంతకు మించి అధికమగు భేదము ఏమియు లేదు (79). విద్వాంసుడగు సాధకుడు ఈ విధముగా ధ్యానమును పూజను యథావిధిగా చక్కగా చేసి నాయొక్క ఆవరణపూజను ఆరంభించవలెను (80).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు శివధ్యానము మరియు పూజా విధానమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

Siva Maha Puranam-4    Chapters