Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించుట

వ్యాస ఉవాచ |

సాధు పృష్టమిదం విప్రా భవద్భిర్భాగ్యవత్తమైః | దుర్లభం హి శివజ్ఞానం ప్రణవార్థప్రకాశకమ్‌ || 1

యేషాం ప్రసన్నో భగవాన్‌ సాక్షాచ్ఛూలవరాయుధః | తేషామేవ శివజ్ఞానం ప్రణవార్థప్రకాశకమ్‌ || 2

జాయతే న హి సందేహో నేతరేషామితి శ్రుతిః | శివభక్తివిహీనానామితి తత్త్వార్థనిశ్చయః || 3

దీర్ఘసత్రేణ యుష్మాభిర్భగవానంబికాపతిః | ఉపాసిత ఇతీదం మే దృష్టమద్య వినిశ్చితమ్‌ || 4

తస్మాద్వక్ష్యామి యుష్మాకమితిహాసం పురాతనమ్‌ | ఉమామహేశసంవాదరూపమద్భుతమాస్తికాః || 5

పురాఖిలజగన్మాతా సతీ దాక్షాయణీ తనుమ్‌ | శివనిందాప్రసంగేన త్యక్త్వా చ జనకాధ్వరే || 6

తపః ప్రభావాత్సా దేవీ సుతా% భూత్‌ హిమవద్గిరేః | శివార్థమతపత్సావై నారదస్యోపదేశతః || 7

తస్మిన్‌ భూధరవర్యేతు స్వయంవరవిధానతః | దేవేశే చ కృతోద్వాహే పార్వతీ సుఖమాప సా || 8

తథైకస్మిన్మహేదేవీ సమయే పతినా సహ | సూపవిష్టా మహాశైలే గౌరీ దేవమభాషత || 9

వ్యాసుడు ఇట్లు పలికెను -

ఓ బ్రాహ్మణులారా! భాగ్యవంతులగు మీరు చక్కగా ప్రశ్నించితిరి. ఓంకారముయొక్క అర్థమును ప్రకాశింపజేసే శివజ్ఞానము తేలికగా దొరికేది కాదు (1). గొప్ప శూలమును ఆయుధముగా దాల్చే శివభగవానుడు సాక్షాత్తుగా ఎవరికి ప్రసన్నుడగునో, వారికి మాత్రమే ఓంకారముయొక్క అర్థమును ప్రకాశింపజేసే శివజ్ఞానము కలుగును. దీనిలో సందేహము లేదు. శివభక్తి లేని ఇతరులకు ఆ జ్ఞానము కలుగదని వేదము చెప్పుచున్నది. ఇది నిశ్చయముగా యథార్థము (2,3). మీరు దీర్ఘమగు సత్రయాగముచే పార్వతీపతియగు శివుని ఉపాసించుచున్నారను విషయమును నేనీ నాడు కన్నులారా చూచి నిశ్చయించు కొంటిని (4). ఓ ఆస్తికులారా! కావున, మీకు పూర్వకాలమునకు చెందిన, పార్వతీపరమేశ్వరుల సంవాదరూపమైన అద్భుతగాథనుచెప్పెదను (5). పూర్వము సకలజగత్తులకు తల్లి, దక్షపుత్రి అగు సతీదేవి తండ్రియొక్క యజ్ఞములో శివుడు నిందింపబడిన సందర్భములో దేహమును చాలించెను (6). ఆ దేవి తపస్సు యొక్క ప్రభావముచే హిమవత్పర్వతుని కుమార్తెయై, నారదుని ఉపదేశము వలన శివుని కొరకై ఆ గొప్ప పర్వతమునందు తపస్సును చేసెను. దేవదేవుడగు శివుడు ఆ పార్వతిని స్వయంవరపద్ధతిచే వివాహమాడగా, ఆమె సుఖించెను (7,8). తరువాత ఒకనాడు మహాదేవియగు ఆ గౌరి భర్తతో గూడి గొప్పది యగు హిమవత్పర్వతమునందు కూర్చుండి శివునితో నిట్లనెను (9).

మహాదేవ్యువాచ |

భగవన్‌ పరమేశాన పంచకృత్యవిధాయక | సర్వజ్ఞ భక్తి సులభ పరమామృతవిగ్రహ || 10

దాక్షాయణీం తనుం త్యక్త్వా తవ నిందా ప్రసంగతః | ఆసమద్య మహేశాన పుత్రీ హిమవతో గిరేః || 11

కృపయా పరమేశాన మంత్రదీక్షావిధానతః | మాం విశుద్ధాత్మతత్త్వస్థాం కురు నిత్యం మహేశ్వర || 12

ఇతి సంప్రార్థితో దేవ్యా దేవశ్శీతాంశుభూషణః | ప్రత్యువాచ తతో దేవీం ప్రహృష్టేనాంతరాత్మనా || 13

మహేదేవి ఇట్లు పలికెను -

ఓ భగవాన్‌! పరమేశ్వరా! సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములనే అయిదు జగత్కార్యములను చేయువాడవు నీవే. సర్వమును తెలిసిన వాడవు. పరమ-అమృతమగు మోక్షమే స్వరూపముగా గలవాడవు అగు నీవు భక్తిచే తేలికగా లభించెదవు (10). ఓ మహేశ్వరా! నిన్ను నిందించే ప్రసంగము వలన నేను దక్షపుత్రికరూపములో నున్న దేహమును విడిచి ఇప్పుడు హిమవత్పర్వతుని పుత్రికనై యున్నాను (11). ఓ పరమేశ్వరా! మహేశ్వరా! నావు దయతో నాకు మంత్రదీక్షను ఇచ్చి నేను నిత్యము వివుద్ధమగు ఆత్మతత్త్వమునందు ఉండునట్లు చేయుము (12). చంద్రశేఖరుడగు శివుడు ఈ విధముగా పార్వతీదేవిచే ప్రార్థించబడినవాడై, అపుడు సంతోషముతో నిండిన మనస్సుతో ఆ దేవిని ఉద్దేశించి ఇట్లు పలికెను (13).

మహాదేవ ఉవాచ|

ధన్యా త్వం దేవదేవేశి యది జాతేదృశీ మతిః | కైలాసశిఖరం గత్వా కరిష్యేత్వాం చ తాదృశీమ్‌ || 14

తతో హిమవతో గత్వాకైలాసం భూధరేశ్వరమ్‌ | జగౌ దీక్షావిధానేన ప్రణవాదీన్మనూన్‌ క్రమాత్‌ || 15

ఉక్త్వా మంత్రాంశ్చ తాం దేవీం కృత్వా శుద్ధాత్మని స్థితామ్‌ | సార్ధం దేవ్యా మహాదేవో దేవోద్యానం గతో % భవత్‌ || 16

తతస్సుమాలినీముఖ్యైర్దేవ్యాః ప్రియసఖీజనైః | సమహృతైః | ప్రపుల్లెసై#్తః పుషై#్పః కల్పతరూద్భవైః || 17

అలంకృత్య మహాదేవీం స్వాంకమారోప్య శంకరః | ప్రహృష్టవదనస్తస్థౌ విలోక్య చ తదాననమ్‌ || 18

తతః ప్రియకథా జాతాః పార్వతీపరమేశయోః | హితాయ సర్వలోకానాం సాక్షాచ్ఛ్రుత్యర్థసమ్మతాః || 19

తదా సర్వజగన్మాతా భర్తురంకం సమాశ్రితా | విలోక్య పదనం భర్తురిదమాహ తపోధనాః || 20

మహాదేవుడు ఇట్లు పలికెను -

దేవతలకు దేవతవగు ఓ ఈశ్వరీ! ఇట్టి సంకల్పము కలుగుటచే నీవు ధన్యురాలవు. కైలాసపర్వతశిఖరమునకు వెళ్లిన పిదప నిన్ను నీవు కోరిన విధముగా చేసెదను (14). అపుడు ఆయన హిమవత్వర్వతమునుండి పర్వతరాజమగు కైలాసమునకు వెళ్లి ఆమెకు దీక్షావిధానపూర్వకముగా ఓంకారము మొదలగు మంత్రములను క్రమముగా బోధించెను (15). మహాదేవుడు మంత్రములను చెప్పి ఆ దేవి శుద్ధమగు ఆత్మయందు నిష్ఠ కలిగియుండునట్లు చేసి ఆ దేవితో కూడి దేవతల ఉద్యానవనమునకువెళ్లెను (16). తరువాత సుమాలిని మొదలగు పార్వతీదేవి యొక్క చెలికత్తెలు కల్పవృక్షమునుండి పుట్టి వికసించియున్న పుష్పములను తీసుకువచ్చిరి (17). శంకరుడు మహాదేవిని వాటితో అలంకరించి ఆమెను తన అంకముపై కూర్చుండబెట్టుకొని ఆమె ముఖమును చూచి ఆనందముతో నిండిన ముఖము గలవాడై ఉండెను (18). తరువాత పార్వతీపరమేశ్వరులు సర్వప్రాణుల క్షేమమును కోరి వేదార్ధముతో సరిబోలియున్న ప్రీతికరమగు సంభాషణమును చేసిరి (19). ఓ తపశ్శాలులారా! అపుడు సకలజగత్తులకు తల్లియగు పార్వతి భర్తయొక్క అంకమునాశ్రయించి ఉన్నదై భర్తయొక్క ముఖమును చూచి ఇట్లు పలికెను (20).

శ్రీ దేవ్యువాచ |

ఉపదిష్టాస్త్వయా దేవ మంత్రాస్సప్రణవా మతాః | తత్రదౌ శ్రోతుమిచ్ఛామి ప్రణవార్థం వినిశ్చితమ్‌ || 21

కథం ప్రణవ ఉత్పన్నః కథం ప్రణవ ఉచ్యతే | మాత్రాః కతి సమాఖ్యాతాః కథం వేదాదిరుచ్యతే || 22

దేవతాః కతి చ ప్రోక్తాః కథం వేదాదిభావనా | క్రియాః కతివిధాః ప్రోక్తా వ్యాప్యవ్యాపకతా కథమ్‌ || 23

బ్రహ్మాణీ పంచ మంత్రే %స్మిన్‌ కథం తిష్ఠంత్యనుక్రమాత్‌ | కలాః కతి సమాఖ్యాతాః ప్రపంచాత్మకతా కథమ్‌ || 24

వాచ్యవాచకసంబంధస్థానాని చ కథం శివ | కో%త్రాధికారీ విజ్ఞేయో విషయః క ఉదాహృతః || 25

సంబంధః కో%త్ర విజ్ఞేయః కిం ప్రయోజనముచ్యతే | ఉపాసకస్తు కింరూపః కిం వాస్థానముపాసనమ్‌ || 26

ఉపాస్యం వస్తు కింరూపం కిం వా ఫలముపాసితుః | అనుష్ఠానవిధిః కో వా పూజాస్థానం చ కిం ప్రభో || 27

పూజాయాం మండలం కిం వా కిం వా ఋష్యాదికం హర | న్యాసజాపవిధిః కో వా కో వా పూజావిధిక్రమః || 28

ఏతత్సర్వం మహేశాన సమాచక్ష్వ విశేషతః | శ్రోతుమిచ్ఛామి తత్త్వేన యద్యస్తి మయి తే కృపా || 29

ఇతి దేవ్యా సమాపృష్టో భగవానిందుభూషణః | తాం ప్రశస్య మహేశానీం వక్తుం సముపచక్రమే || 30

ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం పార్వతీకృతప్రశ్నవర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2)

శ్రీపార్వతీదేవి యిట్లు పలికెను -

ఓ దేవా! నీవు ఓంకారముతో సహా మంత్రములను ఉపదేశించితివి. వాటిలో ముందుగా ఓంకారముయొక్క అర్థమును నేను నిశ్చయముగా తెలియగోరుచున్నాను (21). ఓంకారము ఎట్లు పుట్టినది? అది ఎట్లు ఉచ్చరింపబడును? దానికి ఎన్ని మాత్రలు గలవు? అది వేదమునకు ఆది అని చెప్పుటకు కారణమేమి? (22). దేవతలుఎందరు? ఓంకారము వేదమునకు కారణము అని భావించే విధానమెట్టిది? కర్మలు ఎన్ని రకములు? వాటికి ఫలములతో గల కారణకార్యభావము ఎట్టిది? (23). ఈ మంత్రములో అయిదు బ్రహ్మలు క్రమములో ఎట్లు ఉండును? కళలు ఎన్ని అని చెప్పబడినవి? ఓంకారము ప్రపంచమునకు ఆత్మ ఎట్లు అగుచున్నది? (24) ఓ శివా! ఓంకారమునకు దానిచే బోధించబడే ఈశ్వరునకు గల సంబంధమెట్టిది? అక్షరములనుచ్చరించే స్థానములెయ్యవి. దీనియందు యెవ్వడు అధికారియని గ్రహించదగును? దీనికి విషయము ఎది? (25) ఇచట సంబంధమును ఎట్లు తెలియవలెను? దీనికి ప్రయోజనమేమి? ఉపాసకుని స్వరూపమెట్టిది? ఉపాసనకు స్థానము ఏది? (26) ఉపాసింపబడే వస్తువుయొక్క స్వరూపమెట్టిది? ఉపాసకునకు లభించే ఫలము ఏది? అనుష్ఠానమును చేయు విధానమెయ్యది? ఓ ప్రభూ! పూజకు స్థానము ఏది? (27) పూజలో మండలము ఏది? ఓ హరా! ఋషి మొదలగు వారు ఎవ్వరు? న్యాసమును చేసి జపించు విధమెయ్యది? పూజను చేసే విధానము మరియు క్రమము ఏది? (28). ఓ మహేశ్వరా! ఈ సర్వమును వివరముగా చెప్పుము. నీకు నా యందు దయ ఉన్నచో, నేను ఈ విషయములను యథాతథముగా వినగోరుచున్నాను (29). ఆ దేవి ఇట్లు చక్కగా ప్రశ్నించగా, చంద్రశేఖరుడగు శివభగవానుడు ఆ మహేశ్వరిని ప్రశంసించి చెప్పుటకు ఉపక్రమించెను (30).

శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు పార్వతీదేవి శివుని ప్రశ్నించుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Siva Maha Puranam-4    Chapters