Siva Maha Puranam-4    Chapters   

అథ సప్తచత్వారింశో%ధ్యాయః

ధూమ్రాక్ష-చండ-ముండ-రక్తబీజుల సంహారము

ఋషిరువాచ |

ఆసీచ్ఛుంభాసురో దైత్యో నిశుంభశ్చ ప్రతాపవాన్‌ | త్రైలోక్యమోజసా క్రాంతం భ్రాతృభ్యాం సచరాచరమ్‌ || 1

తాభ్యాం ప్రపీడితా దేవా హిమవంతం సమాయయుః | జననీం సర్వభూతానాం కామదాత్రీం వవందిరే || 2

ఋషి ఇట్లు పలికెను -

శంభుడు మరియు ప్రతాపశాలియగు నిశుంభుడు అనే రాక్షసులు ఉండెడివారు. స్థావరజంగమ ప్రాణులతో కూడియున్న ముల్లోకములు వారి ప్రతాపముచే ఆక్రమించబడెను (1). వారిద్దరిచే మిక్కిలి పీడించబడిన దేవతలు హిమవత్పర్వతము వద్దకు వెళ్లి సర్వప్రాణుల కోరికలనీడేర్చే జగన్మాతకు నమస్కరించిరి(2).

దేవా ఊచుః |

జయ దుర్గే మహేశాని జయాత్మీయజనప్రియే | త్రైలోక్యత్రాణకారిణ్యౖశివాయై తే నమో నమః || 3

నమో ముక్తిప్రదాయిన్యై పరాంబాయై నమో నమః | నమస్సమస్తసంసారోత్పత్తి స్థిత్యంతకారికే || 4

కాలికారూపసంపన్నే నమస్తారకృతే నమః | ఛిన్నమస్తాస్వరూపాయై శ్రీ విద్యాయై నమో%స్తు తే || 5

భువనేశి నమస్తుభ్యం నమస్తే భైరవాకృతే | నమో%స్తు బగళాముఖ్యై ధూమవత్యై నమో నమః|| 6

నమస్త్రిపురసుందర్యై మాతంగ్యై తే నమో నమః | అజితాయై నమస్తుభ్యం విజయాయై నమో నమః || 7

జయాయై మంగళాయై తే విలాసిన్యై నమో నమః | దోగ్ధ్రీరూపే నమస్తుభ్యం నమో ఘోరాకృతే%స్తు తే || 8

మనో%పరాజితాకారే నిత్వాకారే నమో నమః | శరణాగతపాలిన్యై రుద్రాణ్యౖ తే నమో నమః || 9

నమో వేదాంతవేద్యాయై నమస్తే పరమాత్మనే | అనంతకోటి బ్రహ్మాండ నాయికాయై నమో నమః || 10

ఇతి దేవైస్సుత్తా గౌరీ ప్రసన్నా వరదా శివా | ప్రోవాచ త్రిదశాన్‌ సర్వాన్‌ యుష్మాభిస్త్సూ యతే%త్ర కా || 11

తతో గౌరీతనోరేకా ప్రాదురాసీత్కుమారికా | సోవాచ మిషతాం తేషాం శివశక్తిం పరాదరాత్‌ || 12

దేవతలు ఇట్లు పలికిరి -

ఓ దుర్గా! మహాశ్వరీ! భక్తులయందు ప్రీతి గల తల్లీ! నీకు జయమగుగాక! జయము. ముల్లోకములను రక్షించునది, శివుని పత్ని, ముక్తిని ఇచ్చునది, జగన్మాత, సర్వజగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించునది, కాలికా-తారా-ఛిన్నమస్తా-శ్రీ విద్యా అను రూపములను దాల్చినది, భువనములకు ఈశ్వరి, భయంకరమగు ఆకారము గలది, బగళాముఖి, ధూమావతి, త్రిపురసుందరి, మతంగపుత్రి, జయింప శక్యము కానిది, జయస్వరూపిణి, మంగళస్వరూపిణి, సుందరి, గోరూపిణి, క్రూరరూపము గలది, అపరాజిత (పరాజయము నెరుంగనిది) అనురూపములో నున్నది, నిత్యమగు స్వరూపము గలది, శరణు జొచ్చిన వారిని రక్షించునది, రుద్రుని పత్ని, ఉపనిషత్తులచే తెలియబడునది, పరమాత్మ, అనంతకోటి బ్రహ్మాండములకు అధీశ్వరి అగు నీకు అనేక నమస్కారములు (3-10). దేవతలు ఈ విధముగా స్తుతించగా, వరములనిచ్చే మంగళస్వరూపురాలగు గౌరి ప్రసన్నురాలై దేవతలందరితో ఇట్లనెను: మీరీ సమయములో ఎవరిని స్తుతించుచున్నారు? (11) అపుడు గౌరీదేవియొక్క దేహమునుండి ఒక కుమారి ఆవిర్భవించెను. వారు కళ్లను అప్పగించి చూచుచుండగా ఆమె పరమాదరముతో శివశక్తిని ఉద్దేశించి ఇట్లు పలికెను (12).

స్తోత్రం మే క్రియతే మాతస్సమసై#్తస్స్వర్గవాసిభిః | నిశుంభశుంభ##దైత్యాభ్యాం ప్రబలాభ్యాం ప్రపీడితైః || 13

శరీరకోశాద్యత్తస్యా నిర్గతా తేన కౌశికీ | నామ్నా సా గీయతే సాక్షాచ్ఛుంభాసురనిబర్హిణీ || 14

చైవోగ్రతారికా ప్రోక్తా మహో గ్రతారికాపి చ | ప్రాదుర్భూతా యతస్సావై మాతంగీత్యుచ్యతే భువి || 15

బభాషే నిఖిలాన్‌ దేవాన్‌ యూయం తిష్ఠత నిర్భయాః | కార్యం వః సాధయిష్యామి స్వతంత్రాహం వినాశ్రయమ్‌ || 16

ఇత్యుక్త్వా సా తదా దేవీ తరసాంతర్హితా%భవత్‌ | చండముండౌ తు తాం దేవీమద్రాష్టాం సేవకౌ తయోః || 17

దృష్ట్వా మనోహరం తస్యా రూపం నేత్రసుఖావహమ్‌ | పేతతుస్తౌ ధరామధ్యే నష్టసంజ్ఞౌ విమోహితౌ || 18

గత్వా వ్యాజహ్రతుస్సర్వం రాజ్ఞే వృత్తాంతమాదితః | దృష్టా కాచిన్మయా%పూర్వా నారీ రాజన్మనోరమా || 19

హిమవచ్ఛిఖరే రమ్యే సంస్థితా సింహవాహినీ | సమంతాద్దేవకన్యాభిస్సేవితా బద్ధపాణిభిః || 20

కురుతే పాదసంవాహం కాచిత్సం స్కురుతే కచాన్‌ | పాణిసంవాహనం కాచిత్కాచిన్నేత్రాంజనం న్యదాత్‌ || 21

కాచిద్గృహీత్వా హస్తేనాదర్శం దర్శయతే ముఖమ్‌ | నాగవల్లీం దదాత్యేకా లవంగైలాది సంయుతామ్‌ || 22

ఓ తల్లీ! శుంభనిశుంభులనే మహాబలశాలురగు రాక్షసులచే అధికముగా పీడింపబడియున్న దేవతలందరు నన్ను స్తుతించుచున్నారు (13). ఆమె పార్వతియొక్క దేహము అనే కొశమునుండి ఉద్భవించుటచే కౌశికి అను పేర ప్రస్తుతిని గాంచినది. ఆమె స్వయముగా శుంభాసురుని సంహరించినది (14). ఆమెకు ఉగ్రతారిక, మహోగ్రతారిక అను పేర్లు కూడ గలవు. తల్లియొక్క శరీరమునుండి సాక్షాత్తుగా ఆవిర్భవించుటచే, ఆమె మాతంగి యని లోకములో ప్రసిద్ధిని పొందినది (15). ఆమె దేవతలందరితో నిట్లు పలికెను: మీరు నిర్భయముగ నుండుడు. నేను ఇతరుల సహాయముతో పని లేకుండగా స్వతంత్రముగా మీ పనిని చేసి పెట్టెదను (16). ఆ దేవి అపుడు ఇట్లు పలికి వెంటనే అంతర్ధానమయ్యెను. శుంభనిశుంభుల సేవకులగు చండముండులు ఆ దేవిని చూచిరి (17). మనోహరము, కన్నులకు సుఖమును కలిగించునది అగు ఆమె యొక్క రూపమును గాంచి, వారిద్దరు విశేషమగు మోహమును పొంది తెలివిని గోల్పోయి నేలపై బడిరి (18). వారు వెళ్లి వృత్తాంతమునంతను మొదటినుండి తమ రాజునకు విన్నవించిరి. ఓ రాజా! నేను మనోహరమగు ఒక అపూర్వ స్త్రీని చూచితిని (19). ఆమె సింహము వాహనముగా గలదై సుందరమగు హిమవత్పర్వత శిఖరముపై నున్నది. దేవకన్యలు ఆమె చుట్టూ చేతులను కట్టుకొని నిలబడి సేవించుచున్నారు (20). ఒకతె కాళ్లను నొక్కుచుండగా, మరియొకతె జుట్టును దువ్వుచుండెను. ఒకామె చేతులను నొక్కుచుండగా, మరియొకామె కన్నులకు కాటుకను దిద్దుచుండెను (21). ఒకామె అద్దమును చేతితో పట్టుకొని ముఖమును చూపుచుండెను. లవంగములు, ఏలకులు మొదలగు వాటితో చుట్టబడిన తాంబూలమును మరియొకామె ఇచ్చుచుండెను (22).

పతద్గ్రహం కరే కృత్వా స్థితా కాచిత్సఖీ పురః | భూషయత్యఖిలాంగాని కాచిద్భూషాంబరాదిభిః || 23

కదలీస్తంభజంఘోరుః కీరనాసా%హిదోర్లతా | రణన్మంజీరచరణా రమ్యమేఖలయా యుతా || 24

లసత్కస్తూరికామోదముక్తాహారచలస్తనీ | గ్రైవేయకలసద్గ్రీవా లలంతీదామమండితా || 25

అర్ధచంద్రధరా దేవీ మణికుండలధారిణీ | రమ్యవేణిర్విశాలాక్షీ లోచనత్రయభూషితా || 26

సాక్షరా మాలికోపేతా పాణిరాజితకంకణా | స్వర్ణోర్మికాంగులిర్ర్భాజత్పారిహార్యలసత్కరా || 27

శుభ్రవస్త్రావృతా గౌరీ పద్మాసనవిరాజితా | కాశ్మీరబిందుతిలకా చంద్రాలంకృతమస్తకా || 28

తడిద్ద్యుతిర్మహామూల్యాంబర చోలోన్నమత్కుచా | భుజైరష్టాభిరుత్తుంగైర్ధారయంతీ వరాయుధాన్‌ || 29

తాదృశీ నాసురీ నాగీ న గంధర్వీ న దానవీ | విద్యతే త్రిషు లోకేషు యాదృశీ సా మనోరమా || 30

తస్మాత్సంభోగయోగ్యత్వం తస్యాస్త్వయ్యేవ శోభ##తే | నారీరత్నం యతస్సావై పుంరత్నం చ భవాన్‌ ప్రభో || 31

ఇత్యుక్తం చండముండాభ్యాం నిశమ్య స మహాసురః | దూతం సుగ్రీవనామానం ప్రేషయామాస తాం ప్రతి || 32

గచ్ఛ దూత తుషారాద్రౌ తత్రాస్తే కాపి సుందరీ | సా నేతవ్యా ప్రయత్నేన కథయిత్వా వచో మమ || 33

ఇతి విజ్ఞాపితస్తేన సుగ్రీవో దానవోత్తమః | గత్వా హిమాచలం ప్రాహ జగదంబాం మహేశ్వరీమ్‌ || 34

క్రింద పడుచున్న విలాసవస్తువును చేతియందు పట్టుకొని ఒక చెలికతై ఆమె ఎదుట నిలబడెను. ఒకామె ఆమె అవయవములనన్నింటినీ భూషణములు, వస్త్రములు మొదలగు వాటితో అలంకరించుచుండెను (23). అరచి బోదెల వంటి పిక్కలు ఊరువులు గలది, చిలుక ముక్కువంటి ముక్కు గలది, పాములవంటి మరియు లతల వంటి చేతులు గలది, ధ్వనించే నూపురములతో గూడి పాదములు గలది, సుందరమగు మేఖలను దాల్చినది, (24) కస్తూరి సుగంధముతో కూడిన స్తనములపై కదలాడుతూ ప్రకాశించే ముత్యాల హారము గలది, కంఠహారములతో ప్రకాశించు కంఠము గలది, విలాసముగా ధరింపబడిన మాలచే అలంకరింపబడినది (25), లలాటమునందు చంద్రవంక బొట్టును ధరించి ప్రకాశించునది, మణులు పొదిగిన కుండలములను ధరించినది, సుందరమగు కేశాలంకారము గలది, నిడివి కన్నులు గలది, మూడు కన్నులతో శోభిల్లునది (26), వినాశము లేనిది, మాలను దాల్చినది, చేతులయందు ప్రకాశించే కంకణములు గలది, బంగరు ఉంగరములతో కూడిన వ్రేళ్లు గలది, మెరిసి పోయే గాజులతో శోభిల్లు చేతులు గలది (27), స్వచ్ఛమగు వస్త్రమును కప్పుకొని యున్నది, పద్మాసనమునందు ప్రకాశించుచున్నది, లలాటముపై కుంకుమ బొట్టును పెట్టుకున్నది, శిరస్సుపై చంద్రవంకను అలంకరించుకున్నది, మెరుపువలె ప్రకాశించునది, మిక్కిలి విలువైన వస్త్రముతో తయారైన రవికెను ధరించి ఎత్తైన వక్షస్థ్సలముతో ప్రకాశించునది, ఎనిమిది భుజములతో పైకి ఎత్తబడిన శ్రేష్ఠమగు ఆయుధములను పట్టుకొని యున్నది అగు ఆ గౌరి వంటి సుందరియగు యువతి రాక్షసులలో, నాగులలో, గంధర్వులలో, దానవులలో, ముల్లోకములలో ఒక్కరైననూ లేరు (28-30). కావున ఆమె పొందు నీయందు మాత్రమే శోభిల్లును. ఏలయనగా, ఆమె స్త్రీలలో శ్రేష్ఠురాలు. ఓ ప్రభూ! నీవు పురుషులలో శ్రేష్ఠడవు (31). చండముండులు చెప్పిన ఈ వచనములను విని ఆ మహారాక్షసుడు సుగ్రీవుడనే దూతను ఆమె వద్దకు పంపెను (32). ఓ దూతా! వెళ్లుము. హిమవత్పర్వతముపై ఒకానొక సుందరి గలదు. ఆమెకు నా మాటను చెప్పి జాగ్రత్తగా దోడ్కొని రమ్ము (33). రాక్షస శ్రేష్ఠుడగు సుగ్రీవుడు ఆయనచే ఇట్లు ఆజ్ఞాపించబడి హిమవత్పర్వతమునకు వెళ్లి, జగన్మాతయగు మహేశ్వరితో నిట్లనెను (34).

దూత ఉవాచ |

దేవి శుంభాసురో దైత్యో నిశుంభస్తస్య చానుజః | విఖ్యాతస్త్రిషు లోకేషు మహాబల పరాక్రమః || 35

చారో%హం ప్రేషితస్తేన సన్నిధిం తే సమాగమమ్‌ | స యజ్జగౌ సురేశాని తత్సమాకర్ణయాధునా || 36

ఇంద్రాదీన్‌ సమరే జిత్వా తేషాం రత్నాన్యపాహరమ్‌ | దేవభాగం స్వయం భుంజే యాగే దత్తం సురాదిభిః || 37

స్త్రీరత్నం త్వామహం మన్యే సర్వత్నోపరి స్థితమ్‌ | సా త్వం మమానుజం మాం వా భజతాత్కామజై రసైః || 38

ఇతి దూతోక్తమాకర్ణ్య వచనం శుంభభాషితమ్‌ | జగాద సా మహామాయా భూతేశప్రాణవల్లభా || 39

దూత ఇట్లు పలికెను -

ఓ దేవీ! శుంభాసురుడనే దైత్యుడు గలడు. ఆతడు ముల్లోకములలో పేరు మోసిన గొప్ప బలపరాక్రమములు గలవాడు. నిశుంభుడు ఆతని తమ్ముడు (35). దూతనగు నేను ఆయన పంపగా నీ సన్నిధికి వచ్చియుంటిని. ఓ దేవేశ్వరీ! ఇపుడు ఆతడు చెప్పిన పలుకుల నాలకించుము (36). నేను ఇంద్రుడు మొదలగు దేవతలను యుద్ధములో జయించి వారివద్దనున్న శ్రేష్ఠవస్తువులను లాగుకొంటిని. దేవతలకు యజ్ఞములలో ఈయబడిన హవిర్భాగములను నేను స్వయముగా అనుభవించుచున్నాను (37). నీవు స్త్రీలందరిలో శ్రేష్ఠురాలవని నేను తలంచుచున్నాను. అట్టి నీవు నన్ను గాని, నా సోదరుని గాని ప్రేమించి సేవించుము (38). శుంభుడు దూత ద్వారా పంపిన ఈ సందేశమునువిని, భూతపతియగు శివునకు ప్రాణప్రియురాలగు ఆ మహామాయ ఇట్లు పలికెను (39).

దేవ్యువాచ |

సత్యం వదసి భో దూత నానృతం కించిదుచ్యతే | పరం త్వేకా కృతా పూర్వం ప్రతిజ్ఞా తాం నిబోధమే || 40

యో మే దర్పం విధునుతే యో మాం జయతి సంగరే | ఉత్సహే తమహం కర్తుం పతిం నాన్యమితి ధ్రువమ్‌ || 41

స త్వం కథయ శుంభాయ నిశుంభాయ వచో మమ | యథాయుక్తం భ##వేదేవం విదధాతు తథా%త్ర సః || 42

ఇత్థం దేవీవచశ్ర్శుత్వా సుగ్రీవో నామ దానవః | రాజ్ఞే విజ్ఞాపయామాస గత్వా తత్ర సవిస్తరమ్‌ || 43

అథ దూతోక్తమాకర్ణ్య శుంభో భైరవశాసనః | ధూమ్రాక్షం ప్రాహ సక్రోధస్సేనాన్యం బలినాం వరమ్‌ || 44

హే ధూమ్రాక్ష తుషారాద్రౌ వర్తతే కాపి సుందరీ | తామానయ ద్రుతం గత్వా యథాయాస్యతి సాత్ర వై || 45

తస్యా ఆనయనే భీతిర్న కార్యా%సురసత్తమ | యుద్ధం కార్యం ప్రయత్నేన యది సా యోద్ధుమిచ్ఛతి || 46

ఏవం విజ్ఞాపితో దైత్యో ధూమ్రలోచనసంజ్ఞకః | గత్వా హిమాచలం ప్రాహ భువనేశీముమాంశజామ్‌ || 47

భర్తుర్మమాంతికం గచ్ఛ నో చేత్త్వాం ఘాతయామ్యహమ్‌ | షష్ట్యా%సురాణాం సహితస్సహస్రాణాం నితంబిని || 48

దేవి ఇట్లు పలికెను -

ఓ దూతా! నీవు సత్యమును పలుకుచున్నావు. నీ పలుకులలో అసత్యము లేశ##మైననూ లేదు. కాని పూర్వము నేను ఒక ప్రతిజ్ఞను చేసియుంటిని. నా ఆ ప్రతిజ్ఞను గురించి తెలుసుకొనుము (40). ఎవడైతే నా పొగరును అడంచునో, నన్ను యుద్ధములో జయించునో, వానిని నేను భర్తగా పొందగోరెదననియు, ఇతరులు నాకు సమ్మతము కాదనియు నేను శపథమును చేసితని. ఇది నిశ్చయము (41). కావున, నీవు నా మాటలను శంభనిశుంభులకు చెప్పుము. ఈ విషయములో వారు యథాయోగ్యముగా చేయుదురు గాక! (42) దేవియొక్క ఈ వచనములను విని సుగ్రీవుడనే ఆ రాక్షసుడు తన ప్రభువు వద్దకు వెళ్లి ఆ విషయమును రాజునకు విస్తారముగా విన్నవించెను (43). భయంకరమగు శాసనము గల శుంభుడు అపుడు దూతయొక్క వచనములను విని బలవంతులలో శ్రేష్ఠుడగు ధూమ్రాక్షుడనే సేనానాయకునితో కోపముతో నిట్లనెను (44). ఓ ధూమ్రాక్షా! హిమవత్పర్వతమునందు ఒకానొక సుందరి గలదు. నీవు వెంటనే అచటకు వెళ్లి ఆమెను దోడ్కొనిరమ్ము. ఆమె అచటకు వచ్చు విధముగా చేయుము (45). ఓ రాక్షసవీరా! ఆమెను ఇచటకు తెచ్చుటలో నీవు భయమును పొందకుము. ఆమె యుద్ధమును చేయగోరినచో, నీవు ప్రయత్నపూర్వకముగా యుద్ధమును చేయుము (46). ఈ విధముగా ఆజ్ఞాపించబడినవాడై, ధూమ్రాక్షుడనే ఆ రాక్షసుడు హిమవత్పర్వతమునకు వెళ్లి, ఉమాదేవియొక్క అంశనుండి పుట్టిన ఆ భువనేశ్వరితో నిట్లనెను (47). నీవు నా ప్రభువు వద్దకు నడువుము. లేనిచో, నిన్ను నేను సంహరించెదను. ఓ సుందరీ! నా వెనుక అరవై వేలమంది రాక్షసులు గలరు (48).

దైత్యరాట్‌ ప్రేషితో వీర హంసి చేత్కిం కరోమితే | పరం త్వసాధ్యం గమనం మన్యే సంగ్రామమంతరా || 49

ఇత్యుక్తస్తామన్వధావద్దానవో ధూమ్రలోచనః | హుంకారోచ్చారణనైవ తం దదాహ మహేశ్వరీ || 50

తతః ప్రభృతి సా దేవీ ధూమావత్యుచ్యతే భువి | ఆరాధితా స్వభక్తానాం శత్రువర్గనికర్తినీ || 51

ధూమ్రాక్షే నిహతే దేవ్యా వాహనేనాతికోపినా | చర్వితాస్తద్గణాస్సర్వే%పలాయంతావశేషితాః || 52

ఇత్థం దేవ్యా హతం దైత్యం శ్రుత్వా శుంభః ప్రతాపవాన్‌ | చకార బహులం కోపం సందష్టోష్ఠపుటద్వయః || 53

చండం ముండం రక్తబీజం పై#్రషయత్ర్కమతో%సురాన్‌ | తే%పి చాజ్ఞాపితా దైత్యా యయుర్యత్రాంబికాస్థితా || 54

సింహారూఢాం భగవతీమణిమాదిభిరాశ్రితామ్‌ | భాసయంతీం దిశో భాసా దృష్ట్వోచుర్దానవర్షభాః || 55

హే దేవి తరసా మూలం యాహి శుంభనిశుంభయోః | అన్యథా ఘాతయిష్యామస్సగణాం త్వాం సవాహనామ్‌ || 56

వృణీష్వ తం పతిం వామే లోకపాలాదిభిస్త్సుతమ్‌ | ప్రపత్స్యసే మహానందం దేవానామపి దుర్లభమ్‌ || 57

ఇత్యుక్తమాకలయ్యాంబా స్మయిత్వా పరమేశ్వరీ | ఉదాజహార సా దేవీ సూనృతం రసవద్వచః || 58

ఓ వీరా! రాక్షసరాజుచే పంపబడిన నీవు కొట్టినచో నేను నీకు ఏమి చేయగలను? కాని, యుద్ధమును చేయకుండగా నీతో వచ్చుట అసంభవమని తలచుచున్నాను (49). ఆమె ఇట్లు పలుకగా, ధూమ్రాక్షుడనే ఆ రాక్షసుడు ఆమె పైకి పరుగెత్తెను. మహేశ్వరి కేవలము ఓంకారమునుచ్చరించి వానిని దహించి వేసెను (50). ఆనాటి నుండియు లోకములో ఆమెకు ధూమావతి అను ప్రసిద్ధి కలిగెను. ఆమె తనను ఆరాధించే భక్తుల శత్రుసమూహములను నాశనము జేయును (51). ధూమ్రాక్షుడు సంహరింపబడగానే, మిక్కిలి కోపమును పొందియున్న దేవియొక్క వాహనమగు సింహము వాని సేనలను నమిలి వేసెను. మిగిలినవారందరు పారిపోయిరి (52). ప్రతాపశాలియగు శుంభుడు ఈ విధముగా ధూమ్రాక్షుడు దేవిచే సంహరింపబడినాడని విని, పెదవులను పళ్లతో కొరుకుచూ అధికమగు కోపమును పొందెను (53). ఆతడు చండముండరక్తబీజులనే రాక్షసులను వరుసగా పంపెను. శుంభునిచే ఆజ్ఞాపించబడిన ఆ రాక్షసులు కూడ అంబిక ఉన్న స్థానమునకు వెళ్లిరి (54). సింహమునధిష్ఠించియున్నది, అణిమ మొదలగు సిద్ధులకు ఆశ్రయమైనది, దిక్కులను తన కాంతిచే ప్రకాశింపజేయుచున్నది అగు భగవతిని చూచి ఆ దానవవీరులు ఇట్లు పలికిరి (55). ఓ దేవీ! వెంటనే శుంబనిశుంభుల పాదముల వద్దకు నడువుము. అట్లు గానిచో నిన్ను, నీ అనుయాయులను, నీ వాహనమును నశింపజేసెదము (56). ఓ సుందరీ! లోకపాలకులు మొదలగు వారిచే ప్రశంసింపబడే ఆ శుంభుని భర్తగా వరించుము. దేవతలకైననూ పొందశక్యము కాని మహానందమును పొందెదవు (57). జగన్మాత, పరమేశ్వరి అగు ఆ దేవి వారి ఈ మాటలను విని చిరునవ్వు నవ్వి మధురము, యథార్థము అగు వచనమును ఇట్లు పలికెను (58).

అద్వితీయో మహేశానః పరబ్రహ్మ సదాశివః | యత్తత్త్వం న విదుర్వేదా విష్ట్వాదీనాం చ కా కథా || 59

తస్యాహం ప్రకృతి స్సూక్ష్మా కథ మన్యం పతిం వృణ | సింహీ కామాతురా నైవ జంబుకం వృణుతే క్వచిత్‌ || 60

కరేణుర్గర్దభం నైవ ద్వీపినీ శశకం న వా | మృషా వదత భో దైత్యా మృత్యువ్యాలనియంత్రితాః || 61

యూయం ప్రయాత పాతాలం యుధ్యధ్వం శక్తిరస్తి చేత్‌ | ఇతి క్రోధకరం వాక్యం శ్రుత్వోచుస్తే పరస్పరమ్‌ || 62

అబలాం మనసి జ్ఞాత్వా న హన్మో భవతీం వయమ్‌ | అథో స్థిరైహి పంచాస్యే యుద్ధేచ్ఛా మనసే%స్తి చేత్‌ || 63

తేషామేవం వివదతాం కలహస్సమవర్ధత్‌ | వవృషుస్సమరే బాణా ఉభయోర్దలయోశ్శితాః || 64

ఏవం తైస్సమరం కృత్వా లీలయా పరమేశ్వరీ | జఘాన చండముండాభ్యాం రక్తబీజం మహాసురమ్‌ || 65

ద్వేషబుద్ధిం విధాయాపి త్రిదశస్థితయో%ప్యమీ | అంతే ప్రాపన్‌ పరం లోకం యం లోకం యాంతి తజ్జనాః || 66

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం ధూమ్రాక్ష చండముండరక్తబీజవధో నామ సప్తచత్వారింశో%ధ్యాయః (47).

మహేశ్వరుడగు సదాశివుడు అద్వయ పరంబ్రహ్మ. అయన తత్త్వమును వేదములు తెలియుకున్నవి. విష్ణువు మొదలగు వారి గురించి చెప్పునదేమున్నది? (59) ఆయనయొక్క సూక్ష్మప్రకృతి నేను. నేను మరియొకనిని భర్తగా ఎట్లు వరించగలను? ఆడు సింహము కామముచే పీడింపబడి ఎక్కడైననూ నక్కను వరించదు గదా! (60) ఏనుగు గాడిదను, పులి కుందేలును వరించవు. మృత్యువు అనే సర్పముచే నియంత్రింపబడియున్న ఓ రాక్షసులారా! మీరు పలికినది అసత్యము (61). మీరు పాతాళమునకు పొండు. శక్తి ఉన్నచో యుద్ధమును చేయుడు. ఈ విధమగు కోపమును కలిగించే వాక్యములను విని వారు ఒకరితో నొకరు ఇట్లు పలికిరి (62). ఈ పూజ్యురాలిని అబలయను మనోభావనచే మనము వధించుట లేదు. నీకు మనస్సులో యుద్ధముపై కోరిక ఉన్నచో సింహముపై స్థిరముగా కూర్చుండి రమ్ము (63). ఈ విధముగా పరస్పర విరుద్ధముగా మాటలాడుచున్న ఆ రెండు పక్షముల వారి మధ్య కలహము పెరిగి పెద్దది ఆయెను. రెండు పక్షముల వారిపై యుద్ధములో వాడి బాణములు వర్షించినవి (64). ఆ పరమేశ్వరి ఈ తీరున వారితో లీలచే యుద్ధమును చేసి చండముండులను, రక్తబీజుడనే మహారాక్షసుని సంహరించెను (65). ఈ దేవశత్రువులు ద్వేషబుద్ధి కలవారే అయిననూ మరణించిన తరువాత, దేవీ భక్తులు పొందే పరమపదమును పొందిరి (66).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు ధూమ్రాక్ష-చండ-ముండ-రక్తబీజ-వధను వర్ణించే నలుబది ఏడవ అధ్యాయము మగిసినది (47).

Siva Maha Puranam-4    Chapters