Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకచత్వారింశో%ధ్యాయః

శ్రీ శివపురాణ మహాత్మ్యము

సూత ఉవాచ |

తత్ర స్కందసరో నామ సరస్సాగరసన్నిభమ్‌ | అమృతస్వాదుశిశిరస్వచ్ఛాగాధలఘూదకమ్‌ || 1

సమంతతస్సంఘటితం స్ఫటికోపలసంచయైః | సర్వర్తుకుసుమైః పుల్లైశ్ఛాదితాఖిలదిఙ్ముఖమ్‌ || 2

శైవలైరుత్పలైః పద్మైః కుముదైస్తారకోపమైః | తరంగైరభ్రసంకాశైరాకాశమివ భూమిగమ్‌ || 3

సుఖావతరణారోహైః స్థలైర్నీలశిలామయైః | సోపానమార్గై రుచిరైశ్శోభమానాష్టదిఙ్ముఖమ్‌ || 4

తత్రావతీర్ణైశ్చ యథా తత్రోత్తీర్ణైశ్చ భూయసా | స్నాతైస్సితోపవీతైశ్చ శుక్లాకౌపీనవల్కలైః || 5

జటాశిఖాయనైర్ముండైస్త్రి పుండ్రకృతమండనైః | విరాగవివశ##స్మేరముఖైర్మునికుమారకైః || 6

ఘటైః కమలినీపత్రపుటైశ్చ కలశైశ్శివైః | కమండలుభిరన్యైశ్చ తాదృశైః కరకాదిభిః || 7

ఆత్మార్థం చ పరార్థం చ దేవతార్థం విశేషతః | ఆనీయమానసలిలమాత్తపుష్పం చ నిత్యశః || 8

అంతర్జలశిలారూఢైర్నీచానాం స్పర్శశంకయా | ఆచారవద్భిర్మునిభిః కృతభస్మాంగధూసరైః || 9

ఇతస్తతో%ప్సు మజ్జద్భిరిష్టశిష్టైశ్శిలాగతైః | తిలైశ్చ సాక్షతైః పుషై#్పస్త్యక్తదర్భపవిత్రకైః || 10

దేవాద్యమృషిమధ్యం చ నిర్వర్త్య పితృతర్పణమ్‌ | నివేదయేదభిజ్ఞేభ్యో నిత్యస్నానగతాన్‌ ద్విజాన్‌ || 11

సూతుడిట్లు పలికెను -

అచట సముద్రమును పోలియున్న స్కందసరస్సు అనే సరస్సు గలదు. దానియందలి నీరు అమృతము వలె తియ్యగా చల్లగా స్వచ్ఛముగా తేలికగా నుండును. దాని లోతు చాల ఎక్కువ (1). అది స్ఫటికశిలల సమూహములచే చుట్టువారబడి యున్నది. దానికి నాలుగు వైపులా అన్ని ఋతువులకు సంబంధించిన వికసించిన పుష్పములు కప్పి వేసినవి (2). దానియందలి నాచుతో కూడిన నల్ల కలువలు, పద్మములు, ఎర్ర కలువలు నక్షత్రములను బోలియున్నవి. తరంగములు మేఘములను బోలియుండగా, దానిని చూచినచో ఆకాశ##మే భూమిపైకి దిగి వచ్చినదా యన్నట్లున్నది (3). దానికి ఎనిమిది దిక్కులయందు సుఖముగా దిగుటకు వీలుగా స్నాన ఘట్టములు, అందమగు మెట్లు గలవు. అచటి నేల నీలవర్ణము గల శిలలతో ప్రకాశించెను (4). దానియందు జనులు అనేకులు దిగి స్నానములను చేయుచుండగా, మరికొందరు స్నానమును పూర్తి చేసుకొని పైకి ఎక్కుచుండిరి. వారు తెల్లని యజ్ఞోపవీతములను, తెల్లని కౌపీనములను మరియు వస్త్రములను ధరించిరి (5). వారిలో కొందరు జటాధారులు కాగా, మరికొందరు పిలకలను ధరించిరి. ఇంకొందరు ముండనమును చేసుకొని యుండిరి. వారు తమ లలాటములను త్రిపుండ్రముతో అలంకరించుకొనిరి. వైరాగ్యముచే స్వచ్ఛమైన చిరునవ్వుతో కూడిన ముఖములు గల మునికుమారులు (6) కడవలతో, తామరాకుల దొన్నెలతో, మంగళకలశములతో, కమండలములతో, మరియు ఇతరములగు గిండి పాత్రలు మొదలగు వాటితో (7) తమ కొరకు మాత్రమే గాక, ఇతరుల కొరకు, విశేషించి దేవపూజ కొరకు నిత్యము నీటిని తీసుకొని వచ్చి, పుష్పములను కోసి తెచ్చుచుందురు (8). ఆచారవంతులగు మునులు ఇతరుల స్పర్శను పరిహరించువారై నీటిలోపలి రాళ్లపై కూర్చుండి, శరీరమంతా భస్మను పూసుకొని యుండిరి (9). శిష్టులు రాళ్లపై తిలలను, అక్షతలను, పుష్పములను, దర్భలను, పవిత్రములను వదలి పెట్టగా అవిఇటునటు నీటిలో తేలుతూ మునుగుతూ చెల్లాచెదురుగా నున్నవి (10). వేదవేత్తలు అచటకు నిత్యస్నానమునకు వచ్చి దేవ-ఋషి-పితృతర్పణములను నిర్వర్తించినారనే సత్యము వాటిని చూసిన అభిజ్ఞులకు తెలియుచుండును (11).

స్థానే స్థానే కృతానేకబలిపుష్పసమీరణౖః | సౌరార్ఘ్యపూర్వం కుర్వద్భిః స్థండిలేభ్యర్చనాదికమ్‌ || 12

క్వచిన్నమజ్జదున్మజ్జత్ర్ప స్రస్తగజయూథపమ్‌ | క్వచిచ్చ తృషయాయాతమృగీమృగతురంగమమ్‌ || 13

క్వచిత్పీతజలోత్తీర్ణమయూరవరవారాణమ్‌ | క్వచిత్కృతతటాఘాతవృషప్రతివృషోజ్జ్వలమ్‌ || 14

క్వచిత్కారండవరవైః క్వచిత్సారసకూజితైః | క్వచిచ్చ కోకనినదైః క్వచిద్భ్రమరగీతిభిః || 15

స్నానపానాదికరణౖస్స్వసంపద్ద్రుమజీవిభిః | ప్రణయాత్ర్పాణిభిసై#్తసై#్తర్భాషమాణమివాసకృత్‌ || 16

కూలశాఖిశిఖాలీనకోకిలాకులకూజితైః | ఆతపోపహతాన్‌ సర్వాన్నామంత్రయదివానిశమ్‌ || 17

ఉత్తరే తస్య సరసస్తీరే కల్పతరోరధః | వేద్యాం వజ్రశిలామయ్యాం మృదులే మృగచర్మణి || 18

సనత్కుమారమాసీనం శశ్వద్బాలవపుర్ధరమ్‌ | తత్కాలమాత్రోపరతం సమాధేరచలాత్మనః || 19

ఉపాస్యమానం మునిభిర్యోగీంద్రైరపి పూజితమ్‌ | దదృశుర్నైమిషేయాస్తే ప్రణతాశ్చోపతస్థిరే || 20

యావత్పృష్టవతే తసై#్మ ప్రోచుస్స్వాగతకారణమ్‌ | తుములశ్శుశ్రువే తావద్దివి దుందుభినిస్స్వనః || 21

అక్కడక్కడ కొందరు పూజను చేసి వదిలిపెట్టిన పుష్పములను గాలిమోసుకొని వచ్చుచుండెను. కొందరు అర్ఘ్యపూర్వకముగా సూర్యుని ఉపాసించుచుండిరి. మరికొందరు వేదికపై కూర్చుని పూజ మొదలగు కర్మలను చేయుచుండిరి (12). కొన్ని చోట్ల ఏనుగులు గుంపులుగా వచ్చి నీటిని మునుగుతూ పైకి లేస్తూ ఉండగా, వాటికి నాయకుడగు ఏనుగు నీటిలో కల్లోలము చేయుచుండెను. మరికొన్ని చోట్ల లేళ్లు, దుప్పులు, గుర్రములు వచ్చి తమ దాహమును తీర్చుకొనుచుండెను (13). కొన్ని చోట్ల మదించిన ఏనుగులు మరియు నెమళ్లు నీటిని త్రాగి పైకి లేచి గట్టు మీదకు వచ్చుచుండెను. కొన్ని చోట్ల గట్లను తమ కొమ్ములతో పొడుస్తూ పరస్పరము పోట్లాటకు దిగుతున్న ఆబోతులతో ఆ సరస్సు గొప్పగా ప్రకాశించెను (14). కొన్ని చోట్ల కన్నెలేడు పక్షులు, మరికొన్ని చోట్ల బెగ్గురు పక్షులు, ఇంకొన్ని చోట్ల జక్కవ పక్షులు కూయుచుండగా, మరికొన్ని చోట్ల తుమ్మెదలు పాడుచుండెను (15). ఆ సరస్సు తన చుట్టూ ఉండే అడవిలో నివసిస్తూ, తనయందు స్నానమాడి, తన నీటిని త్రాగి జీవించే పక్షులు మొదలగు ఆయా ప్రాణులతో నిరంతరముగా కబుర్లాడుచున్నదా యన్నట్లు ఉండెను (16). గట్టున ఉన్న చెట్ల కొమ్మలలో నక్కియున్న కోకిలల తొందరపాటు కూతలతో ఆ సరస్సు ఎండ వేడికి తాళ##లేని సర్వప్రాణులను సర్వదా తన వద్దకు ఆహ్వానించుచున్నదా యన్నట్లు ఉండెను (17). ఆ సరస్సు యొక్క ఉత్తరతీరమునందు కల్పవృక్షము క్రింద వజ్రపు రాతితో చేసిన వేదికమీద మెత్తని మృగచర్మముపై (18) శాశ్వతముగా బాల్యదేహమును ధరించి ఉండే సనత్కుమారుడు కూర్చుండియుండెను. ఆయన మనస్సు అచంచలముగా నుండే సమాధిని సరిగా అప్పుడే విరమించియుండెను (19). ఆయనను మునులు ఉపాసించుచుండిరి. యోగివర్యులు పూజించుచుండిరి. ఆ నైమిషారణ్యవాసులగు మునులు ఆయనను చూచి నమస్కరించి, దగ్గరకు వెళ్లి నిలబడిరి (20). ఆయన వారి రాకకు గల కారణమును ప్రశ్నించగా వారు వివరించుచుండిరి. ఇంతలో అంతరిక్షమునందు దుందుభుల సంకులధ్వని వినవచ్చెను (21).

దదృశే తత్‌ క్షణ తస్మిన్‌ విమానం భానుసన్నిభమ్‌ | గణశ్వరైరసంఖ్యేయైస్సంవృతం చ సమంతతః || 22

అప్సరోగణసంకీర్ణం రుద్రకన్యాభిరావృతమ్‌ | మృదంగమురజోద్ఘుష్టం వేణవీణారవాన్వితమ్‌ || 23

చిత్రరత్నవితానాఢ్యం ముక్తాదామవిరాజితమ్‌ | మునిభిస్సిద్ధగంధర్వైర్యక్షచారణకిన్నరైః || 24

నృత్యద్భిశ్చైవ గాయద్బిర్వాదయద్భిశ్చ సంవృతమ్‌ | వీరగోవృషచిహ్నేన విద్రుమద్రుమయష్టినా || 25

కృతగోపురసత్కారం కేతునా మాన్యహేతునా | తస్యమధ్యే విమానస్య చామరద్వితయాంతరే || 26

ఛత్రస్య మణిదండస్య చంద్రస్యేవ శుచేరధః | దివ్యసింహాసనారూఢం దేవ్యా సుయశయా సహ || 27

శ్రియా చ వపుషా చైవ త్రిభిశ్చాపి విలోచనైః | ప్రకారైరభికృత్యానాం ప్రత్యభిజ్ఞాపకం విభోః || 28

అవిలంఘ్యం జగత్కర్తురాజ్ఞాపనమివాగతమ్‌ | సర్వానుగ్రహణం శంభోస్సాక్షాదివ పురఃస్థితమ్‌ || 29

శిలాదతనయం సాక్షాచ్ఛ్రీ మచ్ఛూలవరాయుధమ్‌ | విశ్వేశ్వరగణాధ్యక్షం విశ్వేశ్వరమివాపరమ్‌ || 30

విశ్వస్యాపి విధాతౄణాం నిగ్రహాను గ్రహక్షమమ్‌ | చతుర్బాహుముదారాంగం చంద్రరేఖావిభూషితమ్‌ || 31

కంఠే నాగేన మౌలౌ చ శశాంకేనాప్యలంకృతమ్‌ | సవిగ్రహమివైశ్వర్యం సామర్థ్యమివ సక్రియమ్‌ || 32

సమాప్తమివ నిర్వాణం సర్వజ్ఞమివ సంగతమ్‌ | దృష్ట్వా ప్రహృష్టవదనో బ్రహ్మపుత్రస్సహర్షిభిః || 33

తస్థౌ ప్రాంజలిరుత్థాయ తస్యాత్మానమివార్పయన్‌ |

వెనువెంటనే ఆ అంతరిక్షమునందు సూర్యుని వలె ప్రకాశించునది, లెక్క లేనంతమంది గణాధ్యక్షులచే చుట్టువారబడి యున్నది, అప్సరసల గణములతో రద్దీగా నున్నది, రుద్రకన్యలతో నిండియున్నది, డోళ్లు మద్దెళ్ల గంభీరమగు ధ్వనులతో ఘోషించుచున్నది, వేణువు వీణల శబ్దములతో కూడియున్నది, రంగు రంగుల రత్నములు వ్రేలాడే మేలుకట్టులతో గొప్పగా శోభిల్లుచున్నది, ముత్యాల హారములతో విరాజిల్లుచున్నది, మునులు సిద్ధులు గంధర్వులు యక్షులు చారణులు కిన్నరులతో మరియు నాట్యగాండ్రతో గాయకులతో వాద్యగాళ్లతో నిండియున్నది, పరాక్రమశాలియగు వృషభముయొక్క చిహ్నమును కలిగి పగడాలు పొదిగిన జెండా కర్రను కలిగిన పతాకముతో చక్కగా అలంకరించబడిన గోపురము గలది అగు విమానము కానవచ్చెను. ఆ విమానమునకు మధ్యలో రెండు వింజామరల నడుమ (22-26), మణులు పొదిగిన దండముతో చంద్రునివలె ప్రకాశించే తెల్లని గొడుకు క్రింద, దివ్యమగు సింహాసనమును సుయశాదేవితో గూడి అధిష్ఠించి యున్నవాడు (27), తన శోభాయుక్తమగు దేహముతో మరియు మూడు కన్నులతో ప్రకాశించువాడు, శివప్రభువునకు ఆవశ్యకములగు కార్యములను గురించి సూచనలనిచ్చువాడు (28), జగన్నాథుడగు శివుని ఉల్లంఘింప శక్యము కాని ఆజ్ఞయే మూర్తీభవించి వచ్చినదా యన్నట్లు ఉన్నవాడు, సర్వులను అనుగ్రహించే శంభుని దయ సాక్షాత్తుగా రూపు దాల్చి యెదురుగా వచ్చినదా యన్నట్లు ఉన్నవాడు (29), సాక్షాత్తు శిలాదుని పుత్రుడు, శోభిల్లే గొప్ప శూలము ఆయుధముగా గలవాడు, విశ్వేశ్వరుని గణములకు అధ్యక్షుడు,అపరవిశ్వేశ్వరుడా యన్నట్లు ఉన్నవాడు (30), బ్రహ్మ మొదలగు లోకపాలకులను కూడ అనుగ్రహించుటకు దండించుటకు సమర్థత గలవాడు, నాలుగు బాహువులు గలవాడు, విశాలమగు అవయవములు గలవాడు, చంద్రవంకను అలంకరించుకున్నవాడు (31), కంఠమునందు పామును శిరస్సుపై చంద్రవంకను అలంకరించుకున్నవాడు, రూపు దాల్చిన ఈశ్వరభావము వలె నున్నవాడు, సక్రియమగు సామర్థ్యము వలె నున్నవాడు (32), మోక్షమే రూపమును దాల్చి వచ్చినదా యన్నట్లు ఉన్నావాడు, సర్వజ్ఞుడగు శివుడే వచ్చినాడా అన్నట్లు ఉన్నవాడు అగు నందీశ్వరుని చూచి, మహర్షులతో కూడియున్న బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుడు ఆనందముతో నిండిన ముఖము గలవాడై (33), లేచి చేతులను జోడించి తనను తాను ఆయనకు సమర్పించుకున్నాడా యన్నట్లు నిలబడెను.

అథ తత్రాంతరే తస్మిన్‌ విమానే చావనిం గతే || 34

ప్రణమ్య దండవద్దేవం స్తుత్వా వ్యజ్ఞాపయన్మునీన్‌ | షట్కులీయా ఇమే దీర్ఘం నైమిషే సత్రమాస్థితాః |

ఆగతా బ్రహ్మణాదిష్టాః పూర్వమేవాభికాంక్షయా || 35

శ్రుత్వా వాక్యం బ్రహ్మపుత్రస్య నందీ ఛిత్త్వా పాశాన్‌ దృష్టిపాతేన సద్యః |

శైవం ధర్మం చైశ్వరం జ్ఞానయోగం దత్త్వా భూయో దేవపార్శ్వం జగామ || 36

సనత్కుమారేణ చ తతపుస్తం వ్యాసాయ సాక్షాద్గురవే మమోక్తమ్‌ |

వ్యాసేన చోక్తం మహితేన మహ్యం మయా చ తద్వః కథితం సమాసాత్‌ || 37

నావేదవిద్భ్యః కథనీయమేతత్పురాణరత్నం పురశాసనస్య |

నాభక్తశిష్యాయ చ నాస్తికేభ్యో దత్తం హి మోహాన్నిరయం దదాతి || 38

మార్గేణ సేవానుగతేన యైస్తద్దత్తం గృహీతం పఠితం శ్రుతం వా |

తేభ్యస్సుఖం ధర్మసుఖం త్రివర్గం నిర్వాణమంతే నియతం దదాతి || 39

పరస్పరస్యోపకృతం భవద్భిర్మయా చ పౌరాణికమార్గయోగాత్‌ |

అతో గమిష్యే%హమవాప్తకామస్సమస్తమేవాస్తు శివం సదా నః || 40

సూతే కృతాశిషి గతే మునయస్సువృత్తా యాగే చ పర్యవసితే మహతి ప్రయాగే |

కాలే కలౌ చ విషయైః కలుషాయమాణ వారణసీపరిసరే వసతిం వితేనుః || 41

అథ చ తే పశుపాశముముక్షయాఖిలతయా కృతపాశుపతవ్రతాః |

అధికృతాఖిలబోధసమాధయః పరమనిర్వృతిమాపురనిందితాః || 42

తరువాత ఇంతలో ఆ విమానము నేల మీదకు దిగెను (34). ఆయనకు సాష్టాంగనమస్కారమును చేసి, స్తుతించి సనత్కుమారుడు ఆమునులను గురించి నందీశ్వరునకు ఇట్లు విన్నవించెను: వీరు ఆరు వంశములకు చెందిన ఋషులు. వీరు నైమిషారణ్యములో దీర్ఘ సత్రమును చేసినారు. బ్రహ్మచే ఆదేశించబడి మిమ్ములను దర్శించుటకై ఇంతకు ముందే ఇచటకు వచ్చినారు (35). నందీశ్వరుడు బ్రహ్మపుత్రుడగు సనత్కుమారుని వచనమును విని, వెంటనే తన చూపుతో మాత్రమే వారి పాశములను (కర్మబంధమును) నశింపజేసి, శైవధర్మమును ఈశ్వరీయమగు జ్ఞానయోగమును బోధించి మరల శివుని సన్నిధికి చేరుకొనెను (36). సనత్కుమారుడు ఆ సర్వమును సాక్షాత్తుగా నా గురువగు వ్యాసునకు చెప్పెను. మహాత్ముడగు వ్యాసుడు నాకు చెప్పగా, నేను దానిని మీకు సంగ్రహముగా చెప్పితిని (37). త్రిపురాసురసంహారకుడగు శివుని బోధించే ఈ గొప్ప పురాణమును వేదవేత్తలు కానివారికి, భక్తి లేనివానికి, శిష్యుడు కానివానికి, నాస్తికులకు బోధించరాదు. అట్లు బోధించినచో, నరకము లభించును (38). గురుశుశ్రూషతో కూడిన బోధనామార్గములో దీనిని ఎవరైతే బోధించెదరో, స్వీకరించెదరో, పఠించెదరో, లేదా వినెదరో, వారికి లౌకికసుఖము, ధర్మాచరణము వలన కలిగే సుఖము, ధర్మార్థకామములనే మూడు పురుషార్థములు, అంతమునందు మోక్షము నిశ్చయముగా లభించును (39). ఈ పురాణమార్గముయొక్క సంబంధముచే మీరు, నేను ఒకరికి మరియొకరు ఉపకరించితిమి. కావున, నా ఆకాంక్ష సఫలమైనది. నేను వెళ్లుచున్నాను.మనకు సర్వకాలములలో సర్వము మంగళకరమగు గాక! (40) ఈ విధముగా ఆశీర్వదించి సూతుడు వెళ్లెను. ప్రయాగక్షేత్రములో ఆ గొప్ప యాగము పూర్తి అయ్యెను. కలి ప్రవేశముచే కాలము విషయభోగములచే కలుషీకృతమగుచుండెను. సదాచారులగు ఆ మహర్షులు వారాణసీనగరమునకు సమీపములో తమ మకామును ఏర్పాటు చేసుకొని ధర్మమును విస్తరిల్లజేసిరి (41). తరువాత దోషము లేని ఆ మహర్షులు సంసారబంధమునుండి విముక్తిని గోరి, పాశుపతవ్రతమును సమగ్రముగా అనుష్ఠించి, సకలమగు జ్ఞానమును, సమాధిని పొందినవారై పరమానందభాజనులైనారు (42).

వ్యాస ఉవాచ |

ఏతచ్ఛివపురాణం హి సమాప్తం హితమాదరాత్‌ | పఠితవ్యం ప్రయత్నేన శ్రోతవ్యం చ తథైవ హి || 43

నాస్తికాయ న వక్తవ్యమశ్రద్ధాయ శఠాయ చ | అభక్తాయ మహేశస్య తథా ధర్మధ్వజాయ చ || 44

ఏతచ్ఛ్రుత్వా హ్యేకవారం భ##వేత్పాపం హి భస్మసాత్‌ | అభక్తో భక్తిమాప్నోతి భక్తో భక్తి సమృద్ధిభాక్‌ || 45

పునః శ్రుతే చ సద్భక్తిర్ముక్తిస్స్యాచ్చ శ్రుతే పునః | తస్మాత్పునః పునశ్చైవ శ్రోతవ్యం హి ముముక్షుభిః || 46

పంచావృత్తిః ప్రకర్తవ్యా పురాణస్యాస్య సద్ధియా | పరం ఫలం సముద్దిశ్య తత్ర్పాప్నోతి న సంశయః || 47

పురాతనాశ్చ రాజానో విప్రా వైశ్యాశ్చ సత్తమాః | సప్తకృత్వస్తదావృత్త్యాలభంత శివదర్శనమ్‌ || 48

శ్రోష్యత్యథాపి యశ్చేదం మానవో భక్తితత్పరః | ఇహ భుక్త్వాఖిలాన్‌ భోగానంతే ముక్తిం లభేచ్చ సః || 49

ఏతచ్ఛివపురాణం హి శివస్యాతి ప్రియం పరమ్‌ | భుక్తి ముక్తిప్రదం బ్రహ్మసంమితం భక్తివర్ధనమ్‌ || 50

ఏతచ్ఛివపురాణస్య వక్తుః శ్రోతుశ్చ సర్వదా | సగణస్ససుతస్సాంబశ్శం కరోతు స శంకరః || 51

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శ్రీ శివపురాణమాహాత్మ్యవర్ణనం నామ ఏకచత్వారింశో%ధ్యాయః (41).

వ్యాసుడు ఇట్లు పలికెను -

హితకరమగు ఈ శివపురాణము సమాప్తమైనది. దీనిని ఆదరముతో ప్రయత్నపూర్వకముగా పఠించవలెను, మరియు అదే విధముగా వినవలెను (43). నాస్తికునకు, శ్రద్ధ లేనివానికి, మోసగానికి, మహేశ్వరుని భక్తుడు కానివానికి, బడాయి కొరకు ధర్మమును చేయువానికి దీనిని చెప్పరాదు (44). దీనినిఒకసారి విన్నచో పాపము భస్మమగును. భక్తి లేనివానికి భక్తి కలుగును. భక్తి గలవానికి భక్తి సమృద్ధమగును (45). మరల విన్నచో మంచి భక్తి, ఇంకోసారి విన్నచో ముక్తి కలుగును. కావున మోక్షమును కోరువారు దీనిని పలుమార్లు వినవలెను (46). పరమఫలమగు మోక్షమును ఉద్దేశించి సాధకుడు పవిత్రమగు బుద్ధితో ఈ పురాణమును అయిదు సార్లు ఆవృత్తి చేయవలెను. అట్లు చేసినవానికి ఆ ఫలము నిస్సందేహముగా లభించును (47). పూర్వకాలీనులగు రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు మరియు ఇతరులగు పుణ్యాత్ములు దీనిని ఏడు సార్లు ఆవృత్తి చేసి శివుని దర్శనమును పొందిరి (48). ఇంతేగాక, ఏ మానవుడైతే దీనిని భక్తితో నిండిన హృదయము గలవాడై వినునో, ఆతడు ఇహలోకములో సకలభోగములను అనుభవించి, అంతములో ముక్తిని పొందును (49). భుక్తిని ముక్తిని ఇచ్చునది, వేదముతో సమానమైనది, భక్తిని వర్థిల్లజేయునది అగు ఈ శివపురాణము శివునకు పరమప్రియమైనది (50). ఈ శివపురాణమును చెప్పినవానికి మరియు విన్నవానికి, గణములతో పుత్రులతో మరియు పార్వతితో కూడియుండే శంకరుడు సర్వకాలములలో మంగళమును కలిగించు గాక ! (51)

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శ్రీ శివపురాణమాహాత్మ్యమును వర్ణించే నలుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

ఇతి శమ్‌.

శ్రీ శివమహాపురాణము ముగిసినది.

శ్రీసాంబసదాశివార్పణమస్తు

శ్రీకృష్ణార్పణమస్తు

సర్వే జనాస్సుఖినో భవంతు

Siva Maha Puranam-4    Chapters