Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టత్రింశోధ్యాయః

యోగాభ్యాస నియమములు - యోగసిద్ధులు

ఉపమన్యురువాచ |

ఆలస్యం వ్యాధయస్తీవ్రాః ప్రమాదః స్థానసంశయః | అనవస్థితచిత్తత్వమశ్రద్ధా భ్రాంతిదర్శనమ్‌ || 1

దుఃఖాని దౌర్మనస్యం చ విషయేషు చ లోలతా | దశైతే యుంజతాం పుంసామంతరాయాః ప్రకీర్తితాః || 2

ఆలస్యమలసత్వం తు యోగినాం దేహచిత్తయోః | ధాతువైషమ్యజా దోషా వ్యాధయః కర్మదోషజాః || 3

ప్రమాదో నామ యోగస్య సాధనానామభావనా | ఇదం వేత్యుభయాక్రాంతం విజ్ఞానం స్థానసంశయః || 4

అప్రతిష్ఠా హి మనసస్త్వనవస్థితి రుచ్యతే | అశ్రద్ధా భావరహితా వృత్తిర్వై యోగవర్త్మని || 5

విపర్యస్తా మతిర్యా సా భ్రాంతిరిత్యభిధీయతే | దుఃఖమజ్ఞానజం పుంసాం చిత్తస్యాధ్యాత్మికం విదుః || 6

ఆధిభౌతికమంగోత్థం యచ్చ దుఃఖం పురా కృతైః | ఆధిదైవికమాఖ్యాతమశన్యస్త్రవిషాదికమ్‌ || 7

ఇచ్ఛావిఘాతజం మోక్షం దౌర్మనస్యం ప్రచక్షతే | విషయేషు విచిత్రేషు విభ్రమస్తత్ర లోలతా || 8

శాంతేష్వేతేషు విఘ్నేషు యోగాసక్తస్య యోగినః | ఉపసర్గాః ప్రవర్తంతే దివ్యాస్తే సిద్ధిసూచకాః || 9

ఉపమన్యువు ఇట్లు పలికెను -

ఆలస్యము, తీవ్రమగు వ్యాధులు, ప్రమాదము, స్థానసంశయము, అనవస్థితచిత్తత్వము, అశ్రద్ధ, భ్రాంతిదర్శనము (1), దుఃఖములు, దౌర్మనస్యము, విషయములయందు లోలత్వము అనే పది యోగమునభ్యసించు సాధకులకు ఆటంకములని చెప్పబడినవి (2). యోగులకు మనస్సునకు మరియు దేహమునకు ఉండే సోమరితనమే ఆలస్యము అనబడును. శరీరములోని ధాతువులలో హెచ్చుతగ్గులు కలుగుట వలన వచ్చే శరీరదోషములు వ్యాధులు. ఇవి చెడుకర్మల వలన కలుగును (3). యోగసాధనములపై మనస్సులో సావధానత లేకపోవుటయే ప్రమాదము అనబడును. ఇది ఇట్లు అవునా, కాదా అనే రెండు వైపులకు ఊగే బుద్ధిస్థితికి స్థానసంశయమని పేరు (4). మనస్సు ఒక చోట స్థిరముగా నిలబడ లేకపోవుట అనవస్థితి అనబడును. యోగమార్గమునందు ప్రీతి, ఆసక్తి లేని మానసికస్థితికి అశ్రద్ధ అని పేరు (5). ఒక దానిని చూచి మరియొకటిగా తెలుసుకొనుట భ్రాంతి అనబడును. మానవునకు అజ్ఞానము వలన మనస్సులో కలిగే కష్టము ఆధ్యాత్మిక దుఃఖమనబడును (6). పూర్వములో చేసిన పాపకర్మల వలన శరీరములో వ్యాధి వచ్చి దాని వలన కలిగే దుఃఖము ఆధిభౌతికమనబడును. పిడుగుపాటు, ఇతరులు ప్రయోగించిన ఆయుధములు, విషము మొదలగు వాటి వలన కలిగే దుఃఖము ఆధిదైవికమనబడును (7). కోరిన కోరిక భగ్నమగుట వలన మనస్సులో కలిగే క్షేభకు దౌర్మనస్యమని పేరు. రకరకముల ఇంద్రియభోగములయందు మనస్సు తిరుగాడుచుండుట లోలత్వమనబడును (8). యోగమునందు ఆసక్తిగల యోగికి ఈ విఘ్నములు తొలగిపోగానే యోగసిద్ధిని సూచించే దివ్యములగు ఉపసర్గములు (మోక్షమునకు విఘ్నములు) అరంభమగును (9).

ప్రతిభా శ్రవణం వార్తా దర్శనాస్వాదవేదనాః | ఉపసర్గాష్షడిత్యేతే వ్యయే యోగస్య సిద్ధయః || 10

సూక్ష్మే వ్యవహితే%తీతే విప్రకృష్టే త్వనాగతే | ప్రతిభా కథ్యతే యో%ర్థే ప్రతిభాసో యథాతథమ్‌ || 11

శ్రవణం సర్వశబ్దానాం శ్రవణ చాప్రయత్నతః | వార్తా వార్తాసు విజ్ఞానం సర్వేషామేవ దేహినామ్‌ || 12

దర్శనం నామ దివ్యానాం దర్శనం చాప్రయత్నతః | తథాస్వాదశ్చ దివ్యేషు రహేష్వాస్వాద ఉచ్యతే || 13

స్పర్శనాధిగమస్తద్వద్వేదనా నామ విశ్రుతా | గంధాదీనాం చ దివ్యానామాబ్రహ్మ భూవనాధిపాః || 14

సంతిష్టంతే చ రత్నాని ప్రయచ్ఛంతి బహూని చ | స్వచ్ఛందమధురా వాణీ వివిధాస్యాత్ర్పవర్తతే || 15

రసాయనాని సర్వాణి దివ్యాశ్చౌషధయస్తథా | సిధ్యంతి ప్రణిపత్యైనం దిశంతి సురయోషితః || 16

యోగసిద్ధ్యైకదేశే%పి దృష్టే మోక్షే భ##వేన్మతిః | దృష్టమేతన్మయా యద్వత్తద్వన్మోక్షో భ##వేదితి |. 17

కృశతా స్థూలతా బాల్యం వార్ధక్యం చైవ ¸°వనమ్‌ | నానాచాతిస్వరూపం చ చతుర్ణాం దేహధారణమ్‌ || 18

పార్థివాంశం వినా నిత్యం సురభిర్గంధసంగ్రహః | ఏవమష్టగుణం ప్రాహుః పైశాచం పార్థివం పదమ్‌ || 19

ప్రతిభ, శ్రవణము, వార్త, దర్శనము, ఆస్వాదనము, వేదనము అనే ఆరు యోగిసిద్ధులరూపములోని ఉపసర్గములు యోగము నశించుటకు హేతువులు అగును (10). సూక్ష్మము, మరియొక వస్తువుచే కప్పబడి యున్నది, గడచి పోయినది, చాల దూరములో నున్నది, ఇంకనూ ఉదయించనిది అగు పదార్థమును గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలియుచుండుట ప్రతిభ అనబడును (11). వినే ప్రయత్నమును చేయకుండగనే శబ్దములన్నియు వినబడుట శ్రవణమనబడును. సమస్తప్రాణుల విషయమును గురించిన జ్ఞానమునకు వార్త అని పేరు (12). ప్రయత్నము లేకుండగనే దివ్య (దేవలోకమునందలి) వస్తువులు కనబడుట దర్శనమనబడును. అదే విధముగా దివ్యమగు రుచులను ఆస్వాదించుట అస్వాదనమనబడును (13). అదే విధముగా, దివ్యమగు స్పర్శలు తెలియుచుండుట, దివ్యమగు గంధములను ఆఘ్రాణించగల్గుట వేదన అనబడును. బ్రహ్మతో మొదలిడి లోకపాలకుల వరకు అందరు యోగసిద్ధిని పొందిన వ్యక్తి యెదుట నిలబడి అనేకములగు శ్రేష్ఠవస్తువులను ఇచ్చెదరు. యోగికి తన ఇచ్ఛననుసరించి నోటినుండి రకరకముల మధురమగు మాటలు దొర్లుచుండును (14,15). సకలరసాయనములు, దివ్యములగు ఓషధులు అతనికి సిద్ధించును. దేవతాస్త్రీలు ఈతనికి నమస్కరించి మనోభీష్టములనిచ్చెదరు (16). యోగసిద్ధులలో కొంచెము అనుభవమునకు వచ్చిననూ, అట్టి సాధకునకు మోక్షమునందు శ్రద్ధ కలుగును. ఈ సిద్ధి నాకు ఏ విధముగా కలిగినదో, అదే విధముగా మోక్షము కూడ కలుగుననే విశ్వాసము నిర్మాణమగును (17). చిక్కియుండుట, లావుగా నుండుట, బాల్యము, వృద్ధాప్యము, ¸°వనము, అనేకజాతులకు చెందిన రూపములను ధరించుట, పృథివి జలము అగ్ని వాయువు అనే నాలుగు తత్త్వముల దేహమును ధరించుట (18), గంధవతియగు పృథివియొక్క అంశము లేకుండగనే నిత్యము పరిమళభరితమగు గంధమును అఘ్రాణించుట అనే ఈ ఎనిమిది పృథివీ తత్త్వమునకు చెందిన సిద్ధులకు పైశాచపదము అని పేరు (19).

జలే నివసనం చైవ భూమ్యామేవం వినిర్గమః | ఇచ్ఛేచ్ఛక్తస్స్వయం పాతుం సముద్రమపి నాతురః || 20

యత్రేచ్ఛతి జగత్యస్మింస్తత్రైవ జలదర్శనమ్‌ | వినా కుంభాదికం పాణౌ జలసంచయధారణమ్‌ || 21

యద్వస్తు విరసం చాపి భోక్తుమిచ్ఛతి తత్‌క్షణాత్‌ | రసాదికం భ##వేచ్చాన్యత్త్రయాణాం దేహధారణమ్‌ || 22

నిర్ర్వణత్వం శరీరస్య పార్థివైశ్చ సమన్వితమ్‌ | తదిదం షోడశగుణమప్యమైశ్వర్యమద్భుతమ్‌ || 23

శరీరాదగ్నినిర్మాణం తత్పాపభయవర్జితమ్‌ | శక్తిర్జగదిదం దగ్ధుం యదీచ్ఛేదప్రయత్నతః || 24

స్థాపనం వానలస్యా%ప్సు పాణౌ పావకధారణమ్‌ | దగ్ధే సర్గే యథాపూర్వం ముఖే చాన్నాదిపాచనమ్‌ |

ద్వాభ్యాం దేహవినిర్మాణమాపై#్యశ్వర్య సమన్వితమ్‌ || 25

ఏతచ్చతుర్వింశతిధా తైజసం పరిచక్షతే | మనోజవత్వం భూతానాం క్షణాదంతః ప్రవేశనమ్‌ || 26

పర్వతాదిమహాభారధారణం చాప్రయత్నతః | గురుత్వం చ లఘుత్వం చ పాణావనిలధారణమ్‌ || 27

అంగుల్యగ్రనిపాతాద్యైర్భూమేరపి చ కంపనమ్‌ | ఏకేన దేహనిష్పత్తిర్యుక్తం భోగైశ్చ తైజసైః || 28

ద్వాత్రింశద్గుణమైశ్వర్యం మారుతం కవయో విదుః |

నీటిలో నివసించుట, నేలయందు నీరు బయటకు వచ్చునట్లు చేయుట, తనకు ఇచ్ఛ కలిగినచో, ఇబ్బంది లేకుండగా సముద్రమునైననూ స్వయముగా త్రాగివేసే శక్తిని కలిగియుండుట (20). ఈ జగత్తులో ఎక్కడ కావాలని కోరుకుంటే అక్కడ నీరు దొరుకునట్లు చేయుట, కడవ మొదలగునవి లేకుండగనే చేతిలో చాల నీటిని ధరించి యుండుట (21), ఏ ఆహారపదార్థమునందు రుచి లేదో దానిని తినాలనే కోరిక కలుగగానే వెంటనే దానియందు రసము మార్దవము మొదలగు గుణములు ఆవిర్భవించునట్లు చేయుట, జలము అగ్ని వాయువు అనే మూడు తత్త్వముల దేహమును ధరించగల్గుట (22), శరీరమునకు గాయము కాకుండుట, పృథివీతత్త్వమునకు చెందిన ఎనిమిది సిద్ధులను కూడ కలిగియుండుట అనే ఈ అద్భుతమగు పదహారు సిద్ధులకు జలతత్త్వమునకు చెందిన ఐశ్వర్యమని పేరు (23). శరీరమునుండి నిప్పును పుట్టించుట, నిప్పు వేడికి భయపడకుండుట, కోరినచో ఈ జగత్తును ప్రయత్నము లేకుండగనే తగులబెట్టే శక్తిని కలిగి యుండుట (24). నిప్పు నీటియందు కూడ స్థిరముగా నుండునట్లు చేయుట, చేతిలో నిప్పును ధరించుట, తగులబడిన వస్తువు మరల యథాతథముగా తయారగునట్లు చేయుట, నోటియందు అన్నము మొదలగు వాటిని వండుట, అగ్ని వాయువు అనే రెండు తత్త్వముల దేహమును ధరించగల్గుట, వీటికి తోడు జలసంబంధి పదహారు సిద్ధులను కూడ కలిగియుండుట (25) అనే ఈ ఇరువది నాలుగు సిద్ధులు తైజస-ఐశ్వర్యమనబడును. మనస్సుతో సమానమగు వేగమును కలిగియుండుట, క్షణములో ప్రాణుల లోపల ప్రవేశించుట (26), పర్వతము మొదలగు అతి పెద్ద బరువులను సునాయాసముగా ఎత్తగల్గుట, బరువు అగుట, తేలిక అగుట చేతితో గాలిని పట్టుకొనుట (27), వ్రేలి కొనతో పొడుచుట మొదలగు స్వల్పప్రయత్నముచే భూమిని కంపింప జేయుట, వాయువు అనే ఒకే తత్త్వముయక్క దేహమును ధరించుట, ఇరువది నాలుగు తైజససిద్ధులను కూడ కలిగియుండుట (28) అనే ఈ ముప్పది రెండు రకముల సిద్ధులు మారుత-ఐశ్వర్యమని విద్వాంసులు చెప్పుచున్నారు.

ఛాయాహీనవినిష్పత్తిరింద్రియాణామదర్శనమ్‌ || 29

ఖేచరత్వం యథాకామమింద్రియార్థసమన్వయః | ఆకాశలంఘనం చైవ స్వదేహే తన్నివేశనమ్‌ || 30

ఆకాశపిండీ కరణమశరీరత్వమేవ చ | అనిలైశ్వర్యసంయుక్తం చత్వారింశద్గుణం మహత్‌ || 31

ఐంద్రమైశ్వర్యమాఖ్యాతమాంబరం తత్ర్పచక్షతే | యథాకామోపలబ్ధిశ్చ యథాకామవినిర్గమః || 32

సర్వస్యాభిభవశ్చైవ సర్వగుహ్యార్థదర్శనమ్‌ | కర్మానురూపనిర్మాణం వశిత్వం ప్రియదర్శనమ్‌ || 33

సంసారదర్శనం చైవ భోగైరైంద్రైస్సమన్వితమ్‌ | ఏతచ్చాంద్రమసైశ్వర్యం మానసం గుణతో%ధికమ్‌ || 34

ఛేదనం తాడనం చైవ బంధనం మోచనం తథా | గ్రహణం సర్వభూతానాం సంసారమువర్తినామ్‌ || 35

ప్రసాదశ్చాపి సర్వేషాం మృత్యుకాలజయస్తథా | ఆభిమానికమైశ్వర్యం ప్రాజాపత్యం ప్రచక్షతే || 36

ఏతచ్చాంద్రమసైర్భోగైష్షట్పంచాశద్గుణం మహత్‌ | సర్గస్సంకల్పమాత్రేణ త్రాణం సంహరణం తథా || 37

స్వాధికారశ్చ సర్వేషాం భూతచిత్తప్రవర్తనమ్‌ | అసాదృశ్యం చ సర్వస్య నిర్మాణం జగతః పృథక్‌ || 38

శుభాశుభస్య కరణం ప్రాజాపత్యైశ్చ సంయుతమ్‌ | చతుష్షష్టిగుణం బ్రాహ్మమైశ్వర్యం చ ప్రచక్షతే || 39

శరీరమునకు నీడ లేకుండట, ఇంద్రియములు ఇతరులకు కానరాకుండుట (29), తనకు నచ్చిన చోటికి ఆకాశమార్గమునందు వెళ్లగల్గుట, ఇంద్రియములకు సమస్తవిషయములతో సమన్వయము కలుగుట, ఆకాశమును లంఘించుట, తన శరీరములో ఆకాశమును నిక్షేపించుట (30), ఆకాశమును ముద్దగా చేయుట, శరీరము లేనివాడుగా అగుట, మారుత-ఐశ్వర్యములను కూడ కలిగియుండుట అనే నలభై సిద్ధులు గల ఈ గొప్ప ఐశ్వర్యము (31) ఐంద్ర ( ఇంద్రునకు చెందిన)-ఐశ్వర్యమనియు, అంబర (ఆకాశమునకు చెందిన- ఐశ్వర్యమనియు అనబడునని విద్వాంసులు చెప్పుచున్నారు. కోరుకున్న వస్తువు లభించుట, కోరుకున్న స్థలమునకు వెళ్లుట (32), సర్వులను తిరస్కరించుట, సకలరహస్యములను చూడగల్గుట, కర్మకు తగ్గ దేహమును నిర్మించుట, ఇతరులను వశము చేసుకొనుట, ప్రీతిని కలిగించే రూపమును కలిగియుండుట (ప్రీతిని కలిగించే వస్తువులను దర్శించుట) (33), ఒకచోట నిలబడి జగత్తునంతనూ చూడగల్గుట అను సిద్ధులు ఐంద్ర సిద్ధులతో కలిసి చాంద్రమస-ఐశ్వర్యమగును. గుణములలో పైన చెప్పిన ఐశ్వర్యముల కంటె గొప్పది అగు ఈ ఐశ్వర్యమునకు మానస ఐశ్వర్యమనియు పేరు గలదు (34). తెగగొట్టుట, కొట్టుట, కట్టివేయుట, విడిపించుట, సంసారమునకు వశులై ఉండే సర్వప్రాణులను పట్టుకొనుట (35), సర్వులను అనుగ్రహించే శక్తి, మృత్యువును కాలమును జయించుట అనే అహంకారమునకు సంబంధించిన ఈ ఐశ్వర్యమునకు ప్రాజాపత్య-ఐశ్వర్యమని పేరు (36). ఈ గొప్పఐశ్వర్యమునందు చాంద్రమస-సిద్ధులతో కలిసి ఏభై ఆరు సిద్ధులు గలవు. సంకల్పమాత్రముచే సృష్టిని చేయుట, రక్షించుట, సంహరించుట (37), అందరిపై తన అధికారమును చెలాయించుట, ప్రాణుల మనస్సును ప్రేరేపించుట, అందరికంటె పోలికకు అతీతుడుగ నుండుట, ఈ జగత్తు కంటె వేరుగా మరియొక జగత్తును సృష్టించగల్గుట (38), శుభమును అశుభముగను, అశుభమును శుభముగను చేయగల్గుట అనే ఈ సిద్ధులు ప్రాజాపత్యసిద్ధులతో కలిసి, అరవై నాలుగు గుణములు గల బ్రాహ్మ-ఐశ్వర్యము అగునని మహర్షులు చెప్పుచున్నారు (39).

బౌద్ధాదస్మాత్పరం గౌణమైశ్వర్యం ప్రాకృతం విదుః | వైష్ణవం తత్సమాఖ్యాతం తసై#్యవ భువనస్థితిః |

బ్రహ్మణా తత్పదం సర్వం వక్తుమన్యైర్న శక్యతే || 40

తత్పౌరుషం చ గౌణం చ గాణశు పరమైశ్వరమ్‌ | విష్ణునా తత్పదం కించిత్‌ జ్ఞాతుమన్యైర్న శక్యతే || 41

విజ్ఞాన సిద్ధయశ్చైవ సర్వా ఏవౌపసర్గికాః | నిరోద్ధవ్యా ప్రయత్నేన వైరాగ్యేణ పరేణ తు || 42

ప్రతిభాసేష్వశుద్ధేషు గుణష్వాసక్తచేతసః | న సిద్ధ్యేత్పరమైశ్వర్యమభయం సార్వకామికమ్‌ || 43

తస్మాద్గుణాంశ్చ భోగాంశ్చ దేవాసురమహీభృతామ్‌ | తృణవద్యస్త్యజేత్తస్య యోగసిద్ధిఃపరా భ##వేత్‌ || 44

అథవానుగ్రహేచ్ఛాయాం జగతో విచరేన్మునిః | యథాకామం గుణాన్‌ భోగాన్‌ భుక్త్వా ముక్తిం ప్రయాస్యతి || 45

అథ ప్రయోగం యోగస్య వక్ష్యే శృణు సమాహితః | శుభే కాలే శుభే దేశే శివక్షేత్రాదికే పునః |

విజనే జంతురహితే నిశ్శబ్దే బాధవర్జితే || 46

సుప్రలిప్తే స్థలే సౌమ్యే గంధధూపాదివాసితే | ముక్తపుష్పసమాకీర్ణే వితానాదివిచిత్రితే || 47

కుశపుష్పసమిత్తో యఫలమూలసమన్వితే | నాగ్న్యభ్యాశే జలాభ్యాశే శుష్కపర్ణచయే%పి వా || 48

న దంశమశకాకీర్ణే సర్పశ్వాపదసంకులే | న చ దుష్టమృగాకీర్ణే న భ##యే దుర్జనావృతే || 49

శ్మశానే చైత్యవల్మీకే జీర్ణాగారే చతుష్పథే | నదీనదసముద్రాణాం తీరే రథ్యాంతరే%పి వా || 50

న జీర్ణోద్యానగోష్ఠాదౌ నానిష్టే న చ నిందితే | న జీర్ణావ్లురసోద్గారే న చ విణ్మూత్రదూషితే || 51

నచ్ఛర్ద్యామాతిసారే వా నాతిభుక్తౌ శ్రమాన్వితే | న చాతిచింతాకులితో న చాతిక్షుత్పిపాసితః || 52

నాపి స్వగురుకర్మాదౌ ప్రసక్తో యోగమాచరేత్‌ |

బ్రాహ్మ-ఐశ్వర్యమునకు బౌద్ద-ఐశ్వర్యమనియు పేరు. దీనికంటె గౌణ-ఐశ్వర్యము గొప్పది. దానికే ప్రాకృత-ఐశ్వర్యమనియు, వైష్ణవ-ఐశ్వర్యమనియు పేరు. ముల్లోకముల రక్షణ దానిలో భాగమే. ఆ వైష్ణవపదము యొక్క మహిమను పూర్తిగా బ్రహ్మ మాత్రమే వర్ణించి చెప్పవలెను. ఇతరులు చెప్పలేరు (40). దానికి పౌరుష (పురుషునకు అనగా విష్ణువునకు చెందినది) ఐశ్వర్యమనియు పేరు. ఈ గౌణ-ఐశ్వర్యము కంటె గాణశ (గణపతికి చెందిన) ఐశ్వర్యము శ్రేష్ఠమైనది. ఆ గాణశపదమును విష్ణువు తక్క ఇతరులు తెలియజాలరు (41). బౌద్ధసిద్ధులు అన్నియు మోక్షమునకు ఆటంకములే. కావున, సాధకుడు ప్రయత్నపూర్వకముగా పరమవైరాగ్యమును ఆశ్రయించి వాటికి దూరముగా నుండవలెను (42). మిథ్యారూపములు, (సంగ) దోషముతో కూడినవి అగు సిద్ధులయందు లగ్నమైన మనస్సు గలవానికి సకలకామనలను ఈడేర్చే పరమైశ్వర్యరూపమగు అభయస్థానము (మోక్షము) సిద్ధించదు (43). కావున, ఎవడైతే ఈ సిద్ధులతో బాటు దేవతల, రాక్షసుల మరియు రాజుల భోగములను కూడ గడ్డిపోచను వలె విడిచి పెట్టునో, వానికి మాత్రమే సర్వోత్కృష్టమగు యోగసిద్ధి కలుగును (44). అట్లు గాక, మననశీలుడగు యోగి లోకమును అనుగ్రహించే కోరిక గలవాడైనచో, లోకసంచారమును చేయవలెను. అతడు యథేచ్ఛగా సిద్ధులను, భోగములను అనుభవించి, ముక్తిని పొందగలడు (45). ఈ పైన యోగమును అభ్యసించే పద్ధతిని చెప్పెదను. సావధానముగా వినుము. శుభముహుర్తమునందు, శివక్షేత్రము మొదలైన శుభస్థానములో, జనసమ్మర్దము లేని చోట, జంతువులు సంచరించని చోట, శబ్దకాలుష్యము లేనిచోట, బాధలు కలిగే అవకాశము లేనిచోట (46), చక్కగా అలికినది, చూడగానే మనస్సునకు ప్రసన్నతను కలిగించునది, సుగంధద్రవ్యములచే మరియు ధూపముచే పరిమళముతోనిండియున్నది, రాలిన పుష్పములు దట్టముగా చల్లబడినది, రంగు రంగుల చాందినీ (మేలుకట్టు) కట్టబడినది (47), దర్భలు పుష్పములు సమిధలు నీరు పళ్లు దుంపలు అను ద్రవ్యములు సమృద్ధిగా గలది అగు స్థానములో యోగమునభ్యసించ వలెను. అగ్నికి నీటికి దగ్గరలో గాని, ఎండుటాకుల రాశిపై గాని, దోమలు ఈగలు పాములు క్రూరమృగములు దుష్టపశువులు దుర్జనులు అధికముగా నివసించే స్థానములో గాని, భయమును గొలిపే స్థలములో గాని, శ్మశానములో గాని, రచ్చచెట్టు క్రింద గాని, పాము పుట్ట వద్దగాని, పాడుపడ్డ ఇంటిలో గాని, నాలుగు రోడ్ల కూడలిలో గాని, నదులు నదములు సముద్రము అను వాటి తీరములయందు గాని, మార్గమధ్యములో గాని, పాడుపడిన ఉద్యానవనములో గాని, గోశాల మొదలగు స్థలములయందు గాని, ప్రీతికరము కాని స్థలమునందు గాని, నిందితమగు స్థలమునందు గాని, నిందితమగు స్థలమునందు గాని యోగమును అభ్యసించరాదు. అజీర్ణము చేసి,కడుపులో ఆవ్లుము ఎక్కువైపైకి వచ్చే స్థితిలో, శరీరము మలమూత్రములచే దూషితమై యున్న స్థితిలో సాధకుడు యోగమును అభ్యసించరాదు (48-51). రొంప పట్టినప్పుడు, అతిసారవ్యాధిలో, భోజనము అధికమై శ్రమగా నున్నప్పుడు, మనస్సు చింతతో అల్లకల్లోలముగా నున్నప్పుడు, ఆకలి దప్పికలు అధికముగా నున్నప్పుడు (52), సాధకుడు తన గురువు గారి పనులు మొదలగు వాటిలో నిమగ్నమై యున్నప్పుడు యోగమును అభ్యసించరాదు.

యుక్తాహారవిహారశ్చ యుక్తచేష్టశ్చ కర్మసు || 53

యుక్తనిద్రాప్రబోధశ్చ సర్వాయాసవిరవర్జితః | ఆసనం మృదులం రమ్యం విపులం సుసమం శుచి || 54

పద్మకస్వస్తికాదీనామభ్యసేదాసనేషు చ | అభివంద్య స్వగుర్వంతాన భివాద్యాననుక్రమాత్‌ || 55

ఋజుగ్రీవశిరోవక్షా నాతిష్ఠేచ్ఛిష్టలోచనః | కించిదున్నామితశిరా దంతైర్దంతాన్న సంస్పృశేత్‌ || 56

దంతాగ్రసంస్థితాం జిహ్వామచలాం సన్నివేశ్య చ | పార్‌ ష్ణిభ్యాం వృషణౌ రక్షంస్తథా ప్రజననం పునః || 57

ఊర్వోరుపరి సంస్థాప్య బాహూ తిర్యగయత్నతః | దక్షిణం కరపృష్ఠం తు న్యస్య వామతలోపరి || 58

ఉన్నమ్య శనకైః పృష్ఠమురో విష్టభ్య చాగ్రతః | సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్‌ || 59

సంభృతప్రాణసంచారః పాషాణ ఇవ నిశ్చలః | స్వదేహాయతనస్యాంతర్విచింత్య శివమంబయా|| 60

హృత్పద్మపీఠికామధ్యే ధ్యానయజ్ఞేన పూజయేత్‌ |

సాధకుడు యోగ్యమగు (ఉచితము మరియు పరిమితము అగు) ఆహారము మరియు విహారము గలవాడై, కర్మల విషయములో సముచితమగు చేష్టను చేయుచూ (53), ఉచితమగు సమయములలో నిద్రించి మేల్కొంటూ, బరువు పనులను పూర్తిగా విడిచి పెట్టి, మెత్తనిది అందమైనది సరిసమానముగా నున్నది శుద్ధమైనది అగు ఆసనముపై , యోగాసనములలో పద్మక, స్వస్తిక మొదలగు ఆసనములను అభ్యసించవలెను. హిరణ్యగర్భునితో మొదలిడి తన గురువు వరకు గల గురుపరంపరకు వరుసగా నమస్కరించి (54, 55), మెడ తల వక్షఃస్థలము అనువాటిని తిన్నగా నుంచి, తలను మాత్రము కొంచెము పైకి ఎత్తి అభ్యసించవలెను. కళ్లను అధికముగా మూస్తూ తెరుస్తూ యోగముననుష్ఠించరాదు. పళ్లకు పళ్లు తగులరాదు (56). నాలుకను దంతముల కొనల వద్ద స్థిరముగా కదలిక లేకుండగా నుంచవలెను. కాలి మడమలతో అండములను జననేంద్రియమును రక్షించుకొని యోగమును అభ్యసించవలెను (57). చేతులను తొడలపై అడ్డముగా నొక్కకుండగా ఉంచి, కుడిచేతి వెనుక భాగమును ఎడమ అరచేతిలోనుండి (58), నడుమును మెల్లగా పైకి లేపి వక్షఃస్థలమును ముందుకు విరిచిపెట్టి, తన ముక్కు కొనను చూస్తూ, దిక్కులు చూడకుండగా (59), నడుమును మెల్లగా పైకి లేపి వక్షఃస్థలమును ముందుకు విరిచిపెట్టి, తన ముక్కు కొనను చూస్తూ, దిక్కులు చూడకుండగా (59), ప్రాణవాయుసంచారమును నియంత్రించి, రాయి వలె కదలిక లేనివాడై, తన దేహము అనే దేవాలయములోపల పార్వతీసమేతుడగు శివుని హృదయపుండరీకమునకు మధ్యభాగములో స్మరిస్తూ (60), ఈ విధమగు ధ్యానయజ్ఞముతో ఆయనను ఆరాధించవలెను.

మూలే నాసాగ్రతో నాభౌ కంఠే వా తాలురంధ్రయోః || 61

భ్రూమధ్యే ద్వారదేశే వా లలాటే మూర్ధ్ని వా స్మరేత్‌ | పరికల్ప్య యథాన్యాయం శివయోః పరమాసనమ్‌ || 62

తత్ర సావరణం వాపి నిరావరణమేవ వా | ద్విదలే షోడశారే వా ద్వాదశారే యథావిధి || 63

దశారే వా షడస్రే వా చతురస్రే శివం స్మరేత్‌ | భ్రువోరంతరతః పద్మం ద్విదలం తడిదుజ్జ్వలమ్‌ || 64

భ్రూమధ్యస్థారవిందస్య క్రమాద్వై దక్షిణోత్తరే | విద్యుత్సమానవర్ణే చ పర్ణే వర్ణావసానకే || 65

షోడశారస్య పత్రాణి స్వరాష్షోడశ తాని వై | పూర్వాదీని క్రమాదేతత్పద్మం కందస్య మూలతః || 66

కకారాదిటకారాంతాం వర్ణాః పర్ణాన్యనుక్రమాత్‌ | భానువర్ణస్య పద్మస్య ధ్యేయం తద్ధృదయాంతరే || 67

గోక్షీరధవలస్యోక్తా డాదిఫాంతా యథాక్రమమ్‌ | అధో దలస్యాంబుజస్య ఏతస్య చ దలాని షట్‌ || 68

విధూమాంగారవర్ణస్య వర్ణా వాద్యాశ్చ లాంతిమాః | మూలాధారారవిందస్య హేమాభస్య యథాక్రమమ్‌ |

వకారాదిసకారాంతా వర్ణాః పర్ణమయాః స్థితాః || 69

ఏతేష్వథారవిందేషు యత్రైవాభిరతం మనః | తత్రైవ దేవం దేవీం చ చింతయేద్ధీరయా ధియా || 70

మూలాధారమునందు గాని,ముక్కు కొనయందు గాని, నాభియందు గాని, కంఠమునందు గాని, అంగుడియొక్క రెండు రంధ్రములయందు గాని (61), కనుబొమ్మల మధ్యలో గాని, ముక్కుపుటముల వద్ద గాని, లలాటమునందు గాని, శిరస్సునందు గాని శివుని స్మరించవలెను. యథావిధిగా పార్వతీపరమేశ్వరులకు శ్రేష్ఠమగు ఆసనమును (భావనలో) ఏర్పాటు చేసి (62) , ఆవరణసహితముగా గాని, లేదా ఆవరణములు లేకుండగా గాని, శివుని స్మరించవలెను. రెండు, నాలుగు, ఆరు, పది , పన్నెండు, లేదా పదునారు దళముల పద్మమునందు యథావిధిగా శివుని స్మరించవలెను. కనుబొమ్మల మధ్య రెండు దళముల గలది, మెరుపు వలె ప్రకాశించునది అగు పద్మము గలదు (63, 64). కనుబొమల మధ్యగల ఈ పద్మమునకు ఉత్తరదక్షిణముల యందుమెరుపు తో సమానమగు కాంతిగల రెండు ఆకులు గలవు. వాటియందు అంతిమవర్ణములగు హ క్ష అనునవి చిహ్నములుగా నున్నవి (65). పదునారు దళముల పద్మమునకు పదునారు ఆకులు గలవు. వాటియందు అ తో మొదలుపెట్టి అః వరకు పదునారు అచ్చులు చిహ్నితములై యున్నవి. ఈ పద్మమునకు మూలములో దుంప గలదు. దానిని అనుసరించి సూర్యుని వలె ప్రకాశించే పద్మము గలదు. దాని ఆకులయందు క తో మొదలు పెట్టి, ట వరకు అక్షరములు వరుసగా చిహ్నించబడి యున్నవి. ఆ పద్మమును హృదయమునకు మధ్యలో ధ్యానించవలెను (66, 67). దాని తరువాత ఆవుపాల వలె తెల్లనైన పద్మమును భావన చేయవలెను. దీనికి పది దళములు గలవు. ఆ దళములయందు డ తో మొదలు పెట్టి, ఫ వరకు అక్షరములు చిహ్నించబడియున్నవి. తరువాత క్రిందకు వ్రేలాడే ఆరు దళములు గల పద్మము గలదు (68). అది పొగలేని నిప్పు వలె ప్రకాశించును. దాని దళములయందు వ నుండి ల వరకు గల అక్షరములు గలవు. బంగారము వలె ప్రకాశించే మూలాధారపద్మముయొక్క ఆకులయందు వ సుండి స వరకు అక్షరములు వరుసగా చిహ్నితములై యున్నవి (69). ఈ పద్మములలో సాధకుని మనస్సునకు ఏది బాగా నచ్చితే దానియందే పార్వతీపరమేశ్వరులను స్థిరమగు బుద్ధితో ధ్యానించవలెను (70).

అంగుష్టమాత్రమమలం దీప్యమానం సమంతతః | శుద్ధదీపశిఖాకారం స్వశక్త్యా పూర్ణమండితమ్‌ || 71

ఇందురేఖాసమాకారం తారారూపమథాపి వా | నీవారశూకసదృశం బిససూత్రాభ మేవ వా || 72

కదంబగోలకాకారం తుషారకణికోపమమ్‌ | క్షిత్యాదితత్త్వవిజయం ధ్యాతా యద్యపి వాంఛతి || 73

తత్త త్తత్త్వాధిపామేవ మూర్తిం స్థూలాం విచింతయేత్‌ | సదాశివాంతాం బ్రహ్మాద్యభవాద్యాశ్చాష్టమూర్తయః || 74

శివస్య మూర్తయః స్థూలాశ్శివశాస్త్రే వినిశ్చితాః | ఘోరా మిశ్రా ప్రశాంతాశ్చ మూర్తయస్తా మునీశ్వరైః || 75

ఫలాభిలాషరహితైశ్చింత్యా శ్చింతావిశారదైః | ఘోరాశ్చే చ్చింతితాః కుర్యుః పాపరోగపరిక్షయమ్‌ || 76

చిరేణ మిశ్రే సౌమ్యే తు న సద్యో న చిరాదపి | సౌమ్యే ముక్తిర్విశేషేణ శాంతిః ప్రజ్ఞా ప్రసిధ్యతి || 77

సిధ్యంతి సిద్ధయశ్చాత్ర క్రమశో నాత్ర సంశయః || 78

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే యోగాభ్యాస పద్ధతివర్ణనం నామ అష్టత్రింశో%ధ్యాయః (38).

బొటనవ్రేలు పరిమాణము కలవాడై అంతటా ప్రకాశించుచున్నవాడు, లేదా స్వచ్ఛమగు దీపజ్వాలను పోలియున్నవాడై స్వీయశక్తితో కూడి పూర్ణముగా అలంకరించబడియున్నవాడు (71), లేదా చంద్రవంకను పోలియున్నవాడు, లేదా నక్షత్రములను పోలియున్నవాడు, లేదా నివ్వెరధాన్యపు ముల్లువలె మిక్కిలి సూక్ష్మమైనవాడు, తామరతూడులోని త్రాటివలె నున్నవాడు (72), లేదా తెల్ల ఆవాలు వలె గుండ్రముగా నున్నవాడు, లేదా మంచు కణము వలె నున్నవాడు అనే శివుని రూపములలో సాధకుడు ఏ రూపము నచ్చితే దానిని ధ్యానించవలెను. పృథివీ మొదలగు తత్త్వములపై విజయమును కోరు సాధకుడు ఆయా తత్త్వములకు అథిపతియగు దేవతయొక్క స్థూలమగు మూర్తిని ధ్యానించవలెను. బ్రహ్మతో మొదలిడి సదాశివుని వరకు గల మూర్తులు, భవుడు మొదలగు ఎనిమిది మూర్తులు (73, 74) శివుని స్థూలమూర్తులని శివశాస్త్రములో విశేషముగా నిర్ధారించబడి యున్నది. ఆ మూర్తులలో ఘోర, మిశ్ర, ప్రశాంత అనే మూడు రకములు గలవని మహర్షులు చెప్పుచున్నారు (75). ధ్యానములో నిష్ణాతులగు సాధకులు ఫలతృష్ణ లేనివారై ఈ మూర్తులను ధ్యానించవలెను. ఘోర (భయంకర) మూర్తులను ధ్యానించినచో, పాపములు రోగములు క్షయమగును (76). మిశ్ర (ఘోరసౌమ్యమూర్తుల కలయిక) మూర్తులను ధ్యానించినచో ఫలసిద్ధి వలంబమగును. ప్రసన్నమగు మూర్తిని ధ్యానించినచో, ఫలము చాల శీఘ్రముగా లేక చాల విలంబముగా కాకుండా, మధ్యవ్యవధిలో సిద్ధించును. సౌమ్యమగు మూర్తిని ధ్యానించినచో, విశేషించి మోక్షఫలము కలుగును. మరియు శాంతి, ప్రజ్ఞ సిద్ధించును (77). ఈ దేహములో నుండగానే క్రమముగా సిద్ధులు లభించుననుటలో సందేహము లేదు (78).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో ఉత్తరఖండయందు యోగాభ్యాసనియమములను, యోగసిద్ధులను వర్ణించే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).

Siva Maha Puranam-4    Chapters