Siva Maha Puranam-4    Chapters   

అథ చతుస్త్రింశో%ధ్యాయః

బ్రహ్మ విష్ణువుల వివాదము

ఉపమన్యురువాచ |

నిత్యాన్నైమిత్తికాత్కామ్యాద్యా సిద్ధిరిహ కీర్తితా | సా సర్వా లభ్యతే సద్యో లింగబేరప్రతిష్ఠయా || 1

సర్వో లింగమయో లోకస్సర్వం లింగే ప్రతిష్ఠితమ్‌ | తస్మాత్ప్రతిష్ఠితే లింగే భ##వేత్సర్వం ప్రతిష్ఠితమ్‌ || 2

బ్రహ్మణా విష్ణునా వాపి రుద్రేణాన్యేన కేన వా | లింగప్రతిష్ఠాముత్సృజ్య క్రియతే స్వపదస్థితిః || 3

కిమన్యదిహ వక్తవ్యం ప్రతిష్ఠాం ప్రతి కారణమ్‌ | ప్రతిష్ఠితం శివేనాపి లింగం వైశ్వేశ్వ రం యతః || 4

తస్మాత్సర్వప్రయత్నేన పరత్రేహ చ శర్మణ | స్థాపయేత్పరమేశస్య లింగం బేరమథాపి వా || 5

ఉపమన్యువు ఇట్లు పలికెను -

ఈ లోకములో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయుట వలన ఏ సిద్ధి లభించునని కీర్తించబడినదో, ఆ సర్వము లింగమును, శివమూర్తిని ప్రతిష్ఠించుట వలన వెనువెంటనే లభించును (1). ఈ లోకమంతయు లింగరూపుడగు శివునిచే నిండియున్నది. సర్వము లింగముచే ప్రతిపాద్యమగు శివునియందు ప్రతిష్ఠను కలిగియున్నది. కావున, లింగమును ప్రతిష్ఠించినచో, సర్వమును ప్రతిష్ఠించినట్లే యగును (2). బ్రహ్మ గాని, విష్ణువు గాని, రుద్రుడు గాని, ఇతరదేవతలు గాని లింగప్రతిష్ఠను నిర్వహించి మాత్రమే తమ తమ పదవులను నిర్వహించుచున్నారు (3). శివుడు కూడ విశ్వేశ్వర లింగమును ప్రతిష్ఠించినాడన్నచో, లింగమును ప్రతిష్ఠించి తీరవలెనని చెప్పుటకు మరియొక హేతువును దేనిని చెప్పవలయును ? (4) కావున, ఇహపరలోకములలో సుఖమును పొందుట కొరకై మానవుడు సకలవిధముల ప్రయత్నములను చేసి, లింగమును గాని, లేదా శివుని మూర్తిని గాని ప్రతిష్ఠించవలెను (5).

శ్రీకృష్ణ ఉవాచ |

కిమిదం లింగమాఖ్యాతం కథం లింగీ మహేశ్వరః |కథం చ లింగభావో%స్య కస్మాదస్మిన్‌ శివో%ర్చ్యతే || 6

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను-

లింగమనగా నేమి? మహేశ్వరుడు లింగి అగుటకు కారణమేమి? ఈ శివునకు లింగభావము ఎట్లు కలిగినది? శివుని లింగమునందు పూజించుటకు కారణమేమి? (6)

ఉపమన్యురువాచ |

అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణప్రభావాప్యయమ్‌ | అనాద్యనంతం విశ్వస్య యదుపాదానకారణమ్‌ | | 7

తదేవ మూలప్రకృతిర్మాయా చ గగనాత్మికా | తత ఏవ సముత్పన్నం జగదేతచ్చరాచరమ్‌ || 8

అశుద్ధం చైవ శుద్ధం యచ్ఛుద్దాశుద్ధం తత్త్రిధా | తతశ్శివో మహేశశ్చ రుద్రో విష్ణుః పితామహః || 9

భూతాని చేంద్రియైర్జాతా లీయంతే%త్ర శివాజ్ఞయా | అత ఏవ శివో లింగో లింగమాజ్ఞాపయేద్యతః || 10

యతో న తదనాజ్ఞాతం కార్యాయ ప్రభ##వేత్స్వతః | తతో జాతస్య విశ్వస్య తత్రైవ విలయో మతః || 11

అనేన లింగతా తస్య భ##వేన్నాన్యేన కేనచిత్‌ | లింగంచ శివయోర్దేహస్తాభ్యాం యస్మాదధిష్ఠితమ్‌ || 12

అతస్తత్ర శివస్సాంబో నిత్యమేవ సమర్చ్యతే | లింగవేదీ మహాదేవీ లింగం సాక్షాన్మ హేశ్వరః || 13

తయోస్సంపూజనాదేవ స చ సా చ సమర్చితౌ | న తయోర్లింగదేహత్వం విద్యతే పరమార్థతః || 14

యతస్త్వేతౌ విశుద్ధౌతౌ దేహస్తదుపచారతః | తదేవ పరమా శక్తిశ్శివస్య పరమాత్మనః || 15

శక్తిరాజ్ఞాం యదాదత్తే ప్రసూతే తచ్చరాచరమ్‌ | న తస్య మహిమా శక్యోవక్తుం వర్షశ##తైరపి || 16

ఉపమన్యువు ఇట్లు పలికెను -

దేనినుండి జగత్త పుట్టి, దేనియందు విలీనమగునో అట్టి సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతికి లింగమని పేరు. ఆద్యంతములు లేని ఆ ప్రకృతియే జగత్తునకు ఉదాన కారణమగుచున్నది (7). దానికే మూలప్రకృతి మరియు మాయ అని పేర్లు. ఆకాశము వలె సర్వవ్యాపకమగు ఆ ప్రకృతినుండియే ఈ స్థావరంజగమాత్మకమగు జగత్తు పుట్టినది (8). అది ఆశుద్ధము, శుద్ధము, మరియు శుద్ధాశుద్ధము అని మూడు విధములుగా నున్నది. ఆ లింగమునుండియే శివుడు (సగుణ సాకారుడు?), మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ (9), ఇంద్రియములతో కూడిన ప్రాణులు పుట్టి, శివుని (నిర్గుణ నిరాకారుని) అజ్ఞచే దానియందే లయమగుచున్నవి. కావున, ఈ విధముగా లింగమును (ప్రకృతిని) శాసించుటచే, శివుడే లింగము అగుచున్నాడు (10). శివుని ఆజ్ఞ లేనిదే ప్రకృతి స్వతంత్రముగా ఏ పనిని చేయుటకైననూ సమర్థము కాదు మరియు దానినుండి పుట్టిన జగత్తు దానియందే విలీనమగును (11). ఈ కారణము వలననే శివునకు లింగత్వము వచ్చినది. దీనికి మరియొక కారణము లేదు. లింగమనగా పార్వతీపరమేశ్వరుల దేహమే. ఏలయనగా, దానికి అధిష్ఠానము వారే (12). కావుననే, దానియందు పార్వతీసమేతుడగు శివుడు పూజించబడు చున్నాడు. లింగము యొక్క వేదికయే మహాదేవియగు పార్వతి. లింగము సాక్షాత్తుగా లింగమే దేహము అనే స్థితి లేదు (14). ఏలయనగా, వారిద్దరు విశుద్ధులు, కావున, వ్యావహారికస్థాయిలో మాత్రమే లింగము వారికి దేహము అగును, శివపరమాత్మయొక్క సర్వోత్కృష్టమగు శక్తి అదియే (15) ఎవని అజ్ఞను స్వీకరించి మాయాశక్తి చరాచరజగత్తును సృష్టించుచున్నదో, అట్టి శివుని మహిమను చెప్పుటకు వంద సంవత్సరముల కాలమైననూ చాలదు (16).

యేనాదౌ మోహితౌ స్యాతాం బ్రహ్మనారాయణావసి | పురా త్రిభువనస్యాస్య ప్రలయే సముపస్థితే || 17

వారిశయ్యాగతో విష్ణుస్సుష్వాపానాకులస్సుఖమ్‌ | యదృచ్ఛయా గతస్తత్ర బ్రహ్మాలోకపితామహః || 18

దదర్శ పుండరీకాక్షం స్వపంతం తమనాకులమ్‌ | మాయయా మోహితశ్శంభోర్విష్ణుమాహ పితామహః || 19

కస్త్వం వదేత్యమర్షేణ ప్రహృత్యోత్థాప్య మాధవమ్‌ | స తు హస్తప్రహరేణ తీవ్రేణాభిహతః క్షణాత్‌ || 20

ప్రబుద్ధోత్థాయ శయనాద్దదర్శ పరమేష్ఠినమ్‌ | తమాహ చాంతస్సంక్రుద్ధస్స్వయమక్రుద్ధవద్ధరిః || 21

కుతస్త్వమాగతో వత్స కస్మాత్త్వం వ్యాకులో వద | ఇతి విష్ణువచః శ్రుత్వా ప్రభుత్వగుణసూచకమ్‌ || 22

రజసా బద్ధవైరస్తం బ్రహ్మా పునరభాషత | వత్సేతి మాం కుతో బ్రూషే గురుశ్శిష్యమివాత్మనః || 23

మాం న జానాసి కిం నాథం ప్రపంచో యస్యమే కృతిః | త్రిధాత్మానం విభ##జ్యేదం సృష్ట్వాథ పరిపాల్యతే || 24

సంహరామి న మే కశ్చిత్ర్సష్టా జగతి విద్యతే | ఇత్యుక్తే సతి సో%ప్యాహ బ్రహ్మాణం విష్ణురవ్యయః || 25

అహమేవాదికర్తాస్య హర్తా చ పరిపాలకః | భవానపి మమైవాంగాదవతీర్ణః పురావ్యయాత్‌ || 26

సృష్టికి పూర్వము ఈ ముల్లోకములకు ప్రళయము వచ్చినప్పుడు బ్రహ్మవిష్ణువులు కూడ ఆ మాయాశక్తిచే మోహింప జేయబడిరి (17). విష్ణువు సముద్రమునే శయ్యగా చేసుకొని, ప్రశాంతముగా సుఖముగా నిద్రించెను. లోకములకు పితామహుడగు బ్రహ్మ అనుకోకుండగా అచటకు వెళ్లెను (18). అచట ఆయన ప్రశాంతముగా నిద్రపోవుచున్న పద్మము వంటి కన్నులు గల విష్ణువును చూచెను. శంభుని మాయచే మోహింప జేయబడిన బ్రహ్మ విష్ణువుతో నిట్లనెను (19). నీవు ఎవడివి? అని చికాకుతో పలికి, మాధవుని కొట్టి నిద్ర లేపెను. తీవ్రమగు ఆ చేతి దెబ్బ విష్ణువునకు గట్టిగా తగిలెను. ఆయన క్షణములో (20) శయ్యనుండి లేచి, బ్రహ్మను చూచెను. ఆ శ్రీహరికి లోపల చాల కోపము కలిగిననూ, పైకి కోపము లేనివాని వలె బ్రహ్మతో నిట్లనెను (21). ఓ వత్సా! నీవు ఎక్కడనుండి వచ్చితివి? నీ కంగారునకు కారణమేమి? చెప్పుము, విష్ణువుయొక్క ఆ మాటను విని, రజోగుణప్రభావముచే విష్ణువునందు తీవ్రమగు వైరము గల బ్రహ్మ తాను సర్వసమర్థుడను అనే విషయమును సూచించే విధముగా ఆయనతో మరల నిట్లనెను. గురువు తన శిష్యునితో పలికినట్లు, నీవు నన్నువత్సా! అని సంబోధించుటకు కారణమేమి? (22,23) నేను జగన్నాథుడను. నీవు నన్ను యెరుగవా యేమి? ఈ ప్రపంచమును నేనే సృష్టించినాను. నేను నన్ను మూడు మూర్తులుగా విభాగము చేసి, ఈ జగత్తును సృష్టించి పాలించి (24), సంహరించుచున్నాను. ఈ జగత్తులో నాకు తండ్రి మరియొకడు లేడు. బ్రహ్మ ఇట్లు పలుకగా, వినాశము లేని ఆ విష్ణువు కూడ బ్రహ్మతో ఇట్లు పలికెను (25). ఈ జగత్తును ఆదిలో సృష్టించి, పాలించి, సంహరించువాడను నేనే. నీవు కూడ అవినాశినగు నా దేహము నుండి మాత్రమే పూర్వము జన్మించితివి (26).

మన్నియోగాత్వమాత్మానం త్రిధా కృత్వా జగత్త్రయమ్‌ | సృజస్యవసి చాంతే తత్పునః ప్రతిసృజస్యపి || 27

విస్మృతోసి జగన్నాథం నారాయణమనామయమ్‌ | తవాపి జనకం సాక్షాన్మామేవమవమన్యసే || 28

తవాపరాధో నాస్త్యత్ర భ్రాంతోసి మమ మాయయా | మత్ర్పసాదాదియం భ్రాంతిరపైష్యతి తవాచిరాత్‌ || 29

శృణు సత్యం చతుర్వక్త్ర సర్వదేవేశ్వరో హ్యహమ్‌ | కర్తా భర్తా చ హర్తా చ న మయాస్తి సమో విభుః || 30

ఏవమేవ వివాదోభూద్ర్బహ్మవిష్ణ్వోః పరస్పరమ్‌ | అభవచ్చ మహాయుద్ధం భైరవం రోమహర్షణమ్‌ || 31

ముష్టిభిర్నిఘ్నతోస్తీవ్రం రజసా బద్ధవైరయోః | తయోర్దర్పాపహారాయ ప్రబోధాయ చ దేవయోః || 32

మధ్యే సమావిరభవల్లింగమైశ్వరమద్భుతమ్‌ | జ్వాలామాలాసహస్రాఢ్యమప్రమేయమనౌపమమ్‌ || 33

క్షయవృద్ధివినిర్ముక్తమాదిమధ్యాంతవర్ణితమ్‌ | తస్య జ్వాలాసహణ బ్రహ్మ విష్ణూ విమోహితౌ || 34

విసృజ్య యుద్ధం కిం త్వేతదిత్యచింతయతాం తదా | నతయోస్తస్య యాథాత్మ్యం ప్రబుద్ధమభవద్యదా || 35

తదా సముద్యతౌ స్యాతాం తస్యాద్యంతం పరీక్షితుమ్‌ || 36

నా ఆజ్ఞచే నీవు నిన్ను మూడు భాగములుగా చేసుకొని, ముల్లోకములను సృష్టించి, మరల ప్రళయకాలమునందు వాటిని ఉపసంహరించుచున్నావు (27). జగన్నాథుడను, నారాయణుడను, దోషరహితుడను, సాక్షాత్తుగా నీకు కూడ తండ్రిని అగు నన్ను విస్మరించి, ఈ విధముగా అవమానించు చున్నావు (28). దీనిలో నీ తప్పు లేదు. నా మాయచే నీవు మోహమును పొందియుంటివి. నా అనుగ్రహముచే నీ ఈ భ్రాంతి తొందరలోనే దూరము కాగలదు (29). ఓ చతుర్ముఖ బ్రహ్మా! సత్యమును వినుము. సకలదేవతలకు ప్రభువును నేనే. సృష్టిస్థితిలయములను చేయువాడను నేనే. నాతో సముడగు సర్వవ్యాపకుడగు ప్రభువు మరియొకడు లేడు (30). ఇదే తీరున పరస్పరము వాదులాడుచున్న బ్రహ్మవిష్ణువులకు వివాదము పెద్దదయ్యెను. భయంకరమైనది, శరీరమునకు గగుర్పాటును కలిగించునది అగు మహాయుద్ధము జరిగెను (31). రజోగుణప్రభావముచే పట్టుదలతో వైరమును సాధించే వారిద్దరు పిడికిళ్లతో గట్టిగా గుద్దుకొనిరి. వారి పొగరును అడంచి, దేవతలగు వారిద్దరికి సత్యమును బోధించుట కరకై (32), వారి మధ్యలో వేలాది అగ్నిజ్వాలల మాలికలతో విరాజిల్లునది, పరిమాణమును కనిపెట్టుట అసంభవమైనది, సాటి లేనిది, తగ్గుట గాని పెరుగుట గాని లేనిది, మొదలు మధ్యభాగము మరియు అగ్రము లేనిది అగు ఈశ్వరుని అద్భుతమగు లింగము ఆవిర్భవించెను. దాని అసంఖ్యాకములగు జ్వాలలచే బ్రహ్మవిష్ణువులు మోహమును పొందిరి (33,34). వారు యుద్ధమును ఆపివేసి, ఇది ఏమై యుండును? అని ఆలోచించ డొడగిరి. కాని, వారికి ఆ సమయములో దాని యథార్థస్వరూపము తెలియ రాలేదు (35). అపుడు వారిద్దరు దాని తుది, మొదలులను పరీక్షించుటకై సంసిద్ధులైరి (36).

తత్ర హంసాకృతిర్ర్బహ్మా విశ్వతః పక్షసంయుతః | మనోనిలజవో భూత్వా గతస్తూర్ధ్వం ప్రయత్నతః || 37

నారాయణోపి విశ్వాత్మా లీలాంజనచయోపమమ్‌ | వారాహమమితం రూపమాస్థాయ గతవానధః || 38

ఏవం వర్షసహస్రం తు త్వరన్‌ విష్ణురధోగతః | నాపశ్యదల్పమప్యస్య మూలం లింగస్య సూకరః || 39

తావత్కాలం గతశ్చోర్ధ్వం తస్యాంతం జ్ఞాతు మిచ్ఛయా | శ్రాంతోత్యంతమదృష్ట్వాంతం ప్రాపతాధః పితామహః || 40

తథైవ భగవాన్‌ విష్ణుః శ్రాంతస్సంవిగ్నలోచనః | క్లేశేన మహతా తూర్ణమధస్తాదుత్థితో%భవత్‌ || 41

సమాగతావథాన్యోన్యం విస్మయస్మేరవీక్షణౌ | మాయయా మోహితౌ శంభోః కృత్యాకృత్యం న జగ్మతుః || 42

పృష్ఠతః పార్శ్వతస్తస్య చాగ్రతశ్చ స్థితావుభౌ | ప్రణిపత్య కిమాత్మేదమిత్యచింతయతాం తదా || 43

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే బ్రహ్మవిష్ణు వివాదవర్ణనం నామ చతుస్త్రింశో%ధ్యాయః (34).

ఆ సమయములో బ్రహ్మ అంతటా వ్యాపించియున్న రెక్కలు గల హంస యొక్క ఆకారమును దాల్చి, మనోవేగ వాయువేగముతో ప్రయత్నపూర్వకముగా పైకి వెళ్లెను (37). సర్వజగత్స్వరూపుడగు నారాయణుడు కూడ లీలచే కాటుక కొండను పోలియున్న హద్దులు లేని వరాహరూపమును ధరించి, క్రిందకు వెళ్లెను (38). విష్ణువు వరాహరూపముతో ఈ విధముగా వేయి సంవత్సరములు వేగముతో క్రిందకు పయనించిననూ, ఆ లింగముయొక్క మూలమును చూచాయగానైననూ కనుగొన లేకపోయెను (39). అదే కాలములో దాని అగ్రమును కనుగొనగోరి పైకి వెళ్లిన బ్రహ్మ దానిని కనుగొలేక అలసి పోయి క్రిందకు తిరిగి వచ్చెను (40). అదే విధముగా విష్ణుభగవానుడు కళ్లు తిరుగుచుండగా అలిసి చాల కష్టము మీద వేగముగా క్రిందనుండి పైకి లేచి వచ్చినాడు (41). శంభుని మాయచే మోహితులై యున్నవారు ఇద్దరు ఒకరినొకరు కలుసుకొని ఆశ్చర్యముతో సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ, ఏది కర్తవ్యము, ఏది కాదు? అను విషయము తెలియనివారై ఉండిరి (42). వారిద్దరు ఆ లింగమునకు వెనుక ప్రక్కన, ఎదుట నిలబడిరి. ఆ సమయములో వారు దానికి నమస్కరించి, దీని స్వరూపమేమి? అని చింతిల్ల దొడగిరి (43).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో ఉత్తరఖండలో బ్రహ్మవిష్ణు వివాదవర్ణనమనే ముప్పది నాలుగవ అధ్యాయము ముగిసినది (34).

Siva Maha Puranam-4    Chapters