Siva Maha Puranam-4    Chapters   

అథ త్రయస్త్రింశో%ధ్యాయః

శివలింగ మహావ్రతము

ఉపమన్యురువాచ |

అతః పరం ప్రవక్ష్యామి కేవలాముష్మికం విధిమ్‌ | నైతేన సదృశం కించిత్కర్మాస్తి భువనత్రయే || 1

పుణ్యాతిశయసంయుక్తస్సర్వైర్దేవైరనుష్ఠితః | బ్రహ్మణా విష్ణునా చైవ రుద్రేణ చ విశేషతః || 2

ఇంద్రాదిలోకపాలైశ్చ సూర్యాద్యైర్నవభిర్గ్రహైః | విశ్వామిత్రవసిష్ఠాద్యైర్బ్రహ్మవిద్భిర్మహర్షిభిః || 3

శ్వేతాగస్త్యదధీచాద్యైరస్మాభిశ్చ శివాశ్రితైః | నందీశ్వరమహాకాలభృంగీశాద్యైర్గణశ్వరైః || 4

పాతాల వాసిభిర్దైత్యైశ్శేషాద్యైశ్చ మహోరగైః | సిద్ధైర్యక్షైశ్చ గంధర్వై రక్షో భూతపిశాచకైః || 5

స్వం స్వం పదమను ప్రాప్తం సర్వైరయమనుష్ఠితః | అనేన విధినా సర్వే దేవా దేవత్వమాగతాః || 6

బ్రహ్మా బ్రహ్మత్వమాపన్నో విష్ణుర్విష్ణుత్వమాగతః | రుద్రో రుద్రోత్వమాపన్న ఇంద్రశ్చేంద్రత్వమాగతః|| 7

గణశశ్చ గణశత్వమనేన విధినా గతః | సితచందనతోయేన లింగం స్నాప్య శివం శివామ్‌ |

శ్వేతైర్వికసితైః పద్మైస్సంపూజ్య ప్రణిపత్య చ || 8

తత్ర పద్మాసనం రమ్యం కృత్వా లక్షణసంయుతమ్‌ | విభ##వే సతి హేమాద్యై రత్నా ద్యైర్వా స్వశక్తితః || 9

మధ్యే కేసరజాలస్య స్థాప్య లింగం కనీయసమ్‌ | అంగుష్ఠప్రతిమం రమ్యం సర్వగంధమయం శుభమ్‌ || 10

దక్షిణ స్థాపయిత్వా తు బిల్వపత్రైస్సమర్చయేత్‌ |

ఉపమన్యువు ఇట్లు పలికెను -

కేవలము పరలోకమును మాత్రమే సాధించి పెట్టే కర్మయొక్క విధిని ఈ పైన చెప్పెదను. ముల్లోకములలో దీనితో పోల్చదగిన కర్మ మరియొకటి లేదు (1). మహాపుణ్యమునిచ్చే ఈ కర్మను దేవతలు అందరు, విశేషించి బ్రహ్మ విష్ణు రుద్రులు, ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, సూర్యుడు మొదలగు తొమ్మిది గ్రహములు, విశ్వామిత్రుడు వసిష్ఠుడు మొదలగు బ్రహ్మవేత్తలగు మహర్షులు, శ్వేతుడు అగస్త్యుడు దధీచి మొదలగువారు, శివభక్తులమగు మేము, నందీశ్వరుడు మహాకాలుడు భృంగీశ్వరుడు మొదలగు గణాధ్యక్షులు, పాతాళమునందు నివసించే దైత్యులు, శేషుడు మొదలగు మహాసర్పములు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, భూతములు, పిశాచములు అనుష్ఠించిరి (2-5). దీనిని అనుష్ఠించి అందరు తమ తమ పదవులను పొందిరి. ఈ కర్మానుష్ఠానముచే దేవతలందరు దేవపదవిని, బ్రహ్మ బ్రహ్మ పదవిని, విష్ణువు విష్ణుత్వమును, రుద్రుడు రుద్రత్వమును, ఇంద్రుడు ఇంద్రపదవిని, విఘ్నేశ్వరుడు గణాధ్యక్షపదవినిపొందిరి. లింగరూపములో నున్న పార్వతీపరమేశ్వరులను గంధము కలిసిన స్వచ్ఛమగు జలములతో అభిషేకించి, వికసించిన తెల్లని పద్మములతో చక్కగా పూజించి, నమస్కరించి (6-8), అచట సకలలక్షణములతో కూడిన సుందరమగు పద్మాసనమును ఏర్పాటు చేయవలెను. సాధకుడు సంపన్నుడైనచో బంగారము, రత్నములు మొదలగు వాటిని యథాశక్తిగా ఉపయోగించి ఆసనమును స్థాపించవలెను (9). దానియొక్క కింజల్కముల నడుమ బొటనవ్రేలు పరమాణము గల చిన్న అందమైన లింగమును స్థాపించవలెను. శుభకరమగు ఆ లింగము సకలసుగంధద్రవ్యముల పరిమళమును కలిగి యుండవలెను (10). దానిని దక్షిణభాగమునందు స్థాపించి, మారేడు దళములతో పూజించవలెను.

అగురుం దక్షిణ పార్శ్వే పశ్చిమే తు మనశ్శిలామ్‌ || 11

ఉత్తరే చందనం దద్యాద్ధరితాలం తు పూర్వతః | సుగంధైః కుసుమై రమ్యైర్విచిత్రైశ్చాపి పూజయేత్‌ || 12

ధూపం కృష్ణాగురుం దద్యాత్సర్వతశ్చ సగుగ్గులుమ్‌ | వాసాంసి చాతి సూక్ష్మాణి వికాశాని నివేదయేత్‌ || 13

పాయసం ఘృతసంమిశ్రం ఘృతదీపాంశ్చ దాపయేత్‌ | సర్వం నివేద్య మంత్రేణ తతో గచ్ఛేత్ప్రదక్షిణామ్‌ || 14

ప్రణమ్య భక్త్యా దేవేశం స్తుత్వా చాంతే క్షమాపయేత్‌ | సర్వోపహారసంమిశ్రం తతో లింగం నివేదయేత్‌ || 15

శివాయ శివమంత్రేణ దక్షిణామూర్తిమాశ్రితః | ఏవం యో%ర్చయతే నిత్యం పంచగంధమయం శుభమ్‌ || 16

సర్వపాపవినిర్ముక్తశ్శివలోకే మహీయతే | ఏతద్ర్వతోత్తమం గుహ్యం శివలింగమహావ్రతమ్‌ || 17

భక్తస్య తే సమాఖ్యాతం న దేయం యస్య కస్యచిత్‌ | దేయం చ శివభ##క్తే భ్యశ్శివేన కధితం పురా || 18

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే ఆముష్మిక కర్మవిధివర్ణనం నామ త్రయస్త్రింశో%ధ్యాయః (33).

ఆ లింగమునకు దక్షిణపార్శ్వమునందు అగురును, పశ్చిమమునందు మనశ్శిలను (11), ఉత్తరమునందు చందనమును, తూర్పునందు పసువును సమర్పించవలెను. పరిమళభరితములైన సుందరములగు రంగు రంగుల పుష్పములతో పూజించవలెను (12). అన్నివైపులా కృష్ణాగురు ధూపమును, సాంబ్రాణి పొగను వేయవలెను. మిక్కిలి నాజూకైన స్వచ్ఛమగు వస్త్రములను సమర్పించవలెను (13). నేతితో కలిసిన పాయసమును నైవేద్యము పెట్టవలెను. నేతి దీపములను వెలిగించ వలెను. ఉపచారములనన్నింటినీ మంత్రపూర్వకముగా చేసి, తరువాత ప్రదక్షిణమును చేయవలెను (14). దేవదేవునకు భక్తితో నమస్కరించి, స్తుతించి, క్షమాపణను చెప్పవలెను. తరువాత సకలములగు బహుమానములతో సహా ఆ లింగమును శివస్వరూపుడగు గురువునకు శివమంత్రమును జపిస్తూ సమర్పించి , దక్షిణామూర్తిని శరణు పొందవలెను. ఎవడైతే ఈ విధముగా నిత్యము అయిదు సుగంధద్రవ్యములతో కూడిన శుభకరమగు లింగమును పూజించునో (15, 16), వాడు సకలపాపములనుండి విడుదలను పొంది, శివలోకములో మహిమను గాంచును. ఈ శివలింగమహావ్రతము రహస్యమైనది, మరియు వ్రతములలో ఉత్తమమైనది (17). నీవు భక్తుడవు గనుక, నీకు చెప్పితిని. ఎవనికి పడితే వానికి దీనిని చెప్పరాదు. దీనిని శివభక్తులకు మాత్రమే చెప్పవలెను. దీనిని పూర్వము శివుడే స్వయముగా చెప్పినాడు (18).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో ఉత్తరఖండమునందు శివలింగమహావ్రతమును బోధించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).

Siva Maha Puranam-4    Chapters