Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టావింశోధ్యాయః

శివధర్మములోని నైమిత్తిక కర్మలు

ఉపమన్యురువాచ |

అతః పరం ప్రవక్ష్యామి శివాశ్రమనిషేవిణామ్‌ | శివశాస్త్రోక్తమార్గేణ నైమిత్తిక విధిక్రమమ్‌ || 1

సర్వేష్వపి చ మాసేషు పక్షయోరుభయోరపి | అష్టమ్యాం చ చతుర్దశ్యాం తథా పర్వణి చ క్రమాత్‌ || 2

అయనే విషువే చైవ గ్రహణషు విశేషతః | కర్తవ్యా మహతీ పూజా హ్యధికా వాపి శక్తితః || 3

మాసి మాసి యథాన్యాయం బ్రహ్మకూర్చం ప్రసాధ్య తు | స్నాపయిత్వా శివం తేన పిబేచ్ఛేషముపోషితః || 4

బ్రహ్మహత్యాదిదోషాణామతీవ మహతామపి | నిష్కృతిర్ర్బహ్మకూర్చస్య పానాన్నాన్యా విశిష్యతే || 5

పౌషే తు పుప్యనక్షత్రే కుర్యాన్నీరాజనం విభోః | మాఘే మఘాఖ్యే నక్షత్రే ప్రదద్యాత్‌ ఘృతకంబలమ్‌ || 6

ఫాల్గునే చోత్తరాంతే వైప్రారభేత మహోత్సవమ్‌ | చైత్రే చిత్రాపౌర్ణమాస్యాం దోలాం కుర్యాద్యథావిధి || 7

వైశాఖ్యాం తు విశాఖాయాం కుర్యాత్పుష్పమహాలయమ్‌ | జ్యేష్ఠే మూలాఖ్యనక్షత్రే శీతకుంభం ప్రదాపయేత్‌ || 8

ఆషాఢే చోత్తరాషాఢే పవిత్రారోపణం తథా | శ్రావణ ప్రాకృతాన్యాపి మండలాని ప్రకల్పయేత్‌ || 9

శ్రవిష్ఠాఖ్యే తు నక్షత్రే ప్రౌష్ఠపద్యాం తతః పరమ్‌ | ప్రోక్షయేచ్చ జలక్రీడాం పూర్వాషాఢాశ్రయే దినే || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

ఈ పైన శివాశ్రమజీవనమును గడుపువారికి శివశాస్త్రములో చెప్పబడిన మార్గములో చేయదగిన నైమిత్తిక కర్మల విధిని మరియు క్రమమును చెప్పెదను (1). అన్ని మాసములయందు రెండు పక్షములలో క్రమముగా అష్టమి, చతుర్దశి, పూర్ణిమ మరియు అమావాస్య అనే తిథులలో (2). ఉత్తరాయణ - దక్షిణాయన సంక్రమణ కాలములయందు, విషువత్‌ (రాత్రింబగళ్లు సమానముగా నుండు రోజు) నాడు, విశేషించి గ్రహణసమయములలో శక్తిని బట్టి మహాపూజను చేయవలెను (3). సాధకుడు ప్రతి మాసమునందు ఉపవాసమును చేసి, యథాశాస్త్రముగా బ్రహ్మకూర్చ (పంచగవ్యములు) ను తయారు చేసి, దానితో శివునకు అభిషేకమును చేసి, ఆ శేషమును త్రాగవలెను (4). బ్రహ్మహత్య మొదలగు మహాదోషములకైననూ బ్రహ్మకూర్చ పానమును మించిన మరియొక గొప్ప నిష్కృతి లేదు (5). పుష్యమాసములో పుష్యమి నక్షత్రము నాడు సర్వవ్యాపకుడగు శివునకు నీరాజనము నీయవలెను. మాఘమాసములో మఖానక్షత్రము నాడు నేతిని, కంబళీని దానము చేయవలెను (6). ఫాల్గునమాసములో ఉత్తరఫల్గునీ నక్షత్రము నాడు మహోత్పవము నారంభించి, చైత్రమాసములో చిత్రానక్షత్రముతో కూడిన పూర్ణిమనాడు యథావిధిగా దోలోత్సవము (ఉయ్యాల పండుగ) ను చేయవలెను (7). వైశాఖమాసములో విశాఖ నక్షత్రము నాడు పుష్పములతో పెద్ద ఆలయమును నిర్మించవలెను. జ్యేష్ఠమాసములో మూలా నక్షత్రము నాడు చల్లని నీటిని నింపిన కడవను దానము చేయవలెను (8). ఆషాఢమాసములో ఉత్తరాషాఢా నక్షత్రము నాడు పవిత్రారోపణము అనే ఉత్సవమును చేయవలెను. శ్రావణమాసములో మండలములను చేయవలెను (9). ఆ తరువాత ధనిష్ఠ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్రలయందు శివునకు సంప్రోక్షణమును, పూర్వాషాఢా నక్షత్రము నాడు జలక్రీడను చేయవలెను (10).

ఆశ్వయుజ్యాం తతో దద్యాత్పాయసం చ నవోదనమ్‌ | అగ్నికార్యం చ తేనైవ కుర్యాచ్ఛతభిషగ్దినే || 11

కార్తిక్యాం కృత్తికాయోగే దద్యాద్దీపసహస్రకమ్‌ | మార్గశీర్షే తథార్ద్రాయాం ఘృతేన స్నాపయేచ్ఛివమ్‌ || 12

అశక్తస్తేషు కాలేషు కుర్యాదుత్సవమేవ వా | ఆస్థానే వా మహాపూజామధికం వా సమర్చనమ్‌ || 13

ఆవృత్తే %పి చ కల్యాణ ప్రశ##స్తేష్వపి కర్మసు | దౌర్మనస్యే దురాచారే దుస్స్వప్నే దుష్టదర్శనే || 14

ఉత్పాతే వాశుభేన్యస్మిన్‌ రోగే వా ప్రబలే%థ వా | స్నానపూజాజపధ్యానహోమదానాదికాః క్రియాః || 15

నిమిత్తానుగుణాః కార్యాః పురశ్చరణపూర్వికాః | శివానలే చ విహతే పునస్సంధానమాచరేత్‌ || 16

య ఏవం శర్వధర్మిష్ఠో వర్తతే నిత్యముద్యతః | తసై#్యకజన్మనా ముక్తిం ప్రయచ్ఛతి మహేశ్వరః || 17

ఏతద్యథోత్తరం కుర్వన్నిత్యనైమిత్తికేషు యః | దివ్యం శ్రీకంఠనాథస్య స్థానమాద్యం స గచ్ఛతి || 18

తత్ర భుక్త్వా మహాభోగాన్‌ కల్పకోటిశతం నరః | కాలాంతరే చ్యుతస్తస్మాదౌమం కౌమారమేవ చ || 19

సంప్రాప్య వైష్ణవం బ్రాహ్మం రుద్రలోకం విశేషతః | తత్రోషిత్వా చిరం కాలం భుక్త్వా భోగాన్‌ యథోదితాన్‌ || 20

పునశ్చోర్ధ్వం గతస్తస్మాదతీత్య స్థానపంచకమ్‌ | శ్రీకంఠాత్‌ జ్ఞానమాసాద్య తస్మాచ్ఛైవపురం వ్రజేత్‌ || 21

తరువాత ఆశ్వయుజ మాసములో పాయసమును, కొత్త బియ్యముతో వండిన అన్నమును దానము చేయవలెను. శతభిషక్‌ నక్షత్రము నాడు వాటితోనే అగ్నికార్యమును చేయవలెను (11). కార్తీక మాసములో కృత్తికా నక్షత్రము నాడు వేయి దీపములను వెలిగించ వలెను. మార్గశీర్ష మాసములో అర్ద్రా నక్షత్రము నాడు శివునకు నేయితో అభిషేకమును చేయవలెను (12). ఆయా కాలములలో శక్తి లేని సాధకుడు మండపములో ఉత్సవమును గాని, మహాపూజను గాని, లేదా విశేషపూజలను గాని చేయవలెను (13). మంగళములు పునరావృత్తమైనప్పుడు, ప్రశస్తమగు కర్మలయందు, మనస్సు వికలముగా నున్నప్పుడు, చేయకూడని పని జరిగినప్పుడు, చెడు కల వచ్చనప్పుడు, దుష్టులను చూచినప్పుడు ప్రశస్తమగు కర్మలయందు, మనస్సు వికలముగా నున్నప్పుడు, చేయకూడని పని జరిగినప్పుడు, చెడు కల వచ్చినప్పుడు, దుష్టులను చూచినప్పుడు (14), ఉత్పాతములు కలిగినప్పుడు, ఇతరములగు అశుభములు కలిగినప్పుడు, పెద్ద వ్యాధి వచ్చినప్పుడు, స్నానము పూజ జపము ధ్యానము హోమము దానము మొదలగు కర్మలను (15), ఆయా నిమిత్తములకు అనురూపముగా పురశ్చరణపూర్వకముగా చేయవలెను. శివాగ్ని విచ్ఛిన్నము (ఆరిపోవుట) అయినచో, మరల అగ్న్యాధానమును చేయవలెను (16). ఎవడైతే ఈ విధముగా నిత్యము సావధానతతో శివధర్మమును పాటించునో, వానికి మహేశ్వరుడ ఒకే జన్మలో మోక్షమునిచ్చును (17). ఎవడైతే నిత్యనైమిత్తిక కర్మలను క్రమమును తప్పకుండగా చేయునో, అతడు శ్రీకంఠనాధుని దివ్యము, ఆద్యము అగు స్థానమును పొందును (18). ఆ జీవుడు ఆచట వంద కోటి కల్పములు మహాభోగములననుభవించి, కాలాంతరము నందు అచటనుండి జారి, ఉమా-కుమార-విష్ణు-బ్రహ్మలోకములను, మరియు విశేషించి రుద్రలోకమును పొంది, అచట చిరకాలము ఉండి శాస్త్రములో చెప్పబడిన భోగములను అనుభవించి (19,20), మరల అచటనుండి పైకి వెళ్లి, అ అయిదు లోకములను అతిక్రమించి, విషకంఠుడగు శివుని నుండి జ్ఞానమును పొంది, దాని ప్రభావముచే శివపురమును పొందును (21).

అర్ధచర్యారతశ్చాపి ద్విరావృత్తైవమేవ తు | పశ్చాత్‌ జ్ఞానం సమాసాద్య శివసాయుజ్యమాప్నుయాత్‌ || 22

అర్ధర్థచరితో యుస్తు దేహీ దేహక్షయాత్పరమ్‌ | అండాంతం వోర్ధ్వమవ్యక్త మతీత్య భవనద్వయమ్‌ || 23

సంప్రాప్య పౌరుషం రౌద్రస్థానమద్రీంద్రజాపతేః | అనేకయుగసాహస్రం భుక్త్వా భోగాననేకధా || 24

పుణ్యక్షయే క్షతిం ప్రాప్య కులే మహతి జాయతే | తత్రాపి పూర్వసంస్కారవశేన స మహాద్యుతిః || 25

పశుధర్మాన్‌ పరిత్యజ్య శివధర్మరతో భ##వేత్‌ | తద్ధర్మగౌరవాదేవ ధ్యాత్వా శివపురం వ్రజేత్‌ || 26

భోగాంశ్చ వివిధాన్‌ భుక్త్వా విద్యేశ్వరపదం వ్రజేత్‌ | తత్ర విద్యేశ్వరైస్సార్ధం భుక్త్వా భోగాన్‌ బహూన్‌ క్రమాత్‌ || 27

అండస్యాంతర్బహిర్వాథ సకృదావర్తతే పునః | తతో లబ్ధ్వా శివజ్ఞానం పరాం భక్తిమవాప్య చ || 28

శివసాధర్మ్య మాసాద్య న భూయో విని వర్తతే | యశ్చాతీవ శివే భక్తో విషయాసక్తచిత్తవత్‌ || 29

శివధర్మానసౌ కుర్వన్న కుర్వన్వాపి ముచ్యతే | ఏకావృత్తో ద్విరావృత్తస్త్రి రావృత్తో నివర్తకః || 30

స పునశ్చక్రవర్తీ స్యాచ్ఛివధర్మాధికారవాన్‌ | తస్మాచ్ఛివాశ్రితో భూత్వా యేన కేనాపి హేతునా || 31

శివధర్మే మతిం కుర్యాచ్ర్ఛేయసే చేత్కృతోద్యమః | నాత్ర నిర్బంధయిష్యామో వయం కేచన కేనచిత్‌ || 32

ఈ కర్మలలో సగము కర్మలయందు మాత్రమే శ్రద్ధ గలవాడైననూ ఈ విధముగా రెండు సార్లు మరల జన్మించి, తరువాత జ్ఞానమును పొంది, శివుని సాయుజ్యమును పొందును (22). ఏ మానవుడైతే సగములో సగము చేయునో, అతడు మరణించిన తరువాత బ్రహ్మాండము యొక్క అంతము వరకు పైకి వెళ్ళి, అవ్యక్తమును దాటి, పార్వతీపతియొక్క పౌరుషము (తత్పురుషలోకము) మరియు రౌద్రము అనే రెండు లోకములను పొంది, అనేక వేల యుగములు అనేకవిధములుగా భోగములననుభవించి (23,24), ఆ పుణ్యము ఖర్చు కాగానే, భూలోకమును పొంది గొప్ప కులములో జన్మించును. అక్కడ కూడ అతడు పూర్వ సంస్కారప్రభావముచే గొప్ప తేజస్సు గలవాడై (25), అజ్ఞానలక్షణములను విడిచి పెట్టి, శివ ధర్మమునందు ప్రీతి గలవాడగును, ఆ ధర్మముయొక్క గరిమచేతనే ఆతడు శివుని ధ్యానించి, శివపురమును పొందును (26). అచ్చట అతడు వివిధభోగముల ననుభవించి, విద్యేశ్వర స్థానమును పొందును. అక్కడ అతడు విద్యేశ్వరులతో కలిసి బహుభోగములను క్రమముగా అనుభవించి (27), బ్రహ్మండమునకు లోపల గాని, బయట గాని ఒకేసారి మరలివచ్చి (జన్మించి), తరువాత శివజ్ఞానమును పరాభక్తిని పొంది (28), శివుని సమానధర్మములు గల స్థాయిని పొందును. అపుడాతనికి పునరావృత్తి లేదు. ఎవడైతే విషయభోగములయందు జనులకు ఉండే ప్రీతితో సమానముగా శివునియందు అతిశయించిన భక్తి కలిగియుండునో (29), ఆతడు శివధర్మములను ఆచరించినా, ఆచరించక పోయినా, మోక్షమును పొందును. ఆతడు ఒకటి, రెండు లేక మూడు సార్లు మరల జన్మించిననూ, తరువాత మరలి రాడు (30). అతడు ఆ పర్యాయములలో చక్రవర్తియై జన్మించి, శివధర్మమును నిర్ణయించే అధికారమును కలిగి యుండును. కావున, మానవుడు శ్రేయస్సును పొందవలెననే ఉద్యమము కలవాడైనచో, ఏదో ఒక కారణముచే శివుని ఆశ్రయించి, శివధర్మమునందు శ్రద్ధను కలిగియుండవలెను. ఈ విషయములోమేము ఎవరమైననూ ఏ విధముగానైననూ నిర్బంధము చేయబోము (31,32).

నిర్బంధేభ్యో%తివాదిభ్యః ప్రకృత్యైతన్న రోచతే | రోచతే వా పరేభ్యస్తు పుణ్యసంస్కారగౌరవాత్‌ || 33

సంసారకారణం యేషాం న ప్రరోఢుమలం భ##వేత్‌ | ప్రకృత్యనుగుణం తస్మాద్విమృశ్యైతదశేషతః || 34

శివధర్మే%ధికుర్వీత యదీచ్ఛేచ్ఛివమాత్మనః || 35

ఇతి శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే నైమిత్తిక శివధర్మవర్ణనం నామ అష్టావింశో%ధ్యయః (28).

పుణ్య సంస్కారముయొక్క గరిమచే మాకు స్వభావము చేతనే నిర్బంధము గాని, అతివాదము గాని రుచించవు. అవి ఇతరులకు రుచించు గాక! (33) ఎవరిలోనైతే సంసారమునకు కారణమగు అజ్ఞానము బలముగా నాటుకొనుటకు సమర్థము కాలేదో, ఆ కారణముచే వారు తమకు మంగళమును కోరువారైనచో, స్వభావమునకు అనురూపముగా ఈ విషయమునంతనూ విమర్శ చేసి శివధర్మము నందు అధికారమును సంపాదించవలెను (34,35).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివధర్మములోని నైమిత్తికకర్మలను వర్ణించే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

Siva Maha Puranam-4    Chapters