Siva Maha Puranam-4    Chapters   

అథ త్రయోవింశోధ్యాయః

శివ మానస పూజ

ఉపమన్యురువాచ |

వ్యాఖ్యాం పూజావిధానస్య ప్రవదామి సమాసతః | శివశాస్త్రే శివేనైవ శివాయై కథితస్య తు || 1

అంగమభ్యంతరం యాగమగ్నికార్యావసానకమ్‌ | విధాయ వా న వా పశ్చాద్బహిర్యాగం సమాచరేత్‌ || 2

తత్ర ద్రవ్యాణి మనసా కల్పయిత్వా విశోధ్య చ | ధ్యాత్వా వినాయకం దేవం పూజయిత్వా విధానతః || 3

దక్షిణ చోత్తరే చైవ నందీశం సుయశాం తథా | ఆరాధ్య మనసా సమ్యగాసనం కల్పయేద్బుధః || 4

ఆరాధనాదికైర్యుక్తస్సింహ యోగాసనాదికమ్‌ | పద్మాసనం వా విమలం తత్త్వత్రయసమన్వితమ్‌ || 5

తస్యోపరి శివం ధ్యాయేత్సాంబం సర్వమనోహరమ్‌ | సర్వలంక్షణసంపన్నం సర్వావయవశోభనమ్‌ || 6

సర్వాతిశయసంయుక్తం సర్వాభరణభూషితమ్‌ | రక్తాస్యపాణిచరణం కుందచంద్రస్మితాననమ్‌ || 7

శుద్ధస్ఫటికసంకాశం పుల్లపద్మత్రిలోచనమ్‌ | చతుర్భుజముదారాంగం చారుచంద్రకలాధరమ్‌ || 8

వరదాభయహస్తం చ మృగటంకధరం హరమ్‌ | భుజంగహారవలయం చారునీలగలాంతరమ్‌ || 9

సర్వోపమానరహితం సానుగం సపరిచ్ఛదమ్‌ | తతస్సంచింతయేత్తస్య వామభాగే మహేశ్వరీమ్‌ || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

శివశాస్త్రములో శివుడు స్వయముగా పార్వతికి చెప్పిన పూజావిధానమును సంగ్రహముగా వ్యాఖ్యానించెదను (1). దీనికి మానసపూజ అంగము. సాధకుడు దానిని చేసిన తరువాత అగ్నికార్యము వరకు పూర్తి చేసుకొని, లేదా అగ్నికార్యమును చేయకుండగా గాని, బాహ్య పూజను చేయవలెను (2). వివేకియగు సాధకుడు మానసపూజయందు మనస్సులోననే పూజాద్రవ్యములను భావన చేసి, వాటిని శుద్ధి చేసి, వినాయకదేవుని ధ్యానించి యథావిధిగా పూజించి, దక్షిణమునందు నందీశుని, ఉత్తరమునందు సుయశను ఆరాధించి మానసికముగా చక్కని ఆసనమును కల్పించవలెను (3,4). ఈ విధముగా ఆరాధన మొదలగు వాటితో కూడియున్న సాధకుడు సింహాసనము, యోగాసనము మొదలగు ఆసనములను గాని, లేదా స్వచ్ఛమైనది మరియు భూమి నీరు అగ్ని అనే మూడు తత్త్వములతో కూడినది అగు పద్మాసనమును గాని భావన చేయవలెను (5). దానిపై జగన్మాతతో కూడియున్నవాడు, సర్వాధికమగు సౌందర్యము కలవాడు, సకల లక్షణములతో ఒప్పారువాడు, సమస్తములగు అవయవములందు శోభ కలవాడు, సర్వశ్రేష్ఠమగు ప్రకాశముతో నున్నవాడు, సమస్తములగు అభరణములతో అలంకరించుకున్నవాడు, ఎర్రని ముఖము చేతులు మరియు కాళ్లు గలవాడు, మల్లెపూవువలె చంద్రుని వలె స్వచ్ఛమైన చిరునగవుతో కూడిన ముఖము గలవాడు, స్వచ్ఛమగు స్ఫటికమువలె చక్కగా ప్రకాశించువాడు, వికసించిన పద్మముల వంటి మూడు కన్నులు గలవాడు, నాలుగు భుజములు గలవాడు, అందమగు అవయవములు గలవాడు, చక్కని చంద్రకళను ధరించినవాడు, చేతులయందు వరదముద్రను, అభయముద్రను, లేడిని మరియు పరశువును దాల్చినవాడు, పాపములను హరించువాడు, పాము చుట్టలే హారములుగా గలవాడు, నీలవర్ణముతో సుందరమగు కంఠపు లోపలి భాగము గలవాడు, దేనితోనైననూ పోల్చ శక్యము కానివాడు, అనుచరులతో మరియు సాధనసామగ్రితో కూడియున్నవాడు అగు శివుని ధ్యానించవలెను. తరువాత ఆయనకు ఎడమవైపున మహేశ్వరిని ధ్యానించవలెను (6010).

ప్రపుల్లోత్పలపత్రాభాం విస్తీర్ణాయతలోచనామ్‌ | పూర్ణచంద్రాభవదనాం నీలకుంచితమూర్ధజామ్‌ || 11

నీలోత్పలదలప్రఖ్యాం చంద్రార్ధకృత శేఖరామ్‌ | అతివృత్తఘనోత్తుంగస్నిగ్ధపీనపయోధరామ్‌ || 12

తనుమధ్యాం పృథుశ్రోణీం పీతసూక్ష్మవరాంబరామ్‌ | సర్వాభరణసంపన్నాం లలాటతిలకోజ్జ్వలామ్‌ || 13

విచిత్రపుష్పసంకీర్ణకేశపాశోపశోభితామ్‌ | సర్వతో%నుగుణాకారాం కించిల్లజ్జానతాననామ్‌ || 14

హేమారవిందం విలసద్దధానాం దక్షిణ కరే | దండవచ్చాపరం హస్తం న్యస్యాసీనాం మహాసనే || 15

పాశవిచ్ఛేదికాం సాక్షాత్సచ్చిదానందరూపిణీమ్‌ | ఏవం దేవం చ దేవీం చ ధ్యాత్వాసనవరే శుభే || 16

సర్వోపచారవద్భక్త్యా భావపుషై#్పస్సమర్చయేత్‌ | అథవా పరికల్ప్యైవం మూర్తిమన్యతమాం విభోః || 17

శైవీం సదాశివాఖ్యాం వా తథా మాహేశ్వరీం పరామ్‌ | షడ్వింశకాభిదానాం వా శ్రీ కంఠాఖ్యామథాపి వా || 18

మంత్రన్యాసాదికాం చాపి కృత్వా స్వస్యాం తనౌ యథా | అస్యాం మూర్తౌ మూర్తిమంతం శివం సదసతః పరమ్‌ || 19

ధ్యత్వా బాహ్యక్రమేణౖవ పూజాం నిర్వర్తయేద్ధియా | సమిదాజ్యాదిభిః పశ్చాన్నాభౌ హోమం చ భావయేత్‌ || 20

భ్రూమధ్యే చ శివం ధ్యాయేచ్ఛుద్ధదీపశిఖాకృతిమ్‌ | ఇత్థమంగే స్వతంత్రే వా యోగే ధ్యానమయే శుభే || 21

అగ్నికార్యావసానం చ సర్వత్రైవ సమో విధిః | అథ చింతామయం సర్వం సమాప్యారాధనక్రమమ్‌ || 22

లింగే చ పూజయేద్దేవం స్థండిలే వానలే%పి వా || 23

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివ మానసపూజావర్ణనం నామ త్రయోవింశో %ధ్యాయః (23).

పూర్తిగా వికసించిన కలువ రేకులవలె విశాలమగు పొడవైన కన్నులు గలది, పూర్ణచంద్రునివంటి ముఖము గలది, నల్లని గిరజాల జుట్టు గలది (11), నల్లకలువ రేకువలె ప్రకాశించునది, చంద్రవంక శిరోభూషణముగా గలది, సుందరమగు వక్షఃస్థలము గలది (12), సన్నని నడుము గలది, విశాలమగు కటిభాగము గలది, పచ్చని నాణ్యమైన శ్రేష్ఠమగు వస్త్రము గలది, సకలములగు ఆభరణములతో ఒప్పారునది, లలాటమునందు తిలకముతో ప్రకాశించునది (13), రంగురంగుల పుష్పములతో అంతటా అలంకరించబడిన జడతో శోభిల్లునది, అన్ని విధములుగా శివునకు అనురూపమైన ఆకారము గలది, సిగ్గుతో కొద్దిగా వంచబడిన ముఖము గలది (14), ప్రకాశించే బంగరు పద్మమును కుడిచేతియందు పట్టుకున్నది, మరియొక చేతిని పెద్ద ఆసనముపై దండమును వలె పెట్టి కూర్చున్నది (15), సంసారబంధమును పొగొట్టునది, సాక్షాత్తుగా సచ్చిదానంద పరంబ్రహ్మస్వరూపిణి అగు పార్వతిని ధ్యానించవలెను. ఈ విధముగా శ్రేష్ఠమగు ఆసనమునందు ఉపవిష్టులై యున్న పార్వతీపరమేశ్వరులను ధ్యానించి (16), భక్తితో సకలములగు ఉపచారములతో మరియు భావనాత్మకములగు పుష్పములతో చక్కగా పూజించవలెను. లేదా, సర్వవ్యాపకుడగు శివుని అనేకరూపములలో ఏదో ఒక రూపమును భావన చేసి, దానికి శివుడు అని గాని, సదాశివుడు అని గాని నామమును భావించి, అదే విధముగా మహేశ్వరి, పరాశక్తి, షడ్వింశక (ఇరువది ఆరు తత్త్వముల మాయాశక్తి), శ్రీకంఠా అను నామములలో ఒక నామముతో పార్వతిని భావన చేసి (17,18), తన దేహములో కూడ మంత్రన్యాసము మొదలగు వాటిని కూడ చేసి, ఆ మూర్తి యందు కార్యకారణములకు అతీతమైన శివుని స్వరూపమును (19) ధ్యానించి, బాహ్యపూజలో చేసే వరుసలోనే మానసిక పూజలను చేయవలెను. తరువాత సమిధలు, నేయి మొదలగు ద్రవ్యములతో నాభియందు హోమమును కూడ భావన చేయవలెను (20). స్వచ్ఛమగు దీపజ్వాలను పోలియున్న శివుని కనుబొమల మధ్యలో ధ్యానించవలెను. ఈ విధముగా తన దేహావయవమునందు గాని, బాహ్యమందు మూర్తియందు గాని శుభకరమగు ధ్యానయోగమును చేయవలెను (21). అగ్నికార్యము పూర్తియగు వరకు అన్ని వికల్పములలో విధిసమానము. తరువాత భావనారూపమగు ఆరాధనను అంతనూ పూర్తి చేసి (22), లింగమందు గాని, వేదిభూమియందు గాని, అగ్నియందు గాని శివుని పూజించవలెను (23).

శ్రీ శివమహాపురాణమునందలి వాయవీయసంహితలో ఉత్తరఖండయందు శివమానసపూజను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Siva Maha Puranam-4    Chapters