Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథు ఏకాశీత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ గీతాసారః

అగ్నిరువాచ :

గీతాసారం ప్రవక్ష్యామి సర్వగీతోత్త మోత్తమమ్‌ | కృష్టోర్జునాయ యామాహపురా వై భుక్తిముక్తిదమ్‌. 1

శ్రీ భగవానువాచ :

గతాసురగతాసుర్వా న శోచ్యో దేహవానజః | ఆత్మాజరోమరోభేదస్తస్మాచ్ఛో కాదికం త్యజేత్‌. 2

ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేఘూపజాయతే | సంగాత్కా మస్తతః క్రోధః క్రోధాత్సమ్మోహ ఏవచ. 3

సమ్మోహాత్స్మృతి విభ్రంశో బుద్ధినాశాత్ర్పణశ్యతి | దుఃసంగహానిః సత్సంగాన్మోక్షకామీచ కామనుత్‌. 4

కామత్యాగాదాత్మనిష్ఠః స్థిరప్రజ్ఞస్తదోచ్యతే | యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ. 5

యస్యాం జాగ్రతి భూతాని సానిశాపశ్యతోమునేః | ఆత్మన్యేవచ సంతుష్టస్తన్య కార్యం నవిద్యతే. 6

నైవతస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన | తత్త్వవిత్తు మహాబాబో గుణకర్మవిభాగయోః. 7

గుణా గుణషు వర్తన్తే ఇతిమత్వా న సజ్జతే | సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యతి. 8

జ్ఞానాగ్నిః సర్వకర్మాణీ భస్మసాత్కురుతోర్జున ః బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగంత్త్యక్త్వాకరోతియః. 9

లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా | సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. 10

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః | శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. 11

న హి కల్యాణ కృత్కశ్చిద్దుర్గతి తాతగచ్చతి |

అగ్ని దేవుడు పలికెను. సర్వ గీతలలో ఉత్తమోత్తమము అగు గీతా సారమును చెప్పెదను. పూర్వము శ్రీకృష్ణుడు భుక్తిముక్తి ప్రదమగు ఈ గీతను అర్జునునకు బోధించెను. శ్రీ భగవానుడు చెప్పెను. జీవుడు జన్మ రహితుడు కావున మరణించిన వానిని గూర్చి గాని, జీవించియున్న వానిని గూర్చి గాని శోకము చెందరాదు. ఆత్మ జర, మరణములు లేనిది భేద్యము కానిది. అందువలన శోకాదికమును విడువవలెను. విషయములను గూర్చి ఆలోచించు వానికి వాటిపై సంగమేర్పడును. సంగము వలన కామము, దాని వలన క్రోధము, దాని వలన సమ్మోహము, దాని వలన స్మృతి భ్రంశము, దాని వలన బుద్ధి నాశము కలుగును. బుద్ధి నాశము వలన మానవుడు నశించును. సత్సంగము వలన దుస్సంగ హానియు కలుగును. మోక్ష కోరిక కల వాడు ఇతర కామములను తొలగించుకొనును. కామము త్యజించిన వాడు ఆత్మ నిష్ఠుడగును. అపుడాతడు స్థిర ప్రజ్ఞుడని చెప్పబడును. సర్వ భూతములకు యేది నిశయో దానిలో యోగి మేల్కొని యుండును. చూచుచున్న మునికి యేది రాత్రియో దాని యందు ఇతర భూతములు మేల్కొని యుండును. ఆత్మ సంతుష్టుడైన వానికి మరి కర్తవ్యము లేమియు వుండవు. కర్మ చేసినను చేయకున్నను అతనికి ప్రయోజనమేమియు లేదు. ఓ మహా బాహు ! గుణ కర్మ విపాక తత్త్వము తెలిసిన వాడు గుణములు, గుణము లందు ప్రవర్తించుచున్నవని తెలిసికొని వాటిపై సక్తుడు కాడు. పాపము నంతను జ్ఞాన మనెడు నావతో దాట గలవు. ఆర్జునా ! జ్ఞానాగ్ని సర్వ కర్మలను భస్మము చేయును. సంగము విడిచి కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో చేయువాడు పద్మ పత్రము, జలము చేత వలె పాపము చేత లిప్తుడు కాడు. యోగ యుక్తాత్ముడగు యోగి అంతటను సమముగా చూచుచు సర్వ భూతముల యందు తనను తనలో సర్వ భూతములను చూడగలుగును. యోగభ్రష్టుడు పవిత్రులగు శ్రీమంతుల గృహము నందు జనించును. కల్యాణ కార్యము చేసిన వాడెవ్వడును దుర్గతి పొందట.

దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా. 12

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరంతితే | ఆర్తోజిజ్ఞాసు రర్థార్ఖీ జ్ఞానీచ భరతర్షభ. 13

చతుర్విధా భజన్తేమాం జ్ఞానీచైకత్వ మాస్థితః | అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే. 14

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః | అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతమ్‌. 15

అధియజ్ఞోహ మేవాత్ర దేహే దేహభృతాంవర | అంతకాలే స్మరన్మాంచ మద్భావం యాత్యసంశయః. 16

యం యం భావం స్మరన్నన్తే త్యజేద్దేహం తమాప్నుయాత్‌ |

ప్రాణం న్యస్య భ్రువోర్మధ్య అంతేప్రాప్నోతి మత్పదమ్‌. 17

ఓమిత్యేకాక్షరంబ్రహ్మ వదన్దేహం త్యజన్‌ తథా | బ్రహ్మాదిస్తంబపర్యన్తాః సర్వేమమ విభూతయః. 18

శ్రీమన్తశ్చోర్జితాః సర్వే మమాంశాః ప్రాణినః స్మృతాః | అహమేకో విశ్వరూప ఇతి జ్ఞాత్వా విముచ్యతే. 19

గుణమయమైనదియు, దివ్యమైనదియు అగు నామాయ లంఘింప శక్యము కానిది. నన్ను ఎవరు ఆశ్రయింతురో వారు ఈ మాయను దాట లేరు. ఓ భరత వంశ శ్రేష్ఠా ! కష్టములలో నున్నవాడు జిజ్ఞాసువు ప్రయోజనాపేక్ష కలవాడు అద్వైత దృష్టి గల జ్ఞాని ఈ నాలుగు విధములగు వారు నన్ను సేవింతురు, అక్షరమైన బ్రహ్మ అత్యుత్తమము. స్వభావము ఆధ్యాత్మమని చెప్పబడును. భూత భావోద్భవ కరమగు యజ్ఞమునకు కర్మ యని పేరు. వినాశ శీలమగు పదార్థము అది. భూతము పురుషుడు అధి దైవతము. ఈ దేహములో నేనే అధి యజ్ఞమును. మరణ కాలమున నన్ను స్మరించువాడు నన్నే పొందును. సంశయము లేదు. అంతమున యేయే భావమును స్మరించుచు దేహము విడుచునో దానినే పొందును. అంతమున ప్రాణమను భ్రూ మధ్యము నందుంచి, పరమాత్ముడనగు నన్ను పొందును. "ఓం" అను ఏకాక్షర రూప మగు బ్రహ్మను ఉచ్చరించుచు, దేహము త్యజించువాడు నన్నే పొందును. బ్రహ్మ మొదలు స్తంభము వరకు వున్న అన్నియు నా విభూతులే. శ్రీ మన్తములు తేజోవంతములు అగు ప్రాణులన్నియును నా అంశములే. నేనే విశ్వరూపుడను. ఈ విధముగ తెలుసుకొనినవాడు ముక్తుడగును.

క్షేత్రం శరీరం యో వేత్తి క్షేత్రజ్ఞః స ప్రకీర్తితః క్షేత్రక్షేత్రజ్ఞయోర్జానం యత్తద్‌జ్ఞానం మతంమమ. 20

మహాభూతాన్యహంకారరో బుద్ధిరవ్యక్తమేవచ | ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరాః. 21

ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః | ఏతతేత్రం సమాసేన సవికారముదాహృతమ్‌. 22

అమానిత్వ మదంభిత్వమహింసా క్షాన్తిరార్జవమ్‌ | ఆచార్యోపాసనం శౌచంస్థైర్య మాత్మవినిగ్రహః. 23

ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ | జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనమ్‌. 24

అసక్తి రనభిష్వంగః పుత్రధార గృహాదిషు | నిత్యంచ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. 25

మయిచానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ | వివిక్తదేశ సేవిత్వమరతిర్జన సంసది. 26

అధ్యాత్మ జ్ఞాన నిష్ఠత్వం తత్త్వజ్ఞానాను దర్శనమ్‌ | ఏతజ్‌జ్ఞానం యదతోన్యథా. 27

క్షేత్రమను పేరు గల ఈ శరీరమును తెలుసుకొనువాడు. క్షేత్రజ్ఞుడు. క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము నా జ్ఞానమే. మహా భూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఏకాదశ ఇంద్రియములు, పంచ ఇంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చేతనా, ధృతి. ఇవి సంక్షిప్తముగా వికార సహితమగు క్షేత్రము. అభిమానము లేకుండుట, దంభము లేకుండుట, అహింసా, ఓర్పు, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థము లందు వైరాగ్యము, అహంకారము లేకుండుట, జన్మ మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ రూపములగు దోషముల పరిశీలనము, అనాసక్తి, పుత్ర దార గృహాదులందు మమకారము లేకుండుట, ఇష్టానిష్టములు కలిగినపుడు నిత్యము సమచిత్తుడై ఉండుట, ఇతర సంబంధము లేక నాపై చలించని భక్తి, నిర్జన ప్రదేశమును సేవించుట, జన సమూహము నందు అనాసక్తి అధ్యాత్మ జ్ఞానము లందు స్థిరత్వము తత్త్వ జ్ఞాన దర్శనము. ఇది యంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి విరుద్ధమైనది అజ్ఞానము.

జ్ఞేయం యత్తత్ర్ప వక్ష్యామి యంజ్ఞాత్వామృతమశ్నుతే | అనాది పరమం బ్రహ్మ సత్త్వం నామతదుచ్యతే.

సర్వతః పాణిపాదాన్తం సర్వతోక్షి శిరోముఖమ్‌ | సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. 29

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్‌ | అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. 30

బహిరన్తశ్చ భూతానామచరం చరమేవచ | సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థంచాన్తికేపియత్‌. 31

అవిభక్తం చ భూతేషు విభక్తమివచ స్థితమ్‌ | భూతభర్తృచ విజ్ఞేయం గ్రసిష్ణుప్రభ విష్ణుచ. 32

జ్యోతిషామపితజ్జ్యోతిస్తమసః పరముచ్యతే | జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృదిసర్వస్యధిష్ఠితమ్‌. 33

ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మాన మాత్మనా | అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. 34

అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే | తేపి చాశు తరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః. 35

దేనిని తెలుసుకొనుటచే మానవుడు అమృతత్వమును పొందునో దానిని గురించి చెప్పెదను. పరబ్రహ్మ అనాది. సత్త్వ స్వరూపము. అది అంతటను పాణి పాదములు కలది. అన్ని వైపులను నేత్ర, శిరో, ముఖములు కలది. అన్ని వైపులను కర్ణములు కలది. సర్వమును ఆవరించి యుండును. సకలేంద్రియ గుణములను భాసింప చేయునది. సకలేంద్రియ శూన్యము. అది సంగరహితము, సర్వమును భరించునది. నిర్గుణము, గుణములను అనుభవించునది. భూతముల బయటను, లోపలను వున్నది. ఇది అచరము. చరము కూడ. సూక్ష్మ మగుటచే ఇది అవిజ్ఞేయము. ఇది దూరమునందును వున్నది. సమీపము నందును వున్నది. భూతములందు అవిభక్తమైనను విభక్తము వలె నుండునది. భూతములను భరించునది. వాటిని మ్రింగి వేయునది. ఇది జ్యోతిస్సులకు జ్యోతిస్సు. తమోతీతము. జ్ఞాన, జ్ఞేయ స్వరూపము, జ్ఞాన గమ్యము. అందరి హృదయములందు వున్నది. కొందరు ఈ ఆత్మను ధ్యానముచే తమ అంతఃకరణము నందే చూచెదరు. కొందరు సాంఖ్య యోగము చేతను, కొందరు కర్మయోగము చేతను చూచెదరు. ఈ విధముగా తెలియజాలని వారు ఇతరుల నుండి విని ఉపాసింతురు. శ్రుతి పరాయణులగు వారు కూడ మృత్యువును తప్పక తరింతురు.

సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసోలోభ ఏవచ | ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ. 36

గుణావర్తన్త ఇత్యేవ యోవ తిష్ఠతి నేంగతే | మానావమాన మిత్రారితుల్యస్త్యాగీ స నిర్గుణః. 37

ఊర్ద్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్‌ | ఛందాంసి యస్యపర్ణాని యస్తంవేద సవేద విత్‌. 38

ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్దైవ ఆసురఏవచ | అహింసాదిః క్షమాచైవ దైవీసంపత్తితోనృణామ్‌. 39

నశౌచంనాపి వాచారోహ్యాసురీ సమ్పదోద్భవః నరకత్వాత్ర్కోధలోభ కామస్తస్మాత్త్రయం త్యజేత్‌. 40

యజ్ఞస్తపస్తథా దానం సత్త్వాదైస్త్రివిధంస్మ్రతమ్‌| ఆయుఃసత్త్వం బలారోగ్య సుఖాయాన్నంతు సాత్త్వికమ్‌.

దుఃఖశోకామయాయాన్నం తీక్ష రూక్షన్తు రాజసమ్‌ | అమేధ్యోచ్ఛిష్టపూత్యన్నం తామసం నీరసాదికమ్‌. 42

యష్టవ్యోవిధినా యజ్ఞో నిష్కామాయ స సాత్త్వికః | యజ్ఞః ఫలాయ దంభాత్మా రాజసస్తామసః క్రతుః. 43

శ్రద్ధామంత్రాది విధ్యుక్తం తపః శారీరముచ్యతే | దేవాదిపూజాహింసాది వాఙ్మయం తపఉచ్యతే. 44

అనుద్వేగకరం వాక్యం సత్యం స్వాధ్యాయ సజ్జవః | మానసం చిత్తసంశుద్ధేర్మోనమాత్మవినిగ్రహః. 45

సాత్త్వికంచతపోకామం ఫలాద్యర్థన్తు రాజసమ్‌ | తామసం పరపీడాయై సాత్త్వికం దానముచ్యతే. 46

దేశాదౌచైవ దాతవ్యముపకారాయ రాజసమ్‌ | అదేశాదావవజ్ఞాతం తామసం దాన మీరితమ్‌. 47

సత్త్వము వలన జ్ఞానము, రజస్సు వలన లోభము, తమస్సు వలన ప్రమాద మోహ అజ్ఞానములు పుట్టును. గుణములు వాటి వాటి పనులను చేయుచున్నవి అని తెలుసుకొని జ్ఞాని తాను చలించడు. మాన అవమాన మిత్ర శత్రువుల విషయమున తుల్యముగ నుండు ఆ త్యాగి గుణాతీతుడు. ఈ అశ్వత్థము ఊర్ధ్వ మూలము, అధశ్శాఖము, వినాశరహితము. దీనికి ఛందస్సులు వర్ణములు అని ఎవ్వడు తెలుసుకొనునో అతడే వేదవేత్త. ఈ లోకమున దైవము, ఆసురము ఆని రెండు భూత సర్గములున్నవి. దైవీ సంపత్తి వలన మానవులకు అహింసా, క్షమా మొదలగునవి వుండును. అసురీ సంపద వలన శౌచము కాని, ఆచారము కాని వుండదు. క్రోధ లోభ కామములే నరకము. అందుచే ఆత్రయమును త్యజింపవలెను. సత్త్వాది గుణములను బట్టి యజ్ఞ తపో దానాదులు త్రివిధములుగా వుండును. ఆయుఃసత్త్వ, బల, ఆరోగ్య, సుఖ కరమగు, అన్నము సాత్త్వికము, దుఃఖము, శోకము, ఆమయము కల్గించు తీక్షరూక్షాన్నము రాజసము. అమేధ్యము ఉచ్ఛిష్ఠ, పూతి, నీరసమగు అన్నము, తామసము. నిష్కామముగా విధిపూర్వకముగా చేయు యజ్ఞము సాత్త్వికము. ఫలా పేక్షచే దంభమున చేయు యజ్ఞము రాజసము శ్రద్ధా మంత్రాది విధి పూర్వకముగ చేయు తపస్సు శారీరము. దేవ పూజా, అహింసాదికము, వాఙ్మయ తపస్సు. ఇతరులకు బాధను కల్గించనిది సత్యము ఐన వాక్యము. స్వాధ్యాయము జపము. ఇదు కూడ వాఙ్మయ తపస్సు, చిత్త సంశుద్ధి కొరకై మౌనమును అవలంబించుట, మానస తపస్సు. దీనికే ఆత్మ వినిగ్రహమని పేరు. ఫలా పేక్ష లేని తపస్సు సాత్త్వికము. ఫలాదులకై చేయునది రాజసము. పరపీడకై చేయునది తామసము. యుక్త దేశాదులందు చేయు దానము సాత్త్వికము. ప్రయోజనమునుద్దేశించు దానము రాజసము. అయుక్త దేశాదులందు అనాదర పూర్వముగ చేయు దానము తామసము.

ఓం తత్పదిత నిర్థేశో బ్రహ్మణస్త్రి విధః స్మృతః | యజ్ఞదానాదికం కర్మభుక్తిముక్తి ప్రదంనృణామ్‌. 48

అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలమ్‌ | భవత్యత్యాగినాం ప్రేత్య నతుసన్న్యాసినాం క్వచిత్‌. 49

తామసః కర్మసంయోగా న్మోహాత్ల్కేశభయాదికాత్‌ | రాజసః సాత్త్వికోకామాత్పంచైతే కర్మహేతవః. 50

అధిష్ఠానం తథాకర్తా కరణంచ వృథగ్విధమ్‌ | త్రివిదాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్‌. 50

ఏక జ్ఞానం సాత్త్వికం స్యాత్పృథగ్జానంతు రాజసమ్‌ |

అతత్త్వార్థం తామసం స్యాత్కర్మాకామాయ సాత్త్వికమ్‌. 52

కామాయ రాజసం కర్మ మోహాత్కర్మతు తామసమ్‌| సిద్ధ్య సిద్ధ్యోః సమః కర్తాసాత్త్వికో రాజసోహ్యపి. 53

శఠోలసస్తామసః స్యాత్కార్యాదిధీశ్చ సాత్త్వికీ | కార్యార్థం సా రాజసీ స్యాద్విపరీతాతు తామసి. 54

మనోధృతిః సాత్త్వికీ స్యాత్ర్పీతి కామేతి రాజసీ | తామసీతు ప్రశోకాదౌ సుఖం సత్త్వాత్త దన్తగమ్‌. 55

సుఖం తద్రాజనం చాగ్రే అన్తే దుఃఖన్తు తామసమ్‌ | అతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌.

స్వకర్మణా తమభ్యర్చ్య విష్ణుం సిద్ధించ విన్ధతి | కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా. 57

బ్రహ్మాది స్తంబ పర్యన్తం జగద్విష్ణుంచ వేత్తియః | సిద్ధి మాప్నోతి భగవద్భక్తో భాగవతో ధ్రువమ్‌. 58

ఇత్యాగ్నేయే (మహా) ఆదిపురాణ గీతాసారో నామైకాశీత్యధిక త్రిశతతమోధ్యాయః.

బ్రహ్మ యొక్క నిర్దేశము, ఓం, తత్‌, సత్‌ అని త్రివిధము. మానవులకు యజ్ఞ దానాది కర్మలు భుక్తి ముక్తి ప్రదములు. అనిష్టము, ఇష్టము, మిశ్రము, అని, త్రివిధమగు కర్మ ఫలము, త్యాగ రహితులకే మరణానంతరము కలుగును. సన్యాసులకు ఎన్నడును కలుగదు. కర్మ సంయోగము, మోహము, క్లేశము, భయము మొదలగు దానివలన చేయునది తామసకర్మ. కామము లేకుండా చేయునది సాత్త్వికకర్మ. తద్భిన్నము రాజసము, అధిష్ఠానము, కర్త వివిధ కరణ జీతము, వివిధ చేష్టలు దైవము ఈ ఐదును కర్మ హేతువులు. ఏకత్వజ్ఞానము సాత్త్వికము. భేదజ్ఞానము రాజసము. అతాత్త్విక జ్ఞానము, తామసము. ఆ కామకర్మ సాత్త్వికము, సకామ కర్మరాజసము. మోహకృతమగు కర్మ తామసము, సిద్ధ్యసిద్ధులయందు, సమముగా నుండు కర్త సాత్త్వికుడు తద్భిన్నుడు రాజసుడు. శఠుడు అలసుడుయైన వాడు తామసుడు. కార్యాది నిశ్చయము సాత్త్వికము కార్యార్థమైన నిశ్చయము రాజసము. తద్విపరీతము తామసము. మనఃస్థైర్యము సాత్త్వికము. ప్రీతికామము రాజసము. దుఃఖాదికము తామసము. ప్రారంభమున దుఃఖముగనున్నను, చివర సుఖము నిచ్చునది. సాత్త్వికము. ప్రారంభమున సుఖము, అంతమున దుఃఖము అయినది రాజసము. ప్రారంభమునందు అంతము నందు దుఃఖహేతువైనది తాపసము. ఏ విష్ణువు ఈ ప్రపంచము నంతను వ్యాపించియున్నాడో, ఆతడే ఈ భూతముల ప్రవృత్తికి హేతువు. అట్టి విష్ణువును స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందును. సర్వా వస్థలయందును. సర్వకాలములందును. మనోవాక్కాయ కర్మలచే బ్రహ్మాదిస్తంబ పర్యంతమగు ఈ జగత్తు విష్ణు స్వరూపము. అని భావన చేయు భగవద్భక్తుడగు భాగవతుడు తప్పక సిద్ధిని పొందును.

అగ్ని మహాపురాణమున గీతసారమను మూడువందల ఎనిమిది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page