Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ ధారణా

అగ్ని రువాచ :

ధారణా మనసో ధ్యేయే సంస్థితిర్ధ్యాన వద్ద్విధా | మూర్తామూర్త హరిధ్యానమనో ధారణతో హరిః. 1

యద్బాహ్యావ స్థితం లక్ష్యం తస్మాన్న చలతేమనః | తావత్కాలం ప్రదేశేషు ధారణా మనసిస్థితిః. 2

కాలావధి పరిచ్ఛిన్నం దేహేసంస్థాపితం మనః | నప్రచ్యవతి యల్లక్ష్యాద్ధారణా సాభిధీయతే 3

ధారణాద్వాదశా యామాధ్యానం ద్వాదశ ధారణాః | ధ్యానం ద్వాదశకం యావత్సమాధిరభి ధీయతే. 4

ధారణాభ్యాసయుక్తాత్మా యదిప్రాణౖర్వి ముచ్యతే | కులైక వింశముత్తార్య స్వర్యాతి పరమం పదమ్‌. 5

యస్మిన్యస్మిన్భవేదంగే యోగినాం వ్యాధిసంభవః | తత్తదంగం ధియా వ్యాప్తం ధారయేత్తత్త్వం ధారణమ్‌.

ఆగ్నేయీ వారుణీచైవ ఐశానీ చామృతాత్మికా | సాగ్నిః శిఖాఫడం తాచ విష్ణోః కార్యాద్విజోత్తమ. 7

నాడీభిర్వికటం దివ్యం శూలాగ్రం వేదయేచ్ఛుభమ్‌ | పాదాంగుష్ఠాత్క పాలాన్తం రశ్మిమండల మావృతమ్‌. 8

తిర్యక్‌ చాధోర్ధ్వ భాగేభ్యః ప్రయాన్తోతీవతేజసా | చింతయేత్సాధ కేంద్రస్తం యావత్సర్వం మహామునే. 9

భస్మీభూతం శరీరం స్వంతత శ్చైవోప సంహరేత్‌ | శీతశ్లేష్మాదయః పాపం వినశ్యంతిద్విజాతయః. 10

అగ్నిదేవుడు పలికెను. ధ్యేయముపై మనస్సును నిలుపుడు. ధారణ ధ్యానమువలె ఇదికూడ సాకారము నిరాకారము అని రెండు విధములు. భగవంతునిపై మనస్సు నిలుపుడు. క్రమముగా మూర్తధారణ, అమూర్తధారణ అని చెప్పబడును. దీని వలన భగవత్ర్పాప్తి కలుగును. బాహ్య లక్షముపై మనస్సు కదలకుండా ఎంత కాలము నిలచునో అట్టి స్థితికి ధారణ అని పేరు. దేహములో పల కూడ నియత సమయము వరకు మనస్సును లక్షముపై నిలిపి వుంచుట కూడ ధారణ అని పేరు. పండ్రెండు ఆయామములు కల ధారణ వుండును. పండ్రెండు ధారణములు ధ్యానమగును. పండ్రెండు ధ్యానముల పాటు మనస్సు ఏకాగ్రమైనచో దానికి సమాధి యని పేరు. ధారణా భ్యాససమయమున ప్రాణములు విడుచువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి పరమ పదమగు స్వర్గమును పొందును. యేయే అంగమునందు వ్యాధి కలుగునో ఆ అంగమును బుద్ధిచే వ్యాప్తము చేసి తత్త్వమున ధారణ చేయవలెను. ఆగ్నేయావారుణి ఐశాని. అమృతాత్మికా అను విష్ణువు యొక్క నాలుగు విధముల ధారణ చేయవలెను. ఆ సమయమున అగ్ని యుక్త శిఖా మంత్రమునకు ఫట్‌ చేర్చి జపము చేయవలెను. నాడుల ద్వారా వికటము. దివ్యము శుభము అగు శూలాగ్రమును వేధ చేయవలెను. పాదాంగుష్ఠము మొదలు కపోలము వరకు కిరణసముదాయము వ్యాప్తమై వున్నది. అది మహావేగముతో క్రింది నుండిపైకి, పైనుండి క్రిందికి తిరుగుచున్నట్లు భావన చేయవలెను. సాధకుడు తన శరీరము పూర్తిగా, లోపల భస్మమయినట్లు కనబడునంతవరకు రశ్మి మండలమును ధ్యానించవలెను. పిదప ఆధారణను, ఉపసంహరించవలెను. ఈ విధముగా చేయుటచే ద్విజులు శీత శ్లేష్మాది రోగములను తమ పాపములను నశింపచేయుదురు.

శిరోధీరం వాచారంచ కంఠం చాధోముఖేస్మరేత్‌ | ధ్యాయేదచ్ఛిన్న చిత్తాత్మా భూయోభూతేన చాత్మనా. 11

స్ఫురచ్ఛీకర సంస్పర్శ ప్రభూతే హిమగామిభిః ధారాభిరఖిలం విశ్వమాపూర్వభువి చిన్తయేత్‌. 12

బ్రహ్మరంధ్రాచ్చ సంక్షోభాద్యావదాధార మండలమ్‌ |

సుషుమ్నాం తర్గతో భూత్వా సంపూర్ణేందు కృతాలయమ్‌. 13

సంప్లావ్య హిమసంస్పర్శ తోయేనామృత మూర్తినా | క్షుత్పిపాసాక్రమ ప్రాయసంతాప పరిపీడితః. 14

ధారయేద్దారుణీం మంత్రీతుష్ట్యర్థం నాప్యతంద్రితః | వారుణీ ధారణాప్రోక్తా ఐశానీంధారణాంశృణు. 15

పిదప ధైర్యముతో విచారణ చేయుచు ముఖము క్రిందనున్న కంఠమును ధ్యానించవలెను. చిత్తము నష్టము కాకూడదు. తన అంతఃకరణ ద్వారా ధ్యానలగ్నుడై అనంత జల కణములు ఆవిర్భవించి, ఒక దానితో ఒకటి కలసి హిమరాశిని పుట్టించుచున్నట్లును దానిచే భూమిపై జలధారలు ప్రవహించుచు సకల విశ్వమును ముంచెత్తుచున్నట్లును భావించవలెను. ఈ విధముగ హిమస్పర్శచే శీతలమైన అమృత స్వరూప జలముచే బ్రహ్మ రంధ్రము మొదలు మూలాధారము వరకునువున్న చక్ర మండలమును ఆప్లావితము చేసి, సుసుమ్నా నాడి మధ్య ఇందు మండలమును ధ్యానించవలెను. ఆకలి దప్పికలచే క్రమముగా వచ్చిన క్లేశములచే మిక్కిలి పీడితుడై తనతుష్టి కొరకై వారుణీ ధారణా చింతన చేసి ఆలస్యము విడచి విష్ణు మంత్ర జపమును చేయవలెను. ఈ విధముగా వారుణీ ధారణ చెప్పబడినది. ఐశాలీ ధారణను చెప్పెదను.

వ్యోమ్నిబ్రహ్మమయే పద్మేప్రాణాపానే క్షయంగతే | ప్రసాదం చింతయేద్విష్ణోర్యా వచ్చిన్తా క్షయంగతా. 16

మహాభావం జపేత్సర్వం తతోవ్యాపక ఈశ్వరః | అర్ధేందుం పరమంశాంతం నిరాభాసం నిరంజనమ్‌. 17

అసత్యం సత్యమాభాతి తావత్సర్వం చరాచరమ్‌ | యావత్స్యస్పంద రూపన్తు నదృష్టం గురు వక్త్రతః. 18

దృష్టేతస్మిన్పరే తత్త్వేఆబ్రహ్మ సచరాచరమ్‌ | ప్రమాతృ మానమేయంచ ధ్యానహృత్పద్మకంపనమ్‌. 19

మాతృ మోదకవత్సర్వం జపహోమార్చనాదికమ్‌ | విష్ణుమంత్రేణ వాకుర్యాదమృతాం దారణాంవదే. 20

సంపూర్ణేందు నిభం ధ్యాయేత్కమలం తంత్రిముష్టిగమ్‌ |

శిరఃస్థం చింతయేద్యత్నాచశాంకాయుత వర్చసమ్‌. 21

సంపూర్ణ మండలంవ్యోమ్ని శివకల్లోల పూర్ణితమ్‌ | తథాహృత్కమలే ధ్యాయేత్తన్మధ్యే స్వతనుంస్మరేత్‌.

సాధకో విగతక్లేశో జాయతే ధారణాదిభిః. 22

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ధారణాయోగ నిరూపణం నామ పంచసప్తత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

ప్రాణా పానములు క్షయమును పొందగ హృదయాకాశమున బ్రహ్మమయ పద్మమునందు విష్ణు ప్రసాదమును, చింత నశించు వరకు ధ్యానము చేయవలెను. పిదప వ్యాపకమగు ఈశ్వర రూపముతో వుండి శాంతము నిరంజనము, నిరాభాసము, అర్ధ చంద్ర స్వరూపము, అగు సంపూర్ణ మహా భావము యొక్క జపధ్యానము చేయవలెను. జీవాత్మ బ్రహ్మ స్వరూపుడే అను విషయమును గురు ముఖతః తెలియనంతవరకు ఈ చరాచర జగత్తు అసత్యమైనను సత్యముగా భాసించును. ఆ పరతత్త్వము తెలిసిన పిమ్మట బ్రహ్మ మొదలు, సకల చరాచర జగత్తు ప్రమాత, మానము, మేయము, సర్వము కూడ హృదయ కమలమునందు లీనమై పోవును. జప హోమ పూజనాదులు తల్లి ఇచ్చిన మోదకముల వలె మధురమైనవని తెలిసికొని విష్ణు మంత్రముతో అనుష్ఠించవలెను. ఇపుడు అమృతమయీ ధారణము చెప్పెదను. శిరస్సు యొక్క నాడియందు కేంద్రస్థానమున పూర్ణ చంద్ర సమానమగు కమలములను ధ్యానించవలెను. ఆకాశమునందు పదివేల చంద్రులతో సమానమగు ఒక చంద్రమండలము ఉదయించినది. అది కల్యాణమయములగు కల్లోలములతో నిండియున్నది అని భావన చేయవలెను. అట్టి భావన తన హృదయకమలమునందు కూడ చేసి దాని మధ్య భాగమున తన శరీరమున్నట్లు భావించ వలెను. ధారణాదుల ద్వారా సాధకుని క్లేశములన్నియు నశించును.

అగ్ని మహా పురాణమున ధారణా యోగ నిరూపణమను మూడు వందల డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page