Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టత్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రామో క్తనీతిః

అగ్నిరువాచ :

నీతిస్తే పుష్కరోక్తాతు రామోక్తాలక్ష్మణాయచ | జయాయ తాం ప్రవక్ష్యామి శృణుధర్మాది వర్ధినీమ్‌. 1

రామ ఉవాచ :

న్యాయేనార్జన మర్థస్య వర్ధనం రక్షణం చరేత్‌ | సత్పాత్ర ప్రతి పత్తిశ్చ రాజవృత్తం చతుర్విధమ్‌. 2

నయస్య వినయో మూలం వినయః శాస్త్ర నిశ్చయాత్‌ | వినయో హీన్ద్రియజయసై#్తర్యుక్తః పాలయేన్మహీమ్‌. 3

(అ) 2/9

శాస్త్రం ప్రజ్ఞాధృతిర్దాక్ష్యం ప్రాగల్భ్యం ధారయిష్ణుతా | ఉత్సాహోవాగ్మితౌదార్యమాపత్కాలసహిష్ణుతా. 4

ప్రభావః శుచితామైత్రీ త్యాగః సత్యం కృతజ్ఞతా | కులం శీలం దమశ్చేతి గుణాః సమ్పత్తిహేతవః. 5

ప్రకీర్ణవిషయారణ్య ధావన్తం విప్రమాథినమ్‌ | జ్ఞానాంకుశేన కుర్వీత వశ్యమింద్రియదంతినమ్‌. 6

కామఃక్రోధస్తథాలోభో హర్షోమానోమదస్తథా | షడ్వర్గ ముత్సృజేదేన మస్మింస్త్యక్తే సుఖీనృపః. 7

అగ్నిదేవుడు పలికెను : వశిష్ఠా! ఇంతవరకు, పుష్కరుడు బోధించిన రాజనీతిని చెప్పితిని. ఇపుడు లక్ష్మణునకు రాముడు చెప్పిన విజయప్రదమగు రాజనీతిని వినుము. శ్రీ రాముడు చెప్పెను. లక్ష్మణా! న్యాయముగా ధనమును అర్జించుట, సంపాదించిన దానిని వ్యాపారాదుల ద్వారా వృద్ధి పొందించుకొనుట, దానిని స్వజనుల నుండియు, పరులనుండియు రక్షించుకొనుట, సత్పాత్రములందు వినియోగించుట ఇవి రాజు చేయవలసిన నాలుగు పనులు. సమయమునకు మూలము వినయము. అది శాస్త్రనిశ్చయముచే కలుగును. వినయమనగా ఇంద్రియజయము. వినయము కలవాడే శాస్త్రములను పొందగల్గును. శాస్త్రజ్ఞానము, ఎనిమిది గుణములు గల బుద్ధి, ధృతి, దక్షత, ప్రగల్భత్వము, ధారణశక్తి, ఉత్సాహము, ప్రవచనశక్తి, దృఢత్వము, ప్రభుశక్తి, శుచిత్వము, మైత్రి, త్యాగము, సత్యము, కృతజ్ఞత, కులీనత్వము, శీలము, దమము -ఇవి సంపత్తికి హేతువులగు గుణములు. విషయములనెడు మహారణ్యములో నిర్భయముగ పరుగెత్తు చున్న ఇంద్రియగజములను జ్ఞానాంకుశముతో వశమునందుంచుకొనవలెను. రాజు, కామ - క్రోధ - లోభ - మోహ - హర్ష - మద - మాత్సర్య మానములను అరిషడ్వర్గమును పూర్తిగా పరిత్యజించినచో సుఖవంతుడగును.

ఆన్వీక్షికీం త్రయీం వార్తాం దండనీతించ పార్థివః | తద్విద్యైస్తత్క్రియోపేతైశ్చింతయేద్వినయాన్వితః. 8

ఆన్వీక్షిక్యార్థ విజ్ఞానం ధర్మాధర్మౌత్రయీస్థితౌ | అర్థానర్థౌతు వార్తాయాం దండనీత్యాం నయాన¸°. 9

అహింసా సూనృతావాణీ సత్యం శౌచం దయాక్షమా | వర్ణినాం లింగినాం చైవ సామాన్యో ధర్మ ఉచ్యతే. 10

ప్రజాః సమనుగృహ్ణీయాత్కుర్యా దాచార సంస్థితమ్‌ | వాక్సూనృతా దయాదానం హీనోపగతరక్షణమ్‌. 11

ఇతివృత్తం సతాం సాధుహితం సత్పురుషవ్రతమ్‌ | అధివ్యాధిపరీతాయ అద్యశ్వోవావినాశినే. 12

కోహి రాజాశరీరాయ ధర్మాపేతం సమాచరేత్‌ |

రాజు, వినయ గుణ సంపన్నుడై, అన్వీక్షకి, వేదత్రయము, వార్త (కృషి వాణిజ్య పశుపాలనాదికము) దండనీతి అను నాలుగు విద్యలను గూర్చి విద్వాంసుల వద్దను, వాటి ప్రయోగమునందు నేర్పు కలవారి వద్దను కూర్చుండి చింతనము చేయవలెను. అన్వీక్షకి వలన ఆత్మజ్ఞానము, వస్తుయథార్థ స్వరూపజ్ఞానము కలుగును. ధర్మాధర్మ జ్ఞానము వేదత్రయాధీనము. అర్థ - అనర్థములు వార్తా ప్రయోగాధీపములు. న్యాయ - అన్యాయములు దండనీతి యొక్క సముచిత ప్రయోగముపై ఆధారపడియున్నవి. ఏ ప్రాణులకును కష్టము కలిగించకుండుట, మధురముగా మాటలాడుట, సత్యము పలుకుట, బైటను అంతరంగమునందును పవిత్రముగ నుండుట, శౌచాచారపాలనము, దీనులపైదయ, ఓర్పు - ఇవి అన్ని వర్ణములవారికిని, ఆశ్రమములవారికిని వర్తించు సాధారణ ధర్మములు. రాజు ప్రజ ను అనుగ్రహించుచు, సదాచార తత్పరుడై ఉండవలెను. మధురమైన వాక్కు దీనులపైదయ, దేశకాలానుసారము సత్పాత్రదానము, దీనులను శరణాగతులను రక్షించుట, సత్పురుష సహవాసము - ఇది సత్పురుషుల ఆచారము. ఈ ఆచారము ప్రజాసంగ్రహోపాయము. ఇదిలోక ప్రశంసాపాత్రముగాన శ్రేష్ఠము. భవిష్యత్తులోగూడ అభ్యుదయహేతువుగాన హితకరము. ఈ శరీరము రోగములతోను, మానసిక చింతలతోను నిండియున్నది. నేడో, రేపో, దీని వినాశము నిశ్చితము. ఇట్టి పరిస్థితులలో ఇట్టి శరీరము కొరకై ఏ రాజు అధర్మాచరణము చేయును ?

నహిస్వ సుఖమన్విచ్చన్పీడయేత్కృపణం జనమ్‌. 13

కృపణః పీడ్యమానోహి మన్యునా హన్తిపార్థివమ్‌ | క్రియతే7 భ్యర్హణీయాయ స్వజనాయయథాంజలిః. 14

తతఃసాధుతరఃకార్యో దుర్జనాయశివార్థినా | ప్రియమేవాభిధాతవ్యం సత్సునిత్యం ద్విషత్సుచ. 15

దేవాస్తే ప్రియవక్తారః పశవః క్రూరవాదినః | శుచిరాస్తిక్యపూతాత్మా పూజయేద్దేవతాఃసదా. 16

దేవతావద్గురుజన మాత్మవచ్చసుహృజ్జనమ్‌ | ప్రణిపాతేన హిగురుం సతో7మృషానుచేష్టితైః. 17

కుర్వీతాభిముఖాన్భృత్యైర్దేవాన్సుకృత కర్మణా | సద్భావేన హరేన్మిత్రం సంభ్రమేణచ బాంధవాన్‌. 18

స్త్రీభృత్యాన్ర్పేమదానాభ్యాం దాక్షిణ్యనేతరంజనమ్‌ | అనిందాపరకృత్యేషు స్వధర్మపరిపాలనమ్‌. 19

కృపణషు దయాలుత్వం సర్వత్ర మధురాగిరః | ప్రాణౖరప్యుపకారిత్వం మిత్రాయావ్యభిచారిణ. 20

గృహాగతే పరిష్వఙ్గః శక్త్యా దానం సహిష్ణుతా | స్వసమృద్ధిష్వనుత్సుకః పరవృద్ధిష్వమత్సరః. 21

అపరోపతాపి వచనం మౌనవ్రత చరిష్ణుతా |

బంధుభిర్బద్ధ సంయోగః స్వజనే చతురస్రతా | ఉచితాను విధాయిత్వా మితివృత్తం మహాత్మనామ్‌. 22

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామోక్త నీతిర్నామాష్ట త్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

రాజు తాను సుఖించుచు దీనులను పీడించ కూడదు. ఏలనన పీడితులైన దీనజనులు దుఃఖము వలన కలిగిన క్రోధముచే క్రూరుడైన రాజును నశింపజేయుదురు. కల్యాణమును కోరురాజు పూజ్యుల విషయమున ఏ విధమున అంజలి ఘటించి అదరము చూపునో దుష్టుల విషయమున అంత కంటెకూడ అధికమగు అదరము చూపవలెను. మంచి స్నేహితుల విషయమునను, దుష్టులగు శత్రువుల విషయమునను గూడ ప్రియవచనములే పలుకవలెను. ప్రియవాది 'దేవత' ; కటువాది 'పశువు'. రాజు బైటను లోపలను విశుద్ధుడై, అస్తికత్వముతో అంతఃకరణమును పవిత్రము చేసికొని సర్వదా దేవతలను పూజించవలెను. గురువులను దేవతలను వలె పూజించవలెను. మిత్రులను తనతో సమానులని భావించుచు బాగుగా సత్కరించవలెను. తన ఐశ్వర్యమును రక్షించుకొనుటకును, వృద్ధిపొందించుకొనుటకును, రాజు ప్రతిదినము ప్రణామము చేయుచు పెద్దలను అనుకూలులనుగా చేసికొనవలెను. సాంగవేదాధ్యయనము చేసిన వారు ప్రవర్తించు విధముగ ప్రవర్తించుచు విద్యావృధ్ధులగు సత్పురుషులను సుముఖులను చేసికొనవలెను. సుకృతకర్మలచేదేవతానుకూల్యము సంపాదించవలెను. సద్భావముచే మిత్రులను, అదరముచే బంధువులను, ప్రేమచే స్త్రీలను, దానముచే భృత్యులను, అనుకూలులుగ చేసికొనవలెను. ఇతరులనుఅనుకూలతా ప్రదర్శనము ద్వారా సుముఖులను చేసికొనవలెను. ఇతరుల పనులు నిందింపకుండుట, తన వర్ణాశ్రమధర్మములను నిరంతరము పాలించుట, దీనులయెడదయ, లోకవ్యవహారము లన్నింటి యందును, అందరితోడను, మధురముగా మాటలాడుట, ప్రాణములిచ్చియైనను తన ప్రియమిత్రులకు ఉపకారము చేయుటకై సిద్ధముగా ఉండుట ఇంటికి వచ్చిన మిత్రులను, ఇతర సజ్జనులను కౌగిలించుకొనుట, అవసరమైనచో యథాశక్తిగా వారికి ధనమిచ్చుట, ఇతరుల కటుప్రవర్తనను, కఠోరవచనములను సహించుట, తనకు అభివృధ్ధి కలిగినపుడు వికారరహితుడుగ నుండుట, ఇతరులకు అభ్యుదయ కలిగినపుడు ఈర్ష్య లేకుండుట, ఇతరులకు బాధ కలిగించు మాట పలుకకుండుట, మౌనముగా నుండుట, బంధువులతో సంబంధము అవిచ్ఛిన్నముగ ఉంచుకొనుట, సజ్జనులతో ఋజుప్రవర్తనము, వారి సంమతి ప్రకారము కార్యము చేయుట ఇవి మహాత్ముల ఆచారము.

అగ్ని మహాపురాణమునందు రామోక్తనీతివర్ణన మను రెండు వందల ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page