Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అథ శకునాని

పుష్కర ఉవాచ :

ఔషధాని చ యుక్తాని ధాన్యం కృష్ణమశోభనం | కార్పాసం తృణ శుష్కఞ్చా గోమయం వైధనానిచ. 1

అంగారం గుడసర్జౌచ ముండాభ్యక్తం చ నగ్నకమ్‌ | అయః పంకం చర్మకేశౌ ఉన్మత్తంచ సపుంసకమ్‌. 2

చండాలశ్వపచాద్యాని నరా బంధన పాలకాః | గర్భిణీ స్త్రీచవిధవాః పిణ్యాకాదీని వై మృతమ్‌. 3

తుషభస్మకపాలాస్థి భిన్నభాండమశస్తకమ్‌ | అశస్తో వాద్యశబ్దశ్చ భిన్నభైరవ జర్జరః. 4

ఏహీతి పురతః శద్దః శస్యతే నతు పృష్ఠతః | గచ్ఛేతిపశ్చాచ్ఛబ్దో7గ్ర్యః పురస్తాత్తు విగర్హితః. 5

క్వయాసి తిష్ఠమాగచ్ఛ కింతే తత్ర గతస్యచ | అనిష్టశబ్దా మృత్యర్థం క్రవ్యాదశ్చ ధ్వజాదిగః. 6

స్థలనం వాహనానాంచ శస్త్రభంగస్తథైవచ | శిరోఘాతశ్చ ద్వారాద్యైశ్ఛ త్రవాసాదిపాతనమ్‌. 7

హరిమభ్యర్చ్య సంస్తుత్య స్యాదమంగల్య నాశనమ్‌ | ద్వితీయం తు తతోదృష్ట్వా విరుద్ధం ప్రవిశేద్గృహమ్‌. 8

పుష్కరుడు పలికెను : పరశురామా! యాత్రాసమయమున, శ్వేతవస్త్రములు, స్వచ్ఛమైన ఉదకము, ఫలభరితమగు వృక్షము, నిర్మలాకాశము. క్షేత్రములలోని సస్యములు, నల్లని ధాన్యము కనబడుట అశుభము. దూది, తృణములు కలసిన ఎండినగోమయము (పిడకలు), సుత్తి, బొగ్గులు, గుడము, కరాయల తలగొరిగించుకొని తైలము పట్టించుకొనిన నగ్నసాధువు, ఇనుము, బురద, చర్మము, వెండ్రుకలు, పిచ్చివాడు, నపుంసకుడు, చండాలుడు, కారాగారాధికారి, గర్భిణి, విధవ, తెలకపిండి, మృత్యువు, ఊక, బూడిద, నిప్పులు, ఎముకలు, బ్రద్దలైన పాత్రలు - ఇవి యుద్ధయాత్రాసమయమునందు కనబడుట అశుభము. బ్రద్దలైన తాళము చిప్పలధ్వనివలె భయంకరముగ వినవచ్చు వాద్యధ్వని మంచిదికాదు. ''బయలుదేరిరమ్ము'' అను శబ్దము ముందు నుండి వినబడినచో శుభము; వెనుక నుండి వినవచ్చినచో అశుభము 'వెళ్ళుము' అను శబ్దము వెనుక నుండి వినబడినచో శుభము ; ముందు నుండి వినబడినచో అశుభము. ''ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆగుము; వెళ్ళకుము. అచటికి వెళ్ళుటచే నీకేమి లాభము ? ఇట్టి మాటలుఅనిష్టసూచకములు. ధ్వజాదులపై గ్రద్ద మొదలగు మాంసాహారి పక్షులు కూర్చున్నను, అశ్వ - గజాదివాహనములు తొట్రువడి పడిపోయినను, ఆయుధము విరిగిపోయినను, ద్వారాదులు తగిలి శిరస్సుపై దెబ్బ తగిలినను, ఛత్ర వస్త్రాదులను ఎవ్వడైనను క్రింద జార విడచినను, ఈ అపశకునము లన్నియు మృత్యు కారకములు. శ్రీ మహావిష్ణువును పూజించి స్తుతించినచో అమంగళములు తొలగిపోవును. రెండవ పర్యాయము కూడ ఈ అపశకునములు కనబడినచో ఇంటికి తిరిగి వచ్చి వేయవలెను.

శ్వేతాః సుమనసఃశ్రేష్ఠాః పూర్ణకుంభో మహోత్తమః | మాంసం మత్స్యా దూరశబ్దా వృధ్ధఏకః పశుస్త్వజః. 9

గావస్తురంగమానాగా దేవాశ్చ జ్వలితో7నలః | దూర్వార్ద్రగోమయం వేశ్యా స్వర్ణరూప్యంచ రత్నకమ్‌. 10

వచా సిద్ధార్థకౌషధ్యో ముద్గ ఆయుధ ఖడ్గకమ్‌ | ఛత్రం పీఠం రాజలింగం శవం రుదితవర్జితమ్‌. 11

ఫలంఘృతం దధిపయోహ్యక్షతా దర్శమూక్షికమ్‌ | శంఖ ఇక్షుః శుభం వాక్యం భక్తవాదిత్రగీతకమ్‌. 12

గంభీరమేమస్తనితం తడిత్తుష్టిశ్చ మానసీ | ఏకతః సర్వలింగాని మనసస్తుష్టిరేకతః. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మాంగల్యాధ్యాయో నామత్రిశంశదధిక ద్విశతతమోధ్యాయః.

యాత్రా సమయమున తెల్లని పుష్పములు కనబడుట శుభప్రదము. జలపూర్ణకుంభము కనబడుట అత్యుత్తమము. మాంసము, మత్స్యములు, దూరము నుండి కోలాహలము, ఒంటిరియైన వృద్ధుడు మేకలు, గోవులు అశ్వములు, గజములు, దేవప్రతిమలు, మండుచున్న అగ్ని, దూర్వలు, గోమయము, వేశ్య, బంగారము, వెండి, రత్నములు, వనఆవాలు మొదలైన ఓషధులు, పెసలు, ఆయుధములలో ఖడ్గము, ఛత్రము, బల్ల, రాజచిహ్నములు, కూడా విలాపించువారు లేని శవము, ఫలములు, నెయ్యి, పెరుగు, పాలు, అక్షతలు, అద్దము, తేనె, శంఖము, చెరకు, శుభసూచకములగు మాటలు, భక్తులు గాన - వాద్యవాదనములు, మేఘగంభీరగర్జనము, మెరుపు మెరయుట, మనఃసంతోషము- ఇవన్నియు శుభశకునములు. శుభ శకునములన్నియు ఒక ప్రక్క, మనఃప్రసాదము ఒక ప్రక్క - ఈ రెండును సమానములు.

అగ్ని మహాపురాణమునందు శకునవర్ణన మను రెండువందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page