Sri Devi Bhagavatam-1    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

వ్యాసః : ఏవం స మహిషో నామ దానవో వరదర్పితః | ప్రాప్య రాజ్యం జగత్సర్వం వశే చక్రే మహాబలః. 1

పృథివీం పాలయామాస సాగరాంతా భుజార్జితామ్‌ | ఏకచ్ఛత్రాం నిరాతంకాం వైరివర్తవిర్జితామ్‌. 2

సేనానీ శ్చిక్షుర స్తస్య మహావీర్యో మదోత్కటః | ధనాధ్యక్ష స్తథా తామ్రః సేనా%యుతసమావృతః. 3

అసిలోమా తథోదర్కో బిడాలాఖ్యశ్చ బాష్కలః | త్రినేత్రో%థ తథా కాలబంధకో బలదర్పితః. 4

ఏతే సైన్యయుతాః సర్వే దానవా మేదినీం తదా | ఆవృత్య సంస్థితాః కామ మృద్ధాః సాగరమేఖలామ్‌. 5

కరదా శ్చ కృతాః సర్వే భూమిపాలాః పురాతనాః | నిహతా యే బలోదగ్రాః క్షాత్ర ధర్మ వ్యవస్థితాః. 6

బ్రాహ్మణా వశగా జాతా యజ్ఞభాగ సమర్పకాః | మహిషస్య మహారాజ ! నిఃలే క్షితిమండలే. 7

ఏకాతపత్రం తద్రాజ్యం కృత్వా స మహిషాసురః | స్వర్గం జేతుం మనశ్చక్రే వరదానేన గర్వితః. 8

ప్రణిధిం ప్రేషయామాస హయారిస్తుశచీపతిమ్‌ | స సందేశహరం శీఘ్రమాహూయోవాచ దైత్యరాట్‌. 9

గచ్ఛ వీర మహాబాహో దూతత్వం కురుమే%నఘ | బ్రూహి శక్రం దివం గత్వా నిఃశంకరః సురసున్నిధౌ. 10

మూడవ అధ్యాయము

మహిషాసురుడు వరగర్వితుడగుట

ఆ మహిషాసురుడు వరగర్వమున బలశాలియై రాజ్యము బడసి జగ మంతటిని తన చేతిలో నుంచుకొనెను. తన కెదురాడు వైరులు లేనందున సాగరాంతమగు భూమండలమంతయు నత డేకచ్ఛత్రాధిపతిగ పాలించెను. అతనికి మహామదవీర్యుడగు చిక్షురుడు సేనాపతి. అయుత సైన్యముగల తామ్రుడు కోశాధిపతి. అసిలోముడు ఉదర్కుడు బిడాలుడు బాష్కలుడు త్రినేత్రుడు బలదర్పితుడగు కాలబంధకుడు మున్నగు దానవులు మిగుల సర్వసమృద్ధులై తమ సేనలతో సాగరమేఖలయగు నేల నంతయు నాక్రమించిరి. వీరు వెనుకటి రాజులచే నందఱిని కప్పము గట్టునట్లు చేసిరి. తమ్మెదిర్చిన బలశాలురను రూపుమాపిరి. మహిషుని రాజ్యమందలి విప్రులెల్ల రతనికి వశులై యాగభాగము లర్పించిరి. మహిషుడు వరదానగర్వమున తన రాజ్యము నేకాతపత్రముగ నొనరించుకొని జయించుటకు పూనుకొనెను. ఆ దైత్యరాజు దేవేంద్రుని చెంతకు దూత నంపదలచి యొక సందేశహరుని బిలిచి యతని కిట్లనియెను : వీరా ! నీవు నాకు దూతవగుము. నీవు జంకుకొంకులు లేక దేవతల సన్నిధి కేగి యింద్రునితో నిట్లు చెప్పుము

ముంచ స్వర్గం సహస్రాక్ష యథేష్టం గచ్ఛమాచిరమ్‌ | సేవాం వా కురు దేవేశ మహిషస్య మహాత్మనః. 11

స త్వాం సంరక్షయే న్నూనమాజౌ శరణమాగతమ్‌ | తస్మాత్త్వం శరణం యాహిమహిషస్య శచీపతే ! 12

నోచే ద్వజ్రం గృహాణాశు యుద్ధాయ బలసూదన | పూర్వైర్జితో%సి చాస్మాకం జానామి తవ పౌరుషమ్‌. 13

అహల్యాజార ! విజ్ఞానం బలం తే సురసంఘప | యుధ్యస్వ వ్రజవా కామం యత్ర తే రమతే మనః. 14

తచ్ఛ్రుత్వా వచనం తస్య శక్రః క్రోధసమన్వితః | ఉవాచ తం నృపశ్రేష్ఠ స్మితపూర్వం వచ స్తదా. 15

న జానే%హం సుమందాత్మ న్యతస్త్వం మదదర్పితః | చికిత్సాం సంకరిష్యామి రోగస్యా%స్య ప్రభోస్తవ. 16

అతః పరం కరిష్యామి మూలస్యాస్య నిర్మూలనమ్‌ | గచ్ఛ దూత ! తథా బ్రూహి తస్యాగ్రే మమ భాషితమ్‌. 17

శిష్టై ర్దూతో న హంతవ్య స్తస్త్మాత్త్వా విసృజామ్యహమ్‌ | యుద్ధేచ్ఛా చేత్సమాగచ్ఛ త్వరితో మహిషీసుత. 18

హయారే త్వద్బలం జ్ఞాతం తృణాదస్త్వం జడాకృతిః | శృంగయోస్తే కరిష్యామి

సుదృఢం చ శరాసనమ్‌. 19

దర్పః శృంగబలాత్తే% స్తి విదితం కారణం మయా | విషాణ తే పరిచ్ఛి ద్య సంహరిష్యామి తద్బలమ్‌. 20

యద్బలేనాతి పూర్ణ స్త్వం జాతో%సి బలదర్పితః | కుశలస్త్వం తదాఘాతే న యుద్ధే మహిషాధమ. 21

ఓ సహస్రాసాక్షా! ఇక స్వర్గము వీడుము. నీ నచ్చినచోటి కేగుము. లేక మహాత్ముడగు మహిషుని సేవింపుము. అతడు మహారాజు. శరణాగతుల కాశ్రయదాత. నీవతనిని శరణు వేడుము. కాదేని బలసూదనా! వజ్రముదాల్చి రణమున కాయత్తుపడుము. నీవు మా పూర్వుల చేతిలో నోటమి బొందితివి. నీ బలము నాకు తెలియనిది కాదు! అహల్యాజారుడవగు నీ బలము నాకు తెలియనిదా! నన్ను (మహిషుని) మార్కొనుము. కానిచో నీ యిచ్చమెచ్చుచోటికేగుము. అని మహిషుడంపిన దూత మాటలు విని యింద్రుడు కుపితుడై దూతకిట్లనియెను : ''ఓరీ మందమతీ! నీవు మదదర్పమున కన్నుగానకున్నావు. నీ వేగుము. శిష్టులు దూతను చంపరు. కాన నిన్ను విడిచిపెట్టితిని. అతని ముందు నా మాటలుగ నిట్లు పలుకుము. ''ఓ మహిషీసుతా ! నీకు పోరాట మిష్టమైన త్వరగ రమ్ము. ఓరీ దున్నపోతా ! గడ్డి కఱచువాడవు. జడాకృతివి. నీ బలిమి నాకును తెలియును. నీ కొమ్ములు పట్టి విల్లుచేసి గట్టిగ నాడింతును. నీ కొమ్ములు చూచుకొని నీ వింతగ మిట్టి పడుచున్నావు. నీ బలకారణము తెలిసినది. ఇపుడే నీ కొమ్ములు గోసి నీ బలము మట్టుపెట్టుదును. మహిషాధమా! నీవు కొమ్ముల బలమున నింత బలదర్పితుడవైతివి. నీ కొమ్ములు కోసివేతును. నీకు కొమ్ములతో పొడుచుట మాత్రము తెలియును. యుద్ధ మేమి తెలియును.'

ఇత్యుక్తో%సౌ సురేంద్రేణ స దూతస్త్వరితోగతః | జగామ మహిషం మత్తం ప్రణమ్య ప్రత్యువాచ హ. 22

దూతః : రాజన్దేవాధిపః కామం న త్వాం విగణయత్యసౌ | మన్యతే స్వబలం పూర్ణం దేవసైన్య సమావృతః. 23

యదుక్తం తేన మూర్ఖేణ కథమన్య ద్ర్బవీమ్యహమ్‌ | ప్రియం సత్యం చ వక్తవ్యం భృత్యేన పురతః ప్రభోః! 24

ప్రియం సత్యం చ వక్తవ్యం ప్రభోరగ్రే శుభేచ్ఛునా | ఇతి నీతి ర్మహారాజ! జాగర్తి శుభకారిణీ. 25

కేవలం చే త్ప్రియం బ్రూయన్న తే కార్యం భవిష్యతి | పరుషం చ న వక్తవ్యం కదాచిచ్ఛుభమిచ్ఛునా. 26

యథా రిపుముఖా ద్వాచః ప్రసరంతి విషోపమాః | తథా భృత్యముఖా న్నాథ నిఃసరంతి కథం గిరాః. 27

యాదృశానీహ వాక్యాని తేనోక్తాని మహీపతే | తాదృశాని న మే జిహ్వా వక్తు మర్హతి కర్హిచిత్‌. 28

తచ్ఛ్రుత్వా వచనం తస్య హేతుగర్భం తృణాశనః | భృశం కోప పరీతాత్మా బభూవ మహిషాసురః. 29

సమాహూయా బ్రవీద్దైత్యాన్‌ క్రోధ సంరక్తలోచనః | లాంగూలం పృష్ఠదేశేచ కృత్వా మూత్రం పరిత్యజన్‌. 30

భోభో దైత్యాః సురేంద్రో%స్యౌయుద్ధకామో%స్తి సర్వథా | బలోద్యోగం కురుధ్వం వై జేతవ్యో%సౌ సురాధమః. 31

మదగ్రే కో భ##వే చ్చూరః కోటిశ##శ్చేత్తథావిధాః | న బిభేమ్యేకతః కామం హనిష్యామ్యద్య సర్వథా. 32

శూరః శాంతేష్వసౌ నూనం తపస్విషు బలాధికః | బలకర్తా హి కుహకో లంపటః పరదారహృత్‌. 33

అప్సరోబల సంమత్త స్తపోవిఘ్నకరః ఖలః | ఛిద్రప్రహరణః పాపో నిత్యం విశ్వాసఘాతుకః. 34

నముచిర్నిహతో యేన కృత్వా సంధిం దురాత్మనా | శపథాన్వివిధానాధౌ కృత్వాభీతేన చ్ఛద్మనా. 35

విష్ణు స్తు కపటాచార్యః కుహకః శపథాకరః | నారారూపధరః కామం బలకృద్దంభపండితః. 36

కృత్వాకోలాకృతి యేన హిరణ్యాక్షో నిపాతితః | హిరణ్యకశిపుర్యేన నృసింహేన చ ఘాతితః. 37

అను సురేంద్రుని వచనములు విని దూత వేగిరమే మహిషుని జేరి మ్రొక్కి యతని కిట్లనెను : దేవా ! అట నింద్రుడు సేనలతో కొలువుండి తన బలమునే చెప్పుకొనెను కాని, నిన్ను లెక్కించుట లేదు. ఆ మూర్ఖుడు పల్కిన పల్కులు నేనెట్లు పల్కగలను? దూత తన ప్రభుని ముందు సత్యము ప్రియము నగు పలుకులు పలుకవలయును. రాజు మేలుగోరుదూత రాజుముందు శుభకరముగ ప్రియముగ పలుకుట నీతి యందురు. నీకు తృప్తి గలుగునట్లు పలికిన గాని నీ పని నెర వేరదు. శుభము గోరువా డెపుడును పరుషముగ బలుకరాదు. పగతుని నోట వెలువడిన విషము వంటి మాట లొక నమ్మినబంటు నోటి కెట్లు వచ్చును? ఆతని నోట పలుకబడిన పలుకులు నా నోటికి రాకున్నవి అను హేతుగర్భితములైన మాటలు విని గడ్డి కఱచు మహిషుడు కోపించెను. అపుడు మహిషుడు తోక లేపి యాడించుచు మూత్రించుచు గ్రుడ్లెఱ్ఱచేయుచు తన దైత్యులను బిలిచి యిట్లనెను: దైత్యులారా! ఇంద్రుడు యుద్ధసన్నద్ధుడయ్యెను. మీరు మీ మీ బలములు సమకూర్చుకొనుడు. ఆ సురాధము నోడింపవలయును. నా ముందు నిలువబడు వీరు డెవ్వడు? కోట్ల కొలది యింద్రులు వచ్చినను నేను వెనకంజ వేయను. నే నింద్రుని నేడే పరిమార్తును. అతడు శాంత తాపసుల యెడల శూరుడు - బలశాలి - మోసగాడు - లంపటుడు - పరదారల దగులువాడు. ఖలుడు - పాపి - రంధ్రాన్వేషి - అచ్చరల యందము చూచుకొని మత్తిల్లువాడు. విశ్వాసఘాతకుడు. తపము చెఱచువాడు. మున్నతుడు సముచికి భయపడి పెక్కు బాసలు సేసి యతనితో సంధి చేసికొనెను. పిమ్మట కపటముగ నతనిని జంపెను. విష్ణువు సైతము కపటాచార్యుడు శపథాకరుడు టక్కరి మాయలమారి బహురూపములవాడు గర్వ పండితుడు. కావుననే విష్ణువు వరాహరూపమున హిరణ్యాక్షుని - నృసింహరూపమున హిరణ్యకశిపుని దునుమాడెను.

నాహం తద్వశగో నూనం భ##వేయం దనునందనః | విశ్వాసం నైన గచ్ఛామి దేవానాం కుత్ర కర్హిచిత్‌. 38

కిం కరిష్యతి మే విష్ణు రింద్రో వా బలవత్తరః | రుద్రోవా%పి నమేశక్తః ప్రతికర్తుం రణాంగణ. 39

త్రివిష్టపం గ్రహీష్యామి జిత్వేంద్రం వరుణం యమమ్‌ | ధనదం పావకం చైవ చంద్రసూర్యౌ విజిత్య చ. 40

యజ్ఞభాగభుజః సర్వే భవిష్యామో%ద్య సోమపాః | జిత్వా దేవసమూహం చ విహరిష్యామి దానవైః. 41

న మే భయం సురేభ్య శ్చ వరదానేన దానవాః | మరణం న రేభ్య శ్చ నారీ కిం మే కరిష్యతి. 42

పాతాళ పర్వతేభ్య శ్చ సమాహూయ వరాన్వరాన్‌ | దానవాన్మమ సైన్యేశా న్కుర్వంతు త్వరితాశ్చరాః. 43

ఏకో%హం సర్వదేవేశా న్విజేతుం దానవాః క్షమః | శోభార్థం వః సమాహూయ నయామి సురసంగమే. 44

శృంగాభ్యాం చ ఖురాభ్యాం చ హనిష్యే%హం సురాన్కిల | నమే భయం సురేభ్యశ్చ వరదానప్రభావతః. 45

అవధ్యో%హం సురగణౖ రసురై ర్మానవై స్తథా | తస్మా త్సజ్జా భవంత్వద్య దేవలోకజయాయవై. 46

జిత్వా సురాలయం దైత్యా విహరిష్యామి నందనే | మందారకుసుమాపీడా దేవయోషిత్సమన్వితాః. 47

కామధేనుపయోత్సిక్తాః సుధాపాన ప్రమోదితాః | దేవగంధర్వగీతాది నృత్యలాస్య సమన్వితాః. 48

ఊర్వశీ మేనకా రంభా ఘృతాచీ చ తిలోత్తమా | ప్రమద్వరా మహాసేనా మిశ్రకేశీ మదోత్కటా. 49

విప్రచిత్తి ప్రభృతయో నృత్యగీత విశారదాః | రంజయిష్యంతివః సర్వా న్నానాసవనిషేవణౖః. 50

సర్వేసజ్జా భవంత్వద్య రోచతాం గమనం దివి | సంగ్రామార్థం సురైః సార్థం కృత్వా మంగళ ముత్తమమ్‌. 51

రక్షణార్థం చ సర్వేషాం భార్గవం మునిసత్తమమ్‌ | సమాహూయ చ సంపూజ్య స్థాప్య యజ్ఞేగురుంవరమ్‌. 52

వ్యాసః : ఇతి సందిశ్యదైత్యేంద్రా న్మహిషః పాపధీస్తదా | జగామ త్వరితో రాజన్‌ భవనం స్వం ముదాన్వితః. 53

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే తృతీయో%ధ్యాయః.

దనుజులారా! నే నా మరి కేనాటికిని వశుడగాను. ఆ దేవతలనుగూడ నేను నమ్మనే నమ్మను. నన్ను రణాంగణమున రుద్రుడు సైత మెదిరించలేడే! ఇంకింద్రవిష్ణులు నన్నేమి చేయగలరు? నే నింద్రాగ్ని యమ వరుణ కుబేరులను సూర్య చంద్రులను గెలిచి స్వర్గము గైకొనగలను. దానవుల మెల్లరము కలిసి దేవతలను గెలిచి యజ్ఞభాగములుగొని సోమపానము చేయుచు విహరింతము. నాకు బ్రహ్మ యిచ్చిన వరలాభము గలదు. దానివలన నాకు దేవమనుజులవలన భీతిలేదు. ఇంక నాడుది నన్నేమి చేయగలదు? పాతాళపర్వతములనుండి ప్రముఖ దానవవీరులను పిలిపించి సేనాపతులుగ నియమింపుడు. ఎల్ల దేవతలను నే నొక్కడనే జయింపగలను. మిమ్ము వినోదమునకు బవరమునకు వెంటగొనిపోదును. బ్రహ్మవర ప్రభావమున నాకు దేవతల భయము లేదు. వారిని నా వాడికొమ్ములతో గిట్టలతో నంతమొందింతును. నేను సురాసుర నరులచే చంపబడను. కాన స్వర్గ విజయమున కాయత్తపడుడు. మనము సురాలయము గెలిచి మందారమాలలు దాల్చి యచ్చరలతో నందనవనములందు క్రీడింతము. కామధేనువు పాలుగ్రోలి యమృతము త్రావి దేవగంధర్వుల నృత్యగీతములతో ముదమందుదము. ఊర్వశి-రంభ- మేనక-ఘృతాచి-తిలోత్తమ-ప్రమద్వర-మహాసేన - మిశ్రకేశి - మదోత్కట - విప్రచిత్తి మున్నగు నృత్యలాస్యగీత విశారదలు మధుర మద్యపానాదులతో మనలను రంజింపజేయుదురు. మీ కిష్టమేని ఇదొక వినోదకార్యముగ నెంచి సురలతో బోర సిద్ధపడుడు. మన సంరక్షణకొఱకు శుక్రాచార్యుని బిలిచి ఆతని పూజించి యతనిని యజ్ఞకార్యమున నియోగింపుడు. జనమేజయ రాజా! ఆ పాపమతియగు మహిషు డిట్లు దానవుల కాదేశించి ముదముతో తన యింటి కేగెను.

Sri Devi Bhagavatam-1    Chapters