Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

రాజోవాచ : 

విస్మితో%స్మి మహాభాగః శ్రుత్వా%%ఖ్యానం మహామతే | సంసారో%యం పాపరూపః కథం ముచ్యేత బంధనాత్‌. 1

కశ్యపస్యాపి దాయాద స్త్రీలోకీవిభ##వే సతి | కృతవా నీదృశం కర్మ కో న కుర్యాజ్ఞుగుప్సితమ్‌. 2

గర్భే ప్రవిశ్యం బాలస్య హననం దారుణం కిల సేవామిషేణ మాతుశ్చ కృత్వా శపథమద్భుతమ్‌. 3

శాస్తా ధర్మస్య గోప్తా చ త్రిలోక్యాః పతి రప్యుత | కృతవానీదృశం కర్మ కో న కుర్యా దసాంప్రతమ్‌. 4

పితామహా మే సంగ్రామే కురుక్షేత్రే%తి దారుణమ్‌ | కృతవంత స్తథా%%శ్చర్యం దుష్టం కర్మ జగద్గురో ! 5

భీష్మో ద్రోణః కృపః కర్ణో ధర్మాంశో%పి యుధిష్ఠిరః | సర్వే విరుద్ధర్మేణ వాసుదేవేనే నోదితాః. 6

ఆసారతాం విజానంతః సంసారస్య సుమేధసః | దేవాంశాశ్చ కథం చక్రు ర్నిందితం ధర్మ తత్పరాః. 7

కా%%స్థా ధర్మస్య విప్రేంద్రః ప్రమాణం కిం వినిశ్చితమ్‌ | చలచిత్తో%స్మి సంజాతః శ్రుత్వా చైతత్కథానకమ్‌. 8

ఆప్తవాక్యం ప్రమాణం చే దాప్తః కః పరదేహవాన్‌ | పురుషో విషయాసక్తో రాగీ భవతి సర్వథా. 9

రాగో ద్వేషో భ##వే న్నూన మర్థనాశా దసంశయమ్‌ | ద్వేషా దసత్యవచనం వక్తవ్యం స్వార్థ సిద్ధయే. 10

జరాసంధ విఘాతార్థం హరిణా సత్త్వ మూర్తినా | చలేన రచితం రూపం బ్రాహ్మణస్య విజానతా. 11

త దాప్తః కంః ప్రమాణం కిం సత్త్వమూర్తి రపీదృశః | అర్జునో%పి తథైవాత్ర కార్యే యజ్ఞవినిర్మితే. 12

కీదృశో%యం కృతో యజ్ఞః కిమర్థం శమవర్జితః | పరలోకపదార్థం వా యశ##సే వా%న్యథా కిల.13

నాలుగవ అధ్యాయము

మాయాశక్తి ప్రభావము

జనమేజయుడిట్లనియెను: ఓ మహాభాగా! వ్యాస! మహామేధావీ! నీవు చెప్పిన యాఖ్యానము విని నేను పరమవిస్మయమందితిని. జీవుడీ పాపరూపమైన సంసారబంధనముల నుండి యెట్లు విముక్తుడుగాగలడు? ఏలయన, కశ్యపాత్మజుడు త్రైలోక్యపతియునగు దేవేంద్రుడే యట్టి హేయముల కొడిగట్టిన నింక నరులమాట చెప్పనేటికి? మాతృసేవ యను నెపముతో ప్రతినయొనర్చి యామె గర్భముజొచ్చి యందున్న బాలుని చంపుటెంత దారుణకృత్యమో కదా! ధర్మపరిపాలకుడును శాసకుడు నైన త్రిలోకాధిపతియే యంతటి క్షుద్రకార్య మొనర్ప నింక సామాన్యుడెట్లు చేయకుండును? జగద్గురూ!అల కురుక్షేత్ర సంగ్రామము నందు నా పితామహులు చేసిన దుష్టకృత్యములకు నా కచ్చెరువు గలుగుచున్నది. అధర్మముగ ప్రవర్తించు వాసుదేవునిచే భీష్మద్రోణకృపకర్ణులు ధర్మాంశజుడగు ధర్మరాజును పురికొలుపబడిరి. వారును దేవాంశజులే! మేధావులే: ధర్మ తత్పరులే! ఈ సంసారము నిస్సారమని యెఱింగిన వారలే! ఐనను వారును ధర్మబాహ్యముగ నిందిత కృత్యము లేల యొనర్చిరి? విప్రప్రవరా! అట్లు జరిగినచో నిక ధర్మమునకు చోటేది? ధర్మమునకు ప్రమాణమేది? నేనీ కథానక మాలకించినంతనే నా మనస్సు కలగుండు పడినది. ఒక యాప్తుని వాక్యమును ప్రమాణమనుకొందుమేని అట్టి దివ్యదేహధారియు సర్వసముడు నైన యాప్తుడెవడు? లోకములందు పురుషు డెల్ల భంగుల విషయాసక్తుడై రాగవంతుడగుచుండును. అర్థనాశము కలిగిన వానికి తప్పక రాగద్వేషములు కల్గుచుండును. ప్రతివానికిని తన స్వార్థమునకై ద్వేషముతో నసత్యము పలుకవలసి వచ్చును. అన్నియు తెలిసిన సత్త్వమూర్తియగు హరియే జరాసంధుని చంపుటకు కపటమున బ్రాహ్మణ వేషము తాల్చెను. అంతటి సత్త్వమూర్తియగు మహానుభావుడే యంతంత పనిచేయగ నిక నాప్తుడెవ్వడు? ఏది ప్రమాణము? అర్జునుడును యాగనిర్వహణమునకు కపట వృత్తి నవలంబించెను గదా? వారు చేసిన యజ్ఞ మెట్టిది? అది యేల శాంతి రహితమైనది? అది పరలోక ప్రాప్తికి గాని యశమునకు గాని చేయబడినదా?

ధర్మస్య ప్రథమః పాదః సత్య మేత చ్ఛ్రుత్రేర్వచ: | ద్వితీయస్తు తథా శౌచం దయా పాదస్తృతీయకః. 14

దానం పాద శ్చతుర్థ శ్చ పురాణజ్ఞా వదంతి వై | తై ర్విహీనః కథం ధర్మ స్తిష్ఠే దిహ సుసమ్మతః. 15

ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భ##వేత్‌ | ధర్మేస్థిరా మతిః క్వాపి న కస్యాపి ప్రతీయతే. 16

చలార్థం చ యథా విష్ణు ర్వామనో%భూజ్జగత్ప్రభుః | యేన వామనరూపేణ వంచితో%సౌ బలిర్నృపః. 17

విహర్తా శతయజ్ఞస్య వేదాజ్ఞాపరి పాలకః | ధర్మిష్ఠో దానశీలశ్చ సత్యవాదీ జితేంద్రియః. 18

స్థానా త్ప్రభ్రంశితో%కస్మా ద్విష్ణునా ప్రభ విష్ణునా | జితం కేన తయోః కృష్ణ బలినా వామనేన వా.19

ఛలకర్మ విదా చాయం సందేహో%త్ర మహాన్మమ | వంచయిత్వా వంచితేన సత్యం వద ద్విజోత్తమ! 20

పురాణకర్తా త్వమని ధర్మజ్ఞశ్చ మహామతిః | జితం వైబలినా రాజన్దత్తా యేన చ మేదినీ. 21

త్రివిక్రమో%పి నామ్నాయః ప్రథితో వామనో%భవత్‌ | ఛలనార్థ మిదం రాజ న్వామనత్వం నరాధిప! 22

సంప్రాప్తం హరిణా భూయో ద్వార పాలత్వమేవ చ | సత్యాదన్యతరన్నాస్తి మూలం ధర్మస్య పార్థివః. 23

దుఃసాధం దేహినాం రాజన్సత్యం సర్వాత్మనా కిల | మాయా బలవతీ భూప త్రిగుణా బహురూపిణీ. 24

యయేదేం నిర్మితం విశ్వం గుణౖః శబలితం | త్రిభిః తస్మాచ్ఛలవతా సత్యం కుతో%విద్ధం భ##వే న్నృప! 25

మిశ్రేణ జనిత శ్చైవ స్థితి రేషా సనాతనీ | వైఖానసాశ్చ మునయో నిఃసంగా నిష్ర్పతి గ్రహాః 26

సత్యయుక్తా భవంత్యత్ర వీతరాగా గత తృషః | దృష్టాంతదర్శనార్థాయ నిర్మితాస్తే చ తాదృశాః. 27

ధర్మమునకు మొదటి పాదము సత్యము, రెండవది శౌచము, మూడవది భూతదయ, నాల్గవది నిష్కామదానము అని పురాణవిదులు పేర్కొందురు. ఆ నాలుగును లేనిచో ధర్మపు ప్రతిపాదమునకు నిలుకడయే లేదు. ధర్మనీతి బాహ్యమైన పని ధర్మమొసంగు ఫలము నెట్లొసగగలదు? వారిలో నే యొక్కరికి ధర్మము నెడల స్థిరమతి లేదని నాకు దోచుచున్నది. ఆ జగత్ర్పభువగు విష్ణువు కపటము కొఱకై వామన రూపముదాల్చి పాపమా బలిని వంచించెను గదా! ఆ బలి నూఱు యాగములకు కర్త - వేదాజ్ఞను తలదాల్చువాడు - ధర్మిష్ఠుడు - దానశీలి - సత్యవాది - జితేంద్రియుడు. వ్యాసా! అంతటివాడును ప్రభవిష్ణువగు విష్ణునిచే నకస్మాత్తుగా స్థానభ్రష్టుడయ్యెను. ఇపుడు వారిలో జయ మెవ్వరిది? వామనునిదా? బలిదా? ద్విజోత్తమా! కపట నాటక సూత్రధారియగు వామనుడు బలిని గెల్చెనా? లేక వంచితుడైన బలి వామనుని జయించెనా? నిజము పలికి నా సందియ ముడుపుము. నీవు బహుపురాణకర్తవు - ధర్మజ్ఞుడవు - మహామతివి. కాన వాస్తవము దెలుపుమని నిన్నడుగుచున్నాను. వ్యాసు డిట్లనెను. రాజా! ఈ సమస్త భూమండలమును దానము చేసిన బలి నిజముగ గెల్చినవాడు. ఆ హరి బలిని వంచించుటకు వామనత్వమొంది వామనడను పేరును ఖ్యాతి బడసెను. పిమ్మట హరి బలికి ద్వారపాలకుడయ్యెను. కాన దైవ ధర్మము సత్యమగును గాని యితరము గాదు. ఈయెల్ల దేహులకు సర్వభూతాత్మభావముతోడ సత్యపాలన మొనరించుట క్లేశ సాధ్యము. ఈ మహామాయ త్రిగుణాత్మిక - సర్వతోముఖము. ఇదెంతటి వానికిని దాటశక్యము గానిది, ఈ విశ్వము మాయచేతనే విరచింపబడినది. ఇది త్రిగుణముల సమ్మేళనము. కాన వంచకునకు సత్యపాలనమెట్లు సాధ్యమగును? ఈ విశ్వమిట్టి మిశ్రిత గుణములతో జనించినది. ఇది సనాతనము, తిరుగులేని దైవధర్మము. విధి విధానము. వైఖానసాదిమునులు మాత్రము విగత సంగులు - అపరిగ్రహులు - మాయా తీతులు. వారు మానమోహరహితులు - సత్యసంగతులు - తృష్ణారాగవర్జితులు వారు మాత్రమే సత్యధర్మమునకు దృష్టాంతముగ బేర్కొనదగినవారు.

అన్యత్సర్వం శబలితం గుణౖరేభి స్త్రిభి ర్నృప! నైకం వాక్యం పురాణషు వేదేషు నృపసత్తమ! 28

ధర్మశాస్త్రేషు చాంగేషు సుగుణౖ రచితే ష్విహ | సగుణః సగుణం కుర్యా న్నిర్గుణో న కరోతివై 29

గుణాస్తే మిశ్రితా! సర్వై ర్న పృథగ్భావసంగతాః | నిర్వ్యళీకే స్థిరే ధర్మే మతిః కస్యాపి న స్థిరా. 30

భవోద్భవే మహారాజ! మాయయా మోహితస్యవై | ఇంద్రియాణి ప్రమాథీని తదా శక్తం మనస్తథా. 31

కరోతి వివిధాన్భావాన్గుణౖ సై#్తః ప్రేరితో భృశమ్‌ | బ్రహ్మాదిస్తంబపర్యంతాః ప్రాణినః స్థిరజంగమాః. 32

సర్వేమాయావశా రాజన్సాహి క్రీడతి తైరిహ | సర్వాన్వై మోహయత్యేషా వికుర్శత్యనిశం జగత్‌. 33

అసత్యో జాయతే రాజన్కార్యవాన్ర్పథమం నరః | ఇంద్రియార్థాం శ్చింతయానో న ప్రాప్నోతి యదానరః. 34

తదర్థం ఛలమాదత్తే ఛలాత్పాపే ప్రవర్తతే | కామః క్రోధశ్చ లోభశ్చ వైరిణో బలవత్తరాః. 35

కృతాకృతం న జానంతి ప్రాణిన స్తద్వశం గాతాః | విభ##వే సత్యహంకారః ప్రబలః ప్రభవత్యపి. 36

అహంకారాద్భవే న్మోహో మోహాన్మరణమేవచ | సంకల్పా బహవస్తత్ర వికల్పాః ప్రభవంతి చ. 37

ఈర్ష్యా%సూయా తథా ద్వేషః ప్రాదుర్భవతి చేతసి | ఆశా తృష్ణా తథా దైన్యం దంభో%ధర్మమతిస్తథా. 38

ప్రాణినాం ప్రభవంత్యేతే భావా మోహసముద్భవాః | యజ్ఞదానాని తీర్థాని వ్రతాని నియమాస్తథా. 39

ఓ రాజా! ఈ యంతయును త్రివిధ గుణమయము. కాన వేదపురాణములందు ధర్మశాస్త్రములందు నేక వాక్యత గన్పట్టదు. సగుణరాగవంతుడు సగుణకార్యము లొనరించును. కాని, నిర్గుణుడు సగుణచేష్ట లెన్నడును సలుపడు. ఈ త్రిగుణము లెల్లవేళల కలిసి మెలిసి యుండునే కాని విడివిడిగ నుండజాలవు. కనుక నిర్మలమును సుస్థిరమునైన పరమధర్మ మం దెవని బుద్ధి నిలుచును? మహారాజా! ఈ బలవత్తరములైన యింద్రియములు నరుని మాయామోహితునిగ జేయును. కనుక నింద్రియములు జన్మకు హేతువు లగుచున్నవి. మనస్సే యింద్రియములలోన దగులుకొని వెడలజాలకుండును. ఈ మనసు వలన వివిధ భావ పరంపరలు గలుగుచుండును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవఱకు నున్న స్థావరజంగమములైన యెల్ల ప్రాణులు నిరంతరము త్రిగుణములచే ప్రేరితము లగుచుండును. మాయా వశవర్తు లగుచుండును. ఆ మాయాశక్తి యెంతటి వారినైన మోహమున ముంచివైచి యాడించుచుండును. ఈ జగములను వికారవంతములుగ జేయుచుండును. నరేంద్రా! ఈ నరు డేదేని పనిని మొదలు పెట్టుచో నతడు తొలుత నసత్యము లాడ నేర్చుకొనును. పిదప విషయభోగము లాకాంక్షించును. అవి తనకు దక్కనప్పుడు వానికొఱకు వంచనకైన పాల్పడును. దానిచే నతనికి దురితములు సంభవించును. కాన కామక్రోధలోభములు బలవత్తరములగు శత్రులు (నరకద్వారములు - ఆత్మ వినాశకములు). ఈ శత్రువులకు బానిసలైన నరులు మంచిచెడ్డల వివేక మెఱుంగరు. వారికి సంపదలం దహంకారము మిన్నుముట్టగ పుట్టుచుండును. అహంకారము వలన సమ్మోహము-సమ్మోహమున బుద్ధినాశము-తుదకు నాశము-గల్గును. ఈ జీవుల మనస్సులం దనేక సంకల్ప వికల్పములు పుట్టుచు నడగుచుండును. ఈ చిత్తమునందు నెల్లవేళల నసూయాద్వేషములు-ఆశ-తృష్ణ-దైన్యము-దంభము-దుర్మతి రగులుకొనుచుండును. ఈ చెడుభావము లెల్ల జీవులను మోహవశులుగ జేయుచుండును. నరుడు యజ్ఞ దానములు తీర్థ వ్రత నియమములు నాచరించును.

అహంకారాభి భూతస్తు కరోతి పురుషో%న్వహమ్‌| అహంభావకృతం సర్వం ప్రభ##వే ద్వై న శౌచవత్‌. 40త

రాగలోభాత్కృతం కర్మ సర్వాంగం శుద్ధివర్జితమ్‌ | ప్రథమం ద్రవ్యశుద్ధిశ్చ ద్రష్టవ్యా విబుధైః కిల. 41

అద్రోహేణార్జితం ద్రవ్యం ప్రశస్తం ధర్మకర్మణి | ద్రోహార్జితేన ద్రవ్యేణ యత్కరోతి శుభం నరః. 42

విపరీతం భ##వేతత్తు ఫలకాలే నృపోత్తమ! మనో%తి నిర్మలం యస్య స సమ్యక్ఫలభాగ్భవేత్‌. 43

తస్మి న్వికారయుక్తే తు న యథార్థం ఫలం లభేత్‌ | కర్తారః కర్మణాం సర్వే ఆచార్య ఋత్విజాదయః. 44

స్యుస్తే విశుద్ధ మనసస్తదా పూర్ణం భ##వేత్ఫలమ్‌ | దేశ కాలక్రియా ద్రవ్యకర్తౄణాం శుద్ధతాయది. 45

మంత్రాణాం చ తదా పూర్ణం కర్మణాం ఫలమశ్నుతే | శత్రూణాం నాశ ముద్దిశ్య స్వవృద్ధిం పరమాం తథా. 46

కరోతి సుకృతం తద్వ ద్విపరీతం భ##వేత్కిల | స్వార్థసక్తః పుమా న్నిత్యం న జానాతి శుభాశుభమ్‌. 47

దైవాధీనః సదా కుర్యా త్పాప మే న సత్కృతమ్‌ | ప్రాజాపత్యాః సురాః సర్వే హ్యసురాశ్చ తదుద్భవాః. 48

సర్వే తే స్వార్థనిరతాః పరస్పరవిరోధినః | సత్త్వోద్భవాః సురాః సర్వే%ప్యుక్తా వేదేషు మానుషాః. 49

రజోద్భవా స్తామసాస్తు తిర్యంచః పరికీర్తితాః | సత్త్వోద్భవానాం తైర్వైరం పరస్పరమనారతమ్‌. 50

తిరశ్చామత్ర కిం చిత్రం జాతివైర సముద్భవే | సదా ద్రోహపరా దేవా స్తపో విఘ్న కరా స్తథా. 51

అసంతుష్టా ద్వేషపరాః పరస్పర విరోధినః | అహంకార సముద్భూతః సంసారో2యం యతో నృప! 52

రాగద్వేషవిహీనస్తు సకథం జాయతే నృప!

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థ స్కంధే చతుర్థో%ధ్యాయః.

కాని వాని నెల్ల గర్వాతిరేకమున సలుపుచుండును. అహంకారముతో జేసిన యే చిన్నపనియైనను నిర్మలముగ నుండజాలదు. రాగలోభములతో జేసిన పను లెల్లను నపవిత్రములుగ నుండును. కనుక పండితులు మునుముందుగ ద్రవ్యశుద్ధి గమనింపవలయును. ఎట్టి ద్రోహబుద్ధియు లేక సంపాదించిన ధనము ధర్మకర్మములందు ప్రశస్తమైనది. ద్రోహముతో నార్జించిన ద్రవ్యముతో నరుడు శుభకార్యము లొనరింపగూడదు. అట్లొకవేళ చేసినచో నది ఫలించు కాలమున విపరీతముగ మారును. అతి నిర్మలహృదయుడు నిష్కాముడు మనస్వియైన వా డొనరించిన పని చక్కగ ఫలవంత మగును. మనస్సు వికారమయమైనచో నాశించిన ఫలితము చేకూరదు. కావున యజమానులు ఋత్విగాదులు ఆచార్యవర్యులు - వీరు విశుద్ద మనస్కులుగ నుండవలయును. దేశకాలము లందును ద్రవ్యమందును కర్తృ క్రియలయందును మంత్రములందును శుద్ధి యుండవలయును. అపుడు యజమాను డాశించిన ఫలము పూర్తిగ ప్రాప్తించును. ఏలన, స్వార్థాభినివేశము గలవానికి మంచి చెడ్డల వివేకము గలుగదు. అట్టివాడు దైవాధీనుడై పాప మాచరించును గాని సుకృత మొనరింపడు. ఎల్ల దేవదానవులును ప్రజాపతి వలన నుద్భవిల్లిరి. ఐనను వీరు స్వార్థపరులును పరస్పర విరోధులునై వర్తింతురు. దేవతలు సత్త్వగుణ సంజాతులనియు మనుజులు రజోగుణ సంభూతులనియు తిర్యక్కులు తమోగుణ జనితము లనియు శ్రుతులందు గలదు. అమరులు సత్త్వసంజాతులైనను వారిలో వారికి పరస్పర వైర మనవరతము సంభవించుచుండును. ఇక తిర్యక్కులందు జాతి వైరమున్నదన్న నందు విచిత్ర మేమున్నది? దేవతలు సతతము ద్రోహపరులు-తపోవిఘ్నకరులు. వారు ద్వేషనిరతులు. పరస్పర వైరులు-అసంతుష్టులుగ నుందురు. కావున నీ సకల ప్రపంచ మహంకార సముత్పన్న మగుటచే నీ ప్రపంచ మెట్లు రాగద్వేష రహితముగా నుండగలదు?

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు మాయాప్రభావమను చతుర్థాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters