Sri Devi Bhagavatam-1    Chapters   

అథ త్రయోదశోధ్యాయః

రాజా: హరిణాతు కథం యజ్ఞః కృతః పూర్వం పితామహ! జగత్కారణరూపేణ విష్ణువా ప్రభవిష్ణునా. 1

కే సహాయాస్తు తత్రా%%సన్బ్రాహ్మణాః కే మహామతే! ఋత్విజో వేదతత్త్వజ్ఞా స్తన్మేబ్రూహి పరంతప! 2

పశ్చాత్కరోమ్యహం యజ్ఞం విధిదృష్టేన కర్మణా | శ్రుత్వావిష్ణుకృతం యాగమంబికాయాః సమాహితః. 3

వ్యాసః. రాజన్‌! శృణు మహాభాగ! విస్తరంపరమాద్భుతమ్‌ | యథా భగవతీయజ్ఞః కృతశ్చ విధి పూర్వకమ్‌. 4

విసర్జితా యదా దేవ్యాదత్వాశ క్తీశ్చ తా స్త్రయః | కాజేశాః పురుషాజాతా విమానవరమాస్థితాః. 5

ప్రాప్తామహార్ణవం ఘోరంత్రయస్తే విబుధో త్తమాః | చక్రుః స్థానా నివాసార్థం సముత్పాద్య ధరాం స్థితాః. 6

ఆధార శక్తిరచలాముక్తా దేవ్యా స్వయంతతః | తదాధారా స్థితాజాతా ధరామేద స్సమన్తితా. 7

మధుకైటభయోర్మేదః సంయోగాన్మేదినీ స్మృ | ధారణాశ్చ ధరాప్రోక్తా పృథ్వీ విస్తారయోగతః. 8

మహీ చాపి మహీ యస్త్వాద్ధృతా సా శేషమస్తకే | గిరయశ్చ కృతాః సర్వే ధారణార్థం ప్రవిస్తరా. 9

పదుమూడవ అధ్యాయము

శ్రీమహావిష్ణువు శ్రీదేవీయజ్ఞ మాచరించుట

రాజట్లనియె: పితామహా! జగత్కారణభూతుడు ప్రభవిష్ణువు విష్ణువునగు శ్రీహరిచేత పూర్వమీ దేవీయజ్ఞమెట్టు లాచరింపబడెను? దానికి సహాయకులెవరు? ఋత్విజులెవరు? వేదవిదులగు బ్రాహ్మణులుగనెవరెవరు నియమింపబడిరి? నాకిదంతయు విశదమొనరింపుము. శ్రీవిష్ణువు శ్రీదేవీ యాగమొనరించిన విధానమెఱిగిన పిదప నేను విధి ప్రకారమున దేవీయాగము నదే విధముగ నాచరింపగలను. వ్యాసుడిట్లనియె: రాజేంద్రా! పూర్వము విష్ణువుచే విధి పూర్వకముగ నాభగవతీ దేవీ యాగమెట్లు పరమాద్భుతముగ సమాచరింపబడెనో దెలుపుదును. సమాహిత మతితో నాలకింపుము. సృష్టికి పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులా పరాదేవతచేత దివ్యశక్తులు బడసి యామె యనుమతితో విమానము మీద బయలుదేరిరి. ఆ మువ్వురు బుధోత్తములును ఘోర మహార్ణవముజేరి తమ తమ నివాసము లేర్పరచుకొనుటకై ముందుగ భూమిని సృష్టించిరి. అంత నాదేవదేవి భూమి కాధారశక్తి నొసంగుటచే నా యాధారమున భూమి అచల అయ్యెను. మధుకైటభుల మేదస్సు కలియుటవలన మేదిని యనియు సర్వమును ధరించుటవలన ధరయనియు విస్తారముగ నుండుటవలన పృథివియనియు భూమి పిలువబడెను. సర్వాధిక్యము నందుటవలన భూమికి మహియనియు పేరుగలదు. ఆమె యాదిశేషుని శిరములపై నుంచబడెను. భూమిని ధరించుట కున్నత విశాలములగు పర్వతములు సృష్టించబడినవి.

లోహకీలం యథాకాష్ఠే తథాతే గిరయః కృతాః | మహీధరా మహారాజ! ప్రోచ్యంతే విబుధైర్జనైః. 10

జాత రూపమయో మేరుర్బహు యోజన విస్తరః | కృతోమణి మయైః శృంగైః శోభితఃపరమాద్భుతః. 11

మరీచిర్నారదో%త్రిశ్చ పులస్త్వః పులహః క్రతుః | దక్షోవసిష్ఠ ఇత్యేత బ్రహ్మాః ప్రథితాః సుతాః. 12

మరీచేః కశ్యపోజాత ఓ దక్షకన్యాస్త్రయోదశ | తాభ్యో దేవాశ్చ దైవాశ్చ దైత్యాశ్చ సముత్పన్నా హ్యనేకశః. 13

తతస్తు కాశ్యపీ సృష్టిః ప్రవృత్తాచాతి విస్తరా | మనుష్యు పశు సర్పాది జాతిభేదైరనే కధా. 14

బ్రహ్మణశ్చార్ధ దేహీత్తు మనుః స్వాయంభువో%భవత్‌ | శతరూపా తథౄనారీ సంజాతా వామభాగతః. 15

ప్రియవ్రతోత్తాన పాదౌ సుతౌ తస్యా బబూవతుః | తిస్రః కన్యా వరారోహా హ్యభవన్నతి సుందరాః. 16

ఏవం సృష్టిం సముత్పాద్య భగవాన్కమలోద్భవః | చకార బ్రహ్మ లోకంచ మేరు శృంగే మనోహరమ్‌. 17

వై కుంఠం భగవాన్విష్ణూ రమారమణ ముత్తమమ్‌ | క్రీడాస్థానం సురమ్యంచ సర్వలోకోపరి స్థితమ్‌. 18

శివో%పి పరమంస్థానం కైలాసాఖ్యంచకారహ | సమాసాద్యభూతగణం విజహార యథారుచి. 19

స్వర్గ స్త్రీ విష్టపోమేరు శిఖరోపరి కల్పితః | తచ్చస్థానం సురేంద్రస్య నానారత్న విరాజితమ్‌. 20

ఒక పెద్దకట్టెకు నినుపచీలలు బిగించియున్నట్లు పర్వతములు భూమియందు నెలకొల్పబడినవి. కావున గిరులు బుధులచేత మహీధరము లని పేర్కొనబడును. ఆ గిరులలో మేరుగిరి బహు యోజనముల వైశాల్యముగలిగి మణిదీపశిఖరములతో నలరారుచు మహాద్భుతముగ రంగారుబంగారు కాంతు లీనుచు తనరారుచున్నది. మరీచి నారదుడు పులస్త్యుడు పులహుడు అత్రి క్రతుడు వసిష్ఠుడు దక్షుడు ననువారలు బ్రహ్మ మానసపుత్త్రులు. మరీచికి కశ్యపు డుద్భవించెను. ఆతనికి దక్షుని కూతురుతో వివాహము జరిగెను. వీరిరువురికి పెక్కురు దేవదానవులు సముద్భవించిరి. ఆ కశ్యపునివలన విస్తారమైన కాశ్యపసృష్టి జరిగెను. కాన భూమికి కాశ్యపి యనియు పేరు గలిగె. ఆ కాశ్యపునివలన మనుజులు పశువులు పన్నగములు మున్నగు భేదములతో లోకసృష్టి జరిగెను. బ్రహ్మ కుడిభాగమునుండి స్వాయంభువ మనువు నెడమభాగమునుండి శతరూపయను నామె ఉద్భవిల్లిరి. వీరిరువురకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు నను కుమారులును మఱి మువ్వురు వరారోహలగు చక్కని కూతులును జన్మించిరి. ఇట్లు బ్రహ్మ విశ్వరచన సాగించి సుమనోహరమైన మేరుగిరిపై తన లోకము నిర్మించుకొనెను. శ్రీవిష్ణు భగవానుడు సర్వలోకములకు మీద రమారమణమై రమణీయమైన క్రీడాస్థానముగల యకుంఠితమైన వైకుంఠధామ మేర్పరచుకొనెను. భక్తవశంకరుడగు శంకరుడు భూతగణములతో స్వేచ్ఛగ విహరించుట కనువైన కైలాసగిరిని తన నివాసముగ నియమించుకొనెను. మహేంద్రుడు మేరుగిరిపైన స్వర్గసీమ నిర్మించుకొనెను. అది నానారత్న విరాజితమై కామప్రదమై తనరారుచున్నది.

సముద్రమథనాత్ప్రాప్తః పారిజాతస్తరూత్తమః | చతుర్దంత నాగః కామధేనుశ్చ కామదా. 21

ఉచ్చై శ్రవాస్తథా%శ్వోవైరంభాద్యప్సరస స్తథా | ఇంద్రేణోపాత్తమఖిలం జాతం వై స్వర్గ భూషణమ్‌. 22

ధన్వంతరిశ్చంద్రమాశ్చ సాగరాచ్చ సముద్బభౌ | స్వర్గేస్థితో విరాజేతే దేవౌబహుగణౖర్వృతౌ. 23

ఏవం సృష్టిః సముత్పన్నా త్రివిధానృపసత్తమ! దేవతిర్య జ్మనుష్యాది భేదైర్వివిధ కల్పితా. 24

అండజాః స్వేదజాశ్చై చోద్భిజ్ఞాశ్చ జరాయుజాః | చతుర్భేదె ః సముత్పన్నాజీవాః కర్మయుతాః కిల. 25

ఏవం సృష్టిం సమాసాద్య బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | విహారం స్వేషుస్థానేషు చక్రుః సర్వేయథేప్సితమ్‌. 26

ఏవం ప్రవర్తితే సర్గే భగవా న్ప్రభురచ్యుతః | మహాలక్ష్మ్యా సమంతత్ర చిక్రీడ భువనేస్వకే. 27

ఏకస్మిన్సమయేవిష్ణు ర్వైకుంఠే సంస్థితః పురా | సుధాసింధు స్థితంద్వీపం సస్మార మణిమండితమ్‌. 28

యత్రదృష్ట్వా మహామాయాం మంత్రశ్చా సాదితః శుభః | స్మృత్వాతాం పరమాం శక్తిం స్త్రీభావంగమితోయయా. 29

పాలసంద్రమును మధించి నప్పుడందుండి దివ్యవృక్షమగు పారిజాతము చతుర్దంతములుగల యైరావతము కామితములెల్ల వర్షించు కామధేనువు నుద్భవించెను. అశ్వరాజమగు నుచ్చైఃశ్రవము రంభాద్యప్సరోగుణము సకలస్వర్గభూషణములు నింద్రునకు లభించినవి. సముద్రమునుండి పుట్టిన చంద్రుడును ధన్వంతరియు స్వర్గసీమలో దేవతల నడుమ విరాజిల్లు చున్నారు. ఈ తెఱుంగున దేవతలు మనుష్యులు తిర్యక్కులునను ముత్తెఱంగులతో మొదటి సృష్టి జరిగినది. ఎల్లజీవులు తమ తమ కర్మానుసారముగ నండజములు స్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు నను నాల్గు తెఱంగుల నుత్పన్నములైరి. ఈ విధముగ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు విశ్వసృష్టికార్య మారంభించి తమ తమ నెలవులందు యథేచ్ఛగ విహారము సల్పుచుండిరి. ఇట్లు సృష్టిక్రమము జరుగుచుండగ శ్రీమహాలక్ష్మీ సమేతుడై జగన్నాథుడైన యచ్యుతుడు వైకుంఠమున నానందవిలాసముల తేలియాడుచుండెను. ఇట్లు విశ్వుడగు హరి యల వైకుంఠపురంబులో నకుంఠితగతినుండి యొక్కనాడు సుధాసాగరమధ్యమున దీపిల్లు మనిద్వీపమును నెమ్మదిలోన దలంచెను. ఆ శ్రీహరి పూర్వ మాసాగర మధ్యమందే మహామాయను సందర్శించి యా దేవి మాయవలన స్త్రీరూపమంది యా దేవి దయవలన మంత్రరాజము బడసెను.

యజ్ఞం కర్తుం మనశ్చక్రే అంబికాయా రమాపతిః | ఉత్తీర్యభువనాత్త స్మాత్సమాహూయ మహేశ్వరమ్‌. 30

బ్రహ్మాణం వరుణం శక్రం కుబేరం పావకం యమమ్‌ | వసిష్ఠం కశ్యపం దక్షం వా మదేవం బృహస్పతిత్‌. 31

సంభారం కల్పయా మాస యజ్ఞార్థం చాతివిస్తరమ్‌ | మహావిభవ సంయుక్తం సాత్త్వికం సుమనోహరమ్‌. 32

మండపం వితతం తత్ర కారయామాస శిల్పిభిః | ఋత్తిజో వరయా మాస సప్తవింశతి సువ్రతాన్‌. 33

చితిం చకారయ మాస వేదీశ్చైవ సువిస్తరాః | ప్రజేపుర్బ్రాహ్మణా మంత్రాన్దేవ్యాబీజ సమన్వితాన్‌. 34

జుహుపుస్తే హవిఃకామం విధివత్పరి కల్పితే | కృతేతు వితతే హోమేవాగు వాచాశరీరిణీ. 35

విష్ణుంతదా సమాభాష్య సుస్వరామధురాక్షరా | విష్ణో! త్వంభవదేవానాం హరే! శ్రేష్ఠతమ స్సదా. 36

మాన్యశ్చపూజనీయశ్చ సమర్థశ్చ సురేష్వపి | సర్వేత్వా మర్చయిష్యంతి బ్రహ్మాద్యాశ్చ సవాసవాః. 37

ప్రభవిష్యంతి భోభక్త్యా మానవాభువి సర్వతః | వరదస్త్వంచ సర్వేషాం భవితా మానవేషువై. 38

కామద స్సర్వ దేవానాం పరమః పరమేశ్వర్శరః | సర్వయజ్ఞేషు ముఖ్యస్త్వంపూజ్యః సర్వైశ్చయాజ్ఞికై. 39

త్వాంజనాః పూజయిష్యంతి వరదస్త్వంభవిష్యసి | శ్రయిష్యంతి చదేవాస్త్వాం దానవైరతి పీడితాః. 40

అట్టి రమారమణుడు శ్రీదేవీ యాగ మొనర్పదలచి తన భవనము వెడలి శంకరు నాహ్వానించెను. శ్రీవిష్ణువు-బ్రహ్మ-ఇంద్రుడు-అగ్ని-యముడు- వరణుడు-కుబేరుడు-వసిష్ఠుడు-కశ్యపుడు-దక్షుడు-బృహస్పతి మొదలుగాగల దేవతల నాహ్వానించెను. వారెల్లరును యజ్ఞార్థము సాత్త్వికములు - మనోహరములు - మహావిభవ సంభరితములు-నగు పెక్కు యాగ సంభారములు సమకూర్చిరి. అంత దివ్యశిల్పులచేత విశాలమైన మండపము నిర్మింపబడెను. ఆ యజ్ఞమునం దిరువదియేడుగురు ఋత్విజులుగ నియమింపబడిరి. బ్రహ్మణులు విశాలమైన యజ్ఞవేదిక నేర్పఱచి యందగ్నిని ప్రతిష్ఠించి శ్రీదేవీ బీజసంభరితములగు దేవీ మంత్రములతో హోమము చేసిరి. వారి విధముగ విధివిధానముగ హోమము జరుపగ నాకాశవాణి సుస్వరముతో మదుర మధురముగ సుధలొలుకబోయుచు నిల్లు పలికెను: ''ఓ విష్ణూ! నీవు సకల దేవతలలో శ్రేష్ఠతముడవు. నఖిలసురలకు మాన్యుడవు. పూజ్యుడవు. దక్షుడవు. ఇంద్రుడు మున్నగు దేవతలెల్లరు నిన్ను పెక్కురీతుల నర్చింపగలరు. మానవులు నీయందు మధురభక్తిపూరితులై వర్తింతురు. సర్వమానవాళికి నీవు వరదాయకుడవై ప్రఖ్యాతిగాంతువు. అఖిల దేవతలకు కామితార్థప్రదుడవు-పరమేశ్వరుడవు-యజ్ఞముఖ్యుడవు-పరమపూజ్యుడవు నగుదువు. సకల యాజకులు నిన్నే యాజింతురు. సకల జనులు నిన్ను పూజింతురు. దానవ పీడితులైన దేవతలు నిన్ను శరణు జొత్తురు. నీ వెల్లవారి కభయప్రదుడవు-వరదుడవు గాగలవు.

శరణ్య స్త్వంచ సర్వేషాం భవితా పురుషోత్తమ | పురాణషు చ సర్వేషు వేదేషు వితతేషు చ. 41

త్వంవై పూజ్యతమః కామం కీర్తిస్తవ భవిష్యతి | యదాయదాహి ధర్మస్య గ్లావిర్భవతిభూతలే. 42

తదాం%శేనావతీర్యాశు కర్తవ్యం ధర్మరక్షణమ్‌ | అవతారాః సువిఖ్యాతాః పృథివ్యాం తవభాగశ. 43

భవిష్యంతి ధరాయాంవై మాననీయా మహాత్మనామ్‌ | అవతారేషు సర్వేషు నానాయోనిషు మాధవ! 44

విఖ్యాతః సర్వలోకేషు భవితా మధుసూదన | అవతారేషు సర్వేషు శక్తిస్తే సహచారిణీ. 45

భవిష్యతి మమాంశేన సర్వకార్య ప్రసాధినీ | వారాహీ నారసింహీ చ నానాభేదై రనేకధా. 46

నానాయుధాః శుభాకారః సర్వాభరణ మండితాః | తాభిర్యుక్తః సదా విష్ణో! సురకార్యాణి మాధవ! 47

సాధయిష్యసి తత్సర్వం మద్దత్త వరదానతః | తాస్త్వయా నావమంతవ్యాః సర్వదా గర్వలేశతః. 48

పూజనీయాః ప్రయత్నేన మాననీయాశ్చ సర్వథా | నూనంతా భారతేఖండే శక్తయః సర్వకామదాః. 49

పురుషోత్తమా! నీవు సర్వశరణ్యుడవు. సకల వేదపురాణములందు నీవే పూజనీయుడవు. నీవే పరముడవు-విశ్వమాన్యుడవు. నీ కీర్తిచంద్రికలు దెసలు వ్యాపించును. ఈ భూతలమునం దధర్మము పెచ్చు పెరిగి ధర్మహాని సంభవించును. ఆ సమయములందు నీవు నీ యంశముతో ధర్మసంస్థాపనకు యుగయుగములన నవతరింపగలవు. నీ వీ భూమిపై పెక్కు లవతారములు దాల్చెదవు. భూతభావనా! మాధవా! నీ యవతారము లెల్ల మహాత్ములకు మాననీయము లగును. నీ వనేక యోనులందు పెక్కవతారములు దాల్చెదవు. మధుసూదనా! ఇట్లు నీ దివ్యావతారము లెల్లలోకములందును ప్రసిద్ధి గాంచును. ఈ యెల్ల యవతారములందు నా మహాశక్తి నీకు తోడునీడగ నుండగలదు. ఆ దివ్యశక్తి నా యంశమున జనించి చిత్రవిచిత్ర కార్యములు పెక్కులు మానవాతీతములు సాధించగలదు. శ్రీనారసింహి-వారాహిమున్నగు పలుభేదములతో నా శక్తి యొప్పారుచుండును. నా శక్తిస్వరూపిణులు నానాయుధధారిణులు-శుభకారలు-దివ్యభూషణభూషితలు-నై నెగడుదురు. నీవు నా వరప్రభావమున నట్టి నా శక్తులనుగూడి సర్వాతిశాయులగు దేవకార్యములు నెరవేర్చగలవు. నీ వెన్నడు నెప్పుడు నెంతమాత్రము వారిని కించపఱచరాదు. ఆ శక్తులు కర్మభూమియగు భరతఖండమున సర్వకామములు కురియుదురు. వారెల్లవారికి పూజనీయులు. ప్రయత్నపూర్వకముగ మాననీయులు.

భవిష్యంతి మనుష్యాణాం పూజితాః ప్రతిమాసుచ | తాసాంతవచ దేవేశ! కీర్తిఃస్యా దభిలేష్వపి. 50

ద్వీపేషు సప్తస్వపిచ విఖ్యాతా భువిమండలే | తాశ్చ త్వాంవై మహాభాగ! మానవా భువిమండలే. 51

అర్చయిష్యంతి వాంఛార్థం సకామాః సతతంహరే | అర్చాస చోపహారైశ్చ నానాభావసమన్వితాః. 52

పూజయిష్యంతి వేదోక్తమంత్రై ర్నామజపై స్తథా | మహిమా తవ భూలోకే స్వర్గేచ మధుసూదన! 53

పూజనా ద్దేవదేవేశ! వృద్ధిమేష్యతి మానవైః | ఇతి దత్వా వరా న్వాణీ విరరామ ఖసంభవా. 54

భగవానపి ప్రీతాత్మా హ్యభవ చ్ఛ్రవణాదివ | సమాప్య విధివద్యజ్ఞం భగవా న్హరిరీశ్వరః. 55

విసర్జయిత్వా తాన్దేవా న్బ్రహ్మపుత్రా న్మునీనథ | జగామానుచరైః సార్థం వైకుంఠం గరుడధ్వజః. 56

స్వానిస్వానిచ ధిష్ణ్యాని పునఃసర్వే సురాస్తతః | మునయో విస్మితావార్తాం కుర్వంత స్తే పరస్పరమ్‌. 57

యయుః ప్రముదితాః కామం స్వాశ్రమా న్పావనానథ. 58

శ్రుత్వా వాణీం పరమవిశదాం వ్యోమజాం శ్రోత్రరమ్యామ్‌ సర్వేషాంవై ప్రకృతివిషయే భక్తిభావశ్చ జాతః |

చక్రుః సర్వే ద్విజమునిగణాః పూజనం భక్తియుక్తాః | తస్యాః కామం నిఖిలఫలదం చాగమోక్తం మునీంద్రాః. 59

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే త్రయోదశో%ధ్యాయః.

ఆ శక్తి దేవతలు ప్రతిరూపమున మానవులచేత పూజలందుకొందురు. భక్తుల వాంఛితము లీడేర్తురు. వారి మూలమున నీ కీర్తియు నేల నాలుగు చెఱగుల వ్యాపించును. నీవు భూమండలమందు సప్తద్వీపములందు చిరయశము గాంతువు. మహాభాగుడవగు నిన్ను-నా దివ్యశక్తులనుజనులు తమ వాంచాసిద్ధికి పలుభావములతో కానుకలతో సకాములై యర్చింతురు. అచ్యుతా! నీ దివ్యనామజపము వేదోక్త మంత్రములతో జరుగుచుండును. నీ మహోజ్జ్వలశక్తి మహిమము భూమండలమంతయు నిండును. స్వర్గమున వ్యాపించును. అనంతా! నిన్ను పూజించుటవలన నెల్లదేవతలు నరులు పచ్చని బ్రతుకులతో కలకలలాడుదురు. వ్యాసుడిట్లనెను: అని యిట్లు గోవిందునకు వరము లొసగి యాకాశవాణి విరమించెను. అమృతము జాలువాఱు శ్రీదేవీ వాక్కు లాలకించి విష్ణు భగవానుడు సంప్రీతుడై విధివిధానముగ శ్రీదేవీ యజ్ఞమును సమాప్తము గావించెను. పిదప వైకుంఠుడు బ్రహ్మపుత్త్రులను మునికుమారులను వీడ్కొలిపి తన యనుచరులతో గరుడునెక్కి వైకుంఠ మేగెను. ఎల్లదేవతలు తమతమ నివాసముల కరిగిరి. మునులు పరమవిస్మితులై తమలో తాము దేవినిగూర్చి తలపోయుచు హర్షము వెలిపుచ్చుచుండిరి. ఆ పిదప మును లెల్లరు తమతమ పిత్రాశ్రమములకు జనిరి. కర్ణపేయము-దివ్య సుందరము-మహిమాన్వితమునైన యాకాశవాణిని చెవులపండువుగ వినినంతనే యెల్లరికి శ్రీదేవియందు భక్తి ఉప్పొంగెను. ఆనాటినుండి సకల మునులు బ్రాహ్మణులు భక్తితో దేవీపూజ సలుపదొడగిరి. మునివరులారా! నిజముగ శ్రీదేవీపూజ ఫలదాయకము. ఆగమోక్తము.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు పదుమూడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters