Sri Devi Bhagavatam-1    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

సూత ఉవాచ :

శృణ్వంతు సంప్ర వక్ష్యామి పురాణాని మునీశ్వరాః | యథా శ్రుతాని తత్త్వేన వ్యాసాత్సత్యవతీసుతాత్‌. 1

మద్వయం భద్వయంచైవ బ్రత్రయం వ చతుష్టయమ్‌ | అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌. 2

చతుర్దశ సహస్రం చ మాత్స్య మాద్యం ప్రకీర్తితమ్‌| తథాగ్రహసహస్రంతు మార్కండేయం మహాద్భుతమ్‌. 3

చతుర్దశ సహస్రాణి తథా పంచశతాని చ | భవిష్యం పరిసంఖ్యాతం మునిభి స్తత్త్వదర్శిభిః 4

అష్టాదశ సహస్రం వైపుణ్యం భాగవతం కిల | తథా చాయుత సంఖ్యాకం పురాణం బ్రహ్మసంజ్ఞకమ్‌. 5

ద్వాదశైవ సహస్రాణి బ్రహ్మాండం చ శతాధికమ్‌ | తథాష్టాదశ సాహస్రం బ్రహ్మవైవర్త మేవ చ. 6

అయుతం వామనాఖ్యం చ వాయవ్యం షట్శతానిచ | చతుర్వింశతి సంఖ్యాత సహస్రాణి తు శౌనక. 7

త్రయోవింశతి సాహస్రం వైష్ణవం పరమాద్భుతమ్‌ | చతుర్వింశతి సాహస్రం వారాహం పరమాద్భుతమ్‌. 8

షోడశైవ సహస్రాణి పురాణం చాగ్ని సంజ్ఞితమ్‌ | పంచ వింశతి సాహస్రం నారదం పరమం మతమ్‌. 9

పంచ పంచా శత్సాహస్రం పాద్మాఖ్యం విపులం మతమ్‌ | ఏకాదశ సహస్రాణి లింగాఖ్యం చాతి విస్తృతమ్‌. 10

ఏకోన వింశత్సాహస్రం గారుడం హరి భాషితం | సప్తదశ సహస్రంచ పురాణం కూర్మ భాషితం. 11

ఏకాశీతి సహస్రాణి స్కాందాఖ్యం పరమాద్భుతమ్‌ | పురాణాఖ్యా చ సంఖ్యాచ విస్తరేణ మయా2 నఘాః. 12

మూడవ అధ్యాయము

పురాణములను-వ్యాసులను గుఱించిన వివరములు

సూతుండిట్లనియె : ఓ మునులారా! సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి వలన నేను సకలపురాణములను వింటిని. వానిని మీకు చెప్పుదును. మీ రెల్లరును కడు శ్రద్ధగా నాలకింపుడు. మకారము మొదటి యక్షరముగా గల పురాణములు రెండు. భకారము తొలుత గలవి రెండు. బ్రకారము మొదట గలవి మూడు. వకారము ముందుగలవి నాలుగు. ఇవికాక అ-నా-ప-లిం-గ-కూ-స్క అను నక్షరములు ముందుగల వేరువేరు పురాణములు గలవు. వీనిలో మొదటిది మత్స్యపురాణము. ఇది పదునాలుగు వేల శ్లోకములలో వ్రాయబడినది రెండవది మార్కండేయ పురాణము. ఇది అత్యద్భుతమైనది. ఇందు తొమ్మిదివేల శ్లోకములు గలవు. భవిష్య పురాణమునందు పదునాల్గువేల యైదువందల శ్లోకములు గలవు. శ్రీ మహాభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతోను బ్రహ్మపురాణము పదివేల శ్లోకములతోను విలసిల్లుచున్నవి. బ్రహ్మాండ పురాణ మందలి శ్లోకసంఖ్య పండ్రెండు వేల యొకవంద. బ్రహ్మవైవర్త పురాణమందలి శ్లోక సంఖ్య పదునెనిమిదివేలు. వామన పురాణమందు పదివేల శ్లోకములును వాయు పురాణమునందు నిరువది నాలుగువేల యారువందల శ్లోకములును గలవు. శ్రీ విష్ణు పురాణము మహాద్భుతమైనది. అది యిరువది మూడువేల శ్లోకములతో నొప్పారుచున్నది. పరమాశ్చర్యకరమైన వరాహ పురాణమందు శ్లోకము లిరువదినాల్గువేలు గలవు. అగ్ని పురాణమున మొత్తము శ్లోకములు పదారు వేలును నారద పురాణమున నిరువదైదువేల శ్లోకములు నలరుచున్నవి. శ్రీ పద్మపురాణ మేబది యైదువేల శ్లోకములతో విస్తృతమైయున్నది. లింగ పురాణమునందు పదునొకండువేల శ్లోకములు గలవు. శ్రీహరి గరుడ పురాణమును పందొమ్మిదివేల శ్లోకములలో వెల్లడించెను. కూర్మ పురాణమందు పదునేడువేల శ్లోకములు గలవు. స్కంద పురాణ మెనుబది యొక్క వేల శ్లోకములతో తనరారు చున్నది. ఇది పురాణములయు వానియందలి శ్లోకసంఖ్యలయు వివరణము.

తథైవోప పురాణాని శృణ్వంతు ఋషిసత్తమాః | సనత్కుమారం ప్రథమం నారసింహం తతః పరమ్‌ 13

నారదీయం శివంచైవ దౌర్వాసన మనుత్తమమ్‌ | కాపిలం మానవం చైవ తథా చౌశనసం స్మృతమ్‌. 14

వారుణం కాలికాఖ్యండ సాంబం నందికృతం శుభమ్‌ | సౌరం పారాశరం ప్రోక్త మాదిత్యం చాతివిస్తరమ్‌. 15

మాహేశ్వరం భాగవతం వాసిష్ఠంచ సవిస్తరమ్‌| ఏతా న్యుపపురాణాని కథితాని మహాత్మభిః 16

అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీ సుతః | భారతాఖ్యాన మతులం చక్రే తదుపబృంహితమ్‌. 17

మన్వంతరేషు సర్వేషు ద్వాపరే ద్వాపరే యుగే | ప్రాదుష్కరొతి ధర్మార్థీ పురాణాని యథావిధి. 18

ద్వాపరే ద్వాపరే విష్ణు ర్వ్యాస రూపేణ సర్వదా | వేదమేకం స బహుధా కురుతే హితకామ్యయా. 19

అల్పాయుషో%ల్పబుద్ధీంశ్చ విప్రాన్‌ జ్ఞాత్వా కలావథం| పురాణ సంహితాంపుణ్యాం కురుతే%సౌ యుగే యుగే. 20

స్త్రీశూద్ర ద్విజ బంధూనాం న వేద శ్రవణం మతమ్‌ | తేషామేవ హితార్థాయ పురాణాని కృతానిచ. 21

మన్వంతరే సప్తమే%త్ర శుభే వైవస్వ తాభిధే | అష్టావింశతియే ప్రాప్తే ద్వాపరే మునిసత్తమాః. 22

వ్యాసః సత్యవతీ సూను ర్గురుర్మే ధర్మ విత్తమః | ఏకోన త్రింశత్సం ప్రాప్తే ద్రౌణి ర్వ్యాసో భవిష్యతి. 23

అతీతాస్తు తథా వ్యాసాః సప్తవింశతి రేవచ| పురాణ సంహితాసై#్తస్తు కథితాస్తు యుగే యుగే. 24

ఇపుడు ఉప పురాణముల గూర్చి వినుడు. సనత్కుమారము నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔశనసము వారుణము కాలికము సాంబము నందికృతము పారాశరుడు విపులముగ చెప్పిన యాదిత్యపురాణము మాహేశ్వరము భాగవతము వాసిష్ఠము ననుపేరులతో నుపపురాణములు పదునెనిమిది గలవని మహాత్ములు వాక్రుచ్చుచున్నారు. ఈ విధముగ సత్యవతీ తనయుడగు శ్రీ వ్యాసభగవానుడు పదునెనిమిది మహాపురాణములను వివరించెను. ఆ పిదప వానినన్నిటి సారమును గైకొని శ్రీ మహాభారతమను పేర ప్రసిద్ధమైన గ్రంథమును విరచించెను. ప్రతి మన్వంతరమునందును ద్వాపర యుగములు వచ్చుచుండును. ద్వాపరము వచ్చినపుడెల్ల ధర్మాద్వైతమతితో వ్యాసుడు యథావిధిగా పురాణములను ప్రపంచించు చుండును. ప్రతి ద్వాపరమందును శ్రీ హరియే వ్యాసుడుగ నవతరించి జనులకు మేలుబాట చూపుటకు ప్రతియొక వేదమును అనేకములగు ఉప భాగములుగ విభజించును. ప్రతి కలియుగమునను బ్రాహ్మణులల్పాయువులు నల్పమతులునై యుందురు. వ్యాసుడు వారి కందరికిని మేలు వెలుగు చూపగోరి యుగయుగమునందును పావన పురాణ సంహితలను ప్రకటించును. స్త్రీలకును శూద్రులకును ద్విజబంధువులకును వేదము వినుట కధికారము లేదు. అట్టివారి హితము గోరి పురాణములు రచింపబడినవి. ఇపుడేడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. ఈ మన్వంతరమందలి యిరువదెనిమిదవ ద్వాపరము ప్రాప్తించగా నా గురుడు ధర్మవిదుడు నగు సత్యవతీ సుతుడు వ్యాసుడు వ్యాసపీఠమలంకరించి యున్నాడు. ఇక మీదట ఇరువది తొమ్మిదవ ద్వాపరమున ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసపదము నలంకరించును. ఇట్లిప్పటికిరువదేడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళిరి. వీరు ప్రతి ద్వాపరమందును పురాణ సంహితలు వ్రాసిరి.

ఋషయ ఊచుః :

బ్రూహి సూత మహాభాగ వ్యాసాః పూర్వయుగోద్భవాః | వక్తారస్తు పురాణానాం ద్వాపరే యుగే. 25

సూత ఉవాచః

ద్వాపరే ప్రథమేవ్యస్తాః స్వయం వేదాః స్వయం భువా | ప్రజాపతి ర్ద్వితీయేతు ద్వాపరే వ్యాసకార్యకృత్‌. 26

తృతీయే చోశనా వ్యాస శ్చతుర్థేతు బృహస్పతిః | పంచమే సవితా వ్యాసః షష్ఠే మృత్యు స్తథా%పరే. 27

మఘవా సప్తమే ప్రాప్తే వసిష్ఠ స్త్వష్టమే స్మృతః | సారస్వతస్తు నవమే త్రిధామా దశ##మే తథా. 28

ఏకదశే%థ త్రివృషో భరద్వాజస్తతంః త్రయోదశే చాంతరిక్షో ధర్మశ్చాపి చతుర్దశే. 29

త్రయారుణిః పంచదశే షోడ శేతు ధనంజయః | మేధాతిథిః సప్తదశే వ్రతీ హ్యష్టాదశే తథా. 30

అత్రి రేకోనవింశే%థ గౌతమస్తు తతః పరమ్‌ | ఉత్తమ శ్చైకవింశే%థ హర్యాత్మా పరికీర్తితః. 31

వేనో వాజశ్రవాశ్చైవ సోమో%ముష్యాయణస్తథా | తృణబిందు స్తథా వ్యాసో భార్గవస్తు తతః పరమ్‌. 32

తతః శక్తి ర్జాతుకర్ణ్యః కృష్ణద్వైపాయన స్తతః | అష్టావింశతి సంఖ్యేయం కథితా యా మయా శ్రుతా. 33

ఋషులిట్లనిరి: మహాభాగుడవగు సూతమునిచంద్రా! ప్రతి ద్వాపరయుగమునందును పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షుల పేరులు దయతో మాకు తెలుపుము. సూతుడిట్లనియె: మొదటి ద్వాపరమున బ్రహ్మయే స్వయముగ వ్యాసుడై వేద విభజన గావించెను. రెండవ ద్వాపరమునందు ప్రజాపతి వ్యాస కృత్యము నెఱపెను. మూడవ ద్వాపరమందు శుక్రుడును నాలవ యైదవ యాఱవ ద్వాపరములందు వరుసగ గురు రవి మృత్యులును వ్యాసపదవులందు శోభిల్లిరి. ఇంద్రు డేడవ ద్వాపరమున వసిష్ఠు డెనిమిదవ ద్వాపరమున సారస్వతుడు తొమ్మిదవ ద్వాపరమున త్రిధాముడు పదవ ద్వాపరమున వ్యాసకార్యములు నిర్వహించిరి. పదునొకండవ ద్వాపరమున త్రివృషుడు పండ్రెండవ ద్వాపరమందు భరద్వాజుడు పదుమూడవ ద్వాపరంబున నంతరిక్షుడు పదునాల్గవ ద్వాపరమున ధర్ముడు పదునైదవదానిలో త్రైయారుణి పదునారవ దానిలో ధనంజయుడు పదునేడవ ద్వాపరమునందు మేధాతిథి పదునెనిమిదవ ద్వాపరమున వ్రతియును పందొమ్మిదవ ద్వాపరమున అత్రియు నిరువదవ ద్వాపరమున గౌతముడును నిరువది యొకటవ ద్వాపరమున నుత్తముడగు హర్యాత్ముడును ఇరువది రెండవ ద్వాపరమునందు వేనుడు వాజశ్రవుడు నిరువది మూడవ దానిలో సోముడాముష్యాయణుడును నిరువది నాలుగవ ద్వాపరములో తృణబిందువు నిరువది యైదవ ద్వాపరమున భార్గవుడును ఇరువదియారవ ద్వాపరములో శక్తియు ఇరువదేడవ ద్వాపరములో జాతుకర్ణియు ఇరువదెనిమిదవ ద్వాపరమునందు కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడును వ్యాసపీఠమలంకరించిరి. ఇట్లు మీకిరువదియెనిమిది ద్వాపరములందును వచ్చిన ఇరువది యెనిమిదిమంది వ్యాసులను గుఱించి తెలిపితిని.

కృష్ణద్వైపాయనాత్ప్రోక్తం పురాణం చ మయాశ్రుతమ్‌ | శ్రీమద్భాగవతం పుణ్యం సర్వదుఃఖాఘనాశనమ్‌. 34

కామదం మోక్షదం చైవ వేదార్థ పరిబృంహితమ్‌ | సర్వాగమరసారామం ముముక్షూణాం సదా ప్రియమ్‌. 35

వ్యాసేన కృత్వా%తి శుభం పురాణం | శుకాయ పుత్రాయ మహాత్మనే యత్‌ |

వైరాగ్యయుక్తాయ చ పాఠితం వై | విజ్ఞాయ చైవారాణి సంభవాయ.

శుత్రం మయా తత్ర తథా గృహీతం | యథార్థవ ద్వ్యాస ముఖా న్మునీంద్రాః |

పురాణగుహ్యం సకలం సమేతం గురోః ప్రసాదా త్కరుణానిధేశ్చ. 37

సుతేన పృష్టః సకలం జగాద | ద్వైపాయన స్తత్ర పురాణగుహ్యమ్‌ |

అయోనిజే నాద్భుతబుద్ధినా వై | శ్రుతం మయా తత్ర మహాప్రభావమ్‌. 38

శ్రీమద్భాగవతామరాంఘ్రిపఫలా స్వాదాదరః సత్తమాః |

సంసారార్ణవ దుర్విగాహ్య సలిలం సంతర్తుకామఃశుకః |

నానాఖ్యానరసాలయం శ్రుతిపుటైః ప్రేవ్ణూ%శృణో దద్భుతమ్‌

తుచ్ఛ్రుత్వాన విముచ్యతే కలిభయా దేవం విధః కః క్షితౌ. 39

పాపీయానపి వేద ధర్మరహితః స్వాచారహీనాశయో

వ్యాజేనాపి శృణోతి యః పరమిదం శ్రీమత్పురాణోత్తమమ్‌|

భుక్త్వాభోగకలాప మత్ర విపులం దేహావసానే%చలం|

యోగిప్రాప్య మవాప్ను యా ద్భగవతీనామాంకితం సుందరమ్‌. 40

యా నిర్గుణా హరిహరాదిభి రప్యలభ్యా|

విద్యా సతాంప్రియతమా%థ సమాధిగమ్యా|

సా తస్య చిత్త కుహరే ప్రకరోతి భావమ్‌|

యఃసంశృణోతి సతతం తు సతీపురాణమ్‌| 41

సంప్రాప్య మానుషభవం సకలాంగయుక్తమ్‌

పోతంభవార్ణవ జలో త్తరణాయ కామమ్‌|

సంప్రాప్య వాచక మహో న శృణోతి మూఢో%

సౌవంచితో%త్ర విధినా సుఖదం పురాణమ్‌. 42

యః ప్రాప్య కర్ణయుగళం పటు మానుషత్వే

రాగీ శృణోతి సతతం చ పరాపవాదాన్‌|

సర్వార్థదం రసనిధిం విమలం పురాణం

నష్టః కుతో న శృణుతే భువి మంద బుద్ధిః. 43

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ తృతీయోధ్యాయః.

వారిలో శ్రీకృష్ణ ద్వైపాయనుడగు వ్యాసుడు శ్రీదేవీభాగవతపురాణము ప్రవచించగా నేను వింటిని. ఆ పురాణము పుణ్యకరమైనది. ఈ కలి సంసార పాతకములను బాపజాలినది. ఆ పురాణము కామదము ముక్తిదము. అది సకలాగమ సారముతో నవరసములతో చమత్కారముతో వెలయుచున్నది. ముముక్షులకది యెంతేని ప్రీతికరమైనది. శ్రీవేదవ్యాసుడు అతి శుభకరమగు ఆ పురాణమును రచించి దానిని మహాత్ముడు వైరాగ్యసంపన్నుడు అరణి సంజాతుడు శుకనామధేయుడు అగు తన పుత్రునిచే అధ్యయనము చేయించెను. అయోనిజుడు అద్భుతధీశాలి తన పుత్రుడనగు శుకునకు వ్యాసుడు మహా మహిమాన్వితమైన యీ పురాణ రాజమును బోధించు నపుడు నే నచ్చోటనే యుంటిని. కావున ఆ వ్యాసగురుని యనుగ్రహమున నాదేవీ పురాణ రహస్యము సర్వము నేనును విను భాగ్యము పొందితిని. ఈ శ్రీమద్దేవీభాగవతము వేదకల్ప వృక్షమున ఫలించిన దివ్యఫలము. దుర్గమ సంసార సాగరమును దాటించు నావ. ఈ పురాణామృతసారము పెక్కు లాఖ్యానములతో నొప్పుచున్నది. దానిని శుకుడు ప్రేమభక్తి నిండార తన కర్ణపుటములు తనివార గ్రోలెను. అట్టి యద్భుత దివ్యకథలు వినిన ప్రతివాడును కలి భయమునుండి ముక్తుడగును. ఇది ముమ్మాటికిని సత్యము. పాపులలో నతిపాపియైనను వేదధర్మ రహితుడైనను స్వధర్మముల బాటించని వాడైనను ఎట్టివాడైన నేనెపముతో నైనను ఈ పరమోత్తమ శ్రీదేవీ పురాణమును భక్తిప్రపత్తులతో వినినచో నట్టివా డిచ్చోటనే విపుల భోగభాగ్యము లనుభవించి పిదప పరమపావని యగు భగవతి సుప్రసాదమున యోగులనుభవించు నక్షయ దేవీ లోకము లందగలడు. ఏ మానవు డీ పరమమగు శ్రీదేవీ పురాణమును నిరంతరమును చక్కగ వినుచుండునో వాని హృదయకమలమందు ధ్యానగమ్యయు సత్పురుషులకు ప్రియతమయు నిర్గుణయు శ్రీవిద్యారూపయు హరిహరాదులకు నలభ్యయు నగు సర్వకారణ కారణ భగవతి ప్రత్యక్షమగుచుండును. ఇతర ప్రాణులవలె కాక సర్వావయవములతో నొప్పు ఈ దేహమును ధరించిన యీ నరజన్మ కడు దుర్లభ##మైనది. ఇంతటి ఉత్తమ జన్మమునెత్తియు మంచి వాక్కులు గల్గియు మూఢుడీ సంసారసాగరమును దాటించగలిగి ముక్తి నొసగజాలినట్టి యీ దేవీ భాగవతమను నావనుగాంచియు దాని నుపయోగించుకొనజూడనిచో వాడు విధివంచితుడు. ఎవ్వడు మానవజన్మము పొంది వినుటకు సమర్థములగు రెండు చెవులుండియు రాగియై పరనిందలే వినగోరునో - పురుషార్థము లొసంగునదియు నవరసభరితమును నిర్మలమును నగు నీ శ్రీదేవీ భాగవతమును చెవులార వినగోరడో వాడు మందమతి-తనకుతాను నాశము కలిగించుకొనువాడు; కానిచో ముక్తిశ్రీ నొసంగు దీని నేలవినడు?

ఇది శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందు తృతీయాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters