Sri Devi Bhagavatam-1    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

జనమేజయః : దేహప్రాప్తి ర్వసిష్ఠస్య కథితా భవతా కిల | నిమిః కథం పునర్దేహం ప్రాప్తవానితి మే పద. 1

వ్యాసః : వసిష్ఠేన చ సంప్రాప్తః పునర్దేహో నరాధిప | నిమినా న తథా ప్రాప్తో దేహః శాపా దనంతరమ్‌. 2

యదా శప్తో వసిష్ఠేన తదా తే బ్రాహ్మణాః క్రతౌ | ఋత్విజో యే వృతా రాజ్ఞా తే సర్వే సమచింతయన్‌. 3

కిం కర్తవ్య మహో%స్మాభిః శాపదగ్ధో మహీపతిః | అస్మి న్యజ్ఞే త్వసంపూర్ణే దీక్షాయుక్తశ్చ ధార్మికః. 4

కింకర్తవ్యం కార్య మేత ద్విపరీత మభూత్కిల | అవశ్యం భావిభావత్వా దశాక్తాః స్మ నివారణ. 5

మంత్రై ర్బహువిధై ర్దేహం తదా తస్య మహాత్మనః | రక్షితం ధారయా మాసుః కించి చ్ఛ్వసన సంయుతమ్‌. 6

గంధైర్మాల్యైశ్చ వివిధైః పూజ్యమానం ముహుర్ముహుః | మంత్రశక్త్యా ప్రతిష్ఠస్య నిర్వికారం సుపూజితమ్‌. 7

సమాప్తే చక్రతౌ తత్ర దేవాః సర్వే సమాగతాః | ఋత్విగ్భి స్తు స్తుతాః సర్వే సుప్రీతా శ్చాభవ న్నృప. 8

విజ్ఞప్తా మునిభిః స్తోత్రై ర్నిర్విణ్ణాత్మాన మబ్రువమ్‌ | ప్రసన్నాః స్మమహీపాల వరం వరయ సువ్రత. 9

యజ్ఞే నానేన రాజర్షే వరం జన్మ విధీయతే | దేవదేహం నృదేహం వా యత్తే మనసి వాంఛితమ్‌. 10

దృప్తః కామం పురోధా స్తే మృత్యులోకే యథాసుఖమ్‌ | ఏవముక్తో నిమే రాత్మా సంతుష్ట స్తానువాచ హ. 11

న దేహే మమ వాంఛా%స్తి సర్వదైవ వినశ్వరే | వాసో మే సర్వసత్త్వానాం దృష్టా వస్తు సురోత్తమాః. 12

నేత్రేషు సర్వభూతానాం వాయుభూత శ్చరా మ్యహమ్‌ | ఏవ ముక్తాః సురా స్తత్ర నిమే రాత్మాన మబ్రువన్‌. 13

పదునైదువధ్యాయము

నిమి చరిత్రము

జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ! వసిష్ఠుని పునర్జన్మము గుఱించి వివరించితివి. అటులే నిమి యెటుల మరొక తనువుదాల్చెనో తెలుపుము.' అన వ్యాసుడిట్లనెను: రాజా! వసిష్ఠుడు వేరొకదేహము దాల్చెను. కాని, నిమిమాత్రము వసిష్ఠశాపమున మరొక్కమేను దాల్చలేదు. వసిష్ఠుడు నిమిని శపింపగ ఋత్విజులు బ్రాహ్మణులెల్లరు నిట్లు తలంచిరి: ఈ యజ్ఞము పూరణము గాకమునుపే రాజు శపింపబడెనే. రాజు దీక్షితుడుగదా! ఇపుడు మనమేమి చేయవలయును? ఇట్టి విపరీత పరిస్థితిలో చేయదగినదేమున్నది? కానున్నది కాగలదు. మన మీశాపమును వారింపజాలము. అని తలంచి వారు నిమిలోని సూక్ష్మాంశము గ్రహించి దానిని వివిధ మంత్రములతో గాపాడుచుండిరి. వారు తమ మంత్రశక్తి ప్రభావముతో నిర్వికారమైన సూక్ష్మ రూపమును పల్మారు గంధమాల్యాదులచే పూజించుచుండిరి. కొంతకాలమునకు యజ్ఞము సంపూర్ణమయ్యెను. అపుడు దైవతగణమేతెంచెను. ఋత్విజులు ప్రస్తుతింపగ దేవతలు పరమానందభరితులైరి. మునుల స్తోత్రములకు దేవతలు ప్రసన్నులైరి. వారు విషణ్ణుడగు రాజున కిట్లనిరి : రాజా! మేము సంతుష్టిజెందితిమి. వరము కోరుకొనుము. ఓ రాజర్షీ ! నీకీ యాగమువలన నుత్తమజన్మ లభింపగలదు. నీకు దేవశరీరము కావలయునో నరదేహము గావలయునో కోరుకొమ్ము. నీ పురోహితుడగు వసిష్ఠుడు నరజన్మమెత్తి గర్వించియున్నాడు.' అంత నిమిజీవాత్మ ప్రమోదమంది దేవతల కిట్లనెను : నాకీ నశ్వర శరీరముపై వాంఛలేదు. సురలారా! నేను సకల భూతముల చూపులకు పైగా నుండగోరుచున్నాను. నేనెల్ల భూతముల కన్నులపై వాయురూపము దాల్చి చలించుచుండవలయును అనెను.

ప్రార్థయ త్వం మహారాజ దేవీం సర్వేశ్వరీం శివామ్‌ | మఖేనా నేన సంతుష్ఠా సా తే%భీష్టం విధాస్యతి. 14

స దేవై రేవ ముక్తస్తు ప్రార్థయామాస దేవతామ్‌ | స్తోత్రై ర్నానావిధై ర్దివ్యై ర్భక్త్యా గద్గదయా గిరా. 15

ప్రసన్నా సా తదా దేవీ ప్రత్యక్షం దర్శనం దదౌ | కోటి సూర్యప్రతీకాశం రూపం లావణ్యదీపితమ్‌. 16

దృష్ట్వా ప్రముదితాః సర్వే కృతకృత్యాశ్చ చేతసి | ప్రసన్నాయాం దేవతాయాం రాజా వవ్రే వరం నృప. 17

జ్ఞానం తద్విమలం దేహి యేన మోక్షో భ##వే దపి | నేత్రేషు సర్వభూతానాం నివాసో మే భ##వేదితి. 18

తతః ప్రసన్నా దేవేశీ ప్రోవాచ జగదంబికా | జ్ఞానం తే విమలం భూయా త్ర్పారబ్ధ స్యావశేషత. 19

నేత్రేషు సర్వభూతానాం నివాసో%పి భవిష్యతి | నిమిషం యాంతి చక్షూంషి త్వత్కృతేనైన దేహినామ్‌. 20

తవ వాసా త్సనిమిషా మానవాః పశవస్తథా | పతంగా శ్చ భవిష్యంతి పునశ్చా నిమిషాః సురాః. 21

ఇతి దత్త్వా వరం తసై#్మ తదా శ్రీపరదేవతా | ఆమంత్ర్య చ మునీ న్సర్వాం స్తత్రై వాంతర్హితా%భవత్‌. 22

అంతర్హితాయాం దేవ్యాం తు మునయ స్తత్ర సంస్థితాః | విచింత్య విధివ త్సర్వే నిమే ర్దేహం సమాహరన్‌. 23

అరణిం తత్ర సంస్థాప్య మమంథు ర్మంత్ర వత్తదా | మంత్రోహో మైర్మహాత్మానః పుత్రహేతో ర్నిమేరథ. 24

అరణ్యాం మథ్యమానాయం పుత్త్రః ప్రాదురభూత్తదా | సర్వలక్షణ సంపన్నః సాక్షా న్నిమిరివాపరః. 25

అరణ్యా మథనా జ్జాతస్తస్మా న్మిథిరితి స్మృతః | యేనాయం జనకా జ్ఞాత స్తేనా సౌ జనకో%భవత్‌. 26

అపుడు దేవతలు నిమి జీవాత్మకిట్లనిరి : రాజా ! నీవు యజ్ఞప్రియ యజ్ఞేశ్వరి యగు శివభగవతిని ప్రార్థించుము. ఆ దేవి నీ యీ జన్నమునకు తుష్టిజెందెను. ఆ తల్లి నీ కోరిక తప్పక దీర్పగలదు. అని సురలు పలుకగ నిమి పరమభక్తితో పరాంబికను వివిధ దివ్యస్తోత్రములచే సవినయముగ సంస్తుతించెను. అంత నిమికి సూర్యకోటి సమప్రభయగు శ్రీదేవి ప్రత్యక్షమయ్యెను. దేవి భవ్యలావణ్యపు వెలుంగుగాంచి యెల్లరానందభరితులై తమకు తాము ధన్యజీవులమనుకొనిరి. శ్రీమాత ప్రసన్నురాలుగాగా రాజిట్లు వరము వేడుకొనెను : ఓ తల్లీ! విమల జ్ఞానము మోక్షకారకము. అట్టి జ్ఞానము గల్గించు జన్మమిమ్ము. నన్నెల్ల ప్రాణుల నేత్రములపై నివసింపనిమ్ము. అంత జగజ్జననియగు మహేశ్వరి సుప్రసన్నయై యిట్లనెను : నీ ప్రారబ్ధ శేషమున నీకు విమల జ్ఞానము గల్గుగాక! నీవెల్ల ప్రాణులకన్నులపై నుండగలవు. నీ వలననే ప్రాణులకు నిమిషము (కనుమూత) గల్గుచుండును. నీ యునికి వలన నర-పశు-పక్షుల కనులు మూతలుపడును. కాని, యనిమిషులు (దేవతలు) మాత్రము కనుఱప్పలు వాల్చకుందురు. ఇట్లు వరదాయినియగు దేవి వరములొసింగి మునులకు ప్రియములు పలికి యచ్చోనంతర్ధాన మొందెను. దేవి యంతర్ధానమొందిన పిమ్మట మునులెల్లరు దమలో దామాలో చించుకొని నిమి దేహమును యథావిధిగ తీసికొనిరి. వారు నిమిపుత్త్రుని బడయుటకు నిమి దేహము నరణితో మథించిరి. అగ్నివేల్చిరి. అట్లరణితో మథింపగ సాక్షాత్తుగ నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడందుండి యుద్భవించెను. ఆ బాలకు డరణి మథనమున బుట్టుటవలన మిథియనియును తన జనకుని తనువునుండి బుట్టుట వలన జనకుడనియును లోకమున పేరొందెను.

విదేహ స్తు నిమిర్జాతో యస్మాత్త స్మాత్త దన్వయే | సముద్భూతాస్తు రాజానో విదేహా ఇతి కీర్తితాః. 27

ఏవం నిమిసుతో రాజా ప్రార్థితో జనకో%భవత్‌ | నగరీ నిర్మితా తేన గంగాతీరే మనోహరా. 28

మిథిలేతి సువిఖ్యాతా గోపురాట్టాల సంయుతా | ధనధాన్య సమాయుక్తా హట్టశాలావిరాజితా. 29

వంశే%స్మి న్యే%పి రాజాన స్తే సర్వే జనకా స్తథా | విఖ్యాతా జ్ఞానినః సర్వే విదేహాః పరికీర్తితాః. 30

ఏతత్తే కథితం రాజ న్నిమే రాఖ్యాన ముత్తమమ్‌ | శాపాద్యస్య విదేహత్వం విస్తరా దుదితం మయా. 31

రాజా : భగవ న్భవతా ప్రోక్తం నిమిశాపస్యకారణమ్‌ | శ్రుత్వా సందేహమాపన్నం మనోమే%తీవ చంచలమ్‌. 32

వసిష్ఠో బ్రాహ్మణః శ్రేష్ఠో రాజ్ఞశ్చైవ పురోహితః | పుత్రః పంకజయోనే స్తు రాజ్ఞా శప్తః కథం మునిః. 33

గురుం చ బ్రాహ్మణం జ్ఞాత్వా నిమినా న కృతా క్షమా | యజ్ఞకర్మ శుభం కృత్వా కథం క్రోధ ముపాగతః. 34

జ్ఞాత్వా ధర్మస్య విజ్ఞానం కథ మిక్ష్వాకు సంభవః | క్రోథస్య వశమాపన్నః శప్తవా న్ర్బాహ్మణం గురుమ్‌. 35

వ్యాసః : క్షమా%తి దుర్లభా రాజ న్ర్పాణిభి ర్విజితాత్మభిః | క్షమావా న్దుర్లభో లోకే సుసమర్థో విశేషతః. 36

సర్వసంగపరిత్యాగీ ముని ర్భవతు తాపసః | నిద్రాక్షుధో ర్విజేతా చ యోగాభ్యాసే సునిష్ఠితః. 37

అట్లు నిమి విదేహుడుగనగుటవలన నతని వంశములోని వారెల్లరును విదేహరాజులని పిల్వబడిరి. ఈ ప్రకారముగ నిమి తనయుడు లోకమున జనకుడుగ చిరకీర్తిగాంచి గంగాతీరమున నొక సుందరనగరము నిర్మించెను. ఆ నగరు నాటి నుండి మిథాలానగరమన వన్నెగాంచెను. అందు సుందర ప్రాకారములు నున్నత భవన గోపురములు విలసిల్లెను. అది ధనధాన్య సమృద్ధమై చెన్నొందెను. అతని వంశమున జన్మించిన వారెల్లరును. జనకులుగ విదేహులుగ బిలువబడి జ్ఞానసంపన్నులైరి. రాజా! ఇట్లుత్తమ నిమి చరిత్రమును నతడు శాపవశమున విదేహుడగుటయు నీకు వివరించితిని. రాజిట్లనెను : ' వ్యాసమునీశా! నిమి శాపకారణము వివరించితివి. నా చిత్త మతిచంచలము. నిమి కథ వినగనే నాకు సంశయము గల్గుచున్నది. వసిష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు - నిమికి పురోహితుడు - బ్రహ్మపుత్రుడు గదా! మఱియతడు రాజుచే నెట్లు శపింపబడెను? వసిష్ఠుడు తనకు గురువు కుల పురోహితుడునని నిమికి తెలియునుగదా! కనుక యజ్ఞదీక్షలోనున్న రాజు మునినేల క్షమించలేదు? రాజున కంత పట్టరానికోపమెట్లుగల్గెను? నిమి యిక్ష్వాకు వంశజుడు ధర్మవిదుడుగదా! అతడు తన గురువగు బ్రాహ్మణునేల శపించెను?' వ్యాసుడిట్లనెను : రాజా! ఇంద్రియములను జయించుటకు శక్తిలేని ప్రాణుల కోర్మియుండదు. కనుక నీ లోకమున సామర్థ్య ముండియు క్షమాశీలియగువాడు దుర్లభుడు. ఒక తాపసు డాకలిదప్పులు మాని సర్వసంగపరిత్యాగియై యోగాభ్యాసమున నిష్ఠ గల్గియుండవచ్చును.

కామః క్రోధ స్తథా లోభో హ్యహంకార శ్చతుర్థకః | దుర్జేయా దేహ మధ్యస్థా రిపవ స్తేన సర్వథా. 38

న భూతపూర్వః సంసారే న చైవం వర్తతే%ధునా | భవితా న పుమా న్కశ్చి ద్యో జయేత రిపూనిమాన్‌. 39

న సవర్గే న చ భూలోకే బ్రహ్మలోకే హరేః పదే | కైలాసే నేదృశః కశ్చి ద్యో జయేత రిపూనిమాన్‌. 40

మునయో బ్రహ్మపుత్రాశ్చ తథా%న్యే తాపసోత్తమాః | తే%పి గుణత్రయావిద్ధాః కిం పునర్మానవా భువి. 41

కపిలః సాంఖ్యవేత్తా చ యోగాభ్యాసరతః శుచిః తేనాపి దైవయోగాద్ధి ప్రదగ్ధాః సగరాత్మజాః. 42

తస్మా ద్రాజ న్నహంకారా త్సంజాతం భువనత్రయమ్‌ | కార్యకారణభావాత్తు తద్వియుక్తం కథం భ##వేత్‌. 43

బ్రహ్మ గుణత్రయావిష్ఠో విష్ణుశ్చైవాథ శంకరః | ప్రభవంతి శరీరేషు తేషాం భావాః పృథక్పృథక్‌. 44

మానవానాం చ కా వార్తా సత్త్వైకాంత వ్యవస్థితౌ | గుణానాం సంకరో రాజ న్సర్వత్ర సమవస్థితః. 45

కదాచిత్సత్త్వవృద్ధిః స్యా త్కదాచి ద్రజసః కిల | కదా చిత్తమసో వృద్ధిః సమభావః కదాచన. 46

నిర్గుణ | పరమాత్మా%సౌ నిర్లేపః పరమో%వ్యయః | అలక్ష్యః సర్వతత్త్వానామప్రమేయః సనాతనః. 47

తథైవ పరమా శక్తి ర్నిర్గుణా బ్రహ్మసంస్థితా | దుర్జేయా చాల్పమతిభిః సర్వభూత వ్యవస్థితిః. 48

పరాత్మన స్తథా శ##క్తే స్తయోరైక్యం సదైవ హి | అభిన్నం తద్వపు ర్జాత్వా ముచ్యతే సర్వదోషతః.49

కాని, యంతటివాడును తనలో చెలరేగుచున్న కామ-క్రోధ-లోభాహంకారములను నల్గురు శత్రువులను గెల్వనోపడు. అట్టి లోని శత్రువులను గెల్చినట్టి మానవుడు భూత వర్తమాన భవిష్యత్తులలో నొక్కడునులేడు. అట్టి లోని వైరులను గెల్చినట్టి మానవుడు బ్రహ్మవిష్ణుశివలోకములందును స్వర్గమర్త్యపాతాళములందు నొక్కడునులేడు. ఈ త్రిగుణములకు బ్రహ్మపుత్రులు తపసులు మునులును బద్ధులగుదురు. ఇక సామాన్యమానవుల విషయము చెప్పనేల? కపిల మహర్షి సాంఖ్యయోగ ప్రవర్తకుడు పవిత్రుడుగదా! అట్టి వాడును దైవయోగమువలన సాగరతనయులను దగ్ధుల నొనరించెను. రాజా! ఈ భువనత్రయ మహంకార కారణమున బుట్టెను. జగము నహంకారము రెండును పరస్పరము కార్యకారణ భావమున బద్ధములైనవి. ఇంక నహంకారము లేనిచో జగమెట్లుండును? బ్రహ్మవిష్ణుమహేశుల శరీరములందు త్రిగుణభావములు వేర్వేరుగ గల్గుచుండును. ఇక మానవులలో సత్త్వగుణము లేదనుటలో వింతయేమున్నది? ఎందులకనగా, త్రిగుణము లెల్లడలను వ్యాపించి యుండును గదా! ఒకప్పుడు సత్త్వము వేరొకప్పుడు రజస్సు మరొకప్పుడు తమము పెరుగుచుండును. ఒక్కొక్కప్పుడు ఇవి సరిసమానముగ నొప్పును. పరమాత్మ అవ్యయుడు - పరుడు-నిర్గుణుడు - అప్రమేయుడు-అగోచరుడు-సనాతనుడు. అటులే శ్రీదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమార్థప్రదాయిని నిర్ణుణ-మాయాశక్తి-సర్వభూతాత్మ. అల్పబుద్ధులకు తెలియరానిది. ఇట్టి పరమాత్మ - పరాశక్తుల యేకత్వమన్యోన్యత్వ మెఱింగిన మనుజుడు సకల దోషములనుండి విముక్తి గాంచగలడు.

తద్‌ జ్ఞానా దేవ మోక్షః స్యాదితి వేదాంత డిండిమః | యో వేద స విముక్తో%స్మి న్సంసారే త్రిగుణాత్మకే. 50

జ్ఞానం తు ద్వివిధం ప్రోక్తం శాబ్దికం ప్రథమం స్మృతమ్‌ | వేదశాస్త్రార్థ విజ్ఞానాత్తద్భవేద్బుద్ధి యోగతః. 51

వికల్పా స్తత్ర బహవో భవంతి మతికల్పితాః | కుతర్క కల్పితాః కేచి త్సుతర్క కల్పితాః పరే |

వితర్కై ర్విభ్రమోత్పత్తి ర్విభ్రమా ద్బుద్ధి భ్రంశతా | బుద్ధి భ్రంశాత్‌ జ్ఞాననాశః ప్రాణినాం పరికీర్తితః.

అనుభవాఖ్యం ద్వితీయం తు జ్ఞానం తద్దుర్లభం నృప. 52

తత్తదా ప్రాప్యతే తస్య వేత్తుః సంగోయదాభ##వేత్‌ | శబ్దజ్ఞానాన్న కార్యస్య సిద్ధిర్భవతి భారత. 53

తస్మా న్నానుభవజ్ఞానం సంభవత్సతిమానుషమ్‌ | అంతర్గతం తమశ్చేత్తుం శాబ్దబోధోహి నక్షమః. 54

తథా న నశ్యతి తమః కృతయా దీపవార్తయా | తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే. 55

ఆయాసాయాపరం కర్మ విద్యా%న్యా శిల్పనైపుణాత్‌ | శీలం పరహితత్వం చ కోపాభావః క్షమా ధృతిః. 56

సంతోష శ్చేతి విద్యాయాః పరిపాకోజ్జ్వలం ఫలమ్‌ | విద్యయా తపసా వా%పి యోగాభ్యాసేన భూపతే. 57

వినా కామాది శత్రూణాం నైవ నాశః కదాచన | మనస్తు చంచలం రాజన్‌ స్వభావా దతి దుర్గ్రహమ్‌. 58

తద్వశః సర్వథా ప్రాణీ త్రివిధో భువనత్రయే | కామక్రోథా దయో భావాశ్చిత్తజాః పరికీర్తితాః. 59

తే తదాన భవంత్యేవ యదావై నిర్జితం మనః | తస్మాత్తు నిమినా రాజ న్నక్షమా విహితా మునౌ. 60

యథా యయాతినా పూర్వం కృతా శుక్రే కృతాగసి | భృగుపుత్రేణ శప్తో%పి యయాతి ర్నృపసత్తమః. 61

న శశాప మునిం క్రోధా జ్జరాం రాజా గృహీతవాన్‌ | కశ్చి త్సౌమ్యో భ##వేత్కశ్చి త్క్రూరో భవతి పార్థివః. 62

స్వభావభేదా న్నృపతే కస్య దోషో%త్ర కల్ప్యతే | హైహయా భార్గవా న్పూర్వం ధనలోభాత్పురోహితాన్‌. 63

బ్రాహ్మణా న్మూలతః సర్వాంశ్చిచ్ఛిదుః క్రోధమూర్ఛితాః| పాతకం పృష్ఠతః కృత్వా బ్రహ్మహత్యాసముద్భవమ్‌. 64

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే పంచదశో%ధ్యాయః.

ఇట్టి నిర్మల నిశ్చలజ్ఞానమువలన మోక్షము గల్గునని వేదాంతభేరి మ్రోగుచున్నది. దీని నెఱింగిన మానవుడీ త్రిగుణమయ సంసారము దాటగలడు. జ్ఞానము రెండు తెఱంగులుగ నలరారును. అందు మొదటిది శాబ్దజ్ఞానము. అనగా బుద్ధి బలమున వేదశాస్త్రార్థ చమత్కార మెఱుగుట. ఇది బుద్ధిచే నూహించుట వలన గల్గును. దీనిలో పెక్కులు కల్పితములై యుండును. వీనిచే చిత్తభ్రాంతి గల్గును. దీనివలన బుద్ధినాశము - దానివలన జ్ఞాననాశము గల్గును. ఇక రెండవది అనుభవజన్య జ్ఞానము. ఇది కడుంగడు దుర్లభము. దీనినెఱిగిన సద్గురువు వలన సత్సాంగత్యమువలన నిది లభ్యమగును. శాబ్దజ్ఞానమువలన ఏనాటికిని వస్తు-కార్య-సిద్ధిగానేరదు. శాబ్దజ్ఞానము వలన లోకోత్తరమైన యాత్మానుభవజ్ఞానము గలుగదు. జన్మజన్మముల యజ్ఞానపు పెంజీకటుల తెరలను శబ్దజ్ఞానము ఛేదింపజాలదు. ఎట్లనగ, దీపము గూర్చి తెలసినంత మాత్రాన చీకట్లు వ్రీలిపోవుగదా! ఏది బంధకారణముగాదో యదే నిజమైన కర్మ. దేనివలన విముక్తిగల్గునో యదే విద్య. ఇతర కర్మలన్నియు నాయాసము గల్గించునవే. ఇతర విద్యలన్నియును నాయా శిల్పాదికళలలో నేర్పుమాత్రమే కల్గించును. కనుక సచ్ఛీలము-ఓరిమి-ధృతి-కోపము లేకుండుట - పరోపకారము - సంతోషము మున్నగునవి పరావిద్యకు పండిన దివ్యఫలపురసములు. రాజా ! విద్య తపము యోగాభ్యాసమనునవి ముఖ్యములు. ఇవి లేనిచో కామాది శత్రువులు నశింపరు. జీవుల మనస్సు సహజముగ చంచలమైనది. వశముగానిది. దానికి లోబడిన ప్రాణులు లోకమున ముత్తెఱగుల నుందురు. చంచల చిత్తమువలన కామక్రోధాది భావములు గల్గును. మనస్సును జయించినచో కామాదులు గలుగవు. కనుక నిమిరాజున కోర్పులేకపోయెను. యయాతి తిరిగి కోపముతో శుక్రాచార్యుని శపించలేదు. యయాతి ముసలితనమునే స్వీకరించెను. నిమి యయాతులలో నొకరాజు క్రూర స్వభావుడు - వేరొకడు శాంతస్వభావుడు. ఇట్టి భిన్న భావములుండుటవలనప నెవనిని దోషిగ నెన్నగలము? మున్ను హైహయగణము ధనాశవలన తమ పురోహితులగు భార్గవులను హింసించిరి. వారు బ్రాహ్మణులను కన్ను మిన్ను గానని కోపముతో సమూలముగ నశింపజేసిరి. పిదప నట్టి క్షత్రియగణమునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను.

ఇది శ్రీమద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు నిమి చరిత్రమను పంచదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters