Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకాదశోధ్యాయః

జనమేజయః: భారావతరణర్థాయకథితం జన్మ కృష్ణయోః | సంశయో%యంద్విజశ్రేష్ఠ ! హృదయేమమతిష్ఠతి. 1

ప్తృథివీ గోస్వరూపేణ బ్రహ్మణం శరణంగతా | ద్వాపరాంతే%తి దీనా%%ర్తా గురుభారప్రపీడితా. 2

వేధసా ప్రార్థితో విష్ణు కమలాపతి రీశ్వరః | భూభారోత్తరణార్థాయ సాధూనాం రక్షణాయచ. 3

భగవ న్భారతే ఖండే దేవైః సహ జనార్ధన | అవతారం గృహాణాశు వసుదేవగృహే విభో. 4

ఏవం సంప్రార్థితో ధాత్రా భగవా న్దేవకీసుతః | బభూవ సహ రమేణ భూభారోత్తారణాయవై. 5

కియానుత్తారితో భారో హత్వా దుష్టా ననేకశః | జ్ఞాత్వా సర్వాన్దురాచార న్పాపబుద్ధీన్‌ నృపా నిహ. 6

హతో భీష్మో హతోద్రోణో విరాటో ద్రుపదస్తథా | బాహ్లీకః సోమదత్త శ్చ కర్ణో వైకర్తన స్తథా. 7

యై ర్లుంఠితం దనం సర్వం హృతాశ్చ హరి యోషితః | కథం న నాశితా దుష్టా యే స్థితాః పృథివీతలే. 8

ఆభీరాశ్చ శకా వ్లుెచ్చా నిషాదాః కోటిశ స్తథా | భారావతరణం కిం తత్కృతం కృష్ణేన ధీమతా. 9

సందేహో%యం మహాభాగ న నివర్తతి చిత్తతః | కలా వస్మి న్ర్పజాః సర్వాః పశ్యతః పాపనిశ్చయాః. 10

వ్యాసః : రాజన్యస్మిన్యుగే యాదృక్ర్పజా భవతి కాలతః | నాన్యథా తద్భవే న్నూనం యుగధర్మో%త్ర కారణమ్‌. 11

యే ధర్మరసికా జీవాస్తే వై సత్యయుగే%భవన్‌ | ధర్మార్థ రసికా యే తు తే వై త్రేతాయుగే%భవన్‌. 12

ధర్మార్థ కామరసికా ద్వాపరే చాభవన్యుగే | అర్థకామపరాః సర్వే కలావస్మి న్భవంతి హి. 13

పదకొండవ అధ్యాయము

శ్రీదేవీ నామ మాహాత్మ్యము

జనమేజయు డిట్లనెను : ''ఓ ద్విజపరా ! ఈ భూమి భార మణచుటకు శ్రీరామకృష్ణాదు లవతరించి రంటివి. దానిని గూర్చి నా యెడదలో నొక శంక గల్గుచున్నది. భూదేవి ద్వాపరాంతమున భూభరణము సాధ్యముకాక దీనయు నార్తయునై గోరూపమున బ్రహ్మను శరణు పొందెను. అంత బ్రహ్మ కమలాపతియగు విష్ణునిజేరి దేవా ! ఈ పుడమి బరువు తగ్గింపుము. సాధువులను పరిరక్షింపుము. ఈ భారతకండమునం దెల్ల దేవతలతో గలిసి వసుదేవు నింట సత్వర మవతరింపుమని ప్రార్థించెను. ఇట్లు బ్రహ్మ సన్నుతింపగ విష్ణువు భూభారము బాపుటకు బలరామునితో దేవకియం దవతరించెను. అపుడు శ్రీ కృష్ణుడు దురాచారులు దుష్టులు పాపులునగు నరపతుల నెందఱనో తునుమాడి కొంత భూభారము తగ్గించెను. ఈ చనినవారిలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ద్రుపదుడు విరాటుడు బాహ్లిక సోమదత్తులు నుండిరి. పెక్కురు దుష్టులు విష్ణు భార్యల నపహరించి వారి సొమ్ములు దోచుకొనిరి. కాని, యీ పాపాత్ములు చంపబడలేదు. ఇంకను పెక్కురు గొల్లలు శకులు వ్లుెచ్ఛులు నిషాదులు మిగిలిరి. విజ్ఞుడగు కృష్ణుడు వారిని చంపక వదలెను. అందువలన భూభారము పూర్తిగా నెట్లు తగ్గిపోయెను? ఈ కలియుగమందలి ప్రాణులు పాపమతులు. కనుక భూభార హరణము గూర్చి నాకు సందేహము గల్గుచున్నది.'' అన వ్యాసు డిట్లనెను : ''రాజా! ఏ యుగమందలి ప్రజల స్వభావము లా యుగమునకు సంబంధించి యుండును. దీని కంతటికి యుగధర్మము ముఖ్యకారణము. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. ఎల్లరిని చంపినచో సృష్టి ప్రవాహ మాగిపోవును. అందువలన నతడు తక్కిన వారిని చంపక వదలెను. సత్యయుగమున నెల్లరు ధర్మనిరతులు (ధర్మమందే ఆసక్తి కలవారు) ఉండిరి. త్రేతాయుగమందు ధర్మార్థనిరతు లుండిరి. ద్వాపరమున ధర్మార్థకామనిరతు లుండిరి. కలియుగమునందు కామార్థపరులు సంభవింతురు.

యుగధర్మ స్తు రాజేంద్ర నయాతివ్యత్యయం పునః | కాలః కర్తా%స్తి ధర్మస్య హ్యధర్మస్య చ వై పునః. 14

యే తు సత్యయుగే జీవా భవంతి ధర్మ తత్పరాః | కుత్ర తే%ద్య మహాభాగ తిష్ఠంతి పుణ్యభాగినః. 15

త్రేతాయుగే ద్వాపరే వా యే దానవ్రతకారకాః | వర్తంతే మునయః శ్రేష్ఠ కుత్ర బ్రూహి పితామహ. 16

కలావద్య దురాచారా యే%త్ర సంతి గతత్రపాః | ఆద్యే యుగే క్వ యాస్యంతి పాపిష్ఠా దేవనిందికాః.17

ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే | సర్వథా శ్రోతుకామ్బోస్మి యదేతద్ధర్మ నిర్ణయమ్‌. 18

వ్యాసః: యే వై కృతయుగే రాజన్సంభవంతీహ మానవాః | కృత్వా తే పుణ్యకర్మాణి దేవలోకా న్ర్వజంతి వై.19

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ నృపసత్తమ | స్వధర్మేనిరతా యాంతి లోకాన్కర్మజితాన్కిల. 20

సత్యం దయా తథా దానం స్వదారగమనం తథా | అద్రోహః సర్వభూతేషు సమతా సర్వజంతుషు. 21

ఏతత్సాధారణం ధర్మం కృత్వా సత్యయుగే పునః | స్వర్గం యాంతీతరే వర్ణా ధర్మతో రజకాదయః. 22

తథా త్రేతాయుగే రాజ న్ద్వాపరే యుగే తథా | కలా వస్మి న్యుగే పాపా నరకం యాంతి మానవాః. 23

తావత్తిష్ఠంతి తే తత్ర యావత్స్యాద్యుగపర్యయః | పునశ్చ మానుషే లోకే భవంతి భువి మానవాః. 24

యదా సత్యయుగస్యాదిః కలే రంతశ్చ పార్థివ | తదా స్వర్తా త్పుణ్యకృతో జాయంతే కిల మానవాః. 25

యదా కలియుగస్యాది ర్ద్వాపరస్య క్షయ స్తథా | నరకా త్పాపినః సర్వే భవంతి భువి మానవాః. 26

యుగధర్మ మేనాటికిని మారదు. ధర్మాధర్మములకు కాలమే కర్త యగును. అన జనమేజయుడిట్లనెను : 'మహానుభావా! సత్యయుగమునందు ధర్మపరులు పుణ్యనిరతు లుండిరి గదా! వారిప్పు డెచ్చట నున్నారు? త్రేతాద్వాపర యుగము లందలి దానవ్రతపరు లిపు డెచట నున్నారు? నా కదంతయు దెలుపుము. ఈ కలియుగమందు దేవనిందకులు పాపులు దురాచారులు అసత్యవాదులు సిగ్గులేనివారు గలరు. వీరు సత్యయుగమున నేమగుదురు? మహాత్మా! ఈ ధర్మసందేహము లన్నియు వినవేడుక గలుగుచున్నది. నా కన్నియు ససాకల్యముగ నెఱింగింపుము.'' అని యడుగ వ్యాసుడిట్లనెను : రాజా! కృతయుగమునందు జన్మించినవారు పుణ్యకార్యము లాచరించి దేవలోకమున సుఖముందురు. బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్రులు స్వధర్మనిరతులై తమ తమ కర్మలకు దగిన లోకముల కేగుదురు. సత్య-దయా-దానములు ఏకపత్నీ వ్రతము సర్వభూతసమత గలిగియుండుట ద్రోహద్వేషములు లేకుండ మున్నగు సామాన్యధర్మము లాచరించిన రజకాదులును కృతయుగమున తమ తమ ధర్మములందు నిరతులై స్వర్గము జేరెడివారు. ఇటులే త్రేతా ద్వాపరములందలి వారును స్వధర్మపరులై స్వర్గసీమ లలంకరించిరి. కాని, కలియుగమందలి వారు పాపాత్ములై నరకయాతన లనుభవింతురు. వారు యుగము మార్పుజెందువఱకు నరకమున బాధలు పడిపడి తిరిగి మనుజులై పుట్టుదురు. కలియుగ మంతమై సత్యయుగము ప్రారంభమగునపుడు స్వర్గమందలి పుణ్యాత్ములు తిరిగి జన్మింపగలరు. ద్వాపరము చివరలో గలియుగారంభమున పాపులు నరకములనుండి లేచి నరులై జన్మింతురు.

ఏవం కాల సమాచారో నాన్యథ్బాభూత్కదాచన | తస్మా త్కలిరసత్కర్తా తస్మింస్తుతాదృశీ ప్రజా. 27

కదాచిద్దైవయోగాత్తు ప్రాణినాం వ్యత్యయోభ##వేత్‌ | కలౌ యే సాధవః కే చిద్ద్వాపరే సంభవంతి తే. 28

అథ త్రేతాయుగే కేచి త్కేచిత్సత్యయుగే తథా | దుష్టాః సత్యయుగే యే తు తే భవంతి కలావపి. 29

కృతకర్మ ప్రభావేణ ప్రాప్నువంత్య సుఖాని చ | పునశ్చ తా దృశం కర్మ కుర్వంతి యుగభావతః. 30

జనమేజయః : యుగధర్మా న్మహభాగ బ్రూహి సర్వా నశేషతః | యస్మి న్వై యాదృశో ధర్మో జ్ఞాతు మిచ్ఛామి తం తథా. 31

వ్యాసఉవాచ : నిబోధ నృపశార్దూల దృష్టాంతం తే బ్రవీమ్యహమ్‌ | సాధూనా మపి చేతాంసి యుగభావా ద్భవంతి హి. 32

పితు ర్యథా తే రాజేంద్ర బుద్ధిర్విప్రావహేలనే | కృతా వై కలినా రాజ న్ధర్మజ్ఞస్య మహాత్మనః. 33

అన్యథా క్షత్రియా రాజా యయాతి కులసంభవః | తాపసస్య గలే సర్పం మృతం కస్మా దయోజయత్‌. 34

సర్వం యుగబలం రాజ న్వేదితవ్యం విజానతా | ప్రయత్నేన హి కర్తవ్యం ధర్మకర్మ విశేషతః. 35

నూనం సత్యయుగే రాజ న్ర్బాహ్మణా వేదపారగాః | పరాశక్త్యర్చనరతా దేవీదర్శన లాలసాః. 36

గాయత్రీ ప్రణవాసక్తా గాయత్రీధ్యాన కారిణః | గాయత్రీజపసంసక్తా మాయాబీజైకజాపినః. 37

గ్రామే గ్రామే పరాంబాయాః ప్రాసాదకరణోత్సుకాః | స్వకర్మ నిరతాః సర్వే సత్యశౌచదయాన్వితాః. 38

త్రయ్యుక్తకర్మనిరతా స్తత్త్వజ్ఞాన విశారదాః | అభవన్‌ క్షత్త్రియా స్తత్ర ప్రజాభరణ తత్పరాః. 39

వైశ్యా స్తు కృషి వాణిజ్య గోసేవా నిరతా స్తథా శ్రూద్రాః సేవాపరాస్తత్ర పుణ్య సత్యయుగే నృప. 40

కాలగతి యీ గతిగ నుండును. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. కలియుగము చెడుపనులు చేయించును. కలియుగ ప్రజలు కలి ప్రభావమున చెడుభావములు గల్గియుందురు. ఒకప్పుడు దైవయోగముచే వీరి జన్యములలో వ్యత్యాసములును గలుగును. కలిలోని సాధు సజ్జనులు కొందఱు ద్వాపరమున జన్మింతురు. మఱికొందఱు త్రేతాయుగమునను నింకను కొందఱు సత్యయుగమునను జన్మింతురు. సత్యయుగమందలి దుర్మార్గులు కలియుగమున బుట్టుదురు. ప్రాణులు తమ పూర్వ కర్మానుసారముగ సుఖదుఃఖము లనుభవింతురు. ఐనను వారు యుగప్రభావమున యుగధర్మము లాచరింతురు. అన మహాత్మా! నాకు యుగధర్మములన్నిటిని వివరింపుము. ఏ యుగమందెట్టి ధర్మము నడచునో యెఱుగగోరుచున్నాను. అను ప్రశ్నమునకు వ్యాసుడిట్లనెను : రాజా! యుగధర్మము వివరింతును. ఆలింపుము. ఎంతటి సత్పురుషుల చిత్తమైనను యుగధర్మానుసారముగ చలించుచుండును. నీ తండ్రి మహాత్ముడే. ధర్మాత్ముడే. ఐనను నతడు కలిప్రేరణమున నొక విప్రుని నవమానించెను. కలిప్రేరణలేనిచో యయాతివంశజుడు సుక్షత్రియుడునగు నొక రాజొక తబిసి మెడలో నేల చచ్చిన పామును వైచును? కనుక నంతటికి యుగబలము కారణమని పండితులు వాక్రుత్తురు కావున ధర్మకర్మములు జక్కగ పూనికతో నాచరింపవలయును. సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదపారగులు శ్రీదేవీదర్శన లాలసులు శ్రీపరాశక్తి పూజా తత్పరులు నిరంతర గాయత్త్రీజప నిరతులు శ్రీగాయత్త్రీధ్యాన పరాయణులు ప్రణవ నిమగ్నులు మాయా బీజ తప తత్పరులు. నయియుండిరి. ఆ యుగమున గ్రామ గ్రామమున శ్రీ మాతృ మందిర నిర్మాతలు-దేవిమహోత్సవౌత్సాహికులు - స్వధర్మనిరతులు - సత్యశౌచదయాన్వితులు వెలసిరి. క్షత్త్రియులు తత్వజ్ఞాన విశారదులు - వైదిక ధర్మానుష్ఠానపరులు-ప్రజాపాలన తత్పరులు నై యొప్పెసగిరి. వైశ్యులు వ్యవసాయము-వ్యాపారము-గోరక్షణము మున్నగు పనులు నిర్వర్తించిరి. శూద్రులు తక్కిన మూడు వర్ణములవారికి సేవలు సేయుచు నుండిరి.

పరాంబాపూజనాసక్తాః సర్వే వర్ణాః పరేయుగే | తథాత్రేతాయుగే కించిన్న్యూనా ధర్మస్య సంస్థితిః. 41

ద్వాపరేచ విశేషేణ న్యూనా సత్యయుగస్థితిః | పూర్వం యే రాక్షసా రాజం స్తే కలౌ బ్రాహ్మణాః స్మృతాః. 42

పాఖండ నిరతాః ప్రాయోభవంతి జనవంచకాః | అసత్యవాదనః సర్వే వేదధర్మవివర్జితాః. 43

దాంభికా లోకచతురా మానినో వేదవర్జితాః | శూద్ర సేవాపరాంః కేచి న్నానాధర్మప్రవర్తకాః. 44

వేదనిందా కరాః క్రూరాః ధర్మభ్రష్టాతివాదుకాః | యథాయథా కలిర్వృద్ధిం యాతి రాజం స్తథాతథా. 45

ధర్మస్య సత్యమూలస్య క్షయః సర్వాత్మనా భ##వేత్‌ | తథైవ క్షత్త్రియా వైశ్యాః శూద్రాశ్చ ధర్మవర్జితాః. 46

అసత్య వాదినః పాపా స్తథా వర్ణేతరాః కలౌ | శూద్ర ధర్మరతా విప్రాః ప్రతిగ్రహ పరాయణాః. 47

భవిష్యంతి కలౌ రాజ న్యుగే వృద్ధిగతాః కిల | కామాచారాః స్త్రీయః కామలోభమోహ సమన్వితా. 48

పాపా మిథ్యాభివాదిన్యః సదా క్లేశరతా నృప | స్వభర్తృవంచికా నిత్యం ధర్మభాషణ పండితాః. 49

భవంత్యేవంవిధా నార్యః పాపిష్ఠా శ్చ కలౌ యుగే | ఆహారశుద్ధ్యా నృపతే చిత్తశుద్ధి స్తు జాయతే. 50

శుద్ధే చిత్తే ప్రకాశః స్యా ద్ధర్మస్య నృపసత్తమ | వృత్త సంకర దోషేణ జాయతే ధర్మసంకరః. 51

ధర్మస్య సంకరే జాతే నూనం స్యా ద్వర్ణసంకరః | ఏవం కలియుగే భూప సర్వధర్మవివర్జితే. 52

సత్యయుగమున నెల్ల వర్ణములవారును పరాభట్టారికా పూజాతత్పరులై యుండిరి. త్రేతాయుగమున ధర్మస్థానము కొంత తగ్గెను. సత్యయుగధర్మములు ద్వాపరమున నింకను తగ్గెను. వెనుకటియుగాల రాక్షసులు కలియుగమున బ్రాహ్మణులైరి. వీరు పాషండ మతస్థులు మోసగాండ్రు వేదధర్మరహితులు కల్లలాడువారు దంభాచారులు అభిమానమత్తులు లోకజ్ఞానమున నేర్పరులు శూద్రసేవాపరులు నానాధర్మప్రవర్తకులు వేదనిందకులు క్రూరాత్ములు ధర్మకర్మభ్రష్టులు అతివాదులునై యుందురు. కలికాల మధికముగ పెరుగుచుండుకొలది సత్యమూలమగు ధర్మము నంత యధికముగ క్షీణించును. ఇక క్షత్రియ వైశ్య శూద్రులు ధర్మరహితులై వర్తింతురు. తక్కిన వర్ణములవారు పాపుల కల్లబొల్లి మాటలాడువారు నగుదురు. విప్రులు శూద్ర ధర్మమాచరించువారు దాన ప్రతిగ్రహీతలు నగుదురు. ఇట్లు కలికాలమున నధర్మము పెచ్చు పెరుగును. యువతులు కామలోభమోహములు ముప్పిరిగొన కామచారలై వర్తింతురు. వారు పాపిష్ఠురాండ్రు బూటకములాడువారు నిత్తెము వంతలగుందువారు తమ పతులను మోసగించువారు నయియు ధర్మపన్నాలు వల్లించువారగుచు పాపచిత్తలై వర్తింతురు. సాత్త్వికాహారమున చిత్తశుద్ధి గల్గును. చిత్తశుద్ధివలన ధర్మబుద్ధి గల్గును. వృత్తిసంకరమున ధర్మసంకరమును గల్గును. ధర్మసంకరమున వర్ణసంకరము గల్గును. ఇట్లు కలియుగము పుణ్యధర్మ శూన్యమగును.

స్వవర్ణధర్మ వార్తైషా న కుత్రా ప్యుపలభ్యతే | మహాంతో%పి చ ధర్మజ్ఞా అధర్మం కుర్వతే నృప. 53

కలిస్వభావ ఏవైష పరిహార్యో న కేనచిత్‌ | తస్మా దత్ర మనుష్యాణాం స్వభావాత్‌ పాపకారిణామ్‌. 54

నిష్కృతి ర్న హి రాజేంద్ర సామాన్యోపాయతోభ##వేత్‌ | జనమేజయః: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద. 55

కలావధర్మబహులే నరాణాం కా గతి ర్భవేత్‌ | యద్యస్తి తదుపాయ శ్చే ద్దయాయా తం వదస్వ మే. 56

వ్యాసః ! ఏక ఏవ మహారాజ తత్రోపాయోప్తి నాపరః | సర్వదోషనిరాసార్థం ధ్యాయే ద్దేవీపదాంబుజమ్‌. 57

న సంత్యఘాని తావంతి యావతీ శక్తి రస్తి హి | నామ్ని దేవ్యాః పాపదాహే తస్మా ద్భీతిః కుతో నృప. 58

అవశేనా%పి యన్నామ లీలయోచ్చారితం యది | కిం కిం దదాతి తద్‌జ్ఞాతుం సమర్థా న హరాదయః. 59

ప్రాయశ్చిత్తం తు పాపానాం శ్రీదేవీనామసంస్మృతిః | తస్మా త్కలిభయాద్రాజ న్పుణ్యక్షేత్రే వసేన్నరః. 60

నిరంతరం పరాంబాయా నామసంస్మరణం చరేత్‌ | భిత్త్వా భిత్త్వా చ భూతాని హత్వా సర్వమిదం జగత్‌. 61

దేవీం నమతి భక్త్వా యో న స పాపై ర్విలిప్యతే | రహస్యం సర్వశాస్త్రాణాం మయా రాజ న్నుదీరితమ్‌. 62

విమృశ్యైత దశేషేణ భజ దేవీపదాంబుజమ్‌ | అజపాం నామ గాయత్రీం జపంతి నిఃలా జనాః. 63

మహిమానం న జానంతి మాయయా వైభవం మహత్‌ | గాయత్రీం బ్రాహ్మణాః సర్వేజపంతి హృదయాంతరే. 64

మహిమానం న జానంతి మాయయా వైభవం మహత్‌ | ఏతత్సర్వం సమాఖ్యాతం యత్ర్పష్టం తత్త్వయా నృప. 65

యుగధర్మ వ్యవస్థాయాం కిం భూయః శ్రోతు మిచ్ఛసి. 66

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే ఏకాదశో%ధ్యాయః

కలిలో స్వధర్మవర్ణముల రక్షణ ప్రసక్తి లేకపోవును. ధర్మ మెఱింగిన మహాత్ములు నధర్మ మాచరింతురు. ఇదంతయును కలి స్వభావప్రభావమున గల్గును. దీనిని తొలగింప సాధ్యముగాదు. కలిమాయా ప్రభావమును బట్టి నరులు పాపకార్యము లొనర్తురు. ఇట్టి పాపములకు ప్రాయశ్చిత్త మేయుపాయమునను లేదు.'' అన జనమేజయు డిట్లనెను : 'మహాత్మా! నీవు సర్వధర్మజ్ఞుడవు. సర్వశాస్త్రవిదుడవు. ఇట్టి అనీతి అధర్మము గల కలియుగమున మనుజులకు సద్గతి ఎట్లు? దీని కేదే నుపాయ మున్నచో దయతో సెలవిమ్ము.'' అన వ్యాసుడిట్లనెను : 'రాజా! దీని కొకే యొక యుపాయము గలదు. అది కా కింకొకటి లేనేలేదు. సర్వకలిదోషములు నశించుటకు శ్రీదేవీ పాదపద్మములు భక్తిప్రేమములతో ధ్యానింపవలయును. ఈశ్వరీ దివ్యనామమున నెంతటి పాపరాసులైన దహించు మహత్తరశక్తి గలదు. ఆ శక్తిచే నశించని పాపము లీ లోకాలలో లేనేలేవు. ఎంతటి మహాపాపమైనను శ్రీదేవి మధురనామమున నాశము గాగలదు. ఇక భయమేల? ఎంతటి పాపియైనను స్వాధీనము తప్పికాని విలాసమునగాని శ్రీమాతృ దివ్యనామ మొక్కసారియేని నుచ్చరించినచో నతనికే మేమి సత్ఫలములు గలుగునో వానిని శివాదులు నెఱుగజాలరు. శ్రీదేవి మధురనామ సంస్మరణము సకల పాపములకు ప్రాయశ్చిత్తము. కలిభయముగలవారు పుణ్యతీర్థములందు నివసింపవలయును. వారు నిరంతరము శ్రీపరాంబానామ సంస్మృతి యొనరింపవలయును. ఒక డీ జగమందలి ప్రాణులను హింసించి చంపవచ్చును. కాని యతడు శ్రీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రపత్తి జెందినచో వానిని పాపము లంటజాలవు. ఇది సకల శాస్త్రరహస్యము. దీనిని నీకు తెలిపితిని. ఇది అంతయును చక్కగ నెమ్మది నాలోచించుకొని శ్రీదేవీ దివ్యపాదకమలము లాశ్రయింపుము. ప్రాణు లెల్లరును సహజముగ నిత్యమా జపాగాయత్త్రిని జపించుచుందురు. కాని యా దేవి మహిమ నొక్కడు నెఱుగడు. దానికి కారణ మా దేవి మాయా ప్రభావమే. బ్రాహ్మణు లందఱును శ్రీగాయత్త్రీమాతను తమ హృదయసీమలందు జపింతురు. వాస్తవముగా గాయత్త్రీ మహిమ నెవరు నెఱుగరు. దీనికి కారణ మా దేవీమాయా ప్రభావ వైభవమే. రాజా ! ఇట్లు నీ వడిగిన ప్రశ్నల కన్నిటికిని సమాధానము లొసంగితిని. యుగధర్మ వ్యవస్థలు తెలిపితిని. ఇంకేమి వినగోరుదువో తెలుపుము.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు శ్రీదేవి నామ మాహాత్మ్యమను నేకాదశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters