Sri Devi Bhagavatam-1    Chapters   

అథ షష్టో%ధ్యాయః

వ్యాసః: ఏవం ప్రాప్తవరా దేవా ఋషయశ్చ తపోధనాః | జగ్ముః సర్వేచ సమ్మంత్ర్యవృత్రస్యాశ్రమముత్తమమ్‌. 1

దక్ష్యంత మివ లోకాం స్త్రీ న్గ్రసంత మివ చామరాన్‌ | ఋషయో%థ తతో%భ్యేత్య వృత్రమూచుః ప్రియంవచః. 2

దేవకార్యార్థ సిద్ధ్యర్థం సామయుక్తం రసాత్మకమ్‌ | వృత్రవృత్ర ! మహాభాగ సర్వలోకభయంకర. 3

వ్యాప్తం త్వయైతత్సకలం బ్రహ్మాండ మఃలం కిల | శ##క్రేణ తవ వైరం య త్తత్తు సౌఖ్యవిఘాతకమ్‌. 4

యువయోర్దుఃఖదం కామం చింతావృద్ధికరం పరమ్‌ | న త్వం స్వపిషి సంతుష్టో న చాపి మఘవా తథా. 5

సుఖం స్వపితి చింతార్తో ద్వయోర్యద్వైరిజం భయమ్‌ | యువయో ర్యుధ్యతోః కాలో వ్యతీతస్తు మహానిహ. 6

పీడ్యంతే చ ప్రజాః సర్వాః సదేవాసురమానవాః | సంసారే%త్ర సుఖం గ్రాహ్యం దుఃఖం హేయమితిస్థితిః. 7

న సుఖం కృతవైరస్య భవతీతి వినిర్ణయః | సంగ్రామరసికాః శూరాః ప్రశంసంతి న పండితాః. 8

యుద్ధం శృంగారచతురా ఇంద్రియార్థ విఘాతకమ్‌ | పుషై#్పరపి న యోద్ధవ్యం కిం పునర్నిశితైః శ##రైః. 9

యుద్ధే విజయసందేహో నిశ్చితం బాణతాడనమ్‌ | దైవాధీన మిదం విశ్వం తథా జయపరాజ¸°. 10

దైవాధీనా వితిజ్ఞాత్వా నయోద్ధవ్యం కదాచన | కాలే%థ భోజనం స్నానం శయ్యాయాం శయనంతథా. 11

పరిచర్యాపరా భార్యా సంసారే సుఖసాధనమ్‌ | కిం సుఖం యుధ్యతః సంఖ్యే బాణవృష్ఠి భయంకరే. 12

ఖడ్గపాతితిరౌద్రేచ తథా%రాతి సుఖప్రదే | సంగ్రామే మరణా త్స్వర్గసుఖప్రాప్తిరితి స్ఫుటమ్‌. 13

ప్రలోభనపరం వాక్యం నోదనార్థం నిరర్థకమ్‌ | ఛిత్త్వా దేహం వ్యథాం ప్రాప్య శృగాల కరటాదిభిః. 14

ఆరవ అధ్యాయము

శ్రీదేవి వృత్రుని సంహరించుట

ఈ ప్రకారముగ తపోధనులగు ఋషులను దేవతలును శ్రీదేవి దయచే వరములంది తమలోతాము కూడబల్కుకొని వృత్రు నాశ్రమము జేరిరి. వారు నిజ తేజమున వెలుగొందు వృత్రుని గాంచిరి. అతడు ముల్లోకములను బూది సేయువాడేమో అనునట్లును దేవతలను మ్రింగజూచువాడేమో అనునట్లు నుండెను. ఋషులను దేవకార్యార్థము సరసములు సామములు నగు వచనములతో నిట్లనిరి : వృత్రా ! మహానుభావా! సర్వలోకభయంకరా! ఈ బ్రహ్మాండమంతయును నీతో నిండియున్నది. ఇంద్రునితో పగపూనుటవలన నీకు సుఖము గల్గదు. మీ యిర్వురకును దుఃఖకరమగు చింత మిక్కుటయగుచున్నది. అందువలన నీవుగాని యింద్రుడుగాని సుఖముగా నిద్రింపజాలకున్నారు. మీ యిర్వురికిని పోరితము మొదలయి చాలాకాలమైనది. ఐనను మీలో నుండి వైరి భయము వెత యింతవఱకును దొలగుటలేదు. మీ కారణముగ సురాసుర నరులెల్లరును బాధలు పడుచున్నారు. ఈ జగతిలో ప్రతివాడును సుఖము లందవలయును. వైరద్వేషములు గలవానికి సుఖశాంతులు సున్న. సమరకోవిదులు రణమును ప్రశంసింతురు. శృంగార ప్రియు లింద్రియ బాధాకరమగు యుద్ధమునకు దిగరు. వారు పూలతోనైన నొకరినిన గొట్టరు. ఇక బాణములతో గొట్టుదురా? యుద్ధమునందు విజయము సందేహముతోగూడి యుండును గదా! అందు బాణఘాతములు మాత్రము తినక తప్పదు. ఈ విశ్వమంతయును దైవాధీనము. జయాపజయములును దైవాధీనములే. అని యెఱింగిన వాడెప్పుడు నెక్కడ నెవ్వరితోను పోరడు. సరియగు కాలమున స్నానము - భోజనము - సుఖనిద్ర - పతివ్రతయగు భార్య-యివి నరునకు సుఖసాధనములు. రణమునందు బాణవర్షములు గురియును. రణము ఖడ్గ ప్రహారములతో దారుణముగ నుండును. కనుక పోరువానికి సుఖమెట్లుండును? రణములో చచ్చినవానికి స్వర్గసుఖములు గల్గునందురు. కాని, యీ మాట కొండంత యాస గొల్పి రణమునకు ప్రేరించునది మాత్రమే. కనుక స్వర్గకాంక్ష పనికిమాలినిది. వీరుడు తన దేహమును వెతలపాలుచేసి దానిని నక్కల గ్రద్దల పాలు సేయును.

పశ్చాత్స్వర్గసుఖావాప్తిం కోవా వాంఛతిమందధీః | సఖ్యం భవతు తే వృత్ర ! శ##క్రేణ సహ నిత్యదా. 15

అవాప్స్యసి సుఖం త్వం చ శక్ర శ్చాపి నిరంతరమ్‌ | వయంచతాపసాః సర్వేగంధర్వాశ్చ నిజాశ్రమే. 16

సుఖవాసం గమిష్యామః శాంతే వైరే%ధునైవ వామ్‌ | సంగ్రామే యువయేర్ధీర వర్తమానే దివానిశమ్‌. 17

పీడ్యంతే మునయః సర్వే గంధర్వాః కిన్న రానరాః | సర్వేషాం శాంతాకామానాం సఖ్యమిచ్ఛామమే వయమ్‌. 18

మునయస్త్వం చ శక్రశ్చ ప్రాప్నువంతు సుఖంకిల | మధ్యస్థాశ్చ వయం వృత్ర యువయోః సఖ్యకారణ. 19

శపథం కారయిత్వా%త్ర యోజయామో మిథః ప్రియమ్‌ | శక్ర స్తు శపథాన్కృత్వా యథోక్తాంశ్చ తవాగ్రతః. 20

చిత్తం తే ప్రీతిసంయుక్తం కరిష్యతి తు సాంప్రతమ్‌ | సత్యాధారా ధరా నూనం సత్యేన చ దివాకరః. 21

తపత్యయం యథాకాలం వాయుః సత్యేన వాత్యథ | ఉదన్వానపి మర్యాదాం సత్యేనైవ న ముంచతి. 22

తస్మా త్సత్యేన సఖ్యం వా భవత్వద్య యథా సుఖమ్‌ | ఏకత్ర శయనం క్రీడా జలకేళిః సుఖాసనమ్‌. 23

యువాభ్యాం సర్వథా కార్యం కర్తవ్యం సఖ్యమేత్య చ | మహర్షి వచనం శ్రుత్వా తానువాచ మహామతిః. 24

అవశ్యం భగవంతో మే మాననీయా స్తపస్వినః | భవంతో మునయః క్వాపి న మిథ్యావాదినో భృశమ్‌. 25

సదాచారాః సూశాంతాశ్చ న విదు శ్చలకారణమ్‌ | కృతవైరో శ##ఠే స్తబ్ధే కాముకే చ గతత్విషి. 26

నిర్లజ్జే నైవ కర్తవ్యం సఖ్యం మతిమతా సదా | నిర్లజ్జో%యం దురాచారో బ్రహ్మహా లంపటః శఠః. 27

ఇక స్వర్గసుఖము లందుట కే మందమతి కోరుకొనును? అవి నశ్వరములు. కనుక నీ వింద్రునితోడ నేస్తము గల్గి యుండుట మంచిది. దాని వలన నీకు సుఖము, ఇంద్రునకును సుఖము. ఇక గంధర్వాదులు తాపసులు మేము నిజాశ్రమముల కేగుదుము. మే మచ్చట సుఖముగ వసింపగలము. కనుక మీరిక వైరము తల పెట్టకూడదు. రేబవళ్ళు పోరు సల్పరాదు. అట్లు మీరు పోరినచో కిన్నర గంధర్వులకు నరములనులకు బాధలు గల్గుచుండును. మే మెల్లప్పుడును శాంతికాలముల క్షేమము కాంక్షింతుము. ఇంద్రుడు నీవు సుఖముగ నుండుటే మా వాంచితము. మీకు చెలికారము గల్గుటకు మేము మీకు మధ్యవర్తులముగ నుందుము. మేము మీ చేత శపథములు చేయింతుము. మీలో మీకు ప్రేమ గూర్తుము. ఇంద్రుడు నీ యెదుట ప్రతినలు పూనగలడు. అతడు నీకు ప్రీతి గల్గునట్లు వర్తింపగలడు. ఈ సూర్యుడు ఈ జనములు సర్వము సత్యాధారములు. గాలియును సత్యమువలననే వీచును. జలరాశియును సత్యకారణముగ తన వేల నతిక్రమింపకున్నది. కనుక మీ యిర్వురకు చెలిమి కలుగుగాక! మీ రొకేచోట నిదురించుట విహరించుట జలకేళి సల్పుట మంచిది. అన్ని పనులును మీరు కల్లు కోలు తనముతో చేయుట మంచిది. అని యిట్లు మహర్షులు వచించిన వాక్కులు విని వృత్రు డిట్లనెను : ఓ మహానుభావులారా! మీరు పరమ మునులు. తాపసోత్తములు. గౌరవపాత్రులు. అబద్ధము లాడనివారు. పరమశాంతులు. సదాచార సంపన్నులు. మోసములు తెలియనివారు. ఇంద్రుడు మాత్రము వైరి. లంపటుడు. శఠుడు. సిగ్గుమాలిన వాడు. అట్టి యింద్రునితో బుద్ధి మంతు డెట్లు కలిసిమెలసి యుండగలడు? అతడు బ్రాహ్మఘాతుకుడు-శఠుడు-టక్కరి- మాయలమారి - సిగ్గుమాలినవాడు.

న విశ్వాస స్తు కర్తవ్యః సర్వథై వేదృశే జనే | భవంతో నిపుణాః సర్వే న ద్రోహి మతయః సదా. 28

అనభిజ్ఞా స్తు శాంతత్వా చ్చిత్తానా మతివాదనామ్‌ | మునయ ఊచుః: జంతుః కృతస్య భోక్తావై శుభస్యత్వశుభస్యచ. 29

ద్రోహం కృత్వాకుతః శాంతి మాప్నుయ న్నష్టచేతనః | విశ్వాసఘాతకర్తారో నరకం యాంతి నిశ్చయమ్‌. 30

దుఃఖం చ సమావాప్నోతి నూనం విశ్వాసఘాతుకః | నిష్కృతి ర్భ్రహ్మ హంతౄణాం సురాపానంచ నిష్కృతిః. 31

విశ్వాఘాతినాం నైవ మిత్రద్రోహకృతా మపి | సమయం బ్రూహి సర్వజ్ఞ యథా తే చేతసి ధ్రువమ్‌. 32

తేనైవ సమయేనాద్య సంధిః స్యా దుభయోః కిల | వృత్రఉవాచ: న శుష్కేణ న చార్ద్రేణ నాశ్మనా నచ దారుణా. 33

న వజ్రేణ మహాభాగా న దివా నిశి నైవ చ | వధ్యో భ##వేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైవతైః. 34

ఏవం మే రోచతే సంధిః శ##క్రేణ సహ నాన్యథా | ఋషయ స్తం తదా ప్రాహుర్బాఢ మిత్యేవ చాదృతాః. 35

సమయం శ్రావయామాసుస్తత్రానీయ సురేశ్వరమ్‌ | ఇంద్రో%పిశపథాం స్తత్ర చకార విగతజ్వరః. 36

సాక్షిణం పావకం కృత్వా మునీనాం సన్నిధౌ కిల | వృత్రస్తు వచనై స్తస్య విశ్వాసమగమత్తదా. 37

బభూవ మిత్రవచ్ఛక్రే సహచర్యాపరాయణః | కదాచిన్నందనే చోభౌ కదా చిద్గంధమాదనే. 38

కదా చిదుదధే స్తీరే మోదమానౌ విచేరతుః | ఏవం కృతే చ సంధానే వృత్రః ప్రముదితో%భవత్‌. 39

శక్రో%పి వధకామస్తు తదుపాయా నచింతయత్‌ | రంధ్రాన్వేషి సముద్విగ్న స్తదా%సీ న్మఘవా భృశమ్‌. 40

ఇట్టి చెడు లక్షణములవాని నెప్పుడును నమ్మరాదు. మీరు సాధువులు. పరులకు కీడు తలపెట్టనివారు. మీరు పరమశాంతులగుట వలన దుష్టుల చిత్త మెఱుగజాలకున్నారు అన మును లిట్లనిరి : ప్రతి ప్రాణియను తన మంచిచెడ్డల ఫల మనుభవించును. ప్రణష్టచిత్తుడు పరులకు ద్రోహముచేసి యెట్లు శాంతి పడయగలడు? ఇక విశ్వాసఘాతుకులు మిత్రద్రోహులు తప్పక నరకయాతన లనుభవింతురు. విశ్వాసఘాతకుడు దుఃఖముల పాలగును. బ్రహ్మహత్య సురాపానము చేసిన వానికి ప్రాయశ్చిత్తము గలదు. కాని విశ్వాసఘాతుకులకు మిత్రద్రోహులకు మాత్రము ప్రాయశ్చిత్తము లేదు. కనుక నీ మదిలోని నియమమును వెల్లడి చేయుము. అట్టి నియమము ప్రకారముగ మీ మధ్య సంధి జరుగగలదు. అన వృత్రుడిట్లనెను: 'ఓ విప్రవరులారా! నే నెండిన - తడిసిన - దారుణమైన వస్తులచేగాని రాళ్లచేగాని వజ్రముతోగాని యింద్రునిచేగాని సురలచేగాని రేబవళ్ళుగాని చావకుండవలయును. ఈ నియమాలు మీ రొప్పుకొన్నచో నే నింద్రునితో సంధి కంగీకరింతును. కాని మరే విధమున గాదు.' వ్యాసుడిట్లనెను : అంత ఋషు లెల్లరు నట్లే యని యతని మాట నొప్పుకొనిరి. అపుడు వారు సురపతి నాహ్వానించి వృత్ర నియమము లన్నియు వినిపించిరి. ఇంద్రుడును రోష ముడిగి అగ్ని సాక్షిగ మునుల సమక్షమున శపథములు చేసెను. ఇంద్రుని ప్రతినలను వృత్రుడు నిజమనుకొనెను. ఆనాటి నుండియు వృత్రుడు సురపతితో మిత్రుని వలె మెలగుచుండెను. వారొక్కప్పుడు నందనవనమున మరొక్కప్పుడు గంధమాదనమున ఇంకొకప్పుడు సాగరతీరములందు పొరపొచ్చెములు లేక సంతోషముతో విహరించుచుండిరి. ఇట్టి సంధికి వృత్రుడు ప్రమోదభరితడయ్యెను. కాని యింద్రుడు మాత్ర ముద్రేకముతో రంధ్రాన్వేషణ సేయుచు వృత్రుని వధించు నుపాయములు పన్నుచుండెను.

ఏవం చింతయత స్తస్య కాలః సమభివర్తత | విశ్వాసం పరమం ప్రాప వృత్రః శ##క్రే%తి దారుణ. 41

ఏవం కతిచిదబ్దాని గతాని సమయే కృతే | వృత్రస్య మరణోపాయా న్మనసీంద్రో%ప్యచింతయత్‌. 42

త్వష్టైకదా సుతం ప్రాహ విశ్వస్తం పాకశాసనే | పుత్ర వృత్ర మహాభాగ | శృణు మే వచనం హితమ్‌. 43

నవిశ్వాస స్తు కర్తవ్యః కృతవైరే కథంచన | మఘవా కృతవైర స్తే సదా%సూయపరః పరైః. 44

లోభా న్మత్తో ద్వేషరతః పరదుఃఖోత్సవాన్వితః | పరదారలంపటః స పాపబుద్ధిః ప్రతారకః. 45

రంధ్రాన్వేషీ ద్రోహపరో మాయావీ మదగర్వితః | యః ప్రవిశ్యోదరే మాతు ర్గర్భచ్ఛేదం చకార హ. 46

సప్తకృత్వః సప్తకృత్యః క్రందమాన మనాతురః | తస్మా త్పుత్ర ! న కర్తవ్యో విశ్వాసస్తు కథంచన. 47

కృతపాపస్య కా లజ్జా పునః పుత్త్ర! ప్రకుర్వతః | ఏవం ప్రబోధితః పిత్రా వచనైర్హేతు సంయుతైః. 48

న బుబోధ తదా వృత్ర ఆసన్న మరణః కిల | స కదాచి త్సముద్రాంతే తమపశ్యన్మహాసురమ్‌. 49

సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే%తీవ దారుణ | తతః సంచింత్య మఘవా వరదానం మహాత్మనామ్‌. 50

సంధ్యేయం వర్తతే రౌద్రా న రాత్రిర్దివసో న చ | హంతవ్యో%యం మయా చాద్య బలేనైవ న సంశయః. 51

ఏకాకీ విజనే చాత్ర సంప్రాప్తః సమయోచితః | ఏవం విచార్య మనసా సస్మార హరి మవ్యయమ్‌. 52

తత్రా%జగామ భగవా నదృశ్యః పురుషోత్తమః | వజ్రమధ్యే ప్రవిశ్యాసౌ సంస్థితో భగవాన్హరిః. 53

ఇంద్రో బుద్ధిం చకారా%%శు తదా వృత్రవధం ప్రతి | ఇతిసంచింత్య మనసా కథం హన్యాం రిపుం రణ. 54

అట్లు చాలకాలము గడచిపోయెను. వృత్రునకు కపటి అగు సురపతి యందు నమ్మకము గట్టిపడెను. అట్లు కొన్ని యేండ్లు గడచెను. ఇంద్రుడు మాత్రము వృత్రుని చంపు నాలోచనలోనే మునిగియుండెను. ఒకనాడు సురపతిని నమ్ముకొని యున్న వృత్రుని పిలిచి విశ్వకర్మ యిట్లనెను: 'మహాత్మా! వృత్రా! నా మాట వినుము. ఒకేసారి వైరము మాని నెయ్యము బూనిన వానిని నమ్మరాదు. ఇంద్రుడు నీ శత్రువు. అసూయాపరుడు. లోభి మత్తుడు ద్వేషి పరదారలంపటుడు. పాపమతి దుఃఃతుడు పరపీడనపరుడు. రంధ్రాన్వేషి-మాయావి. బహురూపి. ద్రోహమదగర్వములు గలవాడు. అతడొకప్పు డసూయతో తన తల్లి గర్భముజొచ్చెను. అందేడ్చుచున్న శిశువును నలువదితొమ్మిది భాగములుగ ఖండించెను. కనుక కుమారా! అతని నెన్నడును నమ్మియుండకుము. ఒకసారి పాపము చేసినవాడు మరొకసారి చేయుటకు వెనుకాడునా?' అని యిట్లు వృత్రుని తండ్రి సహేతుకముగ బల్కెను. కాని వృత్రుడు తన తండ్రి హితములలోని నిజమెఱుగలేకపోయెను. ఒకనాడింద్రుడు వృత్రుని సముద్రతీరమున గాంచెను. అది సంజవేళ - దార సుముహూర్తము. ఇపుడింద్రుడు బ్రహ్మవరము గుర్తు తెచ్చుకొనెను. ఇంద్రుడిట్లు తలపోసెను: ఇపుడు రాత్రిగాని పగలుగాని కాని సంధ్యాసమయము-ఇత్తఱి నా మహాబలమున వృత్రుడు చంపబడగలడు. ఇది నిర్జనప్రదేశము. ఇంత డొంటరివాడు. ఇది మంచి సమయము. ఇతడు నాకు జిక్కినాడు అని నెమ్మదిననుకొని యింద్రుడవ్యయుని హరిని స్మరించెను. అంతపురుషోత్తముడగు శ్రీహరివచ్చి వజ్రాయుధములో అదృశ్యముగ దాగియుండెను. ఇట్లు తలపోసియు నింద్రుడు తన శత్రువగు వృత్రుని రణమున నెట్లు చంపగలనని మరల తలంచెను.

అజేయం సర్వథాసర్వదేవైశ్చ దానవై స్తథా | యది వృత్రం న హన్మ్యద్య వంచయిత్వా మహాబలమ్‌. 55

నశ్రేయోమమ నూనంస్యాత్సర్వథారిపురక్షణాత్‌ | అపాంఫేనం తదా%పశ్య త్సముద్రే పర్వతోపమమ్‌. 56

నాయంశుష్కో న చార్ద్రో%యం నచశస్త్రమిదంతథా | అపాంఫేనంతదాశక్రో జగ్రాహ కిల లీలయా. 57

పరాంశక్తిం చ సస్మారభక్త్వాపరమయా యుతః | స్మృతమాత్రాతదా దేవీ స్వాంశంఫేనం న్యధాపయత్‌. 58

వజ్రం తదావృతం తత్ర చకార హరి సంయుతమ్‌ | ఫేనావృతంపవిం తత్ర శక్ర శ్చిక్షేప తం ప్రతి. 59

సహసానిపపాతాశు వజ్రహత ఇవాచలః | వాసవస్తు ప్రహృష్టాత్మా బభూవ నిహతేతదా. 60

ఋషయశ్చ మహేంద్రం తమస్తువన్వివిధైః స్తవైః | హతశత్రుః ప్రహృష్టాత్మా వాసవః సహదైవతైః. 61

దేవీం సంపూజయా మాస యత్ర్పసాదా ద్ధతో రిపుః | ప్రసాదయామాస తదా స్తోత్రై ర్నానావిధై రపి. 62

దేవోద్యానే పరాశ##క్తేః ప్రాసాద మకరో ద్దరిః | పద్మరాగమయీం మూర్తిం స్థాపయామస వాసవః. 63

త్రికాలం మహతీం పూజాం చక్రుః సర్వే%పి నిర్జరాః | తదా ప్రభృతి దేవానాం శ్రీ దేవీ కులదైవతమ్‌. 64

విష్ణుం త్రిభువనశ్రేష్ఠం పూజయామాస వాసవః | తతో హతే మహావీర్యే వృత్రే దేవభయంకరే. 65

ప్రవవౌ చ శివో వాయు ర్జహృషు ర్దేవతా స్తథా | హతే తస్మి న్సగంధర్వా యక్షరాక్షస కిన్నరాః. 66

ఇత్థం వృత్రః పరాశక్తి ప్రవేశయుత ఫేనతః | తయా కృత విమోహా చ్చ శ##క్రేణ సహసా హతః. 67

తతో వృత్రనిహంత్రీతి దేవీ లోకేషు గీయతే | శ##క్రేణ నిహతత్వా చ్చ శ##క్రేణ హతం ఉచ్యతే. 68

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే షష్ఠో%ధ్యాయః.

వృత్రుడు దేవదానవుల కజేయుడు. ఒకవేళ నే నతనిని వంచించి నా బలముతో నతనిని చంపలేక పోవచ్చును. అపుడు నా శత్రువు బ్రతుకును. ఇక నా గతి దుర్గతియే అనుకొనుచు అంతలో నింద్రుడు సాగరమునందు పర్వతమువలె పెరుగుచున్న నురుగు చూచెను. ఈ నురుగు తడిసినదిగాదు. ఎండినదిగాదు. ఇది శస్త్రముగాదు అనుకొని యింద్రుడు నీటి నురుగును దీసికొనెను. శ్రీ భవానీ దేవిని మహాశక్తిని మనసార సంస్మరించెను. స్మృతి మాత్రన శ్రీదేవిసంహరిణీశక్తి నురుగులో జేరెను. హరిబలముతో బలముపుంజుకొనిన వజ్రాయుధము నురుగుచే గప్పబడెను. అట్టి వజ్రము చేబూని యింద్రుడు వృత్రుని వ్రేటువేసెను. ఆ దెబ్బకు వజ్రముచే గొట్టబడిన గిరివలె వృత్రుడు నేలగూలెను. వృత్రుడు నేలగూలగనే వజ్రి సంతుష్టుడయ్యెను. అంత నింద్రు డే పరాశక్తి నాశ్రయించి వృత్రుని చంపెనో యా దేవిని పూజించి పలువిధములగు సంస్తుతులతో నామెను ప్రసన్నురాలిని జేసెను. ఇంద్రుడు నందనోద్యానమందు శ్రీపరాశక్తి మందిరము నిర్మించి యందు పద్మరాగమణిమయమగు దేవీ విగ్రహమును ప్రతిష్ఠింపజేసెను. నాటినుండి విబుధులెల్లరును సంధ్యాసమయములందు దేవదేవిని పూజించుచుండిరి. శ్రీదేవి దేవతలపాలిటి కల్పతరువయ్యెను. దేవతల కులదేవతయయ్యెను. శ్రీదేవియే వారి సర్వస్వమయ్యెను. అట్లు దేవభీకరుడు బలశాలియగు వృత్రుడు చావగ నింద్రుడు త్రిభువన పూజ్యుడైన హరిని పూజించెను. గాలి మెల్లమెల్లగ చల్లగ స్వేచ్ఛగ వీవసాగెను. కిన్నర గంధర్వ యక్ష రాక్షసులు సురలును హర్షము వెలిపుచ్చిరి. అట్లు త్రిమూర్తి స్వరూపిణి యగు పరాశక్తి నీటి నురుగున నుండి వృత్రుని మోహితుని జేయుటచేతనే యింద్రుడు వృత్రాసురుని చంపగలిగెను. లోకము వాసవుడు వృత్రుని చంపెనందురు కాని వాస్తవముగ చూడగ పరాదేవి వృత్రనిహంత్రియని వన్నెకెక్కినది.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి షష్ఠస్కంధమందు శ్రీదేవి వృత్రుని సంహరించుటయను షష్టాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters