Sri Devi Bhagavatam-1    Chapters   

అథ దశమో%ధ్యాయః

ఋషయ ఊచుః : 

సూత! పూర్వంత్వయా ప్రోక్తం వ్యాసేనామితతేజసా | కృత్వాపురాణమఖిలంశుకాయాధ్యాపితంశుభమ్‌. 1

వ్యాసేనతు తప స్తప్త్వా కథ ముత్పాదితః శుకః | విస్తరం బ్రూహి సకలం యచ్ఛ్రుతం కృష్ణత స్త్వయా 2

సూత ఉవాచ : ప్రవక్ష్యామిశుకోత్పత్తిం వ్యాసాత్సత్యవతీసుతాత్‌ | యథోత్పన్నః శుకః సాక్షాద్యోగినాంప్రవరోమునిః 3

మేరుశృంగే మహారమ్యే వ్యాసః సత్యవతీ సుతః | తప శ్చచార సో%త్యుగ్రం పుత్రార్థం కృతనిశ్చయః 4

జప న్నే కాక్షరం మంత్రం వాగ్బీజం నారదా చ్ఛ్రుతమ్‌ | ధ్యాయన్‌ పరాం మహామాయాం పుత్రకామ స్తపోనిధిః 5

అగ్నే ర్భూమే స్తథా వాయో రంతరిక్షస్య చాప్యయమ్‌ | వీర్యేణ సమ్మితః పుత్రో మమ భూయా దితి స్మ హ. 6

అతిష్ఠ త్స గతాహారః శతసంవత్సరం ప్రభుః | ఆరాధయ న్మహాదేవం తథైవ చ సదాశివమ్‌. 7

శక్తిః సర్వత్ర పూజ్యేతి విచారం చ పునఃపునః | అశక్తో నింద్యతే లోకే శక్తస్తు పరిపూజ్యతే. 8

యత్ర పర్వతశృంగేవై కర్ణికారవనాద్భుతే | క్రీడంతి దేవతాః సర్వే మునయశ్చ తపోథికాః 9

ఆదిత్యా వసవో రుద్రా మరుత శ్చాశ్వినౌ తథా | వసంతి మునయో యత్ర యే చాన్యే బ్రహ్మ విత్తమాః 10

తత్ర హేమగిరేః శృంగే సంగీతధ్వనినాదితే | తప శ్చచార ధర్మాత్మావ్యాసః సత్యవతీసుతః 11

పదవ అధ్యాయము

వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

ఋషు లిట్లనిరి : సూత మహర్షీ! మహా తేజస్వియగు వ్యాసుడీ దివ్యదేవీ పురాణమును రచియించి శ్రీ శుకునిచే దానిని చదివించెనంటివి. వ్యాసుడు తపమొనరించి శుకునెట్లుద్భవింపజేసెను? నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదమొనరింపుము. సూతు డిట్లనియెను : సత్యవతీ తనయుడు వ్యాసుని వలన యోగి వరుడగు శుకుని జన్మమెట్లుగల్గెనో యా వృత్తాంతము దెల్పెదను. పూర్వము సత్యవతీ సుతుడగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపమాచరించెను. ఆ తపోనిధి పుత్రార్థియై నారదుని వలన నేకాక్షరమంత్ర రాజమగు వాగ్బీజమంత్రము నుపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించు చుండెను. వ్యాసుడు తనకు నింగి గాలి నిప్పు నీరు నేలయను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు గలుగవలయునని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారియై దీక్షతో నూఱండ్లు తపమొనరించెను. శివాశివుల నారాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే యెల్లెడల బూజనీయయని తలంచి వ్యాసుడాదేవిని నిరంతరము గొలుచుచుండెను. లోకమందశక్తుడు నింద్యుడగును. శక్తుడు పూజ్యుడగును. ఆ మేరుగిరి శిఖరముపై అద్భుతకర్ణికారవనము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు సేయుచుందురు. అచట మధుర సంగీతరవములు వీనుల విందులు సేయును. అట్టి సుమనోహరమైనచోట ధర్మాత్ముడు సత్యవతీ సుతుడునగు వ్యాసుడు తపము సేయ మొదలుపెట్టెను.

తతో%స్య తేజసా వ్యాప్తం సర్వం చరాచరమ్‌ | అగ్ని వర్ణా జటా జాతాః పారాశర్యస్య ధీమతః 12

తతో%స్య తేజ ఆలక్ష్య భయ మాప శచీపతిః | తురాసాహం తదా దృష్ట్వా భయత్రస్తం శ్రమాతురమ్‌. 13

ఉవాచ భగవాన్రుద్రోమఘవంతం తథాస్థితమ్‌ | కథ మింద్రాద్య భీతో%సి కిం దుఃఖం తే సురేశ్వర. 14

అమర్షోనైవ కర్తవ్య స్తాపసేషు కదాచన | తప శ్చరంతి మునయో జ్ఞాత్వా మాం శక్తిసంయుతమ్‌. 15

న త్వేతే%హిత మిచ్ఛంతి తాపసాః సర్వథైవ హి ఇత్యుక్తవచనః శక్ర స్తమువాచ వృషధ్వజమ్‌. 16

కస్మాత్తపస్యతివ్యాసః కో%ర్థ స్తన్యమనోగతః | శివ ఉవాచః పారాశర్యస్తుపుత్రార్థీతపశ్చరతిదుశ్చరమ్‌. 17

పూర్ణం వర్షశతం జాతం దదామ్యద్యసుతంశుభమ్‌ ఇత్యుక్త్వావాసవంరుద్రోదయయాముదితాననః. 18

గత్వా ఋషిసమీపం తుత మువాచ జగద్గురుః | ఉత్తిష్ఠ వాసవీపుత్ర పుత్రస్తే భవితా శుభః. 19

సర్వతేజోమయో జ్ఞానీ కీర్తికర్తా తవానఘ | అఖిలస్య జనస్యాత్ర వల్లభ##స్తే సుత: సదా. 20

భవిష్యతి గుణౖః పూర్ణః సాత్త్వికైః సత్యవిక్రమః | తదాకర్ణ్యవచః శ్లక్షణం కృష్ణద్వైపాయన స్తదా. 21

శూలపాణిం నమస్కృత్య జగామాశ్రమ మాత్మనః | స గత్వా%%శ్రమ మేవాశు బహువర్ష శ్రమాతురః 22

అతని మహోగ్ర తేజము చరాచరలోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడ లగ్నివర్ణములయ్యెను. అతని తపము వేడిమికి దేవేంద్రుడే గడగడలాడెను. ఇంద్రుని భయవ్యాకులత్వములను రుద్రుడు గాంచెను. అపుడా రుద్రభగవాను డింద్రున కిట్లనియెను: ''ఓ యింద్రా! ఏల భీతుడవైతివి? నీకు గలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని యెవ్వడు నెప్పుడును కోపము జెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగ దెలిసికొని తపమొనర్తురు. తాపసు లెప్పుడు నితరులకు కీడు తలపెట్టరు.'' అను వచనములాకర్ణించి ''ఆ వ్యాసుడేల తపమొనర్చు చుండెను. అతని మదిలోని కోర్కి యెట్టిది?'' అని ఇంద్రుడడుగ ''ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమొనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో నూఱండ్లు నిండినవి. కాన నతనికిపుడు శుభకరుతనయుని ప్రసాదింతును'' అని రుద్రుడనెను. మధుర దయాసముద్రుడు ప్రసన్నవదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని జేరి యిట్లనియెను: ''ఓ సత్యవతీ తనయా! వ్యాస మునీ! లెమ్ము. నీకు సత్పుత్త్రుడుదయించుగాక! ఓ యనఘా! అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్ఠలు దెచ్చువాడును లోక ప్రియుడునగు పుత్త్రుడు నీకు జన్మించుగాక! అతడు సత్త్వగుణ సంపన్నుడు సత్యవిక్రముడు పూర్ణాత్ముడు గాగలడు.'' సూతుడిట్లనెను : అను శివుని శివంకరవచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అతడు తాను పెక్కేండ్లు పడినపాట్లకు బాధపడుచు -

అరణీసహితం గుహ్యం మమంథాగ్ని చికీర్షయా | మంథనం కుర్వత స్తస్య చిత్తే చింతాభర స్తదా. 23

ప్రాదర్భుభూవ సహసా సుతోత్పత్తౌ మహాత్మనః | మంథానారణిసంయోగా న్మంథనాచ్చ సముద్భవః 24

పావకస్య యథా తద్వ త్కథం మే స్యా త్సుతోద్భవః | పుత్రారణిస్తు యా ఖ్యాతా సా మమాద్య న విద్యతే. 25

తరుణీ రూపసంపన్నా కులోత్పన్నా పతివ్రతా | కథం కరోమి కాంతాం చ పాదయోః శృంఖలాసమామ్‌. 26

పుత్రోత్పాదనదక్షాం చ పాతివ్రత్యే సదా స్థితామ్‌ | పతివ్రతా%పి దక్షా%పి రూపవత్యపి కామినీ. 27

సదా సంధనరూపా చ స్వేచ్ఛా సుఖవిధాయినీ | శివో%పి వర్తతే నిత్యం కామినీపాశసంయుతః 28

కథం కరోమ్యహం చాత్ర దుర్ఘటం చ గృహాశ్రమమ్‌ | ఏవం చింతయత స్తస్య ఘృతాచీ దివ్య రూపిణీ. 29

ప్రాప్తా దృష్టిపథం తత్ర సమీపే గగనే స్థితా | తాం దృష్ట్యా చపలా పాంగీం సమీపస్థాం వరాప్సరామ్‌. 30

పంచబాణపరీతాంగ స్తూర్ణ మాసీ ద్ధృతవ్రతః | చింతయామాస చ తదా కిం కోరమ్యద్య సంకటే. 31

ధర్మస్య పురతః ప్రాప్తే కామభావే దురాసదే | అంగీకరోమి యద్యేనాం వంచనార్థ మిహాగతామ్‌. 32

హసిష్యంతి మహాత్మానస్తాపసామాంతు విహ్వలమ్‌ తప స్తస్త్వా మహాఘోరం పూర్ణం వర్షశతం త్విహ. 33

దృష్ట్వాప్సరాం చ వివశః కథం జాతో మహాతపాః | కామం నిందా%పి భవతు యది స్యా దతులం సుఖమ్‌. 34

గృహస్థాశ్రమసంభూతం సుఖదం పుత్రకామదమ్‌ | స్వర్గదం చ తథా ప్రోక్తం జ్ఞానినాం మోక్షదం తథా. 35

న భవిష్యతి తన్నూన మనయా దేవనక్యయా | నారాదాచ్చ మయాపూర్వం శ్రుతమస్తి కథానకమ్‌.

యథోర్వశీవశో రాజా పరాభూతః పురూరవాః. 36

ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ ప్రథమస్కంధే దశమో%ధ్యాయః

అరణిలో గుప్తమైయున్న యగ్నిని మరల బొందుట కరణిని మథించుచుండెను. అపుడతని డెందమున పుత్ర కామమును గలిగెను. దండముతో నరణిని జేర్చి మథించగ మథించగా నగ్ని యుదయించెను. నాకు పుత్ప్రోత్తికి హేతువగు స్త్రీ లేనేలేదు! నాకీ యగ్నితో సమానుడగు పుత్రుడెట్లు కలుగును? కుల్పోత్పన్న రూప సంపన్న తరుణి కాళ్ళకు సంకెళ్ళవంటిది అగు కాంతను నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాత్రివ్య్రత జీవన రూపవతి కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ విధాయిని యగు నారి బంధన కారిణి. ప్రణవ స్వరూపుడగు శివు డంతటివాడే ఉమా రాగపాశ బంధములచే బద్ధుడయ్యె గదా! ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెఱపగలను అని వ్యాసుడు విచారించు చుండెను. అంతలో దివ్య కామిని యగు ఘృతాచి వ్యాసునకెట్ట యోదుట నింగిపై దోచెను. చపలములగు క్రీగంటి చూపులతో తన సమీపమున ఉన్న ఆ అప్సరః శ్రేష్టుని చూచి వ్యాసుడు వ్రతపరాయణుడయ్యు కామబాణవ్యాప్తమనస్కుడయ్యెను. ఆ సంకటము విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగెను. ఇపుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెల్లుబికినట్లున్నది. నన్నే మోసగించవచ్చిన యీ రమణిని నే నొకవేళ నంగీకరింతు ననుకొందము. అపుడు బ్రహ్మవాదులు తాపసులును కామ లోలుడనగు నన్ను గేలిసేతురు. 'ఇతడే నూఱండ్లెంతో ఘోరముగ తపించి యొక యచ్చర కొంగుబట్టుకొని తన సర్వస్వమామె ముందుంచెను' అని వారందురు. సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చినను సరే! గృహస్థాశ్రమమున పుత్త్రజన్మము గల్గినచో నది సర్వసుఖము గలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును గల్గించును. ఈ దేవకన్యవలన నాకట్టి పుణ్యము గలుగదు. తొల్లి పురూరపు డూర్వశికి వశుడై తుదకామెచేతనే తిరస్కరింపబడెను అను కథను నేను నారదుని వలన వింటిని.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందలి దశమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters