Varahamahapuranam-1    Chapters   

షణ్ణవతితమోధ్యాయః - తొంబది ఆరవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహ దేవు డిట్లు చెప్పెను.

అథ రుద్ర వ్రతోత్పత్తిం శృణు దేవి వరాననే,

యేన జ్ఞానేన పాపానాం ముచ్యతే భూరి మానవః. 1

వరాననా! ఇంక రుద్రవ్రతము పుట్టుకనుగూర్చి వినుము. ఆజ్ఞానముతో మానవుడు సర్వపాపములనుండియు ముక్తుడగును.

బ్రహ్మణా తు యదా రుద్రః పూర్వం సృష్టో వరాననే,

తృతీయే జన్మని విభుః పిఙ్గాక్షో నీలలోహితః. 2

తదా కౌతూహలాద్‌ బ్రహ్మా స్కన్ధే తం జగృహే ప్రభుః,

స్కంధారూఢే తదా రుద్రే బ్రహ్మణోవ్యక్త జన్మనః. 3

జన్మతశ్చ శిరో యద్ధి పఞ్చమం తజ్జగాద హ,

మన్త్రమాధర్వణం ధాత్రి యేన సద్యః ప్రముచ్యతే. 4

బ్రహ్మ మునుపు రుద్రుని సృజించెను. అది మూడవజన్మము (1. విష్ణువు 2. బ్రహ్మ 3. రుద్రుడు.) ఆ రుద్రుడు పచ్చని కన్నులు కలవాడు, నలుపు ఎరువుల వన్నె కలవాడు. అప్పుడు బ్రహ్మ వేడుకతో ఆబాలుని బుజముపై నెత్తుకొనెను. అవ్యక్తమునుండి పుట్టిన బ్రహ్మ బుజముపై నెక్కించుకొనగా ఆతని అయిదవతల ఆధర్వణ మంత్రములను పలికెను. దానివలన మనుజుడు అప్పటికప్పుడు ముక్తి పొందును.

కపాలి రుద్ర బభ్రోథ భవ కైరాత సువ్రత,

పాహి విశ్వం విశాలాక్ష కుమారవర విత్తమ. 5

కపాలీ! రుద్ర! బభ్రు! భవ! కిరాతరూప! సువ్రత! విశాలాక్ష! కుమారవర! సర్వజ్ఞా! ఈ విశ్వమునంతటిని రక్షింపుము.

ఏవముక్త స్తదా రుద్రో భవిషై#్య ర్నామభి ర్భవః,

కపాలశబ్దాత్‌ కుపిత స్తచ్ఛిరో విచకర్త హ. 6

వామాంగుష్ఠనఖే నాద్యం ప్రాజాపత్యం విచక్షణః,

తన్నికృత్తం శిరో ధాత్రి హస్తలగ్నం బభూవ హ, 7

ఇట్లు బ్రహ్మ రానున్న నామములతో పిలువగా భవుడు కపాల శబ్దమువలన కోపించినవాడై బ్రహ్మ యొక్క ఆ అయిదవ తలను ఎడమచేతి వ్రేలిగోటితో తెగగోసెను. ఆ తెగినతల శివుని చేతి యందు తగులుకొని యుండెను.

తస్మిన్‌ కరస్థే శిరసి ప్రాజాపత్యే త్రిలోచనః,

బ్రహ్మాణం ప్రయతో భూత్వా రుద్రో వచన మబ్రవీత్‌. 8

ఆ ప్రజాపతి తల చేతి నుండగా ముక్కంటి వినయముతో బ్రహ్మతో నిట్లు పలికెను.

రుద్ర ఉవాచ - రుద్రుడు పలికెను.

కథం కపాలం మే దేవ కరాత్‌ పతతి సువ్రత,

నశ్యతే చ కథం పాపం మమైతద్‌ వద మాచిరమ్‌. 9

దేవా! ఈ పుఱ్ఱ నాచేతి నుండి ఎట్లు పడును? ఈ నా పాపము ఎట్లు నశించును? ఆలసింపక చెప్పుము.

బ్రహ్మా ఉవాచ - బ్రహ్మ పలికెను.

ఇద మేవ వ్రతం దేవ చర కాపాలికం విభో,

సమయాచారసంయుక్తం కృత్వాస్వేనైవ తేజసా. 10

దేవా! సమయాచారముతో కూడిన ఈ కాపాలిక వ్రతమునే నీదగు తేజస్సుతో ఆచరింపుము.

ఏవ ముక్త స్తదా రుద్రో బ్రహ్మణావ్యక్తమూర్తినా,

ఆజగామ గిరిం తుఙ్గం మహేన్ధ్రం పాపనాశనమ్‌. 11

వ్యక్తముకాని రూపము కల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రడు అప్పుడు మిక్కిలి ఎత్తై నది, పాపములను పోకార్చునది యగు మహేంద్ర పర్వతమునకు ఏతెంచెను.

తత్ర స్థిత్వా మహాదేవ స్తచ్ఛిరో విభిదే త్రిథా,

తస్మిన్‌ భిన్నే పృథక్‌ కేశాన్‌ గృహీత్వా కృతవాన్‌ భవః,

యజ్ఞోపవీతం కేశం తు మహాస్థ్యక్షమణీం స్తథా. 12

అందుండి మహాదేవుడు ఆ తలను మూడు ముక్కలు చేసెను. అది అట్లు పగులగా రుద్రుడు దానికేశములను కైకొని జన్నిదముగా చేసికొనెను. ఎముకలను అక్షమణులను కావించు కొనెను.

కపాలశకలం చైకమసృ క్పూర్ణం కరేస్థితమ్‌,

అపరం ఖండశః కృత్వా జటాజూటే న్యవేశయత్‌. 13

పుఱ్ఱముక్క నొకదానిని నెత్తురునిండినదానిని చేతనుంచుకొని మరొకముక్కచేసి జుట్టుముడిలో ఉంచెను.

ఏవం కృత్వా మహాదేవో బభ్రా మేమాం వసున్ధరామ్‌,

సప్తద్వీపవతీం పుణ్యాం మజ్జం స్తీర్థేషు నిత్యశః. 14

ఇట్లు చేసి మహాదేవుడు ఏడుద్వీపములుగల పుణ్యమైన భూమినంతటిని, తీర్థములలో మునుగుచు, తిరిగెను.

సముద్రే ప్రథమం స్నాత్వా తతో గంగాం వ్యగాహత,

సరస్వతీం తతో గత్వా యమునాసంగమం తతః. 15

మొదట సముద్రమున స్నానము చేసి తరువాత గంగలో మునిగెను. పిదప సరస్వతి కరిగి మరల యమునా సంగమస్థానమున తానమాడెను.

శతద్రూం చ తతో గత్వా దేవికాం చ మహానదీమ్‌,

వితస్తాం చన్ధ్రభాగాం చ గోమతీం సింధు మేవ చ,

తుఙ్గభద్రాం తథా గోదా ముత్తరే గణ్డకీం తథా. 16

శతద్రువు, దేవిక, మహానది, వితస్త, చంద్రభాగ, గోమతి, సింధువు, తుంగభద్ర, గోదావరి, గండకి అనునదులలో స్నానమాడెను.

ఊర్థ్వగం తు తతో గత్వా గతో రుద్రమహాలయమ్‌,

తతో దారువనం గత్వా కేదారగమనం పునః. 17

పిదప పై సీమలకు వెళ్లెను. రుద్రమహాలయము, దారువనము, కేదారము మొదలగుతీర్థములను సేవించెను.

భ##ద్రేశ్వరం తతో గత్వా గయాం పున రథాగమత్‌,

గయాం గత్వా కృతస్నానః పితౄన్‌ సంతర్వ్య యత్నతః. 18

పశ్చాద్‌ వేగేన సకలం బ్రహ్మాండం భూతధారిణి,

బభ్రామ సర్వదేవేశః షష్ఠేబ్దే తస్య చాపతత్‌. 19

భ్రమతః పరిధానం తు కౌపీనం రశనాగతమ్‌,

తస్మింస్తు పతితే దేవి నగ్నః కాపాలికోభవత్‌. 20

భ##ద్రేశ్వరమున కరిగి గయకు పోయెను. గయకరిగి స్నానము చేసి యత్నముతో పితృదేవతలకు తర్పణముచేసెను. పిదప వేగముగా సకల బ్రహ్మాండమును చుట్టివచ్చెను. ఇట్లాతడు తిరుగుచుండగా ఆరవఏట ఆతని నడుమున నున్న గోచిగుడ్డ జారిపడెను. దేవీ! అదిపడగా ఆతడు దిగంబరుడు ఆయెను. ఆవిధముగా కాపాలికుడు ఆయెను.

పునరబ్ద ద్వయం భ్రాన్తో బ్రహ్మాండం తీర్థకారణాత్‌,

తీర్థే తీర్థే హరః స్నాత్వా కపాలం త్యక్తు మైచ్ఛత,

త్యజతోపి న తద్ధస్తా చ్చ్యవతే తస్య ధారిణి. 21

ప్రతితీర్థమునందును హరుడు స్నానముచేసి పుఱ్ఱను వదలించుకొనగోరెను. కాని అది అతనినుండి జారిపోకున్నది.

తతోన్యద్‌ వర్షమేకం తు వర్తతే హిమవద్గిరౌ,

భ్రమతో బభ్రూతా జాతా త్రి నేత్రస్య మహాత్మనా. 22

పిమ్మట మహాత్ముడగు ముక్కంటి ఒక్కఏడుకాలము హిమవత్పర్వతమున తిరిగెను. అట్లు తిరుగుచుండగా ఆతనికి కపిలవర్ణము కలిగెను.

పున రబ్దద్వయం చాన్యత్‌ పరమేష్ఠీ వృషాకపిః,

బభ్రామ రుద్ర స్తీర్థాని పురాణాని సమన్తతః. 23

మరల రెండేండ్లు పరమేష్ఠి, వృషాకపియగు రుద్రుడు పురాణములగు తీర్థములన్నింటిని చుట్టి వచ్చెను.

కస్యచిత్త్వథ కాలస్య ద్వాదశేబ్దే ధరాధరే,

వారాణసీం గతో దేవ స్తత్ర స్నాన మథాకరోత్‌. 24

అంతకొంతకాలమునకు పండ్రెండవయేట ఆ దేవుడు వారాణసి కరిగి అచట స్నానమాచరించెను.

గంగాయాం దేవదేవేశో యావన్మజ్జతి భామిని,

తావత్కపాలం పతితం యల్లగ్నం బ్రహ్మణః పురా. 25

దేవదేవుడు గంగయందు మునిగినవెంటనే మునుపు తగులు కొనిన బ్రహ్మకపాలము జారిపడెను.

కపాల మోచనం నామ తత స్తీర్ధ మనుత్తమమ్‌,

పృథివ్యాం ఖ్యాతి మగమద్‌ వారాణస్యాం ధరాధరే. 26

భూదేవీ! అంతటినుండి కాశీనగరమునందలి ఉత్తమమగు ఆ తీర్థము భూమిలో కపాలమోచనమను ఖ్యాతి గడించెను.

కపాలం పతితం దృష్ట్వా రుద్రహస్తా చ్చతుర్ముఖః,

ఆగతో దేవసహితో వాక్యం చేదమువాచ హ. 27

రుద్రుని చేతినుండి పడినకపాలమును చూచి బ్రహ్మ దేవతలతోపాటుగా వచ్చి ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను.

భవ రుద్ర విరూపాక్ష లోకమార్గే వ్యవస్థితః,

వ్రతాని కురు దేవేశ త్వచ్చీర్ణాని మహాప్రభో. 28

భవా!రుద్రా! విరూపాక్షా! లోకమార్గమున మనసున్నవాడవై వ్రతములను ఆచరింపుము. మహాప్రభూ! ఈవ్రతములు లోకమునకు ఉపయోగపడును.

కపాలం గృహ్య యద్‌ భ్రాన్తం కౌపీనేన సమన్వితః,

తన్మహావ్రతసంజ్ఞం తు మనుష్యాణాం భవిష్యతి. 29

నీవు పుఱ్ఱనుగొని గోచితో తిరిగితివి. అది మనుజులకు మహావ్రతమను పేరుగలది యగును.

నగ్నేన భూత్వా యద్‌భ్రాంతం కపాలవ్యగ్రపాణినా,

తద్ర్వతం నగ్నకాపాలం భవిష్యతి నృణాం భువి. 30

బట్టలులేక కపాలమును శ్రద్ధగా చేతనుంచుకొని తిరిగితివి. అది నగ్నకాపాలిక వ్రతముగా మనుష్యుల కగును.

యచ్చ తే బభ్రూతా జాతా హిమవత్యచలోత్తమే,

భ్రమత స్తద్‌ వ్రతం దేవ బాభ్రవ్యం తే భవిష్యతి. 31

నీకు హిమపర్వతమున తిరుగుచుండగా ఒక విధమగు ఎరుపు వన్నె కలిగినది. దేవా! అది బాభ్రవ్యమను వ్రతమగును.

యచ్చేదానీం విశుద్ధస్య తీర్థేస్మిన్‌ దేహశుద్ధతా,

తచ్ఛుద్ధశైవం భవతు వ్రతం తే పాపనాశనమ్‌. 32

ఇప్పుడు ఈ తీర్థమున విశుద్ధుడవగు నీకు దేహశుద్ధత ఏర్పడినది. పాపనాశనమగు ఆ వ్రతము 'శుద్ధశైవము' అగును.

మాం పురస్కృత్య దేవాస్త్వాం పూజ్యన్తే వివిధా న్యుత,

శాస్త్రాణి తాని సర్వేషాం కథయిష్యసి నాన్యథా. 33

నన్ను పురస్కరించుకొని దేవతలు నిన్ను పెక్కు విధములుగా పూజింతురు. ఆ అన్నింటి శాస్త్రములను నీవే చెప్పగలవు. మరొకపద్ధతి లేదు.

వ్రతాని కురుతే దేవ త్వత్కృతాని హి పుత్రక,

స త్వత్ర్పసాద్‌ దేవేశ బ్రహ్మహాపి విశుధ్యతి. 34

కుమారా! నీవు చేసినవ్రతములన్నింటిని చేయువాడు నీ ప్రసాదము వలన బ్రహ్మహత్య చేయువాడైనను పరిశుద్ధుడగును.

యద్వ్రతం నగ్నకాపాలం యద్‌ బాభ్రవ్యం త్వయా కృతమ్‌,

యత్‌కృతం శుద్ధశైవం చ తత్తన్నామ్నా భవిష్యతి. 35

నగ్నకాపాలము, బాభ్రవ్యము, శుద్ధశైవము అను వ్రతములను చేయువారు ఆ యానామములు కలవారగుదురు.

మాం పురస్కృత్య దేవం త్వాం పూజ్యతే యో విధానతః,

తేషాం శాస్త్రాణి సర్వాణి శాస్త్రం పాశుపతం తథా,

కథయస్వ మహాదేవ సవిధానం సమాసతః. 36

దేవా! నన్నుముందుంచు కొని విధానము ననుసరించి నిన్ను అర్చించువారికి ఆ శాస్త్రములన్నింటిని, అట్లే పాశుపతశాస్త్రమును విధానపూర్వకముగా మహాదేవా! ఉపదేశింపుము.

ఏవముక్త స్తతో రుద్రో బ్రహ్మణా వ్యక్త మూర్తినా,

దేవై ర్జయేతి సంతుష్టః కైలాసనిలయం య¸°. 37

తెలియరాని ఆకృతిగల బ్రహ్మ యిట్లు పలుకగా రుద్రుడు సంతుష్టుడై, దేవతలు

జయజయనాదములు చేయుచుండగా, కైలాస నిలయమున కరిగెను.

బ్రహ్మా అపి సురైః సార్ధం గతః స్వం లోకముత్తమమ్‌,

దేవా అపి యయుః సర్వే యథాగత ముపాగతాః. 38

బ్రహ్మయు దేవతలతో పాటు తన ఉత్తమలోకమున కరిగెను. అట నుండి దేవత లందరును వచ్చిన మార్గమున తమ నెలవులకరిగిరి.

ఏతద్‌ రుద్రస్య మాహాత్మ్యం మయా సంపరికీర్తితమ్‌,

చరితం యచ్చ దేవస్య వ్రతం సమభవద్‌ భువి,

కోన్యన్త్యభ్యధికంతస్య ముక్త్వా నారాయణం ప్రభుమ్‌. 39

భూదేవీ! ఇది రుద్రునిమహాత్మ్యము. నేను చక్కగా వివరించి చెప్పితిని. దేవుని చరితము, వ్రతము భూమియందు ఎట్లేర్పడెనో వివరించితిని. ఆ రుద్రునికంటె మిన్నయగువాడు, నారాయణ ప్రభువు ఒక్కడుతక్క, ఎవ్వడు కలడు?

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే షణ్ణవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబది ఆరవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters