Varahamahapuranam-1    Chapters   

సప్తసప్తతితమోధ్యాయః - డెబ్బది ఏడవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

యదేతత్‌ కర్ణికామూలం మేరో ర్మధ్యం ప్రకీర్తితమ్‌,

తద్‌ యోజన సహస్రాణి సంఖ్యయా మానతః స్మృతమ్‌. 1

ఆ పద్మపు దుద్దు మొదలు మేరువు నడిమి భాగమనియు, దాని కొలత వేల యోజనములనియు ననుకొంటిమి.

చత్వారింశత్‌ తథా చాష్టౌ సహస్రాణి తు మండలైః,

శైలరాజస్య తత్త్రత్ర మేరుమూలమితి స్మృతమ్‌. 2

దాని చుట్టుకొలత నలుబడి యెనిమిది వేల యోజనములు. అది పర్వత రాజమగు మేరువునకు మూలముగా భావింప బడినది.

తేషాం గిరిసహస్రాణా మనేకానాం మహోచ్ఛ్రయః,

దిగష్టౌ చ పునస్తస్య మర్యాదా పర్వతాః శుభాః. 3

అచట నున్న వేలకొలది పర్వతముల ప్రమాణము మిక్కిలి గొప్పది. మరియు ఎనిమిది దిక్కులలో ఎనిమిది సరిహద్దు కొండలు కలవు.

జఠరో దేవకూటశ్చ పూర్వస్యాం దిశి పర్వతౌ,

పూర్వపశ్చాయతా వేతా వర్ణవాంత ర్వ్యవస్థితౌ,

మర్యాదాపర్వతా వేతానష్టా నాహుర్మనీషిణః. 4

వీనిలో తూర్పున జఠరము, దేవకూటము అని రెండు పర్వతములు కలవు. ఇవి తూర్పు పడమరలుగా వ్యాపించి సముద్రములోనికి చొచ్చుకొని పోయి యున్నవి. ఈ మర్యాదా పర్వతము లెనిమిదిగా మేధావులు అభివర్ణింతురు.

యో7సౌ మేరు ర్ద్విజశ్రేష్ఠాః ప్రోక్తః కనకపర్వతః,

విష్కంభాం స్తస్య వక్ష్యామి శృణుధ్వం గదత స్తు తాన్‌. 5

బ్రాహ్మణవరేణ్యులారా! బంగారుకొండగా ప్రసిద్ధి కెక్కిన ఆ మేరుపర్వత విష్కంభములను గూర్చి చెప్పుదును. వినుడు.

మహాపాదాస్తు చత్వారో మేరో రథ చతుర్దిశమ్‌;

యై ర్న చచాల విష్టబ్ధా సప్తద్వీపవతీ మహీ. 6

ఆ మేరు పర్వతమునకు నాలుగు దిక్కులందును నాలుగు మహాపాదములు కలవు. అవి తన్ని పట్టుకొని యుండగా ఏడు ద్వీపములు గల భూమి కదలకుండినది.

దశయోజన సాహస్రం వ్యాయామ స్తేషు శఙ్క్యతే,

తిర్యగూర్థ్వం చ రచితా హరితాలతటై ర్వృతాః. 7

ఆ విష్కంభముల నడిమి ప్రదేశము అడ్డముగా, ఎత్తుగా పదివేల యోజనములని ఊహ. అవి హరితాళ వృక్షములు గల ఒడ్డులతో క్రమ్ముకొని యున్నవి.

మనః శిలాదరీభిశ్చ సువర్ణమణి చిత్రితాః,

అనేకసిద్ధభవనైః క్రీడాస్థానైశ్చ సుప్రభాః. 8

వాని చరియలు మణిశిలలతో రంగు రంగుల మణులతో, పెక్కు సిద్ధ భవనములతో, క్రీడా స్థానములతో గొప్ప కాంతులు కలిగి యున్నవి.

పూర్వేణ మన్దర స్తస్య దక్షిణ గంధమాదనః,

విపులః పశ్చిమే పార్శ్వే సుపార్శ్వశ్చోత్తరే స్థితః. 9

దానికి తూర్పున మందరము, దక్షిణమున గంధమాదనము, పడమటిదిక్కున విపులము, ఉత్తరమున సుపార్శ్వము అనుకొండలు కలవు.

తేషాం శృంగేషు చత్వారో మహావృక్షాః ప్రతిష్ఠితాః,

దేవ దైత్యాప్సరోభిశ్చ సేవితా గుణ సంచయైః. 10

వాని శిఖరములందు నాలుగు మహావృక్షములున్నవి. దేవతలు, దైత్యులు, అప్సరసలు ఆ చెట్ల గుణముల మొత్తములచేత అచట విహరించుచుందురు.

మందరస్య గిరేః శృంగే కదంబో నామ పాదపః,

ప్రలంబశాఖాశిఖరః కదంబ శ్చైత్యపాదపః. 11

మందరగిరి కొమ్మున బాగుగా వ్రేలాడు కొమ్మల చివరలు గల కదంబమను వృక్షము కలదు.

మహాకుంభ ప్రమాణౖశ్చ పుషై#్ప ర్వికచకేసరైః,

మహాగంధమనోజ్ఞైశ్చ శోభితః సర్వకాలజైః. 12

సమాసేన పరివృతో భువనై ర్భూతభావనైః,

సహస్ర మధికం సో7థ గంధే నాపూరయన్‌ దిశః. 13

విప్పారిన కేసరములు గల దాని పూవులు పెద్ద కుండలంత ప్రమాణములో నుండును. సర్వకాలములలో పూచును. గొప్ప పరిమళముతో మనోహరములై యుండును. సర్వ ప్రాణులకు ఉల్లాసమును కలిగించు భూభాగములతో ఆ చెట్టు గంధములతో దిక్కులను నింపుచు విరాజిల్లును. అట్టి చెట్టుగల మండలములు వేయికంటె అధికము.

భద్రాశ్వో నామ వృక్షో7యం వర్షాద్రేః కేతుసంభవః,

కీర్తిమాన్‌ రూపవాన్‌ శ్రీమాన్‌ మహాపాదప పాదపః,

యత్ర సాక్షా ద్ధృషీకేశః సిద్ధసంఘై ర్నిషేవ్యతే. 14

వర్షగిరి యను గంధమాదనమునందు భద్రాశ్వమను వృక్షముండును. అది ఆ కొండశిఖరమున పుట్టినది. మిక్కిలి ప్రసిద్ధి కలది. అందమైనది. శోభతో నిండినది, మహావృక్షములకంటె మిన్న. అక్కడ సాక్షాత్తు హృషీకేశుడు సిద్ధుల సంఘములతో కొలువు తీరి యుండును.

తస్య భద్రకదంబస్య తథాశ్వవదనో హరిః,

ప్రాప్తవాంశ్చామరశ్రేష్ఠః సహి సానుం పునః పునః. 15

గుఱ్ఱపుమోము గల విష్ణువు ఆ భద్రకదంబ వృక్షము గల పర్వతపు చరియను మాటి మాటికి చేరుచుండును.

తేన చాలోకితం వర్షం సర్వద్విపదనాయకాః,

యస్య నామ్నా సమాఖ్యాతో భద్రాశ్వేతి న సంశయః. 16

ఆ విధముగా భద్రకదంబమును చూచెడు అశ్వవదనుడు కలది కావున ఆ వర్షమును భద్రాశ్వమనుచుందురు. సంశయము లేదు.

దక్షిణస్యాపి శైలస్య శిఖరే దేవసేవితే,

జంబూః సద్యః పుష్పఫలా మహాశాఖోపశోభితా. 17

తస్యా హ్యతిప్రమాణాని స్వాదూని చ మృదూని చ,

ఫలాన్యమృతకల్పాని పతంతి గిరిమూర్ధని. 18

దేవతలు సేవించెడు దక్షిణగిరి శిఖరమందలి వృక్షము జంబువు. (నేరేడు) అప్పటికప్పుడు పూవులు కాయలు ఒసగు చుండును. పెనుకొమ్మలతో ఒప్పారు చుండును. దాని పండ్లు మిక్కిలి పెద్దవి, రుచి కలవి, మెత్తనివి, అమృతమున కెనయైనవి. కొండ కొమ్మున రాలుచుండును.

తస్మాద్‌ గిరవరశ్రేష్ఠాత్‌ ఫలప్రస్యన్ద వాహినీ,

దివ్యా జంబూనదీ నామ ప్రవత్తా మధు వాహినీ. 19

ఆ మేలైన పర్వతము నుండి ఆ పండ్ల రసముతో జాలువారెడు దివ్య నది జంబూనది తేనెలను స్రవింప జేయుచు పారుచుండును.

తత్ర జాంబూనదం నామ సువర్ణ మనల ప్రభమ్‌,

దేవాలంకార మతుల ముత్పన్నం పాపనాశనమ్‌. 20

మరియు దానియందు జాంబూనదమను బంగారము మంచివన్నె కలిగి అగ్ని జ్వాలవంటి కాంతితో నుండును. దేవతల కు అలంకారమైనది, పాపములను నశింప జేయునది యగు అది అచట పుట్టెను.

దేవ దానవ గంధర్వ యక్షరాక్షస గుహ్యకాః,

పపు స్తదమృత ప్రఖ్యం మధు జంబూఫలస్రవమ్‌. 21

దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు అమృతము వంటిది, నేరేండు పండ్ల నుండి జాలువారినది అగు ఆ తేనెను త్రావిరి.

సా కేతు ర్దక్షిణ వర్షే జంబూ ర్లోకేషు విశ్రుతా,

యస్యా నామ్నా సమాఖ్యాతా జంబూద్వీపేతి మానవైః. 22

దక్షిణ దేశమునకు పతాక వంటి ఆ జంబువు లోకములందు ప్రసిద్ధి కెక్కినది. దాని పేరుతోడనే ఆ దేశమును మానవులు జంబూ ద్వీపమని పిలుచు చున్నారు.

విపులస్య చ శైలస్య దక్షిణన మహాత్మనా,

జాతః శృంగేతి సుమహా నశ్వత్థశ్చేతి పాదపః. 23

గొప్పది యగు విపుల పర్వతమునకు దక్షిణమున మిక్కిలి పెద్దదియు ఒక కొండ కొమ్మా అన్నట్టిదియు నగు అశ్వత్థము (రావి) అను చెట్టు పుట్టినది.

మహోచ్ఛ్రయో మహాస్కంధో నైకసత్వగుణాలయః,

కుంభ ప్రమాణౖ రుచిరైః ఫలైః సర్వర్తుకైః శుభైః. 24

పెద్ద పరపు, గొప్ప మొదలు, పెక్కు మహాగుణములు గల ఆ చెట్టు పండ్లు కుండలంతంటివి. అన్ని ఋతువులలో కాయునవి. మేలైనవి.

స కేతుః కేతుమాలానాం దేవగంధర్వసేవితః,

కేతుమాలేతి విఖ్యాతో నామ్నా తత్ర ప్రకీర్తితః,

తన్నిబోధత విప్రేన్ద్రా నిరుక్తం నామకర్మణః. 25

ఆ వృక్షము కేతుమాల దేశములకు పతాక వంటిది. దేవతలు గంధర్వులు దానిని సేవింతురు. దానిని బట్టియే దానికి కేతుమాల మనుపేరు ప్రసిద్ధమైనది. నామకర్మములను బట్టి దాని నిర్వచనమును బ్రాహ్మణ ప్రవరులారా! తెలిసికొనుడు.

క్షీరోదమథనే వృత్తే మాలా స్కంధే నివేశితాః,

ఇన్ద్రేణ చైత్యకేతోస్తు కేతుమాల స్తతః స్మృతః,

తేన తచ్చిహ్నితం వర్షం కేతుమాలేతి విశ్రుతమ్‌. 26

పాలసముద్రమును మధించునపుడు ఇంద్రుడు తన చైత్యము పతాకను మాలలుగా భుజముపై నిలుపు కొనెను. అందుచేత ఆ వర్షము (దేశము) 'కేతుమాల' మని ప్రసిద్ధి కెక్కెను.

సుపార్శ్వస్యోత్తరే శృంగే వటో నామ మహాద్రుమః,

న్యగ్రోధో విపులస్కంధో యస్త్రియోజన మండలః. 27

సుపార్శ్యము ఉత్తరశృంగమున వటమను పెద్ద మఱ్ఱిచెట్టు కలదు. దాని మొదలు మిక్కిలి విశాలమైనది. దాని మండలము మూడు యోజనముల ప్రమాణము కలది.

మాల్యదామకలాపైశ్చ వివిధైస్తు సమంతతః,

శాఖాభి ర్లంబమానాభిః శోభితః సిద్ధసేవితః. 28

పెక్కు విధములైన మాలలు సముదాయములతో, మిక్కిలిగా వ్రేలాడు కొమ్మలతో అది అలరారు చుండును. సిద్ధులు దానిని సేవించు చుందురు.

ప్రలంబకుంభ సదృశై ర్హేమవర్ణైః ఫలైః సదా,

సహ్యుత్తరకురూణాం తు కేతువృక్షః ప్రకాశ##తే. 29

వ్రేలాడు కుంభముల వంటి, బంగారు వన్నెకల పండ్లతో ఆ న్యగ్రోధము ఉత్తర కురుభూములకు పతాకా వృక్షముగా ప్రకాశించు చుండును. (న్యగ్రోధము - మఱ్ఱిచెట్టు)

సనత్కుమారావరజా మానసా బ్రహ్మణః సుతాః,

సప్త తత్ర మహాభాగాః కురవో నామ విశ్రుతాః. 30

సనత్కుమారుని తమ్ములు, బ్రహ్మ మానసపుత్రులు ఏడుగురు మహానుభావులు కురువులను వారు అచట ప్రసిద్ధికెక్కిరి.

తత్ర స్థిరగతై ర్జాఞనై ర్విరజసై#్క ర్మహాత్మభిః,

అక్షయః క్షయపర్యన్తో లోకః ప్రోక్తః సనాతనః. 31

తేషాం నామాఙ్కితం వర్షం సప్తానాం వై మహత్మనామ్‌,

దివి చేహ చ విఖ్యాతా ఉత్తరాః కురవః సదా. 32

అందు స్థిరమైన గతి గలవారు, జ్ఞానులు, ఏ పాపము నెరుగని వారు, మహాత్ములు ఉందురు. ప్రళయకాలము వరకు చెడనిది, సనాతనము అగు లోకముగా వారి స్థావరము ప్రసిద్ధి కెక్కినది. స్వర్గము నందును, భూమి యందును ఉత్తర కురువులుగా ఎల్లవేళల కీర్తింప బడునది.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తసప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బది ఏడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters