Varahamahapuranam-1    Chapters   

పంచసప్తతితమోధ్యాయః - డెబ్బది యైదవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

అతఊర్ధ్వం ప్రవక్ష్యామి జంబూద్వీపం యథాతథమ్‌,

సంఖ్యా చాపి సముద్రాణాం ద్వీపానాం చైవ విస్తరమ్‌. 1

ఇటుపై జంబూద్వీపమును, అందలి సముద్రములను, ద్వీపములను గూర్చి విస్తరముగా ఉన్నదున్నట్లుగా చెప్పెదను.

యావన్తి చైవ వర్షాణి తేషు సద్యశ్చ యాః స్మృతాః,

మహాభూత ప్రమాణం చ గతిం చంద్రార్కయోః పృథక్‌. 2

ద్వీపభేద సహస్రాణి సప్త స్వంతర్గతాని చ,

న శక్యన్తే క్రమేణహ వక్తుం యై ర్వితతం జగత్‌. 3

సప్తద్వీపాన్‌ ప్రవక్ష్యామి చంద్రాదిత్యగ్రహైః సహ,

యేషాం మనుష్యా స్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే. 4

అందలి వర్షములు (దేశములు), నదులు, మహాభూతముల ప్రమాణము, సూర్యచంద్రుల గతి, ఏడు ద్వీపములలో నున్న వేలకొలదిగా నున్న ద్వీపముల భేదములు మొదలగు విధముగా విస్తరిల్లిన వానిని గురించి క్రమముగా చెప్పుటకు సాధ్యము కాదు. చంద్రుడు, ఆదిత్యుడు మొదలగు గ్రహములతోపాటు ఏడు ద్వీపములను గూర్చి వివరించి చెప్పెదను. ఈ ప్రమాణము లన్నింటిని మనుష్యులు తర్కముతో (ఊహతో) మాత్రమే చెప్పగలరు.

అచిన్త్యాః ఖలు యే భావాః న తాంస్తర్కేణ సాధయేత్‌,

ప్రకృతిభ్యః పరం యచ్చ తదచిన్త్యం విభావ్యతే. 5

ఊహ కందని భావములను తర్కముతో సాధింప జాలము. ప్రకృతుల కంటె అతీతమైన దానిని అచింత్యముగా భావింతురు.

నవవర్షం ప్రవక్ష్యామి జంబూద్వీపం యథాతథమ్‌,

విస్తరాన్మండలాచ్చైవ యెజనై స్తన్నిబోధత. 6

తొమ్మిది వర్షములు గల జంబూద్వీపమును గూర్చి విస్తరమును, మండల స్వరూపము, యోజనముల కొలత మొదలగు వానితో ఉన్నదున్నట్లు చక్కగా చెప్పెదను.

శతమేకం సహస్రాణాం యోజనానాం సమస్తతః,

నానాజనపదాకీర్ణం యోజనై ర్వివిధైః శుభైః. 7

సర్వధాతు వివృద్ధైశ్చ శిలాజలసముద్భవైః,

పర్వత ప్రభవాభిశ్చ నదీభిః సర్వత శ్చితమ్‌. 8

జంబూద్వీపః పృథుః శ్రీమాన్‌ సర్వతః పరిమండలః,

సవభి శ్చావృతః శ్రీమాన్‌ భువనై ర్భూతభావనః. 9

ఒక వంద వేల యోజనముల కొలత కలది. పెక్కు జనపదములతో నిండినది, శిలల సముదాయములనుండి పుట్టిన అన్ని విధములగు ధాతువులతో కూడిన పర్వతములతో ఇంపైనది. పర్వతముల నుండి జాలు వారిన నదులతో వ్యాప్తమైన ఇట్టి జంబూ ద్వీపము మిక్కిలి విశాలము, శోభ కలది, సంపద కలదియునై తొమ్మిది దేశములతో ఆవృతమై పెద్దగా నున్నది.

లవణన సముద్రేణ సర్వతః పరివారితః,

జంబూద్వీపస్య విస్తారాత్‌ సమేన తు సమన్తతః. 10

జంబూద్వీపమంత వైశాల్యము కల ఉప్పు సముద్రము దానిని అన్నివైపుల చుట్టుకొని యున్నది.

తస్య ప్రాగాయతా దీర్ఘా షడేతే వర్షపర్వతాః,

ఉభయ త్రావగాఢాశ్చ సముద్రౌ పూర్వపశ్చిమౌ. 11

హిమప్రాయశ్చ హిమవాన్‌ హేమకూటశ్చ హేమవాన్‌,

సర్వత్ర సుసుఖ శ్చాపి నిషధః పర్వతో మహాన్‌. 12

చతుర్వర్ణః స సౌవర్ణో మేరు శ్చోల్బమయో గిరిః.

వృత్తాకృతి ప్రమాణశ్చ చతురస్రః సముచ్ఛ్రితః. 13

దానికి తూర్పున వెడల్పు, పొడవు గల ఆరు వర్ష పర్వతములు గలవు. (హద్దులుగా ఉన్న పర్వతములు) రెండు వైపుల తూర్పు పడమర సముద్రములు చుట్టుకొని యున్నవి. మంచు అధికముగా గల హిమవంతము, బంగారము మిక్కుటముగా గల హేమకూటము, అంతట మిక్కిలి సుఖమును కూర్చు పెద్దదియగు నిషధము, నాలుగు రంగులు గలది, బంగారుతో నిండినది, ఱాలబిగువు గలది, గుండ్రని ఆకారము, చతురస్రమగు పై భాగము కల మేరు పర్వతము అందు కలవు.

నానావర్ణస్తు పార్శ్వేషు ప్రజాపతిగుణాన్వితః,

నాభిమండలసంభూతో బ్రహ్మణః పరమేష్ఠినః. 14

మరియు ఆ పర్వతము ప్రక్క భాగముల యందు పెక్కు వర్ణములు కలదియై ప్రజాపతి గుణములతో కూడినదై, పరమేష్ఠి యగు బ్రహ్మ బొడ్డు భాగము నుండి పుట్టినదై యుండెను.

పూర్వతః శ్వేతవర్ణస్తు బ్రాహ్మణ్యం తేన తస్య తత్‌,

పీతశ్చ దక్షిణనాసౌ తేన వైశ్యత్వ మిష్యతే. 15

భృంగపత్ర నిభశ్చాసౌ పశ్చిమేవ యతోథ సః,

తేనాస్య శూద్రతా ప్రోక్తా మేరో ర్నామార్థ కర్మణః. 16

పార్శ్వముత్తరత స్తస్య రక్తవర్ణం విభావ్యతే,

తేనాస్య క్షత్రభావః స్యా దితివర్ణాః ప్రకీర్తితాః. 17

తూర్పు దిక్కున అది తెల్లని వర్ణము కలిగి యుండెను. దాని చేత దాని బ్రామ్మణత్వము తెలియవచ్చును. దక్షిణమున పసుపురంగు వలన వైశ్వత్వము వ్యక్తమగును. పడమటి భాగమున తుమ్మెదరెక్కల వంటి రంగు కలదు. దానిచేత పేరు, ప్రయోజనము, పని అను వానిని సూచించు ఆ మేరువునకు శూద్రతయు చెప్పబడినది. ఉత్తర పార్శ్వమున ఎరుపు రంగు కానవచ్చును. దానిచేత క్షత్రియ భావము ఎరుగ నగును. ఇట్లు దాని రంగులను గూర్చి చెప్పుచుందురు.

వృత్తః స్వభావతః ప్రోక్తో వర్ణతః పరిమాణతః,

నీలశ్చ వైదూర్యమయః శ్వేతశుక్లో హరణ్మయః,

మయూరబర్హి వర్ణస్తు శాతకుంభై శ్చ శృంగవాన్‌. 18

ఇంక అయిదవది యగు నీలము స్వభావమును బట్టి గుండ్రని ఆకారము కలది. రంగును బట్టి నీలము, గొప్ప కొలత కలది, దానినిండ వైడూర్యము లుండును. ఆరవ హిరణ్మయ పర్వతము తెలుపు ఎరుపుల కలనేత రంగులో నుండును. నెమలి పింఛము వంటి వన్నె కలిగి యుండును. బంగారు కొమ్ములతో నుండును.

ఏతే పర్వతరాజానః సిద్ధచారణ సేవితాః,

తేషామంతర విష్కంభో నవసాహస్ర ఉచ్యతే. 19

ఈ గొప్ప కొండలు సిద్ధులు, చారణులు మొదలగు దేవజాతులకు నివాసములు. వాని మధ్య భాగపు వైశాల్యము తొమ్మిది వేల యోజనములు.

మధ్యే త్విలావృతం నామ మహామేరోః ససంభవః,

నవైవ తు సహస్రాణి విస్తీర్ణః సర్వతశ్చ సః. 20

మహామేరువునకు నడిమి భాగమున ఇలావృతమను దేశము కలదు. అది తొమ్మిదివేల యోజనములు వ్యాపించి యున్నది.

మధ్యం తస్య మహామేరు ర్విధూమ ఇవ పావకః,

వేద్యర్థం దక్షిణం మేరో రుత్తరార్ధం తథోత్తరమ్‌. 21

ఈ మహామేరువు మధ్య భాగము పొగలేని నిప్పు వలె కన్పట్టును. మేరువునకు దక్షిణముగా సగము, ఉత్తరముగా సగము పీఠభూమి కలదు.

వర్షాణి యాని షడత్ర తేషాంతే వర్ష పర్వతాః,

యోజనాగ్రం తు వర్షాణాం సర్వేషాం తద్‌ విధీయతే. 22

ఇందు ఆరు దేశములు కలవు. వాని కారు వర్ష పర్వతములు కలవు. అన్ని దేశములకు యోజనము మేర అవి వ్యాపించి యున్నవి.

ద్వేద్వే వర్షే సహస్రాణాం యోజనానాం సముచ్ఛ్రయః,

జంబూద్వీపస్య విస్తార స్తేషా మాయామ ఉచ్యతే. 23

రెండు రెండు దేశముల విస్తారము వేల కొలది యోజనములతో ఉన్నది. ఆ దేశముల విస్తీర్ణము, పొడవు జంబూ ద్వీపపు కొలత యగును.

యోజనానాం సహస్రాణి శ##తే ద్వే చాయతే గిరీ,

నీలశ్చ నిషధ శ్చైవ తాభ్యాం హీనాశ్చ యే పరే,

శ్వేతశ్చ హేమకూటశ్చ హిమవాన్‌ శృంగవాంశ్చ యః. 24

నీలము, నిషధము అను రెండు కొండలు రెండు నూర్లవేల యోజనముల పొడవు కలవి. తక్కిన శ్వేతము, హేమకూటము, హిమవంతము, శృంగవంతము అనునవి వానికంటె తక్కువ కొలత కలవి.

జంబూద్వీప ప్రమాణన నిషధః పరికీర్తితః,

తస్మాద్‌ ద్వాదశభాగేన హేమకూటః ప్రహీయతే,

హిమవాన్‌ వింశభాగేన హేమకూటాత్‌ ప్రహీయతే. 25

నిషధ పర్వతము జంబూ ద్వీపమంతటిదని ప్రసిద్ధి కెక్కినది. హేమకూటము దానికంటె పండ్రెండవ భాగము తక్కువది. హిమవంతము హేమకూటముకంటె ఇరువదవ భాగము తక్కువైనది.

అష్టాశీతి సహస్రాణి హేమకూటో మహాగిరిః,

అశీతి ర్హిమవాన్‌ శైల ఆయతః పూర్వపశ్చిమే. 26

తూర్పు పడమరలుగా హేమకూట మహాపర్వతము ఎనుబది ఎనిమిది యోజనముల పొడవు కలది. హిమవంతము ఎనుబది యోజనముల పొడవైనది.

ద్వీపస్య మండలీభావాద్‌ హ్రాసవృద్ధీ ప్రకీర్త్యతే,

వర్షాణాం పర్వతానాం చ యథాచేమే తథోత్తరమ్‌. 27

ద్వీపము మండలాకారముగా ఉన్న కారణమున ఈ దేశములకు, ఆ పర్వతములకును హెచ్చు తగ్గులు కలుగు చుండునని చెప్పు కొందురు.

తేషాం మధ్యే జనపదా స్తాని వర్షాణి చైవ తత్‌,

ప్రసాత విషమై సై#్తస్తు పర్వతై రావృతాని తు. 28

ఆ కొండల నడుమ పెక్కు జనపదములు గల దేశములు కలవు. జలపాతములతో విషమ స్వరూపములు గల కొండలును ఆవరించి యున్నవి.

సంతతాని నదీభేదై రగమ్యాని పరస్పరమ్‌,

వసన్తి తేషు సత్వాని నానాజాతీని సర్వశః. 29

పెక్కు తీరులు గల నదులు వ్యాపించి యుండగా ఆ దేశములు ఒకదాని కొకటి ప్రవేశించి నలవి కానివై యున్నవి. అందు అన్నియెడల పెక్కు జాతుల జంతువులను నివసించును.

ఏతద్ధైమవతం వర్షం భారతీ యత్ర సంతతిః,

హేమకూటం పరం యత్ర నామ్నా కింపురుషోత్తమః. 30

హైమవత వర్షమున భారతజాతి జనులును, హేమకూట వర్షమున కింపురుష జాతి జనులును కలరు.

హేమకూటాత్‌తు నిషధం హరివర్షం తదుచ్యతే,

హరివర్షాత్‌ పరం చైవ మేరు పార్శ్వ ఇలావృతమ్‌. 31

ఇలావృతాత్‌ పరం నీలం రమ్యకం నామ విశ్రుతమ్‌,

రమ్యకాచ్చ పరం శ్వేతం విశ్రుతం తద్ధిరణ్మయమ్‌,

హిరణ్మయాత్‌ పరంచైవ శృంగవంతం కురు స్మృతమ్‌. 32

హేమకూటమున కావల నిషధము కలదు. దానినే హరివర్షమనియు నందురు. మేరువు ప్రక్కగా హరివర్షమున కావల ఇలావృతము కలదు. దాని కావల నీలము. దానికి రమ్యకమనియు ప్రసిద్ధి. రమ్యకము దాటిన తరువాత శ్వేతము. దానిని హరణ్మయ మనియు నందురు. హిరణ్మయమున కవతల నున్నది శృంగవంతము. దానిని కురు దేశమనియు నందురు.

ధనుః సంస్థే తు ద్వేవర్షే విజ్ఞేయే దక్షిణోత్తరే,

ద్వీపాని ఖలు చత్వారి చతురస్ర మిలావృతమ్‌. 33

దక్షిణముగా ఉత్తరముగా నున్న రెండు దేశములు వింటివలె నుండును. అందు నాలుగు ద్వీపములు కలవు. ఇట్టి ఇలావృతము చతురస్రాకారముగా నుండును.

అర్వాక్‌ చ నిషధస్యాథ వేద్యర్ధం దక్షిణం స్తృతమ్‌,

పరం శృంగవతో యచ్చ వేద్యర్ధం హి తదుత్తరమ్‌. 34

నిషధమునకు దక్షిణముగా నున్న పీఠభూమి సగము దక్షిణ భూమిగా, శృంగవంతమునకు పరముగా నున్న సగము భూమి ఉత్తర భూమిగా గుర్తింతురు.

వేద్యర్ధే దక్షిణ త్రీణి వర్షాణి త్రీణి చోత్తరే,

తయోర్మధ్యే తు విజ్ఞేయో యత్ర మేరు స్త్విలావృతః. 35

దక్షిణమున నున్న వేది యందు సగమున మూడు దేశములు, ఉత్తరమున మూడు దేశములు కలవు. వాని నడుమ నున్నదియే ఇలావృతమని తెలియదగును.

దక్షిణన తు నీలస్య నిషధస్యోత్తరేణ చ,

ఉదగాయతో మహాశైలో మాల్యవాన్నామ పర్వతః. 36

యోజనానాం సహస్రే ద్వే విష్కంభోచ్ఛ్రయ ఏవచ,

ఆయామత శ్చతుస్త్రింశత్‌ సహస్రాణి ప్రకీర్తితః. 37

నీలమునకు దక్షిణముగా, నిషధమునకు ఉత్తరముగా ఉత్తరము వైపు పొడవుగా నున్న మహాశైలము మాల్యవంతము. దాని వెడల్పు, ఎత్తులు రెండువేల యోజనములు. పొడవు ముప్పది నాలుగు వేల యోజనములు.

తస్య ప్రతీచ్యాం విజ్ఞేయః పర్వతో గంధమాదనః,

ఆయామోచ్ఛ్రయ విస్తారాత్‌ తుల్యోమాల్యవతా తు సః. 38

దానికి పడమరగా గంధమాదన పర్వతము కలదు. ఎత్తు, వెడల్పు, పొడవులతో అది మాల్యవంతమునకు సాటియైనది.

పరిమండల స్తయో ర్మధ్యే మేరుః కనక పర్వతః,

చతుర్వర్ణ ససౌవర్ణ శ్చతురస్రః సముచ్ఛ్రితః. 39

ఆ రెండు కొండల నడుమ నాలుగు వర్ణములు కలదియు. స్వర్ణమయమైనదియు నాలుగు కోణములు కలదియు, మిక్కిలి ఎత్తైనదియు నగు బంగారు కొండ మేరువు ఆవరించుకొని యున్నది.

అవ్యక్తా ధాతవః సర్వే సముత్పన్నా జలాదయః,

అవ్యక్తాత్‌ పృథివీపద్మం మేరు స్తస్య చ కర్ణికా. 40

చతుష్పత్రం సముత్పన్నం వ్యక్తం పఞ్చగుణం మహత్‌,

తతః సర్వాః సముద్భూతా వితతా హి ప్రవృత్తయః. 41

వ్యక్తము కాని నీరు మొదలగు ధాతువు లన్నియు పుట్టినవి. అవ్యక్తము నుండి మేరువు దుద్దుగా గల భూమి యనెడు పద్మము నాలుగు రేకులతో పుట్టినది. అది అయిదు గుణములు గల మహత్తుగా ఏర్పడినది. దాని నుండి సకల విధములగు ప్రవృత్తులు ఏర్పడినవి. (చతుష్పత్రమ్‌ - నాలుగు రేకులు - (1) వాసుదేవ (2) సంకర్షణ (3) ప్రద్యుమ్న (4) అనిరుద్ధ తత్వములు) (అయిదు గుణములు - శబ్ధ స్పర్శ రూప రసగంధములు)

అనేక కల్పజీవద్భిః పురుషైః పుణ్యకారిభిః,

కృతాత్మభి ర్మహాత్మభిః ప్రాప్యతే పురుషోత్తమః. 42

మహాయోగీ మహాదేవో జగద్ధ్యేయో జనార్దనః,

సర్వలోకగతోనన్తో వ్యాపకో మూర్తి రవ్యయః. 43

పెక్కు కల్పములు జీవించి యుండువారు, పుణ్యములు చేసినవారు. కృతాత్ములు, మహాత్ములు అగు పురుషులు, మహాయోగి మహాదేవుడు, జగత్తునకు ధ్యేయుడు, సర్వలోకములను వ్యాపించి యుండువాడు, అనంతుడు, వ్యాపకుడు, అవ్యయుడునగు పురుషోత్తముని పొందుదురు.

న తస్య ప్రాకృతా మూర్తి ర్మాంసమేదోస్థి సంభవా,

యోగిత్వా చ్చేశ్వరత్వాచ్చ సత్వరూపధరో విభుః. 44

ఆ పురుషోత్తమునకు ప్రాకృతమైన మూర్తి, మాంసము మేదస్సు, ఎముకలు అనువానితో ఏర్పడునది లేదు. యోగి యగుట వలనను, ఈశ్వరుడగుట వలనను ఆ విభుడు సత్వరూపమును తాల్చువాడు.

తన్నిమిత్తం సముత్పన్నం లోకే పద్మం సనాతనమ్‌,

కల్పశేషస్య తస్యాదౌ కాలస్య గతి రీదృశీ. 45

ఆతడు నిమిత్తముగా లోకమున సనాతనమగు పద్మము మిగిలిన కల్పపు శేషము నందును. మొదటి భాగము నందును పుట్టుచుండును. కాలపు గతి ఇట్టిది.

తస్మిన్‌ పద్మే సముత్పన్నో దేవదేవ శ్చతుర్ముఖః,

ప్రజాపతిపతి ర్దేవ ఈశానో జగతః ప్రభుః. 46

ఆ పద్మమునందు దేవదేవుడు, నలుమోముల దేవర, ప్రజాపతులకు పతి, ఈశానుడు, జగత్తునకు ప్రభువు అగు బ్రహ్మదేవుడు ఉదయించెను.

తస్య బీజ నిసర్గం హి పుష్కరస్య యథార్దవత్‌,

కృత్స్నం ప్రజానిసర్గేణ విస్తరేణౖవ వర్ణ్యతే. 47

ఆ పద్మము విత్తనము సృష్టియే సమస్త ప్రజల సృష్టిగా విస్తరముగా వర్ణింప బడుచున్నది.

తదంబు వైష్ణవః కాయో యతో రత్నవిభూషితః,

పద్మాకారా సముత్పన్నా పృథివీ సవనద్రుమా. 48

ఆ నీరు విష్ణుసంబంధమైన దేహము. రత్నములతో అలంకరింపబడినది. దాని నుండి పద్మపు ఆకారముతో, అడవులతో, చెట్లతో కూడిన భూమి పుట్టినది.

తత్‌ తస్య లోకపద్మస్య విస్తరం సిద్ధభాషితమ్‌,

వర్ణ్యమానం విభాగేన క్రమశః శృణుత ద్విజాః. 49

ఆ లోకపద్మపు విస్తారమును గూర్చి సిద్ధులు పలికి యున్నారు. విభాగములతో వారు చేసిన ఆ వర్ణనమును, బ్రాహ్మణులారా! క్రమముగా చెప్పెదను. వినుడు.

మహావర్షాణి ఖ్యాతాని చత్వార్యత్ర చ సంస్తితాః,

తత్ర పర్వతసంస్థానో మేరు ర్నామ మహాబలః. 50

అందు మహావర్షములు నాలుగు నెలకొని యున్నవి. అందు పర్వతముల కూర్పు మేరు వనునది గొప్ప బలము కలది.

నానావర్ణః సపార్శ్వేషు పూర్వతః శ్వేత ఉచ్యతే,

పీతం చ దక్షిణం తస్య భృంగవర్ణంతు పశ్చిమమ్‌. 51

ఉత్తరం రక్త వర్ణం తు తస్య పార్శ్వం మహాత్మనః,

మేరుస్తు శోభ##తే శుక్లో రాజవంశే తు ధిష్ఠితః. 52

ఆ మేరువు ప్రక్కభాగములంయందు పెక్కు వర్ణములు కలిగి యుండెను. తూర్పున తెలుపు, దక్షిణమున పసుపు, పడమర దిక్కున తుమ్మెదల రంగు, ఉత్తరమున ఎరుపు అనునవి వన్నెలు. కాని పర్వతముల రాజవంశ మందు నెలకొన్న మేరువు తెల్లనిదై ప్రకాశించు చుండును.

తరుణాదిత్యసంకాశో విధూమ ఇవ పావకః,

యోజనానాం సహస్రాణి చతురాశీతి రుచ్ఛ్రితః. 53

బాలసూర్యుని వలె ప్రకాశించుచు పొగలేని అగ్నివలె అలరారు చుండును. ఎనుబది నాలుగు వేల యోజనముల ఎత్తు కలదు.

ప్రవిష్టః షోడశాధస్తా ద్విస్తృతః షోడశైవ తు,

శరావసంస్థితత్వాచ్చ ద్వాత్రింశ న్మూర్థ్ని విస్తృతః. 54

దాని పాదు పదునారు యోజనముల లోతున కలదు. వైశాల్యము పదునారు యోజనములు, మూకుడు వలె ఉండుట వలన దానిపై భాగము ముప్పది రెండు యోనముల విస్తృతితో నుండును.

విస్తార స్త్రిగుణశ్చాస్య పరిణాహః సమన్తతః,

మండలేన ప్రమాణన వ్యస్యమానం తదిష్యతే. 55

దాని చుట్టుకొలత వెడల్పునకు మూడు రెట్లు. దాని వ్యాసము వృత్తాకారపు కొలతతో చూడదగినది.

నవతిశ్చ సహస్రాణి యోనానాం సమన్తతః,

తతః షట్కాధికానాం చ వ్యస్యమానం ప్రకీర్తితమ్‌,

చతురస్రేణ మానేన పరిగాహః సమన్తతః. 56

అన్ని వైపుల చుట్టుకొలత తొంబది వేల యోజనములు దాని వ్యాసము తొంబది ఆరు యోజనములు. చతురస్రపు కొలతతో దాని అన్ని వైపుల వైశాల్యము లెక్కకు వచ్చును.

స పర్వతో మహాదివ్యో దివ్యౌషధి సమన్వితః,

భవనై రావృతః సర్వో జాతరూపమయైః శుభైః. 57

ఆ పర్వతము మహా దివ్యమైనది, దివ్యమగు ఓషధులతో కూడినది. స్వర్గమయములగు చక్కని భవనములతో నిండినది

తత్ర దేవగణాః సర్వే గంధర్వోరగరాక్షసాః,

శైలరాజే ప్రమోదన్తే తథై వాప్సరసాం గణాః. 58

ఆ శైలరాజమున దేవతలయు, గంధర్వులయు, నాగులయు, రాక్షసులయు, అప్సరసలయు గణములు పరమానందము పొందుచుండును.

సతు మేరుః పరివృతో భవనై ర్భూతభావనైః,

చత్వారో యస్య దేశాస్తు నానాపార్శ్వేషు ధిష్ఠితాః. 59

భూతములన్నియు మెచ్చుకొనెడు భవనములతో ఆ మేరువు చుట్టబడి యున్నది. దాని పార్శ్వములన్నియు నాలుగు దేశముల నెలకొని యున్నవి.

భద్రాశ్వో భారతశ్చైవ కేతుమాలశ్చ పశ్చిమే,

ఉత్తరే కురనశ్చైవ కృతపుణ్య ప్రతిశ్రయాః. 60

పడమటి దిక్కున భద్రాశ్వము, భారతము, కేతుమాలము అనునవియు, ఉత్తరమున పవిత్ర కార్యములకు నెలవులగు కురుభూములును కలవు.

కర్ణికా తస్య పద్మస్య సమంతాత్‌ పరిమండలా,

యోజనానాం సహస్రాణి యోజనానాం ప్రమాణతః. 61

ఆ పద్మపు దుద్దు మండలాకారముగా నున్నది. దాని కొలత వేలకొలది యోజనములుగా నున్నది.

తస్య కేసరజాలాని నవషట్‌ చ ప్రకీర్తితాః,

చతురాశీతి రుత్సేధో వివరాంతర గోచరాః. 62

త్రింశచ్చాపి సహస్రాణి యోజనానాం ప్రమాణతః,

తస్య కేసరజాలాని వికీర్ణాని సమస్తతః. 63

దాని కేసరజాలములు మొత్తము పదునైదు (వేలు) గా నున్నవి. ఎనుబది నాలుగు యోజనముల పొడవైనవి. లోపలకు ముప్పది యోజనముల కొలత కలవి. అవి అన్ని వైపులకు చెదరి యున్నవి.

శతసాహస్ర మాయామ మశీతిః పృథులాని చ,

చత్వారి తత్ర పర్ణాని యోజనానాం చతుర్దశ. 64

అవి చాల పెద్దవి. నూరు వేల యోజనముల పొడవు ఎనుబది వేల యోజనములు వెడల్పు కలిగి యున్నవి. అందు పదునాలుగు వేల యోజనములు గల ఆకులు నాలుగు కలవు.

తత్ర యా సా మయా తుభ్యం కర్ణకేత్యభివిశ్రుతా,

తాం వర్ణ్యమాన మేకాగ్ర్యాత్‌ సమాసేన నిబోధత,

మణి వర్ణశ##తై శ్చిత్రాం నానావర్ణ ప్రభాసితామ్‌.65

నేను మీకు కర్ణికగా చెప్పితినే, దానిని గురించి సంగ్రహముగా వర్ణింతును. వినుడు. అది మణిమయములగు వందలకొలది వర్ణములతో పెక్కు రంగుల కాంతులతో చిత్రముగా ఒప్పారు చున్నది.

అనేక పర్ణనిచయం సౌవర్ణ మరుణ ప్రభమ్‌,

కాన్తం సహస్రపర్వాణం సహస్రోదరకందరమ్‌,

సహస్ర శతపత్రం చ వృత్త మేకం నగోత్తమమ్‌. 66

మణిరత్నార్పితశ్వభ్రై ర్మణిభి శ్చిత్ర వేదికమ్‌,

సువర్ణ మణిచిత్రాంగై ర్మణి చర్చిత తోరణౖః. 67

అది పెక్కు పత్రముల గుత్తులు కలిగి చక్కని వన్నెతో ఎర్రని కాంతితో, వేలకొలది కణుపులతో, వేల కొలది కందరములతో మనోజ్ఞమై, నూరువేల పత్రములతో గుండ్రని ఆకృతితో ఒక పెద్ద పర్వతమువలె అలరారును. దానిలోయలు, వేదికలు, ఇతర ప్రదేశములు, తోరణములు రత్నమయములై ఒప్పుచుండును.

తత్ర బ్రహ్మ సభా రమ్యా బ్రహ్మర్షి జనసంకులా,

నామ్నా మనోవతీ నామ సర్వలోకేషు విశ్రుతా. 68

అందు బ్రహ్మసభ మిక్కిలి అందమైనది. అందు బ్రహ్మర్షులు ఎక్కువగా తిరుగు చుందురు. దాని పేరు మనోవతి. అన్ని లోకములో ప్రసిద్ధి కెక్కినది.

తత్రేశానస్య దేవస్య సహస్రాదిత్యవర్చసః,

మహావిమాన సంస్థస్య మహిమా వర్తతే సదా. 69

అందు బ్రహ్మదేవుడు వేయి సూర్యుల కాంతితో వెలిగి పోవుచుండును. గొప్ప విమానమున కూర్చుండును. ఆతని మహిమ ఎల్లవేళల భాసిల్లు చుండును.

తత్ర సర్వే దేవగణా శ్చతుర్వక్త్రం స్వయం ప్రభుమ్‌,

ఇష్ట్వా పూజ్యసమస్కారై రర్చనీయ ముపస్థితాః. 70

అందు దేవతల గుంపులు నాలుగు మొగముల దేవరను, తనకు తానే ప్రభువైన వానిని, పూజింప దగువానిని మన్నన గల నమస్కారములతో ఆరాధించుచు నిలిచి యుందురు.

యై స్తదా జితసంకల్పై ర్బ్రహ్మచర్యం మహాత్మభిః,

చీర్ణం చారుమనోభిశ్చ సదాచారపథి స్థితైః. 71

ఆ మహాత్ములందరు దృఢమైన సంకల్పము కలవారై సుందరములగు హృదయములతో, సదాచారమార్గము తప్పని వారై బ్రాహ్మచర్యమును సాధించు చుందురు.

సమ్య గిష్ట్వా చ భుక్త్వా చ పితృ దేవార్చనే రతాః,

గృహాశ్రమపరా స్తత్ర వినీతా అతిథిప్రియాః. 72

మరియు గృహస్థులు పూజలు, చక్కని భోజనములు కలవారై పితృదేవతల అర్చనల యందు ప్రీతి కలవారై ఉందురు. వినయము కలవారు, అతిథుల యందు ప్రియులునై ఉందురు.

గృహిణః శుక్లకర్మస్థా విరక్తాః కారణాత్మకాః,

యమై ర్నియమ దానైశ్చ దృఢ నిర్దగ్ధ కిల్బిషాః. 73

ఇంకను గృహస్థులు పవిత్ర కర్మముల యందు నిష్ఠ కలవారు. విరక్తులు, యమము, నియమము, దానము మొదలగు వానిచేత గట్టిగా కాలిపోయిన పాపములు కలవారు.

తేషాం నివసనం శుక్లబ్రహ్మలోక మనిన్దితమ్‌,

ఉపర్యుపరి సర్వాసాం గతీనాం పరమా గతిః,

చతుర్దశసహస్రాణి యోజనానాం తు కీర్తితమ్‌. 74

హరి నివాసము స్వచ్ఛమై, ఏ నిందయు లేని బ్రహ్మలోకము పైకి పైకిగా ఉండు సర్వగతులకును పరమగతి. అది పదునాలుగు వేల యోజనముల వైశాల్యము కలది.

తతోర్థరుచిరే కృష్ణే తరుణాదిత్య వర్చసి,

మహాగిరౌ తతో రమ్యే రత్నధాతు విచిత్రితే. 75

నైకరత్న సమావాసే మణితోరణ మందిరే,

మేరోః సర్వేషు పార్శ్వేషు సమంతాత్‌ పరిమండలే. 76

త్రింశద్యోజన సాహస్రం చక్రపాటో నగోత్తమః,

జారుధి శ్చైవ శైలేంద్ర ఇత్యేతే ఉత్తరాః స్మృతాః. 77

పై భాగమున అందమైనది, నల్లనది, అయినను బాల సూర్యుని వన్నెతో ప్రకాశించునది, రత్నధాతువులతో విచిత్రమైనది. రమ్యమైనది అగు పెద్ద పర్వతము కలదు. అది పెక్కు రత్నములకు నిలయము. మణితోరణముల మందిరము లందు కలవు. మేరువునకు అన్ని వైపుల గుండ్రని ఆకారముతో చుట్టుకొని యున్నది. ముప్పది వేల యోజనముల విస్తారము గల ఆ పర్వతము చక్రపాటము. అట్టిదియే జారుధి అనునదియు ఒక పర్వతము. ఇవి ఉత్తర దిక్కున నున్న పర్వతములు.

ఏతేషాం శైలముఖ్యానా ముత్తరేషు యథాక్రమః.

స్థలీ రంతరద్రోణ్యశ్చ నరాంసి చ నిబోధత. 78

ఉత్తరమున నున్న ఈ పర్వతముల తావులలో క్రమముగా ఉన్న నదులు, సరస్సులు అనువానిని గూర్చి తెలసికొనుడు.

దశయోజన విస్తీర్ణా చక్రపాటోపనిర్గతా,

సా తూర్ధ్వావాహినీ చాపి నదీ భూమౌ ప్రతిష్ఠితా. 79

చక్రపాటము నుండి వెలువడి, పది యోజనముల విస్తీర్ణము కల ఊర్ఢ్వవాహిరి యగునది భూమిపై చక్కగా నెలకొని యున్నది.

సా పుర్యా మమరావత్యాం క్రమమాణందుసప్రభా,

తయా తిరస్కృతా వా7పి సూర్యేందుజ్యోతిషాం గణాః. 80

అది అమరావతీ పురమున చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రవహించు చుండును. సూర్యుని, చంద్రుని, నక్షత్రముల కాంతులను కూడ అది తిరస్కరించును.

ఉదయాస్తమితే సంధ్యే యే సేవన్తే ద్విజోత్తమాః,

తాన్‌ తుష్యన్తే ద్విజాః సర్వా నష్టా వప్యచలోత్తమాన్‌. 81

ఉదయ సాయంకాల సంధ్యలను సేవించు బ్రాహ్మణ ప్రవరులు ఆ ఎనిమిది పర్వతములను కూడ స్తుతింతురు.

పరిభ్రమజ్జ్యోతిషాం యా సా రుద్రేంద్రమతాశుభా. 82

చుట్టు తిరుగుచుండు నక్షత్రముల కాంతులు గల ఆ నదిని రుద్రుడు ఇంద్రుడు కూడ సేవించుచుందురు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పంచసప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదియైదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters