Varahamahapuranam-1    Chapters   

ద్విసప్తతితమోధ్యాయః - డెబ్బదిరెండవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

సర్వజ్ఞం సర్వకర్తారం భవం రుద్రం పురాతనమ్‌,

ప్రణమ్య ప్రయతోగస్త్యః పప్రచ్ఛ పరమేశ్వరమ్‌. 1

సర్వజ్ఞుడు, సర్వకర్త, భవుడు, పురాతనుడు, రుద్రుడు అగు పరమేశ్వరునికి ప్రణమిల్లి అగస్త్యుడు శ్రద్ధతో ఇట్లడిగెను.

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లనెను.

భవాన్‌ బ్రహ్మాచ విష్ణుశ్చ త్రయమేతత్‌ త్రయీ స్మృతా,

దీపోగ్ని ర్దీప సంయోగైః సర్వశాస్త్రేషు సర్వతః. 2

కస్మిన్‌ ప్రధానో భగవాన్‌ కాలే కస్మిన్నధోక్షజః,

బ్రహ్మా వా ఏత దాచక్ష్వ మమ దేవ త్రిలోచన. 3

మూడుకన్నుల దేవరా! నీవు బ్రహ్మయును, విష్ణువును, ఈ మువ్వురును సర్వశాస్త్రములయందును అన్నియెడలను త్రిమూర్తులుగా ప్రఖ్యాతులు. ఒక దీపము నందలి అగ్ని పెక్కు దీపములను వెలిగించునట్లుండువారు.

అందు తమ ప్రధానత ఎప్పుడు? విష్ణువెప్పుడు ప్రధానుడు? బ్రహ్మ ఎప్పుడు? దీనిని నాకు తెలియజెప్పుము.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

విష్ణురేవ పరం బ్రహ్మ త్రిభేద మిహ పఠ్యతే,

వేదసిద్ధాంత మార్గేషు తన్న జానన్తి మోహితాః. 4

విష్ణువే పరబ్రహ్మము. వేదసిద్ధాంతమార్గములు దీనినే చెప్పుచున్నవి. అదియే మూడుభేదములను పొందుచున్నది. అజ్ఞానులు దీని నెరుగకున్నారు.

విశ ప్రవిశ##నే ధాతు స్తత్ర ష్ణు ప్రత్యయాదను,

విష్ణు ర్యః సర్వదేవేషు పరమాత్మా సనాతనః. 5

'విశ' అను ధాతువునకు ప్రవేశించుట అర్థము. దానికి 'ష్ణు' అను ప్రత్యయము చేరగా ''విష్ణు'' అనురూపమేర్పడినది. సర్వదేవుల యందు ప్రవేశించు సనాతనుడగు పరమాత్మయే విష్ణువు.

యోయం విష్ణుస్తు దశధా కీర్త్యతే చైకధా ద్విజాః,

స ఆదిత్యో మహాభాగ యోగైశ్వర్య సమన్వితాః. 6

ఈ విష్ణువే పదునొకండు రూపములుగా చెప్పబడునప్పుడు యోగము ఐశ్వర్యము, అను లక్షణములతో కూడినవాడై ఆదిత్యుడగుచున్నాడు.

స దేవకార్యాణి సదా కురుతే పరమేశ్వరః,

మనుష్యభావ మాశ్రిత్య సమాం స్తౌతి యుగేయుగే,

లోకమార్గ ప్రవృత్త్యర్థం దేవకార్యార్థ సిద్ధయే. 7

ఆ పరమేశ్వరుడే ఎల్లవేళ దేవకార్యములను చేయు చుండును. ప్రతియుగమునందును లోకమార్గములను చక్కగా సాగించుటకు, దేవకార్యములను నెరవేర్చుటకు, మనుష్యభావమును పొంది నన్ను స్తుతించుచుండును.

అహం చ వరద స్తస్య ద్వాపరే ద్వాపరే ద్విజ,

అహం చ తం సదా స్తౌమి శ్వేతద్వీపే కృతేయుగే. 8

ప్రతి ద్వాపరయుగమునందును నేనాతనికి వరము లిచ్చువాడను, కృతయుగమున శ్వేతద్వీపమున నేనాతనిని స్తుతించుచుందును.

సృష్టికాలే చతుర్వక్త్రం స్తౌమి కాలో భవామి చ,

బ్రహ్మా దేవాసురా స్తౌతి మాం సదా తు కృతేయుగే,

లింగమూర్తిం చ మాం దేవా యజన్తే భోగకాంక్షిణః. 9

సృష్టికాలమున నేను నలుమోములదేవరను స్తుతింతును. నేను కాలుడ నగుదును. కృతయుగమున బ్రహ్మయు, దేవతలు, రాక్షసులు నన్నెప్పుడు స్తుతింతురు. భోగములను కోరెడు దేవతలు లింగమే మూర్తిగాగల నన్ను పూజింతురు.

సహస్రశీర్షకం దేవం మనసా తు ముముక్షవః,

యజన్తే యం స విశ్వాత్మా దేవో నారాయణః స్వయమ్‌. 10

ముక్తికోరువారు మనస్సులో వేయిశిరస్సులు కల దేవుని అర్చింతురు. అతడే విశ్వాత్ముడు. దేవుడు నగు నారాయణుడు.

బ్రహ్మయజ్ఞేన యే నిత్య యజన్తే ద్విజసత్తమాః,

త్రే బ్రాహ్మాణం ప్రీణయన్తి వేదో బ్రహ్మా ప్రకీర్తితః. 11

బ్రాహ్మణోత్తములు నిత్యము బ్రహ్మయజ్ఞముతో పూజించుచు బ్రహ్మను ప్రీతుని గావింతురు. బ్రహ్మ అనగా వేదమే.

నారాయణః శివో విష్ణుః శంకరః పురుషోత్తమః,

ఏతైస్తు నామభిర్బ్రహ్మ పరంప్రోక్తం సనాతనమ్‌,

తంచ చిన్తామయం యోగం ప్రవదన్తి మనీషిణః. 12

నారాయణుడు, శివుడు, విష్ణువు, శంకరుడు, పురుషోత్తముడు, అను ఈ పేరులన్నియు సనాతనుడగు పరబ్రహ్మమునే చెప్పును. మేధావులు ఇట్టిదానిని ధ్యానమయయోగమని వక్కాణింతురు.

పశూనాం శమనం యజ్ఞో హోమకర్మ చ యద్భవేత్‌,

తదోమితి చ విఖ్యాతం తత్రాహం సంవ్యవస్థితః. 13

యజ్ఞమునందు పశువులను వ్రేల్చు హోమకర్మమున 'ఓమ్‌' అని ప్రసిద్ధమైన దానియందు నేను చక్కగా నెలకొనియుందును.

కర్మవేద యుజాం విప్ర బ్రహ్మా విష్ణు ర్మహేశ్వరః,

వయం త్రయోపి మన్త్రాద్యా నాత్ర కార్యా విచారణా. 14

కర్మములకై వేదముల నుపయోగించువారికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అను మేము మువ్వురము మంత్రముల తొలి వర్ణములము. ఇందు భావింపవలసినది లేదు.

అహం విష్ణు స్తథా వేదా బ్రహ్మ కర్మాణి చాప్యుత,

ఏతత్‌ త్రయం త్వేక ఏవ న పృథక్‌ భావయేత్‌ సుధీః. 15

నేనును విష్ణువును, బ్రహ్మయును మేమే వేదములము కర్మములము. ఇవన్నియు నొక్కటియే. బుద్ధిమంతుడు వేరుగా భావింపరాదు.

యోన్యథా భావయే దేతత్‌ పక్షపాతేన సువ్రత,

స యాతి నరకం ఘోరం రౌరవం పాపపూరుషః. 16

పక్షపాతముచేత ఎవ్వడును గాని వీనిని వేర్వేరుగా భావించునేని ఆ పాపపురుషుడు ఘోరమైన రౌరవమను నరకమున కరుగును.

అహం బ్రహ్మా చ విష్ణుశ్చ ఋగ్యజుః సామ ఏవ చ,

నైతస్మిన్‌ భేదమస్యాస్తి సర్వేషాం ద్విజసత్తమ. 17

ఉత్తమా! నేనును, బ్రహ్మయును, విష్ణువును, వరుసగా ఋక్కు, యజుస్సు, సామములము. ఎవ్వరికిని దీనియందు భేదము ఉండరాదు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్విసప్తతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదిరెండవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters