Varahamahapuranam-1    Chapters   

సప్తతితమోధ్యాయః - డెబ్బదియవ అధ్యాయము

భద్రాశ్వ ఉవాచ - భద్రాశ్వు డిట్లనెను.

భగవన్‌ కిం కృతం లోకం త్వయా త మనుపశ్యతా,

వ్రతం తపో వాధర్మోవా ప్రాప్త్యర్థం తస్య వై మునే. 1

మునీ! నీవు ఆ అద్భుతలోకమును గాంచుటకు ఏవ్రతమును, ఎట్టితపమును, ఏ ధర్మమును చేసితివి?

అగస్త్య ఉవాచ- అగస్త్యు డిట్లు పలికెను.

అనారాధ్య హరిం భక్త్యా కో లోకాన్‌ కామయేద్‌ బుధః,

ఆరాధితే హరౌ లోకాః సర్వే కరతలే7భవన్‌. 2

హరి నారాధింపక లోకములను కోరెడు బుధుడెవ్వడుండును? హరి నారాధించినచో సర్వలోకములు అరచేతి యందుండును.

ఏవం సంచిన్త్య రాజేన్ద్ర మయా విష్ణుః సనాతనః,

ఆరాధితో వర్షశతం క్రతుభి ర్భూరి దక్షిణౖః. 3

ఇట్లని చక్కగా ఆలోచించి నేను నూరేండ్లు గొప్ప దక్షిణలు గల యజ్ఞములతో సనాతనుడగు విష్ణుని ఆరాధించితిని.

తతః కదాచిద్‌ బహునా కాలేన నృపనందన,

యజతో మమ దేవేశం యజ్ఞమూర్తిం జనార్దనమ్‌,

ఆహూతా ఆగతా దేవాః సమమేవ సవాసవాః. 4

అంత నొకప్పుడు పెక్కుకాలము నేను యజ్ఞమూర్తి, దేవదేవుడు నగు జనార్దనుని ఆరాధించుచుండగా నా పిలుపు మేరకు దేవేంద్రునితో పాటుగ దేవతలు విచ్చేసిరి.

స్వేస్వే స్థానే స్థితా ఆసన్‌ యావద్‌ దేవాః సవాసవాః,

తావత్‌ తత్రైవ భగవా నాగతో వృషభధ్వజః. 5

దేవేంద్రునితోపాటు దేవతలందరు తమతమ స్థానము లందుండగా అంతలో అచటికి భగవంతుడు వృషభధ్వజుడు (శివుడు) ఏతెంచెను.

మహాదేవో విరూపాక్ష స్త్ర్యంబకో నీలలోహితః,

సో7పి రౌద్రే స్థితః స్థానే బభూవ పరమేశ్వరః. 6

మహాదేవుడు, విరూపాక్షుడు, ముక్కంటి, నీలలోహితుడు అగు పరమేశ్వరుడు రౌద్ర స్థానమున నిలిచియుండెను.

తాన్‌ సర్వా నాగతాన్‌ దృష్ట్వా దేవానృషిపురోగమాన్‌, 7

సనత్కుమారో భగవా నాజగామాబ్జసంభవః.

త్రసరేణు ప్రమాణన విమానే సూర్యసన్నిభే,

అవస్థితో మహాయోగీ భూతభవ్యభవిష్యవిత్‌. 8

దేవతలు, ఋషిముఖ్యులు మొదలగు వారందరు రాగా వారిని గాంచి మహాయోగియు, త్రికాలజ్ఞుడు, పద్మసంభవుడునగు సనత్కుమారుడు సూర్యునివంటి విమానమున చిన్నరేణువు వంటి ఆకారముతో నిలిచి కానవచ్చెను.

ఆగమ్య శిరసా రుద్రం స వవన్దే మహామునిః,

మయా ప్రణమిత స్తస్థౌ సమీపే శూలపాణినః. 9

వచ్చి ఆ మహాముని రుద్రునకు తలతో ప్రణమిల్లెను. నేను ప్రణామముచేయగా శూలపాణి సమీపమున నిలిచియుండెను.

తానహం సంస్థితాన్‌ దేవాన్‌ నారదాదీన్‌ ఋషీంస్తథా,

సనత్కుమారరుద్రౌ చ దృష్ట్వా మే మనసి స్థితమ్‌. 10

అట్లు వచ్చియున్న దేవతలను, నారదుడు మున్నగు ఋషులను, సతన్కుమారుని, రుద్రుని చూచిన నా మనసున ఒక ప్రశ్న యుదయించెను.

క ఏషాం భవతే యాజ్యో వరిష్ఠశ్చ నృపోత్తమ,

కేన తుష్టేన తుష్టాః స్యుః సర్వ ఏతే సరుద్రకాః. 11

వీరిలో ఎవరు పూజింపదగినవారు? ఎవడు అందరికంటె గొప్పవాడు? ఎవడు తుష్టినందినచో ఈ రుద్రునితో కూడిన సర్వులును తుష్టినందుదురు?

ఏవం కృత్వా స్థితే రాజన్‌ రుద్రః పృష్టో మయానఘ,

ఏవ మర్థం క ఇజ్యో7త్ర యుష్మాకం సురసత్తమాః. 12

ఇట్టిభావము నా హృదయములో కలుగగానేను, దేవతలారా! మీకు వీరిలో పూజనీయు డెవ్వడు? అని రుద్రుని వైపు తిరిగి అడిగితిని.

ఏవముక్తే తదోవాచ రుద్రో మాం సుర సన్నిధౌ 13

నేనిట్లు పలుకగా అంత రుద్రుడు దేవతల యెదుట నాతో నిట్లనెను.

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లనెను.

శృణ్వన్తు విబుధాః సర్వే తథా దేవర్షయో7మలాః,

బ్రహ్మర్షయశ్చ విఖ్యాతాః సర్వే శృణ్వన్తు మే వచః,

త్వం చాగస్త్య మహాబుద్ధే శృణుమే గదతో వచః, 14

దేవతలారా! నిర్మలులైన దేవర్షులారా! ప్రసిద్ధి కెక్కిన బ్రహ్మర్షులారా! మీరందరు నామాట నాలకింపుడు. ఓ మహామతీ! అగస్త్యా ! నీవు కూడ నామాట వినుము.

యో యజ్ఞై రీడ్యతే దేవో యస్మాత్సర్వ మిదం జగత్‌,

ఉత్పన్నం సర్వదా యస్మిన్‌ లీనం భవతి సామరమ్‌. 15

నారాయణః పరో దేవః సత్వరూపో జనార్దనః,

త్రిధాత్మానం సభగవాన్‌ ససర్జ పరమేశ్వరః. 16

ఎవ్వడు సర్వయజ్ఞములచే యజింపబడునో, ఎవని వలన ఈ జగమంతయు, దేవతలతో పాటుగా పుట్టుచున్నదో, ఎల్లప్పుడు ఎవనియందు నిలిచియుండునో, ఎవనియందు లీనమగుచున్నదో ఆ పరదైవము సత్వరూపుడు, ఎవనియందు లీనమగుచున్నదో ఆ పరదైవము సత్వరూపుడు, జనార్దనుడునునగు నారాయణుడే. ఆ పరమేశ్వరుడే తన్నుదాను మూడురూపములుగా సృష్టిచేసెను.

రజస్తమోభ్యాం యుక్తో7భూద్‌ రజఃసత్వాధికం విభుః,

ససర్జ నాభికమలే బ్రహ్మాణం కమలాసనమ్‌. 17

రజస్సు తమస్సులతో కూడినవాడై ఆ విభుడు రజఃసత్వములధికముగా గల బ్రహ్మను, కమలము ఆసనముగా గలవానిని బొడ్డుతామరయందు సృజించెను.

రజసా తమసా యుక్తః సో7పి మాం త్వసృజత్‌ప్రభుః,

యత్సత్వం స హరి ర్దేవో యో హరిస్తత్పరం పదమ్‌. 18

రజస్సుతో, తమస్సుతో కూడినవాడై ఆతడే నన్నును పుట్టించెను. సత్వగుణమే ఆ హరి. హరియే పరమపదము.

యే సత్వరజసీ సో7పి బ్రహ్మా కమలసంభవః,

యో బ్రహ్మా సైవ దేవస్తు యో దేవః స చతుర్ముఖః,

యద్రజస్తమసోపేతం సో7హం నాస్త్యత్ర సంశయః. 19

సత్వరజస్సుల స్వరూపమై కమలమునందు పుట్టిన బ్రహ్మయే ఆ దైవము. ఆ దేవుడే బ్రహ్మ. రజస్తమస్సులతో కూడిన స్వరూపమగు నేనును అతడే. ఇందు సందియము లేదు.

సత్వం రజస్తమశ్చైవ త్రితయం చైత దుచ్యతే,

సత్యేన ముచ్యతే జన్తుః సత్వం నారాయణాత్మకమ్‌. 20

సత్వము, రజస్సు, తమస్సు, ఇదియంతయు ఈ మూడింటి సముదాయమే. సత్వగుణము చేత జీవుడు ముక్తుడగును. సత్వము నారాయణాత్మకము.

రజసా సత్వయుక్తేన భ##వేత్‌ సృష్టీ రజో7ధికా,

తచ్చ పైతామహం వృత్తం సర్వ శాస్త్రేషు పఠ్యతే. 21

సత్వముతో కూడిన రజోగుణముచేత రజస్సు అధికముగా గల సృష్టి ఏర్పడును. అది పితామహుడగు బ్రహ్మకు సంబంధించినదై ఏర్పడినదని అన్ని శాస్త్రములును ఘోషించుచున్నవి.

యద్వేదబాహ్యం కర్మ స్యా చ్ఛాస్త్రముద్దిశ్య సేవ్యతే,

తద్రౌద్ర మితి విఖ్యాతం కనిష్ఠం గదితం మమ. 22

వేదములకు వెలిఅయిన కర్మము, శాస్త్రములను బట్టి చేయునది రౌద్రమని ప్రసిద్ధి కెక్కినది. అది నాకు సంబంధించినది. అని కనిష్ఠమని చెప్పుదురు. (కనిష్ఠము అన్నింటికంటె తక్కువది - హీనమైనది.)

యద్ధీనం రజసా కర్మ కేవలం తామసం తు యత్‌,

తద్దుర్గతి పరం నౄణా మిహలోకే పరత్ర చ. 23

రజస్సులేని కర్మము కేవలము తామసము. అది నరులకు ఇహమునందును, పరమునందును దుర్గతిని కలిగించును.

సత్వేన ముచ్యతే జన్తుః సత్వం నారాయణాత్మకమ్‌,

నారాయణశ్చ భగవాన్‌ యజ్ఞరూపీ విభావ్యతే. 24

సత్వగుణము చేత జీవికి ముక్తి కలుగును. సత్వము నారాయణాత్మకము. యజ్ఞరూపుడగునారాయణుడే భగవానుడు.

కృతే నారాయణః శుద్ధ సూక్ష్మమూర్తి రుపాస్యతే,

త్రేతాయాం యజ్ఞరూపేణ పంచరాత్రైస్తు ద్వాపరే. 25

కలౌ మత్కృతమార్గేణ బహురూపేణ తామసైః,

ఇజ్యతే ద్వేషబుద్ధ్యా స పరమాత్మా జనార్దనః. 26

కృతయుగమున శుద్ధుడు, సూక్ష్మరూపుడునగునారాయణుని ఉపాసింతురు. త్రేతాయుగమున యజ్ఞరూపముతో అర్చింతురు. ద్వాపరమున పంచరాత్రులు ఉపాసింతురు. కలియందు నేనుచూపిన మార్గముతో బహురూపములతో తామసులు ద్వేషబుద్ధితో జనార్దనుడగు పరమాత్మను కొలుతురు.

న తస్మాత్‌ పరతో దేవో భవితా న భవిష్యతి,

యో విష్ణుః సస్వయం బ్రహ్మా యో బ్రహ్మా సో7హమేవ చ. 27

ఆతనికంటె పరదైవము మరియొకటి లేదు. ఉండబోదు. ఆ విష్ణువే స్వయముగా బ్రహ్మ. ఆ బ్రహ్మయే స్వయముగా నేను.

వేదత్రయే7పి యజ్ఞే7స్మిన్‌ యాజ్యం వేదేషు నిశ్చయః,

యో భేదం కురుతే7స్మాకం త్రయాణాం ద్విజసత్తమ,

స పాపకారీ దుష్టాత్మా దుర్గతిం గతి మాప్నుయాత్‌. 28

మూడువేదములందును, యజ్ఞమునందును, పూజ్యత విషయమున ఇదియే నిశ్చయము. మామువ్వురిలో భేదమును భావించువాడు పాపకారి, దుష్టాత్ముడు. వాడు దుర్గతినందును.

ఇదం చ శృణు మే7గస్త్య గదతః ప్రాక్తనం తథా,

యథా కలౌ హరే ర్భక్తిం న కుర్వన్తీహ మానవాః. 29

అగస్త్యా! నేను చెప్పెడి దీనిని కూడ వినుము. మునుపు కలియందు మానవులు ఎట్లు హరిభక్తి చేయకుండిరో తెలిపెదను.

భూర్లోక వాసినః సర్వే పురా యష్ట్వా జనార్దనమ్‌,

భువర్లోకం ప్రపద్యన్తే తత్ర స్థా అపి కేశవమ్‌,

ఆరాధ్య స్వర్గతిం యాన్తి క్రమా న్ముక్తిం వ్రజన్తి చ. 30

పూర్వము భూలోకవాసులందరు జనార్దనుని పూజించి భువర్లోకమును పొందుచుండిరి. అందుండియు కేశవు నారాధించి స్వర్గమును, అచటి నుండి క్రమముగ ముక్తిని పొందుచుండిరి.

ఏవం ముక్తిపదే వ్యాప్తే సర్వలోకై స్తథైవ చ,

ముక్తిభాజ స్తతో దేవాస్తం దధ్యుః ప్రయతా హరిమ్‌. 31

ఇట్లు సర్వలోకముల వారును ముక్తి పదమున వ్యాపించగా అంతకు ముందు ముక్తిని పొందిన దేవతలందరు చిత్తశుద్ధితో ఆ హరిని ధ్యానించిరి.

సో7పి సర్వగతత్వాచ్చ ప్రాదుర్భూతః సనాతనః,

ఉవాచ బ్రూత కిం కార్యం సర్వయోగివరాః సురాః. 32

సనాతనుడగు ఆతడును అంతట నుండువాడు కనుక వారికి ప్రత్యక్షమై యోగివరులారా! సురులారా! పనియేమి? చెప్పుడని పలికెను.

తే తం ప్రణమ్యదేవేశ మూచుశ్చ పరమేశ్వరమ్‌,

దేవదేవ జనః సర్వో ముక్తిమార్గే వ్యవస్థితః,

కథం సృష్టిః ప్రభవితా నరకేషు చ కో వసేత్‌. 3

వారా దేవదేవునకు ప్రణమిల్లి పరమేశ్వరునితో నిట్లనిరి. దేవదేవా! జనమంతయు ముక్తి మార్గమున నిలిచిపోయినది. ఇక ఈ సృష్టి సాగుట యెట్లు? నరకములందెవరుందురు?

ఏవ ముక్త స్తతో దేవై స్తా నువాచ జనార్దనః,

యుగాని త్రీణి బహవో మాముపేష్యన్తి మానవాః. 34

అన్త్యే యుగే ప్రవిరళా భవిష్యన్తి మదాశ్రయాః,

ఏష మోహం సృజామ్యాశు యో జనం మోహయిష్యతి. 35

వారట్లు పలుకగా వారి నుద్దేశించి జనార్దను డిట్లు పలికెను: మూడు యుగములలో పెక్కండ్రు మానవులు నన్ను పొందెదరు. చివరియుగమున చాల తక్కువగా జనులు నన్నాశ్రయింతురు. ఇదిగో మోహమును సృజించుచున్నాను. అది జనులను మోహ పెట్టును.

త్వం చ రుద్ర మహాబాహో మోహశాస్త్రాణి కారయ,

అల్పాయాసం దర్శయిత్వా ఫలం దీర్ఘం ప్రదర్శయ. 36

కుహకం చేన్ద్రజాలాని విరుద్ధాచరణాని చ,

దర్శయిత్వా జనం సర్వం మోహ యాశు మహేశ్వర. 37

మహాబాహూ! రుద్రా! నీవును మోహము గొలుపు శాస్త్రములను చేయింపుము. తక్కువశ్రమ, ఎక్కువ ఫలమును ప్రదర్శింపుము. వంచనను, ఇంద్రజాలములను, విరుద్ధాచారములను చూపి జనులను వెంటనే మోహ పెట్టుము.

ఏవముక్త్వా తదా తేన దేవేన పరమేష్ఠినా,

ఆత్మా తు గోపితః సద్యః ప్రకాశ్యో7 హం కృతస్తదా. 38

ఇట్లు పలికి ఆ పరమేష్ఠి ఆ దేవుడు తన స్వరూపమును గుట్టు పరచెను. నన్నందరు తెలిసికొనునట్లు చేసెను.

తస్మాదారభ్య కాలం తు మత్ప్రణీతేషు సత్తమ,

శాస్త్రేష్వ భిరతో లోకో బాహుల్యేన భ##వేదతః. 39

అది మొదలు కొని నేను రచించిన శాస్త్రములందు లోకము ఎక్కువగా రుచి కలది ఆయెను.

వేదానువర్తినం మార్గం దేవం నారాయణం తథా,

ఏకీ భావేన పశ్యన్తో ముక్తి భాజో భవన్తి తే. 40

వేదముననుసరించు మార్గమును, నారాయణదేవుని ఏకభావముతో చూచువారు ముక్తిని పొందు వారగుచున్నారు.

మాం విష్ణో ర్వ్యతిరిక్తం యే బ్రహ్మాణం చ ద్విజోత్తమ,

భజన్తే పాపకర్మాణ స్తే యాన్తి నరకం నరాః. 41

నన్ను, బ్రహ్మను విష్ణువు కంటె వేరుగా తలచువారు పాపకర్ములై నరకమున కరుగుదురు.

యే వేదమార్గ నిర్ముక్తాస్తేషాం మోహార్థ మేవ చ,

నయసిద్థాన్త సంజ్ఞాభి ర్మయా శాస్త్రంతు దర్శితమ్‌. 42

వేద మార్గమును వదలి వైచినవారి మోహ పెట్టుటకే నేను నయసిద్ధాంతమను పేరు గల శాస్త్రమును చూపితిని.

పాశో7యం పశుభావస్తు స యదా పతితో భ##వేత్‌;

తదా పాశుపతం శాస్త్రం జాయతే వేదసంజ్ఞితమ్‌. 43

ఈ పశుభావమే పాశము. అది ఎప్పుడు పతనమైనదో అప్పుడు పాశుపతమను శాస్త్రము వేదము పేరిట పుట్టును.

వేదమూర్తి రహం విప్ర నాన్యశాస్త్రార్థ వాదిభిః,

జ్ఞాయతే మత్స్వరూపం తు ముక్త్వా వేద మనాదిమత్‌,

వేదవేద్యో7స్మి విప్రర్షే బ్రాహ్మణౖశ్చ విశేషతః. 44

విప్రా! నేను వేదమూర్తిని. ఇతర శాస్త్రముల అర్థములను తర్కించు వారికి నా స్వరూపము తెలియరాదు. అనాదియగు వేదమును వదలి నన్నెరుగరాదు. ఓయి బ్రహ్మర్షీ! నేను విశేషముగా బ్రహ్మ జ్ఞాన సంపన్నులకు, వేదములకు మాత్రమే ఎరుగదగు వాడను.

యుగాని త్రీణ్యహం విప్ర బ్రహ్మా విష్ణు స్తథైవ చ,

త్రయో7పి సత్వాదిగుణా స్త్రయో వేదాస్త్రయోగ్నయః. 45

త్రయోలోకాస్త్రయః సంధ్యా స్త్రయో వర్ణా స్తథైవ చ,

సవనాని తు తావన్తి త్రిధాబద్ధ మిదం జగత్‌. 46

యుగములు మూడు, విప్రా! నేను బ్రహ్మ, విష్ణువు - మువ్వురము. సత్వము మొదలగు గుణములు మూడు. వేదములు మూడు, అగ్నులు మూడు, లోకములు మూడు. సంధ్యలు మూడు. వర్ణములు మూడు. సవనములును మూడు. ఈ జగత్తంతయు ఈ మూటితో బంధింపబడినది.

1. యుగములు - కృత, త్రేతా, ద్వాపరములు.

2. గుణములు - సత్త్వము, రజస్సు, తమస్సు.

3. వేదములు - ఋక్కు, యజుస్సు, సామము

4. అగ్నులు - ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణ

5. లోకములు - భూలోకము, భువర్లోకము, స్వర్లోకము

6. సంధ్యలు - ప్రాతస్సంధ్య, మధ్యాహ్నసంధ్య, సాయంసంధ్య.

7. వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములు.

8. సవనములు - ప్రాతస్సవనము, మధ్యాహ్న సవనము, సాయం సవనము.

య ఏవం వేత్తి విప్రర్షే పరం నారాయణం తథా,

అపరం పద్మయోనిం తు బ్రహ్మాణం త్వపరం తు మామ్‌,

గుణతో ముఖ్యత స్త్వేక ఏవాహం మోహ ఇత్యుత. 47

బ్రహ్మర్షీ! పరుడైన నారాయణుడు, బ్రహ్మ, నేను గుణములను బట్టి మువ్వురము. కాని ప్రధానముగా ఒక్కడే. ఇట్లు కాక భిన్నముగా చూచుట మోహమే.

ఇతి శ్రీవరహ పురాణమను భగవచ్ఛాస్త్రే సప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీవరహ పురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదియవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters