Varahamahapuranam-1    Chapters   

త్రిషష్టితమోధ్యాయః - అరువది మూడవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

అథాపరం మహారాజ పుత్రప్రాప్తి వ్రతం శుభమ్‌,

కథయామీ సమాసేన తన్మే నిగదతః శృణు. 1

మహారాజా! పుత్రప్రాప్తి వ్రతమను మరియొక పుణ్యవ్రతమును సంగ్రహముగా చెప్పెదను. వినుము.

మాసే భాద్రపదే యాతు కృష్ణపక్షే నరేశ్వర,

అష్టమ్యా ముపవాసేన పుత్రప్రాప్తివ్రతం హి తత్‌. 2

భాద్రపదమాసము కృష్ణపక్షమున అష్టమినాడు ఈ పుత్ర ప్రాప్తి వ్రతమును చేయవలయును.

షష్ట్యాం చైవ తు సంకల్ప్య సప్తమ్యా మర్చయేద్‌ హరిమ్‌,

దేవక్యుత్సఙ్గగం దేవం మాతృభిః పరివేష్టితమ్‌. 3

షష్ఠినాడు సంకల్పించి సప్తమినాడు దేవకీదేవి ఒడిలో నున్న వాడు, తల్లుల నడుమ నున్నవాడు అగు శ్రీ కృష్ణదేవుని అర్చింప వలయును.

ప్రభాతే విమలేష్టమ్యా మర్చయేత్‌ ప్రయతో హరిమ్‌,

ప్రాగ్విధానేన గోవింద మర్చయిత్వా విధానతః. 4

అష్టమినాడు స్వచ్ఛమైన ప్రభాతకాలమున నిష్ఠకలవాడై హరిని మునుపు చెప్పిన విధానముతో అర్చింపవలయును.

తతో యవైః కృష్ణతిలైః సఘృతై ర్హోమయేద్‌ దధి,

బ్రాహ్మణాన్‌ భోజయేద్‌ భక్త్యా యథాశక్త్యా సదక్షిణాన్‌. 5

పిమ్మట యవలు, నల్లనినువ్వులు నేయి కలిపిన పెరుగును హోమము చేయవలయును. భక్తితో శక్తి ననుసరించి దక్షిణల నొసగుచు బ్రాహ్మణులకు సంతర్పణము చేయవలయును.

తతః స్వయం తు భుంజీత ప్రథమం బిల్వముత్తమమ్‌,

పశ్చాద్‌ యథేష్టం భుంజీత స్నేహైః సర్వరసై ర్యుతమ్‌. 6

పిదప తానై మొదట ఒక మారేడు ఫలమును తిని తరువాత ఇష్టము ననుసరించి తైలపాకములను, అన్ని రసములతో కూడిన వానిని భుజింపవలయును.

ప్రతిమాస మానేనైవ విధినోషోష్య మానవః,

కృష్ణాష్టమీ మపుత్రోపి లభేత్‌ పుత్రం న సంశయః. 7

ఇట్లే పుత్రులులేని నరుడు ప్రతిమాసమునను విధిపూర్వకముగా కృష్ణపక్షము అష్టమినాడు ఉపవసించి వ్రతమాచరింప వలయును. అతనికి తప్పక పుత్రుడు కలుగును. సంశయములేదు.

శ్రూయతే చ పురా రాజా శూరసేనః ప్రతాపవాన్‌,

స హ్యపుత్ర స్తవ స్తేపే హిమవత్పర్వతోత్తమే. 8

ఒక కథ వినవచ్చుచున్నది. మునుపు ప్రతాపవంతుడగు శూరసేనుడనురాజు సంతానము లేనివాడై హిమవత్పర్వతమున తపస్సు చేసెను.

తసై#్యవం కుర్వతో దేవో వ్రత మేత జ్జగాద హ,

సోప్యేతత్‌ కృతవాన్‌ రాజా పుత్రం చైవోపలబ్ధవాన్‌. 9

ఇట్లతడు తపస్సు చేయుచుండగా దేవుడాతని కీ వ్రతమును గూర్చి ఉపదేశించెను. అతడును దానిని చక్కగా చేసి పుత్రుని పొందెను.

వసుదేవం మహాభాగ మనేక క్రతు యాజినమ్‌,

తం లబ్ధ్వా సోపి రాజర్షిః పరం నిర్వాణ మాప్తవాన్‌. 10

ఆ రాజర్షి అనేక యాగములు చేసిన పుణ్యాత్ముడు వసుదేవుని కుమారునిగా పొంది పరమానంద మందెను.

ఏవం కృష్ణాషమీ రాజన్‌ మయా తే పరికీర్తితా,

సంవత్సరాన్తే దాతవ్యం కృష్ణయుగ్మం ద్విజాతయే. 11

ఇట్లు, రాజా! నీకు కృష్ణష్టమిని గూర్చి తెలిపితిని. ఏడు గడచిన పిదప కృష్ణ ప్రతిమలను రెండింటిని బ్రాహ్మణునకు దాన మొసగవలయును.

ఏతత్‌ పుత్రవ్రతం నామ మయా తే పరికీర్తితమ్‌,

ఏతత్‌ కృత్వా నరః పాపైః సర్వై రేవ ప్రముచ్యతే. 12

పుత్ర వ్రతమను దీనిని గురించి నీకు వివరించితిని. దీని నాచరించి నరుడు పాపములన్నింటి నుండి విడుదల పొందును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే త్రిషష్టితమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది మూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters